CINEMATelugu Cinema

తెలుగు చిత్ర సీమలో లేచి పడిన కెరటం.. దర్శక, నిర్మాత కడారు నాగభూషణం.

చెన్నై లోని ఒక లాడ్జి కి ఉదయం కడారు నాగభూషణం ఎనిమిది గంటలకు ఒక పత్రికా ప్రతినిధి వెళ్లారు. అది ఒక చిన్న లాడ్జి లో ఒక చిన్న గది. తలుపు కొంచెం వేసి ఉంది. కరెంటు లేదు, పైన ఫ్యాన్ తిరగడం లేదు. కిటికీలు మూసేసి ఉన్నాయి. బయటినుండి గాలి రావడం లేదు. ఏ మాత్రం వెలుతురు రావడానికి అవకాశం లేని ఆ గదిలో ఎదురుగుండా గోడకు ఒకప్పటి ప్రముఖ కథానాయిక ముఖ చిత్రం తళుక్కున మెరిసింది. ఆ చిత్రానికి పూలమాల వేసి ఉంది. పత్రికా విలేఖరి అటు ఇటు చూశారు, ఆ గదిలో ఏమైనా కనిపిస్తుందేమోనని. ఒక మూల ట్రంక్ పెట్టె, ప్రక్కనే ఒక కూజా, ఒక గ్లాసు, ఒక మూల ఏదో కాగితాల గుట్ట అగుపించాయి. ఒక పడక కుర్చీలో ఒకాయన కూర్చొని పత్రిక చదువుతున్నారు.

ఆయన వెనుక భాగం కనిపించింది. తాను పత్రిక చదువుతున్నారు కాబట్టి వెనక్కి తిరిగి చూడలేదు. అలాంటి పరిస్థితుల్లో ఒకప్పటి దర్శక నిర్మాతను చూసినటువంటి ఆ పత్రికా విలేఖరి మనసు కలుక్కుమంది. ఈయనను కలుసుకోవడానికా నేను వచ్చింది, అని ఎంతో వైభవంగా బ్రతికిన అతని స్థితి చూసి మాట్లాడడానికి ఇష్టం లేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ఆ పత్రికా విలేఖరి. అలా వెళ్ళిపోయిన కొద్దిరోజులకే ఆ గదిలో ఉన్న దర్శక, నిర్మాత గారు మరణించారు. ఆ గదిలో చిత్ర పటం లో ఉన్న ప్రముఖ కథానాయిక ఎవరో కాదు, తెలుగు టాకీలు మొదలైన కొత్తలో సినీ రంగ ప్రవేశం చేసి విలక్షణమైన పాత్రలతో తెలుగు తమిళ చిత్రాలలో ప్రత్యేక గుర్తింపు పొందిన నటీమణి పసుపులేటి కన్నాంబ గారు. ఆ చీకటి గదిలో ఉన్నటువంటి వ్యక్తి పసుపులేటి కన్నాంబ గారి భర్త కడారు నాగభూషణం గారు.

కరారు నాగభూషణం, కన్నాంబ దంపతులు కలిసి స్థాపించిన సినీ నిర్మాణ సంస్థ “రాజరాజేశ్వరి పిక్చర్స్”. తర్వాత అది రాజరాజేశ్వరి ఫిలింస్ అయ్యింది. వారికి సొంత స్టూడియో కూడా లేదు. అయినా కూడా 1940 నుండి 1965 వరకు దాదాపు 35 సినిమాలు నిర్మించిన ఘనత రాజేశ్వరి ఫిలిమ్స్ దే. అంతే కాకుండా నిజాయితీ, నిబద్దత కలిగిన దర్శక, నిర్మాతగా కడారు నాగభూషణం గారికి ప్రత్యేకమైన గౌరవం ఉండేది. తమ కంపెనీలో పనిచేసినటువంటి నటీ నటులకు సాంకేతిక నిపుణులకు ప్రతినెల చివరి రోజున కచ్చితంగా జీతాలు చెల్లించేవారు. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా కన్నాంబ గారు తన నగలు తాకట్టుపెట్టి మరీ డబ్బులు తెచ్చి నెల జీతాలు చెల్లించేవారు.

కడారు నాగభూషణం గారు ఉండడానికి పెద్ద బంగ్లా, ఆఫీసు కు పెద్ద భవనం, ఐదారు కార్లు, అత్యంత వైభవంగా వెలిగిన సంస్థ చివరి రోజుల్లో నామరూపాలు లేకుండా ముగిసిపోయాయి. ఎంతో గౌరవంగా, పరువుగా జీవించిన కడారు నాగభూషణం గారు చివరి రోజుల్లో మద్రాసు లోని మారుమూల హోటల్లో గాలి వెలుతురు కూడా సరిగ్గా రాని గదులలో అక్కినేని నాగేశ్వరావు గారు, అభిమానులు కలిసి సేకరించిన విరాళాల మీద వచ్చే వడ్డీ నెలకు 260 రూపాయలతో జీవించే పరిస్థితికి వెళ్లారు. ఏ సిటీలో అయితే పెద్ద పెద్ద కార్లు తిరిగారో, అక్కడే సిటీ బస్సుల్లో ప్రయాణించారు. బాగా వెలిగిన రోజుల్లో ఎప్పుడూ కూడా తీరిక లేకుండా ఉన్న కడారు నాగభూషణం గారు, చివరి రోజుల్లో ఎవరూ పలకరించడానికి లేకుండా ఏకాకిగా గదులలో బంధీ అయ్యి రాలిపోయారు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    కడారు నాగభూషణం

ఇతర పేర్లు  :    కె.బి. నాగభూషణం

జననం    :     1902 

స్వస్థలం   :   కోలవెన్ను, కృష్ణా జిల్లా

వృత్తి      :   సినిమా నిర్మాత , దర్శకుడు

తండ్రి    :   కడారు భగవానులు 

జీవిత భాగస్వామి    :    పి.కన్నాంబ

మతం    :   హిందూ మతం

మరణ కారణం  :  వృద్ధాప్యం 

మరణం    :    18 అక్టోబర్ 1976 

చెన్నై, భారత దేశం

నేపథ్యం…

కడారు నాగభూషణం గారు కృష్ణా జిల్లా కోలవెన్ను లో 1902 లో జన్మించారు. వాళ్ళ నాన్నగారు కడారి భగవానులు గారు. బాగా ఉన్నత కుటుంబం. తాను కోలవెన్నులోనే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆ తర్వాత విజయవాడ హిందూ హైస్కూల్ చదువుకున్నారు. అక్కడి నుండి బందరు నోబుల్ కళాశాల కు వెళ్లారు. తాను నోబుల్ కళాశాలలో చదువుకునే రోజుల్లో గూడవల్లి రామ బ్రహ్మం గారు కడారు నాగభూషణం గారికి సహాధ్యాయి గా ఉండేవారు. నాగభూషణం గారికి నోబుల్ కళాశాలలో ఉండగానే నాటకాలు వేయడం అలవాటు అయ్యింది. దాంతో తన చదువు పెద్దగా సాగలేదు. కేవలం నాటకాలే కాకుండా సంగీతం అంటే కూడా నాగభూషణం గారికి అభిరుచి. కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లో “బొబ్బిలి యుద్ధం” లో బుసిగా, చింతామణిలో బిల్వమంగళుడిగా వేసిన వేషాలు మంచి పేరు తెచ్చి పెట్టాయి.

నాటకరంగం…

కళాశాల అయిపోయాక నాటకాల మీద మక్కుతో పై చదువులు కొనసాగించలేదు. నాగభూషణం గారు డబ్బున్న వాడు కావడంతో తనకు చదువుకోవాల్సిన అవసరం కూడా రాలేదు. చదువు అయిపోగానే వాళ్ళ ఊర్లోనే “సీతారామాంజనేయ” నాటక సమాజం స్థాపించి కొంతమంది కుర్రాలను పోగేసి, పేరున్న నటీనటులను పెట్టుకొని “సావిత్రి”, “బొబ్బిలి యుద్ధం” లాంటి నాటకాలను ప్రదర్శిస్తూ ఉండేవారు. ఆ తరుణంలోనే ఆంధ్ర నాటక రంగం ఆయన ఆకర్షించడంతో చదువుకు స్వస్తి పలికి బాల మిత్ర నాటక సమాజంలో చేరారు.

మొదట్లో కొన్ని నాటకాలలో నటించినా తర్వాత నాటక నిర్వహణ బాధ్యతలు చేపట్టడానికి మొగ్గు చూపారు. ఎన్నో నాటకాలు నాగభూషణం గారి ఆధ్వర్యంలో ప్రదర్శింపబడి ప్రశంసలు అందుకున్నాయి. బాలమిత్ర నాటక సమాజం వారి కోరిక మేరకు కడారి నాగభూషణం గారు వారితో చేరి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లాంటి రాష్ట్రాలు తిరుగుతూ నాటకాలు ప్రదర్శించేవారు. నాటకాలలో నటించడం కంటే, వాటి నిర్వహణ మీద ఆసక్తి ఎక్కువ. నటుడి నుండి ఆ నాటకాల ట్రూపు మేనేజర్ అయ్యారు. కొన్నాళ్ల తర్వాత బాలమిత్ర నాటక సమాజం నుంచి నవల నాటక సమాజానికి మారి వాళ్ల నాటకాలను కూడా నిర్వహిస్తూ ఊరురా తిరిగేవారు.

వైవాహిక జీవితం…

నాటక సమాజం నిర్వహిస్తూ ఊరూరు తిరుగుతూ 1934 లో ఏలూరు లో “నవ నాటక సమాజం” వారు “హరిచంద్ర నాటకం” ప్రదర్శించినప్పుడు నటి పసుపులేటి కన్నాంబ గారు ఆ నాటక సమాజంలో చేరి పోయారు. ఆ నాటక సమాజం వాళ్ళు ఎక్కడి ఒక వెళితే అక్కడికి కన్నాంబ గారిని తీసుకెళ్లడం ప్రారంభించారు. అదే సమయంలో ఆ నాటక సమాజంలో హీరోయిన్ పాత్రలు పోషిస్తుండేవారు కన్నాంబ గారు. నాగభూషణం గారి వ్యక్తిత్వం, వ్యవహార శైలి, డైనమిజం కన్నాంబ గారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. కన్నాంబ గారి మంచితనం, ప్రతిభ పాఠవాలు నాగభూషణం గారిని కూడా ఆకట్టుకున్నాయి.

అందుకే  అచిరకాలంలోనే వీరి పరిచయం ప్రణయంగా మారి పరిణయానికి దారి తీసింది. వీరిద్దరూ 1934 ఏప్రిల్ లో వివాహం చేసుకున్నారు. అప్పటికే కడారి నాగభూషణం గారికి పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లి తరువాత వాళ్ళు వేరే వారికి నాటకాలు వేసే బదులు మనమే ఒక నాటక సమాజం స్థాపిస్తే బావుండునని భావించి వారు 1934 చివరలో “రాజరాజేశ్వరి నాటక సమాజం” అనే పేరుతో సొంతంగా నాటక సమాజాన్ని స్థాపించారు.

సినీ రంగ ప్రవేశం…

1934 ఏప్రిల్ లో కన్నాంబ, కడారు నాగభూషణం గార్ల వివాహం జరిగింది. 1934 చివరలో కన్నాంబ దంపతులు “రాజరాజేశ్వరి నాటక సమాజం” అనే పేరుతో సొంతంగా నాటక సమాజాన్ని స్థాపించారు. వారు నిర్వహించే నాటకాలలో వేమూరు గగ్గయ్య, దొమ్మేటి సూర్యనారాయణ, ఈలపాటి రఘురామయ్య, ఋష్యేంద్రమణి లాంటి వారందరూ కూడా అద్భుతంగా నటిస్తూ ప్రసిద్ధమైన నాటకాలను వేదికపై ప్రదర్శిస్తూ ఉన్నారు.

ఇది ఇలా ఉండగా ఒకరోజు బళ్లారిలో నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉండగా ఆ ప్రదేశానికి మద్రాసు నుండి ఒక కుర్రవాడు వచ్చాడు. “మేము కొల్హాపూర్ లో ఒక సినిమా తీస్తున్నాము.

కన్నాంబ గారికి చంద్రమతి పాత్రతో మంచి పేరు తెచ్చుకున్నారు కదా. అందుకని మేము కన్నాంబ గారిని సినిమాలోకి తీసుకుంటాము” అని అన్నాడు.

ప్రధాన పాత్రధారి అయిన కన్నంబ గారు వెళ్ళిపోతే నాటక సమాజాన్ని ఆపేయవలసి వస్తుంది. ఇందులో ఉన్న 22 మందిని కూడా సినిమాల్లోకి తీసుకుంటానంటేనే కన్నాంబ గారిని పంపిస్తాము.

లేదంటే పంపించలేము అని షరతును పెట్టారు నాగభూషణం గారు. దాంతో ఆలోచించిన కుర్రాడు సరే అని ఆ 22 మందిని కూడా సినిమాల్లోకి ఆహ్వానించారు.

ఆ వచ్చిన కుర్రాడే ఆ తరువాత ప్రముఖ దర్శకులలో ఒకరైన “పోలదాసు పుల్లయ్య”. ఆ దర్శకులు తీసిన సినిమా “హరిశ్చంద్ర” (1935).

ఆ విధంగా కన్నాంబ గారు సినిమాల్లోకి ఆహ్వానించబడ్డారు. హరిశ్చంద్ర సినిమా ఓ మాదిరిగా ఆడింది.

కానీ కన్నాంబ గారికి విపరీతమైన పేరు వచ్చింది. ఆ తర్వాత కన్నాంబ గారిని “ద్రౌపది వస్త్రాపహరణం” లో ద్రౌపది పాత్రకు తీసుకున్నారు.

దాంతో కడారి నాగభూషణం, కన్నాంబ దంపతులకు ఆంధ్రదేశం తిరిగి వచ్చే అవసరం లేకుండా చేసింది. వారు సినీ పరిశ్రమలోనే కొనసాగారు.

ఆ విధంగా కన్నాంబ గారు నటించిన రెండవ సినిమా “ద్రౌపది వస్త్రాపహరణం” అత్యంత ఘనవిజయం సాధించింది.

దాంట్లో కడారు నాగభూషణం గారు అశ్వత్థామ పాత్రను పోషించారు. ఆ తర్వాత సరస్వతి టాకీసు వారు కనకతార (1937) అనే సినిమాను తీశారు.

ఆ సినిమాలో కన్నాంబ గారు కనకతార పాత్రను పోషించారు. దాంట్లో కడారు నాగభూషణం గారు మతిమంతుడు అనే పాత్రను వేశారు. 1938లో హెచ్.ఎం.రెడ్డి గారు గృహలక్ష్మి అనే సినిమా తీశారు. దాంట్లో ప్రధాన పాత్ర కన్నాంబ గారు అయితే అందులో నాగభూషణం గారు జడ్జి పాత్ర వేశారు. 1935 నుండి కన్నాంబ గారు ప్రతీ సంవత్సరం ఏదో ఒక సినిమాలో నటిస్తూ వచ్చారు.

నాగభూషణం గారు చిన్న చిన్న వేషాలు వేస్తూ సినీ నిర్మాణాన్ని పరిశీలిస్తూ వస్తున్నారు.

కడారి నాగభూషణం దంపతులు 1940లో రాజరాజేశ్వరి పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి  మొదటి సినిమా “తల్లి ప్రేమ” తీశారు.

ఆ సినిమా మాదిరిగా ఆడింది. ఆ తర్వాత తీసిన సినిమా “సుమతి” తో దర్శకుడుగా కడారు నాగభూషణం గారు. 1942లో చాలా తక్కువ సమయంలో తీసి విడుదల చేశారు ఈ సినిమా దర్శక నిర్మాత నాగభూషణం గారు.

“సుమతి” సినిమాను తీస్తున్నప్పుడే రెండో ప్రపంచ యుద్ధం రావడంతో కడారి నాగభూషణం గారు మద్రాసు నుండి 35 మైళ్ళ దూరంలో ఉన్న తిరువళ్ళూరు కు ఆఫీస్ ను మార్చేశారు.

ఉదయం మద్రాసు కు వచ్చి షూటింగ్ చేసి సాయంకాలం తిరిగి తిరువళ్ళూరు కు వెళ్ళిపోయేవారు.

అలా అతి తక్కువ రోజులలో తన మొదటి సినిమాను దర్శకత్వం వహిస్తూ సినిమాను పూర్తి చేశారు కడారి నాగభూషణం గారు. ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడలేదు. కానీ నష్టాలయితే రాలేదు.

తమిళ చిత్ర నిర్మాణం లోకి…

1944లో తమిళ చిత్ర రంగం లోకి ప్రవేశించిన కన్నాంబ గారు ఎం.జీ.ఆర్ గారితో తమిళంలో హరిచంద్ర సినిమాని సిద్ధం చేశారు. సహా భాగస్వామిగా జెమినీ వాసన్ గారు ఉన్నారు. అలా మొదలైన స్నేహం జెమిని వాసన్ గారితో ఎనిమిది సినిమాల వరకు కొనసాగింది. “హరిశ్చంద్ర” సినిమా కూడా ఓ మాదిరిగా ఆడింది. 1945లో “పాదుక పట్టాభిషేకం” భారీ తారాగణం తో నిర్మించారు. శ్రీరాముని పాత్రలో చిలకలపూడి సీతారామాంజనేయులు గారు నటించారు. 1951 లో “సౌదామిని” అనే జానపద చిత్రం ప్రారంభించారు. నాగభూషణం గారు ఈ చిత్రంతోనే కే.బీ.నాగభూషణం అని పేరు మార్చుకున్నారు.

ఈ చిత్రంలో కన్నాంబ, చిలకలపూడి సీతారామాంజనేయులు గార్లు ఒక జంట, అక్కినేని నాగేశ్వరావు, యస్.వరలక్ష్మి గార్లు మరొక జంటగా నటించారు. కన్నాంబ దంపతులు నిర్మించిన ఈ చిత్రం పరాజయాన్ని మూటగట్టుకుని భారీ నష్టాన్ని మిగిల్చింది. అలాగే తమిళంలో తీసిన రెండు మూడు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. దాంతో ఒక మంచి తెలుగు సినిమా తీసి ఆ నష్టాన్ని పూడ్చుకోవాలని అనుకున్న కన్నాంబ దంపతులు ఆ రోజుల్లో ప్రసిద్ధి పొందిన “సతీ సక్కుబాయి” చిత్రాన్ని సినిమాగా తీస్తూ “సుందర్ లాల్ నెహతా” గారు పెట్టుబడి పెట్టారు. కె.వి.రెడ్డి గారి దక్కించుకున్న ఆ నాటక హక్కుల్ని కన్నాంబ దంపతులకు ఇచ్చేశారు.

ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. వారి అప్పులు కొంతవరకు తీరిపోయాయి. కన్నాంబ దంపతులకు పిల్లలు లేరు. వారు ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు. కన్నాంబ గారు రాజరాజేశ్వరి దేవి ఉపాసకురాలు. అందుకని వాళ్ళ నాటక సంస్థకు గానీ, సినిమా కంపెనీకి గాని రాజరాజేశ్వరి అని పేరు ఉండేది. తాను పెంచుకున్న అమ్మాయికి కూడా రాజేశ్వరి అనే పేరు పెట్టుకున్నారు. ఆ అమ్మాయిని తమ వద్ద అసిస్టెంట్ గా ఉన్న చిత్తజల్లు శ్రీనివాసరావు గారికి (చిత్తజల్లు పుల్లయ్య గారి కుమారులు) ఇచ్చి వివాహం జరిపించారు. 1955లో అల్లుడు చిత్తలు శ్రీనివాసరావు గారు దర్శకత్వంలో “శ్రీకృష్ణతులాభారం” నిర్మించారు. అయితే అద్భుతమైన విజయం సాధించింది.

పరాజయాల పరంపర…

1956లో ఒక ఎదురుదెబ్బ తగిలింది. తమిళంలో నాగ పంచమి అనే సినిమా ప్రారంభించారు కడారు నాగభూషణం గారు.

కన్నడం, తెలుగు భాషలలో “నాగుల చవితి” అనే సినిమాను అదే అంశంతో ఏ.వీ.ఎం వారు ప్రారంభించారు.

అయితే తమిళంలో నాగభూషణం గారు, తెలుగు కన్నడ లో ఏ.వీ.ఎం వారు విడుదల చేసుకోవాలని ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు.

నాగభూషణం గారు తమిళంలో “నాగపంచమి” విడుదల చేశారు. కానీ ఏ.వి.యం వారు ఒప్పందాన్ని అతిక్రమించి తమిళంలో కూడా విడుదల చేశారు.

దాంతో ఆగ్రహించిన నాగభూషణం గారు తన సినిమాని తెలుగులో కూడా విడుదల చేశారు.

కానీ నాగుల చవితి తో పోటీ పడలేక నాగభూషణం గారి సినిమా పరాజయం పాలైంది.

వరలక్ష్మి పిక్చర్స్ నిర్మాత యస్.వరలక్ష్మి గారికి “సతీ సావిత్రి” సినిమాను నాగభూషణం గారి దర్శకత్వంలో తీశారు. ఆ సినిమా ఓ మాదిరిగా ఆడింది.

1958లో నాగభూషణం గారి మొదటి భార్య కూతురు వివాహం కన్నాంబ, నాగభూషణం గార్లు దగ్గరుండి జరిపించారు. 1962 వరలక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై “దక్షయజ్ఞం” సినిమాని ఎన్టీఆర్ గారితో తీశారు. ఆ సినిమా పరాజయం పాలైంది. 1963 లో ఎన్టీఆర్ గారితో ఆప్త మిత్రులు తీశారు. అది కూడా పరాజయం పాలయ్యింది. ఆ సమయంలో సి.ఎస్.రావు గారు రాజసులోచన ను వివాహం చేసుకున్నారు. 1964 వచ్చేసరికి నష్టాలు జాబితాలో కూరుకున్నారు. కన్నాంబ గారు 07 మే 1964 లో కన్నాంబ గారు మరణించారు. ఆమె అంతక్రియలు నాగభూషణం గారే దగ్గరుండి జరిపించారు.

ఆమె అంతిమయాత్రకు ఎం.జీ.ఆర్ గారు, కే.ఎస్.ప్రకాష్ రావు గారు, ఎస్.ఎస్.రాజేంద్రన్ లాంటి తెలుగు తమిళ, ప్రేక్షకులంతా వచ్చేసారు.

మహా పథ గమనం…

తాను ఎంతగానో ప్రేమించిన, అభిమానించిన భార్య పసుపులేటి కన్నాంబ గారు మరణించాక నాగభూషణం గారు ఒంటరైపోయారు. ఆమె మరణించే సమయానికి నాగభూషణం గారు “చదువుకున్న భార్య” (1965) సినిమా నిర్మాణంలో ఉన్నారు. శ్రీ రాజేశ్వరి ఫిల్మ్స్ కంపెనీ పతాకం పై కడారు నాగభూషణం గారు నిర్మించారు. దురదృష్టవశాత్తు ఆ సినిమా కూడా పరాజయం పాలైంది. తాళి భాగ్యం (1966) లో  ఎం.జీ.ఆర్, బి.సరోజ గార్లతో వరలక్ష్మి పిక్చర్స్ పతాకం పై వరలక్ష్మి గారు నిర్మించారు. కడారి నాగభూషణం గారి జాప్యం వల్ల ఆర్థికంగా నష్టపోయారు. దాంతో ఇల్లు, ఆఫీసు, సంపాదించిన ఆస్తులు ఇలా అన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది.

1966 నుండి 1972 వరకు నాగభూషణం గారికి సంబంధించిన ఏ వివరాలు బయటకు రాలేదు. కానీ ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా బాకీ లేకుండా అందరి అప్పులు తీర్చేశారు. “కన్నాంబ గారు నా జీవితంలోకి రావడంతో లక్ష్మి, సరస్వతి రెండు వచ్చాయి. కన్నాంబ గారు వెళ్లిపోవడంతో రెండింటిని తీసుకొని వెళ్ళిపోయారు. తాను జీవించి ఉండగా సుమంగళిగా వెళ్లిపోవాలని కోరుకుంది. తన కోరికను తాను తీర్చుకుంది. నేను మాత్రం ఇలా ఒంటరిగా ఉండిపోవాల్సి వచ్చింది” అని తెలిసిన వారితో చెబుతుండేవారు నాగభూషణం గారు. సౌమ్యులు, నిజాయితీపరులు, నిబద్ధతగల నిర్మాత, ఒక్క రూపాయి కూడా ఎవ్వరికీ బాకీ లేరు, వందలాది మందికి అన్నం పెట్టిన చెయ్యి, వేలాది మంది సాంకేతిక నిపుణులు, నటీ నటులకు ఉపాధి కల్పించినటువంటి కళాసేవ, అన్నింటికీ ముగింపు పలుకుతూ నాగభూషణం గారు 18 అక్టోబరు  1976 నాడు మరణించారు.

కడారు నాగభూషణం గారు విజయవంతమైన దర్శకులు కాకపోవచ్చు, బ్రహ్మాండమైన చిత్రాలు నిర్మించకపోవచ్చు.

కానీ తన 25 సంవత్సరాల్లో స్టూడియో కూడా లేకుండా 35 చిత్రాలు నిర్మించడం ఆ రోజుల్లో గొప్పగా చెప్పుకోవచ్చు.

కళా సేవలో సర్వం కోల్పోయినప్పటికీ కన్నాంబ, కడారు నాగభూషణం గార్ల మంచితనం చరిత్రలో నిలిచిపోయింది.

వారిని ఎరిగిన వారు ఎవరైనా, వారిని పొగడకుండా ఉండలేరు. వారి మంచితనాన్ని గుర్తు చేసుకోకుండా ఉండలేరు.

నాగభూషణం గారి చివరి రోజులు జాలి పడకుండా ఉండలేరు. ఎందరికో అన్నం పెట్టి ఆదుకున్న కడారు నాగభూషణం గారు చిరస్మరణీయులు గా మహా పథ గమనాన్ని చేరుకున్నారు.

సశేషం….

కొంతమందికి డబ్బులు సంపాదించడానికి ఎన్నో సంవత్సరాలు పట్టవచ్చు, ఎన్నో సినిమాలు అవసరం కావచ్చు. కానీ సంపాదించినవి పోగొట్టుకోవడానికి ఒకటి రెండు సినిమాలు చాలు. నిజమా? అంత కష్టంగా ఉంటాయా సినీ రంగంలో పరిస్థితులు అని మనకు అనిపిస్తుంది. కానీ ఇలా నష్టపోయిన దర్శక నిర్మాతల్ని చూస్తే గనుక ఎంత సంపాదించినప్పటికీ, వాటికి అత్యంత దీన స్థితికి దిగజారడానికి ఒకటి రెండు సినిమాలు చాలు అని అనిపిస్తుంది.

1940 నుంచి ఇప్పటివరకు కూడా అనేక ఉదాహరణలు స్ఫురిస్తూ ఉంటాయి. ఇలాంటి వాటికి “రాజరాజేశ్వరి ఫిలిమ్స్” అధినేత అయిన ఖరారు నాగభూషణం గారు కూడా ఒకరు. ఇలాంటి వారు ఎంతో క్రమశిక్షణతో ఉన్నప్పటికీ, ఎలాంటి వ్యసనాలు లేనప్పటికీ వ్యాపారం కలిసి రానప్పుడు జీవితం ఎంత దారుణంగా, ధైణ్యంగా ముగుస్తాయో అవగతమవుతుంది, ఒక్క క్షణం అయ్యో అనిపిస్తుంది. కడారి నాగభూషణం గారి జీవిత కథ కూడా అలాగే ఉంటుంది.

జీవితం ఒక బుడగ అంటుంటారు. అయితే సినీ జీవితం మాత్రం కన్నీటి బుడగ అని కొంతమంది వ్యక్తుల జీవితాలను పరిశీలించినప్పుడు అనిపిస్తుంది. ముఖ్యంగా నిర్మాతగా దర్శకుడుగా ఒక వెలుగు వెలుగి ఎందరో నటీ నటులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేసి, చివరి దశలో అప్పుల పాలై అనామకంగా తనువు చాలించిన కే.బీ.నాగభూషణం గారి లాంటి వ్యక్తుల ప్రస్తావన వచ్చినప్పుడు అయ్యో పాపం అనిపిస్తుంది.

సొంత స్టూడియోలు కలిగిన నిర్మాతలు అధిక సంఖ్యలో సినిమాలు తీయడం అంత విశేషం కాదు.

కానీ అలాంటి సదుపాయాలు లేకుండా ఆ రోజులలో 35 చిత్రాలను తమిళ, తెలుగు భాషల్లో నిర్మించడం కేవలం కడారు నాగభూషణం గారి వల్లే సాధ్యమైంది.

కడారు నాగభూషణం గారు దక్షత కలిగిన నిర్మాతగా పేరు తెచ్చుకున్నారాయన.

సినిమా వ్యాపారంలో సత్సంప్రదాయాలను నెలకొల్పి, అసభ్యతకు, అశ్లీలానికి తావులేని చిత్రాలు రూపొందించిన దర్శక స్రష్టగా పేరు తెచ్చుకున్నారు. 

ఆ రోజులలో అంటే 1950 ప్రాంతాలలో నాగభూషణం గారికి నాలుగు కార్లు, ఒక వ్యాన్ ఉండేవి.

అటువంటి వ్యక్తి చివరి రోజుల్లో చెన్నై లోని పాండి బజారులో అలా నడిచి వెళుతుంటే చూసి కన్నీరు పెట్టని వారు లేరు. ఇదేనా సినిమా జీవితం అనిపిస్తుంది.

Show More
Back to top button