తెలుగు చిత్ర పరిశ్రమలో యాంగ్రీ యంగ్ మ్యాన్ అనగానే గుర్తొచ్చే హీరో రాజశేఖర్. అలాంటి హీరో తన కెరీర్లో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను తీశారు. అలాంటి వాటిలో ఒకటైన “అంకుశం” సినిమా విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎమ్.ఎస్.ఆర్ట్ మూవీస్ సంస్థ నిర్మించింది.
ఈ సినిమాలో నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి కీలక పాత్రను పోషించారు. ఇక కథానాయికగా జీవిత నటించారు. ఈ చిత్రంతోనే ప్రతినాయకుడుగా రామిరెడ్డి సినీ రంగ ప్రవేశం చేశారు. అయితే యాక్షన్ డ్రామాగా విడుదలైన ఈ సినిమా కోడి రామకృష్ణ, రాజశేఖర్ల సినీ కెరీర్‌ని పూర్తిస్థాయిలో మలుపు తిప్పింది. రాజశేఖర్ ఈ చిత్రంలో ముక్కు మీద కోపం ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఈ మూవీలో రాజశేఖర్ చూపించిన ఉగ్రావతారం ఇంకే సినిమాలలోనూ చూపించలేదు. అందుకే, ఈ చిత్రం విడుదల తర్వాత రాజశేఖర్‌కి యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా పేరొచ్చింది.
సంగీతం విషయానికొస్తే మ్యూజిక్ డైరెక్టర్ సత్యం స్వరపరిచిన సాంగ్స్ సందర్భోచితంగా సాగుతూ సినిమాని మరింత ఆసక్తికరంగా మార్చాయి. అన్ని పాటల్లోకెల్లా “ఇది చెరగని ప్రేమకు శ్రీకారం.. ఇది మమతల మేడకు ప్రాకారం” అని ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి పాడిన ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం 1990 సంవత్సరం సెప్టెంబరు 28న విడుదలై సంచలన విజయం సాధించింది.
ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేయగా.. అవి కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రంలో విలన్ పాత్రలో అతి భయంకరంగా నటించిన రామిరెడ్డి నంది అవార్డు గెలుచుకున్నారు. అలాగే, ఈ చిత్ర కథకు కూడా నంది పురస్కారం లభించింది. అందుకే, ఇదే కథతో మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్లో ‘ప్రతిబంద్’ టైటిల్‌తో అరంగేట్రం చేశారు.