
దేశవ్యాప్తంగా ఉన్న అతి పవిత్ర, పురాతన దేవాలయాల్లో మధుర మీనాక్షి ఆలయం ఒకటి. ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని రెండో అతి పెద్ద నగరమైన మదురైలో వెలసి ఉంది. సుమారు 2500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయం పాండ్య రాజుల కాలం నుంచే పూజలందుకుంటుందని చాలామందికి తెలియని విషయం.
తమిళనాడు రాష్ట్రం ఆలయాలకు, సాంస్కృతిక వైభవానికి పెట్టింది పేరు. అలాంటి తమిళనాడులో మదురైనందు వెలసిన పుణ్యక్షేత్రం మధుర మీనాక్షి అమ్మవారి కోవెల.
మదురై పాలకుడు మలయధ్వజ పాండ్య చేసిన తపస్సుకు మెచ్చి పార్వతీదేవి ఆయన కుటుంబంలో వారసురాలిగా జన్మించారు. అయితే ఆ శిశువు మూడు రొమ్ములతో జన్మించింది. దీంతో పాండ్య రాజు ఆందోళనకు గురి అవుతాడు. ఆ బాలికకు కాబోయే జీవిత భాగస్వామి కనిపించిన వెంటనే ఆ బాలిక శరీరంలో మార్పులు జరుగుతాయని ఆకాశవాణి చెప్పడంతో ఆ రాజు ఆనందం వ్యక్తం చేస్తాడు. ఆ చిన్నారికి అన్నిరకాల విద్యలు నేర్పిస్తాడు. యుద్ధ విద్యలో పరిణతి చెందిన ఆమె ఓసారి కైలాసాన్ని స్వాధీనం చేసుకోవాలని బయలుదేరుతుంది.
అక్కడ యోగ నిద్రలో ఉన్న పరమశివుడిని చూసి ఆమె ముగ్ధురాలవుతుంది. పరవశించి పోతుంది. ఆకాశవాణి చెప్పినట్టుగానే ఆ సమయంలో ఆమె శరీరంలో మార్పులు వస్తాయి. అప్పుడు యోగనిద్ర నుంచి మేలుకున్న శివుడు తన కొరకే జన్మించిన కన్యగా భావించి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమే మీనాక్షి అమ్మవారు. ఆమెను వివాహం చేసుకున్న శివుడు మధురై క్షేత్రంలో సుందరేశ్వరునిగా కొలువుదీరాడని పురాణ గాథ.
త్రినేత్రుడైన పరమశివుడు మధువును వర్షింపచేసిన ప్రాంతం కనుక ఈ ప్రాంతానికి మధురై అనే పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతుంది. మధువు అంటే అమృతం. మధుర మీనాక్షీ ఆలయం ఎత్తయిన రాజగోపురాలు కలిగిన ఆలయంగా ప్రపంచ ప్రఖ్యాతి పొందింది.
వైగై నదీ తీరంలోని మధురై క్షేత్రమే నటరాజ శివుని నాట్యపీఠం అని పురాణాలు వర్ణిస్తున్నాయి. సాధారణంగా ఏ ఆలయానికి వెళ్లినా ముందుగా స్వామివారిని దర్శించుకుని, తర్వాత అమ్మ వారిని దర్శించుకోవడం సాంప్రదాయం. అయితే మధురై క్షేత్రంలో మాత్రం ముందుగా శ్రీ మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే సుందరేశ్వరస్వామిని దర్శించుకోవాలన్నది ఆచారం. ఈ ఆలయంలో ఉన్న కొనేరును ‘స్వర్ణకమల తటాకం’ అని అంటారు.
పూర్వం దేవేంద్రుడు స్వర్ణకమలాలతో శివుడిని ఇక్కడే పూజించి తన పాపాన్నీ పోగొట్టుకున్నట్లు అక్కడి ఆలయ అర్చకులు చెబుతారు. అందుకే దీనికి స్వర్ణ కమల తటాకం అనే పేరు వచ్చిందట. భారతీయ సంస్కృతికి, సుందరమైన శిల్పకళకు నెలవైన ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నంతనే ఎన్నో శుభాలు జరుగుతాయని ఎంతోమంది విశ్వసిస్తున్నారు.
ఈ ఆలయానికి నాలుగు ముఖ ద్వారాలు ఉన్నాయి. ధర్మ, అర్ధ, కామ, మోక్ష ద్వారాలుగా వీటిని పిలుస్తారని పురాణ గాథలు చెప్పబడింది. ఎత్తైన ఈ ఆలయ గోపుర శిఖరాలు నగరానికి గుర్తింపుగా నిలిచాయి. హిందువులు పవిత్రంగా పూజించే ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు నిత్యం మీనాక్షి అమ్మవారిని దర్శించుకుని వెళుతుంటారు.
ఈ ఆలయంలో పార్వతీ దేవి కొలువై ఉన్న ప్రాంతానికి పురుషులకు మాత్రం ప్రవేశం లేదు. కాంస్యం, నల్లరాతితో సర్వాంగ సుందరంగా మలచిన ఆర్ట్ గ్యాలరీ వీక్షకులకు కనువిందు చేస్తుంది. కులశేఖర పాండ్యుని కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం తిరుమలై నాయక్ హయాంలో ఆధునికీకరణకు నోచుకుంది.
ఇక మీనాక్షి అమ్మవారు మదురైలో వెలిసిన వైనాన్ని చూస్తే…. తను ఇచ్చిన మాటకోసం భూలోకం చేరిన పార్వతి మదురై రాజుకు కుమార్తెగా జన్మించి మీనాక్షి నామధేయంతో పెరిగి పెద్దదైంది.
పరమశివుడు సుందరేశ్వరునిగా భూలోకంలో జన్మించి మదురై వచ్చి మీనాక్షీ అమ్మవారిని వివాహమాడాడడని.. అనంతరం వీరు మదురై రాజ్యాన్ని చాలా ఏళ్ల పాటు నిరాటంకంగా పరిపాలించారని భక్తులు విశ్వసిస్తారు. ఆ తర్వాత ఇరువురు ఈ ఆలయంలోనే కొలువై ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి.
శుక్రవారం రోజుల్లో ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుంది. ఎందుకంటే ఆలయంలో ఊంజల మండపం వద్ద ఇరువైపులా ఉన్న దేవతలు ప్రతి శుక్రవారం రోజు స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా పూజించేవారన్న కథ ప్రాచుర్యంలో ఉంది.
మదురై మీనాక్షి అమ్మవారికి ఆకుపచ్చ రంగు అంటే ఎంతో ప్రీతిపాత్రం. ఆకుపచ్చ శరీర రంగుతో చిత్రీకరించబడింది. ఎందుకంటే ఆమె మూల ప్రకృతి, ఆదిమ స్వభావాన్ని సూచిస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తులు ఆకుపచ్చ రంగు చీరలను, ఆకుపచ్చ రంగు గల గాజులను అమ్మవారికి మొక్కల రూపంలో చెల్లిస్తారు.
మీనాక్షి” అనే పేరుకు “చేపల కళ్ళు” అని అర్ధం, అనగా చేప ఆకారంలో ఉన్న కళ్ళు. అని అర్థం.
మీనాక్షి అమ్మవారు ఒక చేతిలో చిలుకతో దర్శనమిస్తారు. చిలుకతో ఉన్న ఆమె రూపం మార్గదర్శిగా ఆమె పాత్రను నొక్కి చెబుతుంది. పచ్చని చిలుక తన భక్తులకు మార్గదర్శిగా దేవత యొక్క స్వంత మార్గాన్ని ప్రతిబింబిస్తూ, ఆధ్యాత్మిక జ్ఞానోదయం వైపు ఆత్మ యొక్క ప్రయాణాన్ని కూడా సూచిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.
ఆలయంలో తొమ్మిది అంతస్తుల గోపురాలు, ఒక ఏడు అంతస్తుల గోపురం ఐదు అంతస్తుల గోపురాలు 2, మూడు అంతస్తులు రెండు, బంగారు పూతపూసిన గర్భగుడి గోపురాలు ఉన్నాయి. వీటిలో ఐదు సుందరేశ్వర క్షేత్రానికి కాగా.. మూడు మీనాక్షి మందిరానికి ముఖద్వారాలు.
కామాక్షి కొలువై ఉన్న ప్రదేశాన్ని “నాబిస్థాన ఒట్టియాన పీఠం” అని అంటారు. ఈ ఆలయం శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. విష్ణువు యొక్క సుదర్శన చక్రం సమయంలో సతీదేవి యొక్క నాభి పడిపోయిన ప్రదేశం అని పండితులు చెబుతారు.
ఈ ఆలయం పురాతన వైగై నది, మధురై ఒడ్డున ఉన్న చారిత్రాత్మక హిందూ దేవాలయం. మీనాక్షి ఆలయంలో ఫోటోగ్రఫీకి, కెమెరాలకు అనుమతి లేదు . పవర్ బ్యాంక్‌లతో సహా ఎలాంటి ఎలక్ట్రికల్ ఉపకరణాలను ప్రాంగణం లోపలికి అనుమతించరు.
అంతేకాదు కేవలం కాళ్లు చేతులు కప్పి ఉంచేలా సాంప్రదాయ దుస్తులు ధరిస్తేనే ఈ ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది.
ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలంటే..
రోడ్డు మార్గం ద్వారా అయితే రాష్ట్ర రాజధాని చెన్నై నుంచి ప్రతి గంటకోసారి బస్సు సౌకర్యం ఉంది. దీనితో పాటు.. బెంగుళూరు, కంచి వంటి ముఖ్య ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు బస్సు సర్వీసులు ఉన్నాయి. బస్సులో 12 గంటల పాటు ప్రయాణిస్తే మదురై పట్టణానికి చేరుకోవచ్చు.
రైలు మార్గం ద్వారా అయితే… చెన్నై ఎగ్మోర్ స్టేషన్ నుంచి ముదురైకు రైలు సర్వీసులు నడుపుతున్నారు. వీటితోపాటు.. ఉత్తరభారత దేశంలోని కొన్ని ముఖ్య నగరాల నుంచి వారాంతపు రైలు సర్వీసులను భారత రైల్వే శాఖ నడుపుతోంది. రైలు ద్వారా సుమారు ఏడు గంటల పాటు ప్రయాణం సాగుతుంది.
విమాన మార్గం ద్వారా అయితే… మదురైలో చిన్న పాటి విమానశ్రయం ఉంది. ఇక్కడుకు చెన్నై, ముంబై, బెంగుళూరు, తిరుచ్చి, కొయంబత్తూరుల నుంచి ప్రైవేట్, ప్రభుత్వ విమాన సర్వీసులు తిరుగుతున్నాయి.
కొలిచిన వారికి కొంగుబంగారంగా మారి, దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పేరుందిన ఈ మధురై పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు లక్షల్లో భక్తులు చేరుకుంటారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.