నేటి పురుషాధిక్య సమాజంలో స్త్రీకి తగినంత గౌరవం లభించడం లేదనే వాదనలు నేటికీ వినిపిస్తున్న భారతదేశంలో ఎనభై ఐదు సంవత్సరాల క్రిందట ఒక మహిళ “ఆత్మవిశ్వాసం ఉంటే ఆత్మ గౌరవం నిలుపుకోవచ్చని నిరూపించి, నమ్మిన సిద్ధాంతాల కోసం రాజీపడకుండా జీవించడం ఎలాగో ఆచరించి, దిగువ మధ్యతరగతి మహిళ ఎవరెస్టు శిఖరం అంత ఎత్తుకు ఎలా ఎదగవచ్చో తన జీవితాన్నే ఒక ఉదాహరణగా చేసి చూపించారు బహుముఖ ప్రజ్ఞాశాలి నటి శ్రీమతి భానుమతి. ఆమె కేవలం నటి మాత్రమే కాదు. నటి, గాయని, కథా రచయిత, దర్శకురాలు, నిర్మాత, స్టూడియో నిర్వాహకులురాలు, సంగీత దర్శకురాలు, జ్యోతిష్కురాలు కూడా. ఇలా అనేక రకాల విద్యలలో ఆరితేరి ఇప్పటివరకు భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇలాంటి చరిత్ర ఇంకెవ్వరికీ లేని ఒకేఒక్క విదుషీమణి భానుమతి.
ఆమె చిన్న వయస్సులో ఎన్నో విజయాలు సాధించారు. ఆమె కేవలం పద్నాలుగు సంవత్సరాల వయస్సులోనే మొట్టమొదటగా సినిమాలో నటించారు. పద్దెనిమిది సంవత్సరాలకే పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. పంతొమ్మిది సంవత్సరాలకే కొడుకుకు జన్మనిచ్చారు. అదే పంతొమ్మిది సంవత్సరాల వయస్సులోనే కథ కూడా వ్రాశారు. ఆమె తన ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సులో సినిమాను నిర్మించారు. తన ఇరవై అయిదు సంవత్సరాల వయస్సులో సొంత స్టూడియో నిర్మించారు. తన ఇరవై ఎనిమిది సంవత్సరాల వయస్సులో సొంతంగా సినిమా దర్శకత్వం చేశారు. తన ఇరవై సంవత్సరాల వయస్సులో సంగీత దర్శకత్వం కూడా చేశారు. ఒక స్త్రీ కి ఇంతకంటే స్ఫూర్తి ఇంకేముంటుంది?
“చల్లారని సంకల్పం నీ తోడుంటే అల్లావుద్దీన్ అద్భుతదీపం అవసరం లేదట” అనడానికి నిలువెత్తు నిదర్శనం శ్రీమతి భానుమతి. తన పద్నాలుగవ సంవత్సరం మొదలుకొని తన ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు ఆమె లెక్కలేనన్ని విజయాలు సొంతం చేసుకున్నారు. ఆ విజయాలని తన 75 వ సంవత్సరం వరకు నిలుపుకున్నారు. ఒక స్త్రీ తలుచుకుంటే సరైన మార్గంలో తన వ్యక్తిత్వాన్ని దిద్దుకుంటూ తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుకుంటూ, సంకల్పాన్ని వదిలేయకుండా ముందుకెళ్తే ఏదైనా సాధించవచ్చని చెప్పడానికి భానుమతి ఉదాహరణ.
భానుమతి వ్యవహార శైలి గురించి చెప్పాలంటే ఆమె ఒక మహారాణి దర్పం, మహారాణి ఠీవీ గుర్తొస్తుంటాయి. అందువలననే కాబోలు ఆమెకు గర్వం, అహంభావం అని చాలా మంది అంటుండేవారు. నా మీద నాకుండే నమ్మకాన్ని, గౌరవాన్ని, అహంకారం అనేవాళ్ళకి, మోసగించ మొహమాటం లేకపోవడం, విహారపు వినయం, అభినందించడానికి ఇష్టం లేక తలపొగరు అని విమర్శించే వారికి నేను చెప్పగలిగింది ఏమీ లేదు, మీరందరూ అహంభావం అనుకుంటారు. మొహమాటం లేని తనం నా ఆత్మవిశ్వాసం మాత్రమే అని ఆవిడ చెబుతుండేవారు. ఆమె చిన్నతనంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నారు, ఎన్నో కన్నీళ్లను దిగమింగారు. కానీ ఆమె ఏనాడూ తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు.
ఆవిడ బాల్యమంతా కష్టాలు, కన్నీళ్లు. పిల్లలకు వండిపెట్టి అమ్మ పస్తులు ఉన్నటువంటి వైనం నుండి భానుమతి వచ్చారు. ఆమె సంగీతంలో పేరు సంపాదించారు. ఆమె సంగీతంలో మాత్రమే కొనసాగుదాం అనుకున్నారు. అంతే కానీ ఆమె సినిమాలలో నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. తండ్రి బలవంతం మీద సినిమాలలో నటించడానికి వెళ్లారు. ఒకటి, రెండు సినిమాలు చేసి ఇంటికి వచ్చి ఒక సంవత్సరం పాటు సంగీతం నేర్చుకున్నారు.
సినిమాలలో అవకాశం వచ్చి మళ్లీ నటించడానికి వెళ్లారు. అదే సమయంలో ప్రేమ వివాహం చేసుకోవడం, ఒక అబ్బాయికి జన్మనివ్వడం, ఆ తరువాత సినిమాలు వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో మళ్లీ ఇంకో సినిమాలో అవకాశం రావడం అలా ఆమె చిన్నతనంలో ఏ మాత్రం ఇష్టం లేకున్నా సినిమా రంగంలో కొనసాగించాలని నిర్ణయించుకుని డెబ్భై అయిదు సంవత్సరాల వయస్సు వచ్చేసరికి వివిధ రకాల పాత్రలలో నటిస్తూ చక్కని సినిమాలను అందించారు భానుమతి.
జీవిత విశేషాలు…
జన్మ నామం : భానుమతి రామకృష్ణ
ఇతర పేర్లు : భానుమతి
జననం : 07 సెప్టెంబరు 1925
స్వస్థలం : దొడ్డవరం, ఒంగోలు, ప్రకాశం జిల్లా,
వృత్తి : సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు
తండ్రి : బొమ్మరాజు వెంకటసుబ్బయ్య
జీవిత భాగస్వామి : పి.యస్. రామకృష్ణారావు
పిల్లలు : భరణి (కుమారుడు)
మరణ కారణం : అనారోగ్యం
మరణం : 24 డిసెంబరు 2005, చెన్నై.
నేపథ్యం…
భానుమతి 07 సెప్టెంబరు 1925 నాడు ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు దగ్గర గల “దొడ్డవరం” లో జన్మించారు. ఆమె దొడ్డవరం లో జన్మించినా కూడా పెరిగింది మాత్రం ఒంగోలు లోనే. భానుమతి తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య. ఆయన శాస్త్రీయ సంగీత ప్రియుడు, కళావిశారదుడు. భానుమతి తల్లి పేరు “సరస్వతి”. బొమ్మరాజు వెంకటసుబ్బయ్య శాస్త్రీయ సంగీత ప్రియుడు అవ్వడం వలన సరస్వతి (భానుమతి తల్లిని) ఒక పెళ్లిలో మంగళహారతి పాడుతుండగా చూసి ఆమెను పెళ్లి చేసుకున్నారు. మైకులు లేని ఆ రోజులలో సరస్వతి దేవాలయాలలో సంగీత కచ్చేరీ పాడుతూ ఉంటే సంగీత అభిమానులు తన్మయత్వంతో వింటూండేవారు.
భానుమతికి ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు చెల్లెళ్లు. భానుమతి తాతగారు చనిపోతూ, భానుమతి నానమ్మకు సుమారు 36 ఎకరాల పొలం ఇచ్చివెళ్లారు. భానుమతి నానమ్మ “నేతి గారెలు” తిని ఆ 36 ఎకరాల పొలాన్ని అవజేసింది. గారెలను నేతిలో వండి, నేతిలో నానబెట్టి, నెయ్యి రాసి మరీ తింటుండేవారు. అలా నేతి గారెలు తినడానికి అయిన ఖర్చుకే తన 36 ఎకరాలు పొలం అమ్మేశారు. భానుమతి నాన్న బొమ్మరాజు వెంకటసుబ్బయ్య బంధువులలో ఒకరికి సంతానం లేదు. అందువలన ఈయనను దత్తత తీసుకున్నారు. దాంతో ఆయన ఒంగోలులోనే ఉంటూ మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్నారు.
బొమ్మరాజు వెంకటసుబ్బయ్య తన మెట్రిక్యులేషన్ చదువు అయిపోగానే అక్కడ వెంకటగిరి రాజా వారి ఆస్థానంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ ఉండేవారు. ఆ రోజులలో పది నుండి పదిహేను తాలూకాలు కలిపి ఒక పెర్క అనేవారు. ఆ పెర్కా కు వెంకటసుబ్బయ్య రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ ఉండేవారు. కొన్నాళ్ళ తరువాత వెంకటసుబ్బయ్య ని దత్తత తీసుకున్న బంధువులు మరణించారు. దాంతో 1931 ప్రాంతంలో లక్షల ఆస్తి వెంకటసుబ్బయ్యకు వచ్చేసింది. ఇంత ఆస్తి రావడంతో అసూయపరులైన భానుమతి బంధువులు వెంకటసుబ్బయ్య మీద గుంటూరు కోర్టులో కేసు వేశారు. ఆ కేసును వెంకటసుబ్బయ్య గెలిచారు.
బాల్యం…
కోర్టు ద్వారా ఆస్తి మొత్తం బొమ్మరాజు వెంకటసుబ్బయ్య (భానుమతి తండ్రి) వాళ్ళకు వచ్చేసరికి ఓర్చుకోలేని వారి బంధువులు మద్రాసు ఉన్నత న్యాయస్థానంకు (హైకోర్టు) అప్పీలు చేశారు. దాంతో భానుమతి నాన్న ఉద్యోగం మానేసి కోర్టు చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. కోర్టు చుట్టూ తిరగడానికి ఒకవైపు డబ్బులు ఖర్చవుతుంటే, మరోవైపు ఇల్లు గడవడానికి డబ్బులు ఖర్చవుతూ ఉన్న డబ్బంతా ఖాళీ అయిపోయింది. చేసేదిలేక భానుమతి అమ్మ ఒంటిమీద నగలు అమ్మి కోర్టు కేసులకు ఖర్చుపెట్టారు. తిరిగి తిరిగి ఆయన శారీరకంగా, మానసికంగా బాగా దెబ్బ తిన్నారు. నాన్న కోర్టుల చుట్టూ తిరుగుతుండటంతో ఒకవైపు ఐదుగురు పిల్లలను సాకడం తల్లికి కష్టమైపోయింది.
ఆమెకు సంగీతం తెలిసి ఉండడంతో, ఆమె ఇంటి దగ్గరే పిల్లలకు సంగీత పాఠాలను చెబుతూ కుటుంబ పోషణ సాగించేవారు. భానుమతిని బాలికల పాఠశాలలో చేర్పించారు. ఆ పాఠశాలకు ప్రముఖ కవి జాషువా సోదరి ప్రధానోపాధ్యాయులు. సంగీతం పాఠాలు చెబుతూ, వచ్చిన డబ్బులతో ఆమె ఐదుగురిని పోషించేవారు. ఉదయం, మధ్యాహ్నం పిల్లలకు భోజనం పెట్టి, మిగిలిన భోజనం సాయంత్రం కూడా పిల్లలకే పెట్టేవారు. పిల్లలకు పెట్టగా తల్లికి ఖాళీ పాత్రలే మిగిలేవి. దాంతో ఆమె మాత్రం బలుచు ఆకులను వండుకొని కొంచెం ఉప్పు వేసుకుని తినేవారు.
కొన్నిరోజులు గడిచినాక కోర్టులో కేసు పోయింది, ఆస్తులు పోయాయి. చేసేది లేక తెనాలిలో ఉన్న మిత్రులు వేదాంతం లక్ష్మీనారాయణ వద్ద గుమస్తాగా పని చేసి, వచ్చిన డబ్బులను ఇంటికి పంపిస్తుండేవారు. సరస్వతి సంగీతం చెప్పగా వచ్చిన డబ్బులు, వెంకటసుబ్బయ్య పంపించిన డబ్బులు, ఈ రెండింటితో వాళ్ళ జీవనం గడిపేస్తూ ఉండేవారు. వాళ్ల ఊరిలో కిరాణా కొట్టులో ఖాతా పెట్టి, సరుకులు తెచ్చి జీవనం గడుపుతుండేవారు. అమ్మకు రెండు చీరలే ఉండేవి. పిల్లలకు తిండి పెట్టి అమ్మానాన్నలు పస్తులు ఉంటూ పాటలు పాడుకునేవారు. భానుమతి తన అమ్మ దగ్గరే సంగీతం నేర్చుకునేవారు. వాళ్ళ అమ్మ పూజలు చేస్తూ కథలు చెప్తుండేవారు. అలా ఆమె చెప్పిన కథలలో నుండి ఒక కథతో తరువాత కాలంలో భానుమతి “రత్నమాల” అనే సినిమా తీశారు. ఇలాంటి దయనీయమైన, దుర్భేద్యమైన బాల్యం భానుమతి జీవితంలో గడిచింది.
సినీ రంగ ప్రవేశం…
భానుమతి తన పదకొండు సంవత్సరాల వయస్సులో ఆరవ తరగతి చదువుతుండగా వాళ్ళ మాష్టారు “పాదుకా పట్టాభిషేకం” నాటకం ప్రదర్శన చేయించాలనుకుని భానుమతిని ఆ నాటకంలో లక్ష్మీదేవి పాత్ర, రాముని పాత్రలో నటింపజేయాలని చూశారు. నాటకంలో ముందుగా ఒక ప్రార్ధన గీతం ఉంటుంది. ఆ ప్రార్ధన గీతంలో లక్ష్మీదేవి గాను, పట్టాభిషేకంలో రాముడు గానూ భానుమతితో వేషం వేయించాలని అనుకున్నారు. కానీ భానుమతికి ఇష్టం లేదు. మాష్టారు గారి మాట కాదనలేక సరే అన్నారు. దాంతో ఆ ఊరిలో ఉన్న అక్కమ్మ అనే ఆవిడ భానుమతికి మేకప్ చేసి నాటకానికి సిద్ధం చేశారు. లక్ష్మీదేవిగా, రాముడిగా పాత్రలు ధరించి, పద్యాలు పాడుతూ చక్కటి అభినయంతో పాత్రలను పూర్తిచేశారు. ఆ నాటకం విజయవంతమైంది.
ఆ తరువాత వారం రోజులకి భానుమతి వాళ్ళ ఇంటికి, భానుమతి నాన్న మిత్రులు గోవిందరాజుల సుబ్బారావు వచ్చారు. మాటలలో మాటగా భానుమతికి పాటలు బాగా వచ్చునన్న విషయం తెలుసుకొని ఆమె చేత గ్రామఫోన్ రికార్డులు ఇప్పిస్తే బావుంటుంది అని వెంకటసుబ్బయ్య కు సలహా ఇచ్చారు. ఒకసారి కోర్టు పనిమీద మద్రాసు వెళుతున్న నాన్న వెంకటసుబ్బయ్య వెంట భానుమతి కూడా వెళ్లారు. పనిలో పనిగా గోవిందరాజుల సుబ్బారావు ఇంటికి వెళ్ళి కలిశారు.
వెంకటసుబ్బయ్య, భానుమతిలను వెంటబెట్టుకుని గోవిందరాజుల సుబ్బారావు, దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం కలిసి ఆయన సినిమాలో ఒక పాత్రకు తీసుకోవలసిందిగా కోరారు. దాంతో భానుమతిని పరిశీలించిన ఆయన ఆమెను ఒక పాట పాడవలసిందిగా కోరారు. మాములుగానే సిగ్గు, బిడియంతో ఉన్న భానుమతి భయం భయంగా ఒక పాట పాడారు. అది విన్న గూడవల్లి రామబ్రహ్మం గొంతు లేతగా ఉంది. ఇంకా పసిఛాయలు పోలేదు. అందువలన కొంత కాలం ఆగాలని చెప్పారు. అలా భానుమతికి గూడవల్లి రామబ్రహ్మం సినిమాలో అవకాశం తప్పిపోయింది. దాంతో చేసేది లేక తిరిగి వాళ్ళ ఊరికి వెళ్లిపోయారు.
తొలి సినిమా “వరవిక్రయం”…
నాన్న వెంకటసుబ్బయ్య ఆరోగ్యం దెబ్బతిన్నది. దాంతో ఆయన భానుమతికి పెళ్లి చేయాలనుకున్నారు. ఒక సంబంధం తెచ్చారు. కానీ తనకు చిటికెన వ్రేలు లేదని ఆ సంబంధం తప్పించారు. రెండో సంబంధంగా ఒక ముసలివాడు వచ్చాడు. కానీ లేత వయస్సులో ఉన్న భానుమతిని చూసి తన మనవరాలు వయస్సు ఉండడంతో కాదన్నాడు. చేసేదిలేక భానుమతికి జాతకం చూపించారు. ఆమెకు పద్దెనిమిది సంవత్సరాల వయస్సు వరకు పెళ్లి అవ్వదని తేల్చిచెప్పేశారు జాతకులు. అలాగే ఆమెది మహార్జాతకం అని చెప్పేశారు. చిత్తజల్లు పుల్లయ్య “వరవిక్రయం” (1939) తీస్తూ గోవిందరాజుల సుబ్బారావు సిఫారసు మేరకు భానుమతికి ఒక వేషం ఇవ్వడానికి ఒప్పుకుని ఆమెను పిలిపించారు.
కాళ్ళకూరి నారాయణరావు పంతులు రచించిన సాంఘిక నాటకం “వర విక్రయం” ఈ చిత్రానికి మూలకథ. అందులో ఒక పాత్రకు కొత్త అమ్మాయి కావాలి. కనుక భానుమతి కోసం రేలంగిని పంపించి ఆమెను పిలిపించారు. రాజమహేంద్రవరం లోనే ఆ సినిమాను మొదలుపెట్టి “పుష్పవల్లి” తో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. కొన్ని అనివార్య కారణాల వలన ఆ చిత్రాన్ని రాజమహేంద్రవరంలో చిత్రీకరించలేకపోయారు. ఆ చిత్రాన్ని కలకత్తాలో చిత్రీకరించడానికి సన్నాహాలు మొదలుపెట్టి భానుమతిని కలకత్తా రమ్మని కబురు పంపించారు. సినిమాల గురించి ఒక రకమైన అపోహ ఉన్న వెంకటసుబ్బయ్య మేకపాటి నరసింహారావును సంప్రదించగా, ఆయన ధైర్యం చెప్పడంతో సరేనని భానుమతిని వాళ్ళ నాన్న కలకత్తా తీసుకెళ్లారు.
ఆ విధంగా తన పద్నాలుగు సంవత్సరాల వయస్సులో భానుమతి తొలిసారి సినిమాలలో నటించడానికి కలకత్తా వచ్చారు. వరవిక్రయం సినిమాలో “బలిజేపల్లి లక్ష్మీకాంత కవి” పిసినారి పాత్రలో, “దైతా గోపాలం” భానుమతికి తండ్రి పాత్ర, తల్లి పాత్రలో “శ్రీరంజని”, భానుమతి చెల్లెలి పాత్రలో “పుష్పవల్లి” ఇలా అందరూ పేరుప్రఖ్యాతులు గాంచిన నటీనటులే. “కాళింది” పాత్రలో తొలిసారిగా “వరవిక్రయం” సినిమాలో భానుమతి చాలా చక్కగా నటించారు. తన అరవై సంవత్సరాల సినీ చరిత్ర కలిగిన భానుమతి చిత్రసీమలో తనదైన స్థాయిని నిలుపుకొని, విశిష్ట మహిళగా పేరు తెచ్చుకున్న భానుమతి మొట్టమొదటగా నటించిన సినిమా వరవిక్రయం అద్భుతమైన విజయం సాధించింది.
భరణి స్టూడియో నిర్మాణం…
నటిగా భానుమతి “వరవిక్రయం” (1939) తర్వాత మాలతీ మాధవం, ధర్మపత్ని (1941) మరియు భక్తిమాల లాంటి చిత్రాలలో ఆమె నటించారు. ప్రజాదరణ పొందిన ఆమె మొదటి చిత్రం “కృష్ణ ప్రేమ”. అది ఆమె సినీప్రస్థానంలో ఒక మైలురాయి చిత్రం. ఇక 1945లో బి.యన్. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన “స్వర్గసీమ” ఆమె సినీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. స్వర్గసీమలో భానుమతి పాడిన “ఓ పావురమా” అనే పాట ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. ఆ పాట ఇప్పటికీ కూడా ఈనాటి శ్రోతలను అలరిస్తూనే ఉన్నది. ఈ పాట సూపర్ హిట్ అవ్వడంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. దాంతో అప్రతిహతమైన ఆమె ప్రస్థానం ప్రారంభమైంది.
1946 లో ఎల్వీప్రసాద్ తీసిన “గృహప్రవేశం” కూడా తెలుగు చిత్రసీమలో ఆమె స్థానం పదిలం కావడానికి ఎంతో దోహదం చేసింది. ఆ తరువాత ఆమె “రత్నమాల”, “రాజముక్తి” మొదలగు సినిమాలు వచ్చాయి. నిజానికి “కృష్ణ ప్రేమ” సినిమా తరువాత రామకృష్ణను పెళ్లిచేసుకుని కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న భానుమతిని బి.యన్. రెడ్డి, వై.వి.రావు తదితరులు ఒప్పించి తిరిగి సినిమాల్లో నటించేలా చేశారు. తమిళ టాకీస్ వాళ్ళు తమ “మురుగన్” సినిమా కోసం ఆ రోజులలో భానుమతికి ఇరవై ఐదు వేల రూపాయల పారితోషికం ఇచ్చారు. ఆ డబ్బులతో ఆమె తన కొడుకు పేరుతో “భరణి స్టూడియో” ను నిర్మించారు. ఆ భరణి సంస్థ నుండి భానుమతి రామకృష్ణలు “రత్నమాల”, “లైలా మజ్ను”, “విప్రనారాయణ”, “బాటసారి”, “వివాహ బంధం” తదితర విజయవంతమైన చిత్రాలు నిర్మించారు.
గాయనిగా…
స్వర్గసీమ సినిమా తరువాత “చక్రపాణి” , “లైలా మజ్ను” , “విప్రనారాయణ” , “మల్లీశ్వరి” , “బాటసారి” మరియు “అంతస్తులు” వంటి ఎన్నో గుర్తుండిపోయే సినిమాలలో భానుమతి నటించారు. ఆమె తన జీవితంలో నటించిన అద్భుతమైన సినిమాలలో మల్లీశ్వరి (1951) ఒకటి. దీనిని బి.యన్.రెడ్డి తెరకెక్కించారు. మల్లీశ్వరి చిత్రంలో అమాయక అమ్మాయి పాత్రలో ఆమె నటన ఆజరామరం. నేటికీ మల్లీశ్వరి ఒక కల్ట్ సినిమా. అందులో “మనసున్న మల్లెల మాల లూగెనే”, “పిలిచిన బిగువటరా”, “ఏడ దాగున్నాడో బావ” లాంటి పాటలు తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయాయి. ఆ పాటలలో భానుమతి గాన మాధుర్యాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఆ మాధుర్యం ప్రేమికుల గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అలాగే “ఆలీబాబా 40 దొంగలు”, “తోడు నీడ”, “సారంగధర” లాంటి అనేక సినిమాలలో భానుమతి తన సంపూర్ణ వ్యక్తిత్వంతో నటించి ఒక కొత్త ఒరవడికి దారి తీశారు.
సంగీత దర్శకురాలిగా…
భానుమతి సంగీత దర్శకురాలిగా “చక్రపాణి”, “అంతా మనమంచికే”, “చింతామణి” లాంటి సినిమాలకు పనిచేసి గొప్ప సంగీతాన్ని అందించారు. గాయనిగా వందలాది పాటలు పాడిన భానుమతి “మల్లీశ్వరి”తో సహా “విప్రనారాయణ” సినిమాలో పాడిన “ఎందుకోయీ తోటమాలి” అనే పాటను కూడా అద్భుతంగా పాడారు. 1953లో భానుమతి తొలిసారి “చండీరాణి” సినిమాకి మొదటిసారిగా దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. చండీరాణి (1953), గృహలక్ష్మి (1967), అంతా మన మంచికే (1972), విచిత్ర వివాహం (1973), అమ్మాయి పెళ్ళి (1974), ఇప్పడియుమ్ ఒరు పెన్ (తమిళం) (1975), వాంగ సంభందీ వాంగ (తమిళం) (1976), మనవడి కోసం (1977), రచయిత్రి (1980), ఒకనాటి రాత్రి (1980), భక్త ధృవ మార్కండేయ (1982), పెరియమ్మ (తమిళం) (1992), అసాధ్యురాలు (1993) ఇలా 20 సినిమాలకు పైగా ఆమె దర్శకత్వం వహించారు. దర్శకురాలిగా ఆమె తన వ్యక్తిత్వానికి, స్వభావానికి తగిన సినిమాలు తీశారు, తగిన పాత్రలని పోషించారు. తాను దర్శకత్వం వహించిన సినిమాలలో “అంతా మనమంచికే” అనే సినిమా తనకు ఇష్టమైనది అని చెప్పుకునే భానుమతి, ఆమె స్త్రీలను చులకనగా చూసే వారికి, మోసగాళ్లకు గుణపాఠం చెప్పే పాత్రలలో ఆమె నటించారు. అలాగే ఆమె బాలనటులతో భక్త ధృవ మార్కండేయ సినిమాను ప్రయోగాత్మకంగా తీసి విజయం సాధించారు.
వివాహం…
కృష్ణ ప్రేమ (1943) సినిమా చిత్రీకరణ సమయంలో భానుమతిని ఒక వ్యక్తి విపరీతంగా ఆకర్షించారు. ఆయన ఎప్పుడూ మౌనంగా తనపనేదో తాను చేసుకుపోతూ ఆమెకు దూరంగా ఉండేవారు. ఆమె అంటే భయం వలననా? లేక నిర్లక్ష్యం వలననా? అనేది ఆమెకు తెలియకుండా ఉండేది. కానీ భానుమతి మాత్రం ఆయనే పరీక్షిస్తూ ఉండేది. ఒకసారి ఒక సన్నివేశంలో నటిస్తుండగా గులాబీ ముళ్ళు ఆమె చేతివేళ్లకు గ్రుచ్చుకున్నాయి. రక్తం కారుతుంది. గబగబా ఆ వ్యక్తి వచ్చి గుడ్డకట్టాడు. దాంతో ఆయన ధైర్యానికి నేను ఆశ్చర్యపోవడం ఆమె వంతు అయ్యింది. ఆయనేవరో కాదు సహాయ దర్శకులు పి.యస్. రామకృష్ణారావు. భానుమతి ప్రేమ విషయం వాళ్ళ అమ్మ నాన్నలకు తెలిసిపోయింది. ఆస్తిపాస్తులు లేని మనిషితో నువ్వు కష్టపడుతుంటే చూడలేమన్నారు. అతడిని మర్చిపోమన్నారు వారు. కానీ భానుమతి నాన్న వ్యక్తిత్వం పుణికిపుచ్చుకున్నది కదా.
ఆమె అనుకున్నదే చేసి చూపించింది. జార్జి టౌన్ “వెంకటేశ్వర స్వామి” వారి ఆలయంలో తాను కోరుకున్న మనిషి చేత తాళి కట్టించుకుంది. 08 ఆగష్టు 1943 నాడు తమిళ, తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఎడిటరు అయిన శ్రీ పి.యస్. రామకృష్ణారావును భానుమతి ప్రేమ వివాహం చేసుకున్నారు. కట్టుబట్టలతో పుట్టిల్లు వదిలి రామకృష్ణతో కాపురానికి వెళ్లిపోయారు. ఆమె ప్రేమ వివాహం గురించి అందరికీ ముందుగానే తెలిసినా ఆ ప్రేమను సాధించుకోడానికి భానుమతి నిరాహార దీక్ష చేయడం, గౌరిదేవి పటం ముందు మౌనంగా కూర్చొని రోదించిన విషయం చాలా మందికి తెలియదు. తాను అనుకున్నది సాధించుకోవడం భానుమతికి తెలిసినంతంగా మరెవ్వరికీ తెయదు. వీరిద్దరి ఏకైక కుమారుడు భరణి.
అత్తగారి కథలు…
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భానుమతి వ్రాసిన హాస్య రచన “అత్తగారి కథలు”. ఈ సాహిత్యంలో అత్తగారి పాత్ర యొక్క స్వభావం, మాటలు, చేసే పనులు చాలా నవ్వు తెప్పిస్తాయి. ఒకటి చేయబోయి ఇంకేదో చేస్తూవుంటుంది. అత్తగారు తాను ఎంతో తెలివైనదాన్ని అనుకుంటుంది. ఈ కథలలో రచయిత్రి చిత్రించిన అత్తగారి స్వభావం హాస్యాన్ని, పెద్దరికాన్ని, మానవతను మనకళ్ళముందు మూర్తీభవింపజేస్తుంది. అత్తగారి పుట్టిల్లు చంగల్పట్టు, మెట్టినిల్లు రాయలసీమ, నివాసం చెన్నపట్నం. ఆమె నిష్టగా ఉండే శ్రీవైష్ణవురాలు. ఆమె ఇంట్లో, ఆమె మాటకు తిరుగు లేదు. ఇంట్లోవాళ్ళూ, ఇరుగు పొరుగూ అందరూ ఆవిడ మాట జవదాటరు. అందరూ ఆవిడను అమితంగా ప్రేమిస్తారు. అందరినీ ఆప్యాయంగా పలకరించడంలోనూ, ఆవకాయ పెట్టడంలోనూ, అరటిపొడి చెయ్యడంలోనూ, చాకలి పద్దులు రాయడంలోనూ ఆవిడకు ఎవరూ సాటి లేరని అత్తగారి విశ్వాసం.
అందుకే తన తప్పును ఒక పట్టాన ఒప్పుకోరు. అస్సలు తప్పు అని తెలుసుకోలేని అమాయకురాలు ఆవిడ. బస్సు, వ్యాను ఒకటే అని ఆమె అభిప్రాయం. జపాన్ అంటే ఢిల్లీ దగ్గర ఉందంటుంది ఆమె. “సవతులన్న తరువాత పోట్లాడుకోవద్దూ, మీరిద్దరూ పోట్లాడుకోరే” అని పాలవాడి పెళ్ళాలతో పోట్లాడుతుంది. నవనాగరికురాలైన కోడలు, సత్యకాలపు అత్తగారు గురించిన రచనలలో భానుమతి సృష్టికి పరాకాష్ఠ “అత్తగారి కథలు”. ఎందుకంటే అత్తగారి పాత్ర వాస్తవమైనదీ, జీవంతో తొణికిసలాడేదీను. ఈ కథలో అత్తగారు కోడలితో ఒద్దికగా ఉంటుంది. ఇంటిపెత్తనమంతా అత్తగారిదే. కాని ఆవిడ వఠి పూర్వకాలపు చాదస్తపు మనిషి. హాస్యం పుట్టేది ఇక్కడే”. 1994లో “అత్తగారి కథలు” రచనకు గానూ ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు భానుమతి.
మరణం…
తెలుగులో పాటు తమిళం లో కూడా భానుమతి అనేక సినిమాలలో నటించారు. “మధురై వీరన్”, “నాదోది మన్నన్”, “అన్నై”, “మంగళ”, “అంబికాపతి” లాంటి తమిళ సినిమాలలో ఆమె నటించారు. “నిషాన్, మంగళా, నాయి రోష్ని” లాంటి హిందీ సినిమాలలో కూడా భానుమతి నటించారు. తమిళనాడు ప్రభుత్వం ఆమెను మద్రాసులోని ప్రభుత్వ సంగీత కళాశాలకు ప్రధానాచార్యులుగా నియమించింది. ఆమెకు “పల్నాటి యుద్ధం”, “అన్నై”, “అంతస్తులు” మొదలుగు సినిమాలకు రాష్ట్రపతి నుండి పురస్కారాలు కూడా అందుకున్నారు. 1966 వ సంవత్సరంలో ఆమెను భారతప్రభుత్వం “పద్మశ్రీ” పురస్కారం ఇచ్చి గౌరవించింది. అలాగే భారతప్రభుత్వం 2001 వ సంవత్సరంలో “పద్మభూషణ్” పురస్కారం ఇచ్చి భానుమతిని సత్కరించింది.
వీటితో పాటు అనేక పురస్కారాలను దక్కించుకున్నారు భానుమతి. వాటిలో “ఎన్టీఆర్ జాతీయ పురస్కారం”, “రఘుపతి వెంకయ్య” పురస్కారాలతో పాటు పలు నంది, ఫిలింఫేర్ అవార్డులు కూడా భానుమతి ఖాతాలో ఉన్నాయి. ఆమె సినీ ప్రస్థానంలో దాదాపు ఆరు దశాబ్దాలపాటు ఆమె విజయవంతంగా కొనసాగారు. భానుమతి కొడుకు “భరణి” మద్రాసులోనే స్థిరపడడంతో కొడుకు, కోడలు, వాళ్ళ పిల్లలతో భానుమతి చాలా కాలం శేషజీవితం ఆనందంగా గడిపేశారు. తన బహుముఖ ప్రజ్ఞా విశేషాలతో ఎన్నో సాధించి, ఎందరికో ఆదర్శంగా నిలిచిన భానుమతీ రామకృష్ణ 24 డిసెంబరు 2005 నాడు చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు.
ప్రతీ సినిమాలో త్యాగరాయ కీర్తన…
చాలామందికి తెలియని విషయం ఏమిటంటే భానుమతి ఎంత గొప్ప చలనచిత్ర నటి అయినప్పటికీ ఆమె సాంప్రదాయానికి ఏనాడూ విడాకులు ఇవ్వలేదు. ఆమె పూజగదిలో కుంకుమ బొట్టు పెట్టిన వాళ్ళ అమ్మా, నాన్నల ఫోటో ఉండేది. ఆమె భర్త, సినిమా దర్శకులు పి.రామకృష్ణ రావు ఫోటో కూడా అక్కడ వున్నది. అంత పెద్ద నటి అయ్యి ఉండి కూడా తాను సినిమాలలో నటించే రోజులలో కూడా శ్రావణ శుక్రవారాలు కాళ్ళకూ, ముఖానికి పసుపు రాసుకునేవారు. ఇట్టి విషయాన్ని నాడు నిర్మాత బి.నాగిరెడ్డి పెద్ద కూతురు నాతో స్వయంగా చెప్పారు అని గొల్లపూడి మారుతీరావు చెప్పేవారు.
ప్రతీ సినిమాలోని తప్పనిసరిగా ఒక త్యాగరాజ కీర్తన పాడుతానని సినిమా రంగానికి వచ్చినప్పుడు భానుమతి వాళ్ళ తండ్రికి ఒక మాట ఇచ్చిందట. కర్ణాటక సంగీతం పట్ల, త్యాగరాజ స్వామి పట్ల, సంగీతం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తన తండ్రి పట్ల ఆమెకున్న భక్తి ప్రపత్తులకు ఇది ఒక నిదర్శనం. దక్షిణ భారత చలన చిత్ర రంగంలో భానుమతి ఒక చరిత్ర. నటన, రచన, సంగీతం, గానం, చిత్ర నిర్మాణం, దర్శకత్వం, స్టూడియో నిర్వహణ ఇలా జాతీయ స్థాయిలో బహుమతులు అందుకున్న ఒకే ఒక్క భారతీయ విదుషీమణి పాలువాయి భానుమతి అని గొల్లపూడి మారుతీరావు చెప్పుకొచ్చారు.