Telugu Cinema

ఆయన హాస్యం చెరగనిది.. అల్లురామలింగయ్య!

పలు పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో అల్లురామలింగయ్య పంచిన హాస్యం చెరగనిది..   

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వెయ్యికి పైగా సినిమాలలో నటించిన అల్లురామలింగయ్య హాస్య ప్రధాన పాత్రలే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, సహాయ పాత్రల్లో కూడా నటించి మెప్పించారు.

ఇక సినిమాల్లోకి రాకముందు హోమియోపతి వైద్యులు, అలాగే స్వాతంత్ర సమరయోధుడు కూడా..

‘ముత్యాలు వస్తావా’ అనే పాటలో ఆయన అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. అప్పట్లో అదో పెద్ద హిట్. ఆయన హాస్యం మూడు తరాల సినీ ప్రేక్షకులను అలరించిందంటే  మామూలు విషయం కాదు. ఈయన్ను పద్మశ్రీ సైతం వరించింది.

కుమారుడు అల్లు అరవింద్ పెద్ద నిర్మాత, అల్లుడు మెగాస్టార్ చిరంజీవి, మనవడు అల్లు అర్జున్ స్టార్ హీరో గా నిలవడం విశేషం. అటువంటి విశిష్ట నటులు అల్లు రామలింగయ్య వర్ధంతి నేడు(జూలై 31).. ఈ సందర్భంగా ఆయన జీవిత, సినీ విశేషాలను ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం:

జననం

1922 అక్టోబర్ 1న, పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో జన్మించారు అల్లురామలింగయ్య. తల్లిదండ్రులు అల్లు వెంకయ్య, సత్తెమ్మ. వీరికి మొత్తం ఏడుగురు సంతానం. క్షీరా రామలింగేశ్వరుడి పేరునే అల్లు రామలింగయ్యకు పెట్టారు. ఆయన పెద్దగా చదువుకోలేదు. ఊర్లో ఉన్న స్నేహితులతో కలిసి, ఆకతాయిగా తిరుగుతూ, అందరినీ అనుకరిస్తూ నవ్వించేవారు. ఇదే సరదా.. ఆయన్ను నాటకాల్లో నటించేలా ప్రోత్సహించింది. ఇలా ఊర్లో జరిగే నాటకాలకు హాజరయ్యేవారు. వారి వెంటే తిరుగుతూ, పరిచయం పెంచుకుని, దైనా చిన్న వేషం ఉంటే అవకాశం ఇవ్వమని అడిగేవారట. అలా ఆయనకు మొదటిసారి ‘భక్త ప్రహ్లాద’ అనే నాటకంలో బృహస్పతి వేషం వేసే అవకాశం వచ్చింది. అదీ కూడా డబ్బులు ఆయనే తిరిగి ఇచ్చేట్లుగా ఒప్పందం కుుర్చుకున్నారు. నాటకానుభవం పెద్దగా లేకపోయినా, కొద్దిపాటి నటనావగాహనతో తన వేషంతో జనాల్ని మెప్పించారు. ఇది మొదలు నాటకాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. 

చలనచిత్ర జీవితం

అల్లువారి నాటకాలు చూసిన గరికపాటి రాజారావుగారు చిత్రసీమలో తొలిసారిగా, 1952లో ‘పుట్టిల్లు’ అనే చిత్రంలో శాస్త్రి పాత్రను వేయించారు. ఆ తరువాత హెచ్.ఎం.రెడ్డి ‘వద్దంటే డబ్బు’లో అవకాశం వచ్చింది. ఈ చిత్రాలు తీస్తున్న దశలోనే తన భార్య, నలుగురు పిల్లలతో మదరాసుకు మకాం మార్చారు. హొమియో వైద్యం తెలిసిన ఈయన, తీరికవేళల్లో ఉచితంగా వైద్య సేవలు అందించేవారట.

ఎన్టీఆర్, ఏయన్నార్ హీరోలుగా రూపొందిన అనేక చిత్రాలలో హాస్యాన్ని సైతం వైవిధ్యంగా పలికిస్తూ.. ఆయనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు రామలింగయ్య. హాస్యంతో పాటు విలనిజాన్ని పోషించారు. పాత్ర ఏదైనా, అలవోకగా చేసే నైజం ఆయనది.

1970లలో రూపొందిన వందలాది చిత్రాలలో అల్లురామలింగయ్య నవ్వులు పూయిస్తూ సాగారని చెప్పుకోవాలి. అది కూడా ఒకేరోజున నాలుగు చిత్రాలలో వైవిధ్యమైన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. అప్పట్లో ఆయన కాల్ షీట్స్ కోసం నిర్మాతలు, దర్శకులు పడికాపులు కాచేవారట. 

మూగమనసులు, దొంగరాముడు, మాయా బజార్, ముత్యాల ముగ్గు, మనవూరి పాండవులు, అందాలరాముడు, శంకరాభరణం మొదలైనవి హిట్ చిత్రాలు. (ముత్యాలముగ్గు సినిమా చిత్రీకరణ సమయంలో ఆయన కుమారుడు ఆకస్మికంగా మరణించినా, బాధను దిగమింగి షూటింగ్ లో పాల్గొన్నారు). 

అల్లు రామలింగయ్య నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ ని నెలకొల్పి బంట్రోతు భార్య, దేవుడే దిగివస్తే, బంగారు పతకం వంటి చిత్రాలను నిర్మించారు. చాలాకాలం తర్వాత, 90ల్లో డబ్బు భలే జబ్బు అనే చిత్రం తీశారు. 

ఇలా 2004 నాటికి 1,030కి పైగా చిత్రాల్లో విలక్షణ పాత్రల్ని పోషించారు.

ఆయనదాకా వచ్చిన ప్రతి పాత్రలో నటించి, అందర్నీ అలరించారు. తేజ దర్శకత్వంలో రూపొందిన ‘జై’ చిత్రం చివరిది. 1116 చిత్రాల్లో నటించాలనే ఆయన కోరిక తీరనేలేదు. 

కుటుంబం

ఆయన తనయుడు అల్లు అరవింద్ ప్రముఖ నిర్మాత. ఆయన బతికి ఉన్న సమయంలో నెలకొల్పిన గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ ఈనాటికీ ఎంతోమందికి యువతకు అవకాశాలు కల్పిస్తోంది.

అల్లు రామలింగయ్య చిన్నల్లుడు, తెలుగు పరిశ్రమకు పరిచయం అక్కర్లేని మెగాస్టార్ చిరంజీవి, ఇక రామలింగయ్య మనవళ్ళు అయిన అల్లుఅర్జున్, రామ్ చరణ్ ఈ తరం టాప్ హీరోలుగా నిలిచారు.

ఇప్పటివరకు ఏ హాస్యనటుని వారసత్వమూ ఇంతలా కొనసాగలేదంటే అతిశయోక్తి కాదు. అది అల్లువారికే చెల్లింది.

ఇక అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని అల్లు బ్రదర్స్‌ ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని అల్లు స్టూడియోస్‌లో కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు.

గుర్తింపు

*1990లో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ ‘ అవార్డుతో గౌరవించింది.(రేలంగి తరువాత ‘పద్మశ్రీ’ అందుకున్న హాస్యనటుడు అల్లునే.)

*2001లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత ‘రఘుపతి వెంకయ్య’ అవార్డు ఇచ్చింది. పాలకొల్లులో ఏకంగా ఆయన విగ్రహాన్ని నెలకొల్పారు. 

*2013లో భారత చలనచిత్ర పరిశ్రమ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో విడుదలైన 50 తపాలాబిళ్ళలలో ఒకటి అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం విడుదలైంది. 

*2004 జూలై 31న 82వ ఏటా కన్నుమూశారు.

ఇతర విషయాలు 

*ఈయన అంటరానితనంపై బాగా పోరాడారు. కులమతవిభేదాలను పూర్తిగా వ్యతిరేకించారు.

యవ్వనంలో ఉన్నప్పుడు తన ముందు ఓ నిమ్నకులస్తుడ్ని అగ్రవర్ణాలవారు అవమానిస్తే, ఆక్రోశంతో వారికి దేహశుధ్ధి చేశారు. ఈ కారణం మీద జైలుకు సైతం వెళ్లారట. 

*అప్పట్లో గాంధీజీ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లారట. జైలులో కూడా తోటివారిని పోగేసుకుని నాటకాలు వేశారు.

*మనుషులంతా ఒక్కటే సినిమాలో రామలింగయ్య మీద తీసిన ‘ముత్యాలు వస్తావా’ పాట సూపర్ హిట్ అయ్యింది.

ఆయన అభినయించిన చాలా పాటలకు ఎస్పీ బాలు గళం సరిగా సరిపోయేది.

*మూగమనసులు సినిమా చేసేనాటికి పారితోషికం రెండు ఐదొందలు ఉంటే, 2003నాటికి గానీ ఆయన అత్యధిక పారితోషికం లక్ష రూపాయలు అందుకోలేదట. 

*ఆమ్యామ్య, అప్పుం అప్పుం.. లాంటి ఊతపదాలు ఆయన సృష్టించినవే.

*ఆ రోజుల్లో అధికారులు 40 ఏళ్లకు బర్త్‌ సర్టిఫికెట్‌ తీసుకువస్తేనే, ప్రవేశ పరీక్ష రాయకుండానే ఆర్ఎంపీ సర్టిఫికెట్‌ ఇస్తామని చెప్పింది.

ఇందుకు రామలింగయ్య గారు ‘లేదు నాకు 39 ఏళ్ళే, నేను పరీక్ష రాస్తాన’ని చెప్పడమే కాక ఆ పరీక్షలో ఉత్తీర్ణులై, హోమియోపతి డాక్టరుగా పేరు సంపాదించుకున్నారు.

ఎంతోమందికి ఉచితంగా  వైద్య సేవలు అందించి పలువురికి ఆదర్శమయ్యారు.

హాస్యంలోంచి విలనిజాన్ని, విలనిజంలోంచి హాస్యం సాధించిన విశిష్ట నటులు!!

Show More
Back to top button