CINEMATelugu Cinema

తెలుగు చిత్ర పరిశ్రమలో ఆంధ్రా కమలహాసన్.. నరసింహ రాజు.

సినిమా రంగంలో అగ్ర నటులుగా వెలుగొందాలంటే ముందుగా నటనలో వర్ణమాల నేర్చుకుని అర్హులైన అధ్యాపకుల బోధనలో శిక్షణ పొంది ఆపై అవకాశాలకు ప్రయత్నించి అందరి మెప్పు పొందేలా ప్రతిభను ప్రదర్శించి ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకొని సాగాలి. ఆ పైన కీర్తి, కనకం యాదృచ్ఛికంగా వారిని వెతుక్కుంటూ వస్తాయి. కానీ నాటకాలలో శిక్షణ, అనుభవం లేకుండా చిత్రసీమలో అడుగుపెట్టి భంగపడి, తిరస్కరించబడి, నిరాశతో వెనుదిరిగినా చిగురాశతో మళ్ళీ చిత్రపరిశ్రమలో నిలదొక్కుకుని చిత్రపరిశ్రమ లో కథనాయకుడిగా తనదైన ముద్ర వేసిన నటులలో “నరసింహ రాజు” ఒకరు. 1970లో అనేక విజయవంతమైన జానపద చిత్రాలలో కథానాయకుడిగా నటించిన తాను “ఆంధ్ర కమలహాసన్” గా గుర్తింపు తెచ్చుకున్నారు. జగన్మోహిని సినిమాతో ఘనవిజయాన్ని సాధించి.. ఏకంగా 110 సినిమాలలో హీరోగా నటించి.. చివరిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా , తండ్రి పాత్రల్లో ఎక్కువగా కనిపించే ప్రేక్షకులను మెప్పించారు

చిత్ర పరిశ్రమ అంటేనే ఓ మాయలోకం, రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో ఎవ్వరికీ తెలియదు. సినిమా ప్రపంచం ఎప్పుడు ఎవరిని అందలం ఎక్కిస్తుందో, ఎప్పుడు ఎవ్వరిని పడదోస్తుందో కూడా ఎవ్వరికీ తెలియదు. ఒక్కసారి సినిమా విజయవంతం అయితే అభిమానించే ప్రేక్షకులు, అదే సినిమా పరాజయం పాలైతే మాత్రం  పట్టించుకోవాడిమే మానేస్తారు. అప్పటిదాకా ఉన్న పరిస్థితి ఒకలా ఉంటే సినిమా పోయినప్పుడు ఎదురయ్యే పరిస్థితులు మరోలా ఉంటాయి. అందుకే మన సినిమా వాళ్ళు ప్లాఫ్ సినిమాకు దూరంగా ఉంటారు.

హిట్టుతో ఎంత గుర్తింపు వస్తుందో, సినిమా పరాజయం పాలైతే అంతకంటే ఎక్కువ దారుణ స్థితి నెలకొంటుంది. 1974 లో విడుదలైన “నీడలేని ఆడది” సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేశారు నరసింహ రాజు గారు. తనకు దాసరి నారాయణ రావు గారితో ఒక మంచి అనుబంధం ఉండేది. నరసింహ రాజు గారు ఎప్పుడు వెళ్లి దాసరి గారిని అడిగినా తనకు అవకాశం ఇచ్చేవారు. 1993 వరకు తనకు సినీ అవకాశాలు బాగానే వచ్చాయని, ఆ తర్వాత మాత్రం అవకాశాలు రావడం తగ్గిపోయాయని ఒక ఇంటర్యూలో చెప్పారు. ఈ సమయంలో దాసరి గారి దగ్గరికి వెళితే ఆయన తనకు మళ్ళీ తన సినిమాలో నటించే అవకాశం ఇచ్చారని చెప్పారు.

నరసింహ రాజు గారు కథనాయకుడిగా విఠలాచార్య గారు దర్శకత్వం వహించిన “జగన్మోహిని” (1978) చిత్రం అత్యద్భుతమైన విజయం సాధించింది. దాంతో బి.విఠలాచార్య గారి దర్శకత్వంలో గాంధర్వ కన్య, మంత్రదండం, మోహినీ శపథం వంటి చిత్రాలలో నరసింహ రాజు గారు నటించారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన త్రిలోక సుందరి (1980) వంటి చిత్రాలలో జానపద కథానాయకుడిగా, ఇతర దర్శకులతో కూడా పనిచేశారు నరసింహ రాజు గారు. రెండు దశాబ్దాలలో దాదాపు 100 కు పైగా సినిమాలలో నటించారు. ప్రస్తుతం తాను తమిళ టెలివిజన్ సీరియల్స్‌లో నటుడిగా కొనసాగుతున్నారు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    వేటుకూరి నరసింహరాజు

ఇతర పేర్లు  :  ఆంధ్రా కమల్ హసన్

జననం    :    26 డిసెంబరు 1951   

స్వస్థలం   :    వడ్లూరు గ్రామం, ఉండ్రాజవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా

వృత్తి      :     నటుడు

విద్య     :       పీయూసీ

హీరోగా తొలి సినిమా  :    జగన్మోహిని (1978)

హీరోగా అఖరు సినిమా   :   శ్రీ భ్రమరాంభిక కటాక్షం (1990)

పిల్లలు    :     జగదాంబ (కూతురు), ఒక కుమారుడు

నేపథ్యం…

నరసింహ రాజు గారు 26 డిసెంబరు 1951 నాడు పశ్చిమ గోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం, వడ్లూరు గ్రామంలో జన్మించారు. అప్పట్లో తన తండ్రి గారిది సంపన్న కుటుంబమే. కానీ దానగుణంతో చాలావరకు ఆస్తులు పోగుట్టుకున్నారు. ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదువుకున్న నరసింహ రాజు గారికి చిన్నతనం నుండే నాటకాలు అంటే ఆసక్తి ఉండేది కాదు. కానీ వాళ్ల నాన్న గారికి మాత్రం నరసింహ రాజు గారిని నటుడిని చేయాలనే కోరిక బలంగా ఉండేది.  తన 19వ యేట పౌరాణిక పాత్రధారణ వేషం వేసి కొన్ని ఛాయా చిత్రాలు తీయించి ఆ ఫోటోలను కొంతమంది నిర్మాతలకు కూడా పంపించారు.

తన తల్లిదండ్రులకు తాను ఒక్కడే సంతానం కావడంతో తన నాన్నగారి కోరిక నెరవేర్చడం కోసం తాను ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ సమయంలో “రక్తకన్నీరు నాగభూషణం” గారు ప్రజానాయకుడు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందులో కొత్త నటుడిని పరిచయం పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్న తరుణంలో నాగభూషణం గారి మేకప్ మేన్ చిరంజీవి గారి దృష్టిలో పడ్డారు నరసింహ రాజు గారు. ఆయన నరసింహ రాజు గారిని తన కార్యాలయంకు తీసుకెళ్లారు. నరసింహ రాజు గారిని చూడగానే చిత్ర దర్శకులు వి.మధుసూదన రావు గారు కుర్రాడు బాగానే ఉన్నాడు మేకప్ టెస్ట్ అవసరం లేదు వేషం ఇవ్వండి అనేశారు. జగ్గయ్య, జానకి గార్ల కలయికలో వచ్చే తొలి సన్నివేశంలో నరసింహ రాజు గారు నటించాలి.

తనకు నాటక అనుభవం లేదు. దాంతో కెమెరా ముందుకు రావడం కూడా అదే మొదటిసారి కనుక ఇద్దరు అగ్ర తారల మధ్య సన్నివేశంలో తన నటన తేలిపోయింది. దాంతో తన విషయంలో దర్శక, నిర్మాతలు  పునరాలోచనలో పడ్డారు. హైదరాబాదులో చిత్రీకరణ ఉంటుందని తదుపరి షెడ్యూల్ కు హాజరుకావాలని చెప్పారు. కానీ అసలు నిజం ఏమిటంటే తనను ఆ సినిమాలో నుండి తొలిగించారు. ఆ విషయం తనకు రెండు రోజుల తర్వాత కానీ తెలియలేదు. తనను తీసేసి తన స్థానంలో చంద్రమోహన్ గారిని పెట్టుకున్నారు. నటుడిగా తనకు అనుభవం లేకపోవడం వల్ల నన్ను తీసేసి ఉంటారనుకుని, ఆనాటి నుండి పట్టుదలతో నటన మీద దృష్టి కేంద్రీకరించారు నరసింహ రాజు గారు.

తొలి అవకాశం “నీడలేని ఆడది”..

నరసింహా రాజు గారు తనను ప్రజానాయకుడు సినిమా నుండి తప్పించే సరికి అదే సమయానికి నవశక్తి పిక్చర్స్ అధినేత “గంగాధర రావు” గారు అంతా కొత్త వాళ్ళతో “నీడలేని ఆడది” చిత్రాన్ని తీయదలచి నటీనటుల ఎంపిక కోసం రాష్ట్రమంతా తిరుగుతున్నప్పుడు తనను నరసింహ రాజు గారు కలిశారు. “నీడలేని ఆడది” సినిమాలో హీరో పాత్రకు మొదట శరత్ బాబు గారిని అనుకున్నారు. అయితే అది కళాశాల లో విద్యార్థి పాత్ర కావడంతో శరత్ బాబు గారు సరిపోరని చివరికి నరసింహ రాజు గారిని ఎంపిక చేశారు. ఈ చిత్రానికి బి.వి.ప్రసాద్ గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నరసింహ రాజు గారికి అవకాశం రావడానికి పాత్ర నాకు రావడానికి సహా దర్శకులు రామ సూరి గారు బాగా కృషి చేశారు. నరసింహ రాజు కథానాయకుడిగా, ప్రభ కథానాయకిగా ఈ సినిమాలో నటించారు. నరసింహ రాజు, ప్రభ గార్లకు మాత్రమే నామమాత్రంగా పారితోషికం చెల్లించారు. నూతనప్రసాద్, అన్నపూర్ణ తదితర నటీ నటులందరికీ పారితోషికం ఇవ్వకుండా రానుపోను చార్జీలు మాత్రమే చెల్లించారు. తక్కువ బడ్జెట్ (రెండు లక్షల రూపాయల) తో ఈ సినిమా 1972లో ప్రారంభమై విడుదల కావడానికి రెండేళ్లు పట్టింది. ఆ రోజుల్లో అంతా కొత్తవారితో సినిమా తీయడం, కృష్ణ గారి “అల్లూరి సీతారామరాజు” చిత్రం విడుదలైన వారం రోజులకు నీడలేని ఆడది సినిమా విడుదలకావడం నిజంగా సాహసమే. అయినా ఈ చిత్రం ఘన విజయం సాధించింది.

దాసరి అనుగ్రహం…

సినిమా ఘన విజయం సాధించిందంటే చాలు అవకాశాలు వెల్లువలా వచ్చిపడతాయి. కానీ అందుకు విరుద్ధంగా “నీడలేని ఆడది” చిత్రం ఘనవిజయం సాధించిన ఏడాది వరకు కూడా నరసింహ రాజు గారికి కొత్త అవకాశాలు లభించలేదు. ఆ తరువాత “నవశక్తి గంగాధర రావు” గారే “అమ్మాయిలు జాగ్రత్త” చిత్రం నిర్మిస్తూ అందులో నాకు విలన్ వేశం ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఆ సినిమా అపజయం పాలైంది.  సినిమా విజయవంతం అయినప్పుడే అవకాశాలు రాలేదు. అలాంటిది అపజయం పాలైతే అవకాశాలు ఎలా వస్తాయి. ఇదే నైరాశ్యంలో ఉండి మద్రాసు లోని పాండి బజారులో తిరిగే వారు. ఆ సమయంలో రామచంద్ర రావు గారు అనే జర్నలిస్టు తనకు తారసపడి ఎంతో మందికి సహాయం చేస్తున్న దాసరి నారాయణరావు గారి దగ్గరికి నరసింహా రాజు గారిని తీసుకెళ్లారు.

ఆ రోజులలో ప్రతీ ఆదివారం దాసరి నారాయణ గారు అవకాశాల కోసం తిరిగే వారిని కలుస్తుండేవారు. అలా నరసింహా రాజు గారిని గుర్తు పట్టి నువ్వు నటించిన “రెండు సినిమాలు” చూశాను. నీకు మంచి భవిష్యత్తు ఉంది. కృష్ణవేణి థియేటర్లో ఆడుతున్న కమలహాసన్ చిత్రం అపూర్వ రాగంగల్ చూసి వచ్చి నన్ను కలువు అన్నారు. ఆ చిత్రాన్ని దాసరి గారు తన స్వీయ దర్శకత్వంలో “తూర్పు పడమర” పేరుతో తెలుగులో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత రాఘవగారు మాత్రం తెలుగులో కూడా తమిళంలో నటించిన కమలహాసన్, శ్రీవిద్య లతోనే నటింపజేయాలని ఉండేది. ఎందుకంటే చాలా సన్నివేశాలు రెండవ సారి చిత్రీకరించాల్సిన అవసరం ఉండదు కదా. దాంతో ఖర్చు కలసి వస్తుందని రాఘవగారు ఆలోచన. కానీ దాసరి గారు మాత్రం పట్టు పట్టి నరసింహా రాజు గారికే అవకాశం ఇచ్చారు.

“తూర్పు పడమర” చిత్రంలో నటించిన తరువాత నరసింహ రాజు గారికి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం కలగలేదు. ఆ చిత్రంలో “శివరంజనీ నవరాగిణీ” పాట ఇప్పటికీ కూడా వినిపిస్తుంది. అలా ఒక మంచి అవకాశం కల్పించిన తన సినీ ప్రస్థానం సాఫీగా సాగిపోవడానికి మార్గాన్ని నిర్ధేశించారు దాసరి గారు. ఆ తరువాత దాసరి గారి “కన్యాకుమారి”, “ఇదెక్కడి న్యాయం” తదితర చిత్రాల్లో నరసింహ రాజు గారు నటించారు. కళాకారులను ప్రోత్సాహించడంలో దాసరి పద్మ గారు ముందు వరుసలో ఉంటారు. నిజానికి దాసరి నారాయణ రావు, దాసరి పద్మ గార్లు చిత్రపర పరిశ్రమకి పార్వతీ పరమేశ్వరుల లాంటి వారు. ఎందరో కళాకారులకు వారిద్దరు చాలా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు.  సినిమాలలో అవకాశాలు తగ్గడంతో నరసింహా రాజు గారిని దాసరి గారి దర్శకత్వంలో వచ్చిన సీరియల్స్ కు కూడా అవకాశాలు ఇచ్చారు.

విఠలాచార్య అనుగ్రహం..

ఎన్టీఆర్, కాంతారావు గార్ల తరువాత ఆ స్థాయిలో జానపద చిత్రకథ నాయకుడిగా పేరు తెచ్చుకున్న వారు నరసింహ రాజు గారు. అందుకు ముఖ్య కారకులు జానపద బ్రహ్మ అనదగినవారు దర్శకులు విఠలాచార్య. విఠలాచార్య గారి దర్శకత్వంలోనే కాకుండా ఇతర దర్శకులతో కూడా కలిపి మొత్తంగా 20 జానపద సినిమాలలో కథనాయకుడిగా నటించారు. సాంఘిక చిత్రాలతో పాటు జానపద చిత్రాలలో కూడా నటించాలని ఆసక్తితో ఉన్న నరసింహ రాజు గారు దర్శకులు విఠలాచార్య గారిని కలిశారు. ఆ సమయంలో ఆయన జగన్మోహిని అనే చిత్ర నిర్మాణ సన్నాహాల్లో ఉన్నారు. నరసింహ రాజు గారిని చూడగానే ఆప్యాయంగా వచ్చి పలకరించిన విఠలాచార్య గారు జగన్మోహని సినిమాలో హీరో పాత్రకు వ్రాసుకున్న ఆరు పేర్లను చూపించి అందులో నరసింహ రాజు గారి పేరు కూడా ఉండడాన్ని తనకు తెలియజేశారు.

అందులో మురళీమోహన్, కార్తీక్, భానుచందర్ తదితరుల పేర్లు కూడా ఉన్నాయి. కేవలం నరసింహ రాజు గారు వచ్చి అడిగారు అనే అభిమానంతో ఆ పాత్రను తనకే ఇచ్చేశారు. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి విఠలాచార్య గారు. ఏ సినిమాకి వెళ్తున్నామని అడిగితే సాధారణంగా అందులో నటించే హీరో పేరు చెబుతుంటారు. కానీ తన సినిమాలో ఎవరు కథనాయకుడిగా నటించినా కూడా దానిని విఠలాచార్య సినిమాగా చలామణి చేయించుకున్న ఘనత ఒక్క విఠలాచార్య గారికే దక్కుతుంది. తాను పారితోషికం ఎక్కువ ఇవ్వకపోయినా సరైన సమయానికి ఇస్తానన్నది ఖచ్చితంగా ఇచ్చేవారు. ప్రతీనెల 5వ తారీఖున పారితోషికం చెల్లించేవారు. అలా జగన్మోహని చిత్రంలో నటించారు నరసింహ రాజు గారు. అందులోనూ నరసింహ రాజు గారికి హీరో ఇమేజ్ లేదు. అయినా జగన్మోహని సినిమా మంచి విజయం సాధించింది.

వెల్లువలా అవకాశాలు…

మన నడవడిక బాగుంటే చిరకాలం చిత్ర పరిశ్రమ ఆదరిస్తుందని నమ్మే వ్యక్తుల్లో నరసింహ రాజు గారు ఒకరు. తన కృషికి అదృష్టం కూడా తోడవడంతో అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. వేషాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగాల్సిన అవసరం పెద్దగా రాలేదు. నరసింహ రాజు గారు హీరోగా 100 సినిమాల వరకు చేశారు. 20 సినిమాల్లో సాహా పాత్రధారిగా చేశారు. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్ సంస్థ రూపొందించిన “అత్తవారిల్లు” సినిమాలో నటించారు. రామారావు, శోభన్ బాబు, హరనాథ్ గార్లతో తప్ప మిగిలిన హీరోల అందరితోనూ నటించారు. సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయనిర్మల గారు వారి ప్రతీ సినిమాలో నరసింహారాజు ఉండాలని పిలిచేవారు. డేట్లు సర్దుబాటు చేసుకుని మరీ నటించేవారు.

చిరంజీవితో రెండు సినిమాలు..

నరసింహ రాజు గారు చిరంజీవి గారితో రెండు సినిమాలలో కలిసి నటించారు. పునాదిరాళ్లు, పున్నమినాగు రెండింటిలో నరసింహ రాజు గారు హీరో. ఏ.వీ.ఎం. సంస్థ నిర్మించిన పున్నమినాగు చిత్రంలో చిరంజీవి గారికి ఆ వేషం రావడానికి కారకులు సాహా దర్శకులు రామ సూరి గారు. ఈ చిత్రం తమిళ వర్షన్ లో విజయన్ నటించారు. తెలుగులో కూడా విజయన్ గారినే తీసుకోవాలనుకున్న తరుణంలో తనకు ప్రమాదం కావడంతో ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారు. ఆ సమయంలో ఆ పాత్ర ఎవరి చేత వేయించాలని అన్వేషిస్తున్నప్పుడు రామసూరి గారు చిరంజీవి గారి పేరు చెప్పారు. చిరంజీవి గారితో ఎంతో సన్నిహితంగా ఉన్న నరసింహ రాజు గారు తరువాత కాలంలో చిరంజీవి గారు మెగాస్టార్ గా ఎదిగిన తర్వాత తనని కలవలేదు. ఎందుకంటే నరసింహ రాజు గారికి ఆత్మభిమానం ఎక్కువ. సినిమాలలో అవకాశాలు తగ్గడం వలన సీరియల్ లలో అవకాశాలు వచ్చాయి. 1994 నుంచి నరసింహ రాజు సీరియల్స్ లో నటిస్తూ వస్తున్నారు. టీవీ సీరియల్స్ నరసింహ రాజు గారు గారు తీరిక లేని నటుడుగా కొనసాగుతున్నారు.

ముక్కుసూటి తత్వం…

“ఆడదంటే అలుసా” అనే చిత్రంలో నటిస్తున్నప్పుడు “దివిసీమ” లో ఉప్పెన వచ్చి చాలామంది జీవితాలను చిన్నభిన్నం చేసింది. ఆ ఉప్పెనలో నష్టపోయిన వారి కోసం రామారావు గారు, నాగేశ్వరావు గారు తమ సినిమాల చిత్రీకరణ మానుకుని 30 రోజులపాటు ఆంధ్రదేశం అంతటా పర్యటించి విరాళాల సేకరించారు. ఆ సమయంలో వారిద్దరి వెంట కొందరు నటీనటులు వెళ్లారు. నరసింహ రాజు గారికి పిలుపు రాకపోవడంతో తాను వెళ్లలేదు. ఆ సందర్భంగా ఓ పత్రిక వారు తనను ప్రశ్నించినప్పుడు నేను కొంచెం ఘాటుగానే స్పందించారు. ముక్కుసూటిగా మాట్లాడారు. జనం దగ్గరికి వెళ్లకుండా అగ్ర హీరోలు తమ వంతు విరాళం అందజేసి, తమ లాంటి చిన్న నటీనటులను కూడా తలా కొంత విరాళం ఇవ్వమని చెబితే బాగుండేదని పత్రికాముఖంగా ప్రకటించారు.

నిజంగా వారికి అంత జాలి ఉన్నట్లయితే ఆ రోజుల్లో 30 రోజుల్లో సినిమా పూర్తి చేసి వచ్చిన పారితోషకాన్ని విరాళంగా ఇస్తే బాగుంటుందని కూడా అన్నారు నరసింహ రాజు గారు. తాను అన్న మాటలు పత్రికలు బాగా ప్రచారం చేశాయి. పరిశ్రమలో దుమారం రేగింది. అగ్ర హీరోలుగా ఎదిగితే స్థాయికి నరసింహ రాజు గారు ఎదిగాడా, అతని చేతులు నరికేస్తాం, అతను నటించిన సినిమాలను ఆడనివ్వమని కొందరు ఆగ్రహిస్తే, మంచి ప్రకటన ఇచ్చావని మరికొందరు అభినందించారు. ఆ సమయంలో నరసింహ రాజు గారు ఆరు సినిమాలలో నటిస్తున్నాను. చాలామంది పెద్దవాళ్లతో పెట్టుకుంటావా అని తిట్టిపోశారు.

కానీ విఠలాచార్య గారు మీ అభిప్రాయాన్ని మీరు వెల్లడించడం తప్పేమీ కాదు. మిగతా వారి గురించి బాధపడకండి అని ఓదార్చారు. అభిమానం వల్ల సినిమాలు ఆడవు, మూడు నాలుగు రోజుల వరకు ఆ ప్రభావం ఉంటుంది. కథా బలం ఉన్నప్పుడు ఏ సినిమా అయినా విజయవంతం అవుతుంది మీరేం భయపడకండి అని ధైర్యం చెప్పారు. అప్పటికే నరసింహ రాజు గారు నటించిన జగన్మోహిని చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఎన్టీఆర్ గారు నటించిన “సింహబలుడు”, కృష్ణ గారు నటించిన “సింహ గర్జన” లకు పోటీగా ఆ సినిమా విడుదల చేసి విజయం సాధించారు విఠలాచార్య గారు. తెలుగులో వంద రోజులు ఆడితే, తమిళంలో ఏకంగా ఒక సంవత్సరం పాటు ఆడింది. ఈ సంఘటన జరిగిన తర్వాతే అక్కినేని నాగేశ్వరరావు గారి “సంగీత సామ్రాట్” చిత్రంలో మంచి పాత్ర లభించింది. అలాగే “అమరజీవులు” లో కూడా అక్కినేని తో కలిసి నటించారు నరసింహ రాజు గారు.

సహాయ పాత్రలలో…

కథనాయకుడు గా నరసింహ రాజు గారు చివరి చిత్రం విఠలాచార్య గారు దర్శకత్వం వహించిన “శ్రీ భ్రమరాంభిక కటాక్షం” (1990). ఆ తర్వాత నటునిగా మూడేళ్ల పాటు అవకాశాలు లేవు. ఎప్పుడు కష్టం వచ్చినా దాసరి గారి దగ్గరికి వెళ్లేవారు నరసింహ రాజు గారు. అలా ఒకరోజు దాసరి గారి దగ్గరికి వెళ్లినప్పుడు ఆ రోజుల్లో దాసరి గారికి ఎడిటింగ్ రూమ్స్ ఉండేవి. వాటి నిర్వహణ బాధ్యత నరసింహ రాజు గారికి అప్పగించారు. ఆ తర్వాత “అక్క పెత్తనం”, “చెల్లెలి కాపురం” వంటి చిత్రాలలో నటించమని దాసరి గారు అడిగినా కూడా నరసింహ రాజు గారే వద్దన్నారు. కొంతకాలం తర్వాత కృష్ణవంశీ గారు తీసిన “సింధూరం” సినిమాలో నరసింహ రాజు గారు నక్సలైట్ నాయకుడిగా నటించారు. అది చూసి రాంగోపాల్ వర్మ గారు సుమంత్ హీరోగా తీసిన “ప్రేమ కథ” చిత్రంలో హీరో తండ్రి వేషంలో నటించారు.

నరసింహ రాజు గారు, సారథి గార్లు హీరోలుగా కామెడీ కథాంశంతో ఆంగ్లంలో “ఇంటర్నేషనల్ ఫుల్స్” చిత్రాన్ని నిర్మించారు. పాతతరం దర్శకులు సి.యస్.రావు, బి.ఏ.సుబ్బారావు, కె.యస్.రెడ్డి గారు, హీరో సురేష్ తండ్రి గోపినాథ్ లతో బాటు సూర్యకాంతం, నూతన ప్రసాద్ తదితరులు ఇందులో నటించారు. ఈ చిత్రాన్ని విఠలాచార్య గారి చిన్నబ్బాయి రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆంగ్ల వర్షన్ విడుదలైంది. ఈ సినిమానే తెలుగులో “లంబు – జంబు” పేరుతో డబ్ చేసి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. పదివేల అడుగుల నిడివి వున్న ఈ సినిమా ను తెలుగులో మాత్రం విడుదల చేయలేకపోయారు. నరసింహ రాజు గారికి ఒక కూతురు జగదాంబ, ఒక కొడుకు ఉన్నారు. కూతురు మానవ వనరుల విభాగంలో పనిచేస్తున్నారు. కొడుకు కెనడాలో బ్యాంక్ ఆఫ్ మాంట్రియల్ లో మేనేజరుగా పనిచేస్తున్నాడు.

Show More
Back to top button