HISTORY CULTURE AND LITERATURE

హైదరాబాద్ లో అద్భుతమైన ఖిల్లా.గోల్కొండ కోట.!

కుతుబ్ షాలా అద్భుత కట్టడానికి మారుపేరుగా.. ఒకప్పుడు ప్రపంచంలోనే వజ్రాల వ్యాపారానికి పెట్టింది పేరుగా.. శ్రీరామదాసు.. 12 ఏళ్ళ పాటు చెరసాలలో బందీగా ఉన్నటువంటి పవిత్ర స్థలంగా..

వందల ఏళ్ల భాగ్యనగర చరిత్రకు సాక్ష్యంగా.. నిలిచిన ఈ కోటను.. ఎన్నో రాజ్యాలు, మరెన్నో సామ్రాజ్యాలు దక్కించుకునేందుకు సర్వం ఒడ్డాయి… చివరకు నిజాం నవాబుల చేతిలో చిక్కిన గోల్కొండ అలియాస్ గొల్లకొండ పోర్ట్..

500 ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది…

కాకతీయుల చరిత్రను మిళితం చేసేలా తెలంగాణలో ప్రతి ఏటా బోనాల పండుగ తొలిగా ఈ కోటలోనే చేయడం.. నేటికి ఆనవాయితీగా వస్తోంది.. అమ్మవారికోసం నిర్మించిన ఓ రాతి కట్టడం.. తర్వాతి రోజుల్లో కోటగా అవతరించింది..

కోట నిర్మాణం తర్వాత 500 ఏళ్లలో ఎన్నో ప్రకృతి ఉపద్రవాలను, శత్రుదాడులను ఎదుర్కొందీ..

చివరకు మొగలుల చేతిలో ఈ కోట శిథిలావస్థకు చేరుకుంది.

హైదరాబాద్ నగరంలో తప్పక చూడాల్సిన చారిత్రాత్మక, పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా నిలిచిన ఈ కోటలో.. పెద్దవైన బురుజులు, రాజమందిరాలు, మసీదులు, హిందూ దేవాలయాలు, విశ్రాంతి గృహాలు, ఫతే దర్వాజా.. బాలా హిస్సారు లాంటి ఎన్నో ప్రత్యేక నిర్మాణాలతో, ఎంతో శిల్పకళకు ప్రసిద్ధి గాంచింది.. 

ఆనాటి రోజుల్లో ధ్వని శాస్త్రం ఆధారంగా కింద చప్పట్లు కొడితే కిలోమీటరు అవతల వినపడే టెక్నాలజీని కనుగొనడం విశేషం.. ఇటువంటి మరెన్నో విశేషాలను కలిగిన ఈ గోల్కొండ కోట చరిత్ర గురుంచి మనం ఇప్పుడు ప్రత్యేకంగా తెలుసుకుందాం..

అది 1143వ సంవత్సరం… ఈ (గోల్కొండ) ప్రాంతం ఆనాటి కాకతీయుల ఆధీనంలో ఉండేది. అప్పట్లో ఇదంతా మంగళవరం అనే పేరుతో ఉన్న ఒక కొండ ప్రదేశం.. అయితే ఒకనాడు ఒక గొల్ల వ్యక్తి ఈ కొండ మీద గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడు. కాస్త దూరాన అతనికి ఒక విచిత్రమైన రాయి కనిపించింది. దగ్గరకి వెళ్లి చూస్తే.. అదొక దేవత విగ్రహం.. కొన్నేళ్లనుంచి ఆ కొండపైకి రోజు వస్తున్నా.. ఎప్పుడూ ఆ విగ్రహాన్ని గమనించింది లేదు.. ఇది కచ్చితంగా అమ్మవారే..

కాకతీయ రాజ్యాన్ని కటాక్షించేందుకు ఇక్కడ వెలసిందని ఆ గొల్ల వ్యక్తి నమ్మాడు. వెంటనే ఈ విషయాన్ని కాకతీయరాజు అయిన మొదటి ప్రతాపరుద్రుడికి చెప్పాడు. దాంతో ఆ రాజే స్వయంగా వచ్చి, అమ్మవారిని దర్శించుకొని.. ఆ ప్రదేశంలో మట్టితో ఒక అద్భుతమైన కోటను కట్టించాడు.. తరువాత ఒక గొల్ల వ్యక్తి చెప్పడం కారణంగానే ఈ కోట వెలసింది కాబట్టి గొల్లకొండగా పేరు పెట్టడం జరిగింది. అలానే మంగళవరం అనే కొండ మీద ఈ కోటను కట్టారు.. కాబట్టి మంగల్ గానూ రానురానూ మంకల్ అనే పేరుతో కూడా కోటను పిలిచారు..

అనంతరం 13వ శతాబ్దంలో రాణి రుద్రమదేవి, 2వ ప్రతాపరుద్రుడు కోటకు మరమ్మత్తులు చేయించడంతోపాటు.. కొత్త హంగులను అద్ది.. నూతన కళను తీసుకువచ్చారు. కేవలం ఆధ్యాత్మిక విషయాలపరంగానే కాక శత్రుదాడుల నుంచి రక్షించే ఒక రక్షణ వలయంగా కూడా కోట పేరుగాంచింది. ఆ తరువాతి కాలంలో కిల్జి, తుగ్లక్ ల వరుస దాడుల వల్ల కాకతీయ సామ్రాజ్యం పతనమైపోయింది. తరువాత కోట తుగ్లక్ ల హస్తగతమైంది. వీళ్ల ఆగడాలకు ఆనాటి ఆంధ్రదేశం మొత్తం విలవిలలాడింది. దీంతో తుగ్లక్ పరిపాలకులకు వ్యతిరేకంగా ప్రజల నుంచి విప్లవం మొదలైంది. 1325లో కాకతీయ వారసులైన ముసునూరి నాయకులు తుగ్లక్ లను తరిమి కొట్టి.. ఓరుగల్లుపైన మళ్లీ విజయజెండాని ఎగురవేశారు.

1364 నుంచి ఈ ప్రాంతాన్ని నిజాం నవాబులు పాలించారు. మొదటి నిజాం కాలంలో కోట వెలుపలి భాగాన తూర్పు దిక్కున ఒక గుట్ట ఉండేది. దానిని శత్రువులు ఆక్రమిస్తే కష్టమని భావించిన నిజాం రాజు గుట్టను కోట లోపలికి కలుపుతూ, దాని చుట్టూ గోడను నిర్మించాడు. ఈ కోట మొత్తంమీద 87 అర్ధచంద్రాకారపు బురుజులున్నాయి. వీటిలో పెట్లబురుజు, మూసా బురుజు, మజ్ను బురుజు ప్రసిద్ధిగాంచినవి. కోటను నిర్మించేటప్పుడు శత్రువుల నుంచి రక్షించుకునేందుకుగానూ పెద్ద పెద్ద బురుజులను నిర్మించారు.

మొత్తం 10 కి.మీ.ల పరిధిలో 87 బురుజులు ఉంటాయి. కోటలోకి ప్రవేశించేందుకు 4 ప్రధాన ద్వారాలతో పాటు లోపల నవాబుల కోసం రాజమందిరాలు, మసీదులు కూడా నిర్మించారు. సింహద్వారం దాటుకుని శత్రువులు కోటలోకి ప్రవేశించగానే రాజమందిరంలో కొలువుదీరిన నిజాం నవాబుకి సమాచారం తెలిసేలా ‘ధ్వని శాస్త్రం’ ఆధారంగా చేసిన నిర్మాణాలు, ఇప్పటికీ ఓ అద్భుతమనే చెప్పాలి. ప్రవేశద్వారానికి సమీపంలో ఉన్న గేటు దగ్గర చప్పట్లు కొడితే 120 అడుగుల ఎత్తున ఉన్న బాల మిస్సార్ దగ్గర శబ్దం వినిపిస్తుంది. 

బాలమిస్సార్‌ గేటు నుంచి లోపలికి ప్రవేశించేటపుడు కుడిచేతివైపు ఓ స్నానాల గది ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. కుడిచేతి వైపున వేడి నీళ్ళు… విడిగా చన్నీళ్ళు వచ్చేలా నేల మార్గమున గొట్టములను అమర్చి కట్టారు. ఈ కుళాయిలను చెరువు నీటితో నింపేవారు. ఈ నీటిని అతి ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే ఉపయోగించేవారు. దీనికి పడమర దిశలో ఉన్న గేటు దగ్గర శబ్దం చేస్తే అది అన్ని వైపులకు ప్రతిధ్వనిస్తుంది. ఈ నీటి హౌజ్ ను రాజులు, మరికొందరు ప్రముఖులు వినోదస్థలంగా ఉపయోగించేవారు. నవాబుల కాలంలో కోటలో వజ్రాల వ్యాపారం విస్తృతంగా చేసేవారు.

అతి విలువైన కోహినూర్ వజ్రాలను కూడా రాశులుగా పోసి విక్రయించేవారు. వీరి పాలనలో కొన్నాళ్లు అమ్మవారికి పూజలు ఆగిపోయాయి. ఆ సమయంలోనే ప్లేగు వ్యాధి కారణంగా హైదరాబాద్ రాజ్యంలో వేలాదిమంది చనిపోయారు. నిజాం నవాబు మహ్మద్ కులీ కుతుబ్ షా తల్లి సైతం ప్లేగు వ్యాధితో చనిపోయింది. ఆ సమయంలోనే నిజాం నవాబులు.. గోల్కొండ కోట మీది ఎల్లమ్మ తల్లికి బోనాల జాతరను చేశారు. బోనాల జాతర తర్వాత అనూహ్యంగా ప్లేగు వ్యాధి మరణాలు తగ్గుముఖం పట్టాయి. అప్పట్నుంచి ప్రతీ ఆషాడమాసంలో బోనాల జాతర ఇక్కడ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే వీరి పాలన ఎంతోకాలం కొనసాగలేదు. 

1368లో కర్ణాటక ప్రాంతం నుంచి బహమని సుల్తాన్ లు ఓరుగల్లుపై దండెత్తి.. సంధిలో భాగంగా అనేక కానుకలతోపాటుగా గోల్కొండ కోటను కూడా సొంతం చేసుకున్నారు. అలా తెలుగువారి ఆత్మగౌరవం సుల్తానుల వశమైంది. బహమని రాజు మహమ్మద్ షా తన పేరుమీదుగా గోల్కొండ కోటకు మహమ్మద్ నగర్ అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పటికీ చూస్తే నాటి ప్రభుత్వ దస్తావేజుల్లో గోల్ కొండ మహ్మద్ నగర్ అని కనిపిస్తుంది. కోటను సొంతం చేసుకొన్న తరువాత బహుమని రాజు తనకి అత్యంత సన్నిహితుడైన కుతుబ్ ఉల్ ముల్క్  1496లో గోల్కొండకి జాగీరుదారుడిగా నియమించాడు. కుతుబ్ ఉల్ ముల్క్ తో పాటు ఒక తుర్క వ్యక్తి కూడా వలస వచ్చాడు. ఇతడు రాజు దగ్గర సాధారణ సైనికునిగా చేరి తన పనితీరుతో సేనాపతి స్థాయికి చేరుకున్నాడు. ఆనాటి తెలంగాణలో దారి దోపిడీదారులను, బందిపోటు దొంగలను, సుల్తాన్ మహారాజ్ కి వ్యతిరేకంగా నిలిచిన తిరుగుబాటుదారులను ఎక్కడికక్కడే అణిచివేసి బహమని రాజు దృష్టిలో పడ్డాడు.

అంతేకాకుండా ఈసారి బహమని రాజును చంపడానికి ప్రయత్నించినప్పుడు కుతుబ్ ఉల్ ముల్క్.. తన ప్రాణాలకు తెగించి పోరాడి.. రాజుని కాపాడాడు. అందుకు మెచ్చిన రాజు బహుమానంగా గోల్కొండ కోటకు జమీందారుగా నియమితుడయ్యాడు.

1507లో గోల్కొండ కోట మీద కుతుబ్ షాహీ వంశస్తులు ఓ నల్లరాతి కోటను నిర్మించారు. బురుజులతో మొత్తం 5 కి.మీ.ల చుట్టుకొలతతో ఈ కోట నిర్మాణం జరిగింది. నిజాం నవాబుల పాలనలోనే గొల్లకొండ కాస్తా గోల్కొండగా మారిపోయింది. 120 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ కోటలో ఎన్నో విశేషమైన కట్టడాలు కూడా ఉన్నాయి.. నిజాం నవాబుకి చెల్లించాల్సిన సుంకంతో భద్రాచలంలో రామాలయం నిర్మించిన కంచర్ల గోపన్నను సైతం ఈ కోటలోనే బంధీని చేశారు. ఆ సమయంలో గోపన్న చెక్కిన శిల్పాలు కూడా ఈ కోటలో కనిపిస్తాయి.

1518లో బహమని రాజు మరణించిన తర్వాత కుతుబ్ ఉల్ ముల్క్.. తనను తానే గోల్కొండ రాజ్యానికి సుల్తానుగా ప్రకటించుకున్నాడు. ఆపై మహమ్మద్ కులీ కుతుబ్ షాహీగా పిలవబడ్డాడు.

1518- 1687 వరకు మొత్తం ఏడుగురు కుతుబ్ షాహీ రాజులు గోల్ కొండ రాజ్యాన్ని పరిపాలించారు. నిజానికి కాకతీయులచేత కట్టబడిన ఆ మట్టి కోటను కుతుబ్ షా పూర్తిగా కూల్చేసి.. అదే స్థానంలో గ్రానైట్ రాయితో మనం ఇప్పుడు చూస్తున్నటువంటి పటిష్టమైన కోటను కట్టించాడు. కట్టిన తరువాత గోల్ కొండ గా ఉన్న పేరు కాస్త మహమ్మద్ నగర్ గా మార్చడం జరిగింది. ఈ గోల్కొండ రాతి నిర్మాణం పూర్తవ్వడానికి 62 ఏళ్ళ కాలం పట్టింది అంటే 1580 వరకు అంటే, నలుగురు కుతుబ్ షా రాజుల హయాంలో 1518-80 వరకు కోట నిర్మాణం జరిగిందన్నమాట.

1687లో ఔరంగజేబు గోల్కొండ కోటపై దండెత్తాడు. కోటను నాశనం చేసేందుకు ప్రయత్నించాడు. ఔరంగజేబు దాడి తర్వాత కోట మొగులల పాలనలోకి వెళ్లింది. మొగల్ చక్రవర్తుల నుంచి నిజాం నవాబులు.. కోటను 1724లో తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనం అయ్యేంతవరకూ (1948) నిజాం నవాబులే ఈ ప్రాంతాన్ని పాలించారు. 

కుతుబ్‌షా వంశపు రాజులలో ఏడవవాడు, ఆఖరివాడు అయిన అబ్దుల్‌ హసన్‌ తానీషా పరిపాలనలో రక్షక భటులకోసం కట్టబడిన భవన మార్గంలోనే ఆయన మంత్రివర్యులైన అక్కన్న మాదన్నల కోసం నిర్మించిన కార్యాలయ భవనం ఉంది. అక్కన్న మాదన్న, అబ్దుల్‌ హసన్‌ తానీషా కాలంలో కట్టిన మందిరం దుర్గాదేవి లేక మహాకాళి అమ్మవారి మందిరం.. ఇక్కడ ప్రతి ఆషాఢ మాసములో బోనం ఎత్తుకునే జాతరలు జరుగుతాయి. జంట నగరాల నుంచి అనేకమంది సందర్శకులు రావడం విశేషం. 

బయట ఉండే ఫతే దర్వాజ అయిన విజయద్వారం నుంచే మనం గోల్కొండ కోటను చూడటానికి వెళ్తాము. ఇదే ఎంట్రన్స్ అన్నమాట.. కోటకు మొత్తం తొమ్మిది ద్వారాలు (తలుపులు)న్నాయి. ఫతే దర్వాజ, మోతి దర్వాజ, కొత్తకోట దర్వాజ, జమాలి దర్వాజ, బంజారి దర్వాజ, పటాంచెరు దర్వాజ, మక్కా దర్వాజ డబుల్‌, బొదిలి దర్వాజ, బహిమని దర్వాజా… 

ఔరంగజేబు తన విజయం తరువాత ఫతే దర్వాజ ద్వారం నుంచే తన సైన్యాన్ని నడిపించాడు. అలానే ఏనుగుల రాకను ఆడ్డుకోవటానికని ఆగ్నేయం వైపున పెద్ద పెద్ద ఇనుపచువ్వలు ఏర్పాటు చేశారు. ఫతే దర్వాజను నిర్మించటానికి ధ్వనిశాస్త్రమును ఔపోసన పట్టినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే గుమ్మటం కింద ఒక నిర్ణీత ప్రదేశం వద్ద చప్పట్లు కొడితే కిలోమీటరు అవతల గోల్కొండలో అతి ఎత్తైన ప్రదేశములో ఉన్న “బాల మిస్సారు”లో చాలా స్పష్టంగా వినిపించడం మనం చూసే ఉంటాం. ఈ విశేషమును ఒకప్పుడు ఇక్కడి నిర్వాసితులు ప్రమాదసంకేతాన్ని తెలిపేందుకు ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు మాత్రం సందర్శకులకు వినోదం పంచేదిగా మిగిలిపోయింది.

దేశంలోనే అతి పురాతనమైన కట్టడాల్లో గోల్కొండ ఒక్కటి. అందులోనూ హిందూ, ముస్లింల ఐక్యతకు చిహ్నంగా నిలిచిన ప్రాంతం… బోనాల పండుగకు నాంది అయ్యింది.. ఓరుగల్లు ప్రాభవానికి.. ప్రాచీన కట్టడానికి పునాదిగా నిలిచింది.

Show More
Back to top button