GREAT PERSONALITIESTelugu Cinema

తెలుగు చిత్ర సీమకు కళామతల్లి బహుకరించిన గురువు… దాసరి నారాయణ రావు…

సినిమా అంటే చాలా మందికి ప్యాషన్‌. చాలా మందికి సినిమా ఒక వ్యాపారం. చాలా మందికి సినిమా ఒక వ్యాపకం. కానీ తనకి సినిమానే పంచ ప్రాణాలు. సినిమానే తన ధ్యాస-శ్వాస. తారా బలంతో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాను దరి చేర్చి దర్శకుడి ప్రాముఖ్యాన్ని చాటిన మేధావి. దర్శకుడికి ప్రేక్షకులుంటారని, దర్శకుడి కారణంగానే ప్రేక్షకులు థియేటర్లకొస్తారని నిరూపించిన గొప్ప సాంకేతిక నిపుణుడు. సినిమాను కొత్త పంథాన నడిపించినవాడు. కొత్త పుంతలు తొక్కించిన వాడు.

దాసరి గారిది బహుముఖం. సినీ పరిశ్రమకు తాను ఓ చిహ్నం. తాను అనితర సాధ్యుడు. దిశా నిర్దేశకుడు. చెరిగిపోని రికార్డులను సొంతం చేసుకున్న ఘనుడు. చెదిరిపోని మబ్బు తునక మీద తన పేరును సుస్థిరం చేసుకున్న దర్శకుడు. ఆయనే దర్శకరత్న దాసరి నారాయణ రావు గారు. దాసరి నారాయణ రావు గారి గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. చెప్పడానికి మిగిలింది కూడా ఏమీ లేదు. అయిదు దశాబ్దాలుగా ఎంతో మంది ఆయన విశేషాణాలన్నీ చెప్పేశారు. ఆయన గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే నిజంగా ఆయన తళుకులీనే దర్శకరత్నే.

దర్శకులకు గౌరవ మర్యాదలను, విలువను తెచ్చిన ఘనుడు. నూట యాభై ఒకటి చిత్రాలను అన్ని తానై నడిపించిన సారథ్యం. మరెన్నింటికో మాటలను అందించిన నేర్పరితనం. మరికొన్నింటికి పాటలు సమకూర్చిన ప్రజ్ఞాపాటవం. తన తొలి అడుగు సినిమాయే. దర్శకుడిగా గిన్నిస్‌ రికార్డు స్థాపించినా, నటుడిగా నంది అవార్డులు సాధించినా, సినిమా తీసినా, పాటలు రాసినా, తెర మీదయినా తెర వెనుక అయినా దాసరి దాసరే. తనని ఇతర దర్శకులతో పోల్చలేం.

దాసరి గారి పేరిట 18,000 కు పైగా అభిమానసంఘలు ఉండేవి.  తెలుగు ప్రజలలో దాసరి గారి ప్రాచుర్యానికి అద్దం పడుతుంది. దాసరి గారి సినిమాలు ముఖ్యముగా స్త్రీ ప్రధానముగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకముగా సందేశాత్మకంగా రూపుదిద్దబడ్డాయి. అనేక చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. పలు చిత్రాలలో నటుడిగానూ తన విశ్వరూపం చూపారు.ఆ విధంగా ప్రేక్ష‌కుల గుండెల్లో ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్నారు. క‌ళామతల్లి ముద్దుబిడ్డ‌గా ఎంతో మంది  సినీ క‌ళాకారుల‌కు జీవితాన్నిచ్చారు.

వారి ఆశలకు, ఆశయాలకు తాను వెలుగునిచ్చారు. దాసరి గారి సినిమాలు తాతా మనవడు, స్వర్గం నరకం, మేఘసందేశం మరియు మామగారు తనకు అనేక పురస్కారాలు తెచ్చిపెట్టాయి. దాసరి తీసిన బొబ్బిలి పులి మరియు సర్దార్ పాపారాయుడు చిత్రాలు నందమూరి తారక రామారావు గారిని రాజకీయ ప్రవేశములో ప్రధానపాత్ర వహించాయి. మామగారు, సూరిగాడు మరియు ఒసేయ్ రాములమ్మా చిత్రాలు దాసరి గారి నటనా కౌశలానికి మచ్చుతునకలు. ఈ సినిమాలలో నటనకు దాసరి అనేక విమర్శకుల ప్రశంసలు మరియు బహుమతులు అందుకున్నాడు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    దాసరి నారాయణ రావు 

జననం    :    4 మే 1947

స్వస్థలం   :   పాలకొల్లు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం..

తండ్రి   :   లక్ష్మయ్య చౌదరి

తల్లి     :  వెంకట్రావమ్మ 

ఇతర పేర్లు  :   దాసరి, దర్శక రత్న

వృత్తి      :    సినిమాలు, రాజకీయం

రాజకీయ పార్టీ    :    భారత జాతీయ కాంగ్రెస్

మతం        :      హిందూ

భార్య        :   దాసరి పద్మ

​​పిల్లలు    :     ప్రభు,   అరుణ్ కుమార్,    హేమాలయ కుమారి

మరణ కారణం  :   మూత్రపిండాల సమస్య

మరణం   :              30 మే 2017

హైదరాబాదు, తెలంగాణ..

జననం…

దాసరి నారాయణ రావు గారు పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో 04 మే 1947 నాడు జన్మించారు. పాలకొల్లుకి లలిత కళలకు చాలా దగ్గర సంబంధం ఉంది. పాలకొల్లు నాటకాలకు ప్రసిద్ధి. పినిశెట్టి శ్రీరామమూర్తి రచయిత, దర్శకులు రవిరాజా పినిశెట్టి, చలం, అల్లు రామలింగయ్య గారు లాంటి ప్రముఖులు జన్మించిన ఊరు పాలకొల్లు. ఆ పాలకొల్లు లోనే జన్మించిన దాసరి నారాయణరావు గారిది దిగువ మద్య తరగతి కుటుంబం. ఆరో తరగతి చదువుతుండగా పది సంవత్సరాల వయసులో 1954 – 55 ప్రాంతాల్లో దాసరి గారి నాన్న గారు పొగాకు వ్యాపారం చేస్తూ ఉంటే హఠాత్తుగా గోదాం కాలిపోయింది. దాంతో ఒక్కసారిగా ఆర్థిక పరిస్థితులు తారుమారయ్యాయి.

విద్యాభ్యాసం..

పొగాకు వ్యాపారంలో నష్టం రావడంతో తన సంపాదన పోగొట్టుకున్న దాసరి గారి నాన్నగారు దాసరి గారిని చదివించలేనని వడ్రంగి దగ్గర పనికి కుదిరించాడు. దాంతో చదువు మానేసిన దాసరి గారు వడ్రంగి దగ్గర నెలకు “ఒక రూపాయి” జీతం పుచ్చుకుంటూ పనిచేస్తుండేవారు.

భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకున్న దర్శకులు దాసరి నారాయణరావు గారి తొలి సంపాదన నెలకు “ఒక్క రూపాయి” పుచ్చుకోవడం విశేషం.

అలా వడ్రంగి పని చేస్తుండగా ఒకనాడు సైకిల్ చైన్ పడిపోయిన వ్యక్తికి చైన్ పెట్టడానికి సాయం చేసే క్రమంలో దాసరి గారు సైకిల్ అతను తన మాస్టారు అని తెలుసుకున్నారు.

అది చూసిన దాసరి గారి మాస్టారు గారు విషయం గ్రహించి దాసరి గారి నాన్న గారికి చెప్పి పాఠశాలలో తనను చదివిస్తానని హామీ ఇచ్చి పాఠశాలకు తీసుకెళ్లారు.

పాఠశాలలో పిల్లలు తలా కొంత చందాలు వేసుకుని దాసరి నారాయణరావు గారికి ఇచ్చి తన చదువు కొనసాగడంతో సహాయం చేశారు.

బడి వదలగానే అరటిపండ్లు బండి తీసుకొని బజా బజార్ తిరిగి అమ్మేసి రూపాయి, రూపాయి పోగేసి చదువుకుంటూనే పదవ తరగతి పూర్తి చేశారు దాసరి గారు.

నాటక రంగం…

పాలకొల్లు అంటేనే నాటకాలు పుట్టినిల్లు. నాటకాలు వ్రాయడం, నాటకాలు వేయడం, దర్శకత్వం వహించడం. పాలకొల్లులో పెరిగిన దాసరి నారాయణరావు గారికి మామూలుగానే నాటకాలు అంటే ఆసక్తి పెరిగింది. ఆ రోజుల్లో అమ్మకోసం అనే ఒక నాటకం వ్రాసుకొని దాసరి గారు ఒక్కరే ఏకపాత్రాభినయం చేసేవారు. డిగ్రీ పూర్తయిన తర్వాత ఉద్యోగాల వేటలో హైదరాబాదుకు వచ్చేశారు. సుల్తాన్ టొబాకో కంపెనీలో కొంతకాలం పని చేశారు. హైకోర్టులో చెట్టు క్రింద టైప్ మెషిన్ పెట్టుకొని జాబ్ వరకు చేస్తూ ఉండేవారు. తర్వాత కొన్ని రోజులకు హెచ్.ఏ.ఎల్ లో జాయిన్ అయ్యారు. కానీ తన నాటకాల ప్రవృత్తి మాత్రం మానలేదు. ఆ రోజుల్లో 1964 – 65 లో టికెట్ నాటకాలు ఉండేవి. టిక్కెట్ కొని నాటకాలు చూస్తుండేవారు. దాసరి నారాయణరావు గారి నాటకాలకు మాత్రం టికెట్లు మరీ ఎక్కువగా అమ్ముడు అయ్యేవి.

సినీ రంగ ప్రవేశం…

ఒకసారి రవీంద్ర భారతిలో నాటకాలు వేసేటప్పుడు ఒక సినీ నిర్మాతని అతిథిగా పిలిచారు. వై.వి.కృష్ణ అనే నిర్మాత సూళ్లూరుపేటకు చెందినవాడు. రిషికేశ్ పిక్చర్ స్థాపించి చిన్న చిన్న సినిమాలు తీస్తుండేవారు. తాను దాసరి నారాయణరావు గారి నాటకం చూసి, డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి నాటకం చాలా బాగా వేశావు. మేము సినిమాలు తీస్తున్నాము. నీకు అందులో ప్రధాన హాస్య పాత్ర ఇస్తాను. సినిమాలోకి వస్తావా అని అడిగారు. అక్కడికి వెళ్లినాక వై.వి.కృష్ణ గారు ఉత్తరం కూడా వ్రాశారు. దాంతో రైలు ఎక్కి మద్రాసు వాహినీ స్టూడియోకు వెళ్లారు.

ప్రధాన హాస్య పాత్ర అని చెప్పిన  సహాయ పాత్ర ఇచ్చే సరికి దాసరి గారు అసంతృప్తికి గురై తిరిగి వెళ్లి నాటకాలు వేసుకుందాం అనుకున్నారు. కానీ సినిమా పరిశ్రమ లోకి వచ్చి తిరిగి వెళితే చిన్నచూపుగా ఉంటుందని భావించి “అందం కోసం పందెం” చిత్ర రచయిత వీటూరి గారి దగ్గర సహాయకులుగా చేరారు. సహాయ రచయితగా తన వెండితెర జీవితం మొదలైంది. పాలకొమ్మి పద్మరాజు గారి దగ్గర అసిస్టెంట్ గా ఐదు సినిమాలకు పని చేశారు. ఒకవైపు సినిమాలకు మాటలను వ్రాస్తూనే, మరోవైపు సహాయ దర్శకులకులుగా పని చేస్తున్నారు. “జగత్ జట్టీలు” అనే చిత్రం నుండి మాటల రచయితగా మారిపోయారు దాసరి గారు.

దర్శకుడుగా తొలి చిత్రం “తాత మనవడు”..

రాఘవ గారు నిర్మాతగా పరిమితమైన బడ్జెట్లో తీయాల్సిన సినిమా కోసం నటీనటులను ఎంపిక చేసుకునే పనిలో పడ్డారు దాసరి గారు. హాస్య నటుడుగా మంచి పేరు ఉన్న రాజబాబు గారిని హీరోగా ఎన్నుకున్నారు. విజయనిర్మల ను కథనాయికగా తీసుకున్నారు. తాత పాత్రలో మొదట్లో గుమ్మడి గారికి బదులుగా నాగభూషణం ను అనుకున్నారు. కానీ నాగభూషణం పారితోషికం ఎక్కువగా అడిగారు. అయినా ఇస్తానని ఒప్పుకున్న నిర్మాత రాఘవగారు సినిమా 50 రోజుల తర్వాత ఇస్తానని చెప్పగా సంతృప్తి చెందని నాగభూషణం గారు దాసరి గారిని అవహేళన చేస్తూ మాట్లాడారు. దాంతో మనస్థాపానికి గురైన దాసరి గారు గుమ్మడి గారినే ఎంచుకున్నారు.

తనను అవహేళన చేసిన విషయాన్ని గుర్తుంచుకున్న దాసరి గారు తన 150 సినిమాలలో నాగభూషణం గారిని ఒక్క సినిమాకి కూడా తీసుకోలేదు, గుమ్మడి గారు లేకుండా ఒక్క సినిమా కూడా తీయలేదు. ఈ సినిమాకు “తాత – మనవడు” అనే పేరు పెట్టారు. అనుకున్నట్టుగానే తక్కువ ఖర్చుతో సినిమా తీశారు. 1972 ఆగస్టులో మొదలుపెట్టి ఈ చిత్రం 1973 మార్చి 23న విడుదల అయ్యింది. ప్రతికూల పరిస్థితులలో విడుదలైనా కూడా ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. జై ఆంధ్రా ఉద్యమం, వేసవికాలం, జనరేటర్ సౌకర్యం సరిగా లేక కరెంటు కోతలు. అన్ని పరిస్థితులను తట్టుకొని వంద రోజులు విజయవంతంగా ప్రదర్శితమైంది. మలేషియా టెలివిజన్ లో ప్రదర్శించబడిన మొట్టమొదటి చిత్రంగా తాత – మనవడు రికార్డులకెక్కింది.

నటుడిగా, జర్నలిస్టుగా, పబ్లిషర్ గా, మ్యాగజైన్ ఎడిటర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా, రాజకీయవేత్తగా, కేంద్ర మంత్రిగా అనేక రంగాల్లో రాణించి, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు గడించారు దాసరి గారు. తాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. నటుల నుంచి నటనను రాబట్టుకోవడమే కాదు, తానే స్వయంగా నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు.

మోహన్ బాబు గారికైతే జన్మనిచ్చిన తండ్రి నారాయణ స్వామి అయితే,  స్టార్ నటుడిగా తెరమీద జన్మనిచ్చింది మాత్రం దాసరి నారాయణరావు గారు అనే చెప్పాలి. ప్రేమాభిషేకం, సర్ధార్ పాపారాయుడు, తాండ్రపాపారాయుడు వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలిచ్చి మోహన్ బాబు గారిని ఎక్కడికో తీసుకెళ్లిన ఘనత దాసరి గారిది. ‘స్వర్గం నరకం’తో మొదలైన వీరి ప్రయాణం ఎన్నో చిత్రాల వరకూ సాగింది.

మురళీ మోహన్, పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి నుంచి మొదలు పెడితే, నర్సింహారాజు, శ్రీహరి, రమేష్ బాబు, మహేశ్ బాబు సహా ఎంతో మంది హీరోలను వెండితెరకు పరిచయం చేసిన ఘనత దాసరి గారిది. అటు హీరోయిన్ల విషయానికొస్తే జయసుధ, జయప్రద, మాధవి, శ్రీదేవి, సుజాత, సిల్క్ స్మిత, రజినీ, అన్నపూర్ణ, ఫటాపట్ జయలక్ష్మీ సహా ఎంతో తారమణులను స్టార్ డమ్ తీసుకొచ్చిన ఘనత కూడా దాసరి గారిదే. అటు సోగ్గాడు శోభన్ బాబు గారితో బలిపీఠం, గోరింటాకు, స్వయంవరం వంటి ఎన్నో అద్భుతమైన విజయాలను ఇచ్చారు.

కోడిరామకృష్ణ, రవిరాజా పినిశెట్టి, రేలంగి నరసింహారావు, కె.మురళీమోహన్ రావు, సురేష్ కృష్ణ, కే.యస్.రవికుమార్ వంటి సుప్రసిద్ధ దర్శకులు దాసరి శిష్యరికంలోనే పెద్ద దర్శకులు అయ్యారు. ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించి, దర్శకత్వం వహించిన దాసరి గారిని వరించిన అవార్డులకు లెక్కేలేదు. మేఘసందేశం, కంటే కూతుర్నే కను సినిమాలకు గాను జాతీయ అవార్డులు అందుకున్నారు

అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ నటుడిగా రెండు నంది అవార్డులు. 1990లో ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు, 2007లో ఎన్టీఆర్ జాతీయ చలన చిత్ర పురస్కారం, వీటితో పాటు ఉత్తమ దర్శకుడిగా, మాటల, పాటల రచయితగా అనేక అవార్డులు దాసరి కీర్తికీరిటంలో వున్నాయి. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు, అవార్డులు, రివార్డులు. ఆయన హ్యాండేస్తే స్టార్లు సూపర్ స్టార్లు అయ్యారు. ఆయన పాత్ర చిత్రణ చేపడితే బొబ్బిలిపులిలా గాండ్రిస్తుంది.

త్యాగం గొప్పదని చెప్పిన “ప్రేమాభిషేకం”..

ఒక సినిమా క్లాసికల్ విజయం సాధిస్తే, కమర్షియల్ గా అంత ఆకట్టుకోదు. ఒకవేళ కమర్షియల్ గా విజయం సాధిస్తే, క్లాసికల్ గా పేరు రాదు. కానీ కమర్షియల్ గా విజయం సాధించిన సినిమా క్లాసికల్ గా కూడా ప్రశంసలు పొందితే అదే అక్కినేని “ప్రేమాభిషేకం”. ఈ చిత్రం అక్కినేని మరియు దాసరి గార్ల కీర్తిని ఇనుమడింపజేసింది. అక్కినేని నటజీవితంలో మైలు రాయిగా నిలబడడమే కాదు చిత్ర నిర్మాణ దశను కూడా మార్చేసింది. ప్రేమ గొప్పది. కానీ త్యాగం అంతకన్నా గొప్పది. ఇదే పాయింట్ పై తీసిన ఈ చిత్రం ప్రతీ ఒక్కరి మనసను తాకడమే చిత్ర విజయానికి కారణం. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది అంటారు. మరి త్యాగం ఏది? ఇవాళ రేపు వస్తున్న ప్రేమలో శృంగారం తప్ప త్యాగాన్ని చూడలేము. అందుకే సరిగ్గా నలభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోదాం. అంటే 16 ఫిబ్రవరి 1981 నాడు వచ్చిన సినిమా తెలుగు తెరపై ప్రేమాభిషేకం జరిగింది.

రాజేష్ గా అక్కినేని, దేవిగా శ్రీదేవి ఎంపికయ్యారు. జయంతి పాత్ర జయసుధ అయితే బాగుంటుంది అనుకున్నారు. కథ ఏంటి తన పాత్ర తీరుతెన్నులేవో తెలుసుకోకుండా జయసుధ ఓకే చెప్పేశారు. దాసరి సినిమాలో వేశ్య పాత్ర అయినా ఓకే అనేది జయసుధ అభిప్రాయం. జయసుధ యాదృచ్ఛికంగా అన్న మాటలే చివరకు నిజమయ్యాయి. జయసుధకు వేశ్య పాత్ర దక్కింది. అక్కినేని చేతిలో మందు గ్లాసు ఉంటే ఆ మత్తు థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకులకు సోకుతుంది. తెరమీద ఎన్ని పాత్రలు ఉన్నా అక్కినేని తప్ప మన కంటికి మరెవరు కనిపించరు. చావుతో పోరాడుతూ ఉప్పొంగే ప్రేమని గుండెల్లో దాచుకుంటూ ఓ వేశ్య కోరికనే అతి పవిత్రంగా తీర్చిన ప్రేమికుడిగా చిరస్థాయిగా నిలిచిపోయే ప్రతిభ కనబరిచారు అక్కినేని.

57 ఏళ్ల వయసులోనూ “కోటప్పకొండకు వస్తానని” అంటూ స్టెప్పులు వేశారు అక్కినేని. మరోసారి శ్రీదేవి అందాన్ని అభినయాన్ని కలబోసింది. ఎక్కువ మార్కులు మాత్రం వేశ్య పాత్రకే దక్కాయి. దాసరి దర్శకత్వ ప్రతిభకు ప్రేమాభిషేకం మరో నిదర్శనంగా నిలిచింది.

కేవలం 32 రోజులలో ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేశారు. 18 ఫిబ్రవరి 1981లో ప్రేమాభిషేకం 32 కేంద్రాలలో విడుదలైంది. 30 కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకుంది. 21 కేంద్రాలలో రజతోత్సవం జరుపుకోవడం విశేషం.

నాగార్జున ను “మజ్ను” గా నిలబెట్టిన దాసరి..

ప్రేమకు మరణం లేదు. మరణానికి ప్రేమ కారణం కారాదు అనే సందేశాన్ని చెబుతూ నాగార్జున ను ప్రణయ మూర్తిగా నిలబెట్టిన చిత్రం “మజ్ను”. సాధారణంగా ప్రేమ విఫలం కావడానికి ఆర్థిక వ్యత్యాసాలో, కుల అంతరాలో కారణమవుతాయి. మనిషికీ, మనిషికీ మనసులో కానీ మాటలో కానీ ఏ చిన్న పొరపాటు జరిగినా ఎంత దారుణమైన ఫలితాలు ఉంటాయో ఈ చిత్రంలో చూపించారు దాసరి గారు. దాసరి గారు ఒక అప్ కమింగ్ హీరోతో “మజ్ను” లాంటి భగ్న ప్రేమికుడి కథ తీయాలనుకోవడం నిజంగా సాహసమే. ఆ తరహా పాత్రలకు అక్కినేని తప్ప మరి ఎవరు పనికిరారు అని ప్రేక్షకులు తీర్మానించారని తెలిసి ఆ పాత్రను నాగార్జునతో పోషింప చేయించి తాను అనుకున్నది సాధించారు.

దాసరి సినిమా హీరో నాగార్జున కు ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయింది. రజిని, మూన్ మూన్ సేన్, సత్యనారాయణ, గుమ్మడి, సుధాకర్, నగేష్, జై.వి.సోమయాజులు, వేలు, కె.ఆర్.విజయ, రమాప్రభ, జానకి ఇతర ముఖ్య తారాగణం. తెలుగులో లక్ష్మీకాంత్ – ప్యారేలాల్ మజ్ను సంగీత ప్రధాన ప్రణయ కావ్యానికి అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినిమా పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పాట “ఇది తొలి రాత్రి కదలని రాత్రి” పాటకు సంగీతాన్ని సమకూర్చారు. అక్కినేని నాగేశ్వరావు, దాసరి కాంబినేషన్లో వచ్చిన “ఏడంతస్తుల మేడ”, “శ్రీవారి ముచ్చట్లు”, సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యి ఘన విజయం సాధించాయి.

ఆ సూత్రాన్ని అనుసరిస్తూ 14 జనవరి 1987 నాడు విడుదలైన “మజ్ను” చిత్రం కూడా అఖండ విజయం సాధించింది. ఈ సినిమా 32 కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకుంది. దాసరి గారి పుట్టినరోజు సందర్భంగా మే 4న చెన్నైలోని పద్మ విద్యాలయంలో శతదినోత్సవం జరిపారు. నాగార్జున నటించిన తొలి సినిమా విక్రమ్ విజయవంతమైనా కూడా వేడుక చేయలేదు. ప్రేమ అనే రెండు అక్షరాలు ఎంత గొప్పవో “ప్రేమాభిషేకం” చిత్రంతో తెలిపారు దాసరి గారు. ఆ చిత్రం 75 వారాలపాటు ఏకధాటిగా ప్రదర్శితమై సరికొత్త రికార్డులు ఎన్నో సృష్టించింది. ఆజరామరం, నిత్య నూతనమైన ప్రేమ కథతోనే “మజ్ను” సినిమా తీసి మళ్ళీ విజయం సాధించారు దాసరి గారు. 1987 సంక్రాంతి నుంచి 1988 సంక్రాంతి వరకు విజయవాడ, వైజాగ్ కేంద్రాల్లో ఏకధాటిగా 365 రోజులు ప్రదర్శితమై “మజ్ను” చిత్రం రికార్డులు సృష్టించింది.

మేఘసందేశం…

సున్నిత మనస్కుడు, కళారాధకుడు, కవి, మంచి మనిషి రవీంద్రబాబు. భర్త, పిల్లలు, పూజలు తప్ప మరో ప్రపంచం తెలియని పరమ సాద్వి పార్వతి. ప్రకృతిలోని కళా సృష్టినంతా తనలో నింపుకున్న కళామూర్తి పద్మ. ప్రేమ, భక్తి, అనురాగం, ఆరాధన, అవలోకానుబంధం. ఈ భావాలకు నిలువెత్తు సాక్షాలు ఈ ముగ్గురు. ఇలాంటి పాత్రలను ప్రధానంగా తీసుకొని సాహసమే చేశారు దర్శకరత్న దాసరి నారాయణ రావు గారు. తనలోని కళాత్మక భావాలన్నింటిని పొందుపరచి “మేఘసందేశం” అనే నవరస సుమ మాలికను ప్రేక్షకుల ముందు ఉంచారు దాసరి గారు. కేవలం దర్శక రత్నమే కాదు, తనలో అంతర్లీనంగా కళాతపస్వి కూడా దాగున్నాడని తెలియచెప్పిన అపురూప చిత్రమిది. సహజీవనం ప్రధానంశంగా తెరకెక్కిన చిత్రం ఇది. సహజీవనం వలన కాపురాల్లో, మనుషుల్లో ఎలాంటి సంఘర్షణలు తలెత్తుతాయో హృద్యంగా చూపించారు.

ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, జయప్రద, జగ్గయ్య లు ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ఇది. కథ కథనాలు సంగీతం ఇలా అన్నీ అంశాల్లోను సృజనాత్మక ఉట్టి పడే చిత్రం. అక్కినేని గారికి 200 సినిమా.

తన ప్రవృత్తికి, ఆలోచనలకు భిన్నంగా ఉండే భార్యతో కాపురం చేస్తూ మరోవైపు తన ప్రవృత్తికి దగ్గరైన ఒక కళాకారిణితో సహజీవనం చేసే కథానాయకుడు గా నటించారు.

పోలవరం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రికరించారు. ఈ చిత్రం తొలిసారిగా ఒక అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ప్రదర్శించబడింది.

మాస్కో ఫిలిం ఫెస్టివల్ కి ఈ చిత్రం ఎంపికైంది. తొమ్మిది నంది అవార్డులు, నాలుగు జాతీయ పురస్కారాలు, మరికొన్ని ఫిలింఫేర్ పురస్కారాలు ఈ చిత్రానికి లభించాయి.

రాజకీయం…

దాసరి గారు ఎన్టీఆర్ గారితో అనేక విజయవంతమైన తెలుగు చిత్రాలు తీసినా కూడా తాను స్థాపించిన “తెలుగు దేశం పార్టీ” లో చేరలేదు.

రాజీవ్ గాంధీ పరిపాలనా కాలములో దాసరి గారు కాంగ్రెసు పార్టీ తరపున  ఎన్నికల ప్రచారములో ఉత్సాహవంతముగా పాల్గొన్నారు.

ఊహించని విధంగా రాజీవ్ గాంధీ గారి హత్యానంతరం దాసరి గారు పార్టీకి కాస్త దూరంగా జరిగారు. 1990 దశకం చివరిలో దాసరి గారు “తెలుగు తల్లి” అను ఒక రాజకీయ పార్టీని ప్రారంభించారు.

ఈ పార్టీకి కోస్తా ప్రాంతాలలోని కాపు కులం వర్గాల నుండి అనూహ్య స్పందన లభించింది.

కారణం తెలీదు కానీ, అనివార్య కారణాల వల్ల ఆ పార్టీని ప్రక్కన పెట్టి కాంగ్రెస్ లో చేరారు. తాను కాంగ్రేస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నిక అయ్యారు.

బొగ్గు గనుల శాఖకు కేంద్రమంత్రిగా కూడా ఎన్నికయ్యారు. దాసరి గారు కాంగ్రేస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అత్యంత సన్నిహితులు.

కాంగ్రేస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

దాసరి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నవీన్ జందాల్ నుండి ₹2.25 కోట్లు లంచంగా తీసుకున్నారని తన మీద కేసు వేయడం జరిగింది.

పురస్కారములు…

★ 1974వ సంవత్సరంలో “తాతా – మనవడు” చిత్రానికి గాను దాసరి గారు నంది పురస్కారాన్ని అందుకున్నారు..

★ “స్వర్గం – నరకం” తెలుగు చిత్రానికి గాను ఉత్తమ చిత్రంగా బంగారు నంది బహుమతిని పొందారు..

★ 1983 వ సంవత్సరంలో “మేఘ సందేశం” చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా దాసరి గారు నంది పురస్కారాన్ని స్వీకరించారు..

★ 1992 వ సంవత్సరంలో “మామగారు” చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా నంది బహుమతిని గెలుచుకున్నారు..

★ 1986 వ సంవత్సరంలో తెలుగు సంస్కృతి , తెలుగు చిత్ర రంగానికి దాసరి గారు చేసిన సేవలకు గాను ఆంధ్రా విశ్వ విద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ ను పొందారు..

★ ప్రముఖ సామాజిక సేవా సంస్థల నుండి దాసరి గారు అనేక పురస్కారాలను పొందారు. వాటిలో కొన్ని వంశీ బెర్క్లే, కళా సాగర్, శిరోమణి ఇన్స్టిట్యుట్ మొదలైనవి..

★ ఫిల్మ్ ఫేర్ అవార్డును 6 సార్లు, మద్రాసు ఫిల్మ్ ఫాన్స్ పురస్కారాన్ని 5 సార్లు, సినీ హెరాల్డ్ అవార్డ్ ను 10 సంవత్సరాలు వరసగాను గెల్చుకున్నారు..

★ జ్యోతి చిత్ర నుండి సూపర్ డైరెక్టర్ అవార్డ్ ను 3 సార్లు పొందాడు..

★ పాత కాలం నాటి “ఆంధ్ర పత్రిక” నుండి 6 సార్లు ఉత్తమ దర్శకుడిగా  ఎంపిక అయ్యారు…

★ ఇవి కాక దాసరి గారు నిర్మించిన తెలుగు చిత్రాలలో అనేక అవార్డ్ లను గెలుచుకున్నారు…

మరణం…

దాసరి గారు కష్టపడి పైకొచ్చారు, కష్టాలు పడి పైకొచ్చారు. తాను నోట్లో బంగారు చెంచాతో పుట్టలేదు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టారు.

ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉండే జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదురయ్యాయి. తండ్రి చేసే పొగాకు వ్యాపారం దెబ్బ తినడంతో పుట్టెడు కష్టాలు మొదలయ్యాయి.

స్కూలు ఫీజు కూడా కట్టలేని పరిస్థితి. 7వ తరగతిలో చదువుకు తెరపడింది.

ఓ వడ్రంగి దగ్గర నెలకు రూపాయి జీతానికి పనిలో చేరారు దాసరి గారు.

తన మాస్టారు చొరువతో దాసరి గారి చదువు మళ్లీ మొదలైంది. పుస్తకాలు కొనలేక మిత్రుల దగ్గర తీసుకుని చదువుకున్నారు.

తర్వాత ఇంటికొచ్చాక అరటిపళ్లు అమ్మేవారు. దాంతో వచ్చిన డబ్బుతో పుస్తకాలు కొనుక్కునేవారు.

ఇంత కష్టాల్లో కూడా “కళ” అతన్ని వదిలిపెట్టలేదు. “కళ” ని ఆయన వదిలిపెట్టలేదు. రాత్రి భోజనం అయ్యాక నాటకాలు వేసేవారు. తన భవిష్యత్తుకి పునాదులు వేసుకునేవారు.

ఎందరికో ఆదర్శం, ఎందరికో ప్రేరణ. తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్దన్న లాంటి వారు.

ఇంతటి మన్ననలను పొందిన దాసరి నారాయణ రావు గారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సికిందరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో 30 మే 2017 నాడు ఈ లోకాన్ని వదిలి వెళ్లారు.

Show More
Back to top button