CINEMATelugu Cinema

అతి తక్కువ చిత్రాలలో నటించి తప్పుకున్న అందమైన నటుడు… మంత్రవాది శ్రీరామమూర్తి.

అందమైన రూపం, అద్భుతమైన అభినయం, బాగా డబ్బు సంపాదన ఉన్నకాలంలో ఇక సినిమాలు చాలు అని సంతృప్తి పడిన అరుదైన నటుడు మంత్రవాది శ్రీరామ మూర్తి. నిజానికి సినిమాలలో నటించటానికి పెద్దగా నాటకానుభవం కూడా లేదు. పాఠశాల రోజులలో అందరి బలవంతం మీద బడిలో “నందలాల్” అనే నాటకంలో శివుని వేషం ధరించారు. గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో తన సీనియర్ “ముక్కామల కృష్ణమూర్తి” ప్రేరణతో అనేక నాటకాలలో అభినయించారు. ముక్కామలతో అనేక నాటకాలలో వివిధ పాత్రలను పోషించి ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేశారు శ్రీరామమూర్తి.

కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే సినిమాలలో నటించి, ఆ తరువాత తప్పుకున్నారు ఆయన. 1951లో వచ్చిన “ఆకాశ రాజు” చలనచిత్రంతో మొట్టమొదటిసారిగా తెరంగేట్రం చేశారు. ఆ తరువాత 1952లో వరుసగా “టింగురంగా”, “పేదరైతు”, “రాజేశ్వరి”, “మరదలు పెళ్ళి” లాంటి సినిమాలో నటించారు. 1953 లో పెంపుడు కొడుకు సినిమాలో, 1954లో జ్యోతి సినిమాలో నటించాడు. కేవలం మూడేమూడేళ్ళు కేవలం ఏడు సినిమాలలో మాత్రమే నటించారు శ్రీరామ మూర్తి. ఆ రోజులలో ఆయనకు గొప్ప ప్రేక్షకాదరణ ఉండేది. 

ఈ తరం ప్రేక్షకులకు ఆయన ఎవ్వరో తెలియకపోవచ్చు. కానీ “ఆకాశరాజు”, “టింగ్ రంగా”, “రాజేశ్వరి”, “జ్యోతి”, “మరదలు పెళ్లి” చిత్రాలలో నటించిన కథానాయకుడు శ్రీరామమూర్తి. ఆయన నటించిన చిత్రాలు తక్కువే అయినా ఆయనకు మంచి ప్రజాదరణ ఉండేది. ఆయనతో సినిమాలు తీయడానికి నిర్మాతలు ఉత్సాహం చూపించేవారు. అయితే ఆయన “పెంపుడు కొడుకు” (సావిత్రి కథానాయిక) తరువాత శ్రీరామమూర్తి సినిమాలలో నటించడం మానుకున్నారు. దర్శక నిర్మాతలు ఎంత ఒత్తిడి చేసినా ఆయన సినిమాలలో నటించడానికి అంగీకరించలేదు. నటుడిగా తీరికలేకుండా ఉన్న తరుణంలో ఆ వృత్తిని, ఆ సంపాదనను వదులుకోవాలంటే ఎంత “స్థిత ప్రజ్ఞత” కావాలి? అది శ్రీరామ మూర్తిలో మెండుగా ఉంది.

నేపథ్యం…

మంత్రవాది శ్రీరామమూర్తి 12 నవంబరు 1920 నాడు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఓ మారుమూల పల్లెలో జన్మించారు. ఆయన తండ్రి చిన శేషయ్య వృత్తి రీత్యా న్యాయవాది. అందుకని శ్రీరామ మూర్తి తన డిగ్రీ చదువు పూర్తి కాగానే తాను కూడా న్యాయశాస్త్రం చేరి, న్యాయశాస్త్రం చదివారు. శ్రీరామమూర్తికి మాములుగానే నాటక అనుభవం లేదు. కానీ తాను ఉన్నత పాఠశాలలో చదివే రోజుల్లో అందరి బలవంతం మీద “నందలాల” అనే నాటకంలో శివుడి పాత్ర పోషించాల్సి వచ్చింది. అలాగే ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల, గుంటూరులో చదువుతుండగా తనకంటే సీనియర్ అయిన ముక్కామల కృష్ణమూర్తి నాటకాలు వేయడం చూసి శ్రీరామమూర్తికి కూడా నాటకాలు అంటే ఆసక్తి కలిగింది. అలా ముక్కామల కృష్ణమూర్తి వేసిన నాటకాలనుప్రారంభించారు. అలా నాటకాలలో అడుగిడి ముక్కామలతో కలిసి పలు నాటకాలలో నటిస్తూ వచ్చారు. ఆయన ప్రభావంగానే శ్రీరామమూర్తి కళాశాలలో వేసిన నాటకాలన్నీ ప్రాచుర్యం పొంది, పలు ప్రశంసలు దక్కించుకున్నాయి.

సినిమాలలో అవకాశం…

మంత్రవాది శ్రీరామమూర్తి పల్లెటూరి నుండి వచ్చారు. నాటకాలు వరకు తెలుసు. కానీ సినిమా చిత్రీకరణ గురించి కానీ, సినిమాలలో నటించడం గురించి కానీ తెలియదు. ప్రసిద్ధ తెలుగు కవి పోతన జీవితం ఇతివృత్తంగా, చిత్తూరు నాగయ్య నటజీవితంలో ఒక కలికితురాయిగా నిలిచిపోయిన భక్త పోతన (1943) సినిమాలో శ్రీనాథుడిగా నటించిన జంధ్యాల గౌరీనాథశాస్త్రి “మహారథి కర్ణ” సినిమా నిర్మిస్తూ అందులో కృష్ణుడి పాత్ర కోసం శ్రీరామమూర్తికి కబురు పెట్టారు. ఆ సినిమా “మధుర” లో చిత్రీకరణ జరుగనుందని చెప్పి రవాణా ఖర్చులు మరియు ఇతరత్రా ఖర్చులు చెల్లించి 1116 రూపాయలు పారితోషికంగా చెల్లిస్తామన్నారు. నెల రోజులలో కబురు చేస్తామని కూడా చెప్పారు. కానీ అనివార్య కారణాల వలన ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఆ సినిమా ఆగిపోయిన విషయం తరువాత తెలిసింది. దాంతో చేసేది లేక సినిమాల గురించి కూడా ఆలోచించకుండా న్యాయవాద వృత్తి ప్రాక్టీసు ప్రారంభించారు. ఆ వృత్తి అలా  కొనసాగుతూండగానే అయనకు 1946లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం చేస్తుండగానే మళ్ళీ జంధ్యాల గౌరీనాథ శాస్త్రి దగ్గరినుండి మరొక టెలిగ్రామ్ వచ్చింది. “ఆకాశరాజు” సినిమాలో వేషం ఉందని వెంటనే బయలుదేరి రమ్మని శాస్త్రి సందేశం పంపించారు. దాంతో శ్రీరామమూర్తి బయలుదేరి మద్రాసుకు చేరుకున్నారు.

తొలి సినిమా “ఆకాశరాజు” (1951)… 

1951లో విడుదలైన “ఆకాశరాజు”  తెలుగు సినిమాను “త్రిమూర్తి ఫిల్మ్స్ పతాకం” పై జంధ్యాల గౌరీనాథ శాస్తి నిర్మించిన ఈ సినిమాకు జ్యోతిష్ సిన్హా దర్శకత్వ వహించారు. ఈ సినిమాలో కథానాయకుడిగా ముందు ఎన్టీఆర్ ని ఎంపిక చేసి కొన్ని స్టిల్స్ కూడా తీశారు. కానీ అదే సమయానికి విజయా సంస్థకు ఎన్టీఆర్ శాశ్వత నటులుగా ఎంపికయ్యారు. దాంతో ఎన్టీఆర్ ఆకాశరాజు సినిమా నుండి తప్పుకున్నారు. ఎన్టీఆర్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ పాత్ర మంత్రవాది శ్రీరామమూర్తిని వరించింది. 1951లో ప్రారంభమైన ఈ చిత్రంలో నటీనటులుగా చిలకలపూడి సీతారామాంజనేయులు, కుమారి, జంధ్యాల గౌరీనాథశాస్త్రి, లక్ష్మీరాజ్యం, కనకం, అద్దంకి శ్రీరామమూర్తి, వంగర, ఎస్వీ రంగారావు మొదలగు వారంతా కొత్తవారే నటించడం విశేషం. మద్రాసులో శ్రీరామమూర్తి పరిచయం ఉన్న ఏకైక వ్యక్తి “ముక్కామల” కావడంతో, ఆయన వుండే పాండీ బజారులోని నారాయణ హోటల్లోనే శ్రీరామమూర్తి కూడా ఉండేవారు. ఆకాశరాజు సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుని సినిమాను విడుదల చేశారు. మసక మసకగా ఉండి తెరమీద బొమ్మ సరిగ్గా కనిపించక, మాట సరిగ్గా వినిపించక ఆగ్రహం చెందిన ప్రేక్షకులు తెరమీదికి కుర్చీలు, బల్లలు విసిరేవారు. 1951 లో విడుదలైన ఆ సినిమా పరాజయం పాలైంది. 

“టింగురంగా” (1957)…

ఆకాశరాజు సినిమా తరువాత బి.ఎ. సుబ్బారావు దర్శకత్వంలో యువ పిక్చర్స్ పతాకంపై పి. ఎస్. శేషాచలం నిర్మించిన “టింగ్ రంగా” (1957) చిత్రంలో శ్రీరామమూర్తికి అవకాశం వచ్చింది. ఈ సినిమాలో “రాజా మహారాజా రవికోటిరాగ సురలోక భోజా”  అంటూ సాగే శాస్త్రీయ గీతం ఉంది. ఈ పాటను తాపీ ధర్మారావు  వ్రాశారు. ఘంటసాల పాడిన తొలి శాస్త్రీయ గీతం ఇది. ఈ సినిమాకు టి.వి. రాజు సంగీత దర్శకులు. పాట వ్రాయడం, ట్యూన్ కట్టడం  వీటి కోసం సుమారు రెండు నెలల సమయం పట్టింది. ఘంటశాల 15 రోజులపాటు రిహార్సల్ చేశారు. ఆ పాటను తనపై చిత్రీకరిస్తారని తెలిసిన శ్రీరామమూర్తి కూడా బాగానే రిహార్సల్ చేశారు. ఏడు నిమిషాల నిడివి ఉండే ఈ పాటను ఒకే షాట్ లో చిత్రీకరించడం విశేషం. భోజన విరామ సమయంలో టీ.వీ.రాజు, ఘంటసాల, శ్రీరామమూర్తి కలుసుకొని ఒక మంచి పాట పాడినందుకు ఒకరినొకరు అభినందించుకున్నారు.

తొలి తమిళ సినిమా “రాజేశ్వరి”…

అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి, అంజలీదేవి నటించిన జానపద చిత్రం “రక్ష రేఖ” సినిమాకు దర్శకుడు ఆర్.పద్మనాభన్. ఆయన దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో నిర్మించతలపెట్టిన చిత్రం “రాజేశ్వరి”. ఈ సినిమా తెలుగులో శ్రీరామమూర్తి కథానాయకుడిగా ఎంపిక చేశారు. తమిళ వర్షన్ లో మాత్రం ఎం.జీ.ఆర్ కథానాయకుడు. ఆకాశరాజు సినిమా పరాజయం అవ్వడంతో “రాజేశ్వరి” సినిమా నుండి శ్రీరామమూర్తిని తీసేసి మరో నటుడిని తీసుకుందామని ఆ చిత్రంలో గుణచిత్ర నటుడిగా నటిస్తున్న “లంక సత్యం” చెప్పినా కూడా ఆర్.పద్మనాభన్ వినిపించుకోలేదు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎం.జీ.ఆర్ సరిగ్గా నటించడం లేదని ఆయన్ని తీసేసి తమిళంలో కూడా శ్రీరామమూర్తినే కొనసాగించారు. ఈ రాజేశ్వరి చిత్రానికి సంగీత దర్శకుడు ఓగిరాల రామచంద్ర రావు. ఆయనకు సహాయకుడుగా కే.వీ.మహదేవన్ ను ఎంచుకున్నారు. ఈ సినిమాకు గాయకుడిగా ఘంటసాలను అనుకున్నారు. కానీ ఆయన పాడకపోవడంతో ఆయన స్థానంలో పి.బి.శ్రీనివాస్ తో పాడించాలనుకున్నారు. అయితే గ్రాడ్యుయేషన్ పరీక్షలు జరుగుతుండడంతో చివరికి పిఠాపురం నాగేశ్వరరావుతో పాటలన్నీ పాడించారు.

ముక్కామల దర్శకత్వంలో “మరదలు పెళ్ళి” (1952)…

తాను చదువుకున్న ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో తనకు సీనియర్ అయిన ముక్కామల దర్శకత్వంలో తొలిసారి శ్రీరామమూర్తి కథానాయకుడిగా నటించారు. ఆ సినిమా పేరు “మరదలు పెళ్ళి” (1952). అలాగే ఆయన భానుమతీ తొలిసారిగా దర్శకత్వం వహించిన “చండీరాణి” (1953) చిత్రంలో శ్రీరామమూర్తిని నటించమని భానుమతి అడిగారు. దానికి ఆయన ఒప్పుకోలేదు. దానికి గల కారణం ఏంటి అని అడిగితే ఎన్టీఆర్ ఉన్నారు కదా. ఆయన పక్కన ఏ వేషం ఉన్నా నేను వేయను అని చెప్పి తిరస్కరించారు. ఎందుకు అని అడిగితే ఆయన హీరోయిజం అయనదే, నా హీరోయిజం నాదే అని అన్నారు. “చండీరాణి” సినిమా హిందీలో కూడా ఉందంటున్నారు కదా. అందులోనూ “ఆకాశరాజు” సినిమా పరాజయంతో ఉన్నాను. కనుక నేను ఆ సినిమాలో నేను నటించనని శ్రీరామమూర్తి అన్నారట.ఆయనతో నటింపజేయడానికి భానుమతి ఎంతో ప్రయత్నించారు. కానీ ఆయన అస్సలు ఒప్పుకోలేదు. 

చిత్రకళ మీద ఆసక్తి….

చిత్రకళ మీద ఆసక్తి ఎక్కువగా ఉన్న మంత్రవాద శ్రీ రామమూర్తి దేశనాయకుల చిత్రాలు ఎక్కువగా చిత్రించేవారు. మద్రాసులో ఉన్న సమయంలో తన స్నేహితుడు డాక్టర్ పి.ఎన్.శాస్త్రి గదిలో ఉండేవారు. ఆ రోజులలో ఒక తమాషా సంఘటన జరిగింది. ఎగ్మూర్ లో “స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కళాశాల ఉండేది. హెచ్.వి. రామ్ గోపాల్ అనే వ్యక్తి కళాశాలలో ఫైనల్ ఇయర్ విద్యార్థి. ఆయన మంచి చిత్రకారుడు. శ్రీరామమూర్తి వేసిన నెహ్రూ చిత్రాన్ని చూసి ఆయన ఎంతో అభినందించారు. ఆ రోజులలోనే “స్వర్గసీమ” చిత్రం నిర్మాణం జరుగుతుంది. వాళ్లకు కళా దర్శకులు కావలసి వచ్చి ఆ కళాశాల లెక్చరర్ నారాయణరావుని మాట్లాడుకున్నారు. ఆయనకు సహాయకులుగా హెచ్.వి. గోపాల్ వెళ్లాలి. అయితే శ్రీరామమూర్తి ప్రతిభను గమనించిన హెచ్.వి. గోపాల్ మీరు వెళతానంటే నేను మానుకుంటాను అని శ్రీరామమూర్తితో అన్నారు. ఆర్ట్ మీద ఉన్న ఉత్సాహంతో శ్రీరామమూర్తి కూడా ఒప్పుకున్నారు.

మరణం…

వాహినీ సంస్థ నుండి పిలుపు వస్తుందని శ్రీరామమూర్తి చాలా రోజులు ఎదురు చూశారు. కానీ వారి నుండి పిలుపు రాలేదు. కథానాయకుడు అవ్వాలని వ్రాసిపెట్టి ఉంది గనుక ఆ రోజులలో ఆయనకు వాహినీలో అవకాశం  దక్కలేదేమో? శ్రీరామమూర్తి నటించిన “ఆకాశరాజు”, “టింగ్ రంగా” చిత్రాలలో ఆయన  చిత్రకారుడిగా నటించారు. ఆ తరువాత “జ్యోతి”, “పేద రైతు”, “పెంపుడు కొడుకు” చిత్రాలలో నటించడంతో శ్రీరామమూర్తి నటజీవితం పూర్తయ్యింది. “శకుంతల” చిత్రంలో తనకు అవకాశం వచ్చింది. కొంత భాగం చిత్రీకరణ జరిగింది. కానీ మధ్యలో జరిగిన కొన్ని గొడవల వల్ల ఆ చిత్రంలో నటించనని చెప్పారు.

ఆ తరువాత సినిమాలలో నటించడమే మానేశారు. అక్కడినుండి ఈరోజు కూడా సినిమాల జోలికి వెళ్ళలేదు. నిర్మాతలు ఎంతో మంది ప్రయత్నం చేసినా తిరిగి సినిమాలలో నటించే ప్రయత్నం చేయలేదు. కుటుంబంతో కలిసి మంచిగా ఆరోగ్యంగా, సంతృప్తిగా సంతోషకరమైన జీవితం గడిపారు. తన 91సంవత్సరాల వయస్సులో కారులో కరీంనగర్ వెళ్లి తిరిగి వస్తుండగా దారిలో అడ్డం వచ్చిన ఒక గేదెను కారు డ్రైవరు తప్పించే ప్రయత్నం చేయగా ప్రక్కనే ఉన్న కాలువలో ఆ కారు పడిపోయింది. ఆ షాక్ కు 2011 లో ఆయన ప్రాణ జ్యోతి ఆరిపోయింది. ఆయనలో ఉన్న ఒక నటజ్యోతి అనంతాకాశంలో కలిసిపోయింది.

Show More
Back to top button