
టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు అనగానే గుర్తొచ్చే పేరు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్‌ను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించారు. అయితే, ఆయన దర్శకునిగా తీసిన మొదటి చిత్రమైన ‘నువ్వే నువ్వే’ మూవీ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమా కథను త్రివిక్రమ్ ‘నువ్వే కావాలి’ షూటింగ్ జరుగుతున్నప్పుడు ‘స్రవంతి’ రవికిశోర్ కు చెప్పారు. ఆ కథ నచ్చిన ఆయన వెంటనే అడ్వాన్స్‌ను త్రివిక్రమ్ కు అందజేశారు. నువ్వేకావాలి షూటింగ్ పూర్తయిన వెంటనే స్రవంతి మూవీస్ పతాకంపై ఈ సినిమా నిర్మాణం మొదలైంది.
హీరోగా తరుణ్‌ను, హీరోయిన్గా శ్రియను ఎంపిక చేశారు. ప్రకాశ్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ, శిల్పా చక్రవర్తి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రేమ, కుటుంబ అనుబంధాలకు కొద్దిగా కామెడీ జత చేసిన చిత్రంగా ఈ సినిమాను రూపొందించారు.
‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రాసిన పాటలు, కోటి అందించిన సంగీతం, త్రివిక్రమ్ డైలాగులు ఈ సినిమా స్థాయిని మరింత పెంచేశాయి. హరి అనుమోలు సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, పేకేటి రంగ ఆర్ట్ విభాగాల్లో వారి శైలిని చూపించారు. తరుణ్-శ్రియ లవ్ సీన్స్, ప్రకాశ్ రాజ్-శ్రియ మధ్య సన్నివేశాలు చాలా గొప్పగా ఉంటాయి. హైదరాబాద్, అన్నవరం, ఊటీ, ముంబై, స్విట్జర్లాండ్ లొకేషన్లలో చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశారు. ‘అయామ్ వెరీ సారీ’ పాటను ఊటీలోని ఓ కాలేజీలో షూటింగ్ చేయగా.. అప్పట్లోనే ఈ పాటకు అరవై లక్షలు వరకూ ఖర్చయింది.
2002వ సంవత్సరం అక్టోబర్ 10న విడుదలైన ఈ చిత్రం నిర్మాతకు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాకుండా.. ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణను సొంతం చేసుకుంది. 2002 నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రం విభాగంలో ‘సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్’గా వెండి నంది అవార్డును గెలుచుకుంది. ఉత్తమ సంభాషణల రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ నంది అవార్డు అందుకున్నారు. ఫిలింఫేర్ సౌత్ అవార్డుల్లో ఉత్తమ సహాయ నటుడిగా ప్రకాశ్ రాజ్ పురస్కారం అందుకున్నారు.