HISTORY CULTURE AND LITERATURETelugu Special Stories

ఫిబ్రవరి 26 మహాశివరాత్రి సందర్భంగా

దక్షిణ కాశీ శ్రీముఖలింగం ” ‘ కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖర దర్శనం, శ్రీముఖలింగంలో ముఖదర్శనం ‘ చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతారు. దక్షిణ కాశీగా పిలువబడే శ్రీముఖలింగం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. విశాఖపట్నానికి సుమారు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో జీవనది వంశధార ఒడ్డున ఉంది. శ్రీముఖలింగంలో మహా శివరాత్రికి గొప్ప ఉత్సవం జరుగుతుంది. మహాశివరాత్రి మూడు రోజుల జాతర మహాశివరాత్రి మొదలుకుని నాలుగో రోజు చక్రతీర్ధ స్నానముతో ముగుస్తుంది. కలియుగంలో స్వామి దర్శన భాగ్యం వలన కూడా మోక్షము ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. ఆలయానికి పక్కనే ఆంజనేయస్వామి ఆలయం ఉంది. భక్తులు శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకున్న తర్వాత ఆంజనేయస్వామిని దర్శించుకోవడం ఇక్కడి ఆనవాయితీ.

చెట్టు మొదలే లింగం:

శ్రీ ముఖలింగేశ్వరస్వామి దేవాలయము గల ఈ ఊరు ‘పంచపీఠ’ స్థలముగా ప్రసిద్ధం. దీనినే ముఖలింగ క్షేత్రమని పిలుస్తారు. ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు. ఇప్పచెట్టు మొదలను నరికి వేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ చెట్టు మొదలుపై ‘ ముఖం ‘ కనిపిస్తుంది అని, ఆ చెట్టు మొదలే క్రమంగా లింగంగా మారిందని చెబుతారు. ఇప్పచెట్టును సంస్కృతంలో ‘మధుకం’ అంటారని అందువల్ల ఈ గుడికి మధుకేశ్వర స్వామి ఆలయంగా పేరొచ్చిందని అని కూడా అంటారు. ఇక్కడ శివలింగం ముఖముతో పుట్టడం వలన ముఖలింగేశ్వరుడు అని, మధు వృక్షములో పుట్టుట వలన మధుకేశ్వరుడు అని, ఇలా నాలుగు యుగములలో నాలుగు నామములతో స్వామి కొలవబడుచున్నారు.

కృత యుగములో గోవింద ఈశ్వర స్వామిగా, త్రేతా యుగములో మధుకేశ్వర స్వామిగా, ద్వాపర యుగములో జయంతీశ్వర స్వామిగా, కలియుగములో శ్రీ ముఖలింగేశ్వర స్వామిగా పిలువబడుచున్నారు. ఈ క్షేత్రానికి శ్రీ మహావిష్ణువు పద్మనాభ గిరిపై క్షేత్రపాలకులుగా ఉన్నారు. శ్రీముఖలింగేశ్వరంలో మూడు చోట్ల ముక్కోణపు ఆకారంలో మూడు ఆలయాలు ఉన్నాయి. వాటిలో ప్రధాన ఆలయం మధుకేశ్వర ఆలయం. దీనికి అభిముఖంగా కొంత దూరంలో భీమేశ్వర ఆలయం ఉంది. ఈ రెండు ఆలయాలకు కాస్త దూరంగా ఊరి ప్రథమార్ధంలో అధునాతన వాస్తు పద్ధతిలో అద్భుత సోయగాలు కురిపిస్తూ సోమేశ్వర ఆలయం భక్తులకు ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుంది. 

అద్భుత శిల్ప కళా సంపద:

ఈ మూడు ఆలయాల్లోనూ శిల్ప కళా సంపద చూపరులకు కనువిందు చేస్తుంది. ఈ ఆలయం కళింగ శిల్పకళా వైభవానికి దర్పణం పడుతుంది. ఆలయ ప్రాంగణంలో శిల్ప సంపద ఏక రాతిపై కనిపించి చూపరులను ఆకట్టుకుంటాయి. అరుణాచలంలో నిర్మాణమై ఉన్న శిల్ప సంపదను తలపించే విధంగా ఆలయంలో పార్వతీ పరమేశ్వరుని శిల్పాలు కనిపిస్తాయి. ఈ సన్నివేశం అక్కడ అరుణాచలంలోను, శ్రీముఖ లింగంలోను తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా కనిపించవు. శివపార్వతులు ఎరుపు రంగు రాతిపై ఉత్తర ముఖంగా ఉండడం విశేషం. గర్భగుడిలో ఒక చోట కూర్చుని చూస్తే గణపతి, సూర్యనారాయణ, అమ్మవారు, విష్ణుమూర్తి, శివుడు కనిపిస్తారు. అందుకే దీనిని పంచాయత క్షేత్రమని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ ఆలయంలో గర్బాలయంకాక ఎనిమిది వైపులా ఎనిమిది లింగాలున్నాయి.

ఇక్కడి అమ్మవారు వారాహి దేవి, సప్త మాతృకలలో ఆమె ఒకరు . మిగిలినవారు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. వీరు పార్వతీదేవి అవతారాలు. ఇక్కడి శిల్పాలలో వరాహావతారం, వామనావతారం, సూర్య విగ్రహం ఉండటం విశేషం. భీమేశ్వరాలయం శిథిలావస్థలో ఉంది. ఇక్కడ కుమారస్వామి, దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మ, గణపతి విగ్రహాలున్నాయి. సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది. ముఖమండపం లేదు. ఎత్తయిన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు. ఇక్కడ ఏడు నాలికల అగ్ని విగ్రహం, వినాయకుడు, కాశీ అన్నపూర్ణ, నటరాజు, కుమారస్వామి, హరిహరదేవుల విగ్రహాలు ఎంతో అందంగా ఉన్నాయి. కొన్ని శృంగార శిల్పాల్ని కూడా ఇక్కడ చెక్కారు.

స్థల పురాణం:

ద్వాపర యుగంలో వాసుదేవ మహరుషి వైష్ణవయాగం చేయ సంకల్పించి సర్వదేవతలకు పిలుపునివ్వగా గంధర్వులనే దేవతలు మార్గమధ్య స్థలంలో నగ్నదేహులైన శబరి కన్యలను చూసి కామందులై యజ్ఞంను విస్మరించారు. అందుకు వాసుదేవ మహాఋషి గంధర్వులపై కోపగించి ‘ మీరు భూమియందు శబరులై పుడుదురుగాక ! ‘ అని శపించారు. శాప విమోచనం కోరి గంధర్వులు వాసుదేవుని ప్రార్థించారు. అప్పుడు వాసుదేవుడు ‘కలియుగంలో పరమేశ్వరుడు వంశధార నదీప్రాంతమున మధు వృక్షం (విప్పచెట్టు)అందు ముఖం దాల్చి ఆవిర్భవించునని, ఆ స్వామి దర్శన భాగ్యం వలన మీకు శాప విముక్తి కలుగునని ‘ శాపాంతమును తెలియజేశారు. గంధర్వులు శబరులై గోవిందారణ్యమున జన్మించారు. వీరికి రాజుగా ఉన్న చిత్కసేనుడుకు మొదటి భార్యగా చిత్తి (శబరి), రెండవ భార్యగా చిత్కల (జంగమ)లు ఉండేవారు. వీరిలో చిత్కల గొప్ప శివ భక్తురాలు.

వీళ్ళకు జీవనాధారంగా ఒక విప్ప చెట్టు ఉండేది. విప్ప చెట్టుకు రెండు కొమ్మలు ఉండేవి. ఆ రెండు కొమ్ములను చిత్కసేనుడు తన ఇద్దరు భార్యలకు చెరొక కొమ్మును పంచిపెట్టాడు. పెద్ద భార్యకు ఇచ్చిన కొమ్మకు ఇప్ప పుష్పములు, రెండవ భార్యకు ఇచ్చిన కొమ్మకు తన భక్తి ప్రభావంచే బంగారు పుష్పాలు రాలుతూ ఉండేవి. ఈ పుష్పాలకు ఇద్దరు భార్యలు నిత్యం కలహాలు పడేవారు. ఇది చూసిన రాజుకు కోపం కలిగి ఆ విప్పచెట్టు రెండు రకాలైన పుష్పాలు పూయడం వలన నిత్యము కలహాలు జరుగుచున్నవని విప్ప చెట్టును నరికివేశాడు. అప్పటికి ద్వాపర యుగం అంతం కలియుగం ప్రారంభంలో ఉన్నది. కలియుగంలో వృక్ష మొదలి భాగము ముఖముతో లింగ రూపముగా దాల్చి దర్శనము ఇచ్చెను.

తర్వాత సదరు ముఖ దర్శనము వలన శబరులకు శాప విముక్తి కలిగి గంధర్వులుగా రూపాలు వచ్చాయి. అనంతరం గంధర్వులు తమలోకమునకు వెళ్లి అక్కడ గల కోటి మంది దేవతలకు వంశధార నది తీరమున గోవింద అరణ్యములో ఉన్న మధు వృక్షము మొదలు భాగము నందు శంకరుడు ముఖముతో పుట్టెనని కోటి మంది దేవతలకు చెప్పగా ఆ దేవతలు భూలోకమునకు వచ్చి స్వామి వారి ముఖ దర్శనము చేసి పంచ క్రోష మద్యస్థమునందు ఒకటి తక్కువ కోటి లింగాలను స్థాపించారు. అందుచే ఈ క్షేత్రమును దక్షిణ కాశీగా కూడా పిలువబడుచున్నది. అనంతరం అశ్వనీ దేవతలు వచ్చి స్వామి ముఖ దర్శనం చేసి అష్ట తీర్థ రాజా మహాయోగం నిర్మించారు. 

క్రీ.పూ 8వ శతాబ్దం నాటిది:

ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానికి ఉన్నత దశననుభవించిందని తెలుస్తుంది. ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయని కూడా తేలింది. ఇక్కడ దొరికిన ఏశాసనంలోనూ ఈ పూరిపేరు శ్రీ ముఖలింగం అని పేర్కొనలేదు. నగరం, కళింగ నగరం, కళింగదేశ నగరం, కళింగ వాని నగరం, నగరపువాడ, త్రికళింగ నగరం మొదలైన పేర్లతో ఉంది. ఇక్కడ త్రవ్వకాలలో వీణాపాణి అయిన సరస్వతి విగ్రహం, జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి. ఇక్కడ అనేక శాసనాలు కూడా దొరికాయి. ఈ ఆలయ నిర్మాణం క్రీ.పూ 8వ శతాబ్దములో చోడ గంగ దేవర త్రికలింగాధిపతి అనంత వర్మచే నిర్మాణం జరిగినది. కాలక్రమంలో పర్లాకిమిడి మహారాజా వారు ఆలయ పునరుద్ధరణ చేస్తూ స్వామివారికి కొంత భూమిని ఇచ్చి ధర్మకర్తలుగా ఉన్నారు.

Show More
Back to top button