HISTORY CULTURE AND LITERATURETelugu News

రథసప్తమి అంటే ఏమిటి.. రథసప్తమి ఎందుకు జరుపుకుంటారు?

సనాతన ధర్మం ప్రకారం హిందూ దేవతలు ఎందరు ఉన్న అందరినీ మనం విగ్రహాల రూపంలో కొలుచుకుంటాం కానీ ప్రత్యక్షంగా మనకు కనిపించే దైవం మాత్రం సూర్య భగవానుడు. అందుకే మన భారతదేశంలో నిత్యం సూర్య భగవానుడికి వేకువ జామునే లేచి సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. మనకు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి వల్లనే నేలపై జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయి ఆయనను ఆరోగ్య ప్రదాత అని కూడా అంటారు. భౌతిక దృష్టికి గోచరించని సూర్యుని విశిష్టతలను మన ధర్మం గుర్తించి కొనియాడింది. సూర్యారాధన అత్యంత ప్రాచీన సంప్రదాయంగా చెప్పవచ్చు. అటువంటి సూర్యభగవానుడు లోకరక్షణ కోసం రథాన్ని అధిరోహించిన రోజు రథసప్తమి. ఆరోగ్యం, ఐశ్వర్యంతో పాటు దేనిని కోరేవారైనా సూర్యుని ఆరాధించాలి. రథసప్తమి అంటే ఏమిటి అనే విషయాలు మనం తెలుసుకుందాం.

‘సప్తానాం పూరణీ సప్తమీ’ అంటే ఒకటి నుండి ఏడు వరకూ గల స్థానాలు పూరించేది సప్తమి, సూర్యరథ గమనానికి ఇది కారణమైంది కనుక ఈ పండుగకు రథసప్తమి అని పేరుపెట్టారని పెద్దలు చెబుతున్నారు.

అయితే కొందరు రథ సప్తమినే సూర్యజయంతి అని అంటారు. కానీ నిజానికి సూర్యుడు జన్మించిన రోజు కాదు. సూర్యుడు తన ఉష్ణచైతాన్యాన్ని అంటే వేడిని లోకులకు పంచిపెట్టడం కోసం రథాన్ని అధిరోహించి విధులలో ప్రవేశించిన రోజుగా పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇది లోకంలో సూర్య జయంతిగా పిలవబడుతూ ఉంది. ఇక్కడ రథారోహణమే ప్రధానకృత్యం. లోకబాంధవ ధర్మానికి సిద్ధపడిన రోజు కనుక రథసప్తమి అయ్యింది.

సూర్య భగవానుడు అధిరోహించిన ఆ రథం మామూలు రథం కాదు. దీనికి ఒక్కటే చక్రం ఉంటుంది. తొడల నుండి క్రిందభాగం లేని ‘అనూరుడు’ రథసారథి ఛందస్సులనే గుర్రాలే ఈ రథాన్ని లాగుతాయి. ఏ మాత్రమూ నిలిచే ఆధారంలేని ఆకాశంలో పయనిస్తుంది ఈ రథం. ఇన్ని విలక్షణ విశేషాలున్నాయి కనుకనే ఈ పండగని రథం పేరుగల సప్తమిగా వ్యహరిస్తారని పండితులు చెబుతున్నారు.

సూర్యుడు రథోద్యోగంలో చేరింది మొదలు రాత్రింబవళ్లు తిరుగుతూనే ఉన్నాడు.  ఒక్కరోజు కాదు, ఒక్క నిమిషం కూడా ఎక్కడా కూర్చునే ఉద్యోగం కాదు. ఆయన సారథీ అంతే… కాళ్ళున్నవాడు ఎక్కడికైనా ఎప్పుడైనా విహారానికి వెళ్లవచ్చు కానీ వికలాంగుడైన అనూరుడు అలా చెయ్యలేడు. కాళ్ళు లేకపోవడంవల్ల అతడు మనపాలిట వరం అయ్యాడని పురాణాలు చెబుతున్నాయి.

సూర్యరథానికి ఉన్న గుర్రాలను ఛందస్సులంటారు. ఇవన్నీ వేదఛందస్సులు. అవి 1. గాయత్రి, 2. త్రిష్టుప్, 3. జగతి అనుష్టుప్, 5. పంక్తి, 6. బృహతి, 7. ఉష్ణిక్ అనేవి. వాటికి ఎప్పటికీ అలసట లేదు. గుర్రం వేగవంతమైన చైతన్యానికి చిహ్నంగా భావిస్తారు. సూర్యుని ఏడుగుర్రాలూ ఏడు రకాల కాంతి కిరణాల్ని ప్రసరిస్తూ ఉంటాయి కనుక సూర్యకిరణాల్లో ఏడు రంగులుంటాయి.

వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోతాయి.

రామ రావణ యుద్ధం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని ‘ఆదిత్య హృదయం’ ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది. ఇందులో 30 శ్లోకాలున్నాయి. వీటి స్మరణ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు.

సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు, రాత్రికి ప్రతీక అని, చక్రాలకున్న ఆరు ఆకులు రుతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది. అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి అని పిలుస్తారు.

ఈ రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి. 

ఈ రోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి, రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి.

ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుడిని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి “అర్కః” అని పేరు.

అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ రోజు ఉపవాసముండి సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములలో కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణప్రబోధము.

ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదువ వలసిన శ్లోకాలు:

నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః

అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!!

యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు!

తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!!

ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్!

మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః!!

ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే!

సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!

రథసప్తమినాడు హిందువులు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానాదికాలు పూర్తి చేస్తారు. పూజా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సూర్యోదయానంతరము దానాలు చేస్తారు. ఆ రోజు సూర్యభగవానుని ఎదుట ముగ్గువేసి, ఆవు పిడకలపై ఆవుపాలతో పొంగలి చేసి చిక్కుడు ఆకులపై ఆ పొంగలిని ఉంచి ఆయనకు నివేదన ఇస్తారు. ఇతర మాసములలోని సప్తమి తిథుల కన్నా మాఘమాసమందలి సప్తమి తిథి బాగా విశిష్టమైనది.

రథ సప్తమిని సూర్యప్రభ వాహనంతో ప్రారంభిస్తారు. రోజంతా బ్రహ్మోత్సవంతో భారీ స్థాయిలో జరుపుకుంటారు. భక్తులు అనారోగ్యం నుండి విముక్తి పొందడానికి, పాపాలను పోగొట్టుకోవడానికి సూర్యుడిని ప్రార్థించి, భీష్ముని స్మరించుకుని, తెల్లవారుజామున జిల్లేడు మొక్క ఏడు ఆకులతో స్నానం చేయడం ద్వారా రథ సప్తమిని ఆచరిస్తారు.

మాఘ మాస శుక్ల పక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. కశ్యప మహాముని కుమారుడైన సూర్యభగవానుడు జన్మించిన రోజును రథ సప్తమి అని  అంటారు. సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అది ఈ రథసప్తమి రోజు నుంచే ప్రారంభమవుతుంది.

ఈ రోజున ఎరుక్కు ఆకులతో  తలస్నానం చేయడం, తలపై రాక్షస పాలపిండి (ఎరుక్కు మొక్క) ఆకులతో జుట్టు కడగడం చేస్తారు. ఎరుక్కు మొక్కలో చికిత్సా,  నివారణ గుణాలు ఉన్నాయని ఒక నమ్మకం. కొన్ని ప్రాంతాలలో, ప్రజలు ఎరుక్కు ఆకులపై ఉడకని అన్నం వేసి స్నానం చేస్తారు.

రథసప్తమి రోజున ఉపవాసం పాటిస్తారు, పండ్లు లేదా ఇతర సాత్విక ఆహారాలు తింటారు. భక్తులు దీపాలు వెలిగించి, ఎర్రటి పువ్వులు సమర్పించి, సూర్యునికి నైవేద్యంగా ఖీర్ (తీపి అన్నం పాయసం) వంటి సంప్రదాయ వంటకాలను తయారు చేసి సూర్యపూజ చేస్తారు. రథసప్తమి రోజున సూర్య నమస్కారం చేయడం ఎంతో ప్రాముఖ్యమైనది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగే రథసప్తమిని రాష్ట్ర పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

దానితో పాటు మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది.

పుష్యం, మాఘం ఈ రెండు మాసాలూ వెంటనే వస్తాయి.

పుష్యమాసం పుష్యమీ నక్షత్రం ఆధారంగా చేసుకుని నిర్ణయించబడింది. మాఘమాసం మఖ నక్షత్రం సింహా రాశిని ఆధారంగా చేసుకుని నిర్ణయించబడింది.

జ్యోతిషం ప్రకారం మకరరాశిలోకి అనగా ఉత్తరాషాడ నక్షత్రం 2వ పాదంలోకి సూర్యుడు ప్రవేశించగానే మకరరాశిలోకి సూర్యుడు ప్రవేశించినట్లుగా చెప్పడం జరుగుతుంది.

ఇది పుష్యమాసంలో సాధారణంగా జరుగుతుంది.

అయితే మాఘమాసం 7వ రోజున సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి అంటే ఉత్తరాషాడ 3వ పాదంలోకి వెళ్తాడు.

దాంతో సూర్యుడు పుణ్యకాలమైన ఉత్తరాయనంలోకి బయలుదేరుతాడు.

జీవుడు పుణ్యలోకాలకు వెళ్లడాన్ని శని భగవానుడు నిర్ణయిస్తాడు. అటువంటి శని వాహనమైన కాకి లేదా గ్రద్ద అనుకోండి. కాకి పితృ దేవతలకు పెట్టిన ఆహారం తీసుకుని వెళ్తుంది. ఈ పితృలోకమునకు ఆయుషు కారకుడైన శని అధిపతి అక్కడకు పుణ్యాన్ని అందించే సూర్యుడు రావడంతో పితృదేవతలకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి.

దాంతో సూర్యుని రధం పుణ్యలోకాలకు వెళ్ళుతుంది కనుక కాలం చేసినవారు కూడా ఆ పుణ్యలోకానికి వెళ్ళి నరకబాధను తప్పించుకుంటారు. ఎందుకంటే సూర్యుడు సత్వగున ప్రధానుడు. ఈ సత్వగుణం శ్రీమన్నారాయణుని ప్రసాదం కనుక మోక్షం వస్తుంది కనుకనే

భీష్ముడు యుద్దం ముగిసినా సరే సప్తమి అయిన అంటే మాఘ శుద్ద అష్టమినాడు తాను కోరుకుని వెళ్లిపోయ్యాడు.

కనిపించే దైవం సూర్య భగవాణుడిని సేవించడం వల్ల ఆరోగ్యం తో పాటు మనస్సు నిర్మలంగా ఉంటుంది. అందుకే ఆయనను ఆరోగ్య ప్రధాత అని అంటారు.

Show More
Back to top button