Telugu Cinema

ఓరచూపు లోనే వలపంతా దాచగల అందాల తార. నటి మంజుల.

అందం, నటన మంజుల ఈ రెండు కుడా నాణేనికి రెండు వైపులా ఉన్న బొమ్మ బొరుసు లాంటివి. కొందరు కేవలం అందం తో మాత్రమే పుడతారు. ఇంకొందరికి నటించడం మాత్రమే తెలుస్తుంది. ఈ రెండూ కలగలిసిన వ్యక్తులు కొందరే ఉంటారు. వారిలో నటి మంజుల ఒకరు. మంజుల కేవలం అందానికి ప్రతిరూపం మాత్రమే కాదు. అందం మాటున బొమ్మ వెనుక బొరుసులా మంచి నటి కూడా ఉంది. అందం, అభినయం మిలితమయ్యాయి గనుకనే తాను దశాబ్ది కాలం చిత్రసీమను ఏలగలిగారు.

చక్కటి రూపలావణ్యం, ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే అద్భుతాభినయంతో తెలుగు సినిమా యువనికపై తనదైన ముద్ర వేశారు. తెలుగు సినిమా గర్వించదగ్గ నాయికల్లో మంజుల ఒకరంటే అతిశయోక్తి కాదు. దాదాపు మూడు దశాబ్దాల పాటు తన విలక్షణ నటనతో దక్షిణాది ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న నటి మంజుల గారు.

యాభై ఏళ్ళ క్రితం కుర్రకారు కలల రాణి తాను. దశాబ్ది కాలం పాటు అందం, అభినయం కలబోతై సమ్మోహన పరచిన స్నిగ్ధ కలువ.తుశార తుంపరలో విలాసంగా ఊగిన మల్లెమొగ్గ మంజుల గారు. ఆమె ముత్యాల పలువరసల నుండి ఒలికిన నవ్వుకు వెన్నెలే సిగ్గుపడేది.తమిళ తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ఈనాటికీ నిలిచిపోయిన అభినేత్రి తాను. 

చిలకపచ్చ చీరకట్టి చేమంతి పూలుపెట్టి సోకుచేసుకొచ్చానురో.. ఓరయ్యో చుక్కలాంటి చిన్నదాన్నిరో (మా ఇద్దరి కథ), మన్నించుమా ప్రియా, మన్నించుమా.. మరుమల్లె నల్లగా వుంటే (నాపేరే భగవాన్), మనసెందుకో.. మనసెందుకో.. ఓ మోసగాడా (మనుషులు చేసిన దొంగలు), పడకు పడకు.. వెంట పడకు (మంచి మనుషులు), నేనీదరిని.. నువ్వాదరిని.. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ (బంగారుబొమ్మలు), నిన్నేపెళ్ళాడుతా .. రాముడు భీముడు (మనుషులంతా ఒక్కటే) ఈ పాటలన్నీ గుర్తుచేసుకుంటే తప్పక గుర్తొచ్చే ఓ వెండితెర మెరుపు తీగ మంజుల.

మంజుల గారు మొదట శాంతి నిలయం (1969) చిత్రంలో జెమినీ గణేషన్ పాత్ర యొక్క యుక్తవయసులో మేనకోడలుగా సహాయక పాత్రలో నటించారు.  తన మొదటి ప్రధాన పాత్ర రిక్షాకారన్ ( 1971). ఆమె డెబ్బైల చివరి వరకు అనేక చిత్రాలలో ప్రధాన పాత్రలలో నటించారు. 80వ దశకం చివరి నుండి, తాను ఎక్కువగా సహాయక పాత్రలలో కనిపించారు. మంజుల R. ముత్తురామన్ , శివాజీ గణేశన్ , జెమినీ గణేశన్ , MG రామచంద్రన్ , నందమూరి తారక రామారావు , అక్కినేని నాగేశ్వరరావు , కృష్ణ, శోభన్ బాబు , కమల్ హాసన్ , విష్ణువర్ధన్ మరియురజనీకాంత్ మొదలైన అగ్రనటులతో నటించారు.

ఎన్టీఆర్ గారితో “నేరం నాది కాదు ఆకలిది”, “మనుషులంతా ఒక్కటే”, అక్కినేని గారితో “మహాకవి క్షేత్రయ్య”, “బంగారు బొమ్మలు”, శోభన్ బాబు గారితో “జేబుదొంగ”, “మంచి మనుషులు”, కృష్ణ గారితో “దేవుడు లాంటి మనిషి”, “మాయదారి మల్లిగాడు” లాంటి సుమారు వందకు పైగా చిత్రాలలో నటించారు మంజుల గారు. నటుడు విజయ కుమార్ ను వివాహమాడిన తాను తన పిల్లలైన వనిత, ప్రీతి, శ్రీదేవి లను కూడా తన నట వారసత్వంగా సినిమాలోకి తీసుకొచ్చారు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    మంజుల విజయకుమార్

ఇతర పేర్లు  :    మంజుల  

జననం    :   4 జూలై 1954 

స్వస్థలం   :     చెన్నై 

నివాసం   :    చెన్నై 

తండ్రి   :   సారంగపాణి

తల్లి     :    కౌసల్య 

భర్త     :    విజయకుమార్ 

వృత్తి      :    నటి 

పిల్లలు    :    వనిత విజయకుమార్ 

ప్రీత విజయకుమార్ 

శ్రీదేవి విజయకుమార్ 

అరుణ్ విజయ్ (step-son)

కవిత విజయకుమార్ (step-daughter)

డాక్టర్ అనిత విజయకుమార్ (step-daughter)

మరణం    :  23 జూలై 2013,  శ్రీ రామచంద్ర హాస్పిటల్ – G బ్లాక్, చెన్నై

నేపథ్యం…

మంజుల గారు 04 జులై 1954 నాడు తమిళనాడు లోని చెన్నై లో సారంగపాణి రావు, కౌసల్య దంపతులకు జన్మించారు. మంజుల గారి నాన్న గారు నెల్లూరులో రైల్వే శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా పని చేసేవారు. వాళ్ళ అమ్మ కౌసల్య గారిని ఆ రోజులలోనే మంజుల గారి నాన్న గారు మతాంతర వివాహం చేసుకున్నారు. మంజుల గారికి ఒక అక్క ఉంది. ఆమె పేరు శ్యామల. అక్క అంటే మంజుల కు పంచప్రాణాలు. మంజుల గారి నాన్న గారి స్వస్థలం విజయవాడ. మంజుల గారి అమ్మది తమిళనాడు.

తన తాత గారు సర్ సి.ముత్తుస్వామి అయ్యర్ గారు మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేసేవారు. ఈ రోజుకు కూడా హైకోర్టు ఆవరణలో తన తాత గారి రాతి విగ్రహం ఉంది. వారిది మొదటి నుంచి ధనవంతుల కుటుంబమే. కుటుంబ అవసరాలకు వారికి దిగులు లేదు. మంజుల గారి నాన్నగారు ఊరు ఊరు తిరిగి చివరికి మద్రాస్ లో స్థిరపడిపోయారు. అయితే ఇలా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మారుతూ ఉండటం వలన తెలుగు, హిందీ, తమిళ భాషలు నేర్చుకోవడానికి వీలైంది. నాకు మద్రాసు “గుడ్ షెఫర్డ్ కాన్వెంట్” లో మెట్రిక్ వరకు చదువుకున్నారు. షావుకారు జానకి గారి అమ్మాయి కృష్ణశచి మంజుల గారి క్లాస్ మేట్.

మంజుల గారికి చిన్నతనం నుండి సినిమాలు అంటే బాగా పిచ్చి. తాను తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు వరుస పెట్టి చూసేవారు. స్కూలుకు సైకిల్ మీద వెళుతూ దారిలో గోడలపై అంటించిన ఎం.జీ.ఆర్, జెమినీ గణేషన్, బి.సరోజాదేవి వాల్ పోస్టర్లను తదేకంగా చూస్తూ ఉండిపోయేవారు. ఆ పోస్టర్ల లో సరోజాదేవి స్థానంలో తాను ఉన్నట్లు ఊహించుకునేవారు. అలా పగటి కలలు కంటూ రోడ్లమీద ఊహల్లో తేలిపోతూ సైకిల్ పై నుండి పడిపోయి గాయాలు తగిలించుకున్న రోజులెన్నో తన దినచర్య లో ఉండేవి.

బాల్యం…

ఆ రోజుల్లో ఏవైనా సినిమా చిత్రీకరణ జరుగుతుంది అంటే బడి ఎగ్గొట్టి చూడడానికి వెళ్లేవారు. స్టూడియో వద్దనున్న వాచ్ మెన్ మెడబట్టి గెంటేస్తున్నా ఎలాగోలా వాళ్లను మస్కాగొట్టి లోపలికి జొరబడి పోయేవారు మంజుల గారు. ఒకసారి ఏవీఎం స్టూడియోలో లేత మనసులు షూటింగ్ జరుగుతుంది. ఎలాగోలా తాను స్టూడియో లో దూరిపోయారు. విరామ సమయంలో నటి జమున గారు కుట్టిపద్మిని ని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని చాక్లెట్లు బిస్కెట్లు తినిపిస్తుంటే ఆ పాపం మీద మంజుల గారికి విపరీతమైన ఈర్శ్య వచ్చింది. పద్మిని లాగి పడేసి జమున గారి ఒళ్ళో తాను కూర్చుంటే బాగుండుననే ఆలోచన తనకు వచ్చింది.

అది గమనించిన జమున గారు మంజుల గారిని పిలిచి బేబీ చాక్లెట్లు కావాలా అని అడిగారు. తాను అప్రయత్నంగా వద్దు నేను సినిమా స్టార్ కావాలనుకుంటున్నాను అన్నారట. బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలమ్మా ఇవన్నీ ఆ తరువాతే అన్నారట. అయితే కుట్టి పద్మిని ని చదువుకోదా అని తిరిగి ప్రశ్నించారు మంజుల గారు. ఆ మాటలతో బిత్తర పోయిన జమున గారు భలే దానివే నీ సంకల్పం చాలా గొప్పది. తప్పక సినిమా స్టార్ అవుతావు అని తల నిమిరి మంజుల గారిని ఆశీర్వదించారట. ఆమె ఆశీర్వాదమే ఆ తర్వాత ఇలా మీ హృదయాల్లో నన్ను నటిగా నిలబెట్టింది అని పలు సందర్భాలలో మంజుల గారు చెప్పుకొచ్చారు.

సినీ నేపథ్యం…

సినిమాలు ఎక్కువగా చూసే మంజుల గారు కథానాయకి, కథానాయకుల డాన్సులు చూసి తాను కూడా కూడా డాన్స్ నేర్చుకుంటాను అని ఇంట్లో పోరు పెట్టేవారు మంజుల గారు. దాంతో వాళ్ళ అమ్మ గారు దండాయుధ పాణి పిళ్ళై గారి దగ్గర నాట్యం లో శిక్షణ ఇప్పించారు. అక్కడే ఒకనాటి అందాల తార లత గారు తనకు పరిచయం అయ్యారు. అప్పటినుండి వారిద్దరి మధ్య స్నేహం కొనసాగుతూ ఉండేది. ఒకసారి ఒక కన్నడ చిత్రంలో నటించడానికి ఇద్దరు ముగ్గురు బాలికలు కావాలని మంజుల గారు చదువుతున్న కాన్వెంట్ కి సినిమా వారు వచ్చారు. కొందరిని స్టూడియోలోకి తీసుకెళ్లారు. వారితో మంజుల గారు కూడా ఉన్నారు. అక్కడ వాళ్ళు ఎలా నటించమంటే అలా నటించేశారు. ఆ చిత్రం పేరు “మధురై మాడినోడు”. విజయా సంస్థ వారి “పెళ్లి చేసిచూడు” కి రీమేక్.

ఆ చిత్రంలో ప్రముఖ నటి కాంచన గారి సోదరి గిరిజ గారు నటించిన పాత్రను కన్నడంలో మంజుల గారు పోషించారు. అప్పుడు తన వయస్సు పది సంవత్సరాలు. ఆ తర్వాత నుండి తనలో సినిమాల పట్ల ఆసక్తి ఇంకా ఎక్కువైంది. ప్రముఖు తమిళ సంగీత దర్శకులైన “శంకర్ గణేష్” గారు తమ కుటుంబానికి ఆప్తులు. సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఇంగ్లీష్ సినిమా ఆధారంగా జెమిని వారు “శాంతి నిలయం” అన్న తమిళ చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న రోజులలో ఆ చిత్రంలో కథానాయకుని సంతానంలో ఒక చిలిపి అమ్మాయిగా నటించడానికి ఎవరైతే బాగుంటారా అని ఆలోచిస్తుండగా గణేష్ గారు మంజుల గారి గురించి చెప్పారట. ఆ తర్వాత వాళ్ళు వచ్చి తనను చూసి వాళ్ళ సినిమాలో ఎంపిక చేసుకున్నారు. “శాంతి నిలయం” చిత్రంలో మంజుల గారు కళ్ళజోడు వేసుకుని తమాషాగా కనిపిస్తారు. అప్పటినుండి తనను “కన్నాడి మంజుల” అని పిలవడం ఆరంభించారు. కన్నాడి అంటే కళ్ళజోడు అని అర్థం.

మొదటి చిత్రం “ధర్మపత్ని”…

తెలుగులో మంజుల గారి మొదటి చిత్రం ధర్మపత్ని (1969). హీరో హరినాథ్ గారు తనను బి.వి.సుబ్బారావు గారి వద్దకు తీసుకెళ్లి పరిచయం చేసి ఆ చిత్రంలో నటించే అవకాశం కల్పించారు. ఆ చిత్రం ఆర్థికంగా విజయం సాధించలేదు. కానీ మంజుల గారికి అవకాశాలు దక్కేలా చేశాయి. ఎంజీఆర్ గారు మంజుల గారిని పిలిపించి వారి చిత్రాలలో నటించడానికి ఐదు సంవత్సరాలు ఒప్పందం ఏర్పాటు చేయించారు. “ఉలగం సుట్రియ వాలిలున్” చిత్రంలో తొలిసారి విదేశాల్లో జరిగిన చిత్రీకరణ లో పాల్గొన్నారు. తాను నూతన నటి అయినా, నాటక అనుభవం లేకపోయినా, చక్కని ప్రోత్సాహాన్ని మంచి శిక్షణను ఇచ్చి తన నట జీవితానికి ఉజ్వలమైన భవిష్యత్తును ఏర్పాటు చేశారు ఎంజీఆర్ గారు. శివాజీ గణేషన్ గారి సరసన నాయకగా నటించే అవకాశం “యంగల్ తంగరాజ” చిత్రంతో లభింపజేశారు జగపతి అధినేత విబి రాజేంద్రప్రసాద్ గారు.

అక్కినేని గారితో…

విబి రాజేంద్రప్రసాద్ గారు మంజుల గారికి గురుతుల్యులు. నిజం చెప్పాలంటే తాను నటిగా ఇంత పేరు తెచ్చుకోవడానికి రాజేంద్రప్రసాద్ గారే ముఖ్య కారకులు. అక్కినేని నాగేశ్వరావు గారు మొట్టమొదట డి.యోగానంద్ గారి దర్శకత్వంలో మంజుల గారితో జై జవాన్ (1970 ) చిత్రంలో నటించారు. అది పెద్దగా విజయవంతం కాలేదు. అయితే తర్వాత అక్కినేని గారితో కలిసి నటించిన మరపురాని మనిషి (1973), దొరబాబు (1974), మహాకవి క్షేత్రయ్య (1976), బంగారు బొమ్మలు (1977), చిత్రాలు మంజుల గారికి మంచి పేరు తెచ్చాయి. అక్కినేని గారితో కలిసి నటించడం మంజుల గారికి ఒక విశ్వవిద్యాలయంలో చదువుకోవడం లాంటిది. సెట్ లో ఎంత సరదాగా ఉండేవారు. ఇప్పటికి తెలుగులో మీకు ఇష్టమైన హీరో ఎవరంటే ఏ.ఎన్.ఆర్ గారి పేరే చెబుతాను అనేవారు మంజుల గారు.

ఎన్టీఆర్ గారితో…

మంజుల గారు ఎన్టీఆర్ గారితో మొట్టమొదటి సినిమా వాడే వీడు (1973) చిత్రంలో నటించారు. ఈ చిత్ర దర్శకులు కూడా యోగానంద  గారే. ఏఎన్నార్, ఎన్టీఆర్ ఇద్దరు మహానటులతో మంజుల గారి మొదటి సినిమాలు యోగానంద గారి దర్శకత్వం లోనే కావడం యాదృచ్ఛికం. ఆ తర్వాత ఎన్టీఆర్ గారితో పల్లెటూరు చిన్నోడు (1974), మనసులంతా ఒకటే (1976), మగాడు (1977), మా ఇద్దరి కథ (1977) చిత్రాల్లో కథానాయికగా నటించారు. మనుషులంతా ఒక్కటే చిత్రంలో జమున గారికి కోడలుగా నటించారు.

అదే సినిమా కోసం నిన్నే పెళ్లాడుతా అనే పల్లవితో ఎన్టీఆర్ గారి సినిమా పేర్లన్నీ కలిసి వచ్చేటట్టు పాటను వ్రాశారు దాసరి గారు. దాసరి గారు వ్రాసిన మొదటి పాట అది. మంజుల గారి డాన్సులంటే దాసరి గారికి ఎంతో ఇష్టం. తన డాన్స్ కోసమని అప్పటికప్పుడు సృష్టించిన పాట అది. “మర్యాద ఇచ్చిపుచ్చుకోవడంలో రామారావు గారు తర్వాత ఎవరైనా. సెట్ లో నేను సరదాగా అల్లరి చేస్తుంటే ఏం గురువుగారు మా ఏకాగ్రతకు భంగం కలుగుతుంది అని గంభీరంగా మందలించేవారు నన్ను. హీరోయిన్ లాగా కాకుండా మగ రాయుడులా నన్ను చూసేవారు” వారు అని మంజుల గారు చెప్పుకునే వారు.

హిందీ “దీవార్” ఆధారంగా నిర్మించిన “మగాడు” షూటింగ్ సందర్భంగా ఒక సన్నివేశంలో మంజుల గారు సిగరెట్ తాగాల్సి వచ్చింది. రిహార్సల్ లో రామారావు గారు సిగరెట్ ముట్టించి పొగ వదులుతుంటే, మంజుల గారు పొగ వదలడం ప్రారంభించారు. అది చూసిన ఎన్టీఆర్ గారు ఏమిటి మంజుల గారు రిహార్సల్ లోనే మీరు పొగ పట్టి పట్టి వదులుతున్నారు అన్నారు. అందరు సిగరెట్లు కాలుస్తున్నారు కదా, అందులో ఉన్న థ్రిల్ ఏమిటో నాకు తెలుసుకోవాలని ఉంది అన్నారు మంజుల గారు. దాంతో ఎన్టీఆర్ గారు నవ్వేశారు.

మొదటి సినిమా “మాయదారి మల్లిగాడు”…

ఎంజీఆర్ గారితో ఐదేళ్ల సినిమా కాంట్రాక్ట్ అయిపోయాక మంజుల గారు నటించిన మొదటి చిత్రం “మాయదారి మల్లిగాడు” (1973). హీరోయిన్ గా మంజుల గారు నటించిన మొదటి చిత్రం కూడా అదే. బి.ఏ.సుబ్బారావు గారి వంటి క్లాస్ దర్శకుల చేతిలో అది ప్రారంభం కావడం తన అదృష్టం. ఈ సినిమా పెద్ద సంగీతం పరంగా విజయవంతం అయ్యింది. ఈ సినిమా విజయంతో మంజుల గారికి పదేళ్లపాటు తృప్తిగా భోజనం చేయడానికి కూడా టైం కూడా లేనంత బిజీ అయిపోయారు. కృష్ణ గారితో తర్వాత రక్తసంబంధం, దేవుడు లాంటి మనిషి (1975), భలే దొంగలు (1976), మనసులు చేసిన దొంగలు (1977) చిత్రాలు చేశారు. విజయనిర్మల గారికి మంజుల గారంటే చాలా ఇష్టం.

శోభన్ బాబు గారితో హిట్ ఫెయిర్…

ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు (1974) చిత్రంలో కోయ పిల్ల పాత్ర  చేశారు మంజుల గారు. మొదట్లో పాత్ర చేయాలని లేకపోయినా ఆ భారీ చిత్రంలో చిత్ర పరిశ్రమలో ఉన్న తారలందరూ ఏదో ఒక పాత్రకు బుక్ అయిపోయారు. అసలు ఆ సంవత్సరం ఏ తారా ఇతర సినిమాలకు కాల్షీట్లు ఇవ్వలేని పరిస్థితి. అప్పుడు రత్తి పాత్రను మంజుల గారే చేయాలని విజయనిర్మల గారు గట్టిగా పట్టుబట్టడంతో చేసేశారు. రాజసులోచన సిఫారసు తోనే “మహాకవి క్షేత్రయ్య” లో తనకు మంచి పాత్ర లభించింది. ఆదినారాయణ రావు, ఆరుద్ర గారు ఆ పాత్రకు సంబంధించి చక్కటి తర్ఫీదు ఇచ్చారు.

ఏఎన్ఆర్, కృష్ణ వీళ్లిద్దరితో మంజుల గారు చాలా బాగా నటించేవారు. శోభన్ బాబు గారితో మొదటిసారి జగపతి పిక్చర్స్ మంచి మనసులు (1974) లో హీరోయిన్ గా నటించారు. ఆ తర్వాత అందరూ మంచివారే (1975), జేబుదొంగ, గుణవంతుడు (1975), ఇద్దరు ఇద్దరే, మొనగాడు, పిచ్చి మహారాజు (1976), గడుసు పిల్లోడు (1977 చిత్రాలు చేశారు. ఆ చిత్రాలన్నీ సంగీతం పరంగా విజయం సాధించాయి. శోభన్ బాబు గారితో తాను సెట్ లో చాలా స్నేహంగా ఉండేవారు. విరామ సమయంలో ఒకరి కష్టసుఖాలు ఇంకొకరు మాట్లాడుకునే వారు.

“అందరూ మంచివారే” తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించారు. తమిళంలో ముత్తు రామన్న, హిందీలో రాకేష్ పాండే కథానాయకులు. ఈ ముగ్గురికి తానే కథానాయిక. షూటింగ్ అయ్యాక ఎవరికి వారు పేకాట ఆడుకుంటుంటే నేను శోభనబాబు గారు భోజనం కూడా మర్చిపోయి ఎంత సేపైనా కబుర్లు చెప్పుకునే వాళ్ళు. ఒకసారి వాసన్ గారి అబ్బాయి బాబు వీరిద్దరి దగ్గరికి వచ్చి మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారా. మీ గురించి అంతా ఏవేవో అనుకుంటున్నారు అన్నాడు. శోభన్ బాబు గారు నవ్వేసి మేము మంచి స్నేహితులం. కలుసుకున్నప్పుడు రకరకాల అంశాల గురించి చర్చించుకుంటామని బదులిచ్చారు. బయట గాసిప్స్ ఎన్ని వచ్చినా కూడా ఓర్పు మంజుల గారికి ఆయుధంగా పనిచేసేది.

వివాహం…

నటి మంజుల గారి జీవిత కథానాయకుడు విజయ్ కుమార్ తో “ఉన్నడం మయంగిక్కిరేన్” అనే తమిళ చిత్రంలో తొలిసారి నటించారు.

అప్పటికే ఆయన వివాహకుడు. పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఏదో బంధం వారిద్దరినీ కలిపింది.

ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో 1970 లో వివాహం చేసుకున్నారు. ఎంజీఆర్ గారు పెళ్లి పెద్ద. తన జీవితంలో వివాహం ఒక పెద్ద మలుపు.

పెళ్లయ్యాక చాలా ఏళ్లు సాధారణ గృహ జీవితానికి పరిమితమయ్యారు. వారికి ముగ్గురు అమ్మాయిలు. వనిత, ప్రీతి, శ్రీదేవి. విజయకుమార్ కొడుకు కూడా తమిళంలో చిత్రంగంలో కథానాయకుడుగా పేరు తెచ్చుకుంటున్నారు.

మంజుల నటించిన తెలుగు చిత్రాల సమాహారం…

జేమ్స్ బాండ్ 777 (1971) దొరబాబు (1974 సినిమా) మంచి మనుషులు మాయదారి మల్లిగాడు రక్తసంబంధాలు

ఎదురులేని మనిషి (1975 సినిమా) జేబు దొంగ (1975 సినిమా) బంగారు బొమ్మలు. పిచ్చిమారాజు. జై జవాన్.

వాడే వీడు. పల్లెటూరి చిన్నోడు. అల్లూరి సీతారామరాజు (సినిమా) గుణవంతుడు. ఇద్దరూ ఇద్దరే (1976 సినిమా)

మహాకవి క్షేత్రయ్య. మగాడు. మనుషులంతా ఒక్కటే. నేరం నాదికాదు ఆకలిది. మొనగాడు.

భలే దొంగలు (1976 సినిమా) చిరంజీవి రాంబాబు. మా ఇద్దరి కథ. శభాష్ గోపి. జీవనగంగ. టార్జాన్ సుందరి.

దేవుడులాంటి మనిషి. అభిమన్యు (1992). మనుషులు చేసిన దొంగలు. చంటి. వాసు…

నిష్క్రమణం…

మంజుల గారు గత కొంతకాలంగా కామెర్ల వ్యాధితో బాధపడుతున్నారు. ఒకనాటి ఉదయం నిద్ర లేవడానికి ఉపక్రమిస్తుండగా మంచం పైనుంచి క్రింద పడడంతో తనకు గాయాలయ్యాయి. ఆమెను చెన్నైలోని ఎస్.ఆర్.ఎం.సి ఆసుపత్రికి తరలించారు. కాలేయంలో తీవ్ర రక్తస్రావం కావడంతో మంజుల గారు 23 జూలై 2013 నాడు మంగళవారం ఉదయం మరణించినట్లుగా వైద్యులు ప్రకటించారు. చెన్నైలో తుది శ్వాస విడిచారు. విజయ్ కుమార్ సతీమణి అయిన మంజుల గారికి ముగ్గురు అమ్మాయిలు. తెలుగు, తమిళ భాషలో వందకు పైగా చిత్రాలలో నటించారు.నటి మంజుల గారు శోభన్ బాబుతో ఎక్కువ చిత్రాలు నటించారు.

Show More
Back to top button