CINEMATelugu Cinema

తెలుగు సినీ సంగీతంలో సప్తస్వరాల ఉయ్యాల.. పెండ్యాల నాగేశ్వరావు.

సంగీతంలో చిగురాకులలో చిలకమ్మా (దొంగరాముడు), రాగమయీ రావే అనురాగమయీ రావే (జయభేరి), శేష శైలావాస శ్రీ వేంకటేశా (శ్రీ వెంకటేశ్వర మహత్యం), నా కంటిపాపలో నిలిచిపోరా.. నీవెంట లోకాల గెలవనీరా (వాగ్దానం), పాడవోయి భారతీయుడా, ఆడిపాడవోయి విజయగీతికా (వెలుగు నీడలు), నీలిమేఘాలలో గాలికెరటాలలో (బావ మరదళ్ళు), శివశంకరీ… శివానందలహరీ (జగదేక వీరుని కథ), మోహన రాగమహా మూర్తిమంతమాయే (మహామంత్రి తిమ్మరుసు), తెలిసిందిలే తెలిసిందిలే, నెలరాజ నీ రూపు తెలిసిందిలే (రాముడు భీముడు), కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది (ఉయ్యాల జంపాల), ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి (భూమి కోసం), పదిమందిలో పాటపాడినా అది అంకితమెవరో (ఆనందనిలయం), రాకోయీ అనుకోని అతిథి కాకి చేత కబురైనా పంపక (శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్), చిత్రం! భళారే, విచిత్రం! (దాన వీర శూర కర్ణ)..

ఈ పాటల స్వరకర్త, తెలుగు సినిమా స్వర్ణ యుగంలో స్వరమాధుర్యాన్ని ప్రధానమైన పాటలకు స్వర సృష్టి చేసిన స్వరకర్త పెండ్యాల నాగేశ్వరరావు గారు. తనను నాగేశ్వరరావు గారు అని, రాగేశ్వరరావు గారు అని అంటారు. తాను తెలుగులో 100, తమిళంలో 25, హిందీలో ఐదు, కన్నడంలో ఐదు సినిమాలకు సంగీత స్వరాలను సమాకూర్చారు.

పాటలోని పదాల బరువును తూచి ఆ బరువుకు సర్వవిధాలా సరితూగే వరాల స్వరాలు తోచేవరకు వేచి, నిదానంగా కూర్చుని ఏరుకొని మరీ వరుస కూర్చుంటూ పోతారు. నచ్చకపోతే నచ్చేదాకా మార్చుకుంటూ పోతారు. వరుస కట్టడం నిర్మాణం సంపూర్ణమైన అనంతరం కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ మేధావీధిని మెరిసే మెరుపుల వెలుగుల మెరుగులు కూడా తీర్చుకుంటూ దిద్దుకుంటూ చేర్చుకుంటూ పోతారు. పక్కనున్న పదిమంది విని బాగుందని మెచ్చుకున్నా అంత తొందరగా తృప్తి పడపోరు. ఒక్కోసారి తనకి నచ్చినా ఎదుటివారికి నచ్చకపోతే వారిని సంతృప్తి పరిచేదాకా నిద్రపోరు.

ఏ ఒక్క సినిమాలో ఏ ఒక్క పాట విన్నా కూడా మనసును రంజింప చేస్తుంది. దక్షిణ భారత చలనచిత్ర రంగంలో దశాబ్దాల పాటు ప్రముఖ గాయనిలుగా వెలుగొందిన పి.సుశీల, ఎస్.జానకి గార్ల సినీ జీవితాలకు ప్రయాణం పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీత సారథ్యంలోనే ప్రారంభమైంది.

1951 లో విడుదలైన కన్నతల్లి చిత్రంతో పి.సుశీల గారిని పెండ్యాల గారు పరిచయం చేస్తే, 1955 అక్టోబర్ లో విడుదలైన “దొంగరాముడు” చిత్రంలో కథానాయికకు పాడడం ద్వారా పి.సుశీల గారు సినీ రంగంలో నిలదొక్కుకోవడానికి బలమైన పునాది వేశారు పెండ్యాల గారు. అలాగే 1957 లో విడుదలయిన ఎమ్మెల్యే చిత్రంలో “నీ ఆశ అడిగా” చిత్రంతో ఘంటసాల తో కలిసి పాడడం ద్వారా ఎస్.జానకి గారిని  పరిచయం చేసింది పెండ్యాల గారే.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    పెండ్యాల నాగేశ్వరరావు

ఇతర పేర్లు  :    పెండ్యాల

జననం    :   6 మార్చి 1917 

స్వస్థలం   :     ఒణుకూరు, కృష్ణాజిల్లా

తండ్రి       :    సీతారామయ్య

తల్లి       :      వెంకాయమ్మ

వృత్తి      :    నటన, గానం, సంగీతంలో దర్శకత్వం

భార్య     :    శీతాంశుముఖి

మతం    :    హిందూ మతం

మరణ కారణం  :   సహజ మరణం

మరణం    :  31 ఆగష్టు 1984

జననం…

పెండ్యాల నాగేశ్వరావు గారు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వణుకూరులో 06 మార్చి 1917లో సీతారామయ్య, వెంకమ్మ దంపతులకు జన్మించారు. పెండ్యాలగారి తండ్రి సీతారామయ్యగారు సంగీతం మాస్టారు. హార్మోనియమ్‌ వాయించడంలో దిట్ట. హరికథ, నాటకం హార్మోనియమ్‌ వాయిస్తూ పిల్లలకి పాఠాలు చెప్పేవారు. పిల్లవాడైన నాగేశ్వరరావుకీ ఆ పాఠాలు రుచించాయి. దాంతో పెండ్యాల గారు తన నాన్న గారి దగ్గరే సంగీతంలో ఓనమాలు దిద్దారు. పెండ్యాల గారికి ఆరు నెలల వయస్సులోనే వారి తల్లిగారు స్వర్గస్థులయ్యారు. పెండ్యాల గారి నాన్న గారు రెండో వివాహం చేసుకున్నారు. ఆవిడ పెండ్యాల గారిని సవతి కొడుకులాగే చూసేవారు. పెండ్యాల గారి నాయనమ్మ సుబ్బమ్మగారే పెండ్యాల గారిని పెంచి పెద్ద చేశారు. తాను తన నాన్నమ్మ గారినే “అమ్మా”! అని పిలిచేవారు.

పెండ్యాల గారి ఉత్సాహం చూసిన తన తండ్రిగారు శాస్త్రీయమైన గాత్ర సంగీతంలో , ఇంకో పక్క హార్మోనియమ్‌నీ నేర్పారు. పెండ్యాల నాగేశ్వరరావు గారు వీధిబడి నుంచి ఎలిమెంటరీ స్కూలుకీ, ఎలిమెంటరీ స్కూలు నుంచి హైస్కూలుకూ మారాడు. ఒకవైపు చదువులో బడులు మారుతూ, ఇంకోవైపు వరసల పలుకుబడులు సాధించసాగాడు. స్కూల్లో ప్రార్థనాగీతాలు పాడడాలు, చిన్నచిన్న వేషాలువేస్తూ పద్యాలు పాడడాలూ చేసేవారు. పెండ్యాల గారు తన తండ్రిగారు ఊళ్ళో లేకపోతే, ఆ శిష్యులకి తానే గురువై సంగీతం నేర్పించేవారు. అలా సంగీతం పట్ల శ్రద్ధ, ఆసక్తులు నాగేశ్వరరావు గారిని రంగస్థలనటుణ్ని, హార్మోనిస్టునీ చేశాయి.

ఎక్సెల్సియర్ క్లబ్ లో నాటకాలకు సంగీతం…

రెండో ప్రపంచం యుద్ధ మేఘాలు మద్రాసును అలుముకోవడంతో కడారు నాగభూషణం గారి సినిమా తొందరగా పూర్తి చేసి సినిమాలు ఆపేశారు. దాంతో చేసేది లేక మద్రాసు నుండి సొంత ఊరు కాటూరు కు వచ్చేశారు పెండ్యాల గారు. కాటూరు లో సీతరామయ్య గారు అనే భూస్వామి ఉండేవారు. వాళ్ళ అమ్మాయి పేరు సుశీల దేవి. పెండ్యాల గారి నాన్న గారి దగ్గర సంగీతం నేర్చుకుంటూ ఉండేది. ఆ సుశీల దేవి గారిని పెయ్యేరు కు చెందిన దుక్కిపాటి మధుసూదన రావు గారికి ఇచ్చి పెళ్లి చేశారు. దుక్కిపాటి గారు తన అత్తగారింటికి వచ్చినప్పుడు పెండ్యాల గారితో కచేరీలు పెట్టించేవారు.

తాను రాబోయే రోజులలో పెద్ద నిర్మాత అవుతానని, పెండ్యాల గారు గొప్ప సంగీతంలో విద్వాంసులు అవుతారని వారికి తెలియదు. ఇలా ఉండగా దుక్కిపాటి మధుసూదన రావు గారికి ముదినేపల్లి లో వున్న ఎక్సెల్సియర్ క్లబ్ తో పరిచయం ఏర్పడింది. ఆ క్లబ్ నిర్వహణ బాధ్యత నిర్వహిస్తూ నాటకాలు వేయించే క్రమంలో సంగీతం దర్శకులుగా పెండ్యాల నాగేశ్వరావు గారిని ఎంచుకున్నారు. ఎక్సెల్సియర్ క్లబ్ వారు సాంఘిక నాటకాలు వేసేవారు. గుడివాడ లో విప్రనారాయణ నాటకం వేసే కుర్రాడిని నాటకాలలో ఆడవేశం కోసం ముదినేపల్లి కి తీసుకొచ్చారు. ఆ అబ్బాయే అక్కినేని నాగేశ్వరావు గారు.

ఆ తరువాత రోజులలో దుక్కిపాటి గారు పెద్ద నిర్మాత, అక్కినేని గారు పెద్ద పేరుమోసిన హీరో, పెండ్యాల గారు గొప్ప సంగీతంలో దర్శకులు గా ప్రసిద్ధికెక్కారు. ఇదిలా ఉంటే మద్రాసు నుండి గాలిపెంచల నరసింహారావు గారి నుండి పిలుపు వచ్చింది. తాను మాయలోకం సినిమాకు సహాయకుడిగా సంగీతం అందించారు. దాంతో మంచి పేరు వచ్చింది. బాలాంత్రపు రజనీకాంత రావు గారి గారి సహాయకులు గా వెళ్లిన పెండ్యాల గారు కె.యస్. ప్రకాశరావు గారి పర్యవేక్షణలో జరిగిన గృహప్రవేశం సినిమా కు సంగీతం అందించడం, తనలో ఉన్న ప్రతిభను కె.యస్. ప్రకాశరావు గారు గుర్తించడం, తన సినిమా ద్రోహి లో సంగీతం దర్శకునిగా అవకాశం ఇవ్వడం, ఆ సినిమా విజయవంతం అవ్వడం జరిగిపోయాయి.

సినిమా రంగం…

పెండ్యాల గారు సహనానికి పెట్టింది పేరు. ఆ సహనాన్ని నేర్పుతో ఎలా సమయానుకూలంగా ఉపయోగించుకోవాలో తనకు బాగా తెలుసు. ఇంత విధాన ప్రధానమైన స్వభావం కలిగి ఉండడం చాలా కష్టం. పెండ్యాల గారు గోతుల్యమైన సాధు స్వభావం కలవారు. ఎంతటి ఛండ ప్రఛండమైన ఆగ్రహావేషంలోనైనా విషధరధరుడు గరళాన్ని గళంలోనే మిలితం చేసుకున్న రీతిలో కోపాన్ని మింగేస్తారు పైకి రానివ్వరు. వీరి భూషణం శాంతం. పెండ్యాల నాగేశ్వరావు గారిని నాటకాలలో నుండి చిత్ర పరిశ్రమ కు లాక్కొచ్చిన ఘనత శ్రీ కడారు నాగభూషణం గారిదే. వారి “తల్లి ప్రేమ”, “సుమతి” చిత్రాలలో పెండ్యాల గారు హార్మోనిస్టుగా కుదిరారు. కొన్నాళ్లు గడిచిన తరువాత ఇంటికి వెళ్లి ముదినేపల్లి లోని ఎక్సెల్షియర్ డ్రామాటిక్ అసోసియేషన్ లో చేరారు. నేటి అన్నపూర్ణ సంస్థ అధినేత శ్రీ దుక్కిపాటి నాటి డ్రామా సంస్థకు సెక్రెటరీ. అక్కినేని నాగేశ్వరావు గారు కూడా అక్కడే పనిచేసేవారు. అక్కినేని, పెండ్యాల గార్లు నాలుగు సంవత్సరాలు అక్కడే కలిసి ఉన్నారు.

తొలి చిత్రం ద్రోహి…

నిజానికి పెండ్యాల నాగేశ్వరావు గారి లోని ప్రతిభని పసిగట్టిన వ్యక్తి గాలిపెంచల నరసింహారావు గారు. తాను మాయలోకం (1945) చిత్రానికి పెండ్యాల గారిని హార్మోనిస్టుగా పిలిపించారు. ఎక్సెల్సియర్ క్లబ్ నిర్వాహకులు ఆ తరువాత కాలంలో ప్రముఖ నిర్మాత అయిన దుక్కిపాటి మధుసూదనరావుగారి సలహాతో పెండ్యాల గారు సినిమారంగానికి వచ్చారు. గృహప్రవేశం (1946) చిత్రానికి నిర్మాణ సారథ్యం వహించిన కె.ఎస్‌.ప్రకాశరావు గారు పెండ్యాల గారికి సహాయ సంగీతంలో దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఆ చిత్రానికి సంగీతర్శకుడు బాలాంత్రపు రజనీకాంతరావు గారు. తాను ఆలిండియో రేడియోలో తీరిక లేకుండా వుండేవారు.

దాంతో సమర్థుడైన సహాయకుడు కావాలని పెండ్యాల నాగేశ్వరరావును గారిని తీసుకున్నారు. పెండ్యాల గారి ప్రజ్ఞ ప్రకాశరావు గారికి పూర్తిగా అర్థమైంది. దాంతో తరువాత తాను నిర్మించిన, ద్రోహి (1948)కి పెండ్యాల గారికి సంగీత దర్శకుడుగా అవకాశం ఇచ్చారు కె.యస్.ప్రకాశరావుగారు. ఆ చిత్రానికీ, ఆ చిత్రంలోని కాఫీ ఖవాలీ, మనోవాంఛలు, పూవు చేరి, చిక్కిలిగింతలు మొదలైన పాటలకీ పెండ్యాల గారికి మంచి పేరొచ్చింది. పెండ్యాల సంగీతదర్శకుడుగా స్థిరపడ్డారు. సినిమాలోని ప్రతీ సన్నివేశాన్ని అర్థం చేసుకుని, దానికి తగ్గట్టుగా ట్యూన్‌ వచ్చేవరకూ, ఒళ్లు వంచి పనిచెయ్యడం, తను అనుకున్నట్టే గాయనీ గాయకుల చేత పాటలు పాడించడం పెండ్యాల గారి గుణం.

గాయనీ గాయకుల దగ్గర ఎంత ప్రతిభ వుందో, అంత ప్రతిభనీ పూర్తిగా వినియోగించుకునే సంగీత దర్శకులు పెండ్యాల గారు. ఘంటసాల, పెండ్యాల గార్లకి ఒకరి మీద ఒకరికి విపరీతమైన అభిమానం. పెండ్యాల గారి దృష్టిలో ఘంటసాలని మించిన గాయకుడు లేడు. పెండ్యాల గారి వేల పాటల్లో – అది క్లబ్బుపాటైనా అందులో కూడా మాధుర్యం తొంగిచూసినట్టే, హిందీ పాటని అనుసరించినా, పాశ్చాత్య ధోరణిని అనుకరించినా అందులో తెలుగుదనం వుట్టిపడుతుంది. సంగీతరస హృదయులకీ, గాయనీ గాయకులకీ అందరికీ నచ్చే సంగీతం పెండ్యాల గారిది.

ఒక్కొక్క చిత్రానికి ఒక్కొక్క తరహా సంగీతంలో అందిస్తూ చక్కని చిక్కని చల్లని వెన్నెల్లో, స్వర సంగీత సరోవరంలో రసికుల మానవ హంసలను హాయిగా విహారింపచేస్తూ తన కీర్తి కిరీటంలో చిత్రానికి ఒక వజ్రం చొప్పున పేర్చుకుంటూ వచ్చారు. ద్రోహి, దీక్ష, దొంగ రాముడు, ముద్దుబిడ్డ, అక్క చెల్లెలు, ఎమ్మెల్యే, భట్టి విక్రమార్క, భాగ్యరేఖ, వాగ్ధానం, శ్రీ వెంకటేశ్వర మహత్యం, వెలుగునీడలు, మహాకవి కాళిదాసు, మహామంత్రి తిమ్మరసు, శ్రీకృష్ణార్జునయుద్ధం, జగదేకవీరుని కథ, పరువు ప్రతిష్ట, అత్త ఒకింటి కోడలే, నిత్య కళ్యాణం పచ్చ తోరణం, బావ మరదళ్ళు, భక్త శబరి, జయభేరి, శ్రీకృష్ణ గారడి, కృష్ణ ప్రేమ, ఈడు జోడు, అనురాగం లాంటి అనేక చిత్రాలకు వీరు స్వరరంజకమైన సంగీతం సమకూర్చారు. ప్రజల హృదయాలను చురగొన్నారు.

“రమ్మంటే వచ్చారు అమ్మాయిగారు”, “పైల పైలా పచ్చీసు”, “సూర్యుడు చుట్టూ తిరుగుతుంది భూగోళం”, “పంచరు పంచరు”, “ఎవరికి వారే యమునా తీరే”, “అసలు నీవు రానేలా”, కుషీ కుషీగా నాతో రావే”, “నీ మది పాడెను ఏమని”, “ఎంత ఘనుడవయ్యా యదునందన ఆనందమోహన” వంటి పాటలు విజయవంతం అయినాయి.

జగదేకవీరుని కథ…

జగదేకవీరుని కథ లో జగదేకవీరులైన కథనాయకులు ఎన్టీఆర్ గారు ఏకకాలంలో వివిధ వాద్యాలను వాయిస్తూ జగన్మోహనంగా గీతమాలపించవలసిన ఘట్టానికి ఘనమైన మట్టు కట్టవలసి వచ్చింది. దర్శకులు శ్రీ కె.వి.రెడ్డి గారు పెండ్యాలతో “ఈ ఘట్టంలో నాయకుని గానానికి శిల కరిగిపోవలసి వచ్చింది. మీరెలా కరిగిస్తారో మరి, మీ చేతిలోనే ఉంది. ఈ సన్నివేశం రక్తి కట్టించే బాధ్యత అన్నారు. దాంతో ఈ బాధ్యత ఎలా నిర్వహించడమా అని అహర్నిశలు ఆలోచించి నాగేశ్వరరావు గారి మస్తిష్కం శుష్కించి పోయేటంత పనైంది. పాటను ఏవేవో రాగాలలో ఆలపించాలో అవి చూచుకుని చివరికి దర్బారీ, కానడ, ఘార్జరీతోడి, శంకరాభరణ రాగాలు నేరుకున్నారు పెండ్యాల గారు. ఈ మూడింటిలో కె.వి.రెడ్డి గారికి మొదటిది నచ్చింది. అదే రాగంలో రాగాలాపన, స్వర ప్రస్తారం, పల్లవి, అను పల్లవి, చరణం, నెరవు, తానం ఇత్యాది లక్షణ లక్షితమైన “శివశంకరి” పాట రూపొంది శిలలు ద్రవించేలా తయారైంది.

పెండ్యాల తో తొలి సెంటిమెంట్…

పెండ్యాల గారి సంగీతంలో దోస్తీ చేసిన వారికి పలు సెంటిమెంట్స్ ఉండేవి. అన్నపూర్ణ వారి తొలి చిత్రం “దొంగరాముడు” కు పెండ్యాల గారే సంగీతం అందించారు. ఆ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. దాంతో చిత్ర సీమలోకి అడుగిడుతూ తొలి ప్రయత్నాలు చేసేవారు పెండ్యాల గారినే సంగీత దర్శకునిగా ఎంచుకొనేవారు. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు గారు నిర్మించిన తొలి చిత్రం “రాముడు-భీముడు” చిత్రానికి కూడా పెండ్యాల గారే సంగీతం సమకూర్చారు. ఇక పెండ్యాల గారి స్వరకల్పనలో రూపొందిన “కన్నతల్లి” (1953) చిత్రం ద్వారా పి.సుశీల గారికి పెండ్యాల గారు తొలి అవకాశం కల్పించారు.

ప్రముఖ కవి, గీత రచయిత దాశరథి కృష్ణమాచార్యుల పాట చిత్రసీమలో తొలిసారి వెలుగు చూసింది కూడా పెండ్యాల గారి స్వరకల్పనలోనే. ఆచార్య ఆత్రేయ నిర్మించి, దర్శకత్వం వహించిన “వాగ్దానం” చిత్రంలో దాశరథి గారు  మొదటిసారిగా తన సినిమా పాట ను జనం ముందుంచారు. ఆ చిత్రానికీ పెండ్యాల గారే సంగీతంలో సమకూర్చారు. అలా పెండ్యాల గారి స్వరాల్లోనే దాశరథి గారి పాట ముందుగా ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఆ తరువాత కూడా పలువురు సినీజనం పెండ్యాల గారితో తొలి సెంటిమెంట్ ను అనుసరించారు. జయప్రద తొలిసారి తెరపై కనిపించిన “భూమికోసం” చిత్రానికి కూడా పెండ్యాల గారే సంగీత దర్శకులు.

ఇష్ట దైవం శ్రీనివాసుడు…

పెండ్యాల గారు ఈ పాట పాడండి అని బంధువులు ఎవరైనా అడిగితే చాలు అడిగిన పాటను ఎంతో పారవశ్యంతో పాడేవారు. బంధువులే తనకు నచ్చిన ప్రేక్షకులు. తాను మంచి మూడ్‌లో ఉన్నప్పుడు తన పిల్లలు “ఒక్క పాట పాడు నాన్నా” అని వారు అడిగితే “జ్ఞాపకం లేదమ్మా” అనేవారట. కానీ వారు పాట కొంచెం అందిస్తే మాత్రం తప్పనిసరిగా పాడేవారట. పెండ్యాల గారు చాలా గుప్తదానాలు చేశారు. ఆకలితో ఉన్నవారికి జేబులో ఎంత ఉంటే అంత తీసి ఇచ్చేసేవారు. సినీ మ్యుజీషియన్స్‌ అసోసియేషన్‌ వారికి ఇప్పుడు చాలామందికి పెన్షన్లు వస్తున్నాయి. ఇది పెండ్యాల గారు చేసిన కృషి ఫలితమే అని చెప్పవచ్చు. తనకు దైవభక్తి ఎక్కువ. “వేంకటేశాయ నమః” అంటూ పూలతో ఆత్మార్పణం చేసేవారు. తన ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. కుటుంబంతో కలిసి వారానికోసారి తిరుపతి వెళ్లేవారు. తాను తిరుమలలో చేయించని సేవ లేదు. వెంకటేశ్వర స్వామి మీద స్వరపరిచిన పాటలు భక్తిలో లీనమై చేసేవారు. “శేష శైలావాసా శ్రీవెంకటేశా” పాటను అందరూ ఇప్పటికీ కీర్తన అనుకుంటారు.

వివాహం…

పెండ్యాల నాగేశ్వరావు గారికి తన పదహారవ సంవత్సరంలో 1933 లో తమ ప్రక్క ఊరు ఇందుపల్లికి చెందిన చెందిన శ్రీరామమూర్తి, సాయమ్మ దంపతుల కుమార్తె శీతాంశుముఖి తో వివాహం జరిగింది. అప్పటికి శీతాంశుముఖి వయస్సు ఎనిమిది సంవత్సరాలు. మద్రాసు లో ఎన్టీఆర్ గారి ఇంటి ఎదురుగా ఉన్న ఇల్లు పెండ్యాల గారిది. ఆ తరువాత దానిని ఒక వ్యాపారి కొనుగోలు చేస్తే, తన దగ్గరినుండి దాసరి నారాయణ రావు గారు కొనుగోలు చేశారు. పెండ్యాల గారు కోడంబాకం లోని విశ్వనాథ పురంలో ఒక ఇల్లు కొనుక్కుని అక్కడికి మారారు.

పెండ్యాల గారికి నలుగురు కుమార్తెలు. నలుగురు విద్యాధికులే. పెద్ద కుమార్తె నిర్మల గారు కొద్ది కాలం క్రిందటే దివంగతులయ్యారు. రెండవ కుమార్తె సుజాత గారు, నాలుగవ కుమార్తె మంజుల గారు మద్రాసు లో ఉంటున్నారు. మూడవ కుమార్తె వనజ గారు హైదరాబాదు లో ఉంటున్నారు. పెండ్యాల గారి మూడవ అల్లుడు (వనజ భర్త) యన్.పి.చక్రవర్తి గారు సినీ దర్శకులు గా పనిచేశారు. కత్తుల కొండయ్య, నిప్పులాంటి మనిషి, సంపూర్ణ ప్రేమాయణం, కాష్మోరా లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

నిష్క్రమణం…

అనేక విజయవంతమైన చిత్రాలకు స్వరాలు సమాకూర్చారు పెండ్యాల గారు. తాను విజయం వచ్చిందని ఏ నాడూ పొంగిపోయింది లేదు. పరాజయం కలిగిందని కుంగిపోయింది లేదు. తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగగిపోయేవారు. తెల్లటి బెంగాలీ పంచె కట్టుతో, తెల్లటి గ్లాస్కో జుబ్బాకి బంగారు గుండీలతో ఉండే వస్త్రాలలో స్వచ్ఛమైన తెలుగు భావ కవిలా కనిపిస్తారు. పెండ్యాల గారి లాంటి స్నేహశీలి, సరళస్వభావం గల వ్యక్తులు సినిమా పరిశ్రమలో చాలా అరుదుగా కనిపిస్తారు. ఎప్పుడూ సంగీతాన్ని వింటుండేవారు.

ఖాళీ సమయంలో గ్రామ్ ఫోన్ రికార్డు వేసుకుని వింటుండేవారు. చాలా వరకు పాటలను ఇంట్లోనే స్వర పరిచారు. పెండ్యాల గారి సంగీతంలో ఎన్నో మధురగీతాలు మన సొంతమయ్యాయి. నిజానికి తన పాటల్లో బాణీలు ఎక్కడో విన్నట్టుగా కూడా అనిపిస్తాయి అనే విమర్శ ఉండేది.

అప్పుడప్పుడు దర్శకనిర్మాతలు మోజుపడి ఉత్తరాది బాణీలను తమ చిత్రాల్లో పొందు పరచమని అడిగినప్పుడు తాను వద్దు అనలేక పోయేవారు.

దాంతో ఆ స్వరాలు ఎక్కడో విన్నట్టుగా మనకు తోస్తుంటాయి.

తన తుదికంటా సంగీతం కోసమే జీవించి, సంగీతం కోసమే తన జీవితాన్ని ధారపోశారు.

తుదికంటా మధురామృతం అందించడానికే ప్రయత్నించారు పెండ్యాల గారు.

ఇంతటి సుదీర్ఘ స్వర ప్రస్థానాన్ని కొనసాగించిన పెండ్యాల నాగేశ్వరావు గారు 31 ఆగస్టు 1984 వినాయక చవితి నాడు తుదిశ్వాస వదిలారు.

వినాయక చవితి కి రెండు రోజుల ముందు నుండే హైపర్ అసిడీటీ తో బాధపడుతున్న పెండ్యాల గారు విశ్రాంతి తీసుకుంటుండగా తన కూతురు కారులో బీచ్ కు తీసుకెళ్లారు.

దారిలోనే మగతగా ఉండడంతో వెనకకు తల వాల్చారు.

వెనువెంటనే మద్రాసు లో ఉన్న విజయ ఆసుపత్రికి తీసుకెళ్లగానే దారిమధ్యలోనే శ్వాస తీసుకోవడం ఆపేశారు.

భార్య శీతాంశుముఖి గారిని తోడు వద్దని చెప్పి వెళ్లిన పెండ్యాల గారు విగతజీవిగా తిరిగి రావడం ఆ కుటుంబాన్ని కన్నీటి పర్యంతం చేసింది.

Show More
Back to top button