Telugu Cinema

సినీ, నాటక రంగంలో అభినయ కళామూర్తి.. జె.వి. రమణమూర్తి…

జె. వి. రమణమూర్తి (20 మే 1933 – 22 జూన్ 2016)

అలనాటి సమాజంలో బాల్య వివాహాలు, వితంతు వివాహాలు, కన్యాశుల్కం వంటి సాంఘిక, సామజిక సమస్యల్ని ఎత్తిచూపి వాటిని పారద్రోలేందుకు ప్రజల్లో చైతన్యం తేవడం కోసం గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకాన్ని రచించారు. బాల్య వివాహల ద్వారా ఆడపిల్లలు అనుభవిస్తున్న ఆక్రందనలకు, ఆవేదనకు అద్దం పట్టిన నాటకం కన్యాశుల్కం. ఈ నాటకాన్ని రచించి సుమారు నూరేళ్ళు దాటినా కూడా అందులో సజీవమైన నాటక శిల్పం, సంభాషణా చాతుర్యం, సన్నివేశాల కల్పన ఈ నాటకాన్ని అగ్రస్థానంలో నిలిపివుంచాయి. ప్రస్తుత కాలం నాటికి ఆ సమస్యలు అన్నీ గతించిపోయినా కూడా గురజాడ అప్పారావు గారు వ్రాసిన కన్యాశుల్కం నాటకం మాత్రం సజీవంగా ఉండడానికి కారణం బలమైన ఇతివృత్తం, సామజిక సమస్యలు, జనాల యొక్క భాష, యాసలో నాటకం రచింపబడడం.

ఇంతటి ఖ్యాతిని ఆర్జించిన కన్యాశుల్కం నాటకం ఎంతోమంది నటులకు జీవితాన్నిచ్చింది. వారిలో జె.వి. రమణ మూర్తి గారు ఒకరు. సుమారు ఎనిమిది గంటలు నిడివి కలిగి వేదిక మీద ప్రదర్శించడానికి వీలుగా లేని ఆ నాటకాన్ని భావం చెదరకుండా కుదించి వేదిక మీద ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు జె.వి.రమణమూర్తి గారు. నాటక రంగంలో రమణమూర్తి గారి పేరు ప్రఖ్యాతులు విస్తరించడానికి, సినిమాలలో అవకాశం రావడానికి కన్యాశుల్కం నాటకమే ప్రధాన కారణం. గిరీశంగా జె.వి. రమణమూర్తి గారు, రామప్ప పంతులుగా రమణమూర్తి అన్న గారు అయిన జె.వి.సోమయాజులు దేశ, విదేశాలలో కన్యాశుల్కం నాటకాన్ని ప్రదర్శించి విపరీతమైన కీర్తిని గడించారు.

మునుపటి తరానికి మూర్తి గారు రంగస్థల నటులు, నలుపు తెలుపు సినిమా తరంలో తాను కథనాయకుడు. సహా కథానాయకుడి పాత్రల పోషణలో దిట్ట. రంగు చిత్రాల యుగానికి వచ్చేసరికి గుణచిత్ర నటులు. సుమారు 20 చిత్రాల్లో హీరోగా, అనేక చిత్రాలలో గుణచిత్ర నటులుగా పేరు తెచ్చుకున్న రమణ మూర్తి గారు నిన్న మొన్నటి దాకా టీవీ, రేడియో కళాకారులు. జె.వి. రమణ మూర్తిగా సుప్రసిద్ధుడైన అభినయ మూర్తి జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి గారి గురించి ఒక్క మాటలో, ఒక్క ముక్కలో చెప్పడం, నిర్వచించడం కష్టం.

జీవిత విశేషాలు…

 • జన్మ నామం :    జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి..
 • జననం    :    20 మే 1933
 • స్వస్థలం   :   శ్రీకాకుళం జిల్లాలోని లుకులాం అగ్రహారంలో
 • తండ్రి   :   వెంకట శివ రావు 
 • తల్లి     :   శారదాంబ
 • పిల్లలు   :   కుమార్తెలు శారద, నటన, కుమారులు అరుణ్‌కుమార్‌, హర్షవర్ధన్‌
 • వృత్తి      :    తెలుగు సినిమా నటుడు
 • బంధువులు   :   జె.వి సోమయాజులు (సోదరుడు)
 • సుపరిచితుడు   :   కన్యాశుల్కం లో పాత్ర
 • అవార్డులు    :   నంది అవార్డు
 • మరణ కారణం   :   క్యాన్సర్
 • మరణం   :  22 జూన్ 2016 హైదరాబాదు

జననం…

జె.వి.రమణమూర్తి (జొన్నలగడ్డ వెంకట రమణ మూర్తి) గారు శ్రీకాకుళం జిల్లాలోని లుకులాం అగ్రహారంలో 20 మే 1933లో జొన్నలగడ్డ వెంకట శివ రావు మరియు శారదాంబ దంపతులకు జన్మించారు. విద్యావంతుల కుటుంబంలో పుట్టి పెరిగిన రమణమూర్తి గారు చిన్నప్పట్నుంచే నాటకాలపై మక్కువ పెంచుకొన్నాడు. సైన్స్‌ పట్టభద్రుడైన జె.వి.రమణమూర్తి గారు సినిమాల్లోకి రాకముందు కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. స్నేహితులతో కలసి అసోసియేషన్‌ ఏర్పాటు చేసుకొని నాటకాల్ని ప్రదర్శించేవాడు. ఒకప్రక్కన ఉద్యోగం చేస్తూనే మరో ప్రక్కన రంగస్థల నటుడిగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. గురజాడ అప్పారావు గారు వ్రాసిన కన్యాశుల్కం నాటకం ద్వారా మిక్కిలి ప్రఖ్యాతి పొందారు. కన్యాశుల్కంలోని గిరీశం పాత్రని నాలుగు దశాబ్దాల కాలంలో వెయ్యి సార్లకి పైగా  పోషిస్తూ అపర గిరీశంగా పేరు పొందారు.

జె.వి. రమణ మూర్తి వాళ్ళు అయిదుగురు అన్నదమ్ములు. జె.వి. రమణ మూర్తి గారు మూడో వావారు. మధ్యలో అక్కయ్య ఉన్నారు. మూర్తి గారి నాన్న గారు చిన్నతనంలో పిల్లల్ని నాటకాలు చూడనిచ్చేవారు కాదు. అందుకే వాళ్ళు పదిమంది పిల్లలను కలిసి జట్టుగా ఏర్పడి నాటకాలు వేసేవాళ్ళు. ఊరిలో అందరూ ఉంటారు ఇబ్బంది అని భావించి స్మశానంలో ఎవరూ రారని అక్కడికి వెళ్లి నాటకాలు వేసే వాళ్ళు. నాటకాల పట్ల మూర్తి గారికి వున్న ఆసక్తిని గమనించిన వారి అన్నయ్యలు తనని కూడా వారితోపాటు నాటకాలకు తీసుకు వెళ్లేవారు. మూర్తి గారికి 15 ఏళ్లు వచ్చేటప్పటి నుంచి నాటకాలు వేయడం ప్రారంభించారు. తాను ప్రదర్శించే నాటకాల్లో వాస్తవిక ధోరణి అధికంగా ఉండడంతో అవి ఎక్కువగా ఆదరణ పొందేవి.

తొలి నాటక ప్రదర్శన…

విజయనగరం మహారాజ వారి ఒకప్పటి ఏనుగుల శాల “హస్తబల్ హాల్” లో తొలి నాటక ప్రదర్శన ఇచ్చారు. తాను పాఠశాలలో చదివే రోజుల్లోనే “కవిరాజు మెమోరియల్ క్లబ్” అనే ఒక నాటక సమాజాన్ని నెలకొల్పడం రమణమూర్తి గారికి నాటక రంగంపై ఉన్న జిజ్ఞాసను తెలియజేస్తుంది.  ఆ నాటక సమాజం ఇప్పటికీ కూడా నడుస్తూ ఉండడం చెప్పుకోదగ్గ విశేషం. అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో “ఆత్రేయ” పేరుతో నెలకొల్పిన “విశ్వశాంతి” బహుమతిని రమణమూర్తి గారు అందుకున్నారు.

1955లో హైదరాబాద్ నగరంలో జరిగిన “ఆంధ్ర నాటక పరిషత్” పోటీలలో ప్రఖ్యాత శ్రీ రామ మూర్తి రచించిన “కాళరాత్రి” ప్రదర్శనతో ఉత్తమ నటుడిగా బహుమతి స్వీకరించారు. విజయనగరం మహారాజా కళాశాల నుంచి బిఎస్సి పట్టా తీసుకున్న రమణ మూర్తి గారు కొంతకాలం ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. నట జీవితానికి స్వస్తి చెప్పిన తర్వాత ఎం.ఏ (ఫిలాసఫీ) చేసి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు రమణ మూర్తి గారు. శంకరాభరణం శంకర శాస్త్రి గా పేరు తెచ్చుకున్న జే.వి.సోమయాజులు గారు రమణ మూర్తి గారికి స్వయానా అన్న గారు.

గిరీశం పాత్రలో ఒదిగిపోయిన రమణమూర్తి గారు…

“కన్యాశుల్కం” నాటకాన్ని 1897లో గురజాడ అప్పారావు గారు రచించారు. అప్పట్లో ఆధునిక నాటక రంగంలో “కన్యాశుల్కం” ఒక అనూహ్యమైన సంచలనాన్ని నమోదుచేసింది. ఈ నాటకంలోని పాత్రలు సభ్యసమాజంలో మన చుట్టూ తిరుగుతున్న వ్యక్తులుగానే గోచరిస్తాయి. ఆ రోజుల్లో “కన్యాశుల్కం” ఒక సామాజిక సమస్య. బాల్య వితంతువు బుచ్చమ్మ పాత్ర ఆనాటి ఆచారాలు, సాంప్రదాలకు కట్టుబడిన దయనీయమైన మహిళల జీవితాలకు అద్దం పడుతుంది.

ఈ నాటకం ప్రదర్శితమైన ప్రతీసారి ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నది. అందులో గిరీశం పాత్రలో ఒదిగిపోయి, గిరీశం అంటే ఇలాగే ఉంటారు కాబోలు అనే భావన కలిగించిన అసమాన రంగస్థల నటుడు జె.వి.రమణమూర్తి గారు. తన 20 వ యేట నుండి 43 ఏళ్ల పాటు కన్యాశుల్కం నాటకాన్ని తన స్వీయ దర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చిన ఘనత రమణమూర్తి గారిది. అంతే కాదు “కన్యాశుల్కం” నాటకంలోని పాత్రల మనస్తత్వాన్ని అన్నిటికీ అవగాహన చేసుకుని ఆ పాత్రల స్వభావాలకు సరిపడే నటులను వెతికి పట్టుకొని వారిచేత ఆయా పాత్రను పోషింపజేసిన ఘనత కూడా రమణమూర్తి గారిదే.

కన్యాశుల్కం నాటకం యొక్క నిడివి సుమారు ఎనిమిది గంటలు. కానీ నాటకంలోని పట్టుని, భావాన్ని సడలనీయకుండా సాహిత్యకారులు “అబ్బురి రామకృష్ణా రావు” గారి చేత రెండు గంటలకు కుదించి “నటరాజ కళా సమితి” తరపున వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చిన ఘనత రమణమూర్తి గారిదే. ఆ మధ్య కాలంలో కూడా “పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం” విద్యార్థులకు నాటక ప్రదర్శనలో ఆరు నెలల పాటు శిక్షణ కూడా ఇచ్చారు. తెలుగు వెండితెర మీదికి వస్తున్న కొత్తలో ఒక స్టూడియో ప్రాంగణంలో నటరత్న “ఎన్టీ రామారావు” కు రమణమూర్తి గారు ఎదురయ్యారు. ఎన్టీఆర్ గారు రమణమూర్తి గారి భుజం తడుతూ బ్రదర్ మీరు వేయాల్సిన గిరీశం పాత్రను సినిమాలో నేను ధరించాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ సినిమా తీసే నాటికి మీరు చిత్ర రంగంలోకి అడిగిడలేదు అంటూ ప్రశంసించారు.

ఒక్క కన్యాశుల్కం నాటకం మాత్రమే కాకుండా “ఎవరుదొంగ”, “కప్పలు”, “ఎన్జీవో”, “కీర్తిశేషులు”, “కాలరాత్రి”, “పాణి”, “కాటమరాజు కథ” వంటి అనేక నాటకాలు కూడా రమణమూర్తి గారు ప్రదర్శించిన రంగస్థలం ప్రదర్శనలో ఉన్నాయి. విద్యార్థి దశలో ఉన్నప్పుడు 1947 ఆగస్టు 14న రమణమూర్తి గారు ఒక నాటక ప్రదర్శన ఇస్తున్నారు. స్వాతంత్ర్య ప్రకటన వెలువడిన వెంటనే ఆ వేదిక మీద పతాక ఆవిష్కరణ చేశారు. ఆ అవకాశం తనకు దక్కినందుకు రమణ మూర్తి గారు ఎంతో గర్విస్తుంటారు.

చిత్ర రంగంలో కథనాయకుడిగా…

హైదరాబాదులో “కాలరాత్రి” నాటక ప్రదర్శనకు ప్రఖ్యాత రచయిత డి.వి.నరసరాజు గారు, దర్శకులు తాతినేని ప్రకాష్ రావు గార్లు హాజరయ్యారు. స్ఫుర ద్రూపి, మంచి నటన ప్రదర్శించిన రమణమూర్తి గారి పేరుని ప్రఖ్యాత దర్శకులు ఎల్వి ప్రసాద్ కు వారు సిఫారసు చేశారు. ప్రసాద్ గారి మేనల్లుడు కే.బి.తిలక్ గారు రమణమూర్తి గారి చేత అనుపమ బ్యానర్ మీద 1967లో తాను నిర్మించిన “ఎమ్మెల్యే” సినిమాల్లో సహాయక పాత్ర పోషింప చేశారు. అందులో జగ్గయ్య , సావిత్రి గార్లు ప్రధాన భూమిక పోషించారు. ఆ సినిమా విజయంతో 1958 లో నిర్మించిన “అత్తా ఒకింటి కోడలే” లో కూడా జగ్గయ్యతో పాటు రమణ మూర్తి గారు రెండో హీరోగా నటించారు.

శ్రీ ఫిలిమ్స్ పతాకం మీద సుందర్ లాల్ నహతా నిర్మించిన “మంచి మనసుకు మంచి రోజులు” సినిమాలో ఎన్టీఆర్ గారితో పాటు రెండవ హీరోగా రమణమూర్తి గారికి కి అవకాశాలు లభించాయి. అందులో “రావే నా చెలియా చెలియా నా జీవన నవ మాధురి నీవే” అనే పాటకు రమణమూర్తి అభినయం ఆకట్టుకుంది. నేటికి ఆ పాట సజీవమే. 1958లో అన్నపూర్ణ వారి “మాంగల్య బలం” చిత్రంలో సావిత్రి గారి అన్న సూర్యం పాత్రలో రమణమూర్తి గారు జీవించి నటించారు. అదే సంవత్సరం సుందర్ లాల్ నహత మరో చిత్రం “శభాష్ రాముడు” లో రమణమూర్తి గారు ఎన్టీఆర్ గారికి తమ్ముడు గా నటించేశారు. “జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ములేదురా జానికి గొంకు లేక ముందు సాగిపొమ్మురా” పాటను రమణమూర్తి మీద, “కలకల విరిసి జగాలే పులకించెనే – వలపులు కురిసి సుఖాలే చిలికించెనే”  యుగళగీతాన్ని రమణమూర్తి యం.యస్ రాజం మీద చిత్రించారు. ఈ చిత్రంలో పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో రమణమూర్తి గారు అద్భుతంగా రాణించారు. పై మూడు చిత్రాలు శత దినోత్సవం చేసుకున్నాయి.

విఠలాచార్య సొంత చిత్రం “పెళ్లి మీద పెళ్లి” సినిమాలో రమణమూర్తి గారు తొలిసారి పూర్తిస్థాయి కథనాయకుడిగా కృష్ణకుమారి సరసన నటించారు. 1961 లో నిర్మాత దర్శకుడు పీ.ఏ.పద్మనాభరావు గారు కృష్ణకుమారి, రమణమూర్తి  గార్లు జంటగా “బావ మరదళ్ళు” సినిమా నిర్మించారు. ఆ సినిమా చక్కగా ఆడింది. ముఖ్యంగా అందులో పాటలు అజరామరంగా నిలిచిపోయాయి. “హృదయమా ఓ బేల హృదయమా ఒకేసారి నీకింత సంతోషమా”, “పయనించే మన వలపుల బంగారు నావ, శయనించవే హాయిగా జీవన తారా” అనే యుగళగీతాలు, “నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునే వేళ” అనే ఏక గళ గీతం నేటికీ నిత్య నూతనమే. అదే యేడు భానుమతి గారి సొంత చిత్రం “బాటసారి”లో భానుమతి అన్నగా రమణమూర్తి గారు నటించారు.

ప్రమాదంతో చిత్ర రంగానికి దూరం…

జె.వి.రమణమూర్తి గారు సినీ రంగంలో కథనాయకుడిగా నిలదొక్కుకుంటున్న సందర్భంలో తనను అదృష్టం వెనక్కి లాగింది. కుడి కాలికి మూడు సార్లు ప్రమాదం జరిగింది. దాదాపు 5 ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమకు దూరం కావలసి వచ్చింది. “అమాయకురాలు” చిత్రం డబ్బింగ్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగింది. మూడున్నర ఏళ్ల పాటు మంచం మీదే ఉన్నారు. ఆ తర్వాత మరో రెండు సందర్భాల్లో అదే కాలికి ప్రమాదం జరిగింది. దానివలన ఎన్నో అవకాశాలు కోల్పోయారు. సినిమాలలో నటుడుగా తన రెండో దశ “అనురాగాలు” చిత్రంలో క్యారెక్టర్ నటుడిగా మొదలైంది.  తర్వాత 1978 వరకు రమణమూర్తి గారికి అవకాశాలు రాలేదు.

క్యారెక్టర్ నటుడిగా మారి 1978లో కృష్ణంరాజు చిత్రం “కటకటాల రుద్రయ్య”, కృష్ణ చిత్రం “దొంగల దోపిడి” లో నటించాక అదే సంవత్సరం దర్శకుడు బాలచందర్ గారు రమణమూర్తి గారికి కమలహాసన్ తండ్రిగా మరోచరిత్ర సినిమాతో మంచి బ్రేక్ ను ఇచ్చారు. కళాతపస్వి విశ్వనాథ “సిరిసిరిమువ్వ” సినిమాలో పూజారి పాత్రను రమణమూర్తి గారికి ఇచ్చి తనను క్యారెక్టర్ నటుడిగా నిలబెట్టారు. దానితో వరుసగా బాలచందర్ సినిమాలయిన “ఇది కథ కాదు”, “గుప్పెడు మనసు”, “ఆకలి రాజ్యం”, రమణమూర్తి గారికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలాగే విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన “శుభోదయం”, “సప్తపది”, “శుభలేఖ”, “సిరివెన్నెల” కూడా రమణమూర్తి గారికి మంచి పేరు సంపాదించి పెట్టాయి.

కట్టా సుబ్బారావు గారి దర్శకత్వంలో “గడసరి అత్త సొగసరి కోడలు”, వంటి 11 సినిమాలలో రమణ మూర్తి గారు నటించడం విశేషం. దాసరి గారి చిత్రం “గోరింటాకు”, వి.మధుసూదన రావు గారి చిత్రం “కాంచనగంగ”, జంధ్యాల గారి చిత్రం “ఆనంద భైరవి”, విజయబాపినీడు చిత్రం “నాకు పెళ్ళాం కావాలి”, గిడుతూరి సూర్యం గారి చిత్రం “అమృత కలశం”, మయూరి ఫిలింస్ వారి “కర్తవ్యం” సినిమాలు రమణమూర్తి నటించిన సినిమాలలో కొన్ని మాత్రమే. రమణమూర్తి గారు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 150 చిత్రాలకు పైగా నటించారు. ఎన్ని చిత్రాల్లో నటించినా కూడా తాను నడిచిన బాటను మర్చిపోని మధ్యతరగతి మనిషి రమణమూర్తి గారు.

జె.వి. రమణ మూర్తి గారి పాక్షిక చిత్రాల సమాహారం…

ఎం.ఎల్.ఏ.

అత్తా ఒకింటి కోడలే

మంచి మనసుకు మంచి రోజులు

పెళ్ళి మీద పెళ్ళి

శభాష్ రాముడు

అన్నా చెల్లెలు

బావామరదళ్లు

బాటసారి

అమాయకురాలు

కటకటాల రుద్రయ్య

దొంగల దోపిడి

మరో చరిత్ర

సిరి సిరి మువ్వ

ఇది కథ కాదు

గుప్పెడు మనసు

గోరింటాకు

మూగకు మాటొస్తే

మొగుడు కావాలి

శుభోదయం

సప్తపది

అమృతకలశం

ఆకలి రాజ్యం

గడసరి అత్త సొగసరి కోడలు

శుభలేఖ

ఆనంద భైరవి

కాంచనగంగ

డేంజర్ లైట్

శ్రీ దత్త దర్శనం

సిరివెన్నెల

నాకు పెళ్ళాం కావాలి

ఏడు కొండలస్వామి

కర్తవ్యం

కొబ్బరి బొండాం

ఆర్య

నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ ప్రతి సంవత్సరం సినిమా, టెలివిజన్ రంగాలతోపాటు నాటకరంగానికి కూడా నంది పురస్కారాలను అందజేస్తుంది. నాటకరంగానికి విశేషమైన సేవలందించిన వారికి “నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం” పేరిట ఒక లక్ష రూపాయల నగదు పారితోషికంతో ఘనంగా సత్కరిస్తున్నారు. 2015 సంవత్సరానికి గాను జె. వి. రమణమూర్తి (సాంఘిక నాటకం) గారికి అందజేశారు. ఈ పురస్కారాన్ని 2016 జనవరి 27న ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జె.వి.రమణమూర్తి గారికి పురస్కార ప్రధానం జరిగింది.

మరణం…

నాలుగేళ్లు క్యాన్సర్ తో బాధపడిన రమణమూర్తి గారు 22 జూన్ 2016 నాడు తీవ్ర అశ్వస్థకు గురయ్యి హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. రమణమూర్తి గారికి ఇద్దరు కుమారులు అరుణ్ కుమార్, హర్షవర్ధన్ లు. ఇద్దరు కుమార్తెలు నటన, శారద ఉన్నారు.

Show More
Back to top button