CINEMATelugu Cinema

తెలుగు చిత్ర సీమలో నవరస నటనా సార్వభౌమ.. కైకాల సత్యనారాయణ..

ఐదున్నర దశాబ్దాల క్రిందట ఎన్టీఆర్ గారి “పెళ్లి చేసి చూడు” సినిమా అప్పుడే విడుదలైంది. అదే సమయంలో బెజవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో నాటక పోటీ జరుగుతుంది. అందులో కొందరు ఆ నాటకాల పోటీలలో పాల్గొన్నారు. అప్పట్లో ఇంటర్ చదువుతున్న ఒక కుర్రాడు ఆ నాటకంలో పాల్గొన్నాడు. తాను అచ్చుగుద్దినట్లు “పెళ్లి చేసి చూడు” సినిమా లో ఎన్టీఆర్ లానే ఉన్నాడు. తాను వేదిక మీదకి రాగానే ఒక్కసారిగా హడావుడి మొదలైంది. ఎన్టీఆర్ వచ్చాడంటూ అరుపులు, కేకలు, అభిమానుల హోరు. అదంతా గమనిస్తున్న కుర్రాడికి ఏమి అర్థం కాలేదు. తన ప్రదర్శన పూర్తవ్వగానే తనను అంతా చుట్టుముట్టారు.

వారందరికీ నేను ఎన్టీఆర్ కాదని చెప్పడంతో “మీరు ఎన్టీఆర్ కు బంధువులా, మీరు ఎన్టీఆర్ కు ఏమవుతారు” అనే ప్రశ్నల వర్షం మొదలయ్యింది అభిమానుల నుండి. ఆ నాటకాన్ని చూసిన ప్రముఖ దర్శకులు, “ఆంధ్ర ప్రజానాట్యమండలి” వ్యవస్థాపకులు గరికపాటి రాజారావు గారు తనతో “సినిమాల్లో ఆసక్తి ఉంటే నేను అవకాశం ఇస్తాను ” అన్నారు. దాంతో ఆ కుర్రాడు మా కుటుంబంలో ఇప్పటివరకు డిగ్రీ చదివిన వారెవ్వరూ లేరు. అందుకే “మొదటి ప్రాధాన్యత చదువుకే” అంటూ సున్నితంగా తిరస్కరించాడు. తానే ప్రముఖ నటులు నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారు. అప్పట్లో ఆ అవకాశాన్ని వద్దనుకున్న తనకు ఆ తర్వాత ఎన్నోసార్లు వేషాలు చేతికి అందినట్టే అంది  చేజారిపోయాయి. ఎంతగానో నిరాశ చెందినా తాను పట్టు వదలకుండా అవకాశాలను దక్కించుకుని సినీ పరిశ్రమలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.

సత్యనారాయణ గారు తన 60 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో చేయని పాత్ర లేదు, వేయని వేషం లేదు. కథనాయకుడు, ప్రతినాయకుడు, హాస్యానటుడు, గుణచిత్ర నటులు, పెద్ద తరహా క్యారెక్టర్, సాంఘిక, పౌరాణిక, జానపద, సస్పెన్స్ థ్రిల్లర్ ఒకటేమిటి ఏ పాత్రనైనా, సత్తా ఉన్నా ఆ పాత్రలో ఒదిగి పోయి పూర్తి స్థాయిలో న్యాయం చేయగలిగిన ఓకే ఒక్క నటులు కైకాల సత్యనారాయణ గారు. అన్ని పార్శ్వాలు ఉన్న పాత్రలు చేసి విలక్షణ నటులు అనే పేరు తెచ్చుకున్నారు. తాను అన్ని తరహా పాత్రల పోషణలో ముందంజలో ఉన్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఒక శకం కైకాల సత్యనారాయణ గారు. తాను దాదాపుగా 750కి పై చిలుకు చిత్రాలలో నటించారు. బహుశా యస్.వి.రంగారావు గారి తరువాత విభిన్నమైన పాత్రల్లో నటించిన ఏకైక నటులు మన కైకాల సత్యనారాయణ గారు.

కైకాల సత్యనారాయణ గారు చెయ్యెత్తు మనిషి, ఆజానుబావులు, చూడగానే ఆకట్టుకునే స్ఫురద్రూపం గలవారు. గంభీరమైన వాచకంతో, నవరసభరితమైన నటనతో, అబ్బురపరచే ఆంగికంతో, హావభావాలను చిలికిస్తూ నటనకే భాష్యం చెప్పిన నవరస నటనా సార్వభౌములు. వీర, రౌద్ర, బీభత్స రసాలను అటు పౌరాణిక జానపదాల్లోను, ఇటు చారిత్రాత్మక, సాంఘిక చలన చిత్రాలలోను తనదైన శైలితో మెప్పించిన గొప్ప నటులు కైకాల సత్యనారాయణ గారు. క్రూరత్వాన్ని ప్రదర్శించే కళ్ళు, మరుక్షణం కరుణరసాన్ని వొలికిస్తాయి. బీభత్స భయానకం నుండి హాస్యం వరకు అన్ని భావాలు తన ముఖంలో అలవోకగా పలుకుతాయి. పౌరాణికాలు, జానపదాలు, సాంఘికాలు, ఫాంటసీలు ఇలా ఎనిమిది వందలకు పైగా అనేక సినిమాలలో నటించిన నటశేఖర, కళా ప్రపూర్ణులు కైకాల సత్యనారాయణ గారు.  నిలువెత్తు విగ్రహంతో యన్‌.టి.రామరావు కృష్ణుడైతే, సత్యనారాయణే సుయోధనుడు. రామారావు రాముడైతే, సత్యనారాయణ రావణాసురుడు. విఠలాచార్య ప్రోత్సాహంతో ప్రతినాయకునిగా రాణించిన అనుభవశాలి.

“నాపేరే భగవాన్‌” లో ప్రాణ్‌ను మరపించిన నటనతో, “శారద” లో చెల్లెలి కోసం ప్రాణం విడిచేందుకైనా వెరవని అన్నగా, “తాత మనవడు” లో నిర్దయుడైన తనయునిగా, “యమగోల” లో “యముండ” అనే ట్రేడ్‌ మార్క్‌ సంభాషణలతో దయామయుడైన శిక్షకునిగా, “వేటగాడు” లో అమాయక చక్రవర్తిగా, “సావాసగాళ్లు” లో ఉంగరాల సాంబయ్యగా, “సూత్రధారులు” లో సంగీతానికి జీవితాన్నే వెచ్చించిన కళాకారునిగా, “సిరిసిరిమువ్వ” లో వికలాంగుడైన చేతగాని తండ్రిగా, “గురువును మించిన శిష్యుడు” లో ధర్మపాలునిగా వైవిధ్య నటనకు ఊపిరులూదిన ఈ సార్వభౌముడు ఎనభై రెండేళ్ల వయసుని, ఎనిమిది వందల సినిమాలతో అరవై ఏళ్ల నటనానుభవాన్ని, అన్నిటినీ మించి అసాధారణ జీవితసారాన్ని ఆపోసన పట్టిన మహామేధావి..

జీవిత విశేషాలు…

జన్మ నామం   :    కైకాల సత్యనారాయణ 

ఇతర పేర్లు    :    నవరస నటసార్వభౌమ 

జననం    :    25 నవంబరు 1935   

స్వస్థలం   :    కౌతరం గ్రామం, గుడ్లవల్లేరు మండలం, కృష్ణా జిల్లా..

వృత్తి      :   సినిమాలు, రాజకీయం

తండ్రి       :     కైకాల లక్ష్మీనారాయణ.

జీవిత భాగస్వామి :  నాగేశ్వరమ్మ

పిల్లలు      :   కైకాల లక్ష్మీనారాయణ, కైకాల రామారావు (చిన్నబాబు), కైకాల రమాదేవి లతో సహా మరో కూతురు 

మరణ కారణం   :    అనారోగ్యం 

మరణం   :   23 డిసెంబరు 2022, హైదరాబాదు.

నేపథ్యం…

కైకాల సత్యనారాయణ గారు కృష్ణా జిల్లా గుడివాడ తాలూకాలోని కౌతవరం అనే పల్లెటూరులో 25 జూలై 1935లో జన్మించారు. కైకాల గారి తాతగారు (మాతామహులు) (అమ్మ తండ్రి) కంభంమెట్టు రామయ్య గారి ఇంట్లో జన్మించారు. అప్పట్లో వారిది నిరుపేద కుటుంబం. కైకాల గారి నాన్నగారు మొదట్లో కలప వ్యాపారి దగ్గర గుమస్తాగా పనిచేస్తూ ఉండేవారు. కైకాల సత్యనారాయణ గారు బడి ఉంటే చదువుకోవడానికి వెళ్లేవారు. బడి లేకుంటే పొలానికి వెళ్తుండేవారు. కైకాల గారి స్వగ్రామంలో ఎలిమెంటరీ పాఠశాల వరకు మాత్రమే ఉండేది. దాంతో గుడ్లవల్లేరు జిల్లా పరిషత్ పాఠశాలలో చేరారు.

కౌతవరం నుండి గుడ్లవల్లేరు వరకు రాను పోను ఐదు మైళ్ళ కాలినడకన వెళ్లి చదువుకునేవారు కైకాల సత్యనారాయణ గారు. తన చదువు పాఠశాల ఫైనల్ వరకు అక్కడే కొనసాగింది. నిజానికి కైకాల సత్యనారాయణ గారిని డాక్టరు చేయాలన్నది వాళ్ళ తల్లిదండ్రుల కోరిక. దాంతో పదవతరగతి పూర్తయ్యాక తాను ఇంటర్మీడియట్ లో బై.పీ.సీ తీసుకున్నారు. 1951 లో “ది గుడివాడ కాలేజ్” లో  ఇంటర్మీడియట్ లో చేరిన కైకాల సత్యనారాయణ గారు 1953 వరకు ఇంటర్మీడియట్ పూర్తిచేశారు. 1953 లో అదే కళాశాలలో డిగ్రీలో కొనసాగిన కైకాల గారు 1956 లో డిగ్రీ పూర్తిచేసి పట్టా చేతబుచ్చుకున్నారు. అదే కళాశాలను ప్రస్తుతం పేరు అక్కినేని నాగేశ్వరావు కళాశాలగా పేరు మార్చారు.

నాటకాలు…

కైకాల గారు డిగ్రీ చదివే సమయంలో తాను కొంతమంది కుర్రాళ్ళతో కలిసి నాటకాలు ప్రదర్శించేవారు. అప్పట్లో సినీ నిర్మాత దర్శకుడు దుక్కిపాటి మధుసూదన రావు గారి ఆధ్వర్యంలో వేసే నాటకాలకు ప్రముఖ సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు గారు సంగీతం సమకూర్చేవారు. ఆ కంపెనీలో అక్కినేని నాగేశ్వరావు గారు కథానాయికగా (హీరోయిన్ గా) వేషాలు వేస్తే, ప్రభాకరరావు అనే అతను హీరోగా వేషాలు వేస్తుండేవారు. ఓ రోజు నాటక ప్రదర్శన ఇస్తుండగానే ప్రభాకరరావు గారు వేదిక మీదనే చనిపోయారు. ప్రభాకరరావు పేరుతో పామర్తి సుబ్బారావు గారు “ప్రభాకర నాట్యమండలి” అనే పేరుతో మరో సంస్థను నెలకొల్పారు. అందులో కథనాయకుడి పాత్రను కైకాల గారే వేస్తుండేవారు. ఆ విధంగా కైకాల సత్యనారాయణ గారు ఒకవైపు చదువు, మరోవైపు నాటకాలు, ఇలా రెండు వ్యాపకాలుగా కొనసాగుతుండేవి.

డిగ్రీ చదివే రోజులలో కైకాల గారు వేసే నాటకాలలోఎల్లప్పుడూ కూడా, కైకాల గారికే బెస్ట్ యాక్టర్ గా ఎంపికయ్యేవారు. చిన్నప్పటినుంచి నాటకాలు అంటే భలే ఆసక్తి కనబరిచిన కైకాల సత్యనారాయణ గారు తాను పదో తరగతి చదువుతున్నప్పుడు “ప్రేమ లీలలు” అనే నాటకంలో విలన్ గా నటించారు. ఆ నాటకంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గానూ తనకు వెండి పతకం బహుకరించారు. రాత్రంతా గదిలో కూర్చొని తన స్నేహితులతో కలిసి నాటకాలు చూసిన జ్ఞాపకాలు,  దొడ్లలో అట్ట కిరీటాలతో తాను తన స్నేహితులతో కలిసి వేసిన వేషాలు జీవన మలిసంధ్యలో చాలా కాలం వరకు తాను గుర్తుంచుకున్నారు. అలా మొదలైన తన నటనా పర్వం తాను శివైక్యం చెందేవరకు కొనసాగుతూనే ఉంది.

చేజారిన డాక్టరు చదువు…

మంచి తెలివైన కుర్రాడు కనుక తాను చదువుల్లో ఇంటర్ ఫస్ట్ క్లాస్ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ వాళ్ళందరి అంచనాలు తారుమారయ్యాయి. మరుసటి రోజు ఫిజిక్స్ పరీక్ష అనగా కైకాల గారు రాత్రంతా నాటకాలు ప్రదర్శిస్తూనే ఉన్నారు. అలా రాత్రంతా నిద్ర లేకపోవడంతో ఉదయం పరీక్ష హాలులో సొమ్మసిల్లి పడిపోయారు. ఆ దెబ్బతో తనకు 25 మార్కులు తగ్గిపోయి ఫస్ట్ క్లాస్ వచ్చే అవకాశం చేజారిపోయింది. దాంతో తాను అనుకున్నట్లు డాక్టరు చదువు చదవడానికి వీలు లేకపోయింది. డిగ్రీలో జంతుశాస్త్రం (జూవాలాజి) ప్రధాన సబ్జెక్టుగా కైకాల సత్యనారాయణ గారికి సీటు ఇస్తామన్నారు. అదే కోర్సు గనక తాను తీసుకుంటే రికార్డులు, పుస్తకాలు రాయల్సి ఉంటుంది. నాటకాలకు కొంచెం కూడా సమయం ఉండదని బి.ఏ ఎకానమిక్స్ లో చేరిపోయారు.

సినీ ప్రయత్నాలు…

కైకాల సత్యనారాయణ గారు తన చదువు పూర్తయ్యి ఉద్యోగానికి దరఖాస్తులు చేసుకుంటున్న సమయంలో తన క్లాస్ మేట్ కె.యల్.ధర్, ప్రముఖ దర్శకులు ఎల్వీ ప్రసాద్ గారి వద్ద సహాయ కళా దర్శకునిగా పని చేస్తూ కైకాల గారికి ఒక ఉత్తరం వ్రాశారు. ఎల్వీ ప్రసాద్ గారు అందరూ కొత్త వాళ్ళతో “కొడుకులు కోడళ్ళు” అనే సినిమా తీస్తున్నారని, వస్తే కైకాల గారికి అవకాశం దొరకవచ్చనేమో అని ఆ లేఖ సారాంశం. కైకాల గారిని ఓ నెల రోజుల పాటు ఉండేలా మద్రాసు బయలుదేరి రమ్మని ఆ ఉత్తరంలో వ్రాశారు మిత్రుడు కె.యల్.ధర్. కైకాల సత్యనారాయణ గారిని పరీక్షించిన దర్శకులు యల్వీ ప్రసాద్ గారు తాను నటనకు పనికి వస్తారని తేల్చేశారు. కానీ ఆ సినిమా మొదలయ్యేందుకు నెల పడుతుందని వేచి ఉండమని కైకాల గారికి చెప్పారు.

అవకాశాల కోసం విశ్వ ప్రయత్నాలు…

ఒక రోజు కైకాల గారు తన మిత్రుడు కె.యల్.ధర్ తో కలిసి బస్ స్టాప్ వద్ద నిలుచున్నారు.  అటుగా వెళుతున్న సూరన్న అనే కళా దర్శకులు కైకాల గురించి వాకబు చేసి దర్శకులు తిలక్ గారు ఎమ్మెల్యే అనే సినిమా తీస్తున్నారు, దానికి రెండవ కథనాయకుని అవసరం ఉంది, నిన్ను ఎంపిక చేయవచ్చునేమో వెళ్లి కలవమని సలహా ఇచ్చాడు. సరే అని వెళ్లి దర్శకులు తిలక్ గారిని కలిశారు కైకాల. తన అభినయాన్ని తిలకించి కైకాలను ఎంపిక చేశారు తిలక్ గారు. కానీ సినిమా మొదలయ్యేందుకు నెల పడుతుందని చెప్పారు. నెల గడిచాక కూడా రోజు ఉదయం, సాయంత్రం దర్శకులు తిలక్ గారి దగ్గరికి వెళ్తూ వస్తూ ఉన్నారు సత్యనారాయణ గారు. అయినా ఫలితం లేదు. ఈలోపు ఆ వేశానికి సత్యనారాయణ గారికి బదులు జె.వి.రమణ మూర్తి గారిని తీసుకున్నారు. కైకాల సత్యనారాయణ గారికి మరో చిన్న విషయం ఇవ్వాలనుకున్నారని సూరన్న ద్వారా తెలుసుకున్నారు కైకాల సత్యనారాయణ గారు.

వెంటాడిన దురదృష్టం, చేజారిన అవకాశాలు…

ఏ.వీ.ఎం వారి భూకైలాస్ లో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. ఇలా అవకాశాలన్నీ చేతికి అందినట్లే అంది జారిపోతుండడంతో కైకాల గారికి విపరీతమైన పట్టదుల పెరిగిపోయింది. ఎంత చిన్నదైనా గానీ ఏదో ఒక వేషం వేసి ఈ వెతుకులాటకు స్వస్తి చెప్పి ఇంటికి వెళ్లాలని అనుకున్నారు కైకాల గారు. అవకాశాలు వచ్చినా పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ చిన్న వేషంతో సరిపెట్టుకుని తిరిగి వచ్చానని చెప్పుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. సినిమా వేషాలు దొరకని పరిస్థితి విసిగిపోయిన దశలో సైన్యంలోనైనా చేరదామనుకుని మద్రాసులోని తేనాం పేటలో మిలిటరీ కార్యాలయమునకు వెళ్లి అక్కడ ఇంటర్వ్యూ లో ఎంపికయ్యారు. తీరా ఇంటర్వ్యూలో తన స్వస్థలం గుడివాడని అని చెప్పగానే ఆ ప్రాంతం వాళ్ళ సెలక్షన్స్ వైజాగ్ లోనే అంటూ కైకాల గారిని తిరస్కరించారు.

పార్కులోనే పడుకున్న కైకాల…

అక్కడ కూడా తిరస్కారం ఎదురు కావడంతో అవకాశాలు వెతుకుతున్న సమయంలో రూము లేక 15 రోజులు ఒక పార్కులోనే పడుకునే వారు. ఇంత కఠిన సమయంలో కూడా మద్రాసును వదిలి వెళ్ళకూడదు అని నిశ్చయించుకొని అక్కడే ఉండి ప్రయత్నాలు చేసేవారు కైకాల గారు. రూము దొరికిన తరువాత రోజంతా అలిసిపోయిన కారణంగా కాఫీ ఆర్డర్ చేశారు. కాఫీ అంతా తాగిన తరువాత అందులో అడుగుభాగంలో సాలెపురుగు ఉండటం గమనించారు సత్యనారాయణ గారు. తనతో బాటు తన గదిలో ఉండే తోటి  సభ్యులు సాలెపురుగు వల్ల శరీరంలో విషము ఎక్కుతుందని దవాఖానకు వెళ్లమని చెప్పగా వినకుండా గదిలోనే ఉండిపోయారు. నాకు భవిషత్తు ఉంటే నేను ఉదయం లేస్తాను లేకపోతే ఈ సాలెపురుగు విషం వల్ల చనిపోతాను అని చెప్పి పడుకున్నారు. ఆ ఉదయం ఆరోగ్యంగా లేవటం సినీ పరిశ్రమలోకి రావటంతో కైకాల సత్యనారాయణ గారి జీవితమే మారిపోయింది

కన్నీరు పెట్టుకున్న  కైకాల….

ఒక రోజు వీణ స్టూడియోలో ఉండే సూర్యనారాయణ స్వామి అనే ఇంజనీరు ద్వారా ప్రముఖ దర్శకులు బి.ఏ.సుబ్బారావు గారిని కలిశారు సత్యనారాయణ గారు. నందమూరి తారకరామారావు గారిని చిత్రరంగానికి పరిచయం చేసినది బి.ఏ.సుబ్బారావు గారే. తాను సత్యనారాయణ గారి ఒడ్డూపొడవు చూసి నేనే మీకు వేషం ఇచ్చేవాడిని కానీ నా “చెంచులక్ష్మి” సినిమా ఇప్పటికే పూర్తయ్యింది అని చెప్పి తనను “చక్రపాణి” గారి దగ్గరికి వెళ్ళమన్నారు. చక్రపాణి గారు సత్యనారాయణ గారిని సినిమాలకు పనికొస్తావు అంటూనే తన వద్ద వేషాలు లేవని “మాయాబజార్” దర్శకుడు కె.వి.రెడ్డి గారి దగ్గరికి కైకాల గారిని పంపారు. కె.వి.రెడ్డి కైకాల గారిని మరోమారు పరీక్షించి తప్పకుండా అవకాశం ఇస్తానన్నారు. కానీ సత్యనారాయణ గారు సంక్రాంతి పండుగకు వెళ్లి వచ్చేసరికి ఆ పాత్రను ఆర్.నాగేశ్వరరావుకు గారికి ఇచ్చేశారు. దాంతో సత్యనారాయణ గారు కన్నీటి పర్యంతమయ్యారు.

తొలి సినిమా సిపాయి కూతురు (1959)…

తాను పెట్టుకున్న కన్నీళ్లను, బాధపడటాన్ని చూసిన కె.వి.రెడ్డి గారు “అనుకోని పరిస్థితుల్లో వేశాన్ని ఆర్.నాగేశ్వరావుకి ఇవ్వాల్సి వచ్చింది. నేను నీకు దర్శకుడుగా చెప్పడం లేదు. ఓ పెద్దన్నయ్యగా సలహా ఇస్తున్నాను. నువ్వు తప్పకుండా మంచి కళాకారుడివి అవుతావు. ఇంటికి వెళ్ళినా కూడా ఉద్యోగం దొరికే వరకు ఖాళీగా ఉండాలి కదా. అదేదో ఇక్కడే ఉండు” అంటూ ఓదార్చి తాను ఎరిగిన వాళ్ళందరికీ కైకాల గురించి చెప్పారు. వాళ్లలో ఒకరైన డి.ఎల్.నారాయణ గారు కైకాల సత్యనారాయణ గారిని పిలిపించారు. తనకు హీరో వేషం ఇస్తూనే మూడేళ్లు తన దగ్గర పనిచేయాలని ఆంక్ష విధించారు. ఆ విధంగా జమున కథనాయికగా, కైకాల గారు తొలిసారి కథనాయకుడిగా నటించిన సినిమా “సిపాయి కూతురు” (1959).

ఎన్టీఆర్ లా పోలివున్నాడని ప్రశంస…

కొవ్వలి లక్ష్మీనరసింహారావు గారు వ్రాసిన “సిపాయి కూతురు” అనే పేరుగల నవల ఆధారంగా నిర్మించబడిన సినిమా అది. తాను ఈ సినిమాలో నటించగానే తనను అచ్చం ఎన్టీఆర్ లా ఉన్నాడు అని కితాబిచ్చారు. మరో ఐదు సినిమాల్లోనే హీరోగానే అవకాశం వచ్చింది. కానీ డి.ఎల్.నారాయణ గారు ఒప్పుకోకపోవడంతో కైకాల గారికి ఆ సినిమాలు చేయడం కుదరలేదు. ఈలోపు “సిపాయి కూతురు ” పరాజయం పాలైంది. ఆ తర్వాత డి.ఎల్.నారాయణ గారు ఒప్పుకున్నా కూడా తనకు బయట సినిమాలు చేజారిపోయాయి. సేలం మోడరన్ థియేటర్స్ నిర్మిస్తున్న “సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి” చిత్రానికి నన్ను హీరోగా తీసుకోవాలంటూ విఠలాచార్య గారు సిఫారసు చేశారు. “హీరో అంటే పరిశ్రమలో ఎక్కువ పోటీ ఉంది. విలన్ల కొరత ఉంది. కనుక ఆ వేషాలు ఒప్పుకో నీ భవిష్యత్తుకు ఢోకా ఉండదన్నారు.

విఠలాచార్య సూచనతో “విలన్” గా….

విఠలాచార్య గారి సూచనలను  అంగీకరించడంతో కైకాల గారికి “కనకదుర్గ పూజా మహిమలు” సినిమాలో ప్రతినాయకుడి వేషం ఇచ్చారు. అలా ఒకటి, రెండు సినిమాలలో అవకాశాలు ఇస్తూనే ఎన్టీఆర్ గారితో “అగ్గిపిడుగు” సినిమా తీశారు. అందులో ఎన్టీఆర్ గారు ద్విపాత్రాభినయం. ఒక విలన్ రాజనాల అయితే మరో విలన్ పాత్రలో కైకాల సత్యనారాయణ గారు నటించారు. ఆ సినిమా విఠలాచార్య గారు ఎన్టీఆర్ గారితో తీసిన మొదటి చిత్రం కావడం, అలాగే 28 రోజులలోనే నిర్మాణం పూర్తి చేసుకోవడం, ఇలాంటి ప్రత్యేకతలు ఉండటంతో చిత్రపరిశ్రమ లోని ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా తరువాత సత్యనారాయణ గారు వెనుదిరిగి చూసింది లేదు. ఎన్టీఆర్ గారు హీరో అయితే, తనకు ప్రతి నాయకుడిగా కైకాల గారు ఉండాల్సిందే. కైకాల సత్యనారాయణ గారిని ఉన్నత స్థానంలో నిలిపింది ఎన్టీఆర్ గారే.

అవకాశాలు ఇచ్చిన ఎన్టీఆర్…

ఎన్టీఆర్ గారు కైకాల గారిని ఎంతో అభిమానించేవారు. అప్పట్లో “కృష్ణావతారం” సినిమాలో దుర్యోధనుడి పాత్రకు ముందుగా యస్వీ రంగారావు గారిని అనుకున్నారు. కానీ యస్వీ రంగారావు గారు తన సొంత సినిమా పనుల్లో బిజీగా ఉండడంతో పట్టుపట్టి ఆ వేశాన్ని కైకాల సత్యనారాయణ గారికి ఇప్పించారు. కైకాల గారు విలన్ గా క్రూరత్వం ప్రదర్శించే నటుడిగా పేరు సంపాదిస్తున్న ఆ రోజుల్లో ఎవ్వరూ ఊహించని విధంగా తన సొంత బ్యానర్ ఎన్.ఏ.టి క్రింద నిర్మించిన “ఉమ్మడి కుటుంబం” లో విషాద పాత్రకు కైకాల గారిని ఎంపిక చేసి విలన్ పాత్ర చేయించడమే సాహసం. అంతలోనే “దేవుడు చేసిన మనుషులు” సినిమా విడుదలైంది. మొదటి సినిమాలో కరుణ రసాన్ని ప్రదర్శించిన తాను రెండవ చిత్రంలో హాస్యాన్ని పండించారు.

రాజకీయం…

“ఉమ్మడి కుటుంబం” సినిమా పేరు బలమో ఏమో గానీ ఎన్టీఆర్ అలా మొదట్లో అయిన పరిచయం చివరి వరకు సాగింది. ఎన్టీఆర్ గారు కైకాల గారిని సొంత తమ్ముడు కంటే ఎక్కువగా అభిమానించారు. సాధారణంగా అవుట్ డోర్ లో చిత్రీకరణ వుంటే సత్యనారాయణ గారు బస చేసిన చోటుకి ఎవ్వరినీ అనుమతించేవారు కాదు. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కైకాల గారిని పిలిచి “చివరి వరకు తోడుండాల్సిన వాడివి నువ్వు” అన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున 1996లో మచిలీపట్నం నుండి ఎంపీగా పోటీచేసి గెలిచారు. మళ్ళీ రెండవ సారి పోటీ చేసినప్పుడు తన పార్టీ వాళ్లే  తనకు వ్యతిరేకంగా పనిచేయడంతో ఓడిపోయారు. రాజకీయాలు అబద్ధాలు ఆడే వాళ్లకు, కుయుక్తులు పడే వాళ్లకు తప్ప స్వచ్ఛంగా వ్యవహరించే వారికి కాదని తెలుసుకొన్న కైకాల సత్యనారాయణ గారు రాజకీయాలనుండి ప్రక్కకు తప్పుకున్నారు.

కుటుంబం…

కైకాల సత్యనారాయణ గారికి భార్య నాగేశ్వరమ్మ తో 10 ఏప్రిల్ 1960 లో వివాహం జరిగింది.  వీరికి ఇద్దరు కుమార్తెలు మరియు ఇద్దరు కుమారులు ఉన్నారు. కైకాల సత్యనారాయణ గారి తమ్ముడు నాగేశ్వరరావు గారు సత్యనారాయణ గారి సంస్థ అయిన రమ ఫిలిమ్స్ ను చూసుకుంటున్నారు. సత్యనారాయణ గారి ఇద్దరమ్మాయిలు కూడా బాగానే స్థిరపడ్డారు. రాముడు, కృష్ణుడు తప్ప అన్ని ప్రధాన పౌరాణిక పాత్రలు వేశారు. గుడివాడలో “కైకాల సత్యనారాయణ పురపాలక కళామందిర్” అని ఓపెన్ థియేటర్ నిర్మాణంతో పాటు అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు. ఐదు దశబ్దాల నట జీవితంలో ప్రేక్షకులను తన అద్భుతమైన నటనతో మెప్పించారు. చివరిదశలో వయస్సు సహకరించకపోవడం, ఓపిక తగ్గడంతో మంచి వేషమైతే తప్ప అంగీకరించేవారు కాదు. ఒక లక్ష్యం పెట్టుకున్న తర్వాత ఎన్ని ఇబ్బందులు వచ్చినా కష్టాలను లెక్క పెట్టకూడదని అనేవారు కైకాల సత్యనారాయణ గారు.

మరణం…

తన సినీ ప్రస్థానంలో కైకాల సత్యనారాయణ గారు పోషించని పాత్ర లేదు, కలిసి నటించని నటుడు లేడు. ఒకప్పటి ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు దగ్గర నుండి తర్వాత తరమైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వరకు తరాల నటులకు వారధిగా నిలిచారు కైకాల గారు. ఆ తరువాత కూడా మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజ లాంటి ఎంతోమంది ఈతరం నటులతో కూడా కైకాల గారు నటించారు. దశాబ్దాల తన ప్రస్థానంలో 200 మందికి పైగా దర్శకులతో పని చేసిన కైకాల గారు 770కి పైగా సినిమాల్లో నటించారు. లెక్కలేనన్ని పురస్కారాలు అందుకున్నారు. కరోనా కారణంగా సినిమాలకు దూరమైన పురాణేతిహాస నటులు కైకాల గారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తన 87 ఏళ్ల వయస్సులో 23 డిసెంబరు 2022 శుక్రవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. కైకాల గారు నవంబరు 2021 లో తన ఇంటిలో ఆకస్మికంగా పడిపోయిన తరువాత ఆసుపత్రిలో చేరారు. కొద్దికాలం చికిత్స తరువాత కోలుకున్నారు.

విశేషాలు…

★ నవరస నటనా సార్వభౌముడిగా ప్రఖ్యాతిగాంచిన కైకాల..

★ కైకాల సత్యనారాయణ నటించిన మొదటి చిత్రం “సిపాయి కూతురు”..

★ కైకాల సత్యనారాయణ నటించిన చివరి చిత్రం “మహర్షి”…

★ పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాల్లో ఎన్నో పాత్రలు పోషించిన కైకాల 28 పౌరాణిక, 51 జానపద, 9 చారిత్రక చిత్రాల్లో నటించారు..

★ 200 మందికిపైగా దర్శకులతో పనిచేసిన కైకాల సత్యనారాయణ..

★ కైకాల నటించిన చిత్రాలలో 100 రోజులు ఆడిన చిత్రాలు 223. అర్ధశతదినోత్సవాలు జరుపుకున్న సినిమాలు 59, కైకాల నటించిన సంవత్సరం ఆడిన చిత్రాలు 10..

★ ఇంటర్ రెండో సంవత్సరంలో నాటకరంగంలో కైకాల ప్రవేశం. నాటకరంగ అనుభవంతో సినిమాల్లో వేషం కోసం మద్రాసు వెళ్లిన కైకాల..

★ కైకాల సత్యనారాయణ ను నటుడిగా గుర్తించిన డి.ఎల్.నారాయణ. తొలి సినిమాతోనే కథానాయకుడి అవకాశాన్ని అందుకున్న కైకాల..

★ “సిపాయి కూతురు” చిత్రంతో కథానాయకుడిగా తెరకు పరిచయమైన కైకాల..

★ కైకాల సత్యనారాయణకు కలిసొచ్చిన ఎన్టీఆర్ పోలికలు. కైకాలను ఎన్టీఆర్ కు నకలుగా భావించిన పరిశ్రమ పెద్దలు..

★ సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి చిత్రంలో తొలిసారిగా ఎన్టీఆర్ తో కలిసి నటించిన కైకాల..

★ విఠలాచార్య దర్శకత్వంలో తొలి ప్రతినాయకుడి వేషం వేసిన కైకాల. “కనకదుర్గ పూజ మహిమ” చిత్రంలో తొలిసారి ప్రతినాయకుడి పాత్ర పోషించిన కైకాల..

★ ఎన్టీఆర్ “అగ్గిపిడుగు” చిత్రంతో మలుపుతిరిగిన కైకాల సినీ జీవితం. ఎన్టీఆర్ తో కలిసి 101 చిత్రాల్లో నటించిన కైకాల సత్యనారాయణ..

★ ఎన్టీఆర్ తో పోరాట సన్నివేశాల్లో పోటాపోటీగా నటించిన కైకాల..

★ యమగోల, యమలీల చిత్రాల్లో యముడిగా అలరించిన కైకాల. యమగోల, యమలీల చిత్రాల్లో యముడిగా అలరించిన కైకాల..

★ పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు పాత్రలు పోషించిన కైకాల. సాంఘిక చిత్రాల్లో రౌడీ, తండ్రి, తాత పాత్రల్లో నటించిన కైకాల..

★ రమా ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థను స్థాపించిన కైకాల సత్యనారాయణ. కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు చిత్రాలను నిర్మించిన కైకాల..

★ 1994లో “బంగారు కుటుంబం” చిత్రానికి నంది పురస్కారం. 2011లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్న కైకాల..

★ కైకాలకు బాగా నచ్చిన సంభాషణ “నీవా పాండవ పత్ని”..

★ 1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కైకాల సత్యనారాయణ. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి లోక్ సభకు కైకాల ఎన్నిక..

★ తొలి రోజుల్లో ‘”రాముడు-భీముడు” వంటి ఎన్.టి.ఆర్. ద్విపాత్రాభినయ చిత్రాలలో ఆయనకు డూప్ గా నటించారు కైకాల..

★ 60 సంవత్సరాల సినీజీవితంలో కైకాల 777 సినిమాల్లో నటించాడు. కైకాల పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదును పొందారు.

★ తెలుగు సినీ పరిశ్రమలో ఎస్.వి.రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో కైకాల ఒకరు. తన కెరీర్‌లో మొత్తం 777 సినిమాలలో కైకాల నటించారు. 28 పౌరాణిక చిత్రాలు, 51 జానపద చిత్రాలు, 9 చారిత్రక చిత్రాలలో కీలక పాత్ర పోషించారు.

★ మొత్తం 200 మంది దర్శకులతో కైకాల పనిచేశారు. ఆయన నటించిన సినిమాలలో 223 సినిమాలు 100 రోజులు ఆడాయి. 59 సినిమాలు అర్ధశతదినోత్సవాలు జరుపుకున్నాయి. 10 సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. 10 సినిమాలు ఒక సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువ ఆడాయి.

★ 777 సినిమాలు ఇప్పటిదాకా 28 పౌరాణిక చిత్రాలు, 51 జానపద చిత్రాలు, 9 చారిత్రక చిత్రాలు, 200 మంది దర్శకులతో పనిచేసాడు 223 సినిమాలు 100 రోజులు ఆడాయి. 59 సినిమాలు అర్ధశతదినోత్సవాలు జరుపుకున్నాయి. 10 సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి

10 సినిమాలు ఒక సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువ ఆడినవి..

Show More
Back to top button