ఒక కొత్త పెళ్లికూతురు, పెళ్లి కొడుకు మధుపర్కాలు కట్టుకొని ఒక ఇంటికి వెళ్లి తలుపు కొట్టారు. తలుపు తీసిన ఒక వ్యక్తికి పాదాభివందనం చేశారు ఆ దంపతులు. మమ్మల్ని దీవించు నాన్న అన్న పెళ్లికూతురు మాటలు విని నాన్న విస్తుపోయారు. నాకు, దేవుడికి, జాతకానికి నచ్చిన అబ్బాయి నీకు నచ్చలేదు నాన్నా. అయినా “నీలో ఉండే ఆత్మవిశ్వాసం, పట్టుదల, నీ కూతురినైన నాకూ అణువణువునా వంటబట్టాయి. అందుకని ధైర్యంతో స్వతంత్రించి పెళ్లి చేసుకున్న మమ్మల్ని మనసారా దీవించు నాన్నా” అంది ఆ పెళ్లికూతురు. ఆ పెళ్లి కూతురు పేరు శ్రీమతి పాలువాయి భానుమతి. పెళ్లి కొడుకు పేరు రామకృష్ణ. సరిగ్గా ఎనభై యేండ్ల క్రిందట మాట ఇది. అంటే 08 ఆగస్టు 1943 నాడు అలనాటి బహుముఖ ప్రజ్ఞాశాలి నటి భానుమతి, రామకృష్ణ ల పెళ్లిచేసుకున్న రోజు జరిగిన సంఘటన ఇది.
పాలువాయి భానుమతి కన్నా కొన్నిరోజుల ముందు ఆమె పేరు బొమ్మరాజు భానుమతి. కోకిల పాటను ఎంత బావుంటుందో బొమ్మరాజు భానుమతి పాడే పాట కూడా అంతే బావుంటుంది. ఎందుకంటే దేవుడు ఆమెకు అలాంటి వరం ఇచ్చాడు. ఆమె పాడే పాట విన్న దేశమంతా మెచ్చుకున్నారు. అది నాన్న బొమ్మరాజు వెంకటసుబ్బయ్య కల. 2013లో భారతీయ సినిమా వందేళ్ల సందర్భంగా, CNN-IBN జాబితాలో “ఆల్ టైమ్ 100 గొప్ప భారతీయ చిత్రాలలో” ఒకటిగా పేరు సంపాదించిన మల్లీశ్వరి (1951) చిత్రంలో 17 పాటలలో భానుమతి 13 గీతాలను ఆలపించారు. ఆ చిత్ర విజయంలో తన పాత్ర ఏపాటిదో మనకు అర్థమైపోతుంది. చక్రపాణి , లైలా మజ్ను , విప్రనారాయణ , మల్లీశ్వరి , బాటసారి మరియు అంతస్తులు ఇలా ఎన్నో చిత్రాలలో తన గానమాధుర్యంతో ప్రేక్షకుల హృదయాలను పరవశింపజేసిన ఘనత బొమ్మరాజు భానుమతి సొంతం.
భానుమతి బాల్యపు రోజులలో ఆడపిల్ల సినిమాలలో చేరడం అంటే “అమ్మో ఇంకేమైనా ఉందా” అని జనం విస్తుపోయేవారు. భానుమతి కూడా అలాగే అనుకునేవారు. తల్లిదండ్రుల చాటున, నాలుగు గోడల మధ్య భయ భక్తులతో పెరిగిన పిల్ల, సాంప్రదాయాన్ని, పెద్దల ఆచారాన్ని గౌరవించి, మన్నించడం నేర్చుకున్న అమ్మాయి భానుమతి. ఆమె నాన్న బొమ్మరాజు వెంకటసుబ్బయ్య సంగీత విద్వాంసులు. తనలో తాను సన్నగా మెత్తగా పాడుకునే భానుమతి కంఠంలో ఆయనకు మంచి భవిష్యత్తు కనపడింది. ఆమె పాడుతున్న కొత్తలో ఆయన కుమార్తె పాటే కాదు, “ఆ పిల్ల చాలా బాగా పాడుతుంది” అని వాళ్ళు, వీళ్ళు మెచ్చుకుంటూ అన్నమాటలను తాను స్వయంగా విన్నాక వెంకటసుబ్బయ్య కుమార్తె విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి సంగీతం చెప్పించడం మొదలుపెట్టారు. ఆమె పాట దేశమంతా వినాలని ఆయన దృఢంగా సంకల్పించారు. అలాంటి ఆ అమ్మాయి ఒకరోజు హఠాత్తుగా చెప్పకుండా పెళ్లిచేసుకుని తన కళ్ళముందు ఇలా ప్రత్యక్షమవ్వడాన్ని చూసి విస్తుబోవడం తండ్రి వంతయ్యింది.
చిత్రరంగ ప్రవేశం సంక్షిప్తంగా…
భానుమతికి చాలా పొగరు అనుకుంటారు, అంటుంటారు కూడానూ. ఆమె మీద ఆమెకున్న నమ్మకాన్ని, గౌరవాన్ని అహంకారం అనుకునేవారు. అలా అనుకునేవారికి మోసగించే మొహమాటం, వికారపు వినయం లాంటివి అభినయించడానికి ఇష్టంలేని భానుమతి నిష్కర్ష మాటలలో తలపొగరు ఉందని విమర్శించే వారికి నేను చెప్పగలిగిందేమీ లేదు అన్నదే భానుమతి సమాధానం. సరిగ్గా 1939 వ సంవత్సరంలో అనగా భానుమతికి పద్నాలుగు సంవత్సరాల వయస్సులో తాను చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వం వహించిన “వర విక్రయం” (తెలుగు) చిత్రంలో “కాళింది” పాత్రతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టారు. వరవిక్రయం సినిమాలో భానుమతిని నటింపజేసేందుకు అడగడానికి వచ్చిన దర్శకులు చిత్తజల్లు పుల్లయ్య ఆమెది “పెళ్ళికాని పిల్ల వేశమే” అని చెప్పారు వెంకటసుబ్బయ్యతో. దానికి వెంకటసుబ్బయ్య ఆలోచిస్తానన్నారు.
ఆ మరుసటి రోజు నుండి భానుమతి భవిష్యత్తు మీద వాద ప్రతివాదాలు జరిగాయి. భానుమతి అన్నయ్యలు వద్దన్నారు. శ్రేయోభిలాషులు కొందరు శ్రేయస్సు అన్నారు. మరికొందరు అప్రతిష్ట అన్నారు. ఆమె తల్లి సందేహించింది. భానుమతి నాన్న తటపటాయించారు. కానీ ఆమెకు ఎందుకనో మొదటినుండి నాన్న చెప్పినట్టు వినడం అలవాటు. అందువలన ఆమె ఏమీ మాట్లాడలేదు. అప్పటికి కూడా ఆమె తలవంచుకునే వుంది. భానుమతి అలా తలవంచుకొని ఉండటం తనకు అలవాటు. వరవిక్రయం సినిమాలో నటిస్తున్నప్పుడు కూడా అంతే. కెమెరా అంటే ఎలా ఉంటుందో కొన్నాళ్ల వరకు ఆమెకు తెలియదు. ఆమెను అందరూ అవహేళన చేసేవారు. అలా గొర్రెలా తలదించుకొని నిలబడతావేమే అనేది భానుమతి చెల్లెలు. వాళ్ళంతా ఆమెకు గొర్రె అని పేరు కూడా పెట్టారు. కానీ అది భానుమతికి నచ్చలేదు. తరువాత రోజులలో అందరూ ఆమెను పెంకిఘటం అనేవారు. అది నచ్చింది భానుమతికి. ఎందుకంటే పెంకిఘటం అనేది ఆమెకు పెట్టని ఆభరణం గనుక.
బొమ్మల పెళ్లిళ్లు చేయడం ఇష్టం..
భానుమతి తన బాల్యం నుండీ ఏనాడూ కూడా నటి అవ్వాలని అనుకోలేదు, ఆశ పడలేదు, బెంగ పెట్టుకోలేదు, దేవుళ్ళకి అస్సలు మొక్కుకోలేదు కూడా. ఆమె దేవుడికి నమస్కారం పెడతారు, కానీ ఆశ పెట్టరు. అదేవిధంగా శివున్ని చూడడానికి పనిగట్టుకొని కాశీ వెళ్లాలని పట్టింపు లేదు, కానీ ఎక్కడైనా ఎప్పుడైనా ఎవ్వరికైనా ఉంటాడు. నేను ఇక్కడ నుండే ఆయనకు నమస్కారం పెట్టగలను, భగవంతుడు కూడా ఆ నమస్కారాన్ని అందుకోగలడు అనేవారు భానుమతి. సినిమా నటి కావాలని ఉబలాటంతో ఆమె బయలుదేరలేదు. కాబట్టి అయిన రోజున అయ్యానని ఆమె మురిసిపోలేదు. గర్వంతో విర్రవీగనూ లేదు. తల్లిదండ్రులు కూడా ఆమెని తన అన్నాచెల్లెళ్ల కన్నా మిన్నగా, ప్రత్యేకంగా ఏమీ ఆమెను పెంచలేదు. అందరిలానే ఆమెను కూడా భయభక్తులతో, క్రమశిక్షణతో పెంచి పెద్దచేశారు.
అందుకే ఆమెకు అన్నాచెల్లెళ్లు, అమ్మా నాన్న, సంగీతం తప్ప మిగతా ప్రపంచమేమిటో పద్నాలుగు యేండ్ల భానుమతికి అస్సలు తెలియదు. ఆమెకి బొమ్మల పెళ్లిళ్లు చేయడమంటే భలే సరదా. తాటాకు బొమ్మలు, కొండపల్లి బొమ్మలు బోలెడు ప్రొగేసుకునేది, వాటితోనే ఆడుకునేది. చిన్నప్పుడు ఆమె ఆశలు, కనే కలలు కూడా బొమ్మల పెళ్లిళ్ళ పంధాలోనే ఉండేవి. ఎన్నో వందల “బొమ్మల పెళ్లిళ్లు” చేశారామె. ప్రతీ సంవత్సరం బొమ్మల కొలువు పెట్టేవారు. ఆమెకు బొమ్మలంటే ఎంతో ఇష్టం. ఇన్ని పనులుంటే చిన్నపిల్లలా బొమ్మలాటలు ఏమిటి భర్త రామకృష్ణ నవ్వేవారు. నిత్యం తాటాకు బొమ్మలు కడుతూ, వాటికి అలంకారాలు చేయడంలో నిమగ్నమయ్యేవారు భానుమతి. ఆమెకు మరో ధ్యాస ఉండేది కాదు. నిజానికి ఆమె ఏనాడూ తన తల్లిదండ్రుల మాట జవదాటలేదు, కాదనలేదు కూడా. ఆమె కాదన్నదల్లా ఒకే ఒక్కసారి. అది కూడా ఆమె ప్రేమ వివాహ విషయంలో.
భానుమతి పవిత్రమైన కథ…
అవి కృష్ణ ప్రేమ (1943) చిత్రం తయారవుతున్న రోజులు. అప్పుడే భానుమతి తొలిసారిగా రామకృష్ణని చూశారు. కృష్ణ ప్రేమ చిత్రానికి ఆయన సహాయ దర్శకులు. ఆయనకి ఎంతసేపూ తన పనే తన లోకం. మనిషి చాలా మంచివాడు. ఆ మాట అక్కడ అందరూ అస్తమానం చెప్పుకునేవారు. ఈ మంచివాడు మంచివాడు అనే ధృవీకరణ పదహారేళ్ల భానుమతిని ఆకర్షించింది. క్రమక్రమంగా ఆయన మీద గౌరవభావం ఏర్పడింది. దానిని ప్రేమ అనవచ్చు, అభిమానం అనవచ్చు, అనురాగం కూడా అనవచ్చు. ఏదేమైతేనేమి ఈ అమ్మాయి తనకు తెలియకుండా ఆ అబ్బాయిని ఆరాధించడం మొదలుపెట్టింది. ఈ కృష్ణ ప్రేమ సంగతి రామకృష్ణకు అస్సలు తెలియదు. ఈ విషయాన్ని భానుమతి చెల్లెలు పసిగట్టింది.
పనిగట్టుకొని ఒకనాడు భానుమతితో “అక్క ఒక్క సంగతి అడుగుతాను చెబుతావా అంది చెల్లెలు. భానుమతి అడగమంది. “నీకు తెలిసునో లేదో నాకు తెలియదు గానీ చిత్రీకరణ సమయంలో సెట్స్ మీద నువ్వెప్పుడూ ఆ అబ్బాయినే చూస్తుంటావు” అంది చెల్లెలు. ఈ మాట నిజమే అనే భానుమతికి ఈ వైనం తెలియదు. ఆ సంగతే చెల్లికి చెప్పింది భానుమతి. పోనీలే నాకు తెలుసు. నేను రోజూ చూస్తూనే ఉన్నా, దొంగ దొరికింది అంది చెల్లెలు నవ్వుతూ. భానుమతికి కూడా తనలో ఉన్న దొంగ ఆరోజునే దొరికింది. భానుమతి ఆ దొంగను ఎక్కడికీ పారిపోనివ్వలేదు. అలా అని ఆ సంగతి ఎవరికీ చెప్పనూ లేదు, రామకృష్ణకి కూడా.
ఆస్తి లేదన్న తల్లి, శరీర సౌష్ఠవం లేదన్న తండ్రి…
కానీ నిజం ఎన్నో రోజులు దాగదు. కనుక చివరికి భానుమతి ఒకరోజు అమ్మకు చెప్పారు. అమ్మ, నాన్నకు చెప్పింది. నాన్న భానుమతిని అడిగారు. దానికి ఆవిడ అవునన్నారు. అమ్మ నాన్న కాదన్నారు. అమ్మ చెప్పిన కారణం “ఆయనకి ఆస్తి లేదు”. నాన్న అభిప్రాయం “పోనీ దేహదారుడ్యం అయినా ఉండాలి” కదా అని. చిన్నపిల్ల ఆమెకు తెలీదు అన్నారు. నిజానికి పెద్దవాళ్ళంతా ఇంతే కదా. సదా సద్విచక్షన జ్ఞానం పిల్లలకు ఉంటుందని, వాళ్లకు కూడా సొంత అభిప్రాయాలు, లక్ష్యాలు ఉంటాయని చటుక్కున ఒప్పుకోరు. దాంతో చేసేదిలేక అప్పటికి భానుమతి ఊరుకున్నారు. కానీ వాళ్ల నాన్న ఊరుకోలేదు. రామకృష్ణ తల్లిదండ్రుల వద్ధ ఈ విషయం ప్రస్తావించారు. రామకృష్ణ వాళ్ళకి పెద్ద ఆస్తి ఏమీ లేదు. మా అబ్బాయి చాలా మంచివాడు, బుద్ధిమంతుడు అన్నారు రామకృష్ణ తండ్రి సగర్వంగా. జరుగుతున్న తతంగమంతా జరిగే వరకు రామకృష్ణకి ఏమీ తెలియదు. దర్శకుడిగా పని నేర్చుకుంటున్న ఆయన ఈ ప్రేమ కథకు కథానాయకుడు అన్న వైనం ఏమీ ఆయనకు తెలియదు.
భానుమతికి వేరే సంబంధాలు చూస్తామన్నారు వెంకటసుబ్బయ్య. తొలిసారిగా ఒకరి మీద గౌరవం, అభిమానం కుదిరిన తరువాత ఏ ఆడపిల్ల మనసు అయినా మారదు. అలాగే భానుమతి మనసు కూడా మారలేదు. పెద్దలనాడే జాతకాన్ని తిరగేయించినప్పుడు బహుయోగ్యుడు, సౌమ్యుడు ఆమెకు భర్త కాగలడని ఆ జాతకం ద్యోతకం చేసింది. భానుమతి చాలా ఓర్పుతో రోజులు గడపసాగింది. కృష్ణ ప్రేమ చిత్రం పూర్తవ్వడానికి రెండేళ్లు పట్టింది. ఆమె లక్ష్యం ఫలించడానికి ఎనిమిది నెలలు పట్టింది. ఈలోగా ప్రాణం విసుగెత్తింది కూడానూ. ఒక రోజున “స్టార్ కంబైన్స్” అధిపతి శ్రీరామయ్య భార్య శ్రీమతి కణ్ణామణికి ఈ సంగతి చూచాయగా తెలిసింది. దాంతో ఆమె భానుమతిని చేరదీసి లాలనగా అడిగింది. భానుమతి తన మనస్సు విప్పి చెప్పారు. ఆపైన ఆమె రామకృష్ణునికి కబురు పంపి అడిగింది. ఆయన కూడా దాపరికం లేకుండా ఈ విషయంపై సమాధానం చెప్పారు.
జార్జి టౌన్ లోని ఈశ్వర ఆలయంలో పెళ్లి…
ఆరోజు 08 ఆగస్టు 1943 ఆదివారం. కళ్యాణం వచ్చినా, కక్కు వచ్చినా ఆగదు అనేది ఆర్యోక్తి. రావలసిన కళ్యాణ ఘడియలు వచ్చాయి. అవి రావడానికి రెండు ఘడియలు ముందుగా భానుమతికి ఒక శ్రేయోభిలాషి ఇంటినుండి ఒకసారి రమ్మని కబురు వచ్చింది. అలాగే రామకృష్ణకి కూడనూ. ఇద్దరూ అక్కడికి వెళ్ళాక మీకు ఇప్పుడు పెళ్లి అన్నారు ఆ పిలుపునంపిన కుటుంబంలోని వారంతా చుట్టూ చేరి. మా నాన్నకు చెప్పాలి కదా అంది భానుమతి విస్తుబోయి. అలాగే చెబుదాం అన్నారు వారు. ఇలా హఠాత్తుగా ముహూర్తం ఏమిటి అన్నాడు రామకృష్ణ విస్తుబోయి. “అది అంతేలే ఘటన” అన్నారు వారు.
జార్జ్ టౌన్ లోని ఒక దేవాలయంలో ఈశ్వర సమక్షాన శుభ ముహూర్తాన శాస్త్రోక్తంగా, సలక్షణంగా, నిరాడంబరంగా వివాహం జరిగింది. వధువు తల్లిదండ్రులు, వరుడు తల్లిదండ్రులు మాత్రం అక్కడ లేరు. అయితే పెళ్లి అయిన ఉత్తర క్షణాన వధూవరులు మధుపర్కాలతో సరాసరి నాలుగు వీధుల అవతల ఉన్న భానుమతి ఇంటికి వెళ్లి వందనం చేశారు. “నాన్న మమ్మల్ని దీవించు” అంది భానుమతి. నీకింత పట్టుదల అయితే నేను మాత్రం ఆపేవాణ్ణా తల్లీ, కన్యాదానం అన్యులు చేయవలసి వచ్చింది” అన్నారు వెంకటసుబ్బయ్య కంటతడి పెట్టి. నాన్న “నీ పట్టుదల, నీ ఆత్మ విశ్వాసం నాలోనూ ఉన్నాయి. అందుకే ఇలా స్వతంత్రించాను దీవించు నాన్న” అన్నది భానుమతి. నాన్న వెంకటసుబ్బయ్య మనసారా దీవించారు.
మాంబలం లో అద్దె ఇంటిలో నివాసం..
పెళ్లి అయిన నాటికి భానుమతి “గరుడ గర్వభంగం” (1943) చిత్రంలో నటిస్తున్నారు. పెళ్లి తరువాత ఆమె కొంతకాలం చిత్రసీమ నుండి విరమించుకున్నారు. మాంబలంలో బొమ్మరిల్లు లాంటి చక్కని ఇల్లు 15 రూపాయల బాడుగకు తీసుకుని ఆ నవ దంపతులు కాపురం పెట్టారు. భానుమతి మహాభారతం, రామాయణం, భాగవతాలు చదువుకున్నారు. సాంప్రదాయాలను గౌరవిస్తారు, మన్నిస్తారు కూడనూ. శాస్త్రీయ సంగీతం అంటే ఆమెకు విపరీతమైన అభిమానం, గౌరవం. తాను తీసే ప్రతీ చిత్రంలోనూ శాస్త్రీయ సంగీతానికి స్థానం ఉంటుందని, తాను ఒక్క కీర్తన అయినా పాడుతానని ఒకప్పుడు వాళ్ళ నాన్నగారికి భానుమతి మాట ఇచ్చారు. ఇతరుల చిత్రాలలో తాను పాల్గొన్నప్పుడు ఈ మాట నిలబెట్టుకోలేక పోయినా, తను నిర్మించే ప్రతీ చిత్రంలోనూ సాంప్రదాయానుగుణమైన సంగీతం ఉంటుంది. ఖచ్చితంగా ఆమె ఒక కీర్తనని గానీ, వర్ణం గానీ పాడుతారు.
హాస్యరస ప్రధానమైన చిత్రం “చక్రపాణి” చిత్రంలో ప్రారంభ సంగీతం కదన కుతూహల రాగంలోని కీర్తన “రఘువంశ సుధాంబుధి” ఆలపించారు. కళారాధకురాలిగా ఆమె స్వేచ్ఛనీ, ప్రశంసనీ అపేక్షిస్తారు. ఈ సంగతి తనకు తానుగా చెబుతారు. వీటివల్ల మనసుకి ఆనందం ఉత్సాహం కలుగుతాయి అని అంటుంటారు. పక్షి రాజా వారి “అగ్గి రాముడు”, మలై కళ్లన్” చిత్రాలు తయారవుతున్న సమయంలో అవసరాన్ని బట్టి భానుమతి ఒక నిమిషం కాలం, ఒక అడుగు సెల్యులాయిడ్ వృధాగా పోకుండా సరిగ్గా ఇరవై నాలుగు గంటలలో ఆరు పాటలు రికార్డు చేశారు. నేను పాడడానికి, నటించడానికి ప్రత్యేకంగా కష్టపడే ప్రయత్నం ఏమి చేయను. నా కృషి ఫలితం బాగుంటుందని నా మీద నాకు నమ్మకం ఉంది అంటూనే, “మా నాన్న గారు ఒకరోజున పెట్టిన విద్యాభిక్ష, ఆ రోజున ఆయన దీవెన నా పురోభివృద్ధికి పునాదిరాళ్లు” అని ఘంటాపథంగా చెప్పేవారు భానుమతి.