చెరగని చరిత్రకి ఆనవాలిదే..
- గతమంతా గగుర్పొడిచే నిజాలే..
- ఆధ్యాత్మికానికి అసలైన చిరునామం….ఆ శివాలయం
- స్వప్నం సాకారం చేసి.. శివాలయాలన్ని నిర్మించి..
భగవంతుని మీద భక్తితో భక్తులు భారీ కానుకలను సమర్పించడం చూసాము. బంగారం, వజ్రవైఢూర్యాలను కూడా సమర్పించడం చూసాము. కానీ ఒక వ్యక్తి కి స్వయంగా భగవంతుడే కలలో కనిపించి తనకు ఆలయాన్ని నిర్మించమని అడగడం వింటుంటే అతిశయోక్తిగా అనిపిస్తుంది కదూ. కానీ.. ఇది నిజంగా జరిగిన ఓ యదార్ధ సంఘటన. యుక్త వయసు నుండి ఆ వ్యక్తి తుది శ్వాస వరకు తన జీవితాన్ని భగవంతునికే అర్పించాడు.
కలలు కనడం మానవ సహజం…. అలాంటి కొన్ని తీపి కలలను సాకారం చేసుకోవడం మహనీయుల లక్షణం. కానీ ఇక్కడ కలలో కనిపించిన దేవుడి కోరిక కోసం.. కట్టుకున్న భార్య, పిల్లలను వదిలి కట్టు బట్టలతో కదిలి వచ్చిన ఆ వ్యక్తి కథ అందరూ తెలుసుకోవాల్సిందే..స్వప్నంలో సాక్షాత్కరించిన మహాశివుని కోరిక తీర్చేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఈ కలియుగ భక్త కన్నప్ప ఆయన. ఆయన గాధ ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
ఆధ్యాత్మికానికి అసలైన చిరునామా ఆ శివాలయం…
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం దుమ్ముగూడెం మండలంలోని చినబండిరేవు గ్రామంలో కొండపై కొలువుదీరిన మహాశివుని ఆలయం దిన దినాభివృద్ది చెందుతుంది. శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేం ద్రస్వామి ఆలయంగా పేరొందిన ఈ శివాలయానికి భక్తుల తాకిడి భారీగా పెరుగుతోంది. కోరిన కోర్కెలు తీర్చే వీరభద్రుడు ఇక్కడ కొలువుతీరగా ఆలయ ప్రాంతమంతా కొండపై నిర్మానుష వాతావరణంలో ఆధ్యాత్మికతను సంతరించుకుంటుంది. కోరిన కోరికలు వెంటనే తీర్చగలిగే మహోన్నత శివాలయంగా ఆ ఆలయం భక్తులకు ప్రగాఢ విశ్వాసంగా పేరొందింది. ప్రతీ ఆలయ నిర్మాణానికి చరిత్ర ఉంటుంది. అలాంటిది ఇక్కడ శివాలయం నిర్మాణం జరిగిన తీరు పరిశీలిస్తే ఒళ్లు గగుర్పొడిచే నిజాలు బహిర్గతమవుతాయి.
స్వప్నం సాకారం చేసిందెవరు..? అసలు ఏమిటా చరిత్ర..?
చినబండిరేవులో ఉన్న శివాలయం నిర్మాణానికి దాతలు ఎందరో ఉన్నప్పటికీ ఆలయ నిర్మాణానికి ప్రథమంగా పూనుకున్నది ఓ వ్యక్తి స్వప్నం. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం వెదుళ్లచెరువు గ్రామానికి చెందిన నాగంట్ల వీరయ్య స్వతహాగా బ్రహ్మంగారి మఠంలో ఆరవతరం మనువడు బాల సిద్దయ్య శిష్యుడు. శివ భక్తుడిగా పేరొందిన ఈయన 1990లో దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల బాబా మఠానికి బస చేసేందుకు వచ్చారు. అక్కడ స్వప్నంలో సాక్షాత్కరించిన మహాశివుడు కొన్ని గురుతులతో ఉన్న కొండను చూపించి అక్కడ ఆలయాన్ని నిర్మించాలని ఆజ్ఞాపించాడు. శివుని ఆన ఆలపించిన వీరయ్య ఆ క్షణం నుంచి పరిసర ప్రాంతాల్లోని ప్రతి కొండను ఎక్కి రాత్రి నిద్రిస్తూ మహా శివుడు చూపించిన గుర్తులను స్వప్నం ద్వారా పరిశీలించారు. అలా వెతుకుతూ వెతుకుతూ ఉండగా చినబండిరేవులోని ఓ గుట్ట ఎక్కి నిద్రించిన క్రమంలో మహా శివుడు సాక్షాత్కారంతో దేవుడి స్థానాన్ని కనుగొన్నాడు.
ప్రాణాన్నే పణంగా పెట్టి…
అది కీకారణ్యంతో కూడుకున్న ఓ కొండ. ఆ కొండపై ఓ
రాత్రి నిద్రించగా మహాశివుడు స్వప్నంలో తన స్థానాన్ని వీరయ్యకు చూపించాడు. ఆ క్షణం నుంచి అక్కడ బస చేసేందుకు సిద్ధమైన వీరయ్య పడిన కష్టం! అంతాఇంతా కాదు. విష సర్పాలు, క్రూర మృగాలు సంచరిస్తూ మానవ జాడలేని ఆ కొండపై చిన్నపాటి పందిరి వేసుకున్న వీరయ్య సంకల్పాన్ని పరిశీలించేందుకు సాక్షాత్తు పరమ శివుడే అష్టకష్టాలు పెట్టాడు. దుప్పటి కూడా లేని వీర య్య కట్టుబట్టలతో రాళ్ళగుట్టపై నిద్రిస్తుండగా ఓ రోజు భారీ స్థాయిలో గాలి దుమారం వచ్చి వేసిన పందిరి క్షణాల్లో ఎగిరిపోయింది. చెట్టుకొమ్మలు విరిగి చుట్టు ప్రక్కల పడుతున్నాయి. విష సర్పాలు సమీపంలోనే సంచరిస్తున్నాయి. అయినప్పటికీ శివ నామస్మరణతో ఓ పెద్ద వృక్షాన్ని పట్టుకుని దీక్షలో మునిగిపోయిన వీరయ్య సంకల్పం చూసి శివుడికే ఆశ్చర్యం కలిగినంత పనైంది.
గ్రామస్తులు వద్దని వారించినా…
దూర ప్రాంతం నుంచి వచ్చి శివాలయం నిర్మాణం కోసం కొండపై తను పడుతున్నకష్టాన్ని చూసిన కొందరు గ్రామస్తులు, రైతులు ఓరోజు రాత్రి లాంతర్లతో గుట్టపైకి ఎక్కి వీరయ్యను ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని కోరారు. శివాలయ నిర్మాణం కోసం దూర ప్రాంతం నుండి వచ్చిన నాగంట్ల వీరయ్యను కొండపై చూసిన ప్రజలు తాను ఒక క్షుద్ర పూజలు చేసే వ్యక్తిగా అపోహ చెంది తనని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. శివుని ఆజ్ఞతో తాను ఇక్కడకు వచ్చానని శివాలయం నిర్మించినది ఈ ప్రాంతం నుంచి వెళ్ళనని పట్టుబట్టి వీరయ్య ఎవరి మాటలను ఖాతరు చేయకుండా అష్ట కష్టాలు ఆ కొండపైన పడ్డాడు. గ్రామస్తుల నుంచి ప్రతికూల పరిస్థితులు తలెత్తినప్పటికీ ఆయన మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతుండగా గ్రామంలో ఓ పెద్దమనిషి ఆ గుట్ట పైకి చేరుకొని గ్రామస్తులకు సర్ది చెప్పాడు. అతని పనిని అతను చేసుకొనివ్వండని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశాడు. శివుని ఆజ్ఞతో తాను ఇక్కడకు వచ్చానని ఆలయం నిర్మించిగానీ ఈ ప్రాంతం నుంచి వెళ్ళనని చెప్పుకొచ్చిన వీరయ్య మాటలు విన్న గ్రామస్తులు అప్పటి నుంచి ఆయనకు సహకరిస్తూ వచ్చారు.
దర్శనమిచ్చిన భారీ సర్పం…
నాగంట్ల వీరయ్య వద్దకు ఓ భారీ సర్పం వచ్చి మాయమైన సంఘటన ఆ ప్రాంత విశిష్టతనే మార్చేసింది.
ఓ రోజు భారీ సర్పం వీరయ్య నిద్రిస్తుండగా ఆయనపై నుంచి పాకుతూ వెళ్లింది. ఆ సర్పం ఆ పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతూ వీరయ్యకు అభయాన్నిచ్చింది. ప్రతిక్షణం ఆ సర్పమే వీరయ్య కు సమీపంలో ఉండడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. అదంతా గమనించిన గ్రామస్తులు ఏదో దైవ శక్తి ఈ ప్రాంతంలో ఉందని విశ్వాసంతో అప్పటి నుంచి వీరయ్యకు సహాయంగా నిలిచారు. నాటినుండి గ్రామస్తుల సహకారంతో నాగంట్ల వీరయ్య ఆలయ నిర్మాణం కోసం తీవ్రస్థాయిలో శ్రమించి కొండను పిండి చేసి ఆలయ నిర్మాణానికి కృషి చేశారు. దూర ప్రాంతాల్లో విరాళాలు వసూళ్లు చేసి ప్రధాన ఆలయంతో పాటు శ్రీ గోవింద మాంబా సమేత మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి,
పర్వత వర్దిని సమేత రామ లింగేశ్వర స్వామి వార్లు, సిద్దయ్య,
వినాయకుడు, సుబ్రమణ్య స్వామి, నందీశ్వరుడు, ఆంజనేయ స్వామి,
నవగ్రహాలను ప్రతిష్టాపన చేయడంతో పాటు రెండు ఎకరాల భూమిని కూడా వీరయ్య కొనగలిగాడు. అంతేకాక అదే గుట్టపై తిరుపతమ్మ తల్లి ఆలయాన్ని కూడా నిర్మించగలిగాడు.
సమాదే సాక్ష్యం..
ఇదిలా ఉంటే వీరయ్య తన సమాధిని ముందుగానే నిర్మించుకున్నాడు. శివైక్యం అయిపోవాలనుకున్న వీరయ్య ముందుగానే ప్రణాళికతో తన భార్య సమాధిని శివాలయానికి దగ్గరలోనే ఏర్పాటు చేసుకొని తాను కూడా ఆ సమాధి పక్కనే తన సమాధిని నిర్మించుకున్నారు. ఆ సమాధులే ప్రస్తుతం సాక్షాలుగా నిలిచాయి.
తన యుక్త వయసు అంతా దేవుని సేవకే అంకితం చేసిన 80 ఏళ్ల ఆ పరమ భక్తుడు 2022 జనవరి 19వ తేదీన తన తుది శ్వాస విడిచి శివునిలో ఐక్యమయ్యారు. తాను మరణిస్తూ
వీరయ్య ఈ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయశాఖకు అప్పగించి ఆ బాధ్యతను చేపట్టేలా చూడాలని కోరుకున్నారు. ఆయన మరణించినప్పటికీ ఆ పరమేశ్వరునికి ఏ లోటు లేకుండా ఆయన శిష్యులు ఆ ఆలయ బాధ్యతను తీసుకొని స్వామివారి పూజలను నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వం గుర్తిస్తే మరింత ప్రాచుర్యంలోకి..
ఈ కలియుగంలో వీరయ్య లాంటి పరమ భక్తుల గురించి ఎందరికో తెలియాల్సిన అవసరం ఉంది. ఆ దేవాలయాన్ని దేవదాయ శాఖ గుర్తించి అభివృద్ధి చేస్తే మరింత ప్రాచుర్యంలోకి వస్తుంది. ఆలయం గురించి తెలిసిన పరిసర గ్రామాల ప్రజలు ఇప్పటికీ అధిక సంఖ్యలోనే దర్శించుకుంటున్నారు. భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్లే మార్గం మధ్యలో చిన్న బండి రేపు గ్రామం వద్ద ఈ శివాలయాన్ని దర్శించుకోవచ్చు.