HEALTH & LIFESTYLE

అపెండిక్స్‌ ఎందుకు వస్తుంది? 

అపెండిక్స్‌ ఇది తెలియని వారు ఉండరు. వయసుతో సంబంధం లేకుండా ఆహారంలో మార్పులు, జీవనశైలిలో మార్పులతో అపెండిక్స్‌ బారిన పడుతున్నారు. దీనినే 24 గంటల నొప్పిగా వాడుక భాష. ఇది ఎలా వస్తుంది, రాకుండా ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అపెండిక్స్ (ఉండుకము) అన్నది మూడున్నర అంగుళాల నుంచి నాలుగు అంగుళాల పొడవు ఉండే ఓ చిన్న ట్యూబులాంటిది. ఇది పెద్దపేగుకు అతుక్కుని ఉంటుంది. ఈ పెద్ద పేగు పని..విసర్జన పదార్థాలను బయటికి పంపడం. పెద్ద పేగులోని విసర్జక పదార్థం(మలం) అపెండిక్స్‌లోకి ప్రవేశించినప్పుడు అక్కడ బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్‌తో అది ఉబ్బి అపెండిసైటిస్ సమస్యకు దారితీస్తుంది.

లక్షణాలు

* అపెండిసైటిస్ ప్రారంభంలో ఆకలి తగ్గడం, వికారం, వాంతులు, ఆరోగ్యం బాగాలేదన్న భావన కనిపిస్తాయి.

* బొడ్డు సమీపంలో లేదా పొట్ట పైభాగంలో నొప్పి కొద్దిగా మొదలవుతుంది.

* అక్కడి నుంచి పొట్ట కింది భాగంలోకి పాకి, నొప్పి తీవ్రం అవుతుంది. జ్వరం 99 – 102 డిగ్రీల వరకు వస్తుంది.

* నొప్పి ఎక్కడని అడిగితే మొదట్లో బొడ్డు చుట్టూ ఉన్నట్టు చెబుతారు ఖచ్చితంగా ఫలానా చోట అన్న స్పష్టత ఉండదు.

* నొప్పి మొదలైన 24 గంటల వ్యవధిలో తారస్థాయికి చేరుతుంది.  

* అందుకే 24 గంటల కడుపునొప్పిగా దీన్ని చెబుతారు.

* రక్తపరీక్షలు చేస్తే తెల్ల రక్తకణాలు పెరుగుదల ఎక్కువుగా ఉంటాయి.

పై లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్‌ను సంప్రదించిన తర్వాత అపెండిసైటిస్ ఉందని గుర్తిస్తే.. సర్జరీ చేసి అపెండిక్స్‌ను తొలగిస్తారు. నొప్పి ప్రారంభంలో గుర్తిస్తే సర్జరీ అవసరం లేకుండా యాంటీబయోటిక్స్ ద్వారా సమస్యను నివారించవచ్చు. ఇది అసలు రాకుండా నివారణ మార్గాలేవీ లేవు. సరైన ఆహార జీవనశైలిని అలవర్చుకోవాలి. అధిక పీచు పదార్థాలను తినే వారిలో ఈ సమస్య తక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయి.

Show More
Back to top button