
ఏ రంగంలో రాణించాలన్నా ప్రతిభ ముఖ్యం. ప్రతిభ ఉంటే మనం ఎంచుకున్న రంగంలో అద్భుతమైన విజయాలను సాధించవచ్చు, అద్వితీయమైన సంపదను, కీర్తిని గడించవచ్చు. కానీ కొన్నిసార్లు ఎంత అద్భుతమైన ప్రతిభ ఉన్నా కూడా కాలం కలిసి రాకపోతే జీవితం నైరాశ్యం లోకి నెట్టబడుతుంది. ఆ నైరాశ్యం బ్రతుకును కష్టంగా మారుస్తుంది. ఆ కోవకు చెందిన వారు చిత్రపు నారాయణ మూర్తి. భారతీయ చిత్ర పరిశ్రమ అప్పుడప్పుడే మాటలు నేరుస్తున్న సమయంలో చిత్రపు నారాయణ మూర్తి చిత్రరంగం లోకి ప్రవేశించారు. ముందు సహాయ దర్శకుడిగా, ఎడిటర్ గా, దర్శకుడిగా తన ప్రతిభను చూపించి అనేక పౌరాణిక చిత్రాలకు దర్శకత్వం వహించి, నిర్మాతలకు అనేక విజయాలను అందించారు.
కానీ నిర్మాతగా తాను చతికిల పడ్డారు. ప్రారంభంలో నాటకాలు, ఆ తరువాత సినిమాలలో చేరిన చిత్రపు నారాయణ మూర్తి చలనచిత్ర పరిశ్రమలో చేరిన తొలి నాళ్ళలో తన తమ్ముడు చిత్రపు నరసింహారావు వద్ద సహాయకుడిగా చేరి “సీత కళ్యాణం”, “సతీ తులసి”, “మోహిని రుక్మాంగధ” మరియు “కృష్ణ జరాసంధ” వంటి చిత్రాలకు సహాయం చేస్తూ తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఘంటసాల బలరామయ్య, మీర్జాపురం రాజావారు, మెయ్యప్పన్ చెట్టియార్ వంటి ప్రముఖుల పరిచయాలతో ఆయన సినిమా ప్రస్థానం వైభవంగా సాగింది.
తెలుగు సినిమా ప్రారంభ దశలో తన ప్రతిభా పాటవాలను అత్యద్భుతంగా ప్రదర్శించి, పౌరాణిక చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమను సుసంపన్నం చేశారు చిత్రపు నారాయణ మూర్తి. పౌరాణిక చిత్రాలంటే ఆయనకు అంత పట్టు ఉండేది. అందుకనే పౌరాణిక చిత్రాలు తీయాలంటే ముందుగా నారాయణ మూర్తినే సంప్రదించేవారు. రెండు దశబ్దాలకు పైగా ఆయన చిత్ర దర్శకుడిగా కొనసాగినప్పటికీ కూడా ఆయన సాంఘిక చిత్రాల కంటే పౌరాణిక చిత్రాల మీదనే ఎక్కువగా మక్కువ చూపేవారు. అందువలననే కాబోలు ఆయన తీసిన సాంఘిక చిత్రాలను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. భక్త ప్రహ్లాద చిత్రాన్ని రెండు సార్లు 1942, 1967 తెరకెక్కించి, రెండు సార్లు ఘనవిజయం సాధించడం ఒక్క నారాయణ మూర్తికే చెల్లింది.
ఆయన దర్శకత్వం వహించే తెలుగు చిత్రాలతో పాటు తమిళ చిత్రాలకు కూడా మంచి ఆదరణ ఉండేది. ఆయన దర్శకత్వం వహించిన ఎధిర్ పరధాతు (1958) మరియు అన్నయిన్ ఆనై (1962) చిత్రాలకు మూడవ ఉత్తమ తమిళ చిత్ర మెరిట్ సర్టిఫికేట్ అందుకున్నారు. 1967 తెలుగు చిత్రం భక్త ప్రహ్లాదకు నంది అవార్డును కూడా గెలుచుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం “భక్త మార్కండేయ” (1938) లో వేమూరి గగ్గయ్య మరియు శ్రీరంజని నటించారు. ఈ చిత్రం ఆయనకు దర్శకుడిగా అద్భుతమైన ఆరంభాన్నిచ్చింది, చిత్ర పరిశ్రమలో దర్శకునిగా తనను దర్శకుడిగా నిలదొక్కుకునేలా చేసింది.
జీవిత విశేషాలు…
జన్మనామం : చిత్రపు నారాయణ మూర్తి
ఇతర పేర్లు : చిత్రపు నారాయణ రావు
జననం : 1913
స్వస్థలం : మచిలీపట్నం, కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్, భారతదేశం
వృత్తి : దర్శకులు, నిర్మాత
పిల్లలు : ఇద్దరు కుమారులు
మరణం : 03 ఏప్రిల్ 1985
నేపథ్యం…
చిత్రపు నారాయణమూర్తి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 1913 వ సంవత్సరంలో జన్మించారు. ఈయన తండ్రి చిత్రపు సీతారామయ్య మచిలీపట్నం చుట్టుప్రక్కల గ్రామాలకు కరణీకంగా పనిచేసేవారు. ఆయనకు ఏడుగురు అబ్బాయిలు సంతానం. వారు వరుసగా ఆదినారాయణ రావు, హనుమంతరావు, చలపతిరావు, పిచ్చయ్య, నారాయణమూర్తి, నరసింహారావు, సుబ్బారావు. 130 యేండ్ల క్రితం కరణీకమే ప్రధానం తప్ప వేరే వ్యాపకాలు లేని సీతారామయ్యకు నాటకాలు అంటే ఇష్టం ఉండేది కాదు. నాటకాలు వేయడం, నాటకాలు చూడడం ఆ రోజులలో పెద్ద వ్యసనం. కానీ ఎందువలననో ఆ వ్యసనం ఆయనకు అంటుకోలేదు. కానీ ఆయన కుమారులకు మాత్రం ఆ వ్యసనం అంటుకుంది. ఆయన కుమారులలో కొందరు నాటకాలలో నటించేవారు, నాటకాలను ప్రదర్శించేవారు.
అలాంటి నాటక సంస్థను స్థాపించి నటీనటులతో నాటకాలు వేయించడం లాంటివి చేస్తుండేవారు. తన ఆఖరి కుమారుడు సుబ్బారావు పుట్టిన తరువాత 1916 వ సంవత్సరంలో సీతారామయ్య చనిపోయారు. చిత్రపు నారాయణ మూర్తి చదువు అంతా మచిలీపట్నం లోనే సాగింది. చిన్నతనం ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు ఆయనకు నాటకాల మీద ఆసక్తి ఏర్పడింది. వారి సోదరులు నేషనల్ థియేటర్స్ అనే ఒక నాటక సంస్థను స్థాపించి కాళిదాసు, మేవాడ పతనం, మార్కండేయ, లవకుశ లాంటి నాటకాలను ప్రదర్శిస్తూ ఉండేవారు. ఎవ్వరైనా నాటకాలు వేయడానికి వస్తే వారికి తర్ఫీదు ఇస్తూ ఉండేవారు. ఇలా అయితే నారాయణ మూర్తి నాటకాలకే అంకితం అవుతాడని పైచదువుల కోసం తనను విజయనగరం పంపారు. అక్కడ ఆయన బి.ఏ చదువుకున్నారు. 1928 వ సంవత్సరంలో డిగ్రీ పట్టా పుచ్చుకుని మచిలీపట్నం వచ్చేశారు.
ప్రభుత్వ ఉద్యోగం మానేసి…
పెద్దల బలవంతం మీద అవనిగడ్డలో “డిస్పాచ్ క్లర్క్” గా ప్రభుత్వ ఉద్యోగం లో చేరారు. కానీ ఎక్కువ కాలం ఉద్యోగం చేయలేక నెల రోజుల తరువాత ఉద్యోగం మానేసి బందరు వచ్చేసారు. ఆ తరువాత కొన్ని రోజులకు కలకత్తాలోని జాదవ్ పూర్ లో ఇంజనీరింగ్ చదవడానికి వెళ్లారు. అక్కడ రెండు సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివారు. ఆపై ఇంటి దగ్గర నుండి డబ్బులు రాకపోవడంతో తిరిగి మచిలీపట్నం వచ్చేశారు. ఆ సమయంలో పిల్లలకు ఆయన ట్యూషన్ చెప్పడం ప్రారంభించారు. ఎం.ఏ చేద్దామని అనుకున్నారు, కానీ అది కుదరలేదు. ఒకవైపు ట్యూషన్ చెబుతూనే, మరోవైపు తనకి ఇష్టమైన నాటకాలను కొనసాగించారు. నారాయణ మూర్తి అన్నయ్యకు నేషనల్ ప్రెస్ అకాడమీ ఉండేది. ఆ ముద్రణాలయం లో సినిమాలకు సంబంధించిన కరపత్రాలను ముద్రిస్తూ ఉండేవారు. పినపాల వెంకటదాసు స్థాపించిన మినర్వా టాకీసుకు సంబంధించిన కరపత్రాలు కూడా ఆ ముద్రణాలయం నుండే ముద్రించబడేవి.
పినపాల వెంకటదాసు కుమారుడు చిత్రపు నారాయణ మూర్తి వద్ద ట్యూషన్ చదువుకోవడం, అలాగే మినర్వా టాకీసుకు నారాయణ మూర్తి కరపత్రాలు ముద్రించడం వలన మినర్వా టాకీస్ లో ఆయనకు ఉచితంగా సినిమాలు చూసే అవకాశం దొరికింది. ఆ రోజులలో ఇంకా నిశ్శబ్ద చిత్రాలు మాత్రమే వస్తూ ఉండేవి. ఆ సినిమాలను ఆయన పదేపదే చూస్తూ ఉండేవారు. సినిమా పూర్తయ్యి ఇంటికి వచ్చి ఆ సినిమాలకు సంబంధించిన నోట్స్ ను వ్రాసుకుంటూ ఉండేవారు. అదేవిధంగా మచిలీపట్నం మినర్వ టాకీస్ కు వచ్చే ఆంగ్ల సినిమాలను తెలుగులో అనువాదపు మాటలు చెబుతూ ఉండేవారు. ప్రముఖ నిర్మాత, దర్శకులు హెచ్.ఎం.రెడ్డి వద్ద చిత్రపు నారాయణ మూర్తి తమ్ముడు నరసింహారావు సహాయకులుగా చేరారు. హెచ్.ఎం.రెడ్డి తీసిన “భక్త ప్రహ్లాద” చిత్రానికి సహాయకుడిగా పని చేశారు. అంతేకాకుండా ఆ సినిమాలో ఆయన రెండు పాత్రలు వేశారు. ఒకటి “బ్రహ్మ” పాత్ర అయితే, రెండవది జెండా మార్కుల పాత్ర. ఈ సినిమా విడుదలైన తర్వాత ఆయన పూనే వెళ్లి ప్రభాత్ స్టూడియోలో ఉద్యోగానికి చేరారు నరసింహా రావు.
చిత్ర రంగ ప్రవేశం…
ప్రభాత్ స్టూడియో లో ఒక సంవత్సరం పాటు పనిచేసిన నరసింహా రావు ను 1934 లో పి.వి.దాసు కు పరిచయం చేశారు దాదాసాహెబ్ ఫాల్కే. అప్పటికే పి.వి.దాసు ఒక సినిమాను నిర్మించదలిచి సాంకేతిక నిపుణుల కోసం వెతుకుతూ పూణే వచ్చారు. నరసింహారావు స్వస్థలం కూడా మచిలీపట్నమే అని తెలుసుకున్న పి.వి. దాసు తనతో పాటు మద్రాసుకు తీసుకువచ్చి తాను నిర్మిస్తున్న “సీతా కళ్యాణం” (1934) చిత్రానికి దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. అలా మొదటిసారి చిత్రపు నారాయణ మూర్తి తమ్ముడు చిత్రపు నరసింహారావు తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం “సీతాకళ్యాణం” తెలుగు పౌరాణిక చలన చిత్రం. వేల్ పిక్చర్స్ పతాకంపై పినపాల వెంకటదాసు నిర్మించిన ఈ చిత్రంలో బెజవాడ రాజారత్నం, వేమూరి గగ్గయ్య, కన్నాంబ మొదలగు వారు నటించారు.
సీతా కళ్యాణం (1934) చిత్రానికి సంగీతం గాలి పెంచల నరసింహారావు అందించారు. తమ్ముడు నరసింహారావు దర్శకత్వం వహిస్తున్న “సీతా కళ్యాణం” చిత్రానికి సహాయకులుగా చిత్రపు నారాయణ మూర్తి చేరారు. ఆ విధంగా సహాయకుడికి చేరిన నారాయణ మూర్తిని నిర్మాత పి.వి.దాసు తన యాజమాన్యంలో ఉన్న లాడ్జికి మేనేజరుగా నియమించారు. ఒకవైపు తమ్ముడు నరసింహా రావు వద్ద సినిమాకు సంబంధించిన విషయాలు నేర్చుకుంటూనే, మరోవైపు లాడ్జి మేనేజర్ గా పనిచేస్తూ ఉండేవారు నారాయణ మూర్తి. లాడ్జికి వచ్చిన సందర్శకులతో కొన్నిసార్లు పొసగక, ఆయనకు తాను చేస్తున్న పని నచ్చేది కాదు. దాంతో ఒకరోజు ఆ విషయం తమ్ముడికి చెప్పి మచిలీపట్నం వచ్చి మళ్లీ ట్యూషను చెప్పడం ప్రారంభించారు నారాయణ మూర్తి. అలాగే తాను నాటకాలు కూడా వేయడం ప్రారంభించారు.
ఎడిటర్ మరియు సహాయ దర్శకుడిగా…
వేల్ పిక్చర్స్ పతాకంపై పినపాల వెంకటదాసు నిర్మించిన రెండవ చిత్రం “శ్రీకృష్ణ లీలలు” (1935) చిత్రానికి కూడా చిత్రపు నరసింహారావునే దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వేమూరి గగ్గయ్య, రామతిలకం, సాలూరి రాజేశ్వరరావు, శ్రీరంజని, తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ తెలుగు పౌరాణిక చిత్రానికి కూడా సహాయ దర్శకుడిగా ఉండాలని అన్నయ్య నారాయణ మూర్తికి కబురు చేశారు నరసింహా రావు. కానీ పినపాల వెంకటదాసు సినిమాకు ఆయన సహాయకుడిగా ఉండలేనని తేల్చి చెప్పారు. పి.వి. దాసు నిర్మించిన మూడవ చిత్రానికి ఆయనే స్వీయ దర్శకత్వం చేశారు. ఆ తరువాత ఘంటసాల బలరామయ్య నిర్మాతగా శ్రీరామ ఫిల్మ్స్ పతాకంపై “సతీ తులసి” (1936) నిర్మించదలచి చిత్రపు నరసింహారావును దర్శకుడిగా ఎంచుకున్నారు. దర్శకులు నరసింహారావు పిలుపు మేరకు చిత్రపు నారాయణ మూర్తి రెండోసారి సహాయకుడిగా చేరారు.
ఈ సినిమాకు భీమవరపు నరసింహారావు సంగీతాన్నందించగా, ఘంటసాల బలరామయ్య, వేమూరి గగ్గయ్య, శ్రీరంజని సీనియర్ నటించిన ఈ చిత్రం నవంబరు 1936 లో విడుదలయ్యింది. ఈ చిత్ర నిర్మాణంలోనే కాకుండా చిత్ర ఎడిటింగ్ లో కూడా పాఠాలు నేర్చుకున్నారు నారాయణమూర్తి. “సతీ తులసి” చిత్రం కూడా అద్భుతమైన విజయం సాధించింది. నేషనల్ మూవీ టోన్ వారు మోహినీ రుక్మాంగద (1937) చిత్రాన్ని నిర్మిస్తూ దానికి దర్శకుడిగా చిత్రపు నరసింహారావును తీసుకున్నారు. ఈ సినిమాకు కూడా చిత్రపు నారాయణ మూర్తి సహాయ దర్శకుడిగా నే కాకుండా ఎడిటింగ్ శాఖలో కూడా పనిచేసి పూర్తిగా ఎడిటింగ్ నేర్చుకున్నారు. మోహినీ రుక్మాంగద (1937) సినిమా మే 1937 లో విడుదలైంది. ఈ సినిమాకు అన్నయ్య చిత్రపు చలపతిరావు సహాయ దర్శకుడిగా, తమ్ముడు సుబ్బారావు లు అసిస్టెంట్ ఆడియోగ్రాఫర్ గా పనిచేశారు.
మీర్జాపురం రాజావారి పరిచయం…
మోహినీ రుక్మాంగద (1937) సినిమా తరువాత చిన్న తమ్ముడు చిత్రపు సుబ్బారావు సినిమాలు మానేసి స్వగ్రామం వెళ్లి ప్రెస్ పెట్టుకుని తన ప్రస్థానాన్ని కొనసాగించారు. మిగిలిన అన్నదమ్ములు ముగ్గురు చిత్రం నరసింహారావు, నారాయణమూర్తి, చలపతిరావు మద్రాసు లోనే ఉండిపోయారు. 1936 వరకు రాజకీయాలలో చురుగ్గా ఉన్న నూజివీడు జమీందారు (మీర్జాపురం రాజావారు) జస్టిస్ పార్టీకి నాయకుడిగా ఉండేవారు. 1936 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి జస్టిస్ పార్టీ ఓడిపోవడంతో ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పి సినిమా రంగంలోకి వచ్చి జయా ఫిలిమ్స్ స్థాపించారు. అదే పేరుతో జయా స్టూడియోను కూడా స్థాపించారు. పి.వి. దాసు మొట్ట మొదటిసారిగా మద్రాసు లో స్టూడియోను స్థాపిస్తే, ఆ తరువాత మద్రాసులో రెండో స్టూడియో నిర్మించిన వారు మీర్జాపురం రాజా వారు. జయా ఫిలిమ్స్ బ్యానరును స్థాపించి, అదే పేరుతో స్టూడియోను కూడా నిర్మించారు.
జయ ఫిల్మ్స్ బ్యానరులో కృష్ణ జరాసంధ స్క్రిప్టు తీసుకుని దానినే సినిమాగా “కృష్ణ జరాసంధ” (1938) నిర్మిస్తూ దర్శకుడిగా చిత్రపు నరసింహారావును ఎంచుకున్నారు. అన్నయ్య చిత్రపు నారాయణ మూర్తి, చలపతిరావులు “కృష్ణ జరాసంధ” సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఈ సినిమా తరువాత చలపతిరావు వెనక్కి వెళ్లి తన నేషనల్ ప్రెస్ (ముద్రణాలయం) ను కొనసాగించారు. చిత్రపు నరసింహారావు, నారాయణ మూర్తి ఇద్దరూ మద్రాసులోనే కొనసాగారు. చిత్రపు నారాయణమూర్తికి “శ్రీకృష్ణ లీలలు” సినిమా సమయంలో ఘంటసాల బలరామయ్య, “కృష్ణ జరాసంధ” సినిమాకు మీర్జాపురం రాజావారు పరిచయం అయ్యారు. ఆ పరిచయం ఆ తరువాత రోజులలో తన సినిమా ప్రస్థానానికి ఎంతగానో దోహదం చేశాయి.
దర్శకుడిగా తొలి చిత్రం భక్త మార్కండేయ (1938)…
శ్రీరామ ఫిలిమ్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థ నుండి బయటకు వచ్చిన ఘంటసాల బలరామయ్య తన మిత్రులు వెంకురెడ్డితో కలిసి “కుబేర పిక్చర్స్” అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు. వారు భక్త మార్కండేయ (1938) అనే సినిమా తీయాలనుకున్నారు. దానికి చిత్రపు నారాయణ మూర్తిని దర్శకుడిగా తీసుకున్నారు. నారాయణ మూర్తి తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం భక్త మార్కండేయ (1938). ఈ సినిమాలో మార్కండేయగా జి.ఎన్.స్వామి, యముడుగా వేమూరి గగ్గయ్య, మృకండ మహామునిగా ఘంటసాల రాధాకృష్ణయ్య, శివుడిగా రాయప్రోలు సుబ్రహ్మణ్యం, బ్రహ్మగా ఘంటసాల శేషాచలం, నారదుడిగా టి.రామకృష్ణశాస్త్రి, విష్ణుమూర్తిగా విశ్వనాధం, మరదృతిగా శ్రీరంజని, పార్వతిగా కుమారి, భూదేవిగా రమాదేవిలు నటించారు. ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు ఎడిటింగ్ కూడా తానే నిర్వహించి సినిమా ఘనవిజయంలో తనదైన పాత్ర పోషించారు నారాయణ మూర్తి. కుబేరా ఫిల్మ్స్ పతాకంపై ఘంటసాల బలరామయ్య నిర్మించిన మరొక సినిమా మైరావణ (1940) కు కూడా చిత్రపు నారాయణ మూర్తి దర్శకులు. వేమూరి గగ్గయ్య మైరావణ పాత్రలో నటించగా చిత్తజల్లు కాంచనమాల, రామిరెడ్డి
రాయప్రోలు సుబ్రహ్మణ్యం నటించారు. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించింది.
శోభనాచల పిక్చర్స్ కు ఆస్థాన దర్శకుడిగా…
మీర్జాపురం రాజావారు స్థాపించిన జయ ఫిలిమ్స్ అనే బ్యానరును 1940లో శోభనాచల అనే పేరు మార్చి “శోభనాచల పిక్చర్స్” బ్యానరును, శోభనాచల స్టూడియోను ప్రారంభించారు. ఈ స్టూడియో నిర్మాణంలో చిత్రపు నారాయణ మూర్తి సహాయం కూడా తీసుకున్నారు. ఆ తరువాత చిత్రపు నారాయణ మూర్తి “శోభనాచల పిక్చర్స్” కు ఆస్థాన దర్శకుడిగా ఎనిమిది సంవత్సరాలు కొనసాగారు. ఆ పరంపరలో వరుసగా సుమారు ఎనిమిది చిత్రాలకు దర్శకత్వం వహించారు. అన్ని పౌరాణిక చిత్రాలే. ఆ సినిమా అన్నింటిలోనూ వేమురు జగ్గయ్య నటించారు. అందులో భాగంగా రెండు సినిమాలను సమాంతరంగా తెరకెక్కించారు నారాయణ మూర్తి. అవి “భక్త ప్రహ్లాద” (1942), దక్షయజ్ఞం (1941).
ఒకరోజు భక్త ప్రహ్లాద, మరొక రోజు దక్షయజ్ఞం అలా దర్శకత్వం వహిస్తూ వచ్చారు. భక్త ప్రహ్లాదలో ప్రహ్లాదుడిగా జి.వరలక్ష్మి, హిరణ్యకశిపుడిగా గగ్గయ్య నటించారు. దక్షయజ్ఞం చిత్రంలో వేమూరి గగ్గయ్య, కృష్ణవేణి,రామకృష్ణ శాస్త్రి, రాజారత్నం ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి టి.ఎ.మోతిబాబు సంగీతం సమకూర్చారు. ఈ రెండు సినిమాలు అద్భుతమైన విజయం సాధించాయి. ఈ విజయంతో శోభనాచల పిక్చర్స్ కు మంచి పేరు వచ్చింది. చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వం వహించిన నాలుగు సినిమాలు విజయవంతం అయ్యాయి. అప్పటికే రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. సినిమా వాళ్ళు, వ్యాపారులు తమ కార్యచరణను ఆపేసి, మద్రాసు వదిలి వెళ్ళిపోయారు. అదే సమయంలో చిత్రపు నారాయణ మూర్తి చెన్నపట్నం నుంచి విజయవాడకు వచ్చి ఒక సంవత్సరం పాటు సరదాగా కాలక్షేపం చేస్తూ ఉండేవారు.
నిర్మాతగా తొలిప్రయత్నం విఫలం…
కొంతకాలం తరువాత యుద్ధ వాతావరణం తగ్గగానే శోభనాచల పిక్చర్స్ పతాకంపై “భీష్మ” (1944) సినిమాను నిర్మించదలచి పెడుతూ నారాయణ మూర్తిని పిలిపించారు మీర్జాపురం రాజావారు. “భీష్మ” చిత్రం నారాయణ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కగా జంధ్యాల గౌరీనాథ శాస్త్రి, సి.కృష్ణవేణి, చిలకలపూడి సీతారామాంజనేయులు, లక్ష్మీరాజ్యం, పారుపల్లి సత్యనారాయణ మొదలగు వారు నటించారు. మోతీ బాబు, గాలి పెంచల నరసింహారావులు ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించింది. ఆ తరువాత మద్దాలి కృష్ణమూర్తి, ప్రభావతి, కోటేశ్వరరావు మొదలగు నటీనటులతో సంసార నారది (1944) తెరకెక్కించారు. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించింది.
చిత్రపు నారాయణమూర్తి 1944 వ సంవత్సరం వరకు ఆరు విజయవంతమైన పౌరాణిక చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాను తెరకెక్కిస్తున్న చిత్రాలు విజయవంతం అవుతుండడంతో తనకు చిత్రాలు నిర్మించాలనే ఆలోచన కలిగింది. దాంతో చిత్రపు నారాయణమూర్తి సొంతంగా 1946 వ సంవత్సరంలో “వెంకట్రామ పిక్చర్స్” స్థాపించారు. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి వ్రాసిన “బ్రహ్మ రథం” నవల ఆధారంగా బ్రహ్మరథం (1947) సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. ఈ సినిమాకు రచయిత కూడా బలిజేపల్లి లక్ష్మీకాంత కవి.
ఈ సినిమాకు చిత్రపు నారాయణ మూర్తి దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరించారు. విజయవంతమైన సినిమాను తీశారు. ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమా ప్రింట్ల కోసం నెగిటివ్ ను లాబరేటరీకి పంపించారు. ల్యాబ్ లో అగ్ని ప్రమాదం జరగడంతో అందులో ఉన్న నెగెటివ్స్ అన్నీ కూడా కాలిపోయాయి. అందువలన అదనపు ప్రింట్లు వేయడానికి నెగటివ్ లేవు. అంతకుముందు వేసిన 16 ప్రింట్లు థియేటర్లలో తిరిగి తిరిగి అరిగిపోయాయి. దాంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తాను చేసిన తొలి ప్రయత్నం, మొదటి ప్రయోగం చేదు అనుభవాన్ని మిగిల్చింది.
“ఎన్ తంగై” (1952) తో తమిళ చిత్రాలకు దర్శకుడిగా…
అప్పటివరకు నిర్మాతగా వ్యహరించిన మీర్జాపురం రాజావారు దర్శకత్వం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన స్వయంగా తెరకెక్కించిన కీలుగుఱ్ఱం (1949), తిలోత్తమ
(1951) చిత్రాలకు చిత్రపు నారాయణమూర్తి కథ, స్క్రీన్ ప్లే సమకూర్చారు. తెలుగు, తమిళ భాషలలో నిర్మించబడ్డ తిలోత్తమ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే సమయంలోనే చిత్రపు నారాయణ మూర్తి తమిళం నేర్చుకున్నారు. ఎం.జి.రామచంద్రన్, ఇ.వి.సరోజ లను నాయక, నాయికలుగా 1952 వ సంవత్సరం లో “ఎన్ తంగై” అనే తమిళ సినిమాను నిర్మిస్తూ “అశోక పిక్చర్స్ సేలం” వారు దర్శకుడిగా చిత్రపు నారాయణ మూర్తిని తీసుకున్నారు.
అప్పటివరకు పౌరాణిక సినిమాలనే తెరకెక్కించిన నారాయణ మూర్తి మొట్టమొదటిగా “ఎన్ తంగై” (1952) అనే తమిళ చిత్రం ద్వారా తొలి సాంఘిక చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇదే చిత్రాన్ని జి.వరలక్ష్మి, సూర్యకళ, రామశర్మ, అమరనాథ్ లతో అశోక్ పిక్చర్స్ వారు “మా చెల్లెలు” (1953) పేరుతో తెలుగులో చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వంలో పునర్నిర్మించారు. తెలుగులో “మా చెల్లెలు” అద్భుతమైన విజయం సాధించింది. అలాగే నారాయణ మూర్తి “ఎదిర్ పరాధదు” (1954), “ఆదర్శ సతి” (1955), నాగులచవితి (1956), పతిని దైవమ్ (1957), అణ్ణయిన్ ఆణై (1958), మనమలై (1958), నాన్ వాలార్త తంగై (1958), దైవమే తునై (1959), భక్తశబరి (1960), చిత్తూరు రాణీ పద్మిని (1963) తదితర తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
కోలుకోలేని దెబ్బ తీసిన “కృష్ణ కుచేల” (1961)…
మళ్ళీ చిత్ర నిర్మాణం వైపు మళ్ళిన చిత్రపు నారాయణమూర్తి 1961 వ సంవత్సరంలో “శ్రీ గాయత్రీ ఫిలింస్” ను స్థాపించి స్వీయ దర్శకత్వం చేస్తూనే “కృష్ణ కుచేల” చిత్రాన్ని నిర్మించారు. సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, కన్నాంబ, ముక్కామల, రాజశ్రీ , పద్మనాభం మున్నగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు సమకూర్చగా, మాటలు పాలగుమ్మి పద్మరాజు వ్రాశారు. ఈ చిత్రానికి తన పెద్దబ్బాయి శ్యామ్ సుందర్ ని సహాయ దర్శకుడిగా తీసుకున్నారు. నారాయణ మూర్తి దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం “కృష్ణ కుచేల” కూడా తనకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. చక్కటి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉన్నా కూడా ఈ చిత్ర పరాజయం తనను కోలుకోలేని దెబ్బతీసింది. “చిత్తూరు రాణీ పద్మిని” అనే తమిళ సినిమాని అదే పేరుతో తెలుగులో తెరకెక్కించిన చిత్రపు నారాయణ మూర్తి 06 డిసెంబరు 1963 నాడు ఆ చిత్రాన్ని విడుదల చేశారు. ఆ సినిమా తెలుగులో పరాజయం పాలైంది. అదే సమయానికి నారాయణ మూర్తి రెండవ కుమారుడు 1963 వ సంవత్సరం లోనే జబ్బు చేసి మరణించారు. ఒకవైపు సినిమాల పరాజయం, మరోవైపు కుమారుడి మరణంతో మానసికంగా దెబ్బతిన్న నారాయణ మూర్తి రెండు సంవత్సరాలనుండి సినిమా దర్శకత్వానికి, నిర్మాణానికి దూరంగా ఉన్నారు.
అవకాశాల కోసం ఏ.వి.యం. చెట్టియార్ వద్దకు…
కానీ “కృష్ణ కుచేల” సినిమాకు చేసిన అప్పులతో మళ్ళీ చిత్ర రంగానికి రావలసిన పరిస్థితి ఏర్పడింది. 1965 వ సంవత్సరం లో ఎ.వి.మెయిప్పన్ నిర్మాణ సారధ్యంలోని ఏ.వి.యం. ప్రొడక్షన్స్ వద్దకు వెళ్లారు చిత్రపు నారాయణ మూర్తి. గతంలో వీరి బ్యానరులో “నాగుల చవితి” లాంటి సినిమాను చిత్రీకరించారు. ఆయనకు మరోసారి దర్శకుడిగా అవకాశం ఇవ్వాల్సిందిగా వారిని కోరారు నారాయణ మూర్తి. అప్పటికే ఏ.వీ.ఎం వారు తెలుగులో తీసిన “సంఘం”, “వదిన” లాంటి సినిమాలు పరాజయం పాలయ్యాయి. అదే సమయానికి ఎస్వీ రంగారావు స్థాపించిన “శ్రీవాణి ఫిల్మ్స్” మరియు ఏ.వి.యం. ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా ఎ.సి.త్రిలోకచందర్ దర్శకత్వంలో 1964 లో తెలుగులో నిర్మించిన “నాదీ ఆడజన్మే” (తమిళంలో “నానుమ్ ఒరుపెణ్”) అద్భుతమైన విజయం సాధించడంతో తెలుగులో మళ్ళీ సినిమాలు చేయాలని ఆలోచన వచ్చిన ఏ.వీ.మెయ్యప్పన్ ను అదే సమయానికి చిత్రపు నారాయణ మూర్తి కలిశారు. దాంతో మెయ్యప్పన్ చెట్టియార్ నారాయణ మూర్తితో సినిమా తీయాలనుకున్నారు. కానీ దానికి మాటలు డి.వి.నరసరాజు వ్రాయాలని సూచించారు. నరసరాజు తో ఒక్కసారి మాట్లాడండి అని చెట్టియార్ అన్నారు.
ఆఖరి చిత్రం “భక్త ప్రహ్లాద” (1967)…
ఏ.వి.యం కార్యాలయానికి వచ్చిన డి.వి. నరసరాజు ను కలుసుకున్న చిత్రపు నారాయణ మూర్తిని చూసి నరసరాజు ఆశ్చర్యానికి లోనయ్యారు. “కృష్ణ కుచేల” సినిమా తెరకెక్కిస్తున్న సమయంలో ఆయన చూసిన నారాయణ మూర్తి బలంగా, ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఇప్పుడు చిక్కిపోయి, దిగాలుగా ఉండడం చూసి నరసరాజు అవాక్కయ్యారు. నరసరాజు కనపడగానే ఆయన చేతులు పట్టుకుని పరిచయం చేసుకున్నారు నారాయణ మూర్తి. తాను తెరకెక్కించబోయే సినిమాకు మాటలు వ్రాయాల్సిందిగా నరసరాజు ను కోరారు. తాను మాటలు వ్రాస్తేనే నారాయణ మూర్తి కి అవకాశం ఇవ్వనున్నట్లు మెయ్యప్పన్ చెట్టియార్ చెప్పారని, ఆ సినిమా దర్శకత్వం వహించడం తనకు చాలా అవసరం అని తన ఆర్థిక స్థితిగతుల గురించి చెప్పారు నారాయణ మూర్తి. ఆ మాటలకు ఆ క్షణంలో నరసరాజు కళ్ళలోకి నీళ్లు వచ్చాయి. అప్పుడు నారాయణ మూర్తి కోసం నరసరాజు మాటలు వ్రాయడానికి ఒప్పుకున్నారు. నరసరాజు మాటలు వ్రాయగా నారాయణ మూర్తి తెరకెక్కించిన చిత్రం “భక్త ప్రహ్లాద” (1967). దీనికి మునుపు 1931, 1942 లో కూడా ఇదే పేరుతో తెలుగులో సినిమాలు వచ్చాయి. హిరణ్యకశిపుడిగా ఎస్.వి. రంగారావు, ప్రహ్లాదుడిగా రోజారమణి, ప్రహ్లాదుడి తల్లిగా అంజలీ దేవి నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 1967 లో “భక్త ప్రహ్లాద” విడుదలైంది. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది.
మరణం…
“భక్త ప్రహ్లాద” (1967) సినిమా నిర్మాణానికి ముందు డి.వి.నరసరాజును ఈ పౌరాణిక చిత్రం భక్త ప్రహ్లాదకు మాటలు వ్రాయమని ముందస్తుగా నరసరాజు, నారాయణ మూర్తి లకు బయనా కొంత డబ్బు ఇచ్చి “మెయ్యప్పన్ చెట్టియార్” బెంగుళూరు వెళ్ళిపోయారు. నరసరాజు, నారాయణ మూర్తి లు ఇద్దరూ ఉదయం నాలుగు గంటలు, సాయంత్రం నాలుగు గంటలు స్క్రిప్ట్ పని మీద కూర్చునేవారు. డి.వి.నరసరాజు ఏమి వ్రాసిన సరే అంటూ తలూపుతూ వచ్చారు నారాయణ మూర్తి. వాటికి మార్పులు, చేర్పులు సూచించేవారు కాదు. అందుకు కారణం మెయ్యప్పన్ చెట్టియార్.
డి.వి. నరసరాజు ఏమి వ్రాసినా కూడా వద్దు అనకూడదు అని ఆయన నారాయణ మూర్తి కి చెప్పారు. ఎందుకంటే నారాయణమూర్తి పాతకాలపు మనిషి. తన ఆలోచనలు కూడా పాతగా ఉంటాయి. నరసరాజు కొత్తవారు, ఆయన ఆలోచనల ప్రకారం కానివ్వండి అని నారాయణ మూర్తితో అన్నారట. అదే విషయం నరసరాజుకు చెప్పారు నారాయణమూర్తి. ఎందుకంటే ఆ సినిమా చేయడం నారాయణ మూర్తికి తప్పనిసరి కాబట్టి. “భక్త ప్రహ్లాద” (1967) చిత్రీకరణకు దాదాపు సంవత్సరం పైగా పట్టింది. దానిని సమాంతరంగా తెలుగు, తమిళం, హిందీ భాషలలో నిర్మించారు. ఆ చిత్రం మూడు భాషలలో అద్భుతమైన విజయం సాధించింది.
భారత స్త్రీల సాంప్రదాయాన్ని, భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రతిబింబించే ఒక చిత్రాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు నారాయణ మూర్తి. కానీ భక్త ప్రహ్లాద తరువాత ఆయనకు అవకాశాలు రాలేదు. దాదాపు రెండు దశాబ్దాలు “కృష్ణ కుచేల” సినిమాకు జరిగిన నష్టాలే ఆయనను క్రుంగదీస్తూ వచ్చాయి. నారాయణ మూర్తి వాళ్ళ కుటుంబ బాధ్యతలు ఆయన పెద్ద కుమారుడు శ్యామ్ సుందర్ తీసుకున్నారు. 1985 వ సంవత్సరం ప్రారంభంలో నారాయణ మూర్తి ఆరోగ్యం దెబ్బతిన్నది. “భక్త ప్రహ్లాద” సినిమా తరువాత ఆయన మరొక సినిమాకు దర్శకత్వం వహించాలనే కోరిక తీరకముందే 03 ఏప్రిల్ 1985 నాడు చిత్రపు నారాయణ మూర్తి మరణించారు.

