
నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు క్రక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే” అన్నారు శ్రీశ్రీ. ఒక వ్యక్తి ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు ప్రజలు జై కొడతారు, పూజిస్తారు, గౌరవిస్తారు, ఆ మనిషి వెంట పడతారు. అదే మనిషి ఆ స్థానం నుండి క్రిందికి జారిపడిపోయినప్పుడు ఎవ్వరూ పట్టించుకోరు. ఇది లోక న్యాయం. ఒక మనిషి హోదా, గుర్తింపు, పదవి, పరువు ప్రతిష్టలు సంపాదించాలంటే ప్రతిభ కావాలి, నిరంతరం శ్రమించే మనస్తత్వం ఉండాలి. గమ్యం చేరాలన్న పట్టుదల కావాలి, దానికి తగిన కృషి చేయాలి.
ఇవన్నీ సమకూరి అనుకున్నది సాధించడానికి కొన్ని సంవత్సరాలు కూడా పట్టవచ్చు. సాధించిన తరువాత ఆ స్థాయిని నిలబెట్టుకోవాలంటే దానికి తగిన సంయమనం కూడా ఉండాలి. ఏమాత్రం పొరపాటు జరిగినా కూడా ఆ మనిషి అథఃపాతాలానికి పడిపోవడానికి ఎన్నో రోజులు పట్టదు. తాను మొదలుపెట్టిన స్థానానికే పడిపోవడానికి రోజులు, గంటలు మాత్రమే కాదు క్షణాలు కూడా పట్టొచ్చు. తెలుగు చిత్రరంగంలో తొలి అగ్రస్థాయి హాస్యనటులుగా పరిగణింపదగిన కస్తూరి శివరావు చలనచిత్ర జీవితం జీవితం, వ్యక్తిగత జీవితం రెండూ ఇందుకు నిదర్శనం.
కస్తూరి శివరావు తెలుగు సినిమా ప్రముఖ హాస్యనటులు. ఆయన కేవలం సినిమా రంగంలోనే కాదు, నాటకరంగంలో కూడా ప్రముఖులు. తెలుగు సినిమా రంగంలో తొలి అగ్ర కథానాయకులు చిత్తూరు వి. నాగయ్య అయితే, తొలి అగ్ర హాస్యనటులు కస్తూరి శివరావు. హాస్య నటులు లేకుండా ఏ సినిమాని అంగీకరించలేని పరిస్థితి కథనాయకులది. ఆ కారణంగా నేడు ఎందరో హాస్యనటులు చిత్ర రంగాన్ని ఏలుతున్నారు. అలాంటి హాస్యనటులకు ఆద్యులు కస్తూరి శివరావు. ఆయన తెలుగు సినిమా హాస్యనటులలో ప్రముఖులు అయిన రేలంగి, రమణారెడ్డి, రాజబాబు ల కన్నా కూడా ముందు తరం వారు.
మాటలు నేర్చిన తెలుగు చిత్రాలు రంగప్రవేశం చేయడానికి ముందు మాటలు నేర్వని (మూకీచిత్రాలు) తెలుగు చిత్రాలకు వ్యాఖ్యానం చెప్పేవారు. “చూడామణి”, “స్వర్గసీమ”, “బాలరాజు”, “గుణసుందరి కథ”, “పరమానందయ్య శిష్యులు”, “స్వప్న సుందరి”, “మంత్రదండం”, “స్త్రీ సాహసం”, “పాండురంగ మహత్యం” మొదలగు చిత్రాలలో కస్తూరి శివరావు నటించారు. ఇప్పటి తరం ప్రేక్షకులకు ఆయన చేసిన ఒక్క పాత్ర కూడా వెంటనే గుర్తుకు రాకపోవచ్చు. కానీ ఒకనాడు తెలుగు సినిమా ప్రేక్షకులు కథనాయకులను వదిలేసి ఈ హాస్యనటుడి వెంటపడ్డారు అన్నది నమ్మశక్యం కాని వాస్తవం.
“పువ్వులమ్మిన చోట కట్టెలు అమ్మలేము” అనేది సామెత. కానీ ఒక వెలుగు వెలిగిన చోటే మసకబారిన బ్రతుకును వెల్లదీసిన వారు కస్తూరి శివరావు. నటుడిగా మంచి పేరు సంపాదించారు. విపరీతమైన డబ్బు గడించారు. బ్యూక్ లాంటి ఖరీదైన కారుల్లోనూ తిరిగారు. అలా తన ప్రతిభ వెలిగిపోతున్న రోజులలో లక్షలాది మంది అభిమానుల్ని తన వెనకాల పరిగెత్తేలా చేసుకున్నారు ఈ అగ్రస్థాయి హాస్యనటులు. ఆయన చేసిన ఒకే ఒక్క తప్పిదం పరమానందయ్య శిష్యులు (1950) చిత్రాన్ని తాను స్వంతంగా నిర్మించడం. అంతే ఆ సినిమా పరాజయం వలన కలిగిన నష్టాలతో ఒక్కసారిగా పాతాళానికి పడిపోయారు.
ఆస్తులు తరిగి పోయాయి. సినిమాల్లో అవకాశాలు తగ్గాయి. చెన్నపట్నంలో ఏ వీధులలో బ్యూక్ కారులో తిరిగారో, తిరిగి అదే వీధుల గుండా సైకిలుపై తిరగాల్సిన పరిస్థితికి తెచ్చుకున్నారు. అవసాన దశలో పేదరికం అనుభవించి, చివరకు అనామకుడిగా మరణించారు. ఆయన మృతదేహాన్ని స్మశాన వాటికకు మోసుకెళ్తున్నప్పుడు అరడజను మంది కూడా లేరు. ఆయన సినిమాలలోకి రావడానికి ముందే అసంఖ్యాక అభిమానులను పోగుచేసుకున్నారు. ఎన్నో అవస్థలు, బాధలు పడి పైకి వచ్చారు. డబ్బులు సంపాదించుకున్నారు. కానీ ఒక్క కుదుపుతో ప్రారంభంలో ఎన్ని కష్టాలైతే పడ్డారో, మళ్ళీ అదే కష్టాల కడలిలో పడిపోయారు. వీరి జీవితం తరువాత సినీ తారలకు ఒక గుణపాఠం.
జీవిత విశేషాలు…
జన్మనామం : కస్తూరి శివ రావు
జననం : 06 మార్చి 1913
స్వస్థలం : కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
వృత్తి : హాస్య నటులు, నిర్మాత, మూకీ చిత్రాలకు వ్యాఖ్యాత
జీవిత భాగస్వామి : శకుంతల కస్తూరి
పిల్లలు : ముగ్గురు కుమారులు మరియు నలుగురు కుమార్తెలు
తండ్రి : కస్తూరి కృష్ణానందం
తల్లి : కస్తూరి రామమ్మ
మరణ కారణం : అనారోగ్యం
మరణం : 24 ఫిబ్రవరి 1966 (వయస్సు 52)
నేపథ్యం…
కస్తూరి శివరావు 06 మార్చి 1913 నాడు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జన్మించారు. తండ్రి కస్తూరి కృష్ణానందం, తల్లి కస్తూరి రామమ్మ. తండ్రి కాకినాడలో ఉపాధ్యాయులుగా పనిచేస్తుండేవారు. వీరికి నాలుగో సంతానంగా కస్తూరి శివరావు జన్మించారు. కస్తూరి శివరావు ఉపాధ్యాయుడు కొడుకే అయినా, చిన్నప్పటి నుండి కుదురుగా ఉండేవాడు కాదు. “పండిత పుత్ర, పరమశుంఠ” అన్నట్లు తండ్రి ఉపాధ్యాయుడే అయినా శివరావుకు చదువు మీద ధ్యాస కలిగించలేకపోయారు. తనకు చదువు మీద తప్పించి ఇంట్లో మిగతా అన్నిటి మీద శ్రద్ధ ఉండేది. హార్మోనియంతో పాటు వాయిద్యాలు వాయించగలడు. చక్కని గొంతుతో పాటలు పాడి మెప్పించగలడు. ముఖంలో అద్భుతమైన హావాభావాలు పలికించగలడు.
శివరావు అన్నయ్య మంచి వ్యాఖ్యాత. ఆయనను చూసి కస్తూరి శివరావుకు కూడా వ్యాఖ్యానం మీద ఆసక్తి పెరిగింది. కానీ ఇంట్లో వాళ్ళు చదువుకోమని పాఠశాలకు పంపించేవారు. తనకు చదువు ఏమాత్రం వంటబట్టేది కాదు. తాను బికారిగా తిరుగుతుండేవారు. ఇంట్లో వాళ్ళు తిడితే, ఇల్లు వదిలి పెట్టి పారిపోయేవారు. మళ్లీ ఎప్పటికో వచ్చేవారు. అది తనకు అలవాటయిపోయింది. హార్మోనియం, తబలా వాయించడం లాంటివి తెలిసిన ఆయనకు నాటకాల మీద మంచి ఆసక్తి పెరిగిపోయింది. ఎక్కడైనా నాటకాలు జరుగుతున్నాయంటే, అక్కడికి వెళ్లి నాటకాల వారితో కూర్చొని వారికి తబలా వాయించడంలో సహాయం చేస్తూండేవారు. నాటకాలు పూర్తి అయిపోయిన తరువాత ఎప్పటికో రాత్రి ఇంటికి చేరేవారు.
దర్శకులు సి. పుల్లయ్య వద్ధ చేరి..
కస్తూరి శివరావు దినచర్యపై తండ్రికి దిగులు పెరిగిపోయింది. ఆయన తన శిష్యుడు చిత్తజల్లు పుల్లయ్యను సంప్రదించారు. చలనచిత్ర రంగంలో తారాలోకానికి నాన్నగారు లాంటి వారు చిత్తజల్లు పుల్లయ్య. తెలుగు సినిమా మాటలు నేర్వక ముందు (మూకీ) నుండి కాకినాడలో సినిమా రంగానికి ఆయన ఎంతో కృషి చేస్తున్న వ్యక్తి ఆ రోజులలో సినిమాలు కూడా తీశారు. కస్తూరి శివరావు నాన్న గారి వద్ధ చిత్తజల్లు పుల్లయ్య చదువుకున్నారు. అందువలన గురువుగారి కుమారుడే కస్తూరి శివరావు గనుక “నా దగ్గర పంపించండి. నేను మీ వాడిని తీర్చిదిద్దుతాను” అని గురువు గారికి చెప్పారు. సి.పుల్లయ్య కు రాజమండ్రిలో ఒక స్టూడియో ఉండేది. అక్కడికి శివరావును పంపించారు. కానీ అక్కడ కూడా తాను ఉండలేదు. రాత్రికి రాత్రే అక్కడనుండి పారిపోయాడు.
సి.పుల్లయ్య మనుషులు రెండు రోజులు వెతికి, చివరికి గుంటూరు ఉన్న శివరావును పట్టుకొచ్చారు. గుంటూరులో వీధి నాటకాలు వేసే వారి వద్ధ శివరావు హార్మోనియం వాయిస్తున్నాడు. అక్కడి నుండి ఆయనను పట్టుకొచ్చి రాజమండ్రిలో చిత్తజల్లు పుల్లయ్యకు అప్పగించారు. స్టూడియోలో ఎడిటింగ్ నేర్పించేసి, నెలకు 15 రూపాయలు జీతం ఇచ్చి, ఉండడానికి ఇల్లు, భోజనం సమాకురుస్తారు. ఎడిటింగ్ ఆపరేటర్ గా పనిచేయడం, ప్రొజెక్షన్ ఎలా నడుస్తుందో పరిశీలించడం, ఇలా ప్రతీ విభాగంలో శిక్షణ ఇచ్చి ప్రొజెక్టర్ గా పరీక్ష వ్రాయించారు. ఆ స్టూడియోలో రెండు సంవత్సరాలు పనిచేసి అక్కడినుండి మళ్ళీ పారిపోయి, తన పెద్దన్నయ్య మాదిరిగా అనకాపల్లి ప్రాంతాలలో మూకీ థియేటర్ లకు (ఆ రోజులలో టెంట్ థియేటర్ లు ఉండేవి) యాజమాన్యంతో మాట్లాడుకుని వ్యాఖ్యానాలు చెప్పడం మొదలుపెట్టారు.
మూగ సినిమాలకు వ్యాఖ్యాతగా…
అనకాపల్లిలో మూకీ సినిమాలకు కస్తూరి శివరావు చెప్పే వ్యాఖ్యానం జనాలకు విపరీతంగా నచ్చేసింది. శివరావు వ్యాఖ్యనం అంటే ప్రేక్షకులు విరగబడి వెళ్లేవారు. తాను చెప్పే వ్యాఖ్యానానికి, సినిమా కథకు సంబంధం లేకున్నా కూడా, ఆ కథకు హాస్యాన్ని జోడించి చెప్తుండేవారు. రకరకాల చమక్కులు చేస్తుండేవారు, అనేక జిమ్మిక్కులు కూడా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండేవారు. తెర మీద సినిమా ఎలా ఉన్నా శివరావు వ్యాఖ్యానాలతో ఆ సినిమా బాగా అనిపించేది. దాంతో తాను తెలుగు చిత్రసీమలోకి రాకముందే కస్తూరి శివరావు బాగా ప్రాచుర్యం పొందాడు. ఆయన సంభాషణలను ఎంత గొప్పగా చెప్పేవాడంటే ప్రేక్షకులు సినిమాలు వదిలేసి శివరావును చూసే స్థాయికి చేరారు. సినిమా పూర్తయినాక కస్తూరి శివరావును చూసి ఆనందంగా వెళ్లేవారు. అలా మూగ సినిమాలకు వ్యాఖ్యతగా కొద్దికాలం పేరు తెచ్చుకున్నారు. అటువంటి ఉద్యోగం చేపట్టారు కస్తూరి శివరావు. కొద్దిరోజులు గడిచిన తరువాత మూకీ థియేటర్ యాజమాన్యానికి, శివరావుకు మధ్య జరిగిన కొద్దిపాటి గొడవతో అక్కడినుండి ఆయన తిరిగి ఇంటికి వచ్చేశారు. కథ మళ్ళీ వెనక్కి వచ్చేసరికి శివరావు తల్లిదండ్రులు మరొకసారి సి.పుల్లయ్యను ఆశ్రయించారు. దాంతో శివరావును తిరిగి తన స్టూడియోలో చేర్చుకున్నారు. శివరావు ప్రొజెక్టర్ కు అవసరమైన పరీక్ష కూడా పాసయ్యారు.
తొలి సినిమా వరవిక్రయం (1939)..
రాజమండ్రిలో ఉన్న పుల్లయ్య స్టూడియో దహనం అయ్యింది. దాంతో ఆయన కలకత్తా వెళ్లి సినిమాలు తీయడం ప్రారంభించారు. ఆయనతోపాటు కస్తూరి శివరావును తీసుకెళ్లి అక్కడ సినిమా కూర్పు (ఎడిటింగ్) లో శిక్షణ ఇవ్వడమే కాకుండా, చిత్ర నిర్మాణం, చిత్ర దర్శకత్వం మొదలగు వాటిలో శిక్షణ ఇచ్చేవారు. ఈస్టిండియా కంపెనీ వారు నిర్మించిన వరవిక్రయము (1939) చిత్రానికి దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య. తెలుగు సినిమా ప్రారంభదశలో సందేశాత్మకంగా వచ్చిన చిత్రాలలో వరవిక్రయము ఒకటి. ఈ చిత్రంతోనే నటి భానుమతి సినీ జీవితం మొదలయ్యింది. ఈ సినిమాలో కస్తూరి శివరావుకు అవకాశం ఇచ్చారు దర్శకులు సి.పుల్లయ్య. అందులో రెండు, మూడు సంభాషలు మాత్రమే ఉన్నాయి.
రేలంగి కూడా ఈ సినిమాలో చిన్న వేషం వేశారు. అలా తొలిసారిగా “వరవిక్రయము” సినిమాతో తెలుగు చిత్రసీమలో తెరమీద కనిపించాడు. ఈ సినిమాతోనే రేలంగి వెంకట్రామయ్య, కస్తూరి శివరావులు తమ సినిమా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత తెలుగు సినిమా రంగం కలకత్తా నుంచి మద్రాసుకు చేరింది. ఆ తరువాత చూడామణి (1941) సినిమాలో అతడు వేసిన మంగలిశాస్త్రి అనే వేషంతో జనం దృష్టిలో పడ్డారు. తరువాత అక్కడా అక్కడా చిన్నా, చితకా వేషాలు వేసినా స్వర్గసీమ (1945) సినిమాతో ఇంకా ప్రేక్షకులకు చేరువయ్యారు. అక్కినేని నాగేశ్వరావు నటించిన బాలరాజు (1948) సినిమాలో అక్కినేనికి సహాయకుడిగా నటించారు. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. ఆ సినిమా ఇంకా మంచి పేరు తెచ్చిపెట్టింది. అందులోని శివరావు నటనా, అతని పాటలూ ప్రేక్షకజనాన్ని బాగా ఆకర్షించాయి.
బ్యూక్ కారులో తిరిగేంతగా ఎదిగి..
కస్తూరి శివరావు రూపం, ప్రత్యేకమైన గొంతుతో, అద్భుతమైన తన నటనతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తరువాత భారతీయ సుప్రసిద్ధ సినీ దర్శకులు కె.వి.రెడ్డి దర్శకత్వంలో గుణసుందరి కథ (1949) సినిమా కస్తూరి శివరావు ప్రధాన పాత్రలో నిర్మించారు. ఈ సినిమాలో శివరావుది ప్రధాన పాత్ర. ఆ చిత్రంలోని ఆయన గిడిగిడి అనే ఊతపదంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ రోజులలోనే కస్తూరి శివరావుకు లక్ష రూపాయలు పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధపడ్డారంటే ఆ రోజులలో ఆయనకు ఉన్న గిరాకీని (డిమాండ్) ను మనం ఊహించవచ్చు. వచ్చిన పారితోషికంతో విలాసవంతమైన బ్యూక్ కారు కొనుగోలుచేశారు. కస్తూరి శివరావు ఉండే పాండి బజార్ లో “బ్యూక్” కారు కనపడగానే అభిమానులు శివరావు చూసేందుకు ఎగబడేవారు. ఏ మద్రాసు వీధులలో తాను సైకిల్ పై తిరిగాడో, అదే మద్రాసు వీధులలో ఆయన బ్యూక్ కార్ లో తిరిగేవారు. ఆ తరువాత “స్వప్న సుందరి” (1950), “శ్రీ లక్ష్మమ్మ కథ” (1950) మొదలగు సినిమాలలో నటించారు. “గుణసుందరి కథ” సినిమాతో మంచి పేరు వచ్చాక ఆయన పంపిణీదారుడిగా కూడా మారారు. అందులో కూడా బాగా డబ్బులు సంపాదించారు. ప్రతీ నిర్మాతా తన చిత్రంలో శివరావు వుండాలనీ, అతని కోసం పడిగాపులు పడేవారు. ఒక మహోన్నతమైన తారగా సినీవినీలాకాశంలో వెలిగారు.
పర్వతం నుండి అథః పాతాళానికి…
ఆకాశంలో వెలిగే నక్షత్రాల వయసు కొంతకాలమే! అందుకే సినిమా నటీ నటుల్ని నక్షత్రాలతో పోల్చారు. మద్రాసు పాండీ బజార్లో బ్యూక్ కారులో తిరిగిన కస్తూరి శివరావు తాను చేసిన ఒకే ఒక్క పొరపాటు వలన ఆయన ప్రాభవం ఒక్కసారే పర్వతం నుండి అథః పాతాళానికి పడిపోయింది. అదే పరమానందయ్య శిష్యులు (1950) సినిమా నిర్మాణం. కస్తూరి శివరావు నటుడు, నిర్మాత, దర్శకులుగా తెరకెక్కించిన ఈ చిత్రం లో అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మీరాజ్యo , చిలకలపూడి సీతారామాంజనేయులు, గిరిజ మొదలగు వారు నటించారు. ఈ సినిమా ఘోర పరాజయం పాలైంది. హాస్యనటి దాసరి గిరిజకు ఇదే మొదటి సినిమా. ఈ సినిమాలో ఎంత హాస్యం ఉన్నా కూడా విజయం సాధించలేదు.
ఆయన పెట్టుబడి పెట్టిన ఏమాత్రం వెనక్కి రాలేదు, సరి కదా ఆయనను బాగా అప్పుల్లోకి నెట్టేసింది. కస్తూరి శివరావు అప్పటివరకు సంపాదించినది అంతా పోగొట్టుకున్నారు. ఆయన పతనం అప్పటి నుంచే నెమ్మదిగా ప్రారంభమైంది. రేలంగి శకం వచ్చిన తరువాత శివరావు జోరు తగ్గింది. క్రమేణా సినిమాలూ తగ్గసాగాయి. మద్రాసు పాండీ బజార్లో తన బ్యూక్ కారు కనిపిస్తే అభిమానులు కారు వెంట పరిగెత్తిన దశ నుండి తన “ప్రభ” తగ్గి మళ్ళీ అదే బజార్లో అదే సైకిలు తొక్కుతూ తిరిగే దశకు చేరుకుంది. అదే మాట శివరావును అడిగితే అప్పట్లో కార్లమీద తిరిగాను, ఇప్పుడు మళ్ళీ సైకిలు మీదనే తిరుగుతున్నాను. ఒకప్పుడు మా ఇంటి పేరైన కస్తూరి వాసనే నిత్యం గుప్పుమనేది. ఇప్పుడు ఇంటిపేరు కస్తూరి వారు – ఇంట్లో గబ్బిలాల కంపు” అని తన మీద తనే చమత్కారబాణం వేసుకునేవారు.
ఎన్టీఆర్ అవకాశాలు ఇచ్చినా, వినియోగించుకోని శివరావు..
“ఒకనాడు పెద్ద సైజు కారులోని వెనుక సీటులో దర్జాగా కూర్చుని తిరిగిన శివరావు, అదే రోడ్ల మీద డొక్కు సైకిలు తొక్కుకుంటూ తిరిగారు”. అయితే ఎవర్నీ వేషాలు ఇవ్వమని అడిగేవారు కాదు. అంత బతుకు బతికిన తాను, దేహీ అనవలసిన అవసరం లేదని అతను మొండిపట్టుగా కూర్చోవడం సినిమా నిర్మాతలకి నచ్చలేదు. దీనికి తోడు త్రాగుడు అలవాటు ఆయన సినిమా అవకాశాలను దెబ్బతీసింది. దాంతో తాను నాటకాల్లో నటించడం ఆరంభించాడు. ఇదే అదనుగా భావించిన ఈయన ప్రఖ్యాతిని నాటకరంగం బాగా ఉపయోగించుకుంది. అప్పటికే రేలంగికి విజయాలు మొదలయ్యాయి. దాంతో కస్తూరి శివరావును ప్రేక్షకులు క్రమంగా మర్చిపోయారు. సినిమా వాళ్ళని అవకాశాలు ఇవ్వమని అడగటం ఆయనకు ఇష్టం లేదు అడగనిదే పాత్ర ఇవ్వడం ఎందుకు అనుకున్నారు నిర్మాతలు వెరసి ముఖానికి రంగు వేసుకునే రోజు కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. చివరి రోజుల్లో ఎవ్వరూ సినిమాల్లో అవకాశాలు కల్పించని పరిస్థితిలో కూడా శివరావు మీద అభిమానంతో ఎన్.టి.రామారావు పలు సినిమాలల్లో అవకాశాలు కల్పించారు. సినిమా చిత్రీకరణలకు కూడా త్రాగి వస్తూండటంతో మళ్ళీ అవకాశాలు రాలేదు.
మరణం…
సంవత్సరానికి ఒక సినిమా చేస్తూ, అందులోనూ దక్కే చిన్నపాత్రలు, వాటి ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. పైగా సినిమా రంగంలో చాలా మందికి ఉండే చిన్న చిన్న అలవాట్లు శివరావుకి ఉండేవి. సినిమా రంగం ఆదరించకపోవడం వలన నాటక రంగం మీద శివరావు దృష్టి పెట్టాడు. సినిమా రంగంలో శివరావుకున్న గుర్తింపు అడ్డం పెట్టుకొని తన నాటక సంఘం నడిపించుకోవచ్చు అని వారు ఆయనను ఆహ్వానించారు. చిన్నప్పటి ఆంధ్ర ప్రాంతానికి వచ్చి నాటకాలు ఆడి తిరిగి వెళ్లేవారు. ఒకనాడు ఖరీదైన కారులో తిరిగిన శివరావు, మూడో తరగతి రైలు కంపార్ట్మెంట్ లో ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఆయనకు సరైన ఆదాయం లేదు, సరైన పోషకాహారం లేదు. మాములుగానే ఆయన శరీర రూపం సన్నగా ఉండేది. బుగ్గలు నొక్కుకొని పోయాయి. అనారోగ్యం మొదలైంది. తన కాలే కడుపు కోసం, కుటుంబ సభ్యులకు కోసం ఏదో ఒక పని చేయాల్సి వచ్చేది.
తనకు తెలిసిన పని నటన మాత్రమే. దానినే నమ్ముకుని తిరుగుతున్నారు. నాటకం ఆడేందుకు ఆంధ్ర పారిస్ గా పేరు గాంచిన తెనాలిలో వేస్తున్న నాటకంలో కస్తూరి శివరావు పాత్ర అయిపోయింది. 24 ఫిబ్రవరి 1964 నాడు నాటకాల కంపెనీ వారు ఇచ్చిన పారితోషికం జేబులో పెట్టుకుని తెనాలి రైల్వే స్టేషన్ చేరారు. తనకు అందిన డబ్బు కొంచమైనా కూడా, అది తన వారికి ఆకలికి అదే గొప్పగా సహాయపడుతుంది అనుకుంటూ తెనాలి రైల్వే స్టేషన్ లో ఒక బల్ల మీద పడుకున్నాడు. రాత్రి ఎప్పుడు పడుకున్నాడో గానీ తెల్లవారినా కూడా తాను కదలడం లేదు. ఆ బక్క ప్రాణిని కదిలించి చూస్తే చలనం లేదు, ఆయనలో ప్రాణం లేదు. ఎవరో అనాద శవం అనుకున్నారు. మరీ కొంచెం పరీక్షగా చూసిన వారు కస్తూరి శివరాం మొహంలా ఉంది అన్నారు. ఆ విషయం నాటక ప్రావీణ్యులు, పట్టణంలోని నాటక కళాకారులు వెంకటరామయ్య గారి దగ్గరికి చేరింది.
అంతిమయాత్రకు హాజరైంది ఆరుగురే…
కస్తూరి శివరావు పరిస్థితిని చూసి వెంకటరామయ్య కంటనీరు పెట్టుకున్నారు. కారు మాట్లాడి అందులో మద్రాసు పంపించాలనుకున్నారు. శవాన్ని తీసుకెళ్తే తన కారు మరెవరైనా ఎక్కరు అని కారు డ్రైవరు చెప్పడంతో, చేసేది లేక కారు డిక్కీలో పడుకోబెట్టి చెన్నపట్నం పంపించారు. ఒకనాడు బ్యూక్ కారులో తిరిగిన శివరావు అంతిమంగా అనాధ శవంగా డిక్కిలో వెళ్లారు. మధ్యలో కారు చెడిపోయింది. బాగుచేయించి తీసుకెళ్లాడానికి ఒకరోజు పట్టింది. 24 ఫిబ్రవరి 1966 నాడు మరణించిన ఆయన మృతదేహం 26 ఫిబ్రవరి 1966 సాయంకాలనికి మద్రాసుకు చేరుకుంది. భార్య, పిల్లలు ఏడవడం ప్రారంభించారు. దహన సంస్కారాలకు డబ్బులు లేవు. ఈయన మిత్రుడు హాస్యనటులు సీతారాం, స్టిల్స్ సత్యం మొదలగు వారు కూలీలను పురమాయించి మృతదేహాన్ని స్మశానానికి మోయించారు.
బ్రతికున్నప్పుడు కొన్ని లక్షల మందిని తన వెనకాల పరిగెత్తించుకున్న కస్తూరి శివరావు మృతదేహాన్ని కూలీలు మోస్తుండగా, పట్టుమని ఆరుగురు కూడా లేరు. స్మశానానికి వెళ్ళాక వైద్యుల ధృవీకరణ పత్రం లేదు. ఎలాగోలా వారు ప్రయత్నం చేsi ధ్రువీకరణ తీసుకువచ్చి 26 ఫిబ్రవరి 1966 నాడు రాత్రి దహనం చేశారు. మద్రాసుకు చేరిన శివరావు మృతదేహాన్ని చూడడానికి సినిమా రంగం ప్రముఖులు ఎవ్వరూ రాలేదు. ఆయన హాస్యనటనతో సినిమాలను నిలబెట్టగా అందులో కథానాయకులుగా విజయం సొంతం చేసుకున్న వారు కూడా ఈయన పార్దీవదేహం వైపు తొంగి చూడలేదు. డబ్బు తీసుకొని శివరావు దేహాన్ని మోసిన నలుగురు, వెంట నడిచిన ఆరుగురు మిత్రులతో కస్తూరి శివరావు అంతిమయాత్ర సాగింది. పర్వతంపై కూర్చున్న కస్తూరి శివరావు అథః పాతాళానికి పడిపోయిన వైనం అది. ఆయన సినిమా మజిలీ చలనచిత్ర రంగం వారికి గుణపాఠం.


