యుద్ధం చేసే సత్తా లేని వాడికి, శాంతి అడిగే హక్కు లేదు”. ఇది అరవింద సమేత వీర రాఘవ సినిమాలోని ఎన్టీఆర్ సంభాషణ. తన జీవితంలో ఎన్నో సమస్యలతో యుద్ధం చేస్తున్నాడు ఎన్టీఆర్. 26 మార్చి 2009 కారు ప్రమాదం. చావుతో యుద్ధం చేశారు. మృత్యువు కోరలోనుండి బయటపడ్డారు. వరుసగా సినిమా పరాజయాలతో యుద్ధం చేశారు. మళ్ళీ విజయాలతో తనను తాను నిరూపించుకున్నారు. నిజానికి దుఃఖం మనిషిని ఎడారిలో నిలబెడుతుంది. మనసంతా పొడిపొడిగా అనిపిస్తుంది. ముట్టుకుంటే పగిలిపోతుందేమో అనుకున్నంతగా హృదయం సున్నితం అయిపోతుంది. ఎన్టీఆర్ గారి నాన్న గారు కారు ప్రమాదంలో మరణించారు. అది ఎన్టీఆర్ జీవితంలో కోలుకోలేని దెబ్బ. తన నాన్న దూరమైన విషాదంతో యుద్ధం చేశారు. కష్టం ఒక తీవ్రమైన తీరని దాహం. ఆ దాహం కన్నీరే తీర్చగలదు. బంధాల్లో పంచుకున్న ఉప్పే, బాధలోని ఉప్పెనని సమసి పోయేలాగా చేయగలదు. అవును కన్నీరు కూడా నీరే, జీవనతృష్ణకు పన్నీరే. అందుకే తన కుటుంబం ఇచ్చిన ఓదార్పులో, తన భాగస్వామి చూపిన ప్రేమలో శాంతిని వెతుక్కుంటున్నారు. తన ఇద్దరి పిల్లల నవ్వుల్లో శాంతిని వెతుక్కుంటున్నారు తారక్. ఎనర్జీ కి చిరునామా లాంటి ఎన్టీఆర్ కష్టంలో తనని తాను మలుచుకుంటున్నారు.
కథానాయకుడికి ఒక్కసారి స్టార్ ఇమేజ్ వచ్చిందంటే ఇక అంతే. అదే ప్రముఖంగా కనిపిస్తూ ఉంటుంది. ఆయనలోని నటుడు బయటికి కనిపించడం చాలా తక్కువ. కానీ అగ్ర కథానాయకులు జూనియర్ ఎన్టీఆర్ అందుకు భిన్నం. ఆయన లోనే స్టార్, ఆయన లోని నటుడు ఇద్దరూ పరస్పరం పోటీ పడుతూ ఉంటారు. ఏ పాత్రను అప్పజెప్పినా సరే, అలవోకగా చేసేసి “ఎనీ డౌట్” అంటూ సత్తా చాటుతుంటారు. జూనియర్ ఎన్.టి.ఆర్ గా పేరు పొందిన నందమూరి తారక్ సుప్రసిద్ధ తెలుగు అగ్ర కథనాయకులు. జూనియర్ ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు) అదే పేరు గల సుప్రసిద్ధ తెలుగు సినిమా నటులు, రాజకీయ నాయకులు, దివంగత ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు గారి మనుమడుగా అందరికీ సుపరిచితుడే. అత్యధిక పారితోషికం తీసుకునే తెలుగు చలనచిత్ర నటులలో ఎన్టీఆర్ ఒకరు. ఆయన రెండు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు, రెండు రాష్ట్ర నంది పురస్కారాలు మరియు నాలుగు సినీ “మా” పురస్కారాలతో సహా అనేక ఇతర పురస్కారాలను, ప్రశంసలను గెలుచుకున్నారు . 2012 నుండి, అతను ఫోర్బ్స్ ఇండియా యొక్క 100 ప్రముఖుల జాబితాలో ఉన్నారు.
ఒక గుండ్రటి రబ్బరు బంతిని గోడకేసి బలంగా కొడితే ఏమవుతుంది? అది అంతే వేగంతో వెనక్కి తిరిగి వస్తుంది. ఎన్టీఆర్ కూడా అంతే. అప్పుడప్పుడు తనకు ఎదురైన పరాజయాలకు ఆయన ధీటుగా విజయంతో సమాధానం ఇస్తుంటాడు. “టెంపర్” కి ముందు వరుసగా ఎన్టీఆర్ కు అన్నీ పరాజయాలే. అయినా సరే ఎక్కడా కొంచెం కూడా వెనక్కి తగ్గలేదు. అభిమానులకు నచ్చేవరకు నిజాయితీగా పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఆ పోరాటం ఫలించింది. ఇప్పుడు ఆయన మళ్లీ వరుస విజయాల సింహాసనంపై కూర్చున్నారు. ఈ ప్రయాణంలో నటుడిగా ఎంత పరిణితి చెందారో, వ్యక్తిగా అంతకంటే ఎక్కువ పరిణితి చెందారు. వ్యక్తిగత జీవితాన్ని, సినీ ప్రస్థానాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. నాన్న హరికృష్ణ గారు మరణించడానికి కొన్ని రోజుల ముందు ఎన్టీఆర్ గారికి ఫోన్ చేసి “పలావ్” తినాలని ఉందిరా వండి పంపించరా అని అడిగారు. ఆ రోజు చిత్రీకరణ నుండి ఇంటికి రాగానే స్వయంగా “పలావ్” వండి నాన్నకు పంపించారు ఎన్టీఆర్. ఏదో జరుగుతుందని హరికృష్ణ గారికి ముందే తెలిసిందో ఏమో? ఆ తరువాత కొద్ది రోజులకే కారు ప్రమాదంలో మరణించారు. తన తండ్రి మరణంతో కడివెడు దుఃఖాన్ని కడుపులో దాచుకొని, కొత్త కాంతిని కళ్ళల్లోకి తెచ్చుకొని, రేయింబవళ్లు చేసిన సినిమాలను భుజానికి ఎత్తుకొని ఫలితం కన్నా సినిమా ప్రస్థానాన్నే ఎక్కువగా ఆస్వాదిస్తుంటారు ఎన్టీఆర్.
నేపథ్యం…
జూనియర్ ఎన్టీఆర్ గారు 20 మే 1983 నాడు హైదరాబాదులో జన్మించారు. వీరి తండ్రి నందమూరి హరికృష్ణ, తల్లి షాలిని భాస్కర్ రావు. వీరి తాతగారు దివంగత ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారకరామారావు గారు. ఎన్టీఆర్ గారు హైదరాబాదులో జన్మించారు, హైదరాబాదులోనే పెరిగారు. తాను మాములుగానే అల్లరివాడు. చిన్నప్పుడు తన అల్లరి మామూలుగా ఉండేది కాదు. ఏకోశానా కూడా తనకు ఒక మంచి బాలుడు అని పిలిపించుకోవడం అస్సలు ఇష్టముండేది కాదు. తాను కూడా ఇష్టం లేనట్టు ప్రవర్తించే వారు. తన పాఠశాల మిత్రులు, తన క్రికెట్ మిత్రులతో తరుచూ గొడవలు పడుతుండేవారు. బడి ఎగ్గొట్టి సినిమాలు, షికారులు చేస్తుండేవారు. తనకు కాలు ఒకచోట నిలబడేది కాదు. అందుకే వాళ్ళ అమ్మ షాలిని చేత ప్రతీ రోజు చావు దెబ్బలు తినేవారు. మాములుగానే ఆడవాళ్లు సున్నిత మనస్కులు అంటుంటారు. కానీ ఎన్టీఆర్ గారి తల్లి ఆయన అల్లరిని భరించలేక తనముందు శివతాండవం చేసేవారు. అల్లరి చేస్తే మామూలుగా కొట్టేది కాదు. చేతికి ఏది దొరికితే దానితో ఆయనకు బడితెపూజనే.
ఇలాగే ఒకసారి అమ్మను బాగా విసిగించాడు ఎన్టీఆర్. దాంతో బెల్ట్ తీసుకొని తెగ కొట్టింది. అప్పటికీ ఆమె కోపం చల్లారలేదు. దాంతో హ్యాంగర్ పట్టుకొని బాదింది. ఆ దెబ్బలను తాళలేని ఎన్టీఆర్ గోడ దూకి ప్రక్కనే ఉన్న గుళ్లో దాక్కున్నారు. అందులోంచి బయటికి వచ్చేవరకు ఎదురుచూసి బయటకు వచ్చాక మళ్ళీ కొట్టింది. కొద్దిసేపయ్యాక ఒంటికి మందు రాసి భోరుభోరున ఏడ్చేసింది. ఆయనంటే అంత ప్రాణం వాళ్ళ అమ్మకు. అలాగని గారాబం చేసేది కాదు. వాస్తవంలో బ్రతకడం ఎలాగో ఆయనకు అమ్మే నేర్పింది. ఇలా నడుచుకోవాలి. ఇది మన పరిస్థితి. ఇలా చేయాలి అంటూ ఆయనకు తొలి గురువుగా మారిపోయింది. తనలో విపరీతమైన ఆత్మ విశ్వాసం నింపేది. జీవితంలో ఏదో ఒకటి చేసేయ్, నిన్ను నీవు నిరూపించుకో లేదంటే మనుగడ కష్టం అంటూ ఆమె హితబోధ చేసేవారు. ఆ మాటలు ఆయనకు బాగా పనిచేశాయి. కాకపోతే చిన్న వయస్సు కాబట్టి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు, ఏం చేస్తే తనను తాను నిరూపించుకోగలడో తనకు అర్థమయ్యే వయస్సు ఎన్టీఆర్ ది కాదు. ఒకరకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ కి వాళ్ళ అమ్మ గారే తనకు బలం, బలగం అన్నీ కూడా.
విద్యాభ్యాసం…
ఎన్టీఆర్ గారి ప్రాథమిక విద్య విద్యారణ్య పాఠశాల లోనే జరిగింది. వాళ్ళ నాన్నగారు హరికృష్ణ గారు “అందరితో పాటే మావాడు కూడానూ. మా అబ్బాయి కదా అని ప్రత్యేకంగా చూడకండి” అని యాజమాన్యానికి హుకుం జారీచేశారు. దాంతో ఆ బడిలో అందరి పిల్లలలానే తాను కూడా ఒకడిగానే ఉండేవారు. ఆ పాఠశాల వాతావరణం చాలా బావుండేది. అక్కడ విద్యార్థులను చాలా బాగా తీర్చిదిద్దేవారు. అక్కడ చదువుకున్న విద్యార్థులకు అద్భుతమైన నైపుణ్యాలు వంటబట్టేవి. చదువు చాలా చక్కగా చెప్పేవారు. బట్టీ పట్టే చదువులు ఆ పాఠశాలలో వుండేవి కాదు. ఉపాధ్యాయులు కూడా చాలా మంచివారు. ఎన్టీఆర్ బాగానే చదివేవాడు. పాఠశాలలో మొదటి ర్యాంకు వచ్చేది కాదు. అలాగని ఆత్తెసరు మార్కులతో పాసయ్యేవారు కాదు. బాగానే చదివి పరవాలేదు అనిపించేవారు.
భౌగోలికశాస్త్రం అంటే ఎక్కువగా ఇష్టపడేవారు ఎన్టీఆర్. రకరకాల బొమ్మలకు రంగులు వేయడం తనకు ఆసక్తికరంగా అనిపించేది. అప్పటి నుండే ప్రకృతిని ఆరాధించడం మొదలైంది. తన చుట్టూ వాతావరణం పచ్చగా ఉంటే తనకు విపరీతంగా నచ్చుతుంది. తన అల్లరి చేష్టలవలననే తనకు ఎక్కువమంది స్నేహితులు ఉండేవారు. ఇప్పటికీ తన పాఠశాల మిత్రులతో తనకు స్నేహం కొనసాగుతూ వస్తుంది. అక్కడనుండి కొన్నాళ్లు బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు. తనకు ఆ పాఠశాలలో ఉండబుద్ధయ్యేది కాదు. ఆ పాఠశాలలో నుండి ఎలాగోలా బయటపడాలని పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇంటిమీద బెంగతో ఎలాగైనా ఇంటికి వెళ్లాలని కావాలనే తన కాలు విరగొట్టుకున్నారు. అలాగైనా ఇంటికి పంపిస్తారని తన అభిప్రాయం. కానీ ఆ కాలికి కట్టు కట్టి బోర్డింగ్ స్కూల్ లోనే వుంచారు తప్ప ఇంటికి పంపించలేదు.
ఇంటర్మీడియట్ తో చదువుకు స్వస్తి…
సినిమాలో తన నృత్యంతో అదరగొట్టే ఎన్టీఆర్ గారు వాళ్ళ అమ్మ గారి ప్రోద్భలంతోనే తాను సుధాకర్ మాస్టారు దగ్గర కూచిపూడి నేర్చుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు ఏళ్ల సాధన. దేశవ్యాప్తంగా వందలాది నృత్య ప్రదర్శనలు కూడా ఇచ్చారు ఎన్టీఆర్. వేదిక మీద నృత్యం చేస్తే, ఆ అనుభవంతో సినిమాలలో నటించేటప్పుడు కెమెరా భయం ఉండదు అన్నది వారి నమ్మకం. అందుకే వీలైనంత నృత్య ప్రదర్శనలలో పాల్గొన్న ఎన్టీఆర్ గారికి నిజంగానే ఆ అనుభవం తరువాత రోజులలో చాలా ఉపయోగపడింది. ఆయన ఇంటర్మీడియట్ తరువాత తన చదువును కొనసాగించలేదు. అల్లరిచేస్తూ, ఆటలాడుతూ ఉండే ఎన్టీఆర్ గారికి సినిమాలు చూడడం కూడా బాగా అలవాటు ఉండేది. మాములుగానే వాళ్ళది సినిమా కుటుంబం. వాళ్ళ తాతగారు నందమూరి తారకరామారావు గారు, వాళ్ళ బాబాయి బాలకృష్ణ గారు ఇలా సినిమా వాతావరణంతో తన కుటుంబానికి అనుబంధం ఉండడం వలన తనకు కూడా సినిమాలు చూడడం అలవాటయ్యింది.
బాలకృష్ణ గారి రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా విడుదలైన రోజులవి. సంధ్య సినిమా థియేటర్ లో తొలిరోజు “రౌడీ ఇన్స్పెక్టర్” సినిమా మొదటి ఆట వేస్తున్నారు. విడుదల రోజు అయ్యేసరికి ఎన్టీఆర్ కు టికెట్ దొరకలేదు. దాంతో తాను థియేటరు యాజమాన్యంతో గొడవకు దిగారు. తాను ఈ సినిమా చూస్తే గానీ ఇంటికి వెళ్ళేది లేదని తెగేసి చెప్పారు ఎన్టీఆర్. దాంతో హరికృష్ణ గారు థియేటర్ యాజమాన్యంకు ఫోన్ చేసి “వాడికి ప్రత్యేకంగా ఒక కుర్చీ వేసి ఆ సినిమా చూపించండి” అన్నారు. దాంతో ఎన్టీఆర్ గారికి ప్రత్యేకంగా ఒక కుర్చీ వేసి “రౌడీ ఇన్స్పెక్టర్” సినిమా చూపించారు. అలాగే మరోసారి టికెట్ దొరక్క ప్రొజెక్టర్ రూమ్ లో కూర్చుని సినిమా చూశారు. నిజానికి ప్రేక్షకుల మధ్య ఆ గోలను ఆస్వాదిస్తూ సినిమా చూడడం ఎవ్వరికైనా భలే కిక్కు అనిపిస్తుంది. కానీ ఎన్టీఆర్ గారు ఇప్పుడు అగ్రనటులు. తాను ఎప్పుడైనా సినిమా చూద్దామని థియేటర్ కు వెళ్తే అందరూ సినిమా చూడడం ఆపేసి తననే చూస్తుంటారు. వాళ్ళు సినిమా చూడరు. అందుకే ఎన్టీఆర్ గారు థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు.
ఎన్టీఆర్ గా పేరు మార్చిన తాత నందమూరి తారకరామారావు..
ఎన్టీఆర్ గారు తన పదకొండవ సంవత్సరంలో ఉన్నప్పుడు ఒంట్లో బాగాలేదు. తెల్లవారినా అలాగే పడుకున్నారు. పొద్దున్నే ఇంకా మంచం దిగలేదు. తన గదిలోకి వచ్చి అమ్మ తట్టి లేపింది. ఓపికలేని ఎన్టీఆర్ అంత పొద్దున్నే నిద్ర లేపినందుకు వాళ్ళ అమ్మను విసుకున్నారు. “తాతగారు నిన్ను రమ్మంటున్నారు” అంది అమ్మ. ఆయనకు ఏమీ అర్థం కాలేదు. తాతగారు ఏంటి, నన్ను పిలవడం ఏంటి అనుకున్నారు. నిజానికి తనకు తాతయ్య అంటే దైవంతో సమానం. కానీ అప్పటివరకు తన తాతగారిని ప్రత్యక్షంగా చూసింది లేదు. ఆయన గురించి తెలుసుకోవడమే తప్ప కలుసుకున్నది లేదు. తాతయ్య నిన్ను చూడాలంట అంటూ అప్పటికప్పుడు స్నానం చేయించి ముస్తాబు చేయించి పంపించింది. ఎవరో తీసుకెళ్లి ఆయన గది ముందు వదిలిపెట్టారు.
అప్పుడే తలుపు చాటు నుంచి తాతయ్యని మొదటిసారిగా చూశారు ఎన్టీఆర్ గారు. మనవడిని చూసిన తాతయ్య “ఇటు రండి” అని ఎన్టీఆర్ ను గంభీరంగా పిలిచారు. ఆ సమయంలో ఎన్టీఆర్ కు భయం, ఆశ్చర్యం, ఆనందం అన్నీ ఒకేసారి కలిగాయి. నీ పేరేంటి అని అడిగాడు తాతగారు. అదే జూనియర్ ఎన్టీఆర్ తో సీనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన తొలిమాట. అప్పుడు “తారక్ రామ్” అన్నారు జూనియర్ ఎన్టీఆర్. వెంటనే వాళ్ళ నాన్నగారిని పిలిచి పేరు మార్చండి “నందమూరి తారక రామారావు” అని పెట్టండి అంటూ ఆజ్ఞ లాంటిది వేశారు తాత నందమూరి తారకరామారావు గారు. అప్పటినుంచి తారక రామ్ పేరు కాస్త “ఎన్టీఆర్” అయిపోయింది. ఆ క్షణం నుండి మనుమడు ఎన్టీఆర్ తన తాత నందమూరి తారకరామారావు గారి చేయి వదలలేదు. ఆయన కూడా మనవడిని వదిలి ఉండేవారు కాదు.
తాతగారే తన తొలి దర్శకులు..
విచిత్రం ఏమిటంటే మనవడిని తాత అని పిలిచేవారు నందమూరి తారకరామారావు గారు. అప్పటికే ఎన్టీఆర్ కాస్త బొడ్డుగా ఉండేవారు. నెయ్యి అంటే ఇష్టం లేని ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ నెయ్యి కలిపి నోట్లో ముద్ద పెడితే కక్కేసేవారు. కానీ తన తాతగారు మాత్రం ఇడ్లీని నేతిలో ముంచి తినండి అనేవారు. దాంతో నెయ్యితో భోజనం తప్పనిసరి అయ్యింది. అలా తాతగారు ఇంకా తనను బొద్దుగా మార్చేశారు. అప్పటినుంచి తాతయ్య భోజన అలవాట్లు అన్నీ తనకు వచ్చేశాయి. అందువలన రోజురోజుకీ లావైపోయేవారు.
ఒకసారి నందమూరి తారకరామారావు గారు “మేజర్ చంద్రకాంత్” చిత్రీకరణ జరుగుతుండగా ఎన్టీఆర్ గారు అక్కడికి వెళ్లారు. అప్పట్లో తాత రామారావు గారి వద్ద ముత్తు అనే మేకప్ మాన్ ఉండేవారు. ఆయన్ని పిలిచి మా తాతకు మేకప్ చేయండి అన్నారు. అరగంటలో ఎన్టీఆర్ ను మేకప్ వేసి తయారుచేశారు. అద్దంలో చూసుకున్న ఎన్టీఆర్ కు ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. మేకప్ అయ్యాక తాత గారి దగ్గరికి వచ్చిన ఎన్టీఆర్ తో “బ్రహ్మర్షి విశ్వామిత్ర” చిత్రాన్ని తీస్తున్నాం. అందులో భరతుడు మీరే అన్నారు ఎన్టీఆర్ తో. నేనేంటి సినిమాలో నటించడమేమిటి అనుకున్నారు ఆయన. కానీ తాతగారు చెప్పారు కదా. దాంతో ఆ సినిమాలో నటించారు. అలా నటలో ఎన్టీఆర్ కు తొలి ఓనమాలు నేర్పించారు తాత నందమూరి తారకరామారావు గారు. అలా ఎన్టీఆర్ ను తొలిసారి దర్శకత్వం వహించిన దర్శకుడు, తనను చిత్రసీమకు బాలనటుడిగా పరిచయం చేసి, ఈరోజు అగ్రనటుడిగా వెలుగొందడానికి దారి పరిచిన దార్శనికుడు కూడా తాత రామారావు గారే.
బాలల రామాయణం..
ఎన్టీఆర్ గారికి నటన అనేది వారసత్వంగా వచ్చిందే. కనుక ఏరోజూ కూడా నటనలో ప్రత్యేకమైన శిక్షణ ఏది తీసుకోలేదు. నందమూరి అనే నటనాలయంలో నందమూరి తారకరామారావు అనే ప్రధానాచార్యుల వద్ద నటన నేర్చుకున్న తరువాత మరో మాస్టారు అవసరం లేకపోయింది. అందువలన అప్పటినుంచి ఇప్పటిదాకా ఆయన పేరే ఎన్టీఆర్ తారకమంత్రంగా భావిస్తూ వచ్చారు. “బహ్మర్షి విశ్వామిత్ర” తరువాత తనకు “బాలల రామాయణం” సినిమా నిజంగా ఒక గొప్ప అనుభవం. కెమెరా అంటే ఏమిటో, నటన అంటే ఏమిటో తెలియని పిల్లలతో తీర్చిదిద్దిన ఒక అద్భుతం ఆ “బాలల రామాయణం”. సినిమాను దర్శకులు గుణశేఖర్ గారు చిత్రీకరించగా మల్లెమాల సుందర రామిరెడ్డి గారు దీనిని నిర్మించారు. సినిమా చూస్తుంటే బావుంది అనిపిస్తుంది. కానీ చిత్రీకరణ సమయంలో పిల్లలు వేసిన కోతి వేషాలకు అంతులేదనే చెప్పాలి. ఇలా సినిమాలు తీస్తూ పోతూ ఉంటే చదువుకు ఇబ్బంది అవుతుంది అని రామాయణం తరువాత సినిమాలను ఆపివేశారు ఎన్టీఆర్ గారు.
స్నేహితులు…
ఇరవై సంవత్సరాల వయస్సు అంటే యుక్త వయస్సు, నూనూగు మీసాలు కూడా వయస్సు అది. ఆ వయస్సులో ఎవరైనా ఆడుతూ పాడుతూ గడుపుతుంటారు. స్నేహితులతో పిచ్చాపాటి కబుర్లు, పబ్ లు, ప్రేమకథలు. ఇలా గడిచిపోవాల్సిన వయస్సులో ఎన్టీఆర్ గారు మాత్రం సినిమా హీరోగా స్టార్ డమ్, విజయాలు, అభిమానులు వీటి చుట్టూరా తిరిగే తన యవ్వనం. కానీ యవ్వనాన్ని కోల్పోతున్నానని ఎన్టీఆర్ గారు ఏనాడూ అనుకోలేదు. ఎందుకంటే సినిమాలలో అవకాశాల కోసం ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి అవకాశం రావడమే అరుదుగా భావించి తనకు తానే సర్దిచెప్పుకునేవారు. తాను తన స్నేహితులతో “నేను మీకంటే ముందు జీవితంలో స్థిరపడిపోయాను చూడండి” అంటూ నా స్నేహితులతో అని చెప్పేవారు. ఎన్టీఆర్ గారికి చాలా మంది స్నేహితులు ఉన్నారు.
తనకు దొరికిన అద్భుతమైన వరం తన స్నేహితులు. స్నేహాల్, లవ్ రాజ్, రాజీవ్ కనకాల ఇలా చాలా మంది స్నేహితులు ఉన్నారు. హీరో ఎన్టీఆర్ లా కాకుండా తారక్ లా తనను చూస్తారు. స్నేహాల్ తిడతాడు, కొడతాడు కూడా. వృత్తిగత జీవితం, వ్యక్తిగత జీవితం రెండు వేరు. వాటిని కలపడానికి ఎన్టీఆర్ గారు ఏరోజూ ఇష్టపడేవారు కాదు. ఎప్పుడైనా స్నేహితులను కలిసినప్పుడు పని గురించి ఎక్కువగా మాట్లాడేవారు కాదు. స్నేహితులతో కలిస్తే ఆ సందడే వేరుగా ఉంటుంది. వారితో కలిసి ఇంట్లోనే క్రికెట్ ఆడుకుంటారు. ఎప్పుడూ ముందుగా తానే బ్యాటింగ్ చేసే ఎన్టీఆర్ గారు తాను అవుట్ అయితే ఒప్పుకునేవారు కాదు. రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లతో ఎప్పుడూ సరదాగానే ఉంటారు ఎన్టీఆర్ గారు. ఇక అందరికంటే ఎక్కువగా మంచు మనోజ్ తో స్నేహంగా ఉంటాడు. ఎన్టీఆర్, మంచు మనోజ్ ఇద్దరూ ఒకేరోజు జన్మించారు. కాకపోతే మనోజ్ కంటే అయిదు గంటల ముందు పుట్టారు ఎన్టీఆర్. అందువలన మంచు మనోజ్ ఎన్టీఆర్ ని అన్నయ్య అని, బాబాయ్ అని పిలుస్తుంటాడు. మనోజ్ అల్లరి మాములుగా ఉండదు. తన అల్లరి వంద కోతులతో సమానం అంటారు ఎన్టీఆర్.
2009 కారు ప్రమాదం…
పొద్దున్నే ఏ టిఫిన్ చేయాలి అని ఎన్టీఆర్ గారిని వాళ్ళ అమ్మ అడిగేవారు. దానికి సమాధానంగా పొద్దున్నే లేవాలి కదా అమ్మా. ఎవరికి తెలుసు? ఇదే చివరి నిద్రనేమో అనేవారు. తన సిద్ధాంతం వినడానికి కొత్తగా వింతగా ఉంటుంది. ఇదేంటి ఆయన ఇలా కూడా ఆలోచిస్తాడా అని అనిపిస్తుంది. తన ఆలోచనలు ఇలాగే ఉంటాయి. మనం ఆశ అనే ఓ చిన్న రేఖ పై బ్రతుకుతున్నాము. ఏమో ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఈ చిన్న జీవితంలో ఇన్ని గొడవలు ఎందుకు? నా కోరిక ఒక్కటే చనిపోయే ముందు ఒక్క క్షణం కూడా గిల్టీగా భావించకూడదు. చావు వచ్చిందా, తీసుకెళ్లి పోయేలా ఉండాలి. అంతే తప్ప ఒక్కరోజు బతికితే అది చేసే వాడిని కదా, ఇది చేసే వాడిని కదా అనుకోకూడదు. అంత పరిపూర్ణ జీవితం అనుభవించాలి. అప్పుడు చావుని ఆహ్వానించాలి అనే సిద్ధాంతాన్ని చెబుతారు ఎన్టీఆర్ గారు. దానికి కూడా ఒక కారణం ఉంది. అదే 2009 లో తనకు జరిగిన కారు ప్రమాదం.
26 మార్చి 2009 నాడు జరిగిన కారు ప్రమాదం తన ఆలోచనలను పూర్తిగా మార్చేశాయి. ఆ క్షణాలు ఇంకా తనకు కళ్లముందే కదలాడుతున్నాయి అంటారు. “కన్నుమూసి తెరిచేలోగా ప్రమాదం జరిగిపోయింది. ఎక్కడెక్కడ ఎన్ని ఎముకలు విరిగాయో నాకు స్పష్టంగా తెలిసిపోయింది. ఒళ్లంతా రక్తం. నన్ను సూర్యాపేట ఆసుపత్రికి తీసుకెళ్తుంటే నా జీవితం అంతా నా కళ్ళ ముందు కదిలింది. నా సినిమాలు, అమ్మ, అభిమానులు, నా వస్తువులు, చివరికి నేను పెంచుకున్న కుక్కపిల్ల, అన్నీ ఏంటి? జీవితం అయిపోయిందా అనిపించింది. అమ్మ దీవెనలు, అభిమానుల ఆశీర్వాదం, తాతయ్య ఆశీస్సులతో బ్రతికి బట్టకట్టగలిగా. ఆరోజు రెండోసారి పుట్టాను”.
అని ఆ కారు ప్రమాదం తరువాత ఎన్టీఆర్ గారు చెప్పుకొచ్చారు.
కుటుంబం…
అదే రోజు అంటే 26 మార్చి నాడు ఎన్టీఆర్ గారి శ్రీమతి “లక్ష్మీ ప్రణతి” పుట్టింది కూడా అదే రోజు. అందుకే ప్రతీ ఏడాది వాళ్ళింట్లో 26 మార్చి నాడు రెండు పుట్టినరోజులు జరుగుతాయి. ఆ ప్రమాదం ఎన్టీఆర్ గారిలో చాలా మార్పు తీసుకువచ్చింది. తన జీవితంపై దృక్పథం మారింది. బాధలో ఉన్నప్పుడు కూడా నవ్వడం నేర్చుకున్నారు. తన శ్రీమతి లక్ష్మీ ప్రణతి జీవితంలోకి వచ్చాక తనలోనుంచి కొత్త ఎన్టీఆర్ బయటకు వచ్చాడు. వేగం తగ్గి ఆలోచన పెరిగింది. తనకంటూ ఇంట్లో భార్య ఉంది. అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. “పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయింపబడతాయి అంటారు. నిజంగానే లక్ష్మీ ప్రణతి నాకు దేవుడు పంపిన వరంలా దొరికింది. పెళ్లికి ముందు తనని కలిసింది లేదు, మాట్లాడింది లేదు. కానీ చూడగానే నా కోసమే పుట్టింది అనిపించింది” అని అంటారు ఎన్టీఆర్.
సినీ పరిశ్రమలో పుకార్లు అనేవి సర్వసాధారణం. అలాగే ఎన్టీఆర్ గారిపై కూడా రకరకాల పుకార్లు వచ్చాయి. వాటిని గురించి తన భార్యకు స్పష్టంగా చెప్పేవారు ఎన్టీఆర్. నా పరిస్థితి ఇది, చుట్టూ ఇలాంటి మనషులు ఉంటారు అంటూ అన్నీ పూసగుచ్చినట్టు వివరించేవారు. అందుకే వారిద్దరి మధ్య ఎప్పుడూ ఎలాంటి సందేహాలకు, అనుమానాలకు తావుండేది కాదు. ప్రణతి కి వంట చేయడం రాదు. ఒకసారి కేక్ తయారుచేస్తూ బొగ్గులా మాడ్చేసింది. ఆ అనుభవంతో ఎన్టీఆర్ గారు చిన్నసైజు నలభీముడే. సమయం దొరికితే చాలు వంటింట్లో దూరి అన్ని రకాల వంటలు చేస్తూంటారు. మాంసాహారం, పదిరకాల పలావులు, రోటి, పచ్చళ్ళు, పులుసు తయారుచేస్తారు. పిజ్జా, బర్గర్లు, మటన్ పచ్చడి, నాటుకోడి పచ్చడి, ఇలా ఒకటా రెండు అనేక రకాల వంటలు చేస్తారు.
బరువు తగ్గడం కోసం లైపోసక్షన్ చికిత్స…
కేవలం వంట వండడమే కాదు, అలాగే తినేవారు ఎన్టీఆర్. అందుకే బరువు అదుపులో పెట్టుకోలేకపోయారు. ఎన్నోసార్లు తగ్గాలి అని అనుకున్నా కానీ కుదిరేది కాదు. బరువు తగ్గడంపై శ్రద్ధ పెట్టేవారు కాదు. రాఖీ సినిమా చూశాక తనమీద తనకే కోపం వచ్చింది. ఎన్టీఆర్ ని కొంతమంది హరికృష్ణకు నాన్న లాగా ఉన్నావు అనేవారు. అందువలన ఈ సమయంలో బరువు తగ్గకపోతే అనవసరం అనుకున్నారు. యమదొంగ కథ చెప్పడానికి వచ్చిన రాజమౌళి గారు మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాము అన్నారు. ఇంత లావుగా ఉంటే అమ్మాయిలు థియేటర్లకు వచ్చే అవకాశం ఉండదు అని అనేశారు. అప్పుడు బరువు తగ్గడం ఎంత అవసరమో తనకు అర్థమైంది. రాజమౌళి గారు ఇచ్చిన ప్రోత్సాహంతో లైపోసక్షన్ చికిత్స చేయించుకున్నారు ఎన్టీఆర్.
యమదొంగ సినిమాకు వచ్చేటప్పటికీ తాను పూర్తిగా సన్నబడ్డారు. రాఖీ సినిమా చూసిన వారు, యమదొంగ సినిమా చూసేసరికి ఎన్టీఆర్ గారిని ఎవ్వరూ గుర్తుపట్టలేదు. అందుకే మా అమ్మకు ఇద్దరు కవల పిల్లలు అంటారు ఎన్టీఆర్. రాఖీ వరకు అన్నయ్య నటించి, ఆ తరువాత తమ్ముడు నటించి ఉండొచ్చు అని సరదాగా అంటుంటారు. అలా వ్యాయామం చేసి బరువును అదుపులో పెట్టుకోగలిగారు ఎన్టీఆర్. మనసులో ఒకటి ఉంచుకుని, బయటికి మరొకటి మాట్లాడడం ఎన్టీఆర్ కు చేతకాదు. ఒక సాధారణ పౌరుడిగా ఉండడం ఎన్టీఆర్ కు ఇష్టం. ఆయనకు కుటుంబం అంటే పంచప్రాణాలు. సినిమాల కంటే కుటుంబానికే అధిక ప్రాధాన్యతనిస్తారు. అందుకే బయట వేడుకలకు ఎక్కువగా కనిపించరు. సినిమా చిత్రీకరణ లేకపోయినా, పండగ వచ్చినా ఇంట్లోనే అందరితో కలిసి పాత సినిమాలు చూస్తూవింటారు.
అభిమాన నటి “శ్రీదేవి”…
ఎన్టీఆర్ తన తాతగారి సినిమాల్ని ఎక్కువగా చూస్తారు. నటుడిగా, వ్యక్తిగా, రాజకీయ నేతగా ఆయనకు తాతగారు నందమూరి తారకరామారావు గారే ఆదర్శం. ఎన్టీఆర్ అభిమాన కథానాయకుడు కూడా తాతగారు నందమూరి తారకరామారావు గారే. ఇక కథానాయిక విషయానికి వస్తే తన అభిమాన తార శ్రీదేవి. ఆమె అందం ఎవ్వరికీ రాదు, ఎప్పటికీ మెరిసిపోతున్నట్టుగా కనిపించేవారు ఆమె అని అంటారు ఎన్టీఆర్. ఆ తరువాత తనను అంతగా కట్టుకున్న కథానాయిక రమ్యకృష్ణ గారు. బాబాయి బాలకృష్ణ గారి సినిమాలన్నీ ఎన్టీఆర్ చూస్తుంటారు.
నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గారు నటించిన “దానవీరశూరకర్ణ” చిత్రానికి ఆయన వీరాభిమాని. ప్రపంచ సినిమాల్లోని అత్యుత్తమ చిత్రాలను ఎంపిక చేయాల్సివస్తే ఆ సినిమా తప్పకుండా ఉంటుంది అని అంటారు. గుండమ్మ కథని నాగచైతన్య తో కలిసి పునర్నిర్మించాలని ఉంది అని ఎన్టీఆర్ గారు చెప్పుకునేవారు. జీవితంలో ఏం సాధించినా, ఎంత సంపాదించినా, ఏం కోల్పోయినా చివరికి నాతో ఎప్పటికీ అపురూపమైన కొండంత ఆస్తి ఉంటుంది. అది కావలసినంత ధైర్యాన్ని ఇస్తుంది. ముందు నడిపిస్తుంది. వేయి జీవితాలకు సరిపడేంత ఉత్సాహాన్ని ఇస్తుంది. తాతగారు ఇచ్చిన పేరు ఎన్టీఆర్ అని చెబుతుంటారు తారక్.
విశేషాలు…
★ జూనియర్ ఎన్టీఆర్ గారు హరికృష్ణ, షాలిని భాస్కర్ రావు దంపతులకు 20 మే 1983 లో జన్మించారు.
★ 1991 లో “బ్రహ్మర్షి విశ్వామిత్ర” సినిమాలో బాల నటుడిగా తెలుగు పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆ సినిమా నుండి తారక్ ను “జూనియర్ ఎన్టీఆర్” అని పిలవడం ప్రారంభించారు.
★ ఎన్టీఆర్ హీరో గారు నటించిన తొలి చిత్రం “నిన్ను చూడాలని” సినిమాకు 3.5 లక్షల పారితోషికం తీసుకున్నారు. ఆ మొత్తాన్ని తన తల్లికే ఇచ్చారు.
★ మాతృదేవోభవ చిత్రంలోని “రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే” అనే పాట అంటే ఎన్టీఆర్ కు చాలా ఇష్టం.
★ యమదొంగ కంత్రి అదుర్స్ రభస, జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో సినిమాలతో గాయకుడిగాను ఎన్టీఆర్ గారు మెప్పించారు.
★ తెలుగు సినిమా చరిత్రలో పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ కలయికలో వచ్చిన ఆంధ్రావాలా సినిమా ఆడియో విడుదల వేడుక ఎప్పటికీ చెరగని రికార్డులను నెలకొల్పింది. ఈ వేడుకలో దాదాపు పది లక్షల మంది ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. నిమ్మకూరులో జరిగిన ఈ కార్యక్రమం కోసం రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్ళు కూడా ఏర్పాటు చేశారు.
★ జపాన్ లో అత్యధిక అభిమానులు కలిగి ఉన్న ఏకైక తెలుగు నటుడు ఎన్టీఆర్. తాను హీరోగా నటించిన “బాద్షా” సినిమా జపాన్ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపిక అయ్యింది.
★ ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ లిస్టులో రెండు సార్లు నిలిచాడు ఎన్టీఆర్.
★ ఎన్టీఆర్ సుమారు ఎనిమిది భాషలలో అనర్గళంగా మాట్లాడగలరు. తన వాగ్దాటితో ఇప్పటికే అన్ని చిత్ర పరిశ్రమల వారిని ఆకర్షించారు.
★ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిలకు 05 మే 2011 నాడు వివాహం జరిగింది. వారికి ఇద్దరు అబ్బాయిలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లు. అయినా కూడా కూతురు లేదని లోటు ఎప్పటికీ ఉంటుందని ఎన్టీఆర్ పలు సందర్భాలలో చెప్పారు
★ ఎన్టీఆర్ అభిమాన సినిమా “దానవీరశూరకర్ణ”. ఇప్పటికీ ఈ చిత్రాన్ని వందల సార్లు చూసారట.
★ ఆది సినిమాలో భారీ సంభాషణలు చెప్పగలరా అని కొందరు పరిచూరు బ్రదర్స్ దగ్గర సందేహించారట. కానీ ఎన్టీఆర్ వాటన్నింటిని సింగిల్ టేక్ లో చెప్పి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు. ఆ సినిమాకు ఎన్టీఆర్ నంది పురస్కారం అందుకున్నారు.
★ 9 వ సంఖ్య అంటే ఎన్టీఆర్ కు ఇష్టం. ఆయన వాహన సంఖ్యలన్నీ 9 తోనే ప్రారంభమవుతాయి. ఓ కారు కోసం 9999 అనే ఫ్యాన్సీ సంఖ్యను పదిలక్షల రూపాయలతో కొనుగోలు చేసి 9 అంటే తనకి ఎంత ఇష్టమో తెలిపారు.
★ 2016 లో వచ్చిన జనతా గ్యారేజ్ తో “కింగ్ ఆఫ్ బాక్సాఫీస్” పురస్కారాన్ని ఐ.ఐ.ఎఫ్.ఏ నుండి అందుకున్నారు.
★ కంత్రి, అదుర్స్, బృందావనం చిత్రాలకు గాని ఉత్తమ కథనాయకుడిగా ఫిలింఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు ఎన్టీఆర్.
★ బాలల రామాయణం, ఆది చిత్రాలకు నంది స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని ఎన్టీఆర్ అందుకున్నారు.
★ యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్, తారక్, దేవర ఎన్టీఆర్ పేర్లు..