CINEMATelugu Cinema

అన్నా చెల్లెళ్ళ ఆత్మీయానురాగానికి నిలువెత్తు నిదర్శనం…రక్తసంబంధం (1962) సినిమా.

సినిమాలు రెండు రకాలు. కళ్ళతో చూసే సినిమాలు, గుండెతో చూసే సినిమాలు. మనం చూసే సినిమాలలో కళ్ళతో చూసే సినిమాలు ఎక్కువగా ఉంటాయి. గుండెతో చూసే సినిమాలు చాలా తక్కువగా అక్కడక్కడా కనిపిస్తుంటాయి. ఎన్టీఆర్, సావిత్రిలు అన్నా చెల్లెళ్లుగా జీవించిన చిత్రం “రక్తసంబంధం” (1962) రెండో కోవకు చెందుతుంది. ఈ సినిమా 01 నవంబరు 1962 నాడు విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలకు సరిగ్గా ఐదు నెలల ముందే 07 జూన్ 1962 నాడు ఎన్టీఆర్, సావిత్రి భార్యభర్తలుగా నటించిన “గుండమ్మ కథ” (1962) విడుదలయ్యింది. ఇందులో భార్యభర్తలుగా ఎన్టీఆర్, సావిత్రి అద్భుతంగా అభినయాన్ని పండిస్తే సాదరంగా ఆహ్వానించిన ప్రేక్షకులే, “రక్తసంబంధం” సినిమాలో వారు అన్నా చెల్లెళ్ళుగా నటించినా కూడా బ్రహ్మరథం పట్టారు.

ఆ తరువాత ఎన్ని చిత్రాలలో యన్టీఆర్ అన్న పాత్రల్లో నటించి అలరించినా కూడా ఆయనకు “అన్న” గా తరిగిపోని, చెరిగిపోని స్థానం కల్పించిన సినిమా “రక్తసంబంధం” అనే చెప్పాలి. ఎన్నో చిత్రాలలో విజయవంతమైన జోడీగా అలరించిన యన్టీఆర్, సావిత్రిలు “రక్తసంబంధం” సినిమాలో అన్నాచెల్లెలుగా నటించినా, ఇద్దరూ అన్నాచెల్లెళ్ళుగా తమ పాత్రల్లో జీవించారు. అందుకే “రక్తసంబంధం” విషాదాంత చిత్రమే అయినా, రజతోత్సవాలు చేసుకునేంత ఘనవిజయం సాధించింది. రాజ్యలక్ష్మి పిక్చర్స్ పతాకంపై సుందల్ లాల్ నహతా, డూండీ నిర్మించిగా వీరామాచనేని మధుసూదనరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం  01 నవంబరు 1962 నాడు విడుదలై విజయఢంకా మోగించింది.

తమిళ భాషా చిత్రం “పాశమలర్” (1961) చిత్రాన్ని తెలుగులో “రక్తసంబంధం” గా పునర్నిర్మించారు. విజయ వాహినీ స్టూడియోస్‌, గోల్డెన్ ఫిల్మ్ స్టూడియోస్ లో వేసిన సెట్‌లలో పరిమిత బడ్జెట్‌తో నిర్మించబడింది ఈ చిత్రం. ఈ సినిమాకి రచన ముళ్లపూడి వెంకటరమణ చేశారు. ఘంటసాల వెంకటేశ్వరరావు నేపథ్య సంగీతాన్ని సమకూర్చగా, సి.నాగేశ్వరరావు ఛాయాగ్రహణం, కృష్ణారావు కళా దర్శకత్వం వహించారు. 01 నవంబర్ 1962న విడుదలై విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకున్న ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయవంతమైంది. 11 కేంద్రాలలో 100 రోజుల ప్రదర్శితమైన ఈ సినిమా విజయవాడలోని మారుతీ థియేటర్లో 25 వారాలకు పైగా పూర్తి చేసి రజతోత్సవం జరుపుకుంది. ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా 1988లో మళ్లీ విడుదలై రెండవసారి 100 రోజుల వేడుక జరుపుకుంది.

చిత్ర కథ…

అన్నయ్య ఇవ్వాలని నీకు ఇష్టమైన పూరీ కూర చేశాను, ఒక్క ముక్క కూడా వదలకూడదు తెలిసిందా అంటూ రాధమ్మ అన్న రాజశేఖర్ కు టిఫిన్ క్యారియర్ అందించింది. అమ్మ నువ్వు ఇంత రుచిగా చేశావంటే ఇంకా టిఫిన్ కాదు కదా క్యారియర్ కూడా మిగలదు జాగ్రత్తగా అన్నాడు రాజు నవ్వుతూ. రాధమ్మ కూడా నవ్వింది. అమ్మ రాధా! నన్నింత బుజ్జగించి ఎవరమ్మా తినిపిస్తారు?నాకు తల్లి లేని లోటు తీరుస్తున్నావు అమ్మా అన్నాడు రాజు. నువ్వు మాత్రం నాకు అమ్మనాన్నలు ఇద్దరు లేని లోటు కనబడకుండా చూడటంలా అంది రాధమ్మ. అంతలో కర్మాగారం (ఫ్యాక్టరీ) గంట మ్రోగింది. రాజు మిల్లుకు పరిగెత్తాడు. రాజు తన పదోయేట నుండే చెల్లిని అల్లారుముద్దుగా పెంచుతూ కూలీనాలి చేసి డబ్బులు తెచ్చి తను పస్తులుండి చెల్లెలికి పెట్టేవాడు. అతని ఆశలు కలలు అన్నీ రాధ చుట్టూనే. రాధ ఒక్కనాడు వాళ్ళ ఆవును ఇంటికి తీసుకెళ్తుంటే కారును చూసి బెదిరి కొమ్ము విసిరింది. రాధ క్రిందపడింది. ఆనందు అనే మిల్లు కార్మికుడు ఆమెకు కట్టుకట్టి ఇంటికి పంపాడు. ప్రాణ సమానమైన తన చెల్లెలికి చూపిన ఆదరణకు రాజు హృదయం కృతజ్ఞతలు నిండిపోయింది. ఆనాటి నుండి రాజు, ఆనందు ప్రాణ స్నేహితుయ్యారు. రాధా, ఆనందుల పరిచయం పెరిగింది. వాళ్ళిద్దరూ మనసిచ్చిపుచ్చుకున్నారు.

ఒకనాడు మిల్లులో సమ్మె జరిగింది. బోనస్ కోసం కార్మికుల చేత సమ్మె చేయిస్తే ఒళ్ళు మండిన యజమాని కర్మాగారం (ఫ్యాక్టరీ) మూసేశాడు. రాజుకు మొదటి నుంచి సంఘాలు, సమ్మెలు అంటే పడవు. బోనసు వస్తే చెల్లికి మంచి చీర కొనవచ్చునన్న అతనికి ఇప్పుడు నిరుద్యోగం పెనుభూతమైంది. దిగులుగా ఉన్న అన్నయ్యకు చెల్లెలు రాధమ్మ ధైర్యం చెప్పింది. అతనికి తెలియకుండా తను పనిచేసి కూడబెట్టిన వెయ్యి రూపాయలతో బొమ్మల వ్యాపారం పెడదామనుకుంది. రాజుకు ధైర్యం ద్విగుణీకృతమైంది. రాధమ్మ బుద్ధిబలం, ఉత్సాహం తోడై పట్టిందల్లా బంగారమైంది. అటు మిల్లు మూసుకు కూర్చున్న యజమాని వెంకటరత్నం కూడా రాజును తన మిల్లు నడిపించవలసిందిగా కోరాడు. మెల్లిగా పగ్గాలు చేపట్టాడతను. అచిరకాలంలోనే అతని దశ తిరిగింది. అన్నాచెల్లెల్లు చిన్న మేడ నుంచి పెద్ద బంగ్లాకు మారిపోయారు. ఓ రాకుమారుని తెచ్చి చెల్లెలికిచ్చి పెళ్లి చేసి వారిద్దరూ తన కళ్ళ ముందు తిరుగుతుంటే చూడాలని రాజు కల మెల్లిగా ఘనీభవించసాగింది.

తల్లి, తండ్రి లేని ఆనందకు మేనత్త కాంతమ్మే అన్నీనూ. పేరుకు తగ్గట్టుగానే ఆమె సూర్యకాంతమ్మ. ఇంటికి “మగదక్షత” ఆవిడదే. పనిగండం ఉన్న అప్పారావు ఆవిడకు కొడుకు. ఉద్యోగాలు చేయకుండా అప్పులు చేసి తన బావకు వాటిని బదలాయిస్తాడు.  ఈ అప్పారావు విసినాదం గారి అమ్మాయి రెండు జెళ్ళ సీతను గాఢంగా ప్రేమిస్తాడు. సీతకు కూడా అతడంటే ఇష్టమే. కానీ ఆమె తండ్రి చాటు బిడ్డ. విశినాదం మహా పిసినారి. కర్మాగారం లాకౌట్ కి వెళ్లడంతో అనందు సొంత ఊర్లో కోర్టు తగాదాల్లో ఉన్న ఆస్తి కేసులను ఓ కొలిక్కి తెచ్చేందుకు అక్కడే ఉండిపోతాడు. ఆయన కేసు గెలిపించుకొని తన ఊరు చేరేనాటికి తన స్నేహితుడు రాజు కాస్త రాజశేఖర్ గారు అయిపోతాడు. మేనత్త సలహామేరకు రాజశేఖరుని కలిసి ఆనందు ఉద్యోగం అభ్యర్థించి సంపాదించుకుంటాడు. రాధమ్మ ప్రేమను మూట కట్టుకుంటాడు. 

రాధమ్మ పుట్టినరోజు పండగనాడు ఆమెతో సన్నిహితంగా మెలుగుతున్న ఆనందును చూసి రాజు ఉగ్రుడై అతడిని చావబాదుతాడు. మరోవైపు కర్మాగారం పనివాళ్ళ ఉపసంహారణ గొడవ కూడా రాజశేఖర్, ఆనందుల మధ్య ఎడం కాస్త పెంచుతుంది. కర్మాగారం యజమాని వెంకటరత్నం గారు రాధమ్మకు ఓ గొప్పింటి సంబంధం చూపుతాడు. అయితే అబ్బాయి చెల్లెలు మాలతిని రాజు పెళ్లి చేసుకోవాలి. రాధమ్మకు ఈ వార్త చెప్పాలని ఆనందంగా ఇంటికి వచ్చిన రాజశేఖర్ ఒకచోట తోటలో ఆనంద్, రాధమ్మ మాట్లాడుతుండటం చూసి హతాశుడవుతాడు. అయితే ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లిచేసుకుందామన్న ఆనందుకు రాధమ్మ ఇచ్చిన సమాధానం రాజు మనసు మార్చుకునేలా చేస్తుంది. చెల్లెలి ప్రేమకు అతను వివశుడవుతాడు. ఆనందుకు రాధమ్మనిచ్చి పెళ్లి చేసి వాళ్ళను తనతోనే ఉంచుకుంటాడు రాజశేఖర్. ఆనందుకు తోకలాగా మేనత్త కాంతమ్మ, బామ్మర్ది అప్పారావు కూడా ఇక్కడే తిష్ట వేస్తారు.  పెళ్లయ్యాక గాని రాధమ్మకు అన్నయ్య తన కోసం చేసిన త్యాగం తెలిసిరాలేదు. తనే పూనుకొని మాలతితో అన్నయ్య పెళ్లి జరిపిస్తుంది.

కాంతమ్మ గారు రాజు ఇంట్లో తిష్ట వేయడంతో అప్పారావు శ్రీమంతుడు రాజశేఖర్ బంధువు అని తెలిసిన మరుక్షణం లోభి విశ్వనాథం అతడిని అల్లుడిగా చేసుకున్నాడు. కొడుకు కూడా ఓ ఇంటి వాడెవడంతో కాంతమ్మ నేరుగా రంగంలోకి దిగింది. ముందు రాధమ్మను రాజు నుంచి దూరం చేసి దురుద్దేశంతో వీలు చిక్కినప్పుడల్లా మాలతి, రాధమ్మల మధ్య పచ్చగడ్డి వేయడం ఆరంభించింది. ఆవిడ కష్టం వృధా కాలేదు బావ బామ్మార్దుల మధ్యన తలెత్తిన విభేదాలు చివరికి అన్నాచెల్లెళ్ళ మధ్య కూడా ఎడం పెంచాయి. ఇల్లు వదిలిన రాజు తన భార్యతో వెళ్లిపోయాడు. రాజు కష్టాలు అంతటితో ఆగలేదు. ఈ దిగుళ్ల మధ్య కడుపున పుట్టిన బిడ్డని అతి కష్టం మీద కనిచ్చిన మాలతీ కూడా చెప్పా పెట్టకుండా పైలోకాలకు వెళ్లిపోయింది.

భార్య మరణించడంతో మరోసారి తల్లి లేని బిడ్డని పెంచడం రాజు వంతయ్యింది. కాంతమ్మ విజృంభించింది. విరక్తిచెందిన రాజు చెల్లి సుఖం కోసం ఆస్తినంతా తన చెల్లి పేరుమీద వ్రాసి పసిదాన్ని తీసుకుని దేశాటనకు వెళ్లిపోయాడు. ఆనందు, రాధమ్మలకు కాంతమ్మ చేసిన నిర్వాకం అర్థమైంది. కానీ అప్పటికి ఆలస్యమైంది. దేశం పట్టి తిరుగుతున్న రాజు ఆరోగ్యం పాడయ్యింది. ఇక ఓపిక లేక రాజు దీపావళి రోజు ఇంటికి వచ్చాడు. తనకు తెలియకుండానే మేనల్లుడిని కారు ప్రమాదం నుండి తప్పించి తాను అంధుడయ్యాడు. అవరోధాలు తొలిగి రాధమ్మ అన్నయ్యను చేరేసరికి అతనికి ప్రాణం అవసాన దశలో ఉన్నది. ఆ చెల్లి చేతుల్లోనే అన్నయ్య విశ్రమించాడు. అన్నయ్యా అంటూ అతని మీద వాలిపోయింది రాధమ్మ. ఆమె ప్రాణం కూడా అన్నయ్యతో పాటే వెళ్ళిపోయింది.

డూండీ సినిమా ప్రస్థానం…

బెజవాడలో 1921 సంవత్సరంలో పోతిన బ్రదర్స్ “మారుతి టాకీస్” ను నిర్మించారు. శ్రీనివాస థియేటర్ ని కూడా వారే నిర్మించారు. వాటి యాజమాన్యంలో ఒకరు పోతిన శ్రీనివాసరావు సినిమాల మనిషి. ఆయన ఆంధ్రదేశానికి తొలి ఎగ్జిబిటర్ (ప్రదర్శకుడు). ఆయన రెండవ కుమారుడు పోతిన డూండేశ్వర రావు (డూండి). ఆయన టింగురంగడులా ఉండే కుర్రాడు. “మారుతి టాకీస్”,  “శ్రీనివాస థియేటర్” ల ఆజమాయిషీ డూండీ అన్న బెనర్జీ చూసుకునేవారు. డూండీ మాత్రం మద్రాసులో చదువుకుంటూ ఉండేవారు. సోమవారం నుండి శనివారం వరకు కళాశాలకు వెళుతుండేవారు. ఆదివారం మాత్రం సినిమా స్టూడియోల చుట్టూ తిరుగుతూండేవారు. 

డూండీ బాగోగులు, బాధ్యతలు ఇద్దరు ప్రముఖులు చూస్తుండేవారు. ఒకరు అక్కినేని నాగేశ్వరావు అయితే, రెండవ వ్యక్తి సుందర్ లాల్ నెహతా. డూండీ మంచి చెడ్డలు అక్కినేని నాగేశ్వరావు చూసుకుంటే, సుందర్ లాల్ నెహతా డబ్బు గట్రా సర్దుతూండేవారు. డూండీకి ఇంటి నుండి డబ్బులు రావడం ఆలస్యం అయితే సుందర్ లాల్ నెహతా కార్యాలయానికి వెళ్లి డబ్బు తీసుకునే చనువు ఉండేది. ఒక ఆదివారం మామూలుగానే విజయా స్టూడియోస్ కి వెళ్ళిన డూండీని ప్రొజెక్షన్ థియేటర్ కు లాక్కెళ్ళి “నేరమలై తిరుడన్” అనే తమిళ సినిమాను చూపించారు నాగిరెడ్డి. అది శాండో చిన్నప్ప దేవర్ సినిమా. ఆ సినిమాని ఆయన తన సినిమాలన్నీ విజయా స్టూడియోలోనే తీసేవారు.

“నేరమలై తిరుడన్” సినిమా స్టూడియోలో చిత్రీకరణ జరిపినందుకు గానూ శాండో చిన్నప్ప దేవర్, స్టూడియో అధినేత నాగిరెడ్డికి 24 వేల రూపాయలు బకాయి పడ్డారు. “నేరమలై తిరుడన్” సినిమా ప్రొజెక్షన్ పూర్తయ్యాక ఎలా ఉందని డూండీని అడిగారు నాగిరెడ్డి. నిజానికి ఆ సినిమా డూండీకి బాగా నచ్చింది. అప్పటికే నాగరెడ్డికి ఇవ్వవలసిన బకాయి క్రింద దేవర్ ఆ సినిమా డబ్బింగ్ హక్కులను ఇచ్చేశారు. అందువలన ఆ 24,000 రూపాయలు ఇచ్చి ఈ “నేరమలై తిరుడన్” సినిమాను తెలుగులోకి అనువాదం చేసుకోవాల్సిందిగా డూండీకి నాగిరెడ్డి చెప్పేశారు. దాంతో ఆ సినిమాను తెలుగులోకి అనువదించారు డూండీ. ఆ సినిమా పేరు “కొండవీటి దొంగ” (1957). ఆ సినిమా తెలుగులో కూడా బాగా ఆడింది. ఆ సినిమా డూండీకి మంచి లాభాలను కూడా తెచ్చిపెట్టింది. ఈ విధంగా డూండీ సినిమాల్లోకి ప్రవేశం చేశారు.

తొలి చిత్రం అక్కినేనితో శభాష్ రాజా (1961)…

ఆ తరువాత సుందర్ లాల్ మెహతా తీసిన “మంచి మనసుకు మంచి రోజులు”, “శభాష్ రాముడు”, “శాంతినివాసం”,  “అభిమానం” వంటి సినిమాలకు కార్యనిర్వాహక నిర్మాత (ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్) గా డూండీ పనిచేశారు. ఆయన నిర్మాతగా వ్యవహరించి అక్కినేని నాగేశ్వరావు, రాజసులోచన కలయికలో పూర్తిస్థాయిలో తెరకెక్కించిన తొలి చిత్రం శభాష్ రాజా (1961) నవంబరు 09 నాడు విడుదలైన సమయానికి మద్రాసులో ఓ తమిళ సినిమా విజయవంతంగా నడుస్తోంది. అది తమిళ అగ్రనటులు శివాజీ గణేషన్ సొంత సినిమా. అన్నా చెల్లెళ్ళ ప్రేమను అజరామరమైన దృశ్య కావ్యంగా మలచిన సినిమా అది. ఆ సినిమా డూండీకి అమితంగా నచ్చింది. దానిని తెలుగులో తీద్దామని సుందర్ లాల్ నెహతాతో చెప్పారు డూండీ. దానికి నెహతా కూడా ఆయన మాటకు మద్దతు పలికారు. ఆయన కేవలం ఆర్థిక వ్యవహారాలు మాత్రమే చూసుకునేవారు. డూండీ జడ్జిమెంట్ మీద అపారమైన నమ్మకం వున్న నెహతా క్రియేటివ్ వర్క్ మొత్తం ఆయనకే వదిలేసేవారు.

ఎన్టీఆర్ ను సూచించిన అక్కినేని…

శభాష్ రాజా సినిమాలో నటించిన కథానాయకుడు అక్కినేని అంటే చనువు ఎక్కువ వున్న డూండీ, నేరుగా ఆయన దగ్గరకు వెళ్లి ఈ సినిమా మీరు చేయాలనగానే అది విని అక్కినేని నవ్వేశారు. “నాతో ఆ సినిమా తీస్తే ఆడదు” అన్నారు. ఎందుకంటే అక్కినేని, సావిత్రి చెల్లెమ్మగా నటించడం జనం చూడరు. కనుక ఆయన నందమూరి తారకరామారావును సూచించారు. ఆయన అయితేనే బాగుంటుంది అని సలహా ఇచ్చారు. రామారావు ఆజానుబావుడు. సావిత్రి అన్నయ్యా అంటూ ఆయన గుండెలను హత్తుకుని ఏడిస్తే జనం హృదయాలకు కూడా ఆ సన్నివేశం హత్తుకుంటుంది నాకు ఆ విగ్రహం లేదు అంటూ అక్కినేని తేల్చేశారు. 

అక్కినేని చెప్పిన దానిలో డూండీకి నిజం ఉందనిపించడంతో ఆయన నందమూరిని కలిశారు. అప్పటికే ఆ సినిమా గురించి రామారావు విని ఉన్నారు. అప్పటికే సావిత్రితో తాను కథానాయకుడిగా నటించిన గుండమ్మ అద్భుతమైన విజయం సాధించినా కూడా డూండీ సినిమాలో నటించడానికి సంశయించలేదు. నిర్మాత సినిమాను నిర్మించే సామర్థ్యం ఉన్నదా, ఆ సినిమాలో తన వేషం తన సినీ ప్రస్థానానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే విషయాలు చూసుకునే రామారావు మిగిలిన విషయాలేవీ పట్టించుకోకుండా దర్శకుడు ఏది చెబితే అది చేసేవారు.

రచయిత ముళ్ళపూడి వెంకటరమణ…

“పాశమలర్” తమిళ సినిమాకు మూలకథ వ్రాసినవారు కె.పి.కొట్టార్కర. తమిళంలో ఈ కథను ఆయన అద్భుతంగా వ్రాశారు. కొత్తవారిని ప్రోత్సాహించడం అంటే సరదా ఉన్న డూండీ ఆంధ్రపత్రిక వారపత్రికలో సమీక్షలు వ్రాసే ముళ్ళపూడి వెంకటరమణను కథా రచయితగా తీసుకున్నారు. ఇతరత్రా విషయాలను ఏమాత్రం కలగజేసుకోని నందమూరి తారకరామారావు కొత్త రచయిత అనగానే కొంత భయపడ్డారు. సినిమా మొత్తం భారీ నాటకీయత, మానసిక భావోద్వేగాల మిళితం. సినిమా అంతా దిగంతాలకు పరుచుకుని ఉంటుంది. అంతటి సాహసం చేయడం ఎందుకు? ఆచార్య ఆత్రేయను తీసుకోమని డూండీకి సలహా ఇచ్చారు ఎన్టీఆర్.

కానీ పట్టు విడవని డూండీ “హాస్యం వ్రాయడం అంటే అంత తేలిక కాదు. జీవితం పట్ల అపారమైన అవగాహన ఉన్న మనషి మాత్రమే దానిని అద్భుతంగా పండించగలడు. హాస్యన్ని చక్కగా చిలికించగలిగిన మనిషి మిగతా ఏ రసాన్నయినా అవలీలగా పలికించగలడని నా నమ్మకం” అన్నారు ఎన్టీఆర్ తో. దాంతో మారు మాట్లాడని నందమూరి సరేనన్నారు. రచయిత ముళ్ళపూడి వెంకటరమణ సన్నివేశానికి 30 పేజీల వరకు సంభాషణలు వ్రాసేవారు. సినిమాకు 100 సన్నివేశాలుంటాయి. ఇలా వ్రాస్తే సినిమా మొత్తం ఎన్ని అడుగులు ఉంటుందో చూసుకోమని ఆయనకు చెప్పేవారు డూండీ. సంభాషణలు వ్రాయగా వ్రాయగా అందులోని ధర్మ సూక్ష్మము ఆయనకు తెలిసివచ్చింది. ఆ తరువాత చకచకా అల్లుకుపోయారు.

దర్శకుడిగా వీరమాచనేని మధుసూదనరావు…

“పాశమాలర్” దర్శకుడు బీమ్ సింగ్ తెలుగువాడే. కానీ వాళ్ళ తాత తండ్రులు తమిళనాడు వెళ్లి స్థిరపడడంతో, ఆయన కూడా అక్కడే పెరిగాడు. ఆ రోజులలో బీమ్ సింగ్ తమిళంలో అగ్ర దర్శకులలో ఒకరు. అగ్ర కథానాయకులు, పెద్ద బ్యానర్లతో సినిమాలు తీస్తూ ఆయన వ్యవహారం అట్టహాసంగా ఉండేది. పారితోషికం కూడా చాలా ఎక్కువగానే తీసుకునేవారు. “పాశమాలర్” ను “బీమ్ సింగ్” తో దర్శకత్వం చేయించాలంటే చాలాకాలం ఆగాలి. అందుకని డూండీ తెలుగువారితోనే దర్శకత్వం చేయించాలని అనుకున్నారు. అలా ఆయన మనసులో మెదిలిన వ్యక్తి వీరమాచనేని మధుసూదనరావు. ఈయన తొలి సినిమా “సతీతులసి” (1959). ఆ మరుసటి సంవత్సరం జగపతి పిక్చర్స్ వారి “అన్నపూర్ణ” సినిమా ఆయనకు దర్శకుడిగా ఇంకా మంచి పేరు తెచ్చిపెట్టింది. అందువలన డూండీ ఆయనను దర్శకునిగా ఎన్నుకున్నారు.

చిత్రీకరణ…

1962 ప్రారంభంలో రక్తసంబంధం చిత్ర చిత్రీకరణ ఆరంభమైంది. ఈ సినిమా మొత్తం చిత్రీకరణ స్టూడియోలోనే ముగించొచ్చు. చిత్రీకరణ అంతా విజయా, గోల్డెన్ స్టూడియోలో జరిగింది. సినిమా ప్రారంభంలో వచ్చే మిల్లు సన్నివేశాలు, అంతర్గతంగా చేసే పని సన్నివేశాల చిత్రీకరణ అంతా నిజమైన కర్మాగారంలో తీశారు. మిల్లు వెలుపలి పని భాగం చిత్రీకరణ మాత్రం గోల్డెన్ స్టూడియోలో చేశారు. స్టూడియో ఆవరణలో ప్రహరీగోడ సెట్ వేసి, గేటు పెట్టి పైన “రత్నం స్టీల్ అండ్ మెటల్ ఇండస్ట్రీస్” అనే బోర్డును తగిలించారు. లోపల ఒక కర్మాగారం గొట్టం, నిలువెత్తున కటౌట్ చేయించి పెట్టారు. గొట్టం వెనుక కనిపించే స్టూడియో అంతస్తు అచ్చం కర్మాగారం వాతావరం చూపిస్తుంది. 

రాధమ్మతో కలిసి రాజు బొమ్మల తయారీ సంస్థ ఆరంభించినప్పుడు ఒక మంచి పాట వస్తుంది. అదే “మంచి రోజు వస్తుంది, మా బ్రతుకునిస్తుంది”. దీనిని కొసరాజు  వ్రాశారు. అంతకుముందు కూడా కొసరాజు వీళ్లకు “శభాష్ రాముడు” చిత్రంలో “జయమ్ము నిశ్చయమ్మురా” పాటను వ్రాశారు. ఉల్లాసం, ఉత్సాహం, ఉత్తేజం కలగలిసిన ఇలాంటి పాటలు వ్రాయడంలో సిద్ధహస్థులు. “మంచి రోజు వస్తుంది, మా బ్రతుకునిస్తుంది” పాటను మద్రాసుకు సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న పల్లెలో తీశారు. కథలో అదృష్టవంతుడిగా అనతికాలంలోనే దశ తిరిగి రాజు బంగళాకు మారిపోతారు. ఆ భవంతి అప్పట్లో చామియర్స్ రోడ్డుకే తలమానికంగా ఉండేది. ఆ స్వంత భవంతి మరెవరిదో కాదు, అది సుందర్ లాల్ నేహతాదే.

“బంగారు బొమ్మ రావేమే”

“రక్తసంబంధం” సినిమా ప్రస్తావనకు రాగానే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది “బంగారు బొమ్మ రావేమే” అనే పాట. దీనిని ఆరుద్ర వ్రాశారు. 62 సంవత్సరాల క్రితం తెరకెక్కించిన “రక్తసంబంధం” సినిమాలోని ఈ పాట ఇప్పటికీ కూడా తెలుగునాట జరిగే పెళ్లివేడుకలకు వినిపించడం నిజంగా విశేషమే. ఈ పాట విషయంలో ఆరుద్రను, మధుసూదన రావును ప్రశంసిస్తుంటారు డూండీ. ఈ పాటకి తెరరూపం రావడానికి వాళ్ళిద్దరూ పడిన తపన అపూర్వం అని అంటారు. తమిళంలో “పాశమలార్” సినిమాకు సంగీత దర్శకులు “విశ్వనాథన్ రామ్మూర్తి”. “బంగారు బొమ్మ రావేమే” పాట యొక్క ట్యూన్ తమిళం నుంచి తీసుకున్నారు సంగీత దర్శకులు ఘంటసాల మాస్టారు. అలాగే “చందురుని మించు అందమొలికించు” పాట ట్యూన్ కూడా తమిళం నుండి తీసుకున్నదే. తమిళంలో కూడా “బంగారు బొమ్మ రావేమే” పాట అద్భుతంగా వచ్చింది.

అయితే ఆ పాటను తెలుగులో వ్రాయడానికి కూర్చున్నప్పుడు సరిగ్గా వ్రాయలేదు. అందుకని ఆరు నెలల పాటు ఆరుద్రను రాచిరంపాన పెట్టి మరీ మధుసూదన రావు ఈ రూపంలో రాబట్టుకున్నారని డూండీ చెప్పారు. పాట చిత్రీకరణ సమయం దగ్గర పడుతున్నా కూడా ఇంకా ఇంకా మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. అన్నీ అనుకున్న విధంగా అమరిన తరువాత ఈ పాట రికార్డింగ్ అయ్యింది, చిత్రీకరణ కూడా జరుపుకుంది. “డూండీ, మధుసూదన రావు లను ఒప్పించలేని నేను, రేపు లక్షలకొద్దీ ప్రేక్షకులను ఎలా మెప్పించగలను”? అని ఆరుద్ర డజన్ల కొద్దీ వెర్షన్లను అలా వ్రాస్తూనే పోయేవారు. అందుకే పాట చిరస్థాయిగా నిలిచిపోయింది. తెలుగు పెళ్లిళ్లలో ముత్యంగా వినిపించే మూడు పాటలు “బంగారు బొమ్మ రావేమే” (ఆరుద్ర), “సీతారాముల కళ్యాణం చూతము రారండి” (సీనియర్ సముద్రాల) “శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం” (ఆరుద్ర). రెండవ పాట సీనియర్ సముద్రాల వ్రాయగా, మొదటి పాట, చివరి పాట కూడా ఆరుద్ర గారే వ్రాయడం, ఆ పాటలు కూడా బాపు రమణలు వ్రాయించుకోవడం మరో విశేషం.

రమణ కథలలోని పేర్లే ఈ సినిమాలో పాత్రలకు… 

“పాసమలర్” తమిళ కథను తెలుగులో పునర్నిర్మాణం చేసేటప్పుడు కథలో పెద్దగా మార్పులేమీ చేయలేదు. ప్రధాన కథకు చక్కగా హాస్యాన్ని అనుసంధానం చేసి తెలుగుదనాన్ని మాత్రం గుమ్ముగా అద్దారు. ముళ్ళపూడి వెంకటరమణ తన మొదటి సినిమా గనుక ఆయన అప్పటికే తన కథల్లో పాఠకులను బాగా అలరించిన పాత్రలైన రాజు, రాధమ్మ, రెండు జెళ్ళ సీత, అప్పారావు, విసినాదం, కాంతమ్మ లాంటి పేర్లను చక్కగా వాడుకున్నారు. సూర్యకాంతం, రేలంగి, గిరిజ రమణారెడ్డి లాంటి వారు హాస్యాన్ని చాలా బాగా పండించారు.

సీతను దక్కించుకునేందుకు అప్పారావు పేపరులో వచ్చిన జలంధర్ ఉంగరం ప్రకటన చూసి ఆ అంగుళీకాన్ని తెప్పించుకుని విసినాదం మీద ప్రయోగిస్తాడు. కానీ ఫలితం ఉండదు. ఇక లాభం లేదనుకుని ముప్పై మంది  కుర్రాళ్ళను పోగేసుకుని విసినాదం ఇంటి ముందు నిరాహార దీక్ష మొదలెడతాడు. ముసలి విలను విసినాదం డౌన్ డౌన్, సీత నాన్న సింగినాదం డౌన్ డౌన్ అంటూ రాసిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ దసరా పులివేశంలో విసినాదం బొమ్మలను కూడా ప్రదర్శిస్తారు. నాకు ఇలాంటి వేషం వేయిస్తారా  అని నోరు బాదుకున్న విసినాదంతో “ఏం చెయ్యం? మీ ఫోటో తీసుకెళ్లి పెయింటరుకు ఇస్తే అతగాడు మీ పోలికే కాకుండా, బుద్దులు కూడా వచ్చేలా గీసేశాడు” అంటారు.

ముళ్ళపూడినే నమ్మిన మధుసూదన రావు…

ఆ రోజులలో బాపు, రమణలకు సినిమాలంటే విపరీతమైన ఇష్టం. ఎంతగా వారు ఇష్టపడేవారంటే రోజుకు కచ్చితంగా మూడు ఆటలు సినిమా చూసేటంత. ఆంధ్రపత్రికలో ఉద్యోగం మానేసి వచ్చాక వెంకటరమణ 1960 – 61 సంవత్సరాలలో స్వయం ఉపాధి చూసుకుంటూ ఉన్నారు. ముందుగా ఆయనకు మొదటి సినిమా అవకాశం ఇచ్చినవారు డి.బి.నారాయణ. ఆ సినిమా పేరు “దాగుడుమూతలు”. కానీ కథ చెప్పే విషయంలో దర్శకుడు ఆదుర్తిని ఒప్పించడంతో విఫలమయ్యారు. ఆ సినిమా అలా ఉండగానే “రక్తసంబంధం” సినిమా చిత్రీకరణ పూర్తయిపోయి విడుదలయ్యింది కూడా. నిజానికి ముళ్ళపూడి వెంకటరమణ మీద డూండీకి ఎంత నమ్మకముందో, వీరమాచనేని మధుసూదన రావుకు కూడా అంతే నమ్మకం. మధుసూదన రావు రచయితకు మొత్తం సన్నివేశాన్ని క్షుణ్ణంగా వివరించి తనకు కావలసిన మాటైనా, పాటైనా రాబట్టుకుంటారు. రచయిత కొత్తవాడా, పాతవాడా అనేది చూడకుండా తనకు కావలసింది రాబట్టుకోగలరు.

జెమినీ గణేశన్ స్థానంలో కాంతారావు…

“రక్తసంబంధం” సినిమా నాటికి సావిత్రి సూపర్ స్టార్. ఆవిడకు జంటగా నటించడం అంటే చాలా గొప్ప. తమిళంలో సావిత్రి ప్రక్కన జెమినీ గణేషన్ నటించేశారు. అప్పటికే వీళ్లిద్దరికి వివాహం అయ్యి “విజయ చాముండేశ్వరి” అనే కూతురు కూడా పుట్టింది. తమిళంలో వీళ్ళిద్దరిది బాగా ప్రసిద్ధ జంట. ఆ అదృష్టం తెలుగు సినిమాలో కాంతారావుకు దక్కింది. మరి తెలుగులో అంత స్థాయి ఉన్న నటుడు ఎవరా అని ఆలోచిస్తున్న డూండీకి వెంటనే కాంతారావు స్ఫురణకు వచ్చారు. ఎన్టీఆర్ కు కూడా కాంతారావు అంటే చాలా అభిమానం. డూండీ అంతకుముందు తాను తీసిన శాంతినివాసం సినిమాలో కాంతారావుకు అవకాశం ఇచ్చారు. శాంతినివాసం సినిమా కాంతారావుకు చాలా మంచి పేరు తెచ్చింది. సాంఘిక చిత్రాలలో కాంతారావుకు ఇష్టమైన సినిమా కూడా “శాంతినివాసం” సినిమానే. 

ఆ విధంగా ఆనందుగా నటించిన వేషం కాంతారావుకు వెళ్ళింది. సావిత్రి, కాంతారావుల మీద తీసిన “ఎవరో నన్ను కవ్వించి పోయేదేవరో” పాట స్టూడియోలో చిత్రీకరించవచ్చు. కాని డూండీ ఈ ఒక్క పాటను “కొడైకెనాల్” వెళ్లి మరీ చిత్రీకరించారు. ఇక తమిళంలో రాజం పోషించిన పాత్రను తెలుగులో దేవిక పోషించారు. నిజానికి అది చాలా చిన్న పాత్ర. కథ మొత్తం నటి సావిత్రి మీదే నడుస్తుంది. అందువలన దేవిక ప్రాధాన్యత కూడా చాలా తక్కువ. “శభాష్ రాముడు” సినిమాలో నాయికగా అవకాశం పొందిన కృతజ్ఞతతో దర్శకుడు అడగగానే దేవిక అంగీకరించింది. ఇకపోతే దేవిక అన్నగా ప్రభాకర్ రెడ్డి నటించారు. అలాగే వెంకటరత్నంగా నటించింది  కె.వి.ఎస్. శర్మ. ఆయనే “వీరాభిమాన్యు” సినిమాలో “శకుని” గా నటించారు. “వీరపాండ్య కట్ట బ్రహ్మన్న” సినిమాలో శివాజీకి గాత్ర దానం చేసింది కూడా ఈయనే.

ఛాయాగ్రాహకులు సి. నాగేశ్వరావు…

“రక్తసంబంధం” సినిమాకు ఛాయాగ్రహకులు సి.నాగేశ్వరరావు. అతనికి సహాయకులుగా ఎస్.వెంకటరత్నం పనిచేశారు. ఎన్టీఆర్ ను అందంగా చూపించడంలో సి.నాగేశ్వరరావు పేరును అప్పుడు బాగా చెప్పుకునేవారు. ఆయన ప్రతిభ గురించి మాట్లాడుకునేందుకు “పాండవ వనవాసం” సినిమా ఒక్కొక్కటి చాలు. అలాగే ఈ సినిమాకు సహాకార దర్శకునిగా పనిచేసినవారు “మంగళగిరి మల్లికార్జున రావు”. ఈయన సీనియర్ శ్రీరంజని కుమారులు. ఆ తరువాత ఇదే బ్యానర్ మీద వచ్చిన “గూఢచారి 116” సినిమా దర్శకునిగా ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టింది.

“రక్తసంబంధం” చిత్రం పతాక సన్నివేశాన్ని పండించేందుకు ఎన్టీఆర్, సావిత్రిలు పడిన తపన నిజంగా అపూర్వమనే చెప్పాలి. అనారోగ్యం ఒంట్లో తిష్ట వేసుకున్న దగ్గర నుంచి తన కదిలికల్లో నందమూరి చేసిన మార్పులు ఎవ్వరూ మర్చిపోలేరు. “ఇదే రక్తసంబంధం” పాట సినిమాలో రెండుసార్లు వస్తుంది. సినిమా పేర్లు పడుతున్నప్పుడు మొదటిసారి, పతాక సన్నివేశాలలో రెండోసారి. మొదటి పాటను దాశరథి వ్రాశారు. రెండోది అనిశెట్టి సుబ్బారావు వ్రాశారు. ఆయన వామపక్ష అభిమాని మధుసూదన రావుకు ఆప్తమిత్రుడు. “చందురుని మించు అందమొలికించు” అన్న పాట తమిళంలో కన్నా ఈ పాట తెలుగులో చాలా బాగా వచ్చింది. ఇది కూడా అనిశెట్టి సుబ్బారావు వ్రాశారు.

వెండితెర నవల…

ఈ రోజులలో సినిమా ప్రచారం అంతా టీ.వీ.లో ప్రమోషన్ వర్క్ ల మీద ఆధారపడడం జరుగుతుంది. కానీ ఆ రోజులలో పెద్దపెద్ద సినిమా నిర్మాణ సంస్థలు తమ సినిమాలను వెండితెర నవలా రూపంలో మార్కెట్లోకి తీసుకువచ్చేవి. సినిమా విడుదలకు ముందే నవలా రూపంలో వ్రాయించి, మంచి మంచి ఛాయాచిత్రాలతో పుస్తకాలను ప్రచారం చేయించేవారు. ఆ నవలా పుస్తకాలు కూడా బాగా అమ్ముడయ్యేవి. ఆ విధంగానే “రక్తసంబంధం” సినిమా ఎంత విజయవంతం అయ్యిందో, ఆ సినిమా వెండితెర నవల కూడా అంతే విజయవంతం అయ్యింది. దాదాపుగా 62 సంవత్సరాల క్రితం వెండితెర నవలగా వచ్చిన “రక్తసంబంధం” సినిమా నవల ధర ఒక్క రూపాయిగా ఉండేది. ఒక్క రూపాయి అంటే ఆరోజులలో చాలా ఎక్కువే. రమణ వ్రాసిన మొదటి వెండితెర నవల అన్నపూర్ణ వారి “వెలుగునీడలు” విడుదలైన వారం రోజులకే  ఆ నవలా పుస్తకం 10,000 కాపీలు అమ్ముడయిపోయింది. 

ఈరోజులలో నవల అంటే గరిష్టంగా 1000 కాపీలు మాత్రమే వేసుకునే పరిస్థితి. కానీ ఆ వెయ్యి కాపీలు కూడా అమ్ముడవ్వడానికి సంవత్సరాలు పట్టే దుస్థితి నెలకొని వుంది. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి “భార్యభర్తలు” సినిమాకు కూడా ముళ్ళపూడి వెంకటరమణ వెండితెర నవల వ్రాశారు. ఈ నవలను చదివిన దర్శకులు ప్రత్యగాత్మ, ఈ నవల ముందే వచ్చివుంటే భార్యభర్తలు (1961) సినిమాను నేను ఇంకా బాగా తీసివుందును అని వ్యాఖ్యానించారు. ముళ్ళపూడి వెంకటరమణ వ్రాసిన వెండితెర నవలల్లో మెరిసిన చమక్కులు అంత గొప్పగా వుండేవి. ముళ్ళపూడి వెంకటరమణ వ్రాసిన వెండితెర నవలల్లో మరో విజయం “ఇద్దరు మిత్రులు”. సినిమా పంపిణీరంగంలో ప్రచార నిర్వాహకునిగా భీష్ముని పీఠంపై కూర్చుండ బెట్టదగిన కాట్రగడ్డ నరసయ్య ఆ రోజుల్లో తమ మధు బుక్స్ సిరీస్ లో వెండితెర నవలలు వేస్తుండేవారు. రమణ వెండితెర నవలల గురించి వ్యాఖ్యానిస్తూ ఆయన “ఇడ్లీ కన్నా చట్నీ బెస్ట్” అనేవారు.

రజతోత్సవ చిత్రంగా “మారుతీ” విజయవాడలో…

“రక్తసంబంధం” సినిమా 01 నవంబరు 1962 నాడు విడుదలైంది. 17 రీల్స్‌తో సుమారు మొత్తం పొడవు 15,386 అడుగుల (4,690 మీ) మరియు సినిమా నిడివి 144 నిమిషాలు. సినిమా పంపిణీ హక్కులను ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సొంతం చేసుకుంది. విడుదలవ్వగానే జనం చేత భేష్ అనిపించుకుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమా ఆనాటి మహిళలను బాగా ఆకర్షించింది. ఈ సినిమాని జనం కనకాభిషేకం చేశారు. రక్త సంబంధం వాణిజ్యపరంగా విజయవంతమైంది, 11 కేంద్రాలలో 100 రోజులు, అలాగే విజయవాడ మారుతీ టాకీసులో 25 వారాలకు పైగా పూర్తి చేసి “రక్తసంబంధం” సినిమాను రజతోత్సవ చిత్రంగా మార్చింది.

ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రక్తసంబంధం సినిమా 1988లో తిరిగి విడుదలచేయబడింది. అప్పుడు హైదరాబాదులో 100 రోజుల ప్రదర్శనను పూర్తిచేసుకుంది. అప్పట్లో ఈ సినిమా నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది. అప్పట్లోనే అగ్రతారలుగా వెలుగొందుతున్న నందమూరి తారకరామారావుకు పాతిక వేలు, సావిత్రికి ఇరవై వేలు, దేవకికి ఇచ్చింది ఐదు వేల రూపాయలు. “రక్తసంబంధం” సినిమా 11 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుని, విజయవాడ మారుతి టాకీసులో రజతోత్సవం చేసుకున్నా కూడా నిర్మాతలు శతదినోత్సవ వేడుకలు మాత్రం చేయలేదు.

“మంచి మనసుకు మంచి రోజులు” సినిమా 100 రోజులు ఆడి, శత దినోత్సవ వేడుకలు విజయవాడలో జరిపారు. ఆ సినిమా 100 రోజులు ఆడిన రామ టాకీస్ వారికి శతదినోత్సవ వేడుకల బాధ్యతలు అప్పగించారు. తారలు, సాంకేతిక నిపుణులు మద్రాసు నుండి వచ్చారు. అయితే వారందరికీ బస ఒక్కచోట ఏర్పాటు చేయడం గొడవకు దారితీసింది. తారలందరికి సి.వి.రెడ్డి ఇంట బస. అందరినీ ఒకే చోట ఉంచిన కారణంగా స్థలాభావ ఇబ్బందులు వచ్చాయి. ఈ విషయం ఎన్టీఆర్ కి కోపం తెప్పించింది. ఆయనకు సర్దిచెప్పవలసి వచ్చింది. అప్పటినుండి డూండీ తన సినిమాలు ఎంత విజయవంతమైనా కూడా వేడుకలు మాత్రం చేసేవారు కాదు. కానీ విజయానికి సంబంధించిన షీల్డ్ లు తయారుచేయించి తారలందరి ఇళ్లకు పంపించేవారు.

Show More
Back to top button