Telugu Cinema

చిత్ర పరిశ్రమలో అభినవ అభినేత్రి..  నటి రేవతి..

అన్ని రంగాల్లో మాదిరిగానే రేవతి సినీ రంగంలోనూ ఆది నుంచీ పురుషాధిక్యమే. నటనా శాఖని మినహాయిస్తే సినిమాకి సంబంధించిన కొన్ని శాఖల్లో మహిళా ప్రాతినిథ్యం నామ మాత్రం కాగా, కొన్ని శాఖల్లో అసలు ప్రాతినిథ్యమే లేదు. చలనచిత్ర రంగంలో దర్శకుడు సినిమాకి కెప్టెన్. 24 క్రాప్టులను సమన్వయపరుస్తూ సినిమాని తెరకెక్కించాలంటే అనేక సవాళ్లు ఉంటాయి. అన్ని శాఖల వారినీ సమన్వయపరిచి, తన మేధోప్రతిభతో సన్నివేశాల్ని కల్పించి సినిమాకి ఓ రూపాన్ని తీసుకువచ్చే దర్శకత్వంలోనూ మహిళల సంఖ్య చాలా తక్కువ.

అయితే భారతీయ సినిమాకి మూకీ యుగం నుంచే మహిళా దర్శకులు ఉన్నారనే నిజం ఈ కాలం వారికి ఆశ్చర్యం కలిగించే విషయమైనా అది నిజం. భారతీయ సినీ చరిత్రలో మొదటి దర్శకురాలు ఓ ఉర్దూ మహిళ కావడం విశేషం. సవాళ్ళను స్వీకరించడానికి మహిళలు వెనుకడుగు వేయడం లేదు. మెగా ఫోన్ అందుకొని మంచి చిత్రాలను రూపొందిస్తున్నారు.

భానుమతి, సావిత్రి, విజయనిర్మల, జయ, జీవిత, నందిని రెడ్డి, సుచిత్ర చంద్ర బోస్, చూనియా, శశికిరణ్, మంజుల, సంజనా రెడ్డి ఇలా ఎందరో మహిళా దర్శకులు ఏడాది కాలంగా మహిళా దర్శకులకు అర్థవంతమైన చిత్రాలను రూపొందించడానికి తమ వంతు కృషి చేస్తున్నారు. అవి బాక్సాఫీస్ వద్ద విజయాలను అందుకుంటూనే ఉన్నాయి. అలాంటి మహిళా దర్శకులలో రేవతి గారు ఒకరు. రేవతి గారు నటి. నటనతో పాటు వీలు కుదిరినప్పుడు సినిమాకు దర్శకత్వం వహిస్తూ తన ప్రతిభను చాటుతూనే ఉన్నారు.

మిత్ర్ “మై ఫ్రెండ్” (2002), ఫిర్ మిలెంగే (2004), కేరళ కేఫ్ మలయాళం (2009), ముంబై కటింగ్ (2010), సలాం వెంకీ (2022) లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

రేవతి ఒక భారతీయ చలనచిత్ర నటి. చలనచిత్ర దర్శకురాలు. తెలుగు, మలయాళ, తమిళ సినిమాల్లో నటిగా ఎక్కువగా తాను ప్రసిద్ధి చెందారు. తాను మూడు వేర్వేరు విభాగాలలో జాతీయ పురస్కారాలు, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ (సౌత్) తో బాటు తాను అనేక ప్రసంశలు గెలుచుకున్నారు.

రేలంగి నరసింహారావు గారు దర్శకత్వం వహించిన ‘మానసవీణ’ చిత్రంతో తెలుగు చిత్ర సీమ లో అడుగుపెట్టారు రేవతి గారు. అదే సమయంలో దర్శకులు బాపు గారు తెరకెక్కించిన “సీతమ్మ పెళ్ళి” చిత్రం కూడా రేవతికి గారికి మంచి తెచ్చి పెట్టింది. మణిరత్నం గారి “మౌనరాగం” తో రేవతికి గారికి విపరీతమైన పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. తెలుగులో కి అనువాదమైన ఈ సినిమా ఇక్కడి ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. అప్పటి నుండి తమిళంలో రేవతి గారు నటించిన పలు చిత్రాలు తెలుగువారినీ అనువాదరూపంలో పలకరించాయి.

రేవతి గారు శిక్షణ పొందిన భరతనాట్యం నర్తకురాలు. ఏడు సంవత్సరాల వయస్సు నుండి నాట్యం నేర్చుకుని 1979 సంవత్సరంలో చెన్నైలో ఆమె ఆరంగేట్రం నాట్యం ప్రదర్శన కూడా ఇచ్చారు. సినిమాలకే కాకుండా, రేవతి అనేక రకాల సామాజిక సంస్థలలో పాల్గొంది. ఇందులో అత్యంత ముఖ్యమైనది బన్యన్, ఎబిలిటీ ఫౌండేషన్, ట్యాంకర్ ఫౌండేషన్, విద్యాసాగర్, చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, భారతదేశ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వంటి అనేక చిత్రోత్సవాలలో సభ్యురాలిగా కూడా పనిచేశారు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    ఆశ కేలుని నాయర్

ఇతర పేర్లు  :    రేవతి 

జననం    :   8 జూలై 1966 (వయసు 56)

స్వస్థలం   :     కొచ్చి, కేరళ, భారతదేశం

తండ్రి   :   కేలుని నాయర్

తల్లి     :    లలితే కేలున్ని 

వృత్తి      :    నటి, దర్శకురాలు, సామాజిక కార్యకర్త

జీవిత భాగస్వామి   :  సురేష్ చంద్ర మేనన్ (1986–2002) (2013లో విడాకులు)

పిల్లలు    :    మహి

బంధువులు    :    నిరంజనా అనూప్(మేనకోడలు)

పురస్కారాలు   :    భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు , ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు(దక్షిణ)

నేపథ్యం..

రేవతి గారు కేరళ లోని కొచ్చిలో 08 జులై 1966 న జన్మించారు. రేవతి గారి అసలు పేరు “ఆశా కేలుని నాయర్”. వీరి నాన్న కేలుని నాయర్, అమ్మ లలితే కేలున్ని గార్లు. కేలుని నాయర్ గారు కల్లిక్కాడ్, పాలక్కాడ్ ప్రాంతాలకు చెందిన, భారతీయ సైన్యంలో ఒక ఉద్యోగం చేసేవారు. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్. మలయాళ నటి గీతా విజయన్ ఈమె బంధువు.

సినీ నేపథ్యం…

రేవతి గారు భారతీరాజా దర్శకత్వం వహించిన “మన్ వాసనై” (1983) అనే తమిళ చిత్రం ద్వారా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. “ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ సాయిల్” చిత్రానికి అనువాదం గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విను చక్రవర్తి , గంటిమతి , మరియు వై. విజయ సహాయక పాత్రల్లో నటించిన ఈ చిత్రం లో పాండియన్ మరియు రేవతి లు నాయకా, నాయికలు గా నటించిన ఈ చిత్రం 29 జూలై 1983 నాడు విడుదలై 200 రోజులకు పైగా థియేటర్లలో ప్రదర్శించబడింది. అంతే కాకుండా “మన్ వాసనై” ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ చిత్రం తెలుగులో మంగమ్మగారి మనవడు (1984) గా తిరిగి పునర్నిర్మించబడింది.

తన తొలి చిత్రమే సిల్వర్ జూబ్లీ హిట్‌గా నిలిచి తనకు “ఫిలింఫేర్ ప్రత్యేక అవార్డు సౌత్” లభించింది. ఆ తర్వాత తాను 1983లో “కట్టాతే కిలిక్కూడు” అనే సినిమాతో మలయాళ చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను సాధించి  1980లలో తన అతి పెద్ద విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. రేవతి గారిని 1984 లో దర్శకుడు రేలంగి నరసింహారావు గారు “మానసవీణ” చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఈ చిత్రంలో రేవతి గారితో బాటు రాజ్‌కుమార్ , బాలాజీ మరియు సుమిత్ర గార్లు నటించారు. ఈ చిత్రానికి ఎం.యస్.విశ్వనాథన్ గారు సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం “తెన్నాల్ తేదున్న పూవు” పేరుతో మలయాళంలోకి డబ్ చేయబడింది.

ప్రముఖ దర్శకులు బాపు గారి దర్శకత్వం లో సీతమ్మ పెళ్లి (1984) అనే చిత్రం లో నటించారు. సీతమ్మ పెళ్లి చిత్రం తమిళ చిత్రం “ముల్లుమ్ మలరుమ్” (1978) యొక్క రీమేక్. ఇందులో మోహన్ బాబు, మురళీ మోహన్, ముచ్చెర్ల అరుణ మరియు రేవతి ఆమె తెలుగు చలనచిత్ర ప్రవేశంలో నటించారు. ఈ చిత్రం 30 జూన్ 1984న విడుదలైంది.  రేవతి తమిళంలో మహేంద్రన్ దర్శకత్వంలో అంధురాలు, అత్యాచారం-బతికిన సీత పాత్రను పోషించింది.కై కొడుక్కుమ్ కై (1984) రజనీకాంత్ సరసన రేవతి భారతిరాజా దర్శకత్వం వహించిన పుదుమై పెన్ (1984) లో సీత పాత్రను పోషించింది. అదే సంవత్సరం ఆమె ఆర్.సుందర్రాజన్ దర్శకత్వం వహించిన వైదేహి కతిరుంతల్ కూడా చేసింది .

రేవతి గారు తాను నటించే సినిమాలలో అభినయించే పాత్రల ఎంపికలో బహుముఖ ప్రజ్ఞావంతంగా వ్యవహరించేవారు. తాను ఎక్కువగా బలమైన, సాపేక్షమైన మహిళా పాత్రలను పోషించేవారు. తమిళ దిగ్గజ దర్శకులు మణిరత్నం గారి మొదటి విజయవంతమైన “మౌన రాగం” (1986) చలనచిత్రం ద్వారా స్త్రీగా రూపాంతరం చెందే చాలా ఆత్మీయమైన మరియు తలరాతగల అమ్మాయి దివ్య పాత్రలో ఆమె గొప్పగా అభినయించారు.

మౌన రాగం…

మౌన రాగం. అనేది 1986లో విడుదలైన భారతీయ తమిళ భాషా రొమాంటిక్ డ్రామా చిత్రం. జి.వెంకటేశ్వరన్ నిర్మాణంలో మణిరత్నం రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ మరియు రేవతి గార్లు నటించారు. ఇందులో కార్తీక్ (అతిథి పాత్ర), వి.కె.రామస్వామి, రా.శంకరన్ , భాస్కర్, కాంచన , వాణి, కలైసెల్వి మరియు సోనియా సహాయక పాత్రలలో నటించారు. ఇది తన తండ్రి (శంకరన్) ప్రోద్భలంతో చంద్రకుమార్ (మోహన్)తో బలవంతంగా వివాహం చేసుకున్న స్వేచ్ఛా-స్ఫూర్తి కలిగిన కళాశాల అమ్మాయి దివ్య (రేవతి) జీవితాన్ని తెలియజేస్తుంది. కానీ, ఆమె అప్పటికీ తన గత ప్రేమికుడు మనోహర్ (కార్తీక్) జ్ఞాపకార్థం జీవిస్తుంది. కథ తన గతాన్ని పట్టుకోవడం మరియు వర్తమానంతో సరిపెట్టుకోవడం మధ్య దివ్య యొక్క అంతర్గత సంఘర్షణను అనుసరిస్తుంది.

15 ఆగస్టు 1986, భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం నాడు విడుదలైంది. ఈ చిత్రం ఇది 175 రోజులకు పైగా థియేటర్లలో ప్రదర్శింపబడింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇది తమిళంలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. అలాగే మణిరత్నం గారు తమిళంలో ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ మరియు సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డులను అందుకున్నారు. మౌన రాగం కూడా కార్తీక్ కెరీర్‌లో అతిథి పాత్ర అయినప్పటికీ అతని కెరీర్‌లో ఈ చిత్రం పురోగతిగా నిలిచింది. ఇది హిందీలో 1992లో కసక్‌గా పునర్నిర్మాణం చేయబడింది, అలాగే కన్నడలో 1999 లో చంద్రోదయ గారీమేక్ చేశారు.

రేవతి గారు 1986 లో కె.బాలచందర్ గారి దర్శకత్వం లో “పున్నగై మన్నన్‌” లో కమల్ హాసన్ గారు సరసన నటించారు. రేవతి గారు ఆ చిత్రంలో అభినయించినందుకు తన పాత్రకు పలు ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని సాధించింది. ఆ దెబ్బతో తమిళ చిత్ర పరిశ్రమలో తాను అత్యంత గుర్తింపు ఉన్న నటిగా తనకు పేరొచ్చింది. అలాగే 1988లో మలయాళ చిత్రం “కక్కోతిక్కవిలే అప్పూప్పన్ తాడికల్‌” లో తన అద్భుతమైన నటనకు గానూ తన మొదటి ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు.

ఆమె 1990లో “కిజక్కు వాసల్” అనే చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలో ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. రేవతి గారు వరుసగా విజయాలను కొనసాగిస్తూ హిట్‌ల వెంట హిట్‌లను అందుకున్నారు. ప్రియదర్శన్ యొక్క మలయాళ చిత్రం “కిలుక్కమ్‌” లో తాను అత్యుత్తమ నటనను కనబర్చారు. 1991లో సురేష్ కృష్ణ యొక్క దర్శకత్వం లో రేవతి గారు, సల్మాన్ ఖాన్‌ గారితో కలిసి “లవ్” చిత్రంతో హిందీలో అడుగుపెట్టారు. తాను 1992లో తన తమిళ చిత్రం “తేవర్ మగన్” కోసం ఉత్తమ సహాయ నటి విభాగంలో జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు. 1990ల ప్రారంభంలో ఆమె సినీ ప్రస్థానం గరిష్ట స్థాయికి చేరుకుంది. తాను అప్పుడప్పుడు తెలుగు మరియు కన్నడ చిత్రాలలో కూడా  కనిపించేవారు.

రేవతి గారు బాలు మహేంద్ర గారు దర్శకత్వం వహించిన “మరుపడియం” (1993) చిత్రానికి గానూ ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఆ దశాబ్దంలో అంజలి (1990), “తేవర్ మగన్‌” లో ఆమె అత్యంత మంచి గుర్తింపు పొందిన కొన్ని చిత్రాలలో కనిపించిన పిమ్మట తన ప్రస్థానం లో విజయ పరంపర 1990ల చివరి వరకు కొనసాగింది. మగలిర్ మట్టుమ్ (1994) లాంటి విజయవంతమైన చిత్రాలలో తాను నటించారు. తాను 1998 లో “తలైమురై” చిత్రానికి గానూ తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు ప్రత్యేక బహుమతిని కూడా గెలుచుకున్నారు.

హిందీ ప్రేక్షకులు “మార్గరీటా విత్ ఎ స్ట్రా (2014) మరియు 2 స్టేట్స్ (2014) లలో రేవతి గారిని ఆదరించారు. తమిళంలో, ప పాండి (2017) జాక్‌పాట్ (2019) అలాగే మలయాళంలో వైరస్ (2019) వంటి చిత్రాలలో నటించి మెప్పించారు. రేవతి గారు తెలుగు మరియు హిందీ ద్విభాషా చిత్రం “మేజర్” (2022) లో కనిపించారు. అందులో తాను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లి ధనలక్ష్మి పాత్రను పోషించారు. .

దర్శకురాలిగా…

రేవతి గారు నటనతో పాటు, సినిమా లకు దర్శకత్వం కూడా వహించారు. తాను రెండు చిత్రాలకు ( మిత్ర్, మై ఫ్రెండ్ మరియు ఫిర్ మిలేంగే ) దర్శకత్వం వహించారు. దానితో బాటు కేరళ కేఫ్, అలాగే విడుదల కాని ముంబై కట్టింగ్ అనే సంకలన చిత్రాలకు ఒక్కొక్క ఎపిసోడ్ ను రేవతి గారు అందించారు.

మిత్ర్ (మై ఫ్రెండ్)..

“మిత్ర్, మై ఫ్రెండ్” అనేది 2002లో విడుదలైన భారతీయ ఆంగ్ల-భాషా డ్రామా చలనచిత్రం. దీనికి రేవతి గారు తొలిసారిగా దర్శకత్వం వహించారు. దీనికి కథ వి.ప్రియ అందించగా, స్క్రీన్ ప్లే వి.ప్రియ, సుధా కొంగర లు రచించారు. ఈ చిత్రంలో శోభన , నాసిర్ అబ్దుల్లా మరియు ప్రీతి విస్సా నటించారు. ఈ చిత్రం 49వ జాతీయ చలనచిత్ర అవార్డులు (2001) లో ఆంగ్లంలో ఉత్తమ చలనచిత్రం పురస్కారాన్ని నిర్మాత సురేష్ చంద్ర మీనన్ అందుకున్నారు. ఉత్తమ నటి గా శోభన, ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో బీనా పాల్, 33వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో “స్పెషల్ జ్యూరీ అవార్డు సిల్వర్ పీకాక్” ను అందుకున్నారు. ఈ చిత్రంలో తమిళ సంభాషణలు కూడా ఉన్నాయి, కొన్ని పాటలు హిందీలో ఉన్నాయి.

ఫిర్ మిలేంగే…

రేవతి గారు దర్శకత్వం వహించిన 2004లో విడుదలైన భారతీయ నాటక చిత్రం “ఫిర్ మిలేంగే”. ఇందులో శిల్పా శెట్టి , సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్ లు నటించారు.

ఈ చిత్రం AIDS అనే ప్రధాన అంశంతో చిత్రీకరించబడింది. హాలీవుడ్ చిత్రం ఫిలడెల్ఫియా (1993) నుండి ప్రేరణ పొంది చిత్రీకరించారు.

ఈ చిత్రం విడుదల తర్వాత విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినంత విజయవంతం కాలేదు.

ముఖ్యంగా ఈ చిత్రం లో శిల్పాశెట్టి హెచ్‌ఐవి రోగిగా నటించినందుకు అనేక ప్రశంసలు అందుకుంది.

శిల్పాశెట్టి నటన కు ఫిలింఫేర్ అవార్డ్స్ , IIFA అవార్డ్స్ , స్టార్ స్క్రీన్ అవార్డ్స్ మరియు జీ సినీ అవార్డ్స్ లో ఉత్తమ నటి నామినేషన్లను పొందింది.

వైవాహిక జీవితం…

రేవతి గారు 1986లో ఛాయాగ్రాహకులు మరియు దర్శకులు సురేష్ చంద్ర మీనన్‌ను వివాహం చేసుకున్నారు. అనేక సినిమాల్లో వీరిద్దరు కలిసి పనిచేశారు.

అయితే పెళ్లయిన 16 ఏళ్ల తర్వాత వ్యక్తిగత కారణాలతో వీళ్లిద్దరూ విడిపోయారు.

వారి మధ్య విభేదాలు కాకుండా, వారి విడాకులకు రేవతి గారు గర్భవతి కాకపోవడం కూడా ఒక కారణమే.

సంతానం లేకపోవడం వారి అనుబంధాన్ని దెబ్బతీసింది.

కొన్నేళ్లుగా వీళ్లిద్దరి మధ్య సఖ్యత కొరవడింది. వీరిరువురు 2002 నుండి విడివిడిగా జీవించడం ప్రారంభించారు.

చెన్నై అదనపు కుటుంబ న్యాయస్థానం ద్వారా 23 ఏప్రిల్ 2013 న విడాకులు మంజూరు చేశారు.

విడాకులు తీసుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత, నటి రేవతి ఒక వీర్య దాత సహాయంతో IVF (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ద్వారా 48 యేళ్ల వయస్సులో ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. IVF ద్వారా పుట్టిన బిడ్డకు ఈమె మహి అని నామకరణం కూడా చేసింది.

పురస్కారాలు…

★ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్…

1992 సంవత్సరంలో “తేవార్ మగన్‌” చిత్రానికి గానూ ఉత్తమ సహాయ నటి పురస్కారాన్ని అందుకున్నారు..

2002 సంవత్సరంలో “మిథర్ మై ఫ్రెండ్” ఇంగ్లీష్‌ ఉత్తమ చలన చిత్రం పురస్కారాన్ని గెలుచుకున్నారు..

2011 సంవత్సరంలో “రెడ్ బిల్డింగ్ వేర్ ది సన్ సెట్స్‌” చిత్రానికి గానూ కుటుంబ సంక్షేమంపై ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్‌ పురస్కారం దక్కించుకున్నారు..

★ తమిళనాడు రాష్ట్ర ఫిలిం అవార్డులు..

1990 సంవత్సరంలో “కిజ్హక్కు వాసల్” సినిమాకు గానూ ఉత్తమ నటి పురస్కారం పొందారు..

1998 సంవత్సరంలో “తలైజురై” చిత్రానికి గానూ ఉత్తమ నటిగా ప్రత్యేక బహుమతిని గెలుచుకున్నారు..

★ 2 వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్..

2012 వ సంవత్సరంలో ప్రతిపాదన “మోలీ ఆంటీ రాక్స్” సినిమాకు ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు..

★ దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు..

1983 వ సంవత్సరం లో “మాన్ వాసనై” సినిమాకి ప్రత్యేక అవార్డును దక్కించుకున్నారు..

1988 వ సంవత్సరంలో “కాక్కోత్తిక్కవిలే అపోప్పన్ తాడికల్” సినిమాకు గానూ ఉత్తమ మలయాళ నటిగా పురస్కారం పొందారు..

1992 వ సంవత్సరం లో “అంకురం” సినిమాకు గానూ ఉత్తమ తెలుగు నటిగా పురస్కారం అందుకున్నారు..

1992 వ సంవత్సరం లో “తేవార్ మగన్” సినిమాకు గానూ ఉత్తమ తమిళ నటిగా పురస్కారం స్వీకరించారు..

1993 వ సంవత్సరంలో “మారుప్పాడియం” సినిమా కొరకు ఉత్తమ తమిళ నటిగా పురస్కారం దక్కించుకున్నారు..

1994 వ సంవత్సరం లో “ప్రియాంక” సినిమా కోసం ఉత్తమ తమిళ నటిగా పురస్కారం పొందారు..

★ సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డులు..

1984 వ సంవత్సరం లో “సీతమ్మ పెళ్ళి” సినిమాకి గానూ ఉత్తమ తెలుగు నటి పురస్కారం దక్కించుకున్నారు..

1990 వ సంవత్సరం లో “కిజ్హక్కు వాసల్” సినిమాకి బెస్ట్ తమిళ నటిగా పురస్కారం పొందారు..

1991 వ సంవత్సరం లో “కిలుక్కం” సినిమా కోసం ఉత్తమ మలయాళ నటిగా పురస్కారం అందుకున్నారు..

1991 వ సంవత్సరం లో “తేవార్ మగన్” సినిమాకు ఉత్తమ తమిళ నటిగా పురస్కారం పొందారు..

1994 వ సంవత్సరం లో “ఎన్ ఆసాయ్ మచన్” సినిమాకు స్పెషల్ బెస్ట్ తమిళ నటిగా పురస్కారం దక్కించుకున్నారు..

★ ఫిల్మ్ ఫాన్స్ (అభిమానుల) అసోసియేట్ అవార్డులు..

1983 వ సంవత్సరం లో “కట్టాతే కిలిక్కూడు” సినిమాకు ఉత్తమ మలయాళ నటి అవార్డు దక్కించుకున్నారు..

1984 వ సంవత్సరంలో “పుధుమ పెన్న్” సినిమాకి బెస్ట్ తమిళ నటి పురస్కారం పొందారు..

1984 వ సంవత్సరంలో “మానస వీణా” సినిమా కోసం ఉత్తమ తెలుగు నటి అవార్డు అందుకున్నారు..

1990 వ సంవత్సరం లో “అంజలి” సినిమాకి ఉత్తమ తమిళ నటి అవార్డు పొందారు..

1991 వ సంవత్సరం లో “కిలుక్కం” సినిమా కోసం ఉత్తమ మలయాళ నటి పురస్కారం దక్కించుకున్నారు..

1992 వ సంవత్సరంలో “తేవార్ మగన్” సినిమాకి ఉత్తమ తమిళ నటి పురస్కారం అందుకున్నారు..

1994 వ సంవత్సరం లో “ప్రియాంక” సినిమా కోసం ఉత్తమ తమిళ నటి గా పురస్కారం పొందారు..

★ మైలపూర్ అకాడమీ బెర్క్లీ డ్రామా అవార్డు..

1989 వ సంవత్సరం లో “ఇరవిల్ ఒరు పాగల్” సినిమా కోసం టెలివిజన్‌లో ఉత్తమ నటిగా పురస్కారం అందుకున్నారు..

1984 వ సంవత్సరంలో “పెన్న్” సినిమా కోసం టెలివిజన్‌లో ఉత్తమ నటి పురస్కారం దక్కించుకున్నారు..

★ 33 వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా..

2002 వ సంవత్సరంలో “మిత్ర్ మై ఫ్రెండ్” సినిమాకి కేరళ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సిల్వర్ పీకాక్ జ్యూరీ అవార్డును అందుకున్నారు..

2009 వ సంవత్సరంలో “కేరళ కేఫ్” సినిమాకు గానూ ఉత్తమ మలయాళ చిత్రం “నెట్‌ప్యాక్ (NETPAC) అవార్డు” ను దక్కించుకున్నారు..

★ ఇతర అవార్డులు…

1993 వ సంవత్సరంలో తమిళనాడు ఇయాల్ ఇయిల్ నాటక మాన్రం వారు “కలైమామణి” పురస్కారాన్ని ఇచ్చి సత్కరించారు..

2007 వ సంవత్సరంలో సిఎంఎస్ (CMS) మీడియా సిటిజెన్ వారు “కర్మవీర్ పురస్కార్” అందజేశారు..

★ జీ సినీ అవార్డులు..

2004 వ సంవత్సరంలో “ధూప్” సినిమాకి గానూ ఉత్తమ సహాయ నటి పురస్కారం అందుకున్నారు..

Show More
Back to top button