
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు అనుబంధంగా పనిచేస్తున్న Cybersecurity and Infrastructure Security Agency (CISA)లో డిప్యూటీ డైరెక్టర్‌గా తెలుగు వ్యక్తి డాక్టర్ గొట్టుముక్కల మధు నియమితులయ్యారు. అమెరికాలో మౌలిక సదుపాయాల భద్రత మరియు సైబర్ హ్యాకింగ్ ముప్పులకు వ్యతిరేకంగా పనిచేసే ఈ ప్రముఖ సంస్థలో అధికారకంగా తెలుగు యువకుడు చేరడం గర్వకారణంగా మారింది.
డాక్టర్ మధు తల్లిదండ్రులు గొట్టుముక్కల వెంకట సూర్య సత్యనారాయణరాజు (కొండరాజు) మరియు సత్యవాణి. వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, ఐ.పోలవరం మండలం, కేశనకుర్రు గ్రామం.
విద్యార్హతల పరంగా మధు గారు కాకినాడలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, అనంతరం ఏలూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన మధు, టెక్సాస్ రాష్ట్రంలో MS (Master of Science) మరియు MBA (Master of Business Administration) పట్టాలు పొందారు.
సైబర్ సెక్యూరిటీ రంగంలో మధు గారికి విశేష అనుభవం ఉంది. ప్రముఖ అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీలు మోటరోలా (Motorola), శాంసంగ్ (Samsung) సంస్థలలో పనిచేసి విలువైన అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. ఈ రంగంలో చూపిన నైపుణ్యం, నాయకత్వ గుణాలు మధు గారిని అమెరికా ప్రభుత్వ దృష్టిలోకి తీసుకువచ్చాయి.
CISA అనేది అమెరికాలో సైబర్ ముప్పులను నివారించడంలో, ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లో మౌలిక సదుపాయాల భద్రతను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. డిప్యూటీ డైరెక్టర్ పదవి ద్వారా డాక్టర్ మధు, అమెరికా దేశ భద్రతా వ్యవస్థలో కీలక నిర్ణయాలు తీసుకునే స్థాయిలోకి ఎదిగారు.
గ్రామీణ ప్రాంతం నుంచి ప్రపంచ స్థాయిలో సైబర్ భద్రత రంగంలో నాయకుడిగా ఎదిగిన డాక్టర్ మధు ప్రస్థానం యువతకి గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది. “పట్టి, పట్టుదల ఉంటే, ప్రపంచంలో ఏ స్థాయికైనా ఎదగవచ్చు” అనే సందేశాన్ని ఆయన ప్రయాణం అందిస్తోంది.
తెలుగు వేదిక నుంచి అమెరికా వైట్‌హౌస్ స్థాయికి చేరుకున్న డాక్టర్ మధుకు విశేష అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలోని తెలుగువారి సమాజం ఈ విజయాన్ని హర్షిస్తుండగా, స్వదేశంలోని వారి గ్రామమైన కేశనకుర్రులో కూడా ఆనందం నెలకొంది.