Telugu Cinema

తెలుగు సినీ రచయితల వర్గానికి భీష్మాచార్యులు.. డి.వి. నరసరాజు

భీష్మాచార్యులు”గుండమ్మ కథ” సినిమా లో “గుండమ్మ” ను “గుండక్కా”.. అని పిలుస్తాడు ఎన్టీవోడు. అప్పుడు “నేను అక్కనట్రా” అని అంటుంది ఎన్టీవోడిని. అక్కంటే తప్పేంటి ఘంటన్నా అని రమణారెడ్డి తో అంటాడు ఎన్టీవోడు. ఆ సినిమా లో సావిత్రి ని బుల్లెమ్మా అని, జమున ను చిట్టెమ్మా అని ఎన్టీవోడి తో పిలిపిస్తాడు రచయిత. ఆ సంభాషణ లు ఎంతలా పేలాయంటే ఆ సినిమా అఖండ విజయానికి దోహదం చేశాయి. “యమగోల” లో “తాళము వేసితిని గొల్లెము మరచితిని” అని పలికించినదీ, “పిచ్చోడిలాగా ఏమిటి.. ఖచ్చితమైన పిచ్చోడినైతే” అంటూ శంకరం నోట “పెద్దమనుషులు” పై వ్యంగ్యం చిలికించినదీ కూడా అదే రచయిత. ఆ రచయిత ఎవరో కాదు. మాటల మాంత్రికుడు డి.వి.నరసరాజు.

నరసరాజు గారికి మొదటి నుంచి సృజనాత్మక కళల మీదే దృష్టి. తనకు ఆస్తి బాగా ఉండడంతో ఉద్యోగాలు చేయాల్సిన లంపటాలు లేకపోవడంతో, బంధువుల దన్ను ఉండడంతోనూ నాటక రచయితగా తన జీవితాన్ని ప్రారంభించారు. తెలుగు చిత్ర సీమలో కథ, సంభాషణల రచయితగా తాను సుప్రసిద్ధులు. ఆయన మౌలికంగా నాటక రంగం తెలుగు పలుకు బడిని ఉపయోగించడంలో అందెవేసిన చేయి. డి.వి.నరసరాజు గారు చూడడానికి చాలా గంభీరమైన వ్యక్తి లాగా తోస్తారు. కొందరికి ముక్కోపిలా ఆగుపిస్తారు.

వ్యక్తిగతంగా తాను మాటకారి కాదు. కానీ తన రచనలో జాలువారిన మాటలు తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. భీష్మాచార్యులు సినిమా పరిశ్రమలో వివాదాలకు దూరంగా, వివాదాలకు అతీతంగా తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకున్న వారు ఎవరైనా ఉన్నారు అంటే అది నిస్సందేహంగా నరసరాజుగారే. 92 కు పైగా సినిమాలకు కథను, మాటలను సమకూర్చిన నరసరాజు గారు, తాను అన్ని సినిమాలకు రాసినా నరసరాజు అనగానే గుర్తొచ్చే సినిమా మాత్రం “యమగోలే”.

అలనాటి దిగ్గజ సినీ రచయితలలో “డి.వి. నరసరాజు” ది ప్రత్యేక స్థానం. తెలుగు రచయితల వర్గానికి తానొక భీష్మాచార్యులు. తన గురించి క్లుప్తంగా చెప్పుకుంటే, నేడు రచయితలకు సంఘం ఉంది అంటే ఆ రోజుల్లో మద్రాసులో తాను నెలకొల్పిన తెలుగు సినీ రచయితల సంఘమే కారణం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన రచనతో ఎన్నో మరపురాని చిత్రాలను అందించిన ప్రసిద్ధ రచయిత డి.వి. నరసరాజు గారు. ఆయన రచించిన సినిమాలలో హాస్యరసం తొణికిస లాడుతూ ప్రేక్షకుల్ని నవ్వించింది. తెలుగు పలుకుబడిని ఉపయోగించడంలో నరసరాజు గారిది అందెవేసిన చేయి. సామాన్య వాడుక లో జనం నిరంతరం వాడే పదాలనే వాడి హాస్యం, వ్యంగ్యం పండించిన కృషీవలుడు డి.వి.నరసరాజు గారు

తెలుగు పలుకుబడిని ఉపయోగించడంలో నరసరాజు గారిది అందెవేసిన చేయి. సామాన్య వాడుక లో జనం నిరంతరం వాడే పదాలనే వాడి హాస్యం, వ్యంగ్యం పండించిన కృషీవలుడు డి.వి.నరసరాజు గారు. 1951లో పాతాళభైరవి సినిమా వందరోజుల ఉత్సవం సందర్భంగా ప్రదర్శించబడిన నరసరాజు గారి నాటకం “నాటకం” చూసి దర్శకులు కె.వి.రెడ్డి గారు తనని సినిమా రంగానికి పరిచయం చేశారు. 1954లో పెద్దమనుషులు సినిమాతో రచయితగా సినీరంగప్రవేశం చేసిన నరసరాజు గారు, ఆ సినిమా విజయవంతమవడంతో సినీ రచయితగా స్థిరపడ్డారు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    దాట్ల వెంకట నరసరాజు

ఇతర పేర్లు  :    డి.వి.నరసరాజు

జననం    :    15 జూలై 1920

స్వస్థలం   :     గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలంలోని తాళ్లూరులో

వృత్తి      :    హేతువాది , రచయిత, దర్శకుడు, నాటక రచయిత

తండ్రి    :   పద్మరాజు

తల్లి     :   సుబ్బమ్మ

భార్య     :   వెంకట్రామమ్మ 

పిల్లలు   :   ఒక కుమార్తె

మతం   :     హిందూ

మరణం    :     28 ఆగష్టు  2006

హైదరాబాదు

నేపథ్యం…

ప్రఖ్యాతులైన సినీ రచయిత డి.వి.నరసరాజు గారి పూర్తి పేరు దాట్ల వెంకట నరసరాజు. దాట్ల వెంకట నరసరాజు గారి స్వస్థలం గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం తాళ్లూరు. 15 జులై 1920 నాడు పద్మరాజు, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. ఈ దంపతులకు మొదట 1918 లో కూతురు  వెంకటరామమ్మ, 1920 లో కుమారుడు వెంకట నరసరాజు, ఆ తర్వాత ఒక ఆడపిల్ల పుట్టి చనిపోయింది. ఊరు మొత్తం మీద రాజుల కుటుంబాలు అరడజను కంటే ఎక్కువ ఉండేవి కాదు. మిగతా కులాలు కమ్మ, తెలగ, వగైరా ఉన్న వారికి భూవసతి పెద్దగా ఉండేది కాదు. నాలుగైదు బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి వారికి భూ వసతి బాగానే ఉండేది. ఊళ్లో రామాలయం ఉండేది. దానికి నరసరాజు గారి కుటుంబం ధర్మకర్తలు.

శ్రీరామనవమికి వారి కుటుంబ సభ్యులే పీటల మీద కూర్చుని సీతారాముల కళ్యాణం చేయించేవారు. వారికున్న పలుకుబడితో గుంటూరు, సత్తెనపల్లి మొదలగు పట్టణాలలో చందాలు సేకరించి ఊరు బయట పడమటి దిక్కున ఒక శివాలయం కట్టించారు. తన హై స్కూల్ చదువు హిందూ హైస్కూల్లోనూ, ఇంటర్ హిందూ కాలేజీ గుంటూరులోను పూర్తి చేసి మద్రాసు లైలా కాలేజీ నుంచి బీ.ఏ.డిగ్రీ తీసుకున్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో బీ.ఏ.లో స్టేట్ ఫస్ట్ గా నిలిచారు నరసరాజు గారు. బెజవాడ ముత్యాలంపాడు లోనే మేనమామ వాళ్ళ ఇంట్లో తన బాల్యం అంతా సాగింది. కొన్ని జట్కాలు, నాలుగైదు కార్లు మాత్రమే ఉన్న నాటి బెజవాడ వీధుల్లో నరసరాజు గారి చిన్నతనం అంతా గడిచిపోయింది.

విద్యాబ్యాసం

తన విద్యాభ్యాసం నాలుగవ తరగతి వరకు ముత్యాలంపాడు లోనే సాగింది. ఆ రోజుల్లో పల్లెటూర్లలో నాలుగవ తరగతి వరకే ఉంటుంది. పై చదువులకు పట్టణాలకు వెళ్లి చదువుకోవాలి. దాంతో చాలా మంది చదువు మానేసేవారు. కానీ నరసరాజు గారు పై చదువుల కోసం 1933 లో కొత్తపేట లోని హిందూ ఉన్నత పాఠశాలలో ఫోర్త్ ఫారంలో చేరారు. ముత్యాలంపాడు ఎలిమెంటరీ పాఠశాలలో చదివేటప్పుడు తనకు ఫిట్స్‌ వచ్చాయి (మూర్చ). మూర్చ అంటే స్పృహ వుండేది. ఎడం చేతి వేళ్లు కొంకర్లు పోయేవి. ఎడం చేయి వణికిపోయేది. కానీ ఎడం చెయ్యి చచ్చుపడేది, పట్టు యిచ్చేదికాదు.

మొదట్లో అమృతాంజనంతో చేతికి మర్ధన చేయడం యింకా ఏదో ఆయుర్వేద వైద్యుం చేశారు, గాని లాభం లేకపోయింది. అప్పుడు ప్రకృతి వైద్యంలో ప్రవేశం ఉన్న తన నాలుగో మేనమామ తనకు తొట్టి స్నానం అనే ప్రకృతి వైద్యం చేయించాడు. ఆహారం చప్పిడిగా కారం లేకుండా అన్ని కాయగూరలు వండి పెట్టించేవారు. కొద్ది కాలం తరువాత మూర్చలు పూర్తిగా తగ్గిపోయాయి. మళ్లీ జీవితంలో తనకు ఎప్పుడూ మూర్చలు రాలేదు

1933 నుంచి 1936 వరకు నాల్గవ ఫారం, ఐదవ ఫారం, ఆరవ ఫారం అంటే 9, 10, 11 వ తరగతులు పూర్తి చేశారు. స్కూల్ ఫైనల్ అంటే 11వ క్లాసు. ఆ తర్వాత కాలేజీ లో ఇంటర్మీడియట్ రెండేళ్లు, బి.ఏ. రెండేళ్లు. గుంటూరు హిందూ కళాశాలలో చేరారు. చేరిన తర్వాత అది ఒక కొత్త జీవితం ఇల్లు వదిలి హాస్టల్లో ఉండి చదవడం కొత్త అనుభవం. సాయంత్రం కళాశాల నుంచి తిరిగిరాగానే హాస్టల్లో క్యారమ్స్ ఆడుకునే వాళ్ళు. సినిమాలు బాగా చూసేవారు. వచ్చిన ప్రతీ తెలుగు సినిమా తప్పకుండా చూసేవారు.

వివాహం…

నరసరాజు గారి తండ్రి గారు పోయిన తరువాత తన పెద్ద మేనమామ సుబ్బరాజు గారు తాళ్లూరు వెళ్లి ఆస్తి విభాగాలు చేయించి నరసరాజు గారి వాటా భూములు కౌలుకిచ్చి తనను, తన అమ్మ, అక్కయ్య, తమ్ముని ముత్యాలంపాడు తీసుకొచ్చారు. నరసరాజు గారికి, తన కూతురినిచ్చి వివాహం చేయదలచి తన కుటుంబం సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేశారు.

అదేమిటి? ఆడుకునే చిన్నపిల్లలు – వాళ్లకి అప్పుడే పెళ్లేమిటి? అని తమ్ముళ్లు – చెల్లెళ్లు అంటే, ఆ నేను ఎక్కువ రోజులు బతకను. అప్పుడు వాడు చేసుకుంటాడో లేదో. నేను వాడి ఆస్తి కాపాడాను. అంత ఆస్తిపరుడు అల్లుడు కావాలని కోరుకోవడం తప్పా!” అని ముహూర్తాలు పెట్టించేశారు.

నరసరాజు గారి పెళ్లి 1932 “మే” నెలలో జరిగింది. వారిది బాల్య వివాహం. అప్పుడు నరసరాజు గారికి 12 ఏళ్లు. తన భార్య వెంకట్రామమ్మ కు 10 ఏళ్లు. వీరిద్దరి మధ్య తేడా ఏడాది పైన 8 నెలల వ్యత్యాసం.

నాటకాలు..

నరసరాజు గారికి నాటకాలు చూడడం చిన్నతనం నుండే మొదలయ్యింది. నాలుగయిదేళ్ల వయస్సు లోనే ముత్యాలంపాడు లో పాటి మీద వీధి నాటకాలు వేసేవాళ్లు. ముత్యాలంపాడులోనే మాలపల్లిలో కొందరు వారి పాలెళ్లతో సహా వీధి నాటకాలు నేర్చుకుని ప్రదర్శించేవాళ్లు. నరసరాజు గారి తాతయ్య గారి ఆవులు కాచే కోటాయి అనే అతడు హీరో వేషాలు వేసేవాడు. ఇంకొకడు బిక్షాలు అని సావిత్రమ్మగారి పాలేరు, తాను హీరోయిన్ వేషాలు వేసేవాడు. పున్నాయి అని రైల్వేలో గ్యాంగ్‌మాన్‌గా పనిచేసే అతను విలన్ వేషాలు వేసేవాడు. రావణుడు, హిరణ్యకశిపుడు వగైరాలు. వాళ్లకి నాటకాలు నేర్పే గురువు అయ్యన్న అనే అతను సాతాని. అతను నారదుడు వేషం వేసేవాడు. “గోవిందుడేల రాడే.. గోపాలుడేల రాడే..  నా మందపాలుతాగి ఏమందకేగినాడో”.. అని కృష్ణుని మీద పాట. బెజవాడ – ఏలూరు రోడ్డులో మాచవరం అనే ఊరు వుంది. ఆ ఊరి మాలవాళ్లు వీధి నాటకాలు వేసేవాళ్లు. అక్కడ విరాట పర్వం చాలా ఫేమస్.

ఇవి గాక తోలు బొమ్మలాటలు. పిల్లలు గోనె సంచులు, చాపలు తీసుకుపోయి వాటి మీద నిలబడి చూసేవాళ్ళు. నాటకాలు తెల్లవారిందాకా ఉండేవి. ముత్యాలంపాడులోనే కుర్రవాళ్లు అంటే యువకులు పద్యాలు, పాటలు పాడగలిగినవాళ్లు, సమాజంగా ఏర్పడి పురాణ నాటకాలు వేసేవాళ్లు. “రాధాకృష్ణ”, “శ్రీకృష్ణతులాభారం”, “కృష్ణలీలలు” బాగా పాడే “గొడవర్తి సూర్య నారాయణ రాజు” ఆడవేషాలు వేసేవాడు, “రాధాకృష్ణ” లో రాధ. కళ్లేపల్లి జగ్గయ్య నారదుడు. వీళ్లకి పాటలు పద్యాలు నేర్పడానికి బెజవాడ నుంచి ఒక హార్మొనిస్టు వచ్చేవాడు. హార్మోనిస్టు నాటకానికి డైరెక్టరు ఓగిరాల జానకిరామయ్య గారని సత్యనారాయణపురంలో ఉండేవాడు. తరువాత ఆయన సూరిబాబు, రాజేశ్వరి వాళ్లకి హార్మోనిస్టుగా వుండేవాడు. ఆయన కొన్ని నాటకాలను తర్ఫీదు కూడా ఇచ్చేవాడు.

విజయవాడ లోని ఇప్పటి వెల్కమ్ హోటలే, నాడు గ్రామీణ జనం ఎల్లికమ్మ హోటల్ అనడం నరసరాజు గారికి తెలుసు. తాను ఆనాటి మేటి పౌరాణిక నటులందరి నాటకాలు చూశారు. స్థానం నరసింహారావు, రోషనార, చింతామణి పాత్రలలో ఎంత సొగసుగా ఉండేవారో డి.వి.నరసరాజు గారు చెప్పేవారు. టీ.వీ.సుబ్బారావు, కపిలవాయి, బందా కనక లింగేశ్వర రావు గార్లు ఒకరేమిటి నాటి అగ్ర నటులు అందరు జ్ఞాపకాల ఆయన మాటల్లో ఒక గొప్ప చదువు. రామచంద్ర కాశ్యప, రామన్న పంతులు, నిర్మలమ్మ లతో కలిసి చాలా నాటకాలు ఆడారు. తానే స్వయంగా నాటకాలు కూడా వ్రాశారు.

వాపస్ నాటకం..

పీ.వీ.నరసింహారాజు గారు వ్రాసిన “వాపస్” నాటిక 50 ఏళ్ల క్రితం చాలా ప్రసిద్ధి. ఈ నాటిక హైస్కూలు, కళాశాల వార్షికోత్సవంలో ప్రదర్శించడానికి వీలైన ఏకాంకిక. భలే బాగుంటుంది. “కళాశాల పూర్వ విద్యార్థులలో ఒకడు తనకు కళాశాల చదువు వల్ల ఏమాత్రం జ్ఞానం అబ్బలేదని, తాను కట్టిన ఫీజులు వాపస్ ఇవ్వాలని పేచీకి దిగుతాడు. టీచర్లు అందరు మళ్ళీ ప్రశ్నించి జ్ఞానాన్ని పరీక్షించి పాస్ చేస్తారు. లెక్కల టీచర్ మాత్రం అన్ని తప్పులు చేసావు ఫెయిల్ అయ్యావు అంటాడు. దాంతో విద్యార్థి తెగ ఆనందపడతాడు. వాపస్ ఇవ్వడానికి కట్టిన ఫీజులు లెక్క చెప్పమంటారు.

ఆశువుగా అణా పైసాతో సహా కచ్చితంగా లెక్క చెప్తాడు. అప్పుడు లెక్కల మాస్టారు అతని ధారణా శక్తికి, లెక్కలు చెప్పిన తీరుకి మురిసి నూటికి నూరు మార్కులు ఇచ్చి పాస్ చేస్తాడు. దాంతో అతడికి దమ్మిడి కూడా వాపస్ రాదు. దీనికి మూలం ఫ్రిడ్జ్ అనే హంగేరియన్ రచయిత (1887 – 1938). పెర్సివల్ వైల్డ్ దీన్ని “రిఫండ్” పేరిట అంగీకరించారు. వాపస్ మూలాలను నరసరాజు గారు ప్రస్తావించారో లేదో తెలియదు. ఆచంట శారదా దేవి గారు తిరుపతి మహిళా కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేసే రోజుల్లో “వాపస్” ని విద్యార్థినులతో ఆడించి రక్తి కట్టించారు.

సినీ రంగ ప్రవేశం…

నాటక రచనలో విశేష అనుభవం ఉన్న నరసరాజు కి సినిమా అవకాశం నడిచి వచ్చింది. 1954లో విజయా వారి “పెద్ద మనుషులు” చిత్రం ద్వారా దర్శకులు కే.వీ.రెడ్డి గారు నరసరాజు గారిని వెండితెరకు పరిచయం చేశారు. అప్పటినుంచి కడదాకా ఆయన సమవేగంతో అర్థ శతాబ్దం పాటు చిత్రసీమ లో కొనసాగారు. పింగళి నాగేందర్రావు, ఆత్రేయ, సీనియర్ సముద్రాల, నరసరాజు సహాపాటిలు కృష్ణశాస్త్రి, శ్రీ శ్రీ , దాశరధి, సి.నారాయణరెడ్డి, కొసరాజు డి.వి.నరసరాజు గారికి ఆత్మీయులు. నాటి అగ్ర నటులందరికీ ఆయన కథ మాటలు అందించారు.

అన్నపూర్ణ సంస్థ లో అక్కినేని నాగేశ్వరావు గారు నిర్మించిన దొంగ రాముడు చిత్రానికి కథ, కథనం, మాటలు నరసరాజు గారే అందించారు. ఇప్పటికీ స్క్రీన్ ప్లే విషయంలో “దొంగరాముడు” చిత్రాన్ని సినీ పండితులు బాలశిక్షగా భావిస్తారు. ఇది 1955లో విడుదలై పేరు డబ్బు గడించిపెట్టింది. ప్రారంభం నుంచి క్రమశిక్షణ, ప్రతిభ గల పెద్ద మనిషిగా డి.వి.నరసరాజు పరిశ్రమలో పేరు పడ్డారు. తాను ఎప్పుడూ కూడా రెండు పడవల మీద కాలు పెట్టరు. ఒక సినిమా పూర్తయ్యాకే మరొకటి అంగీకరించేవారు. కథా చర్చలు కాగానే స్క్రిప్ట్ పని ఆరంభించేవారు. ప్రతీ రోజు ఆఫీసుకు వచ్చి రాసింది వినిపించడం, సవరణలు మార్పులు ఉంటే తెలుసుకోవడం ఇలా వరుసగా రాస్తే మొత్తం సినిమా స్క్రిప్ట్ ని బైండ్ పుస్తకంగా ఇచ్చేసేవారు.

యమగోల…

పల్లవీ ప్రొడక్షన్స్ వెంకటరత్నం గారు యమలోకపు గందరగోళంతో కూడిన బెంగాలీ సినిమా “జీవాంతమానుష” రీమేక్ హక్కులు కొన్నారు.

నేరుగా తనకు సాన్నిహిత్యం ఉన్న ముళ్లపూడి గారి దగ్గరకెళ్లి తెలుగులో వ్రాయమన్నారు.

అయ్యా, అది పొలిటికల్ సెటైరికల్ డ్రామా, మనవల్ల కాదు. డి.వి.నరసరాజు గారే దీనికి సమర్ధుడు అని చెప్పి రమణ గారే పంపారు. కథ నరసరాజు గారి చేతిలో పడడంతో హీరో కూడా మారిపోయాడు. శోభన్ బాబు స్థానంలో ఎన్టీఆర్ వచ్చారు.

యమగోల చేసి జనంతో ఈలలు కొట్టించుకున్నారు. కానీ ఇక్కడ ఇంకో పిట్టకథ. నిజానికి వెంకటరత్నం ఎన్టీఆర్ దగ్గరకు పోయి ఇప్పుడు సినిమాలో ఉన్న ఎన్టీఆర్ పాత్ర ను బాలకృష్ణతోనూ, యముడు కారక్టర్ ఎన్టీఆర్ తోనూ చేయించాలని తనకు ఉన్నట్టు చెప్పారు. అయితే ఎన్టీఆర్ గారు దీనికి ఒప్పుకోలేదు. ఆ పాత్రకు బాలయ్య సరిపోడు. అది నేనే చేస్తాను. యముడుగా సత్యనారాయణను తీసుకుందాం అని సలహా చెప్పారు.

అలా సత్యనారాయణను యముడుగా ప్రమోట్ చేసిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది.

యమగోల లో చాలా వరకు రాజకీయ సంభాషణలు పేల్చారు నరసరాజు గారు.

అప్పట్లో ఏదన్నా సినిమాలో డైలాగులు విజయవంతం అయితే చాలు వాటిని ఎల్పీ రికార్డులుగా విడుదల చేసేవారు.

ముఖ్యంగా అప్పట్లో వచ్చిన “యమర్జన్సీ” మీద కాంగ్రెస్ పార్టీ మీద చాలా సెటైర్లు పేల్చారు భీష్మాచార్యులు నరసరాజు గారు.

తెర మీద చెప్పేది ఎన్టీఆర్ కావడంతో ఆ సంభాషణ లకు అద్భుతమైన స్పందన వచ్చింది.

దర్శకత్వం…

డి.వి.నరసరాజు గారు సుప్రసిద్ధ రచయిత. తాను సినిమాలలోకి రాకముందు వీధి నాటకాల్లో నటించే వారు.

కాని, అతి బలవంతం మీద రెండు మూడు సినిమాల్లో నటించారు. ఉషాకిరణ్ మూవీస్ వారి “కారు దిద్దిన కాపురం” చిత్రానికి భీష్మాచార్యులు నరసరాజు గారు దర్శకత్వం వహించారు.

ముందుగా ఆ సినిమా కు కథ తయారు చేసి, స్క్రీన్‌ప్లే సంభాషణలు వ్రాసిన తరువాత మొత్తం ఆ సినిమా నిర్మాత రామోజీరావు గారికి వినిపించారు. అది రామోజీరావు గారికి బాగా నచ్చింది.

అప్పుడు దర్శకుడు ఎవరా అనే ప్రశ్న వచ్చింది. ఒక్క నిమిషం ఆలోచించి, మీరే దర్శకత్వం చెయ్యండి.

అంతా మీరే చేశారు మొత్తం అంటే అందులోనే వుంది కదా అన్నారట రామోజీరావు గారు.

నరసరాజుగారు ఆఁ? అని ముందు ఆశ్చర్యపోయి, తర్వాత ‘అబ్బే’ అన్నారట.

కానీ తర్వాత రామోజీరావు గారి బలవంతంతో అంగీకరించారు. ఒక మిట్టమధ్యాహ్నం విజయగార్డెన్స్‌లో ఆ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అప్పుడు రావి కొండలరావు గారు అక్కడికి వెళ్లారు.

నరసరాజు గారు కనిపించలేదు. అడిగితే, కాస్త దూరంలో వున్న చెట్టు చూపించారు. చెట్టు నీడన నిలబడి ఉన్న నరసరాజు గారిని రావి కొండలరావు గారు వెళ్లి అడిగారు. “షాట్స్ రాసి ఇచ్చేశానయ్యా, సంభాషణలు ఏం లేవు. అంచేత వాళ్లు తీసేయొచ్చు. నీడగా వుందని ఇలా నించున్నాను” అన్నారు భీష్మాచార్యులు నరసరాజు గారు. “హాయిగా ఏ.సి. గదిలో కూచుని స్క్రిప్ట్ రాసుకునే మీకు ఇప్పుడు తెలిసి వచ్చినట్టుంది దర్శకత్వం అంటే” అన్నారు రావి కొండలరావు గారు ఆయనకున్న చనువుతో.

తాను నవ్వి, అవుననుకో, కానీలే, ఇదొక అనుభవం. మళ్లీ డైరక్టు చేస్తానాయేం? అన్నారు నరసరాజు గారు.

నరసరాజు గారి చేతిలో నాటి ప్రముఖ సంస్థలు విజయ, వాహిని, అన్నపూర్ణ, ఏ.వి.యం లాంటివి ఉండేవి.

పని విషయంలో అనుకున్న దక్షత, క్రమశిక్షణ అందరికీ నచ్చేది. మంచి హాస్యం, సుతి మెత్తని వ్యంగ్యం నరసరాజు గారి సొంతముద్ర.

1975లో వచ్చిన ఎన్టీఆర్ గారి “యమగోల” ఫాంటసీ యొక్క సంచలనం అందులో “యముండా” అంటూ భీష్మాచార్యులు నరసరాజు గారి సంభాషణలకు పెట్టిన వొరవడి, ఆ తరువాత వచ్చిన ఆ మాదిరి యమ ఫాంటసీలకు మార్గదర్శకంగా నిలిచింది. గృహలక్ష్మి , రాముడు భీముడు, గుండమ్మ కథ, మూగనోము, చదరంగం లాంటి సాంఘికాలు నరసరాజు గారికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి.

మోహినీ రుక్మాంగద, రేణుకా దేవి మహత్యం, భక్త ప్రహ్లాద లాంటి పౌరాణికలు సైతం నరసరాజు గారి రచనతో రాణించాయి.

పదును తెలిసిన చక్కని భాషతో సంభాషణలను లలిత లలితంగా పలికించారు.

“రాజమకుటం” నరసరాజు కలం నుంచి వెలువడిన జానపదం. తరువాత ఉషాకిరణ్ సంస్థలకు పలు చిత్రాలకు రచయితగా పనిచేశారు.

భీష్మాచార్యులు డి.వి.నరసరాజు గారు 90 చిత్రాలకు పైగా రచయితగా పనిచేశారు.

నరసరాజు గారు నటులు, మంచి వక్త, ఆధునిక పద్య గద్య సాహిత్యాలను క్షుణ్ణంగా చదివారు.

హేతువాదుల అనుచరుడుగా ఆయనకు పలు అనుభవాలు ఉన్నాయి.

వృత్తిలో, ప్రవృత్తిలో క్రమశిక్షణ కలిగిన మనిషి. వంశపారంపర్యంగా వచ్చిన ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు.

ఇంట్లో తప్ప బయట భోజనం చేసేవారు కాదు. వేళలు పాటించేవారు.

వేళాపాళా తెలియని సినిమా ప్రపంచంలో నరసరాజకు మాత్రం వేళ తప్పక చరించారు.

చిత్ర సమాహారం…

★ రచయిత గా..

పెద్దమనుషులు (1954) (రచయిత) , దొంగ రాముడు (1955) , శోభా (1958)

రాజా మకుటం (1959) .రేణుకాదేవి మహత్యం (1960)

గుండమ్మ కథ (1962) .మాన్-మౌజీ (1962) (కథ) .మోహినీ రుగ్మాంగద (1962)

రాముడు భీముడు (1964) .నాది ఆడ జన్మే (1965) . CID (1965) . రంగుల రత్నం (1966)

భక్త ప్రహ్లాద (1967) . చదరంగం (1967) . గృహలక్ష్మి (1967) . బాంధవ్యాలు (1968) . తిక్క శంకరయ్య (1968)

మూగ నోము (1969) . జై జవాన్ (1970). బడి పంతులు (1972) . ఇద్దరు అమ్మాయిలు (1972) . వాడే వీడు (1973)

మగాడు (1976) యమగోల (1977) . KD నం:1 (1979) . యుగంధర్ (1979) . శృంగార రాముడు (1979)

వయ్యారి భాములు వగలమారి భర్తలు (1982) .శ్రీ రంగ నీతులు (1983) .కాంచన గంగ (1984) .

ముచ్చటగా ముగ్గురు (1985) . కారు దిద్దిన కాపురం (1986)

(రచయిత మరియు దర్శకుడు)

రావు గారి ఇల్లు (1988)

బృందావనం (1992) (రచయిత)

★ నటుడు గా…

మనసు మమత (1990) (రచయిత మరియు నటుడు)

చెవిలో పువ్వు (1990) (నటుడు)..

స్వర్గారోహణం…

వార్థక్యంతో భక్తి రావడం తప్పని సరికాదని, మానసికంగా తనపై తనకు విశ్వాసం వుంటే, మూఢనమ్మకాలను దూరం పెట్టవచ్చని బలంగా నమ్మేవారు భీష్మాచార్యులు నరసరాజు గారు.

నిజానికి తాను హేతువాది. తాను 92 చిత్రాలకు పైగా సినిమాలకు కథను, మాటలను సమకూర్చారు.

తాను దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలలో కారు దిద్దిన కాపురం ఒకటి. తాను కథలు వ్రాయడం, దర్శకత్వం వహించడమే కాకుండా, కొన్ని సినిమాలలో నటించారు కూడా.

చెవిలో పువ్వు చిత్రంలో ఒక చిన్న పాత్రను కూడా పోషించారు. తన చివరి సినిమా రాజా, భూమిక ప్రధానపాత్రధారులుగా 2006లో విడుదలైన మాయాబజార్. అందులో నరసరాజు గారు న‌టించారు.

సినీ కథ, సంభాషణల రచయితగా సుప్రసిద్ధులైన భీష్మాచార్యులు  డి.వి.నరసరాజు గారు తాను రచించిన సినిమాలలో హాస్యరసం తొణికిసలాడుతూ ప్రేక్షకుల్ని నవ్వించేది.

ఇంతటి పేరు ప్రఖ్యాతులు గాంచిన తాను అనారోగ్యంతో 28 ఆగష్టు 2006 నాడు హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో మరణించి స్వర్గారోహణం పొందారు.

Show More
Back to top button