Telugu Politics

మార్పులు, చేర్పులు వల్ల వైసీపీకి లాభం ఉందా.?

ఎన్నికల పోటీల్లో ఒక ప్రణాళికగా గెలుపు గుర్రాలను సిద్ధం చేసుకోవడం ప్రతి పార్టీకి ప్రాణవాయువే అని చెప్పవచ్చు. దీనిలో భాగంగానే అభ్యర్థుల స్థానాల్లో మార్పులు, చేర్పులు, పార్టీల ఇన్చార్జీలు సహజంగా జరిగేవే! భవిష్యత్లోనూ ఇవి కొనసాగుతాయి. అయితే రాష్ట్రంలో అభ్యర్థుల మార్పు చేర్పులపై టీడీపీ చేస్తున్న ఈ రాద్ధాంతం దేనికి? ఇలా టీడీపీ గతంలో చేసిందా..? అసలు ఇలా సడెన్‌గా మార్పులు చేయడం వల్ల గెలుపు అవకాశాలు చేరుతాయా అనే విషయాలపై ఒక లుక్ వేద్దాం.

వాస్తవానికి ఇలా మార్చడం, మార్పులు జరగడం ఈనాటిది కాదు. ఆరంభం నుంచి ఉంది. దీనిని అనువైన సమయంలో సాగిస్తూ.. అనుకూల ఫలితాలు సాధించిన అనుభవం కూడా ఉంది. 2014తో పోలిస్తే 2019లో జగన్ తన అభ్యర్థుల జాబితాలో ఒకేసారి 60 మంది కొత్త వారిని తీసుకొచ్చి విజయం సాధించారు. 

కాబట్టి ఈసారి కూడా అదే ఆనవాయితీని సాగిస్తున్నారు. తొలి రెండు జాబితాల్లో 38 మంది ఇన్చార్జీలు ఖరారయితే అందులో పాత వారి స్తానభ్రంశం తీసేస్తే మూడోవంతు కొత్త ముఖాలే. దీంతో సీఎం జగన్ తన సక్సెస్ మంత్రం మరోసారి పాటిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే, గత ఎన్నికల్లో తెలుగుదేశం కూడా ఏకంగా మంత్రులుగా ఉన్న వారిని సైతం జిల్లాలకు మార్చేసిన ఘట్టం ఉంది. కొవ్వూరు నుంచి ప్రాతినిధ్యం వహించిన మంత్రి కేఎస్ జవహర్‌ని కృష్ణా జిల్లా తిరువూరికి మార్చి, కొవ్వూరులో విశాఖ జిల్లా నుంచి తెచ్చిన వంగలపూడి అనితను బరిలో అధినేత చంద్రబాబు దింపారు. 

అంతేకాదు ఆ పార్టీకే చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ చరిత్ర యావత్తు వరుసగా స్థాన చలనాలే కదా. అలాంటివారు ఇంకా అనేక మంది ఉన్నారు. అయితే, సీఎం జగన్ ఈసారి కూడా ఇలా ఇన్చార్జీల్లో మార్పులు తీసుకురావడం టీడీపీ తీవ్రంగా ఎద్దేవా చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే వైసీపీ శ్రేణులు టీడీపీని గతంలో మార్పులు చేసిన చరిత్ర చంద్రబాబుకు ఉందంటూ.. కౌంటర్ ఇస్తున్నారు.  

ఏది ఏమైనప్పటికీ.. రాజకీయ పార్టీలు ప్రతి ఎన్నికనూ ప్రతిష్టాత్మకం గానే తీసుకుంటాయి. అలా చేసినప్పుడే సక్సెస్ కొట్టగలుగుతాయి. అందుకు అనుగుణంగా వ్యూహం రూపొందించుకోవడం, ప్రచారం సాగించడమే కాకుండా తగిన అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం గెలుపుకు అత్యంత కీలకం అవుతుంది.

Show More
Back to top button