Telugu Special Stories

శత ప్రయోగాల వేదిక శ్రీహరికోట

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి జనవరి 29న తన ‘వందవ ‘ ప్రయోగం జిఎస్ఎల్వి – ఎఫ్ 15 ద్వారా ఎన్విఎస్ – 02 నావిగేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టడంతో శ్రీహరికోట రికార్డు కెక్కింది. 1979 ఆగస్టు 10న ఎస్ఎల్వి 3ఇ -1 రాకెట్ ద్వారా రోహిణి టెక్నాలజీ పేలోడ్‌ని మొదటిసారిగా ప్రయోగించింది. 2024 డిసెంబర్ చివరి వారంలో స్పేడెక్స్ మిషన్‌లో భాగంగా ప్రయోగించిన పిఎస్ఎల్వి సి – 60 షార్ నుంచి చేసిన 99వ ప్రయోగం. తొలి ప్రయోగం చేసిన 46 ఏళ్లలోనే ఈ ప్రగతి సాధించడం విశేషం. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న ప్రతీ ఒక్కరూ అభినందనీయులే! ఇది ప్రతీ భారతీయుని విజయం. ఈ సందర్భంగా ఒకసారి మన అంతరిక్ష విజయ పరంపరను పునరావలోకనం చేసుకుందాం.

తొలినాళ్ళలో

స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలోనే దేశ రక్షణ అవసరాలు, అభివృద్ధికి అంతరిక్ష పరిజ్ఞాన అవసరాన్ని గ్రహించిన భారత ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనా వ్యవస్థను ఏర్పరచేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు పితామహుడైన విక్రం సారాభాయ్ 1957లో రష్యా మొట్టమొదటి ఉపగ్రహం స్పుత్నిక్‌ను ప్రయోగించిన తరువాత మన దేశానికి కూడా ఉపగ్రహ అవసరాన్ని నాటి ప్రధాని నెహ్రూకు తెలియజేసి ‘ సాంకేతిక పరిజ్ఞాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చేటప్పుడే మన దేశంలోని ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చని ఒప్పించి, 1962లో భారత అణుశక్తి వ్యవస్థ పితామహుడయిన హోమీ భాభా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ (ఇన్‌కోస్పార్)ను ఏర్పరచారు.

భవిష్యత్తులో ఇతర దేశాలు ఉపగ్రహానికి కావలిసిన సకల పరికరాలను అందించక పోవచ్చని ముందుగానే ఊహించిన సారాభాయ్ అవసరమైన అన్ని భాగాలనూ దేశీయంగానే తయారు చేసే దిశగా ప్రయత్నం చేసారు. 1969లో ఇన్‌కోస్పార్ ఇస్రోగా రూపొందింది. ఉపగ్రహాలను తయారు చేయడంతోపాటు వాటిని ప్రయోగించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండాల్సిన ఆవశ్యకతను గుర్తించిన సారాభాయ్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (ఎస్ఎల్వి) ఉపగ్రహ వాహకనౌక రూపకల్పనకు నాంది పలికారు. 

స్థల అన్వేషణ

మొదటి నుండి ఉపగ్రహాల నిర్మాణాన్నే దృష్టిలో పెట్టుకొని దానికి అవసరమైన భూ ఉపరితల లక్షణాలను అధ్యయనం చేసేందుకు కేరళలో త్రివేండ్రం వద్ద తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ నెలకొల్పి అమెరికా, రష్యాల నుండి దిగుమతి చేసుకున్న రాకెట్లను ప్రయోగిస్తూ ఉపరితలాన్ని అధ్యయనం చేయడం మొదలు పెట్టారు. కానీ దీని చుట్టూ జనసంచారం ఎక్కువగా ఉండడం, పైగా ఆ కేంద్రం మినీ రాకెట్ ప్రయోగాలకే పరిమితం కావడం కారణాన్న భవిష్యత్తులో చేయబోయే భారీ రాకెట్ ప్రయోగాల దృష్ట్యా భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం మరోచోట రాకెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అనువైన రాకెట్ ప్రయోగ కేంద్ర స్థలం కోసం అన్వేషణలో అన్ని ప్రాంతాలనూ పరిశీలిస్తూ రాగా శ్రీహరికోట దీవి ఆయన కంటపడింది.

శ్రీహరికోట ప్రత్యేకత:

రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు ఎంత దగ్గరగా ఉంటే భూమ్యాకర్షణను అధిగమించి పైకి వెళ్ళేందుకు రాకెట్‌కు అంత తక్కువ ఇంధనం ఖర్చౌతుంది. శ్రీహరికోట భూమధ్యరేఖకు దగ్గరగా ఉండడం ఇస్రో ఈ స్థలాన్ని ఎంచుకోవడానికి ఒక కారణం. భౌగోళికంగా సాంకేతికంగా, ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఫ్రెంచి గయానాలోని కౌరు రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు కేవలం ఏడు డిగ్రీల అక్షాంశంలోనూ, ఎంతో గొప్పదిగా చెప్పుకునే అమెరికాలోని కేఫ్ కెన్నెడీ రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు 28 డిగ్రీల అక్షాంశంలోనూ ఉండగా  శ్రీహరికోట 13 డిగ్రీల 43 సెకండ్ల అక్షాంశం మీద ఉంది. భూమధ్య రేఖకు అత్యంత దగ్గరగా ఉన్న కేంద్రాల్లో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. ఇంకా రాకెట్ ప్రయోగ దిశలో భూభాగాలేవీ లేకపోవడం, ఒకవేళ ప్రయోగమేదైనా విఫలమైనా రాకెట్ శకలాలు సముద్రంలో పడిపోయేందుకు వీలుండడం లాంటి కారణాలు కూడా కలిసి రావడం దీని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. 1969లో శ్రీహరికోట రాకెట్ కేంద్రంగా ఎంపికైంది.

ఇక్కడ నుంచి 1979 ఆగస్ట్ 10న ఎస్ఎల్వి 3ఇ -1 రాకెట్ ద్వారా రోహిణి టెక్నాలజీ పేలోడ్‌ని ప్రయోగించింది. కానీ ఈ ప్రయోగం సఫలం కాలేదు. షార్ నుంచి ఇస్రో జరిపిన 99 ప్రయోగాల్లో 9 మాత్రమే విఫలమయ్యాయి. విజయవంతమైన ప్రయోగాల్లో 129 స్వదేశీ ఉపగ్రహాలను, 433 విదేశీ ఉపగ్రహాలను, రెండు ప్రైవేట్ ఉపగ్రహాలను, ఒక గగనయాన్ టెస్ట్ వెహికిల్ డీ వన్, 18 స్టూడెంట్ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. 2008 లో చంద్రయాన్1 , 2014 లో మంగళ్‌యాన్, 2016లో పునర్వినియోగ లాంచి వాహనపు తొలి పరీక్ష, 2016లో ఒకే రాకెట్టుతో 20 ఉపగ్రహాల ప్రయోగం, 2017లో ఒకే రాకెట్టుతో 104 ఉపగ్రహాల ప్రయోగంతో ప్రపంచ రికార్డు, 2017లో  జిఎస్ఎల్‌వి మార్క్ 3 ప్రయోగం, 2023లో చంద్రయాన్- 3 విజయవంతం అయ్యాయి. దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన క్రయోజెనిక్ ఇంజన్ కూడా విజయవంతమైంది. 

ఎన్విఎస్ – 02 

నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్ (ఎన్విఎస్) అనేది భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇది మనదేశంలోని వినియోగదారులకు అలాగే భారత భూభాగానికి మించి 1500 కి.మీ విస్తరించి ఉన్న ప్రాంతానికి ఖచ్చితమైన స్థానం, వేగం, సమయ (పివిటి) సేవలను అందించడానికి రూపొందించబడింది. ఇది రెండు రకాల సేవలను అందిస్తుంది. అవి ఒకటి స్టాండర్డ్ పొజిషనింగ్  సర్వీస్ (ఎస్పీఎస్), రెండు రిస్ట్రిక్టెడ్ సర్వీస్ (ఆర్ఎస్). ఎస్పీఎస్ 20 మీటర్ల కంటే మెరుగైన స్థాన ఖచ్చితత్వాన్ని, సేవా ప్రాంతంలో 40 నానో సెకెన్ కంటే మెరుగైన సమయ ఖచ్చితత్వాన్ని అందిస్తుంది.రెండో తరం ఉపగ్రహాల్లో మొదటిదైన ఎన్వీఎస్-01ను 2023 మే 29న జీఎస్ఎల్వీ-ఎఫ్12 ద్వారా ప్రయోగించారు. తొలిసారిగా ఎన్వీఎస్-01లో స్వదేశీ అణు గడియారాన్ని ప్రయోగించారు.

ఎన్వీఎస్ సిరీస్లోని రెండో ఉపగ్రహం ఎన్వీఎస్-02ను ఎల్1, ఎల్5, ఎస్ బ్యాండ్లలో నావిగేషన్ పేలోడ్తో కాన్ఫిగర్ చేయడంతో పాటు సీ-బ్యాండ్లోని పేలోడ్ను దాని మునుపటి ఎన్వీఎస్-01 మాదిరిగానే రూపొందించారు. ఇది 2250 కిలోల లిఫ్ట్-ఆఫ్ ద్రవ్యరాశి, 3 కిలోవాట్ల పవర్ హ్యాండ్లింగ్ సామర్థ్యంతో  స్టాండర్డ్ – I 2కె బస్ ప్లాట్ఫామ్ పై కాన్ఫిగర్ చేయబడింది. ఐఆర్ ఎన్ఎస్ఎస్ -1ఈ స్థానంలో 111.75 డిగ్రీల ఉష్ణోగ్రతను అమర్చనున్నారు. ఎన్వీఎస్-02 ఖచ్చితమైన సమయ అంచనా కోసం స్వదేశీ, సేకరించిన పరమాణు గడియారాల కలయికను ఉపయోగిస్తుంది. ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని ఇతర ఉపగ్రహ ఆధారిత వర్క్ సెంటర్ల సహకారంతో యుఆర్ శాటిలైట్ సెంటర్ (యుఆర్ఎస్సి) లో రూపొందించి అభివృద్ధి చేసి, ఇంటిగ్రేట్ చేశారు. ఉపగ్రహం వివిధ దశల్లో దాని పనితీరు సమ్మతి యొక్క సమగ్ర ప్రీ-షిప్‌మెంట్ సమీక్ష డిసెంబర్ 27, 2024న పూర్తయింది. ఈ ఉపగ్రహాన్ని 2025 జనవరి 05న భారత ప్రయోగ కేంద్రం ఎస్డీఎస్సీ-షార్కు పంపారు. ఇది విజయవంతం అయింది. జై భారత్ ! జై భారత్ !

Show More
Back to top button