
“తనకు ఇష్టమైన పనిని ఏ మూర్కుడైనా చేయగలడు, కానీ తెలివి గలవాడు ఏ పనినైనా తనకు ఇష్టంగా మలుచుకుంటాడు” అన్నారు స్వామీ వివేకానంద. పేదరికంలో పుట్టి ఎన్నో కష్టాలు ఎదురైనా కూడా తన లక్ష్యం కోసం వేసిన ఒక్కొక్క అడుగు తనకు ఒక్కో పాఠం నేర్పింది అంటారు కోట నరసింహం కేసరి (కె.ఎన్.కేసరి). ఆయన ఏ పనినైనా తనకు ఇష్టంగా మలుచుకునేవారు, అందుకే జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళగలిగారు. ఎక్కడో మారుమూల పల్లెలో జన్మించి, తినడానికి లేక బిచ్చమెత్తుకునే స్థాయి నుండి మొదలైన తన ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి కోటేశ్వరుడి స్థాయికి ఎదిగి, పేదరికపు మూలాలను వదిలేయకుండా సామాజిక సేవలు చేసే స్థాయికి చేరుకున్నారంటే మాములు మాటలు కాదు. ఆయన “కేసరి కుటీరం” అనే ఔషధశాల స్థాపించారు. అలాగే మదరాసులోని మైలాపూరులో కేసరి పాఠశాలను స్థాపించారు. దానశీలిగా పేరుగాంచిన కె.యన్.కేసరి స్త్రీ జనోద్దరణకై గృహలక్ష్మి మాసపత్రికను స్థాపించారు. కర్నాటక సంగీత విద్వాంసుడు మరియు సినీ గాయకుడైన ఉన్ని కృష్ణన్ ఆయన ముని మనుమడు.
కె.యన్. కేసరి తన పదకొండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన తల్లి బాధను భరించలేక ఇంటి నుండి పారిపోయి కాలినడకన మద్రాసు నగరానికి చేరుకున్నారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు, పలు సమస్యలతో పోరాడారు. అనేక ప్రారంభ ఎదురుదెబ్బల తరువాత, ఆయన హిందూ థియోలాజికల్ స్కూల్ (మింట్ స్ట్రీట్) లో స్కాలర్‌షిప్ పొంది అక్కడే చదువుకున్నారు. ఆయుర్వేద వైద్యం నేర్చుకున్న కేసరి, కన్యకా పరమేశ్వరి ఆలయ ధర్మ ఆయుర్వేద వైద్యశాలలో సాధన చేసిన పండిట్ డి గోపాలాచార్యులు వద్ద శిష్యరికం చేశారు. 1900 వ సంవత్సరంలో, డాక్టర్ కేసరి కొంతమంది భాగస్వాములతో కలిసి కేసరి కుటీరం పేరుతో తన సొంత ప్రాక్టీసును స్థాపించారు. వారి మధ్య అభిప్రాయ భేదాల కారణంగా వ్యాపారాన్ని మచిలీపట్నం మరియు సికింద్రాబాద్‌లో కొత్త కార్యాలయాలతో విస్తరింపజేశారు. లోధ్రా, అమృత మరియు అర్కా వంటి మందుల ఉత్పత్తుల కోసం డాక్టర్ కేసరి తన సొంత ప్రకటనలను రూపొందించారు. వ్యాపారాన్ని మరింత విస్తరణ చేయడం కోసం తన నివాసం ఎగ్మోర్‌కు మారడానికి దారితీసింది.
దీర్ఘకాలిక అనారోగ్యం తరువాత కేసరి మొదటి భార్య మరణించారు. దాంతో ఆయన కేరళకు చెందిన మాధవి అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఆమె స్త్రీలు మరియు పిల్లల అనారోగ్యాలను నయం చేయడంలో నిపుణురాలు కావడంతో ఆమె తన భర్తతో కలిసి వైద్య వృత్తి ప్రాక్టీసును ప్రారంభించారు. కేసరి, మాధవి దంపతులకు 1919లో శారదా దేవి అనే కుమార్తె జన్మించారు. ఆ తరువాత సంవత్సరాల్లో వారు వసంత అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. వారు కేరళలో కేసరి కుటీరం యొక్క ఒక శాఖను ఏర్పాటు చేశారు. 1937లో కేసరి కుటీరం వ్యాపారం రాయపేటలోని వెస్ట్‌కాట్ రోడ్‌కు మార్చారు.
అక్కడ బంగ్లాలో మందులు తయారుచేసేవారు. అది రానురాను ఒక భారీ సంస్థగా మారింది. కె.యన్.కేసరి తాను మంచి విద్యను పొందడానికి ఎదుర్కొన్న ఇబ్బందులను ఎప్పటికీ మర్చిపోకుండా, మద్రాసు పట్టణంలో నివసించే ఆంధ్రా మూలాలున్న ప్రజలకు మంచి విద్యను అందించడానికి ఏర్పాటు చేసిన పాఠశాలకు దాని నిర్వహణకు కేసరి ఆర్థిక సహాయం చేశారు. ఆ సంస్థ నిర్వహణను చేపట్టడానికి ముందుకొచ్చి, 1943లో దానిని మిడిల్ స్కూల్‌కు, తరువాత హై స్కూల్ స్థాయికి కేసరి పెంచారు. ఈ పాఠశాల నుండి మార్చి 1948లో మొదటి బ్యాచ్ విద్యార్థులు యస్.యస్.యల్.సి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యారు. ఆ తరువాత ఇది కేసరి హై స్కూల్‌గా మారింది.
కష్టాలు నిండిన బాల్యం…
డాక్టర్ కె.యన్.కేసరి (కోట నరసింహం కేసరి) 1875 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాలో మద్దిపాడు మండలానికి చెందిన ఇనమనమెళ్ళూరు గ్రామంలో జన్మించారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఈయన తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. కేసరికి ఐదేళ్ల వయసు ఉండగానే తండ్రి మరణించారు. అప్పటికే దర్జీ పని చేస్తున్న తల్లికి ఇంటి పనులలో సహాయం చేస్తూ ఉండటం వలన తాను బడికి కూడా సరిగ్గా వెళ్ళగలిగేవాడు కాదు. కేవలం తల్లి దర్జీ పని చేస్తుండడం వలన వచ్చే ఆదాయంతో తన ఇల్లు గడిచేది కాదు. తన ఐదేళ్ల వయస్సులో తండ్రిని కోల్పోయినప్పుడు ఆయన వదిలివెళ్లిన ఆస్తి కేవలం పది అణాలు మాత్రమే. దాంతో రెండు పూటలా తిండి తినడమే కష్టమైన ఆ పరిస్థితులలో ఆ చిన్న వయస్సులో ఆ పిల్లవాడు పక్క ఊరు వెళ్లి బిచ్చం ఎత్తుకునేవాడు.
చూడడానికి ముక్కుపచ్చలారని చిన్న పిల్లవాడు, అందులోనూ అమాయకత్వం ఉండడం వలన కాబోలు జోల పట్టుకుని బిచ్చం ఎత్తుకుంటున్నాడని జాలిపడి కాస్త ఎక్కువగానే బిచ్చం వేసేవారు. బిచ్చమెత్తుకున్న సంచిని మోసుకుని కాలినడకన ఇంటికి బయదేరేవాడు. నడుచుకుంటూ ఇంటికి వచ్చేటప్పుడు దారి మధ్యలో అరికాళ్ళలో గుచ్చుకున్న ముళ్ళ వలన కాళ్ళకు రక్తం కారుతూ ఉండేది. అవేమీ లెక్కచేయకుండా మోసుకొచ్చిన సంచిని అమ్మకు ఇచ్చేవాడు. కాళ్ళకు కారుతున్న రక్తాన్ని చూసి ఆమె హృదయం శోకంతో నిండిపోయేది. కొడుకు పడుతున్న బాధను చూసి ఆమె భావురుమని ఏడ్చేది.
కాలినడకన ఒంగోలు నుండి మద్రాసుకు…
కొడుకు కష్టాలు చూసి తల్లడిల్లిపోయిన ఆ తల్లి కుమారుడితో “నీవు బిచ్చమెత్తవద్దు, నేను దర్జీ పనితో పాటు ఏదో ఒక కష్టం చేసి సంపాదిస్తాను, వచ్చిన సంపాదనతోనే ఎలాగోలా బ్రతుకుదాము” అని హితబోధ చేసింది. కానీ ఆ పిల్లవాడికి మాత్రం తమ పేదరికం, తాము పడుతున్న కష్టాలు చూసి తల్లడిల్లిపోయేవాడు. ఏం చేస్తే తమ పేదరికం పోతుందని విపరీతమైన ఆలోచనలు చేసేవాడు. ఊర్లో ఉంటే ఎప్పటికీ తమ బ్రతుకు ఇలాగే ఉంటుందని అర్థం అయిన ఆ కుర్రాడు పట్నం వెళ్లి చదువుకోవాలని, అక్కడే ఏదో ఒక పనిచేసి సంపాదించాలని అనుకున్నాడు. అలా తనలో మొదలైన సంకల్పంతో తన పది సంవత్సరాల వయస్సులో మద్రాసు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు.
తండ్రి లేని బాధ ఒకవైపు, తల్లి పడే కష్టం మరొకకవైపు, కడు పేదరికం, ఆకలి, కన్నీళ్లు, కష్టాలు ఇవన్నీ మదిలో మెదులుతుండడంతో చేసేదేమి లేక తన ఊరి నుండి కాలినడకన ఒంగోలు చేరుకున్నాడు. అక్కడినుండి మద్రాసుకు బయలుదేరాడు. ఒంగోలు, మద్రాసు మధ్య దూరం సుమారు 300 కి.మీ పైనే. కాలినడకనకన బయలుదేరిన కేసరి కొన్ని వారాలపాటు నడిచి, నడిచి చివరికి మద్రాసుకు చేరుకున్నాడు. ఒంగోలు నుండి మద్రాసుకు చేరుకునే క్రమంలో తాను కొన్నివారాల పాటు కాలి నడకన చేసిన ప్రయాణం తన జీవితాన్ని మార్చడానికి, తన లక్ష్యాన్ని చేరుకోవడానికి తనలో ఒక పట్టుదల ఏర్పడడానికి దోహదం చేసిందనే చెప్పాలి. చదువు నేర్పిన పాఠాల కంటే, బ్రతుకు నేర్పిన పాఠాలు జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. అందుకేనేమో ఒంగోలు నుండి మద్రాసుకు చేరుకునే సుదీర్ఘ కాలి నడకలో తాను ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు.
పలు సామాజిక సేవలు నిర్వహించి…
మద్రాసు చేరిన కోట నరసింహం కేసరి (కె.ఎన్.కేసరి) ఎలాగోలా హిందూ ధార్మిక పాఠశాలలో స్కాలర్‌షిప్పు పొంది, చదువు పూర్తి చేసుకున్నారు. ఆ తరువాత పలుచోట్ల ఉద్యోగ ప్రయత్నాలు చేసినా అవి ఆయనకు సత్ఫలితాలను ఇవ్వలేదు. తరువాత ఆయన వైద్యం నేర్చుకోవడం ప్రారంభించారు. ఆయనకు మద్రాసులో పరిచయమున్న కోమట్ల సహాయంతో శ్రీ కన్యకాపరమేశ్వరీ ఆయుర్వేద వైద్య కళాశాలలో కొలువు సంపాదించారు. ఆ తరువాత 1900 వ సంవత్సరంలో మద్రాసులోని జార్జిటౌన్ నారాయణ మొదలి వీధిలో ఒక చిన్న ఇంటిని బాడుగకు తీసుకుని కేసరి కుటీరము పేరుతో ఆయన మందుల తయారీ సంస్థను ప్రారంభించారు. ఎంతో డబ్బు సంపాదించారు. చాలా ఎత్తుకు ఎదిగిపోయారు.
తాను ఎదుర్కొన్న కష్టాలు, అనుభవించిన బాధల నుండి స్ఫూర్తి పొందిన తాను ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. 1928లో సామాజిక రాజకీయ రంగాలలో మహిళను ప్రోత్సహించేందుకై గృహలక్ష్మి అనే తెలుగు వారపత్రికను స్థాపించి, దానికి వ్యవస్థాపక సంపాదకుడిగా వ్యవహరించిన కేసరి ఆ పత్రిక కోసం మహిళా రచయితలను పెంపొందించారు. మహిళా రచయితలను సత్కరించేందుకు ఆయన గృహలక్షి స్వర్ణకంకణమనే పురస్కారాన్ని స్థాపించారు. అదేవిధంగా 1943 వ సంవత్సరంలో చెన్నపట్నంలోని మైలాపూరు తెలుగు ప్రాథమిక పాఠశాల యొక్క యాజమాన్యపు బాధ్యతలను తీసుకొని దానికి తగిన నిధులు సమకూర్చి, దానిని ఉన్నత పాఠశాల స్థాయికి తీసుకెళ్ళారు. 1951 వ సంవత్సరంలో విద్యాభివృద్ధి పనులను మరింత విస్తరించడానికి కేసరి విద్యాసంస్థ అనే ధర్మాదాయసంస్థను ఏర్పాటు చేసారు. కేసరి విద్యాసంస్థ ప్రస్తుతం తన ఆధ్వర్యంలో అనేక పాఠశాలలను నడిపిస్తున్నది.
ప్రత్యేక విద్యాలయాలు స్థాపించి…
పదేళ్ళ వయస్సులో కాలినడకన చెన్నపట్నం చేరిన కేసరి జీవితం ఒక పద్మవ్యూహం. దానిని ఛేదించడం తన జీవితానికి ఒక అద్భుతం అనే చెప్పాలి. తన గురించి తాను ఇలా వ్రాసుకున్నాడు…
“చిన్నతనంలో ఇల్లు వాకిలి లేని వానిగా చేసి, రాగి చెట్టు క్రింద కాపురం చేయించినందుకు గానూ నాకు కోపం వచ్చి నివసించడానికి అద్భుతమైన భవనాలను నిర్మించుకున్నాను. చిన్నతనంలో విద్య కోసం పడిన కష్టం మరువజాలక అనేక విద్యాలయాలను స్థాపించాను. చదువుకున్నప్పుడు నన్ను ఆదరించిన నాకు అన్నం పెట్టిన అమ్మల హస్తములకు ఏటేటా గృహలక్ష్మి స్వర్ణకంకణము అనే బంగారు తొడుగులు తొడుగుతున్నాను. ఇప్పుడు మరొక కార్యక్రమం చేపట్టదలుచుకున్నాను. నన్ను ఈ స్థితికి తెచ్చిన స్త్రీల ఆరోగ్యం కోసం తయారు చేయబడిన లోద్రం అనే ఔషధం వలన నాకు ఇంత సంపద సమకూరునది. ఈ ధనాన్ని స్త్రీల విద్యాభివృద్ధికి ఒక లక్షల రూపాయలు (ఇప్పట్లో వందల కోట్ల రూపాయలతో సమానం) స్కూలు కమిటీ తరపున ఇచ్చుచున్నాను. ఈ ధనము వెచ్చించి “కేసరి కన్య విద్యాలయం” అనే పేరుతో ఆడబిడ్డలకు ప్రత్యేకంగా విద్యాలయం నెలకొల్పండి అని కమిటీ వారిని కోరుతున్నాను” అని అన్నారు.
ఒంగోలులో బిచ్చమెత్తుకోవడంతో బాల్యం ప్రారంభించిన ఆ కుర్రాడు చెన్నపట్టణం చేరుకుని అనేక కష్టాలు పడి ఉన్నత స్థితికి చేరి చిట్టచివరికి స్కూలుకు లక్ష రూపాయలు దారం ఇచ్చే స్థితికి చేరుకున్నారు కె.ఎన్.కేసరి. ఆయన ప్రారంభించిన వ్యాపారాలు ఇప్పటికి కూడా నడుస్తున్నాయి. లోద్ర అనే ఆయుర్వేద ఔషధం, కేసరి విద్యాలయం లాంటి వాటిని ప్రారంభించిన కోట నరసింహం అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కె.ఎన్.కేసరి అంటే అందరికీ అర్థం అయిపోతుంది. 1875లో జన్మించిన కె.ఎన్.కేసరి తన 78 సంవత్సరాల వయస్సులో అనగా 1953లో మరణించారు. ఆయన బాల్యంలో చదువుకోడానికి పడిన కష్టాలు, తప్పని పరిస్థితిలో చదువు పూర్తిగా మానేసేయడం, వ్యాపారాలు ప్రారంభించడం, సంపాదనపరులు కావడం ఇదంతా కూడా వినడానికి ఒక సినిమా కథలా ఉంటుంది.










