మోక్షం సిద్ధించే మహా క్షేత్రం..కాశీ విశ్వేశ్వరాలయం…!

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి.. కాశీ విశ్వనాథుని ఆలయం.. ఏడాది పొడవునా భక్తులతోక ళకళలాడుతుంటుందా పవిత్రధామం. పరమశివుడు నివసించిన మహిమాన్విత క్షేత్రమే కాశీ. ఆయన కొలువైన ఆలయమే విశ్వేశ్వరాలయం. ‘ఈ నగరం మనం చెప్పుకునే చరిత్రకన్నా ప్రాచీనమైనది, సంప్రదాయంకన్నా పురాతనమైనది’. కాశీకే వారణాసి అని మరోపేరు. వరుణ, అసి అనే రెండు నదుల మధ్య నిర్మించిన నగరం కావడంవల్లే ఇది వారణాసి అయిందనీ, ఆ పేరును పాళీ భాషలో బారనాసి అని రాసేవారట. అదే బెనారస్‌గా మారింది. అయితే కాశీ నగర పుట్టుకే అంతుబట్టని రహస్యం అంటుంటారు అక్కడి నివాసులు.
క్షేత్ర ప్రాశస్త్యం…
బ్రహ్మదేవుడు సృష్టి సాగించే సామర్థ్యంకోసం తపస్సు చేసుకోవడానికి వీలుగా శివుడు త్రిశూలాగ్రమ్మీద సృష్టించిన భూఖండమే కాశీగా అభివర్ణిస్తారు. దీనిమీద కూర్చుని బ్రహ్మదేవుడు సమస్త లోకాలనూ, భూమినీ సృష్టించాడట. దేవతలు, రుషిమునుల విన్నపం మేరకు శివుడు త్రిశూలం మీద ఏర్పడ్డ భూఖండాన్ని అలాగే దించి, నేలమీద నిలబెట్టడంతో.. అదే కాశీ పట్టణంగా నిలిచిపోయిందని శివపురాణం చెబుతోంది.
మనిషిని విశ్వంలో ఐక్యం చేసే నగరంగానూ చెబుతారు. అందుకే అక్కడికి వెళ్లినవారికి తిరిగి రావాలనిపించదట. కైలాసంలో సన్యాస జీవితాన్ని గడిపే ఈశ్వరుడు పార్వతితో వివాహమయ్యాక కాశీని నివాసంగా చేసుకున్నాడట.
చారిత్రాత్మక నగరం…
ఐదువేల సంవత్సరాలక్రితమే కాశీ నగరం ఏర్పడిందని, ఇందుకు రుజువుగా వేదాల్లోనూ ఇతిహాసాల్లోనూ ప్రస్తావన ఉందని ప్రతీతి. తొలి నిర్మాణం ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ పూర్వం ఇక్కడ 72వేల గుడులు ఉండేవనీ.. యోగశాస్త్రం ప్రకారం ఇది మనిషి శరీరంలోని నాడుల సంఖ్యతో సమానమనీ.. శక్తి చలనం ఉన్న చోటల్లా మందిరాలు నిర్మించినట్లు తర్వాతి కాలాల్లో జరిపిన పరిశోధనల్లో తేలింది.
కాశీలో ఉన్నవాళ్లకి సమస్త యాగాలు చేసిన పుణ్యం సిద్దించడంతోపాటు, శరీరంలోని చక్రాలన్నీ ఉత్తేజితమవుతాయట. కాశీలో గద్దలు ఎగరవు, గోవులు పొడవు పెరగవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవనీ అంటుంటారు. ఇక్కడ మరణించిన ఏ జీవికైనా కుడి చెవి పైకి లేచి ఉంటుందట.
అంతేకాక హిమాలయాల్లోని గోముఖం నుంచి బయలుదేరిన గంగమ్మ దారి మరలి కాశీ నగరాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుందట. ఎంత కరవు వచ్చినా గంగమ్మ ఇప్పటివరకూ కాశీ ఘాట్లను వదిలి దూరం పోలేదట.
ఈ ప్రాంతాన్ని పాలించిన ఆనాటి చక్రవర్తులూ, ప్రజలూ కలిసి నిర్మించిన గుడులు మొత్తంగా 26వేలకు పైనే ఉండేవట. ప్రస్తుతం వీటిసంఖ్య రెండున్నర వేలకు తగ్గింది.
కాశీ నగరం.. ముస్లిం దండయాత్రల్లో మూడుసార్లు ధ్వంసమైనట్లూ, అలా ధ్వంసమైన ఆలయాల్ని అక్బర్ కాలంలో పునరుద్ధరించినట్లూ తెలుస్తోంది. గమనిస్తే, కాశీలోని ప్రతి వీధిలోనూ ఓ గుడి ఉంటుంది. అన్నింటిలోనూ నిత్యం పూజలూ, హోమాలూ జరుగుతూనే ఉంటాయట. వీటన్నిటిలోకి ప్రత్యేకమైనది విశ్వనాథ మందిరం. పూర్వం ఈ గుడి ఎంతో వైభవంగా ఉండేదట. ఆ తరవాత దాడులకు భయపడి, గుడి చుట్టూ చిన్నాపెద్దా భవనాలు కట్టడంతో ఇరుకు గల్లీల మధ్య ఉండిపోయిందట. అందుకే దాన్ని మళ్లీ అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కాశీ విశ్వనాథధామ్ ప్రాజెక్టును చేపట్టింది ప్రభుత్వం.
ప్రత్యేకతలు..
విశ్వనాథుడి ఆలయానికి వెళ్లేదారిలోనే మనకు సాక్షి గణపతి ఆలయం, కలంతో ఉన్న వినాయకుడు కనిపిస్తారట. కాశీకి వచ్చినవాళ్ల వివరాలను ఆయన రాసుకుంటాడని నమ్ముతారు. గేటు వద్ద మరో దుండి గణపతి ఆలయం ఉంటుంది. 56 స్వరూపాలతో కూడిన స్వామి కాశీ పట్టణాన్ని కాపాడుతుంటాడనీ, దర్శించుకుంటే విఘ్నాలన్నీ తొలగిపోతాయనీ భక్తుల విశ్వాసం. అది దాటిన తర్వాత విశ్వనాథుడి ఆలయం వస్తుంది. గర్భగుడిలో ఓ మూలగా ఉంటుందా లింగం. ప్రస్తుత మందిరాన్ని 1780ల్లో ఇండోర్ రాణి అయిన అహల్యాబాయి హోల్కర్ కట్టించిందట. మహారాజా రంజిత్ సింగ్ ఈ ఆలయ గోపురాలకు బంగారు పూత వేయించేందుకు వెయ్యి కిలోలకుపైగా బంగారాన్ని సమర్పించాడట. అందుకే దీన్ని సువర్ణ దేవాలయంగా పిలుస్తుంటారు భక్తులు.
విశ్వనాథుడి గర్భగుడికి నాలుగు ద్వారాలు ఉంటాయి. రెండు లోపలకు వెళ్లడానికీ, మిగతా రెండు బయటకు రావడానికీ. గుడిలో నలువైపులా సీతారామలక్ష్మణులు, దశ భుజ వినాయకుడు, కాల భైరవుడు, పార్వతీ పరమేశ్వరులు, మహా శ్వేత రూపాలు దర్శనమిస్తాయి.
కాశీ విశ్వేశ్వరునికి.. శవభస్మ లేపనంతోనే పూజ ప్రారంభిస్తారట. ప్రతి ఏటా మహాశివరాత్రినాడు మృత్యుంజయ ఆలయం నుంచి విశ్వనాథ ఆలయం వరకూ ఊరేగింపు జరుగుతుందిక్కడ. విశ్వనాథుడికన్నా ముందు తారకేశ్వర లింగాన్ని దర్శించుకుంటారు భక్తులు. ఈ లింగమే కాశీలో మరణించేవారి చెవిలో తారకమంత్రంను ఉపదేశిస్తుందట. దర్శనానంతరం బయటకు రాగానే అవిముక్తేశ్వర లింగం కనిపిస్తుంది. ఈయన పరమశివుడు గురువైన ముక్తేశ్వరుడనీ శివుడి పూజలందుకునే పవిత్ర లింగమనీ చెబుతారు. ఈ విశ్వనాథ మందిరంతోపాటు వేలకొద్దీ మందిరాలూ, దశాశ్వమేధ, ప్రయాగ్, సోమేశ్వర్, హరిశ్చంద్ర, మణికర్ణికాఘాట్… వంటి 80కి పైగా ఘాట్‌లతో అలరారే ఈ ముక్తి క్షేత్రాన్ని తమ జీవితంలో ఒక్కసారైనా చూసి, తరించాలని కోరుకుంటారు భక్తులు.