Telugu Cinema

భారతీయ చిత్రసీమలో దార్శనిక శ్రమజీవి… సత్యజిత్ రాయ్..

సత్యజిత్ రాయ్ ( 2 మే 1921– 23 ఏప్రిల్ 1992)

భారతీయ చిత్రసీమలో దార్శనిక శ్రమజీవి… సత్యజిత్ రాయ్…., చలనచిత్రాలను సృజనాత్మకత, కళాత్మకత, వాస్తవికత దృష్టిలో ఉంచుకుని చిత్రీకరణ జరిపే దర్శకులు అతి తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో సత్యజిత్ రాయ్ ప్రముఖులు.

భారతీయ చిత్రసీమలో దార్శనిక శ్రమజీవి, పాశ్చాత్య దేశాలలో అపారమైన పేరు ప్రఖ్యాతులు ఉన్న ఏకైక భారతీయ దర్శకులు సత్యజిత్ రాయ్ గారూ. వినోదమే ప్రధానంగా భావించే ప్రపంచ సినీ లోకాన్ని ఒక పెద్ద మలుపు తిప్పిన మహా దర్శకులు వీరు.

ద్రష్టగా, కళాస్రష్టగా ప్రపంచ సినీరంగ అతిరథ, మహారథుల చేత మన్ననలు పొందిన సత్యజిత్ రాయ్ సినిమాలు అపూర్వమైన కళా కౌశలంతో బాటు, స్థూలంగా భారతీయతనూ, కథనం, శిల్పాల్లో సూటిదనాన్నీ, నిజాయితీనీ ప్రతిబింబిస్తాయి.

భారతీయ చిత్రసీమలో దార్శనిక శ్రమజీవి… సత్యజిత్ రాయ్.., సంస్కారాన్నీ, భారతీయతనూ ఒంటపట్టించుకుని ప్రపంచ స్థాయికి ఎదిగిన సత్యజిత్ రాయ్ గారు ఏ ప్రక్రియను చేపట్టినా ప్రతిభావంతంగా నిర్వహించగలిగారు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    సత్యజిత్ రాయ్ 

జననం    :   2 మే 1921

స్వస్థలం   :   కలకత్తా, భారతదేశం

తండ్రి   :   సత్యజిత్ సుకుమార్

తల్లి     :   సుప్రభ

భార్య    :   బిజోయా రాయ్ 

వృత్తి      :    చలన చిత్ర నిర్మాత, రచయత

మరణం   :  23 ఏప్రిల్ 1992, కలకత్తా

జననం…

సత్యజిత్ రాయ్ గారు 02 మే  1921 నాడు కలకత్తా లో జన్మించారు. రాయ్ గారి తాత ఉపేంద్రకిషోర్ రాయ్ చౌదరి గారు, ఒక రచయిత, తత్త్వవేత్త, ప్రచురణకర్త, బ్రహ్మ సమాజం నాయకుడు.

ఉపేంద్రకిషోర్ గారి కొడుకు సుకుమార్ బెంగాలీలో నాన్సెన్స్ కవిత్వము (అంటే యతి ప్రాసలు లేకుండా వింతగా ఉండి, నవ్వు పుట్టించే కవిత్వము) సృష్టికర్త, బాల సాహిత్యవేత్త, విమర్శకుడు. రాయ్‌ గారికి 3 సంవత్సరములు ఉన్నపుడు తన తండ్రి సుకుమార్ గారు మరణించారు.

తన తల్లి సుప్రభ గారు చిన్న ఆదాయముతో రాయ్‌ గారిని పెంచింది. సత్యజిత్ రాయ్ గారికి కళల పై ఆసక్తి ఉన్నపటికీ ప్రెసిడెన్సీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు.

తన తల్లి ప్రోద్భలముతో ఠాగూర్ కుటుంబము పై గౌరవముతో విశ్వభారతికి వెళ్ళారు. ప్రముఖ పెయింటర్లు నందలాల్ బోస్, వినోద్ బిహారీ ముఖర్జీ నుంచి ప్రాచ్య కళలు (ఓరియంటల్ ఆర్ట్) ఆభ్యసించారు.

అజంతా గుహలు, ఎల్లోరా గుహలు, ఎలిఫెంటా గుహలు దర్శించి భారతీయ కళలపై మక్కువ పెంచుకున్నారు. అక్కడే తనకు సీనియర్ గా ఇందిరా గాంధీ గారు చదివారు. ఏజెన్సీలో కమర్షియల్ ఆర్టిస్ట్ గా కొంతకాలం పనిచేశారు.

తమ తాతలు వ్రాసిన కథలను పుస్తకాలుగా ప్రచురించారు. వాటికి రాయ్ గారే ముఖపత్ర చిత్రాలుగా లిఖించారు. కొన్ని పిల్లల కథలను కూడా వ్రాశారు.

చిత్రలేఖనం పట్ల రాయ్ గారికి ఎంతటి అభిమానమో చలనచిత్రాలన్నా తనకు అంతే అభిమానం ఉండేది. దాంతో మిత్రులతో కలిసి కలకత్తా ఫిలిమ్స్ సొసైటీను స్థాపించి పలు విదేశీ చిత్రాలను చూడగలిగారు.

ఆ తర్వాత ఆరు నెలల పాటు యూరోప్ లో పర్యటించే అవకాశం లభించింది. అప్పుడు దాదాపు 99 విదేశీ చిత్రాలను చూశారు రాయ్ గారు. వాటిలో విక్టోరియా డి శిఖా రూపొందిన “బైసికిల్ థీవ్స్” తనను ఎంతగానో ఆకట్టుకుంది.

పాశ్చాత్య చిత్రాల్లోని వాస్తవికతను కట్టిపడేసింది. మన సినిమాల్లోని వాస్తవికతను ప్రతిబింపజేయాలని తాను ధృడంగా నిశ్చయించుకున్నారు.

సినీ రంగ ప్రవేశం…

నిజానికి సత్యజిత్ రాయ్ గారు ఒక చిత్రకారుడుగా తన జీవితాన్ని ప్రారంభించారు. తన కళాశాల చదువు పూర్తి చేసిన వెంటనే ఠాగూర్ విశ్వవిద్యాలయంలో తన పేరును నమోదు చేయించుకున్నారు.

కాకపోతే అంతకుముందే సంగీతం పట్ల అతనికి ఆసక్తి పెరిగింది. ఆ క్రమంలో భారతీయ, పాశ్చాత్య సాంప్రదాయ సంగీత ధోరణులు రెండింటిని ఆకలింపు చేసుకున్నాడు.

అదే సమయంలో సినిమా మాధ్యమం పట్ల శ్రద్ధ పెరిగింది. ఆలోచనలు పెరిగాయి. ఇవన్నీ కలగలిపి “పథేర్ పాంచాలి” సినిమా నిర్మాణానికి పురికొల్పేలా చేశాయి. ఆ తర్వాత అపరాజితో, అపూర్ సంసార్, కాంచన గంగ చారులత వంటి మరెన్నో కళాఖండాలు వరుస పరంపరంగా అతని చేతిలో ప్రాణం పోసుకున్నాయి.

పథేర్ పాంచాలి నవల..

ప్రముఖ బెంగాలీ నవలా రచయిత “బిబూతి భూషణ్ బెనర్జీ” గారు వ్రాసిన నవల “పథేర్ పాంచాలి” నే 1955లో సినిమాగా నిర్మించి భారతీయ చలనచిత్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టారు సత్యజత్ రాయ్ గారు.

తాను ఎంత ప్రయత్నం చేసినా చిత్ర నిర్మాణం కోసం ఎవ్వరి నుండీ ప్రోత్సాహం లభించలేదు. చివరికి రాయ్ గారు తన భార్య నగలతో సహా తన ఆస్తులు అమ్ముకుని నిర్మాణానికి దిగారు.

ఆ సినిమాలో పాత్రల కోసం నటనలో నిష్ణాతులైన నటులను కాకుండా ఏమాత్రం అనుభవం లేని వారిని ఎంచుకున్నారు. చిత్రీకరణ అంతా అవుట్ డోర్ షూటింగ్ తోనే సినిమా పూర్తి చేసి సహజత్వానికి నిలువుటద్దం పట్టారు.

అయితే ఫథేర్ పాంచాలి సినిమా పాశ్చాత్య దేశాలలో విజయ ఢంకా మ్రోగించిన తర్వాతే భారతీయ ప్రేక్షకులు దాని విశిష్టతను గుర్తించారు. బెంగాల్ లో 1930లో నెలకొన్న ఆనాటి తీవ్రమైన కరువు, నాటి దారిద్ర్యాలను సత్యజిత్ రాయ్ గారు “పథేర్ పాంచాలి” చిత్రంలో అత్యంత వాస్తవికంగా చిత్రీకరించారు.

“పథేర్ పాంచాలి” చిత్ర కథ..

“పథేర్ పాంచాలి” చిత్ర కథ విషయానికి వస్తే బెంగాల్లో ఒక కుగ్రామంలో నివసిస్తున్న ఒక పురోహితుడికి ఒక భార్య, ఒక కూతురు, ఒక బాబు ఉంటారు.

కరువు కాటకాలతో విలవిలలాడుతున్న ఆ గ్రామంలో అతనికి తన ఇల్లు గడవడమే కష్టమవుతుంది.

అందుకే కలకత్తా వెళ్లి కొన్ని డబ్బాలు సంపాదించుకుని వద్దామని వెళతాడు. నాలుగైదు మాసాలు గడిచినా అతడు పెద్దగా ఏమి సంపాదించలేక పోతాడు.

చివరికి ఒకరోజు తాను  సంపాదించిన కొంత డబ్బుతో కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుందాం అని వస్తాడు.

కానీ అప్పటిదాకా రహస్యంగా ఉంచిన తన కూతురు మరణం గురించి తెలుసుకొని కుప్పకూలిపోతాడు.

ఇక లాభం లేదనుకున్న తన భార్యను, కొడుకును తీసుకొని కలకత్తా వెళ్ళిపోతాడు. వాస్తవానికి “పథేర్ పాంచాలి” చిత్రాన్ని విషాదం గానే చిత్రీకరించాడు.

అయితే విషాదాలు జీవితాన్ని తాత్కాలిక ప్రతిష్టంభనకు గురి చేయగలవే, కానీ జీవిత చైతన్యాన్ని ఆపలేవు. జీవితం ఆనందంగా సాగిపోతూనే ఉంటుందనే సత్యాన్ని కూడా ఆయన అంతర్లీనంగా ధ్వనింప చేస్తాడు.

రాయ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అంత ఆదరణ రావడానికి ఇదే ప్రధాన కారణమైంది.

వహీదా రెహమాన్ కు దక్కిన “అభిజాన్”…

భారతీయ చిత్రసీమలో దార్శనిక శ్రమజీవి… సత్యజిత్ రాయ్.. రూపొందించిన “చారులత” చిత్రాన్ని చూసిన దర్శకులు చేతన్ ఆనంద్ గారు రాయ్ గారిని ఎంతగానో ప్రశంసించారు.

అలాగే చేతన్ ఆనంద్ గారు రూపొందించిన “హఖీకత్” చూసిన రాయ్ గారు హాలీవుడ్ స్థాయిలో రూపొందిన ఇండియన్ వార్ ఫిలిం అని కీర్తించారు.

శాంతారామ్ గారు రూపొందించిన “దునియా నా మనే”, “పడోసి”, “డాక్టర్ కోట్నిస్ కి అమర్ కహాని” చిత్రాలు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పడతాయని కొనియాడారు రాయ్ గారు.

బిమాల్ రాయ్, మహబూబ్ ఖాన్ రూపొందించిన చిత్రాలను కూడా ఆయన అభిమానించారు. వాటిలోని గొప్పతనాన్ని పదిమంది సమక్షంలో నిస్సంకోచంగా చాటారు.

“మదర్ ఇండియా” చిత్రంలో నర్గీస్ అభినయం చూసి ముగ్ధుడైన రాయ్, తన “అభిజాన్” లో ఆమెను గులాబీ పాత్రలో నటింపచేయాలని అనుకున్నారు రాయ్.

అయితే ఆ సమయంలో నర్గీస్ గర్భవతిగా ఉన్న కారణంగా ఆ పాత్రను వహీదా రెహ్మాన్ గారు దక్కించుకున్నారు.

అభిజాన్ లో తను పోషించిన గులాబీ వంటి పాత్ర మళ్ళీ తన జీవితంలో తనకు లభించలేదని వహీదా రెహమాన్ గారు పలు సందర్భాలలో చెప్పారు.

ఈ సినిమాలో ఎలా నటించారో స్క్రిప్ట్ వివరించే సమయంలోనే సత్యజిత్ రాయ్ గారు పాత్ర గురించి తెలిపారు. దాంతో నటించేటప్పుడు ఇలాంటి ఇబ్బంది పడలేదు.

అయితే ఈ చిత్రంలో నా పాత్రకు నేనే పాట పాడాలని ఆయన కోరినప్పుడు ఆశ్చర్యపోయాను. ఈ చిత్రంలో నీ పాత్రకు నీవే పాడడం న్యాయం. నాకు పాత్రధారిని స్వంత గొంతు కావాలి.

అందుకు లతా మంగేష్కర్ వంటి గాన కోకిల అవసరం లేదు అని చెప్పారు. దాంతో ధైర్యం వచ్చి పాడాను. ఆ సినిమా నాకు ఎంతో పేరు సంపాదించి పెట్టింది.

నా నుండి అంత సహజ సిద్ధమైన నటనను మరో దర్శకుడు రాకెక్కించలేకపోయారని వహీదా రెహమాన్ గారు గుర్తు చేసుకుంటారు.

అభినయాన్ని అభినందించే రాయ్…

బాలీవుడ్ లో స్క్రిప్ట్ లు తయారవుతాయి. వాటిని వ్రాయరు అని సత్యజిత్ రాయ్ గారు అనేవారు.

స్టార్స్ అనుగుణంగా హిందీ చిత్రాల కథలు తయారవుతాయని, ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నా కూడా కమర్షియల్ జిలుగులలో వారి ప్రతిభ ప్రపంచానికి తెలియకుండా పోతుందని రాయ్ గారు వాపోయేవారు.

నాటి నట త్రయం “దిలీప్ కుమార్”, “రాజ్ కపూర్”, “దేవానంద్” అంటే రాయ్ గారికి ఎంతో అభిమానం.

“దిలీప్ కుమార్” భారతదేశంలో నిజమైన “మెథడ్ ఆర్టిస్ట్”.

“గంగ జమున”, “సాగిన మహతో” చిత్రాల్లో దిలీప్ గారి అభినయం అద్భుతం. రాజ్ కపూర్ “జాగ్ తే రహో” వంటి మరిన్ని చిత్రాల్లో నటించి ఉంటే బాగుండేది.

ఇక దేవానంద్ వంటి స్టైలిస్ట్ మన దేశంలో మరొకరిని నేను చూడలేదు అని చెప్పేవారు రాయ్ గారు.

అమితాబచ్చన్ గారి అభినయం అన్నా కూడా రాయ్ గారికి ఎంతో ఇష్టం.

శశికపూర్ గారు, ఆయన భార్య జెర్నీ ఫర్ అభినయం అన్నా కూడా రాయ్ గారికి ఎంతో అభిమానం.

భారతీయ పౌరాణికాలను రూపొందించడంతో దక్షిణాది వారిదే పైచేయని రాయ్ గారు అంగీకరించారు.

ముఖ్యంగా మన తెలుగులో నందమూరి తారకరామారావు గారు నటించిన పలు పౌరాణిక చిత్రాలు, బెంగాలీలో అనువాదమయ్యి విజయవంతం అవుతున్నాయి.

అందువల్ల రాయ్ గారు పౌరాణిక చిత్రాలని దక్షిణాది వారే బాగా తీయగలరని చెప్పేవారు.

మన అందాల తార జయప్రదను భారతీయ వనితకు అసలైన ప్రతిరూపమని రాయ్ గారు కొనియాడారు.

తాను చెప్పదలచుకున్న విషయాన్ని డొంక తిరుగుడు లేకుండా ఎలా చెప్తారో తన చిత్రాలను కూడా అదేవిధంగా రూపొందించే వారు రాయ్ గారు.

కథలోని పాత్రలకు సరిపోయే నటీనటులను నేను ఎంచుకుంటాను.

అంతేకానీ ఏ రోజున కూడా నటీనటుల కోసం నేను చిత్రాలను రూపొందించలేదు అని చెప్పేవారు రాయ్ గారు.

అలాగే ఇతరుల పనితనాన్ని కూడా ఎంతగానో అభినందించేవారు రాయ్ గారు. తాను “షోలే” వంటి కమర్షియల్ క్లాసిక్ ను రూపొందించలేనని చెప్పుకొచ్చారు.

రాయ్ దర్శకత్వం వహించిన సినిమాలు..

  • పథేర్ పాంచాలి (1955)..
  • అపరాజితొ (1956)..
  • అపుర్ సంసార్ (1959)..
  • దేవి (1961)..
  • కాంచన్‌జంగ (1962)..
  • మహానగర్ (1963)..
  • చారులత (1964)..
  • చిరియాఖానా (1967)..
  • తీన్ కన్య..
  • కాపురుష్ వో మహాపురుష్..
  • గోపీ గాఁయె బాఘా బఁయె (1969)…
  • సీమబద్ధ (1971)..
  • సోనార్ కెల్లా…
  • నాయక్..
  • ఘరె బైరె (1984)..
  • అగంతక్…

మరణం…

తొలి చిత్రంతోనే సినీ వినీలాకాశంలో ధ్రువతారగా నిలిచిన గొప్ప దర్శకులు సత్యజిత్ రాయ్ గారు.

తన సినిమాకు స్క్రిప్ట్, సంగీతం అన్నీ తానే సమకూర్చుకుని ప్రతీ సినిమాపై తనదైన ముద్ర వేసిన విశిష్ట వ్యక్తులు “సత్యజిత్ రాయ్” గారు.

“పథేర్ పాంచాలి” తో బాటు మరెన్నో అపురూప కళాఖండాలు నిర్మించి, భారతీయ సినీ నిర్మాణాన్ని కొత్త పుంతలు తొక్కించిన “సత్యజిత్ రాయ్” గారు 23 ఏప్రిల్ 1992 నాడు మరణించారు.

నగరంలోనే పుట్టి, నగరంలోనే పెరిగిన “సత్యజిత్ రాయ్” గారికి గ్రామీణ జీవనం గురించి పెద్దగా తెలియదు.

అందుకే కాబోలు నగరానికి దూరంగా వెళ్లి పల్లె హృదయాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో శ్రమించారు. “వాతావరణాన్ని, జీవితాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకుంటూ పోతే చలనచిత్ర నిర్మాణం అంత క్లిష్టమవుతూ ఉంటుంది.

కాకపోతే జీవిత సత్యాలను వాస్తవాలను ఆవిష్కరించడానికి ఎంతటి కృషి చేస్తే అంతటి మానవీయ విలువలు గల గొప్ప చిత్రం తయారవుతుందని బలంగా నమ్మేవారు “సత్యజిత్ రాయ్” గారు.

సశేషం…

ప్రేక్షకుల అభిరుచులను దృష్టిలో ఉంచుకొని సినిమా తీయాల్సిన అవసరం సత్యజిత్ రాయ్ గారికి ఎప్పుడు రాలేదు. తన ఇష్టానుసరం తీస్తూ వెళుతుంటే తనకంటూ ప్రత్యేకమైన ప్రేక్షకులు తయారయ్యారు.

“ఘరైభైరె” సినిమా కలకత్తా నగరంలోనే కాదు, మామూలు గ్రామాల్లో కూడా విజయవంతంగా నడిచింది.

దీనిని బట్టి ప్రేక్షకులు రాయ్ చిత్రాలకు ఎంతగా పెరిగారో అర్థమైపోతుంది. ప్రేక్షకులు తమ నుంచి పారిపోవడానికి వ్యాపార సినిమాలు కూడా చూస్తున్నారు.

కానీ వాటితో సంతృప్తి కలగక కొత్త తరహాలో వచ్చే సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఆ విషయం ఎప్పుడూ మర్చిపోకూడదు అంటారు రాయ్.

సత్యజిత్ రాయ్ గారు తన సినిమాలన్నింటిని బెంగాల్ భాషలోనే నిర్మించారు. అందువల్ల అవి మొత్తం భారత ప్రజలకు చేరలేకపోయాయని వ్యధ రాయ్ గారిని వేధిస్తూ ఉండేది.

ఆ సంతృప్తి ఆయనను “పత్రంజ్ కీ కిలాడీ” అనే హిందీ సినిమా తీయడానికి పురి కొల్పింది.

ధైర్యం, సాహసమే ఊపిరిగా సాగిన మహా దర్శకుడి సినీ ప్రస్థానంలో అదే తన ఆఖరి సినిమా అయ్యింది.

Show More
Back to top button