CINEMATelugu Cinema

తెలుగు చిత్రసీమలో సాత్విక పాత్రలకు పెట్టింది పేరు.. జూనియర్ శ్రీరంజని..

వాహినీ స్టూడియోస్” సినీ నిర్మాణ సంస్థ వారు విజయవంతమైన చిత్రం నిర్మించాలని భావించి షేక్స్‌పియర్ వ్రాసిన “కింగ్ లియర్” నాటకం నుండి ప్రధాన అంశాన్ని తీసుకుని, దానికి మార్పులు, చేర్పులు చేసి ఒక కథ రూపొందించారు. దర్శకులు కె.వి. రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాకి పింగళి, కామేశ్వరరావులు కలిసి స్క్రిప్టును తయారు చేశారు. ఆ సినిమా పేరు “గుణసుందరి కథ”. ఈ సినిమాలో కథానాయకుడిగా హాస్యనటుడు కస్తూరి శివరావును ఎంపిక చేయగా, కథానాయికల తండ్రి ఉగ్రసేన మహారాజుగా గోవిందరాజుల సుబ్బారావును ఎన్నుకున్నారు.

“గుణసుందరి కథ” సినిమాకు ముఖ్యమైన కథానాయిక గుణసుందరి పాత్రలో ఒక కొత్త నటిని తీసుకున్నారు. అది సాత్వికమైన పాత్ర, ఆ పాత్రకు ఆమె తగదు అని ఎంతో మంది దర్శకులు కె.వి. రెడ్డిని వారించారు. కానీ ఆయన వినలేదు. ఎందుకనో తెలియదు. ఆ పాత్రకు ఆమె తప్పనిసరిగా న్యాయం చేయగలదు అని ఆయన బలంగా నమ్మారు. ఆ నమ్మకం నిజమైంది. 1949 లో విడుదలైన “గుణసుందరి కథ” సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఆ కథానాయిక కూడా ఆ పాత్రను అద్భుతంగా పోషించి సాత్వికమైన పాత్రలకు తాను తగును అని నిరూపించుకుంది. ఆమె మంగళగిరి మహాలక్ష్మి. ఆమె సీనియర్ శ్రీరంజనికి స్వయానా చెల్లెలు. ఆ కారణం చేతనే ఆమెను జూనియర్ శ్రీరంజని అన్నారు.

తన అక్క సీనియర్ శ్రీరంజని నటించిన చిత్రాలు తొమ్మిది, అయినా చిత్రసీమలో మంచి పేరు గడించారు. చెల్లి జూనియర్ శ్రీరంజని డెబ్భైకి పైగా చిత్రాలలో నటించారు. ఆమె కూడా చిత్రపరిశ్రమలో నటనలో మంచి మార్కులు సంపాదించారు. ఎలాంటి నటనానుభవం లేకపోయినా 1944 వ సంవత్సరంలో “భీష్మ” సినిమాతో సినిమాల్లోకి ప్రవేశించిన జూనియర్ శ్రీరంజని కథానాయికగా, ఇల్లాలి పాత్రలో, గుణచిత్ర నటిగా ఎన్నో పత్రాలను పోషించారు. ప్రధానంగా ఆమె  దీర్ఘకాలం భార్య పాత్రలకు ప్రసిద్ధి చెందారు. జూనియర్ శ్రీరంజని తమిళ చిత్రం “పరాశక్తి” లో ధర్మబద్ధమైన హిందూ స్త్రీ పాత్రలో నటించి పురుషులకు ఆదర్శంగా ప్రతిబింబించే పాత్రలో నటించారు.

ఎల్‌.వి. ప్రసాద్ “గృహప్రవేశం” చిత్రంతో సి.ఎస్‌.ఆర్. ఆంజనేయులుకు స్నేహితురాలు లలితగా తెలుగులో సినిమాలలోకి ప్రవేశించారు. కమలాకర కామేశ్వరరావు, కె.వి.రెడ్డి మరియు పి.ఎస్. రామకృష్ణారావుల చిత్రాలలో ఆమె నటించారు. కథానాయికగా సినిమాలలో రాణించడానికి ముందే సిటీ లైట్స్ (1931) రీమేక్‌లో రాజీ ఎన్ కన్మణి (1954) లో ఆమె అంధ బాలికగా నటించారు. ఆమె అనారోగ్య కారణంగా 1964 వ సంవత్సరంలో చలనచిత్రాలలో నుండి విరమించుకున్నారు. ఆ తరువాత ఆమె 1969 తరువాత కొన్ని అతిథి పాత్రలను పోషించడానికి తిరిగి సినిమా రంగంలోకి తిరిగి వచ్చి ఐదు సంవత్సరాల వరకు వృద్ధులైన తల్లి పాత్రలు పోషించి 1974 లో సినిమా రంగంనుండే కాకుండా జీవన రంగం నుండి నిష్క్రమించారు.

అక్క సీనియర్ శ్రీరంజని సినిమాలలో నటించే సమయానికి ఈమె చిన్నపిల్ల. అక్కతోబాటు జూనియర్ శ్రీరంజని కూడా చిత్రీకరణకు వెళుతుండడంతో చిన్నప్పుడు ఆమెకు బాల నటిగా రెండు, మూడు చిత్రాలలో అవకాశం కల్పించారు. అలా చిన్నతనంలో ఒకటి, రెండు సినిమాలలో నటించిన అనుభవం తప్ప నటనానుభవం లేని జూనియర్ శ్రీరంజనికి యాదృచ్చికంగానే సినిమా అవకాశాలు రావడం, వాటిని వినియోగించుకోవడం, సాత్వికమైన పాత్రలలో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం చేశారు జూనియర్ శ్రీరంజని.

అక్క సీనియర్ శ్రీరంజని క్యాన్సర్ వ్యాధికి గురై అతి చిన్న వయస్సులో (33 సంవత్సరాలకే) 1939లో తన స్వగ్రామంలోనే కీర్తిశేషులవ్వడంతో, ఆమె అభీష్టం మేరకు ఆమె ముగ్గురు పిల్లల బాధ్యత తీసుకుని జూనియర్ శ్రీరంజని తన అక్క భర్త నాగుమణిని వివాహం చేసుకున్నారు. రెండేళ్లు గుంటూరులో కాపురం చేశారు. ఆ తరువాత చిత్రపు నారాయణ మూర్తి తెరకెక్కించిన భీష్మ (1944) చిత్రంతో అరంగేట్రం చేసినా, ప్రముఖ దర్శకులు కె.వి.రెడ్డి చిత్రం “గుణసుందరి కథ” సినిమాలో “గుణసుందరి” పాత్ర ద్వారా ఆమె పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. ఆ తరువాత “చంద్రహారం” అనే భారీ చిత్రంలో కథానాయికగా నటించారు. “మంత్రదండం”, “సంక్రాంతి”, “ప్రేమ”, “బ్రతుకు తెరువు”, “స్వయంప్రభ”, “రామాంజనేయ యుద్ధం” వంటి అనేక చిత్రాలలో ఆమె నటించారు.

జీవిత విశేషాలు.

జన్మనామం  :   జూనియర్ శ్రీరంజని

ఇతర పేర్లు  :   మంగళగిరి మహాలక్ష్మి 

జన్మదినం :  22 ఫిబ్రవరి 1927

స్వస్థలం :    మురికిపూడి, నరసరావుపేట, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.

తల్లి    :     వీరమ్మ 

జీవిత భాగస్వామి :    నాగుమణి  

పిల్లలు :    అక్కయ్య పిల్లలు ముగ్గురు (వారిలో ఒకరు యం. మల్లికార్జున రావు) 

మరణ కారణం  :   అనారోగ్యం 

మరణం :    27 ఏప్రిల్ 1974

నేపథ్యం…

జూనియర్ శ్రీరంజని అసలు పేరు మంగళగిరి మహాలక్ష్మి. ఆమె 22 ఫిబ్రవరి 1927 నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకా మురికిపూడి గ్రామంలో జన్మించారు. ఆమె తల్లి పేరు వీరమ్మ. ఆమెకు నలుగురు పిల్లలు. ఈ నలుగురి పిల్లలలో పెద్దామె సీనియర్ శ్రీరంజని. మంగళగిరి మహాలక్ష్మి నలుగురిలో చివరిది. పెద్దామె సీనియర్ శ్రీరంజని సినిమాలలో నటిస్తున్నప్పుడు అక్కతో బాటుగా మంగళగిరి మహాలక్ష్మి చిత్రీకరణకు వెళ్లేవారు. ఆ సమయంలో ఆయా చిత్రాలలో బాల నటులు అవసరమైనప్పుడు ఆ పాత్రలను మహాలక్ష్మితో  వేయించేవారు. ఆవిధంగా “సతీతులసి”, “నరనారాయణ”, “మార్కండేయ” లాంటి చిత్రాలలో బాలనాటిగా ఆమెకు అవకాశాలు వచ్చాయి.

కానీ ఆమె భవిష్యత్తులో కథానాయిక అవుతుందని, జూనియర్ శ్రీరంజనిగా గుర్తింపు తెచ్చుకుని అందరినీ అలరిస్తుందని అప్పట్లో ఎవ్వరూ అనుకోలేదు. సీనియర్ శ్రీరంజనికి 1939లో జబ్బు చేసింది. ఇక తాను బ్రతకతని ఆమెకు అర్థమైపోయింది. తల్లి వీరమ్మ, చెల్లెలు మహాలక్ష్మి, భర్త నాగుమణి దగ్గరికి పిలిచిన సీనియర్ శ్రీరంజని తాను మరణించగానే తన చెల్లెలు మహాలక్ష్మిని తన భర్త నాగుమణికి  ఇచ్చి వివాహం చేయాలని, లేకపోతే తన పిల్లలు అన్యాయమైపోతారని వారి వద్ధ మాట తీసుకుంది. అందువలన అక్క మాటను పాటిస్తూ బావ నాగుమణిని 1940 వ సంవత్సరంలో వివాహమాడారు.

చిత్ర రంగ ప్రవేశం…

సీనియర్ శ్రీరంజనికి ముగ్గురు పిల్లలు. పెద్దబ్బాయికి పదిహేను సంవత్సరాలు, రెండవ అబ్బాయికి నాలుగు సంవత్సరాలు, చిన్నబ్బాయికి రెండు సంవత్సరాలు. ఒకరికి ఇంకొకరికి మధ్య వయస్సులో వ్యత్యాసం చాలా ఉంది. ఈ ముగ్గురు పిల్లలు పోషించే బాధ్యతను జూనియర్ శ్రీరంజని తీసుకున్నారు. అక్క భర్త నాగుమణికి వివాహం ఆడిన మహాలక్ష్మి, పిల్లలతో కలిసి గుంటూరు వెళ్లిపోయారు. అక్కడ రెండేళ్లు ఆమె గృహిణిగానే జీవనం గడిపారు. ఒకరోజు వీళ్ళింటికి బెజవాడ నుండి హనుమాన్ దాస్ వచ్చారు. ఆయన మహాలక్ష్మికి మేనమామ మాత్రమే కాదు, సీనియర్ శ్రీరంజిని, నాగుమణికి గురువు కూడా. మహాలక్ష్మి కూడా పాటలు పాడుతుండేవారు. ఆ పాటలు విన్న హనుమాన్ దాస్ ఆమెను సినిమాలలో నటింపజేస్తే బాగుంటుందని, నాగుమణికి చిత్ర పరిశ్రమలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి గనుక అదేమంత కష్టం కూడా కాదని సలహా ఇచ్చారు. హనుమాన్ దాస్ ఇచ్చిన సలహా మంగళగిరి మహాలక్ష్మి భర్త నాగుమణికి మంచిగానే తోచింది. 

భీష్మ (1944)…

పౌరాణిక చిత్రాలను రూపొందించడంలో ఘనాపాటి అయిన దర్శకులు చిత్రపు నారాయణమూర్తి బెజవాడకు వచ్చిన సమయంలో ఆయనను కలిసి భార్య మంగళగిరి మహాలక్ష్మి గురించి చెప్పారు భర్త నాగుమణి. దానికి అంగీకారంగా తాను త్వరలో తీయబోయే భీష్మ చిత్రంలో ఆమెకు అవకాశం ఇస్తానని దర్శకులు హామీ ఇచ్చారు. ఈలోపు మహాలక్ష్మికి కొంత నటనా అనుభవం ఉండడం మంచిదని గ్రహించిన నాగుమణి దైతా గోపాలం దగ్గర శిక్షణ ఇప్పించారు. కొంతకాలం తర్వాత చిత్రపు నారాయణమూర్తి నుండి పిలుపు రాగానే భర్తతో కలిసి మద్రాసు చేరుకున్నారు మంగళగిరి మహాలక్ష్మి. ఆమెకు మేకప్ టెస్ట్ చేసిన తరువాత భీష్మ చిత్రంలో సత్యావతి పాత్రకు ఆమెను తీసుకున్నారు చిత్రపు నారాయణమూర్తి (భర్త పోయిన అనంతరం వచ్చే సత్యావతి పాత్రను ఛాయాగ్రాహకులు రెహమాన్ భార్య లలిత పోషించారు). ఈ సినిమాలో మంగళగిరి మహాలక్ష్మి రెండు పాటలు కూడా పాడారు. భీష్మ పంపిణీదారులైన చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్ మంగళగిరి మహాలక్ష్మి అలనాటి నటి శ్రీరంజిని చెల్లెలు అని తెలుసుకుని తొలిసారిగా “జూనియర్ శ్రీరంజని” అనే పేరుతో పబ్లిసిటీ ఇచ్చారు. భీష్మ చిత్ర విజయంతో ఆమెకు “జూనియర్ శ్రీరంజని” అనే పేరు స్థిరపడింది.

మలుపు తిప్పిన “గుణ సుందరి కథ”…

నిజానికి మంగళగిరి మహాలక్ష్మి నటించిన భీష్మ చిత్రం విడుదల సమయంలో పోతిన శ్రీనివాస రావు (తెలుగు సినిమా నిర్మాత, దర్శకులు డూండీ తండ్రి) ఆమె పేరును జూనియర్ శ్రీరంజనిగా మార్చారు. భీష్మ చిత్రం విజయవంతం అయిన తరువాత జూనియర్ శ్రీరంజని వరుసగా గృహప్రవేశం (1946), బ్రహ్మ రథం (1947), గొల్లభామ (1947), మదాలస (1948), గీతాంజలి (1948) లాంటి సినిమాలలో నటించారు. మధిర సుబ్బన్న దీక్షితులు తెలుగులో వ్రాసిన “కాశీ మజిలీ కథలు” ఆధారంగా “శోభానాచల పిక్చర్స్” ద్వారా మీర్జాపురం రాజా నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకులు చిత్తజల్లు పుల్లయ్య తెరకెక్కించారు. ఈ గొల్లభామ చిత్రంతోనే “అంజలీదేవి” సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ సినిమాలో జూనియర్ శ్రీరంజనితో బాటు ఆ తరువాత రోజులలో దర్శకత్వం చేసిన సీనియర్ శ్రీరంజని అబ్బాయి ఎం.మల్లికార్జున రావు లాంటి వారు నటించారు.

ఈ నాలుగు చిత్రాలలో జూనియర్ శ్రీరంజని నటించినప్పటికీ అవేమీ కూడా ఆమె సినీప్రస్థానానికి సాయం కాలేదు. అయితే అదే సమయంలో వౌహిని స్టూడియోస్ నిర్మాణంలో కదిరి వెంకట రెడ్డి (కె.వి. రెడ్డి) తెరకెక్కించిన “గుణసుందరి కథ” జూనియర్ శ్రీరంజని నట జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ చిత్రంలో శ్రీరంజనికి కథానాయికగా అవకాశం ఇచ్చి ఎంతో మేలు చేశారు దర్శకులు కె.వి.రెడ్డి. ఆమెను కథానాయికగా తీసుకోవద్దని ఆయనను ఎంతమంది వారించినా వినకుండా ఆమె మీద నమ్మకంతో కె.వి. రెడ్డి ఆ పాత్రను ఇవ్వడం, దానిని ఆమె సమర్ధవంతంగా పోషించి, వచ్చిన అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకోవడం జరిగింది. “గుణసుందరి కథ” చిత్రం ఘన విజయం సాధించి జూనియర్ శ్రీరంజిని నటనా జీవితాన్ని విజయపథం వైపు కొనసాగడానికి దోహదం చేసింది.

సాత్విక పాత్రలలో…

1949 లో విడుదలైన “గుణసుందరి కథ” జూనియర్ శ్రీరంజని సినీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. షేక్సిపియర్ రచించిన ప్రముఖ ఆంగ్ల నాటకం “కింగ్ లియర్ నాటకం” ప్రేరణతో నిర్మితమైన చిత్రం “గుణసుందరి కథ”. కె.వి. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఆ సినిమా విపరీతమైన వసూళ్లను సాధించిపెట్టింది. దాంతో జూనియర్ శ్రీరంజని పేరు మార్మోగిపోయింది. జూనియర్ శ్రీరంజని తన అక్క సీనియర్ శ్రీరంజని సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అక్క నటించినటువంటి సాత్వికమైన పాత్రలు జూనియర్ శ్రీరంజనికి కూడా సాధ్యం అనే పేరు “గుణసుందరి కథ” సినిమా ద్వారా సంపాదించారు.

గుణసుందరి కథ సినిమా చూసిన దర్శకులు కృష్ణన్ సంజు తన తమిళ చిత్రం “పరాశక్తి” లో అవకాశం ఇచ్చారు. ఇందులో హీరో శివాజీ గణేషన్ సరసన ఇదే ఆమె తొలి తమిళ చిత్రం. ఆ తరువాత “లైలా మజ్ను”, “గృహప్రవేశం”, “చంద్రహారం”, “శ్రీ గౌరీ మహత్యం”, “ఊహ సుందరి”, “మంత్రదండం”, “బ్రతుకుతెరువు”, “రాజీ నా ప్రాణం”, “పెద్ద మనుషులు”, “శ్రీకృష్ణ తులాభారం”, “పెంకి పెళ్ళాం”, “సంతానం”, “కృష్ణ లీలలు”, “ప్రేమే దైవం”, “శ్రీ గౌరీ మహత్యం”, “శ్రీకృష్ణార్జున యుద్ధం”, “మహాకవి కాళిదాసు”, “నేనంటే నేనే”, “బంగారు పంజరం”, “జీవన తరంగాలు” వంటి చిత్రాలతో పాటు అనేక తమిళ చిత్రాలలో ఆమె నటించారు. కథానాయికగా నటిస్తూనే ఎన్టీఆర్ కు భార్యగా నటించిన శ్రీరంజని, “భలేతమ్ముడు” చిత్రంలో ఆయనకు తల్లిగా నటించడం విశేషం. ఆమె భర్త నాగుమణి నిర్మించిన “మహాకవి కాళిదాసు” చిత్రంలో అక్కినేని నాగేశ్వరావు హీరోగా నటించిన ఆ చిత్రంలో శ్రీరంజని పాత్ర ప్రేక్షకుల సానుభూతి పొందింది.

మరణం…

1946లో శ్రీరంజని అనారోగ్యానికి, అస్వస్థతకు గురవ్వడంతో వైద్యుల సలహాతో దాదాపు నాలుగేళ్లు నటనకు దూరంగా ఉన్నారు. ఆరోగ్యం కుదుటబడ్డ తరువాత 1968లో తిరిగి సినీరంగ ప్రవేశం చేసి శ్రీరంజని నటించిన తమిళ చిత్రం “నాన్”. దీనిని “నేనంటే నేనే” పేరుతో తెలుగులోను తీశారు. ఆ చిత్రంలో కూడా శ్రీరంజని నటించారు. ఆమె దాదాపు 60 నుండి 70 సినిమాలలో నటించారు. జూనియర్ శ్రీరంజని ఇలా సినిమాలలో నటిస్తున్నా గానీ, సీనియర్ శ్రీరంజని అబ్బాయి యం.మల్లికార్జున రావు సినిమాలలో సహాయ దర్శకుడుగా కొనసాగారు.

శోకభరితమైన పాత్రలకే పరిమితమై చిట్టచివరి వరకు నటించారు జూనియర్ శ్రీరంజని. 1973లో వచ్చిన “జీవన తరంగాలు” సినిమాలో కూడా చక్కని పాత్రను పోషించారు. ఆమె నటించిన చిట్టచివరి చిత్రం “ఇంటి కోడలు” (1974) లో విడుదలయ్యింది. “స్నేహబంధు”, “భక్తతుకారం”, “వైశాలి”, “కోడెనాగు”, “ఇంటి కోడలు” వంటి చిత్రాలలో గుణచిత్ర నటులుగా పాత్రలు పోషించిన శ్రీరంజని అలా సినిమాలలో నటిస్తూనే తన 48 సంవత్సరాల అతి పిన్న వయస్సులో ఉండగానే 27 ఏప్రిల్ 1974 నాడు మరణించారు. జూనియర్ శ్రీరంజని సుమారు 78 సినిమాలలో నటించారు.

Show More
Back to top button