
రెండో అయోధ్యగా పేరు గాంచిన కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 5వ తేదీన అంకురార్పణ, 6న ధ్వజారోహణం, 10న గరుడసేవ జరుగగా.. 11న కల్యాణం జరగనుంది. నేడు సీతారాముల కల్యాణం జరగనుంది. ఈ కల్యాణంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఇందుకోసం సాయంత్రం 5 గంటలకు సీఎం ఒంటిమిట్టకు చేరుకోనున్నారు. స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పిస్తారు. అదేరోజు రాత్రి ఒంటిమిట్ట టీటీడీ అతిథి గృహంలోనే బస చేస్తారు. ఆ తరువాత 12న ఉదయం కడప నుంచి విజయవాడకు సీఎం బయలుదేరుతారు. ఈ నెల 15 వరకూ జరగనున్న బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంవారు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేశారు.
ఇటీవల ఒంటిమిట్ట ఆలయ జీర్ణోద్ధరణ పనులను పూర్తి చేశారు. భక్తుల కోసం ఆలయం లోపల చలువ పందిళ్లను వేశారు. ఈరోజున రాములోరి కల్యాణం జరగనుండగా, భక్తులు విశేషంగా వస్తారనే అంచనాతో తీర్థ ప్రసాదాలు సిద్ధం చేశారు.
ఒంటిమిట్ట ఏకశిలానగరం.. ఎంతో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. భారతదేశంలోని పెద్ద గోపురాల్లో ఈ రామాలయ గోపురం ఒకటి.
చంద్రుని వెలుగుల్లో స్వామి వారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత.
శ్రీరామచంద్రుడు సీతా, లక్ష్మణ సమేతంగా వెలసిన క్షేత్రమే.. కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీకోదండ రామాలయం… ఆంజనేయుని రాకకు ముందే ఈ క్షేత్రంలో స్వామివారు విహరించినట్టు తెలుస్తోంది.
త్రేతాయుగంలో సాక్షాత్తు ఆ పురుషోత్తముడే ఇక్కడ నడిచినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.
16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని ఒంటెడు, మిట్టడు అనే సోదరులు నిర్మించినట్టు తెలుస్తోంది. వారిపేరుతోనే ఒంటిమిట్టగా ఈ ప్రాంతం తర్వాతి రోజుల్లో విశేష ఖ్యాతి పొందింది. వీరి విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో మనం చూడవచ్చు. విజయనగర వాస్తుశైలిలో అద్భుతమైన నిర్మాణంతో.. పైన మూడు గోపురాలతో సుందరంగా ఉంటుంది. ఆలయం లోపలి స్తంభాలు, గోడలపై సజీవమైన చిత్రకళను సైతం చూడొచ్చు.
ఆలయాన్ని అన్నమయ్య సందర్శించి, అనేక సంకీర్తనలు రచించారు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన ఆ గ్రంథాన్ని ఇక్కడే స్వామివారికి అంకితమిచ్చారు. అష్టదిగ్గజ కవుల్లో ఒకరైన రామభద్రకవి ఈ ప్రాంతానికి చెందినవాడేనని కూడా తెలుస్తోంది. ఆంధ్ర వాల్మీకిగా ఖ్యాతిచెందిన వావిలికొలను సుబ్బారావు ఒంటిమిట్ట నివాసి కావడం మరో విశేషం! ఇక్కడ వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడట. దాని ప్రకారమే రాత్రిళ్లు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు.
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వచ్చే నెల అంటే మే నెల 11న రాత్రి నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవానికి 150 కిలోల ముత్యాలను సిద్ధం చేస్తున్నారు. జానకీరాముల పరిణయ వేడుకలను తిలకించడానికి తరలి రానున్న భక్తులకు స్వామి వారి తలంబ్రాలను ఉచితంగా పంపిణీ చేయడానికి 1.50 లక్షల ప్యాకెట్లను సిద్ధం చేయనున్నారు. తలంబ్రాల తయారీకి బియ్యం 30 క్వింటాళ్లు, నెయ్యి 40 కిలోలు, కుంకుమ 20 బస్తాలు, పసుపు 20 మూటలు (బస్తా 25 కిలోలు), కంకణాలు 1.50 లక్షలు అవసరం పడతాయని అంచనా వేశారు. తలంబ్రాల ప్యాకెట్లతో పాటు తిరుమల శ్రీవారి చిన్న లడ్డూలు (25 గ్రాములు) రెండు ప్రత్యేక సంచిలో పెట్టి కల్యాణ వేదిక ప్రాంగణంలోకి ప్రవేశించే సమయంలోనే ముందస్తుగా సందర్శకులకు అందజేసేలా చూస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక పంపిణీ కేంద్రాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు.