ననవ్వడం రాజబాబు ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం” అన్నారొక సినీ రచయిత. మనిషి జీవితంలో తాను పుట్టినప్పటినుండి నుంచి బోసి నవ్వులతో మొదలౌతుంది. ముఖంపై చిరునవ్వు ఉంటే ఆ మనిషి జీవితంలో ఎంతో సంతృప్తిగా ఉన్నట్లు భావిస్తారు. ప్రస్తుత యాంత్రిక జీవనంలో, ఉరుకుల పరుగుల జీవితంలో నిస్తేజమైపోయినట్టు అనిపిస్తోంది. “నవ్వు నాలుగు విధాలా చేటు” అన్నది పాత సామెత. “నవ్వు నలభై విధాల గ్రేటు” అనేది ప్రస్తుత సామెత. వెండితెర పై నుండి ప్రేక్షకుల మీదకు నవ్వులు పువ్వులను వెదజల్లేది హాస్య నటులు అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం వస్తున్న సినిమాలో వెకిలి చేష్టలు చేస్తూ, రికార్డింగ్ డాన్స్, గంతులు ఇటువంటి దృశ్యాలు ముఖ్య హాస్యంగా గుర్తించబడుతున్నాయి.
ఇక తెలుగు సినిమా పరిశ్రమలో ప్రపంచంలో ఎక్కడా లేని హాస్య నటులు ఉన్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. 1932 లో తెలుగు చిత్ర సీమలో టాకీలు మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు సుమారు 90 ఏళ్ళ చలనచిత్ర పరిశ్రమలో అనేకమంది హాస్య నటులు చిత్ర తమ హాస్యంతో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేశారు. వెండితెర పై నుండి ప్రేక్షకుల మీదకు నవ్వులు పువ్వులను వెదజల్లేది హాస్య నటులు అంటే అతిశయోక్తి కాదు.
కానీ ప్రస్తుత హాస్య సన్నివేశాలకు దూరంగా గతంలోకి మనం వెళ్ళగలిగితే చాలు ఆ శకానికి సంబంధించిన స్వర్ణయగం కనిపిస్తుంది. కస్తూరి శివరావు, రేలంగి వెంకట్రామయ్య, రమణారెడ్డి, బాలకృష్ణ, పద్మనాభం మొదలైన హాస్యబ్రహ్మలు ఆ యుగంలో ధ్రువతారాలుగా వెలుగొందారు. అలాంటి కోవకు చెందిన వాడే ప్రముఖ హాస్య నట చక్రవర్తి రాజబాబు గారు. చిత్ర సీమలో రాజబాబు గారి హాస్యం ఎంతగా ప్రాచుర్యం పొందినదంటే, తన హాస్యానికి 13 సంవత్సరాలు వరుసగా ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందుకున్న ఘనత తనదే.
నిజం చెప్పాలంటే హాస్యనటుడిగా గారి ప్రస్థానం అంత తేలికగా మొదలవ్వలేదు. తాను పావలాతో మద్రాసుకు చేరుకున్నారు. చాలా రోజులు వసతి లేక, బట్టలు లేక, సరైన తిండి దొరకక మున్సిపాలిటీ కార్పొరేషన్ నీళ్లతో సరిపెట్టుకునేవారు. ఏ రోజయినా కడుపునిండా అన్నం దొరికితే చాలు దాంతో రెండు మూడు రోజులు బ్రతికేవారు. అలా అప్పుడప్పుడు తనకు భోజనం పెట్టి తనను ఆదుకున్న మహానుభావుడు అలనాటి కథానాయకి రాజసులోచన గారి ఇంటి వనమాలి. సినిమాలలో నటించడానికి వచ్చిన తనకు అవకాశాలు రాక, సినిమాలలో ప్రవేశం దొరక్క ట్యూషన్లు కూడా చెప్పేవారు.
తాను ట్యూషన్ చెప్పే ఇంట్లో ఏదో మూల ఒక కుక్కపిల్లలా పడుకుని ఉంటే ఎవరో లేపి కాఫీయో, రెండు ఇడ్లీలో ఇచ్చేవారు. చివరికి తన నిరీక్షణ ఫలించి “సమాజం” అనే చిత్రంతో సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. “నేను కోట్ల రూపాయలు సంపాదించాను” అని సగర్వంగా ప్రకటించుకున్న ఓకే ఒక్క హాస్యనటులు రాజబాబు గారే కావొచ్చు. అవకాశాలు అందిపుచ్చుకుని వాటిని సద్వినియోగం చేసుకున్న రాజబాబు గారు అతి తక్కువ కాలంలోనే తన నటజీవితాన్ని కామెడీతో ప్రారంభించి, విలనీతో పాటు విభిన్న పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పించారు.
నటనంటే ఆషామాషీ కాదు. అందులోనూ హాస్యం పండించడమంటే, దానికెంతో వేదన అనుభవించాలి. కడుపుబ్బ నవ్వించే హావభావాలు అంత తేలిగ్గా వచ్చేవి కావు.. ఎంతో బాధను దిగమింగుకునే క్రమంలో వారిచ్చే హావాభావాలే నవ్వును తెప్పిస్తాయి. తన నవ్వుల పువ్వులతో తెలుగువారికి హాస్యసుగంధాలు అందించారు రాజబాబు గారు. తాను తెరపై కనిపించగానే ప్రేక్షకుల పెదాలు నవ్వడానికి విచ్చుకొనేవి. ఇక తన మెలికలు తిరిగే హాస్యాభినయం జనానికి కితకితలు పెట్టేది. ఒకానొక దశలో తెలుగు సినిమా వ్యాపార సూత్రంగా రాజబాబు గారి హాస్యం నిలచిందంటే అతిశయోక్తి కాదు. అలనాటి అగ్ర నటులకు సమానంగా పారితోషికం అందుకున్న గొప్ప హాస్యనటులు రాజబాబు గారు.
జీవిత విశేషాలు…
జన్మ నామం : పుణ్యమూర్తుల అప్పలరాజు
ఇతర పేర్లు : రాజబాబు
జననం : 20 అక్టోబరు 1935
స్వస్థలం : నరసాపురం, మద్రాసు ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా
వృత్తి : నటుడు, హాస్యనటుడు
తండ్రి : ఉమామహేశ్వర రావు
తల్లి : శ్రీమతి రవణమ్మ
జీవిత భాగస్వామి : లక్ష్మీ అమ్ములు
పిల్లలు : నాగేంద్ర బాబు, మహేష్ బాబు
మరణం : 14 ఫిబ్రవరి 1983, హైదరాబాదు
జననం…
అది 1935 వ సంవత్సరం.. అక్టోబరు 20వ తేదీ.. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో పుట్టాడు ఓ పిల్లాడు. అప్పుడు నర్సాపురం ప్రజలు ఉహించలేదు, ఆ పిల్లాడే తెలుగు సినిమా హాస్య చక్రవర్తి అవుతాడని. పిల్లాడికి “పుణ్యమూర్తుల అప్పలరాజు” అని పెట్టారు. అతని తల్లిదండ్రులు శ్రీ పుణ్యమూర్తుల ఉమామహేశ్వర రావు , శ్రీమతి రవణమ్మ. అతని సోదరులు చిట్టి బాబు మరియు అనంత్ బాబు. ఎందుకో తెలియదు గానీ, పిల్లాడు ఎంత తిన్నా బక్కచిక్కిన వాడిలానే ఉండేవాడు.
తన తండ్రి ఉద్యోగరీత్యా బదిలీ కారణంగా రాజబాబు గారి చదువు మొత్తం తూర్పుగోదావరి జిల్లా మండపేట లోనే సాగింది. ఎస్.ఎస్.ఎల్.సి చదువుతున్నప్పటినుండే నాటకాలు ఆడేవారు. తాను నాటకాలు వేయడం తన తండ్రికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. నాటకాలు వేసినట్టు ఎవరి ద్వారానో తండ్రికి తెలిసిపోయి దెబ్బలు కూడా తిన్నారు. స్కూల్ ఫైనల్ పాస్ అయ్యి రాజమండ్రిలో బేసిక్ టీచర్ ట్రైనింగ్ చేశాడు. ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ముగించి తెలుగు ఉపాధ్యాయుడుగా కొద్దికాలం పనిచేశారు. ఉపాధ్యాయునిగా పనిచేసేటప్పుడే నాటకాలలో పాలుపంచుకొనేవారు .
బాల్యం…
రాజబాబు గారు సన్నగా వుండేవారు. కానీ చాలా హుషారుగా వుండేవారు. తనకు బుర్రకథలంటే చాలా ఇష్టం. అందువలన తాను పాఠశాలలో చదివేరోజులలోనే బుర్రకథలు చెప్పడం నేర్చుకున్నారు. రిక్షావాళ్ళకు బుర్రకథలను తనదైన తరహాలో హాస్యంగా చెప్పేవారు. రిక్షావారు ఆ అబ్బాయి చెప్పే విధానం వారికి నవ్వులు తెప్పించేవి. దాంతో తన హాస్య చతురతను చూసి మెచ్చుకుని అభినందించేవారు. వారు అలా మెచ్చుకుంటూ వుంటే తాను ఇంకా రెచ్చిపోయేవారు. పాఠశాల చదువులో భాగంగా పదవ తరగతి పూర్తయ్యింది. ఇంటర్ కు కళాశాలలో చేరారు. ఇంటర్ అయిపోయిన తరువాత టీచర్ ట్రైనింగ్ చేసి తెలుగు పంతులుగా చేరారు. అయినా నాటకాలపై తనకు మక్కువ తగ్గలేదు. మళ్ళీ కళావేదికపై కాలుమోపారు. అద్భుతంగా నటిస్తుండటంతో తన స్నేహితుడు సినిమాలలో చేరమన్నాడు.
దాంతో సినిమాలలో నటించాలనే లక్ష్యంతో ఇంట్లో చెప్పాపెట్టకుండా చెన్నై చెక్కేశారు. 07 ఫిబ్రవరి 1960 రోజున మద్రాసు చేరుకొన్నారు. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే అది జీవితం ఎలా అవుతుంది. మద్రాసు లో తనకు అవకాశాలు తన్నుకురాలేదు.
తన బక్కపలుచని శరీరం చూసి పెదవి విరిచారు సినీపెద్దలు. ఒకప్రక్క ఆకలిబాధ. సినిమాలు లేవు. ఊరికి వెళ్ళలేడు.
అలా ఆలోచిస్తూ నటి రాజసులోచన గారి ఇంటి దగ్గరకు వచ్చాడో రోజు. ఆకలితో తనకు కళ్ళు తిరుగుతున్నాయి.
ఆమె ఇంటి ముందుకొచ్చి నీరసంగా కుర్చొండిపోయారు. అది గమనించి ఆ ఇంటి వాచ్ మన్ ఆయన దగ్గరకు వచ్చాడు.
రాజబాబు గారి పరిస్థితి చూసి జాలేసి త్రాగడానికి నీళ్ళు, బిస్కెట్ ఇచ్చాడు. కృతజ్ఞతగా చూసారు అతని వైపు రాజబాబు గారు.
వ్యక్తిగత జీవితం…
రాజబాబు గారు 05 డిసెంబరు 1965 తేదీన లక్ష్మీ అమ్ములు ను వివాహమాడారు.
ఆమె రచయిత శ్రీశ్రీ గారి మరదలు. రాజబాబు గారికి నలుగురు సోదరులు, ఐదుగురు సోదరీమణులు ఉన్నారు.
వారిలో చిట్టి బాబు మరియు అనంత్ బాబు లు సినిమా నటులు మరియు టెలివిజన్ కళాకారులు.
రాజబాబు, లక్ష్మీ అమ్ములు దంపతులకు ఇద్దరు అబ్బాయిలు.
నాగేంద్ర బాబు మరియు మహేష్ బాబు. ఇద్దరు ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు.
సినీ నేపథ్యం…
స్కూలు ఫైనలు పాసయ్యి రాజమండ్రి లో బేసిక్ టీచర్ ట్రైనింగు అయిపోయాక టీచరుగా రాజమండ్రి పక్కనున్న ధవలేశ్వరంలో పనిచేస్తూ పిల్లలకు ఆటపాటలతో చదువు చెప్పేవారు రాజబాబు గారు.
ఒకప్రక్క ఉద్యోగం చేసుకుంటూనే మరోప్రక్క నిడదవోలు అచ్యుతరామయ్య బుర్రకథ ట్రూప్ లో హాస్యం చెప్పేవారు.
మరికొన్నాళ్ళకు టీచర్ ఉద్యోగం మానేసిన తాను బెజవాడలో మహావీర్ మెడికల్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పని చేశారు.
అట్లా పనిచేస్తూనే మిమిక్రీ ఆర్టిస్ట్ గా ప్రోగ్రాములు ఇచ్చేవారు. అదే సమయంలో కన్యాశుల్కం కె.వెంకటేశ్వరరావు నాటకం “దొంగ వీరడు” లో నటించారు.
ఆ నాటకాన్ని చూసిన ఆంధ్ర కళా నాట్యపరిషత్తు వ్యవస్థాపకులు “గరికపాటి రాజారావు” గారు రాజబాబు గారిని మద్రాసు రమ్మన్నారు.
మద్రాసులో గరికపాటి రాజారావు డ్రామా ట్రూపులో “అల్లూరి సీతారామరాజు” లో నటించారు. అప్పుడప్పుడు నాటకాలు వేస్తూనే మరోవైపు సొంతంగా మిమిక్రీల ప్రోగ్రామ్ లు ఇచ్చేవారు.
అదే సమయంలో వేషాల కోసం ఆయన దర్శించని దర్శకుడుగాని, నిర్మాతగానే లేడు.
డబ్బులు ఉంటే తినేవాడు, లేకపోతే నీళ్లు తాగి ఉండేవాడు. వేషాలు సంపాదించాలనే పట్టుదల మాత్రం తనలో తీవ్రంగా ఉండేది.
చెన్నపురి ఆంధ్ర మహాసభ వారి నాటక పోటీల్లో “రావి కొండలు రావు” గారి “కథ కంచికి” నాటకంలో పొట్టి ప్రసాదు సిఫారసు తో వేషం దొరికింది.
అందులో పాత్ర చిన్నదైనా రాజబాబు గారికి మంచి పేరు వచ్చింది. ఆ నాటకం చూసిన కె.వి.రెడ్డి గారు కొన్నాళ్ళ తరువాత “సత్యహరిచంద్ర” లో కాలకౌశుడి వేషం ఇచ్చారు.
రాజబాబు గారికి రాజమండ్రిలో మాస్టారు గా అనుభవం ఉంది. కనుక మద్రాసు వచ్చిన కొత్తలో అడ్డాల నారాయణరావు ఇంట్లో పిల్లలకు పాఠాలు చెప్పేవారు.
అడ్డాల నారాయణరావు గారి సిఫారసుతో రేలంగి నిర్మాతగా తీసిన “సమాజం” చిత్రంలో చిన్న వేషంతో చిత్ర రంగ ప్రవేశం చేశారు.
ఆ తరువాత కొన్ని చిత్రాలలో చిన్నాచితకా వేషాలు వేసినా భావన్నారాయణ గారు తీసిన “సర్కార్ ఎక్స్ ప్రెస్” చిత్రంలో పెద్ద వేషంతో గుర్తింపు వచ్చింది.
ఈ చిత్రంతో సినీ పరిశ్రమ దృష్టిలో పడ్డారు రాజబాబు గారు. తన కేరీర్ ని “ఇల్లు ఇల్లాలు” మలుపు తిప్పిందని చెప్పవచ్చు.
దాసరి గారి దర్శకత్వంలో ప్రతాప్ ఆర్ట్స్ వారి “తాత మనవడు” లోనూ, ఆ తరువాత “తిరుపతి”, “పిచ్చోడి పెళ్లి” చిత్రాల్లో కథనాయకుడుగా నటించారు.
తన మొదటి సినిమా “సమాజం” తరువాత రాజబాబు గారికి “తండ్రులు కొడుకులు”, “కులగోత్రాలు”, “స్వర్ణగౌరి”, “మంచి మనిషి” మొదలగు చిత్రాలలో అవకాశాలు వచ్చాయి.
స్వర్ణగౌరి చిత్రానికి గాను 350 రూపాయలు మొట్టమొదటి పారితోషికంగా స్వీకరించారు.
మొదటి చిత్రం విడుదల తరువాత వచ్చిన చిన్న చిన్న పాత్రలలో నటిస్తూనే “కుక్కపిల్ల దొరికిందా”, “నాలుగిళ్ళ చావిడి”, “అల్లూరి సీతారామరాజు” మొదలగు నాటకాలు వేశారు.
జగపతి ఫిలింస్ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్ గారి చిత్రం “అంతస్తులు” చ్రిత్రంలో నటించినందుకు గాను మొట్టమొదటి సారిగా పెద్దమొత్తం పారితోషికంగా 1300 రూపాయల్ని పొందారు రాజబాబు గారు.
ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా వరుసగా నిర్మాణ సంస్థలు నిర్మించిన ఎన్నో చిత్రాలలో తాను నటించారు. ఆ సమయంలో “ఆకాశరామన్న”, “సతీ శబరి”, “ప్రచండ భైరవి”, “సత్యహరిశ్చంద్ర”, “సంగీత లక్ష్మి”, “పరమానందయ్య శిష్యుల కథ”, “ఉమ్మడి కుటుంబం”, “విచిత్ర కుటుంబం” లాంటి చిత్రాలలో నటించారు గారు. రాజబాబు గారికి జంటగా లీలా రాణి, మీనా కుమారి, ప్రసన్న రాణి, గీతాంజలి లాంటి నటీమణులు నటించినా కానీ, ప్రేక్షకాదరణ పొందిన జోడీ మాత్రం రమాప్రభ గారే అని చెప్పాలి. “ఇద్దరు అమ్మాయిలు”, “ప్రేమనగర్”, “ఇల్లు ఇల్లాలు,” “పల్లెటూరి బావ”, “సెక్రెటరి”, “జీవన జ్యోతి”, “కార్తీక దీపం”, “అడవి రాముడు”, “సోగ్గాడు” లాంటి చిత్రాలు ” – రమాప్రభ” జోడీకి మంచి హాస్య జంటగా పేరు తెచ్చాయి. ఒక్క రమాప్రభ జంటగా దాదాపు 300 చిత్రాల్లో నటించారంటే మనం ఆశ్చర్యపోతాం.
రాజబాబు గారు ఒక్క ఏడాదిలో 31 సినిమాలో నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 31 సినిమాల్లో నటించడం అంటే అప్పట్లో గిన్నిస్ రికార్డుగా చెప్పుకునేవారు. కేవలం స్నానానికి మాత్రమే ఇంటికి వచ్చి తక్కిన సమయంతో షూటింగ్ లో గడిపేవారు.
గారు దాదాపు 500 పైచిలుకు చిత్రాల్లో నటించారు. ఎన్నో ఫిలింఫేర్ పురస్కారాలు, రాష్ట్ర ప్రభుత్వం నంది పురస్కారాలు తనను వరించాయి.
హీరోల కంటే ముందు రాజబాబు గారినే బుక్ చేసే వారట నిర్మాతలు.
రాజబాబు గారు లేని సినిమా మాకొద్దు అని నిర్మాతలతో పంపిణీదారులు కూడా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం కూడా జరిగేది.
ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గార్ల వెంట సహా కథానాయకుడు హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించారు. “బాబ్ అండ్ బాబ్” అనే బ్యానరును స్థాపించిన రాజబాబు గారు “ఎవరికి వారే యమునా తీరే”, “మనిషి రోడ్డున పడ్డాడు”లాంటి చిత్రాలు నిర్మించారు. మనిషి రోడ్డున పడ్డాడు సినిమా చిత్రికరణలో అదనంగా క్యారేజీలు తెప్పించి అందరికీ తానే స్వయంగా వడ్డిస్తూ అందరు కలిసి భోజనం చేయాలని అనేవారట. చిత్రీకరణ ఖర్చు కంటే భోజనాలకే ఎక్కువ ఖర్చయిందని అనుకునేవారట.
గతాన్ని మరచిపోని రాజబాబు…
“మనిషిగా పుట్టి, మనిషిగా పెరిగి, మనిషిగా పోయాక కూడా, మనిషిగా బ్రతికే ఉండాలనేది రాజబాబు గారి సిద్ధాంతం. తన సంపాదన లోని కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు కూడా వెచ్చించారు. తన సొంత ఖర్చుతో 60 జంటలకు వివాహం జరిపించారు. 56 మంది పిల్లలకు చదువులు చెప్పించారు. తన సొంత ఊరును మరిచిపోకుండా రాజమండ్రి లో స్కావెంజర్స్ కోసం ఒక కాలనీ, కోరుకొండలో “రాజబాబు జూనియర్ కళాశాల కట్టించారు. తన వద్దకు వచ్చి ఎవ్వరైనా ఆకలి అని చేయి చాస్తే తన జేబులో చేయి పెట్టి, జేబులోంచి చేతికి ఎంత వస్తే అంత తీసి ఇచ్చే దయాగుణం గలవారు రాజబాబు గారు. గతాన్ని ఎప్పుడు కూడా మరచిపోరాదనేది రాజబాబు గారి ఫిలాసఫీ. “గతాన్ని మరిచిన మనుషులు చితిమీద పేర్చిన శవాలు అనేవారు.
మీకు చాలా డబ్బు వస్తే ఏం చేస్తారు అని పాత్రికేయులు అడిగితే పానగల్ పార్కులో సిమెంట్ బెంచీలకు పరుపులు కుట్టిస్తానని చెప్పేవారు. తాను ఎన్నో రాత్రులు ఆ బెంచీల మీద పడుకున్నారు. రాజబాబు గారు నాటక రంగం నుండి వచ్చారు. అందుకే తనకు నాటక రంగం అంటే ఎనలేని ప్రేమ. రాజబాబు గారికి ప్రతీ ఏడాది తన పుట్టినరోజు అక్టోబర్ 20 నాడు జన్మదిన వేడుకల్లో భాగంగా నాటకోత్సవవాలు నిర్వహించేవారు. మద్రాసు వాణి మహల్ లో మూడు రోజులు వేడుకలు జరిపేవారు. ఆ సందర్భంలో సీనియర్ నటులను సత్కరించేవారు. తన సంపాదనలో ఎక్కువ శాతం దానధర్మాలకు కేటాయించేవారు రాజబాబు గారు.
రాజబాబు గారు మద్రాసు కు వచ్చిన తొలినాళ్ళలో డబ్బుకి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాజబాబుకి పద్మనాభం గారి మేకప్ మ్యాన్ కృష్ణ గారు అయిదు రూపాయలు ఇస్తానంటే “పాండి బజార్ లోని పానగల్ పార్కు కార్నర్ లో సాయంత్రం దాక ఎదురుచూసిన సందర్భాల గురించి తరచూ చెప్తుండేవారు రాజబాబు గారు. అదే కార్నర్ లో లక్ష రూపాయల కారులో వెళుతున్నప్పుడు ఆ ఐదు రూపాయల కోసం తాను నిరీక్షించిన గడియలను నెమరు వేసుకునేవారు. తాను రాజమండ్రిలో టీచర్ ట్రైనింగ్ చేసే రోజులలో జాంపేటలో తన హాస్టల్ ఎదురుగా ఉన్న ఓ పాక హోటల్లోని స్త్రీ తనకు ఖాతాలో రోజూ టిఫిన్ పెట్టిందని గుర్తుంచుకొని తాను మంచి స్థితిలో ఉండగా అక్కడికి వెళ్లి ఆమె ముసలిదైపోవడంతో ఆమె కొడుకుతో మంచి హోటల్ పెట్టించారు రాజబాబు గారు.
తుది ఘడియలలో వేదాలు వల్లించిన రాజబాబు…
రాజబాబు గారి సోదరులు చిట్టిబాబు, అనంత్, బాబి ముగ్గురు సినిమా హాస్యనటులే. వీళ్ళని తెరపై చూస్తున్నప్పుడు ప్రతీ ఒక్కరికీ తమ అంతరంగంలో లీలాగా రాజబాబు గారు కదలాడటం, రాజబాబు గారి ముద్ర ప్రేక్షకులపై ఎంతగానో ఉందని చెప్పడానికి ఉదాహరణ. నిజానికి తాను అతి పిన్న వయస్సులో తన 47వ యేట శివైక్యం చెందడం మిక్కిలి బాధాకరం. తమిళంలో నాగేష్ వేసిన ఎన్నో పాత్రలను తెలుగులో రాజబాబు గారు వేసేవారు. నాగేష్ గారితో రాజబాబు గారు మంచి స్నేహంగా ఉండేవారు. “నా దినచర్య లో పేజీలు దగ్గర పడ్డాయి, వేదాంతం అలవడుతోంది” అంటూ తాత్వికంగా “విషం తాగేటప్పుడు నలకల కోసం ఎందుకు వెతుక్కుంటావు”, “పదిమందిలో వెలుగుతున్న దీపాన్ని ఆర్పడానికి ప్రయత్నించకు, ప్రయత్నించావా ఆ నిమిషంలో నీవు కూడా చీకట్లో ఉంటావని గుర్తుంచుకో” లాంటి ఎన్నో సూక్తులు రాజబాబు గారు వల్లించేవారు.
మరణం..
రాజబాబు గారిని మనం కేవలం హాస్యనటులు గానే చూడలేం. తాను ఎన్నో విభిన్న పాత్రలో నటించారు. “మనిషి రోడ్డున పడ్డాడు”, “తిరుపతి”, “బలిపీఠం”, “జీవనజ్యోతి” లాంటి వందల చిత్రాలు గారు నవరసాలు వొలికించడానికి సాక్ష్యంగా ఉన్నాయి.
గతంలో హాస్య నటులను హీరోలుగా పెట్టి తీసిన చిత్రాలు కస్తూరి శివరావు “గుణసుందరి కథ”, రేలంగి “పక్కింటి అమ్మాయిలు” చిత్ర విజయాలకు ఏమాత్రం తీసిపోలేనిదిగా గారు హీరోగా నటించిన “తాత మనవడు” నిరూపించింది.
20 వ శతాబ్ధపు ఉత్తమ హాస్యనటుడిగా గుర్తింపుపొందిన రాజబాబు గారు నిజజీవితంలో కూడా “రాజునే”. తనలోని “కృతజ్ఞత” మనందరికీ ఆదర్శం.
నటుడిగా నిలదొక్కుకునే సమయంలో తనకు సహాయపడిన వాళ్ళందరినీ గుర్తుంచుకొని కృతజ్ఞతాభావం చూపిన మహామనిషి రాజబాబు గారు.
పద్మశ్రీ పొందిన తొలి హాస్యనటులు కూడా రాజబాబు గారే. ఏడుసార్లు ఉత్తమ హాస్యనటుడి అవార్డు పొందారు.
రాజబాబు గారికి ఘంటసాల పాటలంటే ఎంతో ఇష్టం.
మహా శివరాత్రి రోజు ఘంటసాల గారి వర్ధంతి అయిన 11 ఫిబ్రవరి 1983 నాడు ఘంటసాల పాటలు వింటూనే ఉన్నారు.
అదే రోజు రాత్రి గొంతులో ఏదో ఇబ్బంది వచ్చి హైదరాబాదు లోని థెరెసా ఆసుపత్రిలో చేరారు.
ఆ ఆసుపత్రి లోనే 14 ఫిబ్రవరి 1983 రోజున తెలుగు సినీ అభిమానుల్ని శోక సముద్రంలో ముంచి తిరిగి రాని లోకాలకు పయనమయ్యారు.
ఎవ్వరూ కూడా అనుకరించడానికి అసాధ్యమైన ప్రత్యేకమైన శైలి గారిది.
సినిమా అనే మూడు అక్షరాలు బ్రతికి ఉన్నంతకాలం గారు బతికే ఉంటారు. తన మరణంతో తెలుగు చిత్రసీమకు కలిగిన లోటు ఎప్పటికి తీర్చలేనిది.