బసవరాజు వెంకట పద్మనాభ రావు (20 ఆగస్టు 1931 – 20 ఫిబ్రవరి 2010)
పాతాళభైరవి సినిమాలో మాంత్రికుడు “సదా జపా” అని పిలిస్తే “ఓయ్ గురు” అని పలికిన ఓ కుర్రాడు, ఆ తర్వాత తన హాస్యాన్నే తన ఊపిరి చేసుకుని దాన్నే సదా జపిస్తూ వచ్చాడు. తన హాస్యం తో రెండు, మూడు దశాబ్దాల పాటు ప్రేక్షక జనాన్ని నవ్వుల జల్లుల్లో తడిపిన నట ప్రముఖులు. పలు చిత్రాలు నిర్మించి విజయాలూ, ప్రశంసలూ పొందిన విలక్షణ కళాభిజ్ఞుడు. అనేకమంది కొత్తవారిని పరిచయం చేసి సినీజీవితం అందించిన అనుభవశాలి. శ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రం ద్వారా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని గాయకునిగా పరిచయం చేసిన ఘనులు. వారే పద్మనాభం గారు.
పద్మనాభం గారు తెలుగు తెర హాస్య నటశ్రేణిలో అగ్రగణ్యులు. మీరు ఎవరండీ అచ్చు పద్మనాభం లాగా ఉన్నారు అని ఏదో సినిమాలో ఒక హాస్య నటి అంటే మురిసిపోయిన పద్మనాభం గారు ఎన్నో అసలు సిసలు పనులు చేసి చూపించాడు. ఆరోగ్యకరమైన నవ్వు, ఆహ్లాదకరమైన సినిమా, అద్భుతమైన నిర్మాణం, మంచి దర్శకత్వం, వినసొంపైన సంగీతం. అచ్చు ఆడపిల్ల గొంతు లాగా ఉంది. ఇదేమి గొంతు అని బాలసుబ్రమణ్యం గారిని అందరు వెక్కిరిస్తుంటే, నీవు పాడు బాబు పైకొస్తావని తన చిత్రం “శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న” లో “ఏమి వింత మోహమో” పాటతో తన సినీ రంగ ప్రవేశానికి స్వీకారం చుట్టించారు.
తెరమీద నవ్వులు రువ్విన వాళ్లందరి జీవితాలు పూల బాటలు కావు. ఇది నగ్న సత్యం. అలాగే పద్మనాభం జీవితం కూడా. ప్రతీ మనిషి జీవితంలోను సుఖ దుఃఖాలు, ఎత్తు పల్లాలు సహజమే. పెదాలకు మనసు ఉండాలి. లేదంటే ఆ పెదాల నుండి జారే ఆ నవ్వుల్లో శూన్యం తప్ప మరేమీ ఉండదు. హాస్యనటుడైన ప్రతి ఒక్కరు ఈ మాట నమ్మి తీరాలి. పద్మనాభం గారు ఈ వాక్యాన్ని తన జీవన సూక్తిగా మలుచుకున్నారు.
మిగిలిన హాస్య నటులెవర్ని గుర్తుచేసుకున్నా కూడా వారి హావభావాలు, సన్నివేశాలు గుర్తుకొస్తాయి. వారందరిలోనూ అతి ప్రఖ్యాతులైన రాజబాబు గారిని తల్చుకుంటే హడావుడి, బ్రహ్మానందం గారిని గుర్తుచేసుకుంటే వింత వింత వేషాలు మదిలో మెదులుతాయి. కానీ పద్మనాభం గారిని అనుకోగానే “అయ్యొ అయ్యొ” అని ముక్కుతో మాట్లాడే విదూషకుడే సాక్షాత్కరిస్తాడు. అదే తన ప్రత్యేకత. ప్రేక్షకులకు నవ్వును పంచే క్రమంలో నటుడు అప్పుడప్పుడు హద్దులు దాటుతుంటాడు. కానీ పద్మనాభం గారు మాత్రం ఏనాడూ తాను గీసుకున్న గీత దాటలేదు. గిరిలో ఉంటూనే హాస్యాన్ని హిమగిరి మీద కూర్చోబెట్టారు. తన మాటలతో నవ్వు, పెదాల కదలికకు పని లేని చోట తన వేష భాషలతోనూ, అవి కూడా అక్కరకు రానప్పుడు తన హావభావాలతోను నవ్వుల యాత్ర చేయించారు. నవ్వించే విద్య వస్తే అన్ని విద్యలు అభినట్టే అనేది తన అభిప్రాయం.
రేలంగిని చూస్తే చాలు పొట్ట చెక్కలే. కస్తూరి శివరావు, రమణారెడ్డి, బాలకృష్ణ, చదలవాడ, రాజబాబు లాంటి వాళ్ళని చూస్తే కూడా పెదవులపై నవ్వుల వరదలే. అవును మరి వాళ్ళ మొహాలకి, వ్యవహార శైలిలోనే హాస్యం తొణికిసలాడుతుంది. మరి పద్మనాభం మొహం చూస్తేనేమో చాలా మాములుగా ఉంటుంది. మరి హాస్యం ఎలా పుడుతుంది. కానీ పుట్టించాడు. తాను తన పాత్రలతోనే విపరీతమైన నవ్వును సృష్టించాడు. హాస్యానికి గురువు అయిపోయాడు. పాతాళభైరవి తో “గురు” అనే ఊతపదాన్ని తెలుగు నాట ప్రసిద్ధి పొందింది తన ద్వారానే కదా.
నాటకాల మీద రక్తితో సినీరంగంలో ప్రవేశించి అనేక ఢక్కాముక్కీలు తింటూ దాన్నే నమ్ముకుని అంచలంచెలుగా ఎదిగిన వ్యక్తి పద్మనాభం గారు. రేలంగి ఏకచ్ఛత్రంగా ఏలుతున్న కాలంలో రేలంగికి, రమణారెడ్డికి మధ్య తనకూ చోటు చిక్కించుకోవడం కేవలం పద్మనాభం గారి ప్రతిభకు నిదర్శనం.
@ జీవిత విశేషాలు…
జన్మ నామం : బసవరాజు వెంకట పద్మనాభ రావు
ఇతర పేర్లు : పద్మనాభం
జననం : 20 ఆగస్టు 1931
స్వస్థలం : సింహాద్రిపురం, పులివెందుల తాలూకా , కడప జిల్లా
తండ్రి : వెంకట శేషయ్య
తల్లి : శాంతమ్మ
వృత్తి : తెలుగు సినిమా, రంగస్థలనటుడు, సినీనిర్మాత, దర్శకుడు, హాస్య నటుడు
మతం : హిందూ మతం
మరణ కారణం : గుండె పోటు
మరణం : 20 ఫిబ్రవరి 2010, చెన్నై, తమిళనాడు
@ బాల్యం…
పద్మనాభం గారు కడప జిల్లాలోని పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామం లో బసవరాజు వెంకట శేషయ్య, శాంతమ్మ దంపతులకు 20 ఆగస్టు 1931 లో జన్మించారు. చిన్నప్పుడు తనకు చదువు మీద అంత ఆసక్తి ఉండేది కాదు. చదువు మీద కంటే గ్రామ్ ఫోన్ పాటల మీదే తన ధ్యాసంతా ఉండేది. పాటలు వినడం, పాడడం, టెంట్ సినిమాలకు వెళ్లడం ఇదే తన దినచర్య గా ఉండేది. ఆ రోజుల్లో వేమూరు గగ్గయ్య గారి పాటలు, పద్యాలను తాను అమితంగా ఇష్టపడేవారు. తనను అవి బాగా ఆకర్షించడంతో వాటినే ఎక్కువగా పద్మనాభం గారు అనుకరించేవారు. ఆ రకంగా తాను సింహాద్రిపురంలో అతి కష్టం మీద ఐదో తరగతి వరకు పాఠశాల చదువు కొనసాగింది. అటుపైన పై చదువుల కోసం ప్రొద్దుటూరు వచ్చారు. అక్కడ కూడా తన చదువు కొనసాగలేదు. తాను చూసే సినిమాల ప్రభావం వల్ల, నాటకాల మీద ఆసక్తితోనూ “చింతామణి” నాటకంలో శ్రీకృష్ణుని పాత్ర ధరించారు. దాంతో చదువుకు స్వస్తి చెప్పి నాటకాల పట్ల ఆసక్తి పెంచుకున్నారు.
@ సినీ నేపథ్యం…
పద్మనాభం గారికి చిన్నప్పుడు తాను స్వంతంగా ఒక సైకిల్ కొనుక్కోవాలి అనే ఒక కోరిక ఉండేది. మద్రాసు వెళ్లి ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించి ఆ డబ్బుతో సైకిల్ కొనుక్కోవాలి. ఆ కోరికతో తాను రైలెక్కి 1943లో తన చిన్నాయన సుదర్శనతో కలిసి మద్రాసుకు బయలుదేరారు. మద్రాసు కు వెళ్లిన తనకు మొట్టమొదటి ఆవాసం కల్పించింది నటి కన్నాంబ గారే. పద్మనాభం గారు మాములుగానే పాటలు పాడేవారు. తన గాత్రం విన్న కన్నాంబ గారు మొదట తన రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీలో “పాదుకా పట్టాభిభిషేకం” చిత్రంలో కోరస్ పాట పాడడానికి అవకాశం ఇచ్చారు. దాంతో ఆ చిత్రంలో కోరస్ పాట పాడారు. అందులో నాగయ్య, కన్నాంబ గార్లు ప్రధాన పాత్రధారులు. ఆ చిత్రమే పద్మనాభం గారికి సినిమా రంగ ప్రవేశానికి నాంది పలికింది.
నిజానికి ఈ సినిమా కి ముందు అనేకానేక కష్టాలు అనుభవించిన తాను కన్నాంబ గారు చేరదీసి భోజనం పెట్టకపోతే, తాను అవకాశామిచ్చి ఇలా సినిమా రంగంలోకి ఆహ్వానించక పోతే నిజానికి పద్మనాభం అనే హాస్య నటులు తెలుగు తెర మీద నవ్వుల పువ్వులు పూయించేవారు కాదు. అయితే మొహానికి రంగు పూసుకుని మొట్టమొదటిసారిగా తాను సినిమాలో నటించిన చిత్రం మాయ లోకం (1944). చిన్న బాల్యం రాకుమారుడుగా గూడవల్లి రామబ్రహ్మం గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పద్మనాభం గారు మొదటిసారి కెమెరా ముందుకు వచ్చారు. సారథి ఫిలిమ్స్ నిర్మాణంలో గాలి పెంచల నరసింహారావు గారు సంగీతం అందించిన ఈ చిత్రానికి గూడవల్లి రామ బ్రహ్మం గారు దర్శకత్వం వహించగా గోవిందరాజుల సుబ్బారావు, సిఎస్సార్ ఆంజనేయులు, కన్నాంబ, టీ.జీ.కమలదేవి, అక్కినేని నాగేశ్వరావు, శాంతకుమారి, ఎం.వి.రాజమ్మ గార్లు ఇందులో తారాగణం.
పద్మనాభం గారి రెండవ చలనచిత్రం “త్యాగయ్య”. అందులో నాగయ్య గారి శిష్యుడిగా నటించారు. ఇక తాను నటించిన మూడవ చిత్రం ముగ్గురు మరాఠీలు. ఆ తరువాత తాను యోగివేమన లో నటించారు. ఆ విధంగా ఒక్కో సినిమాలో నటిస్తూ తన సినీ జీవితాన్ని ముందుకు నడిపిస్తూ తన నట జీవితంలో స్థిరపడుతూనే నారద నారది, భక్త సిరియాల చిత్రాలలో నటించారు. 1947 వ సంవత్సరంలో వెంపటి సదాశివ బ్రహ్మం గారు రచన చేయగా కాళ్లకూరి సదాశివరావు గారు దర్శకత్వం వహించిన “రాధిక” చిత్రంలో నటించారు. రావు బాల సరస్వతి గారు కథనాయికగా నటించిన “రాధిక” లో పద్మనాభం, కళ్యాణం రఘురామయ్య, దాసరి కోటిరత్నం గార్లు ఇందులో నటించారు.
1949 వ సంవత్సరంలో విజయా ప్రొడక్షన్స్ వారి షావుకారు చిత్రంలో నటించారు. ఎల్వీ ప్రసాద్ గారి దర్శకత్వంలో నాగిరెడ్డి – చక్రపాణి నిర్మాతలు గా షావుకారు జానకి గారికి తొలి చిత్రం అదే కావడం విశేషం. ఇందులో ఎన్టీఆర్, గోవిందరాజులు, శాంతకుమారి, జోగారావు, సీత, శివరావు, బాలకృష్ణ గార్లు తారాగణం. అయితే 1950లో విడుదలైన విజయా వారి “పాతాళ భైరవి” లో నేపాల మాంత్రికుడు ఎస్వీ రంగారావు గారి శిష్యుడు పాత్రతో పద్మనాభం గారికి మంచి పేరు వచ్చింది. అదే తన హాస్య పాత్రలకు మూలం. దాంతో తిరుగులేకుండా మూడేళ్ల పాటు విజయా సంస్థలోనే శాశ్వత కళాకారునిగా పూర్తి స్తాయి సినిమాలలో పనిచేస్తూ వచ్చారు.
ఆ తర్వాత అదే సంస్థ పైన “పెళ్లి చేసి చూడు”, “చంద్రహారం” చిత్రాలలో నటించారు. ఈ రెండు చిత్రాలు తమిళంలో కూడా చిత్రీకరించారు. 1954 వ సంవత్సరంలో “శ్రీకాళహస్తి మహత్యం”, సుందర్ లాల్ నెహతా చిత్రం “సతీ అనసూయ”, “శ్రీకృష్ణ లీలలు”, “సతీ సుకన్య”, “కృష్ణ ప్రేమ” నారదుడి వేషం వేశారు. కానీ ఎన్టీఆర్, సావిత్రి, కన్నాంబ, సరోజ గార్లు నటించిన “కార్తవరాయని కథ” చిత్రంలో బాలకృష్ణ కు అసిస్టెంట్ గా కామెడీ విలన్ గా నటించారు పద్మనాభం గారు. ఆ తర్వాత “పాండురంగ మహత్యం”, “జయసింహ”, “వెలుగునీడలు” చిత్రంలో నటించిన పద్మనాభం గారు 1960లో భార్యాభర్తలు సినిమాతో సినిమా రంగంలో పూర్తి స్థాయి హాస్య నటుడుగా మారిపోయారు.
ఆ తర్వాత వచ్చిన “ఇద్దరు మిత్రులు”, “పూలరంగడు”, “కుల గోత్రాలు”, “వాగ్దానం” లాంటి చిత్రాలు కూడా హాస్యానటుడిగా తనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. 1964లో పద్మనాభం గారి సొంత నిర్మాణ సంస్థ రేఖ అండ్ మురళీ ప్రొడక్షన్ లో నిర్మించిన తొలి చిత్రం “దేవత” లో నటించారు. ఈ బ్యానర్ లో “పొట్టి ప్లీడర్”, “శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న” చిత్రాలలో నటించారు. కాగా 1968 లో తమ స్వంత బ్యానర్ లో వచ్చిన “శ్రీరామ కథ” చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించారు.
1970 వ సంవత్సరంలో పద్మనాభం గారు తీసిన “కథానాయిక మొల్ల” చిత్రానికి గానూ ఉత్తమ చిత్రం గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చింది. ఆ తర్వాత “జాతకరత్న మిడతం బొట్లు”, “మాంగళ్యబలం”, “ఆజన్మ బ్రహ్మచారి”, “సినిమా వైభవం”, “హాస్య అభిషేకం” చిత్రాలలో నటించారు. “దేశోద్ధారకులు” చిత్రంలో పూర్తిగా కరుణరసం పండిన పాత్రలో నటించారు. ఇలా తన చలనచిత్ర జీవితంలో దాదాపు 400 పైచిలుకు చిత్రాల్లో వివిధ పాత్రలలో నటించి పద్మనాభం గారు ప్రేక్షకుల హృదయాలలో తనదైన ముద్ర వేసుకున్నారు.
@ నిర్మాత గా, దర్శకుడిగా…
నటుడిగా విజయవంతంగా ఎదిగిన పద్మనాభం గారు నిర్మాతగా కూడా పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. తొలి ప్రయత్నంగా ఎన్టీఆర్, సావిత్రి జంటగా దేవత చిత్రాన్ని నిర్మించారు పద్మనాభం గారు. కె.హేమాంబరధరరావు దర్శకత్వంలో రేఖా & మురళీ ఆర్ట్స్ పతాకం పై పద్మనాభం గారు నిర్మించిన ఈ సినిమా విజయం సాధించడంతో బమిడిపాటి రాధాకృష్ణ గారు వ్రాసిన ఇదేమి నాటకం ఆధారంగా “పొట్టి ప్లీడర్” చిత్రాన్ని నిర్మించారు. పద్మనాభం గారు ఈ చిత్రంలో టైటిల్ పాత్రను పోషించగా శోభన్ బాబు, గీతాంజలి గార్లు జంటగా నాయకా, నాయికలుగా నటించారు. 1960 లో పద్మనాభం గారు నిర్మాతగా రూపొందిన “శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న” చిత్రం తనకు ఎంతో పేరు తెచ్చి పెట్టింది. అంతేకాకుండా ఈ చిత్రం ద్వారా పద్మనాభం గారు గాయకుడిగా తెలుగు వారికి గర్వకారణమైన ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి తొలి సినిమా అవకాశం ఇచ్చారు. ఈ మూడు చిత్రాలకు హేమాంబరధరరావు గారు దర్శకత్వం వహించారు.
శ్రీ రామ కథ సినిమాతో పద్మనాభం గారు దర్శకుడిగా మారారు. 1969లో పద్మనాభం స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో “కథానాయిక మొల్ల” చిత్రం తో రసజ్ఞులను మెప్పించడమే కాక అప్పటి రాష్ట్ర ప్రభుత్వ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. వీటితో పాటు “జాతకరత్న మిడతం బొట్లు” చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషలలో నిర్మించారు. గుహనాథన్ గారు వ్రాసిన తమిళ నాటకం “కాశీ” ఆధారంగా తాను నిర్మించిన “ఆజన్మ బ్రహ్మచారి” చిత్రంలో నాగభూషణం గారు టైటిల్ పాత్ర పోషించారు. రామకృష్ణ, గీతాంజలి ఇందులో జంటగా నటించారు. ఆ తర్వాత భానుమతి ప్రధాన పాత్రగా “మాంగల్య భాగ్యం” చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమాలో పద్మనాభం, రమాప్రభ గార్లు జంటగా నటించారు. అనేక రంగస్థల ప్రదర్శనలు ఇచ్చిన పద్మనాభం గారు మిమిక్రీ చేయడంలో కూడా సిద్ధహస్తులు. పద్మనాభం గారు మంచి గాయకులు కూడా. దేవత సినిమాలో “మా ఊరు మదరాసు నా పేరు రాందాసు కమ్మని నీ ఫోజు” పాట పాడమే కాకుండా కృష్ణ నటించిన తొలి చిత్రం తేనె మనసులు తనకు ప్లే బ్యాక్ కూడా పాడారు.
@ నాటకాలలో…
పద్మనాభం గారు 1958 వ సంవత్సరంలో వల్ల నరసింహారావు గారితో కలిసి “శాంతినివాసం” స్టేజీ నాటకంలో నటించారు. 1960లో “శ్రీకాళహస్తి మహత్యం” లో కాశీ పాత్రలో, “పేరిగాడు రాజంట” లో పేరిగాడు పాత్రలో నటించారు. ఎలాంటి ట్రూపు లేకుండా పద్మనాభం గారు సొంతంగా ప్రదర్శించిన “చింతామణి” నాటకం విజయవంతం అయ్యింది. పేరిగాడి పాత్ర కూడా విజయవంతం అయ్యింది. 1944 నుండి 1946 వరకు “తుకారాం”, “రామదాసు”, “శ్రీకృష్ణ లీలలు”, “రంగూన్ రౌడీ”, “హరిచంద్ర” నాటకాలలో ఈలపాటి రఘురామయ్య, నామదేవ, ఋష్యేంద్రమణి లతో కలిసి నటించారు. సూరిబాబు తారాశశాంకం లో చంద్రుడిగా నటించారు. ప్రజానాట్యమండలి వారి అల్లిముఠా లో చదలవాడ కుటుంబరావు గారితో నటించారు. విశ్వశాంతి నాటకం లో కూడా నటించారు.
@ టి.వి.సీరియల్స్ లో…
దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రంలో ప్రసారమైన “గయ్యాళి భార్య”, “నీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర”, “అనగనగా ఒక శోభ” లలో పద్మనాభం గారు నటించారు. వాటితో తనకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ప్రైవేట్ టీవీ ఛానల్ రాడాన్ ప్రొడక్షన్స్ “ఇది కథ కాదు”, “శ్రీమతి”, జయసుధ గారి జనని సీరియల్స్ లోకూడా నటించారు. పి.ఎన్.రామచంద్రరావు గారు నిర్మించిన గోల్ మాల్ సీరియల్ లో నటించారు. ఇది కూడా తనకు మంచి పేరు తెచ్చింది. ఇవే కాక రేడియోలో 1944 నుంచి అనేక నాటకాల్లో నటించారు.
@ కొండ నుండి నేలకు, ఆ పైన నింగికి…
వెలుగు, చీకటి ల తెర మీద నవ్వి నవ్వి అలసిపోయియారు పద్మనాభం గారు. పరులను నమ్మి మెసపోయారు. మూడు దశాబ్దాల పాటు వెండి వెలుగులతో వెలిగిపోయిన హాస్య చక్రవర్తి పద్మనాభం గారు. నటుడిగానే కాదు, దర్శకుడిగా, నిర్మాతగా కూడా దేవత, పొట్టి ప్లీడర్, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న, కథానాయిక మొల్ల, శ్రీరామకథ ఇలా ఇప్పుడు క్లాసిక్స్ గా నిలిచిన తెలుగు చిత్రాలన్నీ తాను ఊపిరి పోసిన సూపర్ హిట్ చిత్రాలే.
స్నేహితులు దగ్గర సిమిమా కోసం తీసుకున్న అప్పు ఆయన పీకకు చుట్టుకుంది. అదెలాగంటే మందుపార్టీ అని చెప్పి సదరు స్నేహితులు పద్మనాభం గారు తీసిన సినిమాల మీద నెగటివ్ రైట్స్ వ్రాయించుకున్నారు. అదీ 99 సంవత్సరాలకి. మందు మాయలో చేసిన పొరపాటును తాను గమనించలేకపోయారు. తనకు ఎంతో పేరు ప్రతిష్టలను, డబ్బుని తెచ్చే బంగారు బాతులాంటి సినిమాలు చేజారిపోయాయి. తన సినీ వైభవం అట్టర్ ఫ్లాప్ గా నిలిచిపోయింది. ఒక్క తప్పుడు నిర్ణయం మొత్తం బ్రతుకునే తల క్రిందులు చేసేసింది. కొండ మీద నుంచి నేల మీదకు తొసేసింది. జీవితంలోని రంగులన్నీ కక్షగట్టి అతని జీవితంలో వెకిలిగా నిలబెట్టాయి. అంతా విధి.
అప్పటి దాకా కూడేసుకున్న మిద్దెలు, పొలాలు అన్నీ కరిగి నీరైపోయి, బజారులోకి లాగేసాయి. ఇక నగా, నట్రా అన్నా ఏదైనా ధర పలుకుతాయని చూస్తే అదీ మోసమని తేలింది, పగిలిపోతున్న గుండెను చేతపట్టుకుని తిరిగి మళ్ళీ ఈ పాపపు లోకంలోకి వచ్చి పడ్డారు. ఈ కష్ట కాలంలోనే పాతిక లక్షల విలువైన వజ్రపుటుంగరం నకిలీదని తేలింది పాపం. మతి పోగొట్టుకుని, కట్టుబట్టలతో రోడ్డున పడ్డాడు. దీంతో తన మతి భ్రమించింది. చికిత్స పొంది తేరుకున్నా ఆర్థిక ఇబ్బందులు మాత్రం తనను చివరికంటా వెంటాడుతూనే ఉన్నాయి. చివరి దశలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ పద్మనాభం గారు 26 ఫిబ్రవరి 2010 ఉదయం చెన్నైలో గుండెపోటుతో మరణించారు.