పుట్టిన ప్రతీ మనిషి ఏదో ఒకటి సాధించాలనే లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తూనే ఉంటాడు. తన కలలు, తన ఆశయాల కోసం తన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఇంకెన్ని అవరోధాలు ఎదురైనా తన గమ్యం చేరేవరకు పోరాడుతూనే ఉంటాడు. అదేవిధంగా తాను సినిమా రంగంలో రాణించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తూ పడిపోతూ, ప్రయాణం చేస్తూ అలసిపోతూ, అదృష్టం కావలించుకున్నట్టే అనిపించి దురదృష్టం హత్తుకుంటూ అనేక పరిణామాల మధ్య ఒక అవకాశాన్ని దక్కించుకుని అదృష్టవంతుడిగా తన తొలి సినిమా “అదృష్టదీపుడు”లో ద్విపాత్రాభినయంతో కథానాయకుడిగా స్థానం దక్కించుకున్న కథానాయకుడు రామశర్మ. తన అసలు పేరు ఉప్పలూరి వీర వెంకట ప్రభాకర రామశర్మ. సినిమాలలో చేరగానే తన పేరును “రామశర్మ” గా కుదించుకుని దాదాపు పాతిక సినిమాలలో కథానాయకుడిగా నటించారు.
రామశర్మకు తొలి సినిమా “అదృష్టదీపుడు” (1952) చిత్రంలోనే ద్విపాత్రాభినయం చేసే అరుదైన అవకాశం లభించింది. అయితే ఆ సినిమా విజయవంతం కాకపోయినా తన ప్రతిభ ఆధారంగా ఆయన మరిన్ని అవకాశాలు సంపాదించుకున్నారు. ఛాయాగ్రహణం మీద అభిరుచితో బొంబాయి వెళ్లి ఫజల్ బాయి ఇనిస్టిట్యూట్ లో చేరగా, బోళ్ల సుబ్బారావుతో సలహాపై మద్రాసు వెళ్లి సినిమాలలో అవకాశం కోసం చాలా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇక లాభం లేదనుకుని పిఠాపురం వచ్చి నాటకాలపై దృష్టిని కేంద్రీకరించారు రామశర్మ. “సంస్కృతి” అనే నాటికను వ్రాసి దానిని ప్రదర్శించి మెప్పుపొందడమే కాకుండా, ఆనాటి ఆంధ్రనాటక కళాపరిషత్ లో ఆయన ప్రదర్శించిన “గౌతము బుద్ధ” నాటకానికి ఎంతో ప్రజాదరణ లభించింది. “మంత్రదండం”, “తిలోత్తమ” లాంటి సినిమాల కోసం, అందులో కథానాయకుడి పాత్రకోసం రామశర్మ ఎంపికచేయబడినా చివరినిమిషంలో రద్దయి మానసికంగా నిరాశకు గురయ్యారు.
ఒకప్రక్కన ఎన్టీఆర్, మరొక పక్కన ఏఎన్ఆర్ కథనాయకులుగా తమ సత్తాను ప్రదర్శిస్తున్న తరుణంలో చిత్రసీమకు పరిచయమైన రామశర్మ వారిద్దరితో పాటు తాను కూడా ఒక కథానాయకుడి స్థానంలో ఉన్నానని నిరూపించుకున్నారు. ఉప్పులూరి రామశర్మ గౌతమబుద్ధ నాటకంలో బుద్ధుని వేషం ద్వారా పేరు తెచ్చుకుని తమిళనాడు టాకీస్ అధినేత సౌందరరాజన్ ఇచ్చిన అవకాశంతో సినిమాలలో ప్రవేశించారు. “అదృష్టదీపుడు” (1952) సినిమాతో తెరంగేట్రం చేసి, సుమారు పాతిక చిత్రాలలో నటించారు. రామశర్మది కాకినాడ దగ్గర పిఠాపురం. సినిమాలలో నాయక, ఉపనాయక పాత్రలు ధరించారు. అందగాడైన రామశర్మ సంభాషణలు చెప్పటంలో సైతం మేటి. కృష్ణకుమారి తొలి చిత్రం “నవ్వితే రత్నాలు”, బి.ఎన్. రెడ్డి కళాత్మక చిత్రం “బంగారుపాప”, సావిత్రితో “మేనరికం”, “ప్రపంచం” మొదలగు చిత్రాల్లోనూ నటించారు.
జీవిత విశేషాలు…
జన్మనామం : ఉప్పలూరి వీర వెంకట ప్రభాకర రామశర్మ
ఇతర పేర్లు : రామశర్మ
స్వస్థలం : పిఠాపురం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
వృత్తి : నటుడు, రంగస్థల కళాకారుడు
గుర్తించదగిన సేవలు : గౌతమబుద్ధ నాటకం, అదృష్టదీపుడు..
మరణ కారణం : వృద్ధాప్యం
నేపథ్యం…
రామశర్మ ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించారు. రామశర్మ పూర్తి పేరు “ఉప్పులూరి వీర వెంకట ప్రభాకర రామశర్మ”. ఆ పేరు చాలా పెద్దదిగా ఉందని భావించి సినిమాలలోకి వచ్చిన తరువాత ఆయన తన పేరును రామశర్మగా కుదించుకున్నారు. ఆయన పిఠాపురంలోనే పాఠశాల విద్యాభ్యాసం కొనసాగించారు. ఆ తరువాత ఆయన కాకినాడలో గణితశాస్త్రంలో బి.ఎ. చేశారు. డిగ్రీ పూర్తవ్వగానే బొంబాయి వెళ్లి ఛాయాగ్రహణం నేర్చుకోవాలనే కోరికతో ఫజుల్ బాయి ఇనిస్టిట్యూట్ లో చేరారు. ఆ సంస్థలో ఉన్నప్పుడే ఛాయాగ్రాహకులు బోళ్ల సుబ్బారావుతో పరిచయం ఏర్పడింది. సుబ్బారావు సలహామేరకు రామశర్మ మద్రాసు బయలుదేరి వెళ్లి సినిమాలలో అవకాశం కోసం విపరీతమైన ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలేవీ కూడా ఫలించలేదు. కొంతకాలం వేచిచూసి అవకాశాలు రాకపోవడంతో ఇక లాభం లేదనుకుని తిరిగి పిఠాపురం వెళ్లిపోయారు. పిఠాపురానికే చెందిన పంతం చిన్నారావు అనే వ్యక్తి రామశర్మ లోని ఉత్సాహాన్ని గమనించి, ఆయనను కథానాయకుడిగా పెట్టి ఒక సినిమా తీద్దామని ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు.
నాటకాలలో…
ఎన్ని ప్రయత్నాలు చేసినా సినిమాలలో అవకాశాలు దక్కకపోవడంతో మనసు నాటకాల వైపు మళ్ళింది. దాంతో ఆయన నాటకాలపై దృష్టిని కేంద్రీకరించారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలు, కమ్యూనిస్టు ఉద్యమాలు ముమ్మరంగా ఉండే ఆ రోజులలో, ఆ పార్టీ ಸಿద్దాంతాలతో ఏకీభవిస్తూ రామశర్మ ఒక నాటికను వ్రాసి, దానిని ప్రదర్శించారు. ఆ నాటిక పేరు “సంస్కృతి “. దీనికి ఎనలేని ప్రజాదరణ వచ్చింది. అలాగే ఆంధ్రనాటక కళాపరిషత్ లో రామశర్మ ప్రదర్శించిన “గౌతమబుద్ధ” నాటకానికి కూడా ఎంతో ప్రేక్షకాదరణ లభించింది. ఆ నాటకాన్ని తిలకించిన దర్శకులు కురుమద్దాలి రామచంద్రరావు తాను తెరకెక్కిస్తున్న “మంత్రదండం” సినిమా కోసం రామశర్మను పిలిపించారు. అదేవిధంగా మీర్జాపూరు రాజావారు తాను తీస్తున్న “తిలోత్తమ” చిత్రంలో కథానాయకుడి పాత్రకోసం రామశర్మకు మేకప్ టెస్టు చేశారు. కానీ దురదృష్టం తోడున్నట్లుగా ఆ రెండు చిత్రాలలోనూ తనకు పాత్రలు దక్కలేదు. ఆ చిత్రాలలో కథానాయకుడిగా మాత్రం అక్కినేని నాగేశ్వరరావు నటించారు.
తొలి సినిమా “అదృష్టదీపుడు”…
సినిమాలలో వచ్చిన అవకాశాలు మరలిపోవడంతో రామశర్మ ఒకింత నిరాశకు గురయినా కూడా తనని తాను సముదాయించుకుని నాటకాల మీదనే మళ్ళీ దృష్టి కేంద్రీకరించారు రామశర్మ. అదే సమయంలో తమిళనాడు టాకీసు అధినేత సౌందరరాజన్ అంతా కొత్త వారితో ఒక సినిమా తీసే ప్రయత్నాలలో ఉన్నారు. ఆ విషయం తెలిసిన దాసు అనే ప్రొడక్షన్ మేనేజరు రామశర్మను సౌందరరాజన్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన్ని చూసీ చూడగానే కాస్యూమ్స్ టెస్ట్, మేకప్ టెస్ట్ లాంటివి ఏమీ చేయకుండానే ఏకంగా కథానాయకుడి పాత్రకు ఎంపిక చేశారు. అందులోనూ ఆయనది ద్విపాత్రాభినయం. అవకాశం వచ్చిన తొలి చిత్రంలోనే రెండు పాత్రలు చేసే అవకాశం అతి అరుదుగా లభిస్తుంది. అందుకే రామశర్మ అదృష్టవంతుడని అందరూ అభినందించసాగారు. యాదృచ్చికంగా ఆయన నటించిన తొలి సినిమా పేరు కూడా “అదృష్టదీపుడు” కావడం గమనార్హం. ఈ చిత్రంలో అదృష్టదీపుడు, హరిదత్తుడు అను రెండు పాత్రలను రామశర్మ పోషించారు. ఇంకో చెప్పుకోదగ్గ ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రముఖ నటులు గుమ్మడి వెంకటేశ్వరరావుకు కూడా తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో ఆయన విక్రభద్రుడు అనే పాత్రను పోషించారు.
చిత్తూరు వి. నాగయ్య సహాకారంతో…
వెండితెరపై రామశర్మ అడుగుపెట్టడం వెనుక చిత్తూరు వి.నాగయ్య సహాకారం కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. రామశర్మ తన “గౌతమబుద్ధ” నాటకాన్ని సినీ పెద్దలు, ప్రముఖుల సమక్షంలో ప్రదర్శించాలనేది కోరికగా ఉండేది. రామశర్మ తనకు తెలిసిన ఒక వ్యక్తి ద్వారా ఆనాటి ప్రముఖ నటులు చిత్తూరు వి.నాగయ్య కలిశారు. రామశర్మ కోరికను మన్నించి నాగయ్య మద్రాసులో “గౌతమబుద్ద” నాటక ప్రదర్శన ఏర్పాటు చేసి చిత్ర ప్రముఖులను ఆహ్వానించారు. నాగయ్య సహకారం అందించగా ప్రదర్శన జరిపిన ఈ నాటకం ఆధారంగానే రామశర్మకు “అదృష్టదీపుడు” చిత్రంలో అవకాశం దొరికింది. ఇది విన్న చిత్తూరు వి.నాగయ్య ఎంతగానో ఆనందపడ్డారు. సిద్ధార్థుడు పాత్రతో అతను బాగా ప్రసిద్ధిచెందాడు కనుక తనను సిద్దార్థ్ అని పేరు మార్చుకోమని రామశర్మకు నాగయ్య సూచించారు. కానీ తన అసలుపేరుతోనే నటిస్తానని చెప్పారు రామశర్మ. చదువుకున్న దర్శకుడు కానీ, కథానాయకుడు కానీ ఉంటే ఆ రోజులలో వాళ్ళు చదువుకున్న చదువును బట్టీ డిగ్రీ పట్టా పుచ్చుకున్నట్టయితే ఆ డిగ్రీతో సహా టైటిల్స్ లో వేయడం ఒక ఫ్యాషన్ గా ఉండేది. ఆవిధంగా రామశర్మ నటించిన చిత్రాలు తెరపై ప్రదర్శన అయితే గనుక “రామశర్మ బి.ఎ.” అనే పేరు వేసేవారు.
పాతిక చిత్రాలలో కథానాయకుడిగా….
రామశర్మ మొదటిచిత్రం “అదృష్టదీపుడు” చిత్రం అద్భుతమైన విజయం దక్కించుకుంది. కానీ ఆయన నటించిన రెండవ చిత్రం “నవ్వితే నవరత్నాలు” మాత్రం విజయం దక్కించుకోలేకపోయింది. కథానాయిక కృష్ణకుమారి తొలిసారిగా నటించిన సినిమా ఇదే కావడం గమనార్హం. నవ్వితే నవరత్నాలు (1951), ఆకాశరాజు (1951), ఆడజన్మ (1951), కాంచన (1952), మంజరి (1953), గుమాస్తా (1953), ఆదర్శం (1953), మరదలు పెళ్ళి (1952), పరోపకారం (1953), ప్రపంచం (1953), నాచెల్లెలు (1951), పల్లె పడుచు (1954), మేనరికం (1954), నాఇల్లు (1951), భక్తరామదాసు (1951), సంతోషం (1955) , బంగారుపాప (1954) ఇలా దాదాపుగా ఇరవై ఐదుకు పైగా చిత్రాలలో కథానాయకునిగా నటించారు రామశర్మ. ఆయన సావిత్రి, అంజలీదేవి, జి.వరలక్ష్మి, కృష్ణకుమారి, సూర్యకుమారి, పద్మ, పద్మిని తదితర తారల నడుమ కథానాయకునిగా వెలిగారు. తమిళ నిర్మాతలు రామశర్మతో ఎక్కువగా తెలుగు చిత్రాలు నిర్మించడం గమనార్హం.
నిరంతరం వార్తలలో నిలుస్తూ…
ప్రేక్షకులలో రామశర్మకు విపరీతమైన ఆదరణ ఉండేది. ఆయన సినీ పత్రికల వారితో అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. అందువలన ఆయనకు విపరీతమైన ప్రచారం వచ్చేది. సినిమా పత్రికలు “రూపవాణి”, “రేరాణి”, “గుండుసూది”, “మోహిని”, “సినీ జగత్” వంటి పత్రికల ముఖచిత్రాలలో రామశర్మ ఛాయాచిత్రాలు తప్పనిసరిగా వేసేవారు. రామశర్మను ఎలాగయినా ప్రచారం పొందించే వార్తలలోకి ఎక్కించాలని కృష్ణ కుమారితో సంబంధం ఉందనే గాలివార్తలు వ్రాసేవారు. కృష్ణ కుమారి – రామశర్మల జంటగురించి నీలివార్తలు పోగుచేసి సినీ పత్రికలు నింపేవారు. వారి వివాహం జరగొచ్చు అన్నంతగా వారి వార్తలను విపరీతంగా ప్రచారం చేస్తూ పత్రికలలో వ్రాశారు కూడా. కథానాయకుల మధ్య ఆ రోజుల్లో పోటీ ఎక్కువగా ఉండేది. ఆ పోటీని తట్టుకుని నిలబడాలంటే పాత్రికేయుల సహాకారం తప్పనిసరి. అందువలన అట్టి విషయాన్ని గ్రహించిన రామశర్మ వారితో చాలా సన్నిహితంగా ఉంటూనే తన గురించి తప్పనిసరిగా ఎప్పుడూ పత్రికలలో ఏదో ఒక వార్త వచ్చేలా తాను శ్రద్ధ వహిస్తూ ఉండేవారు. దాంతో రామశర్మకు విపరీతంగా అభిమానులు అనుసరణ ఉండేది.
చూడముచ్చటగా రామశర్మ, సావిత్రిల జంట…
రామశర్మ, సావిత్రిల జంట ఆరోజులలో చూడ ముచ్చటగా ఉండేది. చాలామంది వాళ్లిద్దరు పెళ్ళి చేసుకుంటారేమోనని కూడా అనుకునేవార. రామశర్మ సినిమా ప్రస్థానం 1956తోనే పూర్తయిందని చెప్పవచ్చు. ఎందుకంటే కథానాయకుడిగా తీరికగా ఉన్న రోజులలోనే తన కుటుంబ సమస్యల కారణంగా ఒక సంవత్సరం కాలం ఆయన సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది. తనకున్న ఆ సమస్యలను పరిష్కరించుకుని తిరిగి చిత్రపరిశ్రమకి వచ్చేనాటికి ఆయన స్థానంలో ఎంతో మంది కొత్త కథానాయకులు వచ్చేశారు. ఆయన స్థానాన్ని అనేక మంది కొత్త తారలు ఆక్రమించేశారు.
అనామకంగా తనువు చాలించి…
కొత్త కథానాయకులు వచ్చేసరికి తన స్థానం గల్లంతైన పరిస్థితి రామశర్మకు నెలకొనింది. అటువంటి పరిస్థితులలో రామశర్మ స్నేహితులైన నిర్మాతలు కోనేరు రవీంద్రనాథ్, ఛటర్జీ, గుత్తా రామినీడు వంటివారు తమ చిత్రాలైన “భక్తపోతన” (1943), “జేబుదొంగ”, “విజృంభణ” సినిమాలలో అవకాశాలు ఇచ్చి ఆయనను ఆదుకున్నారు. ఆ తరువాత మళ్లీ కొంతకాలం నటించకుండా ఆగిపోయారు. కొత్త కథనాయకుల రంగప్రవేశంతో రామశర్మకు అవకాశాలు తగ్గిపోయి క్రమంగా ఆయన తెరమరుగు కావాల్సి వచ్చింది.
అయినా కూడా ఆయన ఎవ్వరికీ తలవంచకుండా, ఏ ఒక్కరినీ యాచించే పరిస్థితి రానివ్వకుండా రామశర్మ జాగ్రత్త పడుతూవచ్చారు. అదే సమయంలో ఆయన చదువుకున్న చదువు తనకు అక్కరకు వచ్చింది. రామశర్మ రేస్‌కోర్సులో ఉంటూనే ఏ గుర్రం గెలుస్తుందో టిప్స్ చెబుతూ కాల క్షేపం చేస్తుండేవారు. అదేవిధంగా తనకు తెలిసిన హోమియో వైద్యాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా వారికి సేవలు అందిస్తూ వచ్చారు. తనకు సాధ్యమైనంతగా సినీరంగంలో ఒక వెలుగు వెలిగిన రామశర్మ జీవిత చరమాంకంలో అనామకంగానే తన జీవితాన్ని చాలించాల్సి వచ్చింది.