కన్ను తెరిస్తే జననం, కన్నుమూస్తే మరణం, రెప్పపాటే జీవితం” అన్నాడు ఒక కవి. “పుట్టిన ప్రతి మనిషికీ మరణశాసనం ఎక్కడో పాతిపెట్టబడి ఉంటుంది” అన్నారు ఇంకొక కవయిత్రి. ఎదిగే ప్రతి మనిషికి కూడా తాను వేసే ప్రతీ అడుగు మృత్యుద్వారం వైపే అని తెలుసు. అయితే ఎప్పుడొస్తుందో తెలియని మరణం గురించి ప్రతీక్షణం ఆలోచించి జీవితాన్ని నిరాశమయం చేసుకోవడం కంటే, ఆ ఆలోచనలను పాతాళంలో పాతిపెట్టేసి అనురాగాల కోసం, అనుబంధాల కోసం, ఆప్యాయతల కోసం ఆరాటపడడం, సంపద కోసం సుఖం కోసం హైరానా పడటం ఇదంతా మానవ సహజం. అయితే మృత్యువు పలాన సమయంలో వస్తుంది అని రూఢీగా తెలిసినప్పుడు మనిషి మనోభావాలు ఎలా ఉంటాయి? మృత్యువు వస్తుందని తెలిస్తే బహుశా వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తులకు అయితే పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జీవితంలో బాధ్యతలు అన్నీ అయిపోయాయి. ఇవాళ కాకపోతే రేపైనా రాబోయేది మృత్యువు కదా అని సర్దిచెప్పుకోవచ్చు.
కాకపోతే యవ్వనారంభంలో ఉన్న ఒక అబ్బాయికి, అమ్మాయికి తమ జీవనజ్యోతి వెలిగేది కొద్ది రోజులే అని తెలియడం, అలాంటి చివరి రోజులలో వారి మధ్య ప్రేమ చిగురించడం. ఇలాంటి కథను వెండితెరకెక్కించాలంటే ఎంత ధైర్యం ఉండాలి? ఈ సాహసం బహుశా మణిరత్నం గారి ఒక్కరికే సాధ్యపడిందేమో. అలాంటి ప్రేమ కథా చిత్రమే మణిరత్నం “గీతాంజలి”. తమిళ చలనచిత్ర దర్శకులు మణిరత్నం. తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితం అయిన కథానాయిక “సుహాసిని” మణిరత్నం భార్య. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన అన్ని తమిళ చిత్రాలూ తెలుగులోకి అనువదించబడ్డాయి. నాయకుడు, రోజా, బొంబాయి మొదలయినవి మణిరత్నం ఆణిముత్యాల్లో కొన్ని మాత్రమే. ఆయన ప్రతీ చిత్రం విమర్శకుల ప్రశంశలు పొందినవే. మణిరత్నం గారు తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన ఒకే ఒక సినిమా “గీతాంజలి”.
ఈ సినిమాను చలనచిత్రం అనడం కంటే కూడా ఒక అద్భుతమైన చిత్రకారుడు చిత్రించిన సజీవ వర్ణచిత్ర సముదాయం అని కానీ, భావుకత నింపుకున్న ఓ కవి వ్రాసిన ప్రేమామృత కావ్యమని కానీ, గొంతుకలో మకరందాన్ని, గరళాన్ని కూడా దాచుకున్న ఓ గాయకుడు పాడిన మధుర విషాద గీతాంజలి అని కానీ చెప్పుకోవచ్చు. క్షణక్షణం మృత్యువు ముంచుకొస్తున్న హీరో హీరోయిన్ల మధ్య ప్రేమను చిగురింపచేసి, వారు సరదాగా ఉంటున్నప్పటికీ తెరపై చూసే ప్రేక్షకులు మనసుల్ని కరిగించి, గుండెల్ని పిండేసి, హృదయాలను ద్రవీబోతం చేసి వెండితెర దర్శక మాంత్రికుడు మణిరత్నం సృష్టించిన పూర్తి విషాదభరిత ప్రేమగాథ చిత్రం గీతాంజలి. కథానాయకుడిని, కథానాయికని ఇద్దరినీ కూడా ఎప్పుడు చనిపోతారో కూడా తెలియదని చెప్పేసి, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కథ నడిపించి ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించడం ఒక మణిరత్నం కే చెల్లింది, ఒక మణిరత్నంకే సాధ్యపడింది.
చిత్ర విశేషాలు….
దర్శకత్వం : మణిరత్నం
కథ : మణిరత్నం
నిర్మాణం : సి.యల్. నరసారెడ్డి
స్క్రీన్ ప్లే : మణిరత్నం
తారాగణం : అక్కినేని నాగార్జున, గిరిజ, విజయకుమార్, షావుకారు జానకి, ముచ్చెర్ల అరుణ, రాధాబాయి, డిస్కో శాంతి, సిల్క్ స్మిత, సుమిత్ర, విజయచందర్
సంగీతం : ఇళయరాజా
నేపథ్య గాయకులు : బాలు, యస్.జానకి
సాహిత్యం : వేటూరి సుందర రామూర్తి
ఛాయాగ్రహణం : పి.సి.శ్రీరామ్
సంభాషణలు : రాజశ్రీ
నిర్మాణ సంస్థ : భాగ్యలక్ష్మీ ఎంటర్‌ప్రైజెస్
నిడివి : 135 నిమిషాలు
విడుదల తేదీ : 19 మే 1989
భాష : తెలుగు
చిత్ర కథ సంక్షిప్తంగా…
చిత్ర కథానాయకుడు ప్రకాష్ (అక్కినేని నాగార్జున) పరిచయంతో గీతాంజలి సినిమా కథ మొదలవుతుంది. ప్రకాష్ ఎల్లప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా తిరిగే ఒక యువకుడు. కళాశాలలో చదువుతుంటాడు. అయితే అతనికి ప్రాణాంతకమైన వ్యాధి ఒకటి ఉంది అని తెలుస్తుంది. ప్రాణం పోతుందని తెలిసి జీవితం మీద విరక్తి చెందిన ప్రకాష్ అన్నింటినీ వదిలేసి ఊటీ వెళ్ళిపోతాడు. అక్కడ అతనికి అల్లరి చేసే కొంటె పిల్ల గీతాంజలి (గిరిజ) పరిచయం అవుతుంది. గీతాంజలి తండ్రి ఊటీ లో పెద్ద వైద్యుడు. గీతంజలి చాలా చురుకైన అమ్మాయి. ఎప్పుడూ అందరిని ఆటపట్టిస్తూ, నవ్వుతూ ఉంటుంది. అయితే ఆమె కూడా ఒక ప్రాణాంతక వ్యాధి తో బాధ పడుతుంది. అయితే ప్రకాష్ మాదిరి ఆలోచిస్తూ భయపడకుండా, ప్రకాష్ కు భిన్నంగా వ్యాధి గురించి ఎక్కువగా ఆలోచించకుండా జీవితాన్ని చలాకీగా గడుపుతుంది. ప్రకాష్, గీతాంజలి ల మధ్య పరిచయం క్రమక్రమంగా ప్రేమగా మారుతుంది. కానీ ప్రకాష్‌కి వ్యాధి ఉన్న విషయం గీతాంజలికి తెలియదు.
ఒకరోజు ప్రకాష్ తల్లి అతని దగ్గరకు వచ్చి తన కొడుకు ప్రేమ గురించి తెలుసుకుంటుంది. ప్రకాష్ తన అనారోగ్యాన్ని గీతాంజలి నుండి గోప్యంగా ఉంచుతున్నాడని తెలియక, అతని తల్లి గీతాంజలికి నిజం చెబుతుంది. ప్రకాష్ పరిస్థితి తన పరిస్థితి కంటే దారుణంగా ఉందని తెలిసి ఆమె గుండె పగిలిపోతుంది. వెంటనే గీతాంజలి ప్రకాష్‌ని కలిసి తనను మరచిపోమని చెబుతుంది. ప్రకాష్ గీతాంజలికి గుర్తు చేస్తూ, అందరూ ఏదో ఒకరోజు చనిపోతారని, తాను కూడా చనిపోతానని చెప్పాడు. తన మరణం మినహాయింపు కాదని అతను ఆమెకు చెబుతాడు. కానీ ఒత్తిడికి గురైన గీతాంజలి తనకు తన ప్రాణం కంటే ప్రకాష్ ప్రాణమే ముఖ్యమని, అతని మరణాన్ని తాను చూడలేనని చెబుతుంది. ఆమె తనను విడిచిపెట్టమని ప్రకాష్ ను వేడుకుంటుంది. తనని మళ్ళీ మళ్లీ చూడకూడదని అతనితో చెబుతుంది.
ఒకరోజు రాత్రి గీతాంజలి ఆరోగ్యం విషమించడంతో ఆమెను ఆసుపత్రిలో చేరుస్తారు. ఆ వార్త తెలుసుకున్న తరువాత ప్రకాష్ ఆమెను కలవడానికి ఆసుపత్రికి వెళతాడు. కానీ గీతాంజలి తండ్రి, డాక్టర్ అయిన అతను, గీతాంజలికి ప్రకాష్ ను చూడకూడదు అనే కోరిక ఉన్నందున అతన్ని విడిచిపెట్టమని అభ్యర్థిస్తాడు. చేసేదిలేక ప్రకాష్ విచారంతో ఊరు విడిచి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో గీతాంజలి గుండెకు చికిత్స చేయించుకుంటుంది. ఆమె చికిత్స తరువాత గీతాంజలి నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. ఆమె కోలుకోవడం పట్ల ఆమె కుటుంబం మొత్తం ఆనందంతో ఉంటుంది. గీతాంజలి తన తండ్రితో ప్రకాష్‌ని కలవాలనుకుంటున్నట్లు చెబుతుంది. అతను పట్టణం వదిలి రైల్వే స్టేషన్‌కు వెళ్లాడని కుటుంబీకులు తెలుసుకుంటారు. ప్రకాష్ గీతాంజలిని చూసి వెనక్కి తిరిగి ఆమె దగ్గరకు పరిగెత్తి ఆమె చాచిన చేయి పట్టుకుంటాడు. గీతాంజలి మరియు ప్రకాష్ మళ్లీ కలుస్తూ ముద్దు పెట్టుకోవడంతో సినిమా ముగుస్తుంది.
నిర్మాత సి.యల్.నరసారెడ్డి…
గీతాంజలి సినిమాలో పతాక సన్నివేశాలలో నాయికా, నాయకులను కలిపి విషాద స్వరంతో ముగిస్తాడు మణిరత్నం. ఈ సినిమా మొదట్లో, చివర్లో విషాదం కాకుండా ఈ సినిమా పొడవునా కూడా ఒక విషాద గాథనే అంతర్లీనంగా నడిపిస్తూ, విషాదంగా ఉన్న కథానాయిక, కథానాయకుడు హుషారుగా ఉంటుంటే ప్రేక్షకులు జాలి, కరుణ, వాళ్ళ మనసుల్లో బాధ కలగడం ఇలాంటి చక్కటి భావోద్వేగాలను చక్కగా పండించారు మణిరత్నం గారు. ఈ సినిమా ముప్పై సంవత్సరాల క్రిందట విడుదలైంది. 1980 వ దశకంలో చిరంజీవి గారి యాక్షన్ సినిమాలు బాక్సాఫీస్ మీద గుత్తాధిపత్యం చెలాయించే రోజులవి.
అలాంటి రోజులలో ఇలాంటి విభిన్నమైన చిత్రాన్ని నిర్మించడానికి పూనుకున్న నిర్మాత సి.ఎల్.నరసారెడ్డి. సి.ఎల్.నరసారెడ్డి గారిది నెల్లూరు. వాళ్ల నాన్నగారు కూడా సినిమా రంగంలో పెట్టుబడి పెట్టే వ్యాపారం రంగంలో ఉన్నారు. సి.ఎల్.నరసారెడ్డి గారు డిగ్రీ చేసాక సినిమా రంగంలో కొత్త రకం పెట్టుబడులు పెట్టాలని ఆయన మద్రాసుకు వచ్చి సత్యనారాయణ ఫిలిం ఫైనాన్స్ అనే ఒక కంపెనీని పెట్టారు. 1983లో వాళ్ళ మిత్రుడు సత్యారెడ్డి తో కలిసి కొన్ని సినిమాలకు పెట్టుబడి పెట్టారు. అలాగే ఆయన సొంతంగా భానుచందర్ హీరోగా 1984 – 1985 ప్రాంతాల్లో “హెచ్చరిక” అనే ఒక సినిమాను తీశారు. చిన్న సినిమా అయినా కూడా బాగా ఆడింది. డబ్బులు కూడా బాగా వచ్చాయి. ఈయన మణిరత్నం గారు తీసిన అనువాద చిత్రాలను పంపిణీ చేసేవారు.
వెంకటేష్, నాగార్జున లతో “ఘర్షణ” సినిమా..
మణిరత్నం గారు అగ్ని నక్షత్రం (1988) అనే తమిళ సినిమాను “ఘర్షణ” గా తెలుగులోకి అనువదించారు. ఆ సమయంలో తెలుగులో ఇదే సినిమాను నాగార్జున, వెంకటేశ్ లతో పునర్నిర్మాణం చేద్దామని నిర్మాత సి.ఎల్.నరసారెడ్డి గారికి మణిరత్నం గారికి సూచించారు. కానీ మణిరత్నం గారికి ఈ సినిమాను పునర్నిర్మించడం ఇష్టం లేదు. అప్పటివరకు మణిరత్నం గారు కనడంలోనూ, మలయాళం లోనూ, తమిళంలోనూ, సూటి సినిమాలే తీశారు. ఘర్షణ పునర్నిర్మాణానికి వెంకటేష్ గారు ఒప్పుకున్నారు, కానీ నాగార్జున గారికి ఇష్టం లేదు. అందువలన మణిరత్నం గారికి కూడా ఇష్టం లేదు.
అప్పుడు మణిరత్నం గారు ఈ సినిమా పునర్నిర్మాణం వద్దు. డబ్బింగ్ చేసుకో, నీకు వేరే సినిమా తీసి పెడతానని నిర్మాత సి.యల్.నరసారెడ్డి గారితో అన్నారు. దాంతో సి.యల్.నరసారెడ్డి గారు ఘర్షణ సినిమాని అనువాదం చేసి దానికి కూడా పంపిణీదారులుగా ఉన్నారు. అప్పుడు మణిరత్నం గారు సి.యల్.నరసారెడ్డి గారికి ఈ వైవిధ్యభరితమైన కథను చెప్పారు. మణిరత్నం గారు కథంతా తయారు చేసుకున్నాక సినిమాకు ఏ పేరు పెట్టాలి అని అనుకున్నప్పుడు ఢిల్లీలో ఒక పాప కాన్సర్ బారిన పడి చనిపోయే ముందు ఒక డైరీ వ్రాసుకుంది. ఆ డైరీ చదివి కదిలిపోయిన మణిరత్నం గారు ఈ సినిమాలో కథానాయిక పేరు, ఈ సినిమా పేరు “గీతాంజలి” అని పెట్టారు. ఆ విధంగా గీతాంజలి కథకు ఒక పేరు తయారయ్యింది.
నటీ నటుల ఎంపిక…
ఘర్షణ సినిమా తీద్దామనుకునేటప్పుడు నాగార్జున గారిని కలవడం, ఆ తరువాత గీతాంజలి కథ చెబితే నాగార్జున గారికి నచ్చడం, పైగా మణిరత్నం గారు సూటిగా తెలుగులో తీస్తున్న చిత్రం ఇది కావడంతో ప్రేక్షకుల్లో, పంపిణీదారుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎందుకంటే మణిరత్నం గారు వరుసగా మూడు సూపర్ హిట్ చిత్రాలు ఇచ్చి ఉన్నారు. ఇక నాగార్జున గారు కథానాయకుడిగా ఎంపికయ్యారు. ఇందులో కథానాయిక విషయానికొస్తే హీరోయిన్ పాత్ర చాలా విభిన్నంగా ఆ రోజులలో ఏ హీరోయిన్ ఛాయలలో లేనట్టు ఉంటుంది. అందుకే హీరోయిన్ కొత్తగా ఉంటే బాగుంటుందని కథానాయిక కోసం వెతకడం మొదలుపెట్టారు.
ఇది ఇలా ఉండగా మణిరత్నం, సుహాసిని గార్లకి వివాహం నిశ్చయమవ్వడం, వివాహం జరగడం జరిగింది. పెళ్లి రోజున ఇండియన్ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ గారితో పాటు తన చెల్లెలు, చెల్లెలు వాళ్ళ స్నేహితురాలు వచ్చారు. ఆ స్నేహితురాలు అంతకుముందే లండన్ నుండి వచ్చింది. ఆమె పేరు గిరిజ. వాళ్ళ నాన్నగారు కెనడాలో డాక్టర్ గా స్థిరపడిపోయారు. వారికి వ్యాపారం కూడా ఉంది. వాళ్ళ అమ్మగారు బ్రిటిష్ సంతతికి చెందినవారు. ఆ పెళ్ళికి వచ్చిన గిరజ కథానాయికగా సరిపోతుందని కృష్ణమాచారి శ్రీకాంత్ గారిని మణిరత్నం గారు సంప్రదించడం, శ్రీకాంత్ చెల్లెలు గిరిజతో మాట్లాడడం, దాంతో గిరిజ ఒప్పుకోవడం జరిగింది. ఆ విధంగా లండన్ లో పుట్టి పెరిగిన గిరిజ అనే అమ్మాయిని హీరోయిన్ గా ఆ సినిమాలో తీసుకోవడం జరిగింది.
ఇళయరాజా సంగీతం…
నాగార్జున గిరిజలవే ప్రధాన పాత్రలు, మిగతా పాత్రలన్నీ సహాయ పాత్రలే. నటీనటులలో ఎక్కువగా చెప్పుకోవాల్సింది గిరిజనే. ఎందుకంటే విభిన్నమైన కోణాలలో తన నటనను చూపించాలి కనుక. గిరిజ గారికి ఇంతకుముందు సినిమాలలో నటించిన అనుభవం లేదు. కానీ ఆమె ముఖంలో కథానాయిక పాత్రకు సంబంధించిన నటన మణిరత్నం గారికి కనిపించింది. అందుకని ఆమెను కథనాయికగా తీసుకోవడం జరిగింది. ఆ విధంగా కథ, నటీనటులు సిద్ధమయ్యారు. ఇంకా ఈ సినిమాకు మూలస్థంభం ఇళయరాజా సంగీతం. అంతకుముందు మణిరత్నం గారి సినిమాలన్నింటికీ ఇళయరాజా గారే సంగీతం దర్శకులు.
అలా సహజంగానే ఇళయరాజా గారిని సంగీత దర్శకుడుగా ఎంచుకున్నారు మణిరత్నం గారు. ఇళయరాజా గారి గత సినిమాలు సితార, సాగరసంగమం లాంటి ఎన్నో సినిమాలలో నేపథ్య సంగీతం వైవిధ్యంగా ఉంటుంది. చిత్ర దర్శకుడు తీసిన దృశ్యాలను ప్రేక్షకులకు చేరవేయడంలో నేపథ్య సంగీతం ఎంతైనా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ సినిమాలో కొన్ని సందర్భాలలో ఇళయరాజా గారు అందించిన నేపథ్య సంగీతం ప్రేక్షకుల ఊహలకు అందదు. డిస్కో శాంతి, సుత్తివేలు మధ్యలో జరిగే సన్నివేశాలలో వచ్చే నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటుంది. ఇలా ఏ దృశ్యాన్ని తీసుకున్నా కూడా సినిమా విజయంలో ఇళయరాజా గారి పాత్ర కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది.
“రాజశ్రీ” మాటలు…
ఈ సినిమా విజయానికి ఇంకో మూల స్తంభం “రాజశ్రీ” మాటలు. ఈయన అసలు పేరు “ఇందుకూరి రామకృష్ణ”. అంతకుముందు మణిరత్నం గారి డబ్బింగ్ సినిమాలకు “రాజశ్రీ” గారే మాటలు వ్రాశారు. అంతకు ముందు ఆయన నేరుగా తీసిన సినిమాలు కూడా మాటలు వ్రాశారు. కానీ ఇలా మణిరత్నం గారు సూటిగా తీసే సినిమాకు మాటలు వ్రాయడం తొలిసారి. ఇలా రాజశ్రీ గారు తన సినిమా ప్రస్థానం మొత్తంలో మాటలు వ్రాసిన అద్భుత చిత్రం “గీతాంజలి” సినిమా అని పేర్కొనవచ్చు. ఈ సినిమాకి ముందు తమిళంలో సంభాషణలు విని మణిరత్నం వాటిని సరిచేసి రాజశ్రీ గారితో మాట్లాడి గీతాంజలి లో మనం విన్న సంభాషణలు వ్రాయించారు.
“గీతాంజలి” సినిమా విజయానికి ఇంకో మూలస్థంభం “వేటూరి సుందర రామ్మూర్తి” గారి పాటలు కూడా ఒక కారణమే. ఇళయరాజా గారు ట్యూన్ ఇవ్వడం, ఆ స్వరాలలో కవిత్వాన్ని చొప్పించి పాటలు వ్రాయడం కొందరికే సాధ్యపడింది. మొట్టమొదటి ఆత్రేయ, తరువాత వేటూరి సుందర రామ్మూర్తి, ఆ తరువాత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మాత్రమే. వీరు ఇళయరాజా సంగీతంలో వ్రాసే పాటలలో కవిత్వం పొదిగారు. వేటూరి గారు వ్రాసిన పాటలన్నింటిలోనూ ప్రతీ పాటలో కూడా తాను వ్రాసిన మాటలు “పేదవాడి కంటిలో ప్రేమ రక్తము”, “ఏల కాని ఏలలు రాలుపూల దండలు”, “నయన శృతులకు హృదయ లయలకు, అధరజతులకు”, “ఇరు సందెలు కదలాడే యెద ఊయల వొడిలో” ఇలా పాటలలోని మాటలు కూడా ఈ చిత్ర విజయానికి దోహదం చేశాయి.
పి.సి.శ్రీరాం ఛాయాగ్రహణం…
ఈ సినిమా విజయానికి మరొక మూలస్తంభం చాయాగ్రహకుడు పి.సి.శ్రీరామ్. మణిరత్నం గారి మొట్టమొదటి విజయవంతమైన “మౌనరాగం” చిత్రం నుండి ఆయనే చాయాగ్రహక దర్శకుడు. అంతకుముందు ఆయన తీసిన “నాయకుడు”, “ఘర్షణ” సినిమాలలో కూడా వెలుగునీడలతో చెడుగుడు ఆడాడు. అలాగే ఈ సినిమా లో కూడా. ఒక్క ఫేమ్ కూడా పూర్తి వెలుతురులో గానీ, పూర్తి చీకట్లో గానీ ఉండదు. ఇలా వెలుగునీడల మిశ్రమాన్ని మిళితం చేసి ఒక అద్భుతమైన చిత్రాన్ని అందించాడు పి.సి.శ్రీరామ్. ఈ సినిమాలో ప్రతీ సన్నివేశం, ప్రతీ ఫేములో పి.సి.శ్రీరామ్ యొక్క గొప్పతనం కనిపిస్తుంటుంది. అప్పుడు డి.ఐ (డిజిటల్ ఇంటర్మీడియట్) లేదు. ఇప్పుడు తీస్తున్న సినిమాలు కంప్యూటర్ కి ఎక్కించి రంగులు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఇవన్నీ చేసే అవకాశం ఆ రోజులలో లేదు.
ఈ లైటింగ్ సరిపోతాయా లేదా అనేది ఛాయాగ్రహకుడు కెమెరాలో నుంచి చూసి తనే అంచనా వేసుకోవాలి. అతని అంచనాల మీదనే ఈ సీన్ ఎలా వస్తుందో తెలిసిపోతుంది. అంత ప్రావీణ్యత ఉంటే తప్ప ఆ నాణ్యత కనిపించదు. అలాగే సినిమాలలో చాలా చోట్ల పొగ మంచు కనిపిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ తొంభై నుండి తొంభై అయిదు శాతం వరకు ఊటీలోనే తీశారు. సహజంగానే పొగ మంచు ఉన్నప్పుడు అక్కడ చిత్రీకరణ చేశారు. ఉదయం ఐదు గంటలకు చిత్రీకరణ చేసేవారు. పి.సి.శ్రీరాం గారు నాలుగు గంటలకే అక్కడికి వెళ్లి వెలుతురు లాంటివి చూసుకుంటూ ఉండేవారు. ఈ సహజమైన పొగ మంచు లేనప్పుడు మద్రాసు నుండి రెండు లారీల మంచు తెప్పించి ఆ మంచు నుండి వచ్చే పొగ మంచునే సినిమాలో సహజత్వం కోసం వాడారు. నాగార్జున గిరిజ వాళ్ళ ఇంటికి తలుపులు తీసుకొని వెళ్ళినప్పుడు ఇలాంటి పొగ మంచు వస్తుంది. అంతేకానీ ఎక్కడ కూడా స్నోబాల్స్ వాడలేదు. ఆ విధంగా సంగీతం, మాటలు, పాటలు, పి.సి శ్రీరామ్ ఛాయాగ్రహణం చక్కగా కుదిరాయి.
చిత్రీకరణ…
దర్శకుడిగా మణిరత్నం పనితనం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కథను ఎంచుకోవడమే పెద్ద సాహసం. మణిరత్నం గారు ఈ కథను పండించి మనకు అందించడం గొప్ప వరం అని చెప్పుకోవాలి. అక్టోబరు 1988 లో ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. మణిరత్నం, సుహాసిని జంటకు పెళ్లి అయిన కొత్త రోజులు. ఈ సినిమాకి మొట్టమొదటగా సుహాసిని గారు క్లాప్ ఇచ్చారట. కొన్ని రోజులు చిత్రీకరణలో ఉన్న ఆమె ఆ తరువాత “మమతల కోవెల” సినిమా చిత్రీకరణకు వెళ్లిపోయారు. ఈ సినిమాలో నాగార్జున గారు ఉంటున్న అతిథి గృహం, ఆసుపత్రి, గిరిజ ఉండే ఇల్లు సన్నివేశాలను ఊటీలోనే తీశారు. నాగార్జున గారి నాన్నగారు ఉన్న ఇల్లు, చదివిన కళాశాల లాంటి ఒకటి, రెండు దృశ్యాలు మద్రాసులో చిత్రీకరించారు. కానీ సినిమా ఎక్కువ శాతం ఊటీలోనే తీశారు.
పాటల చిత్రీకరణ…
ఈ సినిమాలో పాటల చిత్రీకరణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒక్కొక్క పాటను ఒక్కొక్క అనుభవం లాగా ప్రేక్షకులకు అనుభూతిని కలిగించేలాగా తీర్చిదిద్దారు. “జల్లంత కవ్వింత కావాలిలే” పాటను నలభై మంది పిల్లలను, ఇరవై అయిదు మంది కుర్రాళ్ళతో జనవరిలో ఉటీలో గడ్డకట్టే చలిలో ఆ పాటను చిత్రీకరించారు. ఆ పాట మధ్యలో వర్షం పడుతూ ఉంటే టోపీ పెట్టుకుని కర్ర పట్టుకుని ఒక వ్యక్తి నృత్యం చేస్తూ ఉంటాడు. ఆయనే ఆ చిత్ర నృత్య దర్శకుడు సుందరం మాస్టారు. ఆయనే ప్రభుదేవా తండ్రి. ఆ పాట మొత్తం కృత్రిమ వర్షం సృష్టించడానికి రెండు అగ్నిమాపక యంత్రాలను (ఫైర్ ఇంజన్లు) మాత్రమే వాడారు. “నందికొండ వాగుల్లో” పాటను ఉటీలో కాకుండా వీనస్ స్టూడియోలో సెట్టింగ్ వేసి చిత్రీకరించారు. “జగడ జగడ జగడ” పాటను మద్రాసులో రేస్ కోర్సులో నలభై కార్లతో సాయంకాలం ఆరు గంటల నుండి అర్ధరాత్రి రెండు గంటల వరకు వారం రోజులు చిత్రీకరించారు.
సింగిల్ షాట్ లో “ఓం నమః” పాట..
“ఓం నమః” అనే పాటను ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పాట. ఇది నాగార్జున, గిరిజల మీద చిత్రీకరించిన పాట. కేవలం సింగిల్ షాట్ లోనే తీశారు. ఎక్కడా కూడా కట్ చేయడం గానీ, ఎడిటింగ్ చేయడం గానీ చేయలేదు. వాళ్ళిద్దరూ ఆ భంగిమలో ఉండగా రౌండ్ ట్రాలీ మీద కెమెరా నాలుగున్నర నిమిషాలు తిరుగుతూనే ఉంటుంది. ఎక్కడా కెమెరా కట్ అంటూ ఉండదు. అలా నాలుగున్నర నిమిషాలు దర్శకుడు తీయడం, ఛాయాగ్రాహక దర్శకుడు దానికి చిత్రీకరించడం, నటీనటులు నటించడం ఒక పెద్ద సాహసం. “ఓ పాపా లాలీ” అనే పాట వెనకాల పొగమంచు కనిపిస్తూ ఉంటుంది. ఆ పొగమంచు సహజంగా లేనప్పుడు మద్రాసు నుండి తెచ్చిన మంచు తీసుకెళ్లి వేశారట. అప్పుడు పొగమంచు బాగా వచ్చేదట. “ఓ ప్రియా ప్రియా” పాటను రాజస్థాన్ లోని జైసల్మేర్ లో చిత్రీకరించారు. జైసల్మేర్ పట్టణం థార్ ఎడారి నడిబొడ్డున ఉంది. ఒక వంద ఒంటెల్ని తెచ్చి వాటితో చిత్రీకరించారు. అందుకే ప్రతీ పాట ఒక మ్యూజిక్ వీడియో లాగా అనిపిస్తుంది. ఈ సినిమాలో కథానాయిక గిరిజకు డబ్బింగ్ చెప్పింది ఎస్పీ శైలజ గారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.
విడుదల…
ప్రేక్షకులు మణిరత్నం సినిమా అనగానే విపరీతమైన అంచనాలతో ఉంటారు. అప్పటికే “మౌనరాగం”, “నాయకుడు”, “ఘర్షణ” సినిమాల విజయాలతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసి ఉన్నారు. కథనాయకుడు నాగార్జున గారికి ఇది పదిహేనవ సినిమా. అప్పటికీ “శివ” సినిమా ఇంకా రాలేదు. తనకు సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఒక్కటీ కూడా లేవు. ఈ సినిమా ప్రివ్యూ చూసిన రాఘవేంద్రరావు గారు సినిమా సూపర్ హిట్ అయినా అవుతుంది, లేదంటే సూపర్ ప్లాఫ్ అయినా అవుతుంది. అంతే కానీ యావరేజ్ గా మాత్రం ఆడదని అన్నారట. ఈ సినిమా విడుదల చేసే సమయానికి కొంతమంది పంపిణీదారులు సినిమా కొనడానికి వెనక్కితగ్గారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు చచ్చిపోతారని, వారు చనిపోతే సినిమా ఎవరు చూస్తారని వాళ్ళ అభిప్రాయం. అసలే చిరంజీవి గారి సినిమాలు విజయవంతంగా ఆడుతున్న రోజులు అవి. తన సినిమాల ముందు ఇది నడుస్తుందా అని పంపిణీదారులు వెనక్కితగ్గారు. దాంతో నిర్మాత గారే సొంతంగా 19 మే 1989 నాడు విశాఖపట్నంతో బాటు ఇంకా రెండు జిల్లాలలో విడుదల చేసుకున్నారు. అధిక లాభాలు వచ్చాయి. అలా విడుదల సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వారం తరువాత ఊపందుకున్న కలెక్షన్లు..
సినిమా విడుదలైన తర్వాత మొట్టమొదటి వారం కలెక్షన్లు లేవు. ఆ తరువాత కలెక్షన్లు ఊపందుకున్నాయి. ప్రేక్షకులు నటీనటులతో, సినిమాతో ప్రయాణం చేసి వాళ్ళ బాధలను తమ బాధలనుకుని ఆ సినిమాను విజయవంతం చేశారు. మొదటివారం తరువాత విజయపరంపర మొదలైంది. ఈ సినిమా విజయవంతం అవుతుందని నాగార్జున గారికి మొట్టమొదటి నుండి నమ్మకం. “ఇంకెంతకాలం వీళ్ళు బ్రతుకుతారో లేదో తెలియదు గానీ, వీళ్ళు బ్రతికినంత కాలం సంతోషంగా ఉంటారు” అని చిట్టచివరి వాక్యంగా ముగింపునిస్తారు. ముగింపు ఈవిధంగా ఉంటుందని ముందుగా ఎవ్వరూ ఊహించలేదు. ముగింపులో హీరో హీరోయిన్లు చనిపోవడం ఏంటి? వారు చనిపోకుండా చూడాలని నాగార్జున అభిమాన సంఘం వారు వెళ్లి దర్శకులు మణిరత్నం గారికి విన్నవించుకున్నారు. అభిమాన సంఘం అధ్యక్షుడు సూచన మేరకు పై వాక్యము ముగింపులో వేశారని చెబుతారు
తమిళం లోనూ విజయవంతం…
ఆ సినిమాలో గిరిజ వేసుకున్న దుస్తులు గీతాంజలి దుస్తులుగా ఆ రోజులలో ప్రేక్షకులలో విపరీతమైన ఆదరణ పొందాయి. సినిమా వాల్ పోస్టర్లు కూడా ఆ రోజులలో విపరీతమైన సంచలనం. వాల్ పోస్టర్లు కళాత్మకంగా నిలిచాయి. ఈ సినిమా విజయవంతం అవ్వడమే కాకుండా ఎన్నో నంది అవార్డులను అందుకుంది. ఉత్తమ కథా రచయిత (మణిరత్నం), ఉత్తమ హాస్యనటులు (సుత్తివేలు), ఉత్తమ నృత్య దర్శకులు (సుందరం మాస్టర్), ఉత్తమ ఛాయాగ్రహకులు (పి. సి. శ్రీరామ్), ఉత్తమ కళా దర్శకులు (తోట తరణి) ఇలా చాలా పురస్కారాలను గెలుచుకుంది. ఈ సినిమాను తరువాత మలయాళం లోకి అనువదించారు. ఓ మాదిరిగా ఆడింది. ఈ సినిమాను తమిళంలోకి అనువదించారు. తమిళంలో ఈ సినిమా చాలా అద్భుతంగా ఆడింది. నిర్మాతకి తెలుగు సినిమా కంటే కూడా తమిళ సినిమాకే ఎక్కువ లాభాలు వచ్చాయి. ఇదే సినిమాను వేరే నిర్మాత
దీపక్ ఆనంద్ దర్శకత్వంలో “యాద్ రాఖేగీ దునియా” పేరుతో హిందీలో తీశారు.
అవకాశాలు వదులుకున్న నటి గిరిజ…
ఈ సినిమా హిందీలో సరిగ్గా ఆడలేదు. ఈ సినిమా తరువాత నటి గిరిజకు విపరీతమైన అవకాశాలు వచ్చాయి. రజనీకాంత్ గారు ఫోన్ చేసి మెచ్చుకున్నారు. తన సరసన నటించమని కూడా అడిగారు. నటి గిరిజ గారు ఆ తరువాత “వందనం” అనే మలయాళ సినిమాలో నటించారు. “హృదయాంజలి” అనే సినిమా 1992లో చిత్రీకరణ జరుపుకొని 2002లో విడుదల అయ్యింది. ఆ రెండు సినిమాల తరువాత హిందీ సినిమాలో ఒక పాటలో నటించారు. ఆ సినిమా తర్వాత భారతదేశం వదిలి లండన్ వెళ్లిపోయారు. ఆమె ఆధ్యాత్మిక రంగంలో ఉండటం వలన సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చానని టీవీ9 కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె లండన్ వెళ్లిపోయాక ఒక సినిమాలో నటించారు. ఆమె ఆధ్యాత్మిక మార్గంలో, వేదాంత ధోరణిలోనే ఉన్నారు.