
అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి షాక్ ఇవ్వనున్నారు. తాజా సమాచారం ప్రకారం, ట్రంప్ ఓ కొత్త పన్ను చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికాలో ఉన్న విదేశీయులు తమ స్వదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులకు డబ్బులు పంపే remittance లపై 5 శాతం పన్ను విధించే యోచనలో ఉన్నారు.
ఈ ప్రతిపాదిత చట్టం అమలులోకి వస్తే, తాత్కాలిక వీసాలతో అమెరికాలో ఉన్నవారు, ముఖ్యంగా వర్క్ వీసాలు మరియు స్టూడెంట్ వీసాలపై ఉన్న భారతీయులు తీవ్రంగా ప్రభావితమవుతారు. లక్షలాది మంది భారతీయులు ఈ మార్పుతో ఆర్థికంగా నష్టపోవలసి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే విద్యా ఖర్చులు, జీవన ఖర్చులతో ఒత్తిడిలో ఉన్న విద్యార్థులకు ఇది మరో భారం అవుతుంది. ఇదే సమయంలో తమ కుటుంబాలను ఆదుకోవడానికి అమెరికాలో నుంచి డబ్బులు పంపే వలసదారులకు ఇది గట్టి దెబ్బే.
ఈ ప్రతిపాదనపై విదేశీయుల మధ్య ఆందోళన పెరుగుతోంది. ఆర్థిక నిపుణులు ఈ విధానం వలసదారులపై నేరుగా ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ చట్టం అమలులోకి రావాలంటే ఇంకా అనేక శాసనపరమైన ప్రక్రియలు మిగిలి ఉన్నాయి.