CINEMATelugu Cinema

కళామతల్లి ఆంధ్ర నాటక రంగానికి అర్పించిన ఆణిముత్యం.. ఈలపాటి రఘురామయ్య..

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా ఏ గురువూ నేర్పని ఈలపాటతో రఘురామయ్య జన్మించారు. అది అమృతగానం. కృష్ణపరమాత్మ స్వరూపాన్ని అలంకరించి చేసిన నటన నేటికీ ఆంధ్ర నాటక రంగానికి అఖండ జ్యోతి. ఆరున్నర దశాబ్దాలు ఆంధ్ర నాటక సంఘంలో ప్రతీ ప్రదర్శనలోనూ వైవిధ్యమైన నటన, గానం అందించి ప్రేక్షకులకు వినూత్నమైన భావ స్పందన కలగచేసినాడు. గానంలో అమృతం, నటనలో లాలిత్యం, పాత్రోచిత గాంభీర్యం ఆయన సొత్తు. తెలుగు నాటక ప్రదర్శనలో స్త్రీ, పురుష పాత్రను అద్భుతంగా అభినయించడమే కాకుండా చలనచిత్ర రంగంలోకి కూడా ప్రవేశించి అనేక పాత్రలు ధరించాడు. వ్రేలును వెదురుగా మలచి, ఈలను వంశీరవంగా పలికించిన గంధర్వుడు ఎవరో కాదు. ఈలపాట రఘురామయ్య గా ప్రసిద్ధి చెందిన కళ్యాణం వెంకట సుబ్బయ్య.

ఆయన రంగస్థలం మీద పద్యం ఆలపిస్తుండగా ప్రత్యక్షంగా చూసిన వారు అదృష్టవంతులు. మల్లె పూవు గుబాళింపు, పల్లానికి నీరు పారినంత సులువుగా, పున్నమి నాడు ఎగిసిన కెరటం అంత హుషారుగా వుండే స్వర మాధుర్యం ఆయనది. అదే నాటక ప్రేక్షకులను పరవశులను చేసింది. ఆ గళం  గాంధర్వం. ఆయన ఇంటిపేరు కల్యాణం. తన అద్వితీయ గానంతో, అభినయ వైవిథ్యంతో రంగస్థల, సినీ రంగాలలో శాశ్వత కీర్తి పొందిన కళాకారుడు కల్యాణం రఘురామయ్య. ఆయన
ఈలపాట రఘురామయ్య గా కూడా ప్రసిద్ధి పొందారు.

సినిమారంగం బాగా ప్రచారంలోకి వచ్చిన తరువాత కూడా తెలుగునాట పౌరాణిక నాటకాలకు ఆదరణ ఏమాత్రం తగ్గకుండా నిలిచింది అంటే అందుకు కారణం నాటక ప్రముఖులు “ఈలపాట రఘురామయ్య” వంటి వారు.  “శ్రీకృష్ణుడు” పాత్రలో రఘురామయ్య నటిస్తున్నారు అని ప్రకటిస్తే అనేక గ్రామాల నుండి బండ్లు కట్టుకుని నాటకశాల దగ్గరికి వచ్చేవారు. అంతగా తాను తన శ్రీకృష్ణ వేషంతో ప్రభావితం చేశాడు. అంతేకాదు అదనంగా శ్రీకృష్ణుడు వేణునాదాన్ని చేతివ్రేలితో వినిపించగలిగిన నేర్పు ఈలపాట రఘురామయ్య గారిలో ఉంది.

డాక్టరు సి. నారాయణ రెడ్డి ఒక సందర్భంలో అన్నట్టు వ్రేలును వెదురుగా మలిచి, ఈలను వంశీరవంగా పలికించిన గంధర్వ అంశ రఘురామయ్య గారిది. దురభ్యాసాలు లేని జీవనశైలి, క్రమశిక్షణ, కఠోర వ్యాయామం, ప్రాణాయామంతో సిద్ధించిన దేహదారుఢ్యం, అందం, ఆకర్షణ అన్నిటికీ మించి పేరు ప్రతిష్ఠలు, లక్షలాది అభిమానులు ఉన్నప్పటికీ రఘురామయ్య గారు తన తల్లిగారు జీవించి ఉన్నంత కాలం ఆమె పాదాలకు నమస్కరించిన తర్వాత మాత్రమే వేదికను ఎక్కేవారు. నిగర్వి, నిరాడంబరుడు అయిన రఘురామయ్య తన మేకప్ సామాగ్రి, ఆభరణాలు, వస్త్రాలు తనే తీసుకువెళ్లి తన ముఖానికి అలంకరణ చేసుకునేవారు. 75 సంవత్సరాల వయస్సులో కూడా కంటి అద్దాలతో పనిలేని మీ ఆరోగ్య రహస్యం ఏమిటి అని ఎవరైనా రఘురామయ్య గారిని అడిగితే మాట్లాడం తెలిస్తే పోట్లాడరాదు,  తినడం తెలిస్తే రోగం రాదు అనేవారు.


జీవిత విశేషాలు…

జన్మ నామం :  కల్యాణం వెంకట సుబ్బయ్య

ఇతర పేర్లు   :    ఈలపాట రఘురామయ్య

జననం    :    05 మార్చి 1901

స్వస్థలం   :  సుద్దపల్లి, గుంటూరు జిల్లా

తండ్రి  :  కళ్యాణం నరసింహ రావు

తల్లి  :  వేంకట సుబ్బమ్మ

జీవిత భాగస్వామి :  సావిత్రి (రోహిణి వెంకట సుబ్బయ్య, సీతమ్మ ల రెండవ పుత్రిక). 92 యేళ్ళ వయస్సు ఉండగా, 08 డిసెంబరు 2014న మరణించారు.

పిల్లలు   :   ఒకే కుమార్తె, తోట సత్యవతి

వృత్తి      :   సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు

మరణ కారణం   :   గుండెపోటు

మరణం   :   24 ఫిబ్రవరి 1975, హైదరాబాదు, తెలంగాణ

నేపథ్యం…

ఈలపాట రఘురామయ్య గారు గుంటూరు జిల్లా సుద్దపల్లిలో 05 మార్చి 1901 తేదీన జన్మించారు.  వీరి తండ్రి కళ్యాణం నరసింహారావు, తల్లి వెంకటసుబ్బమ్మ. గుంటూరు జిల్లాలోని సుద్దపల్లిలో పుట్టిన రఘురామయ్య గారికి పుట్టుకతోనే సంగీతం అబ్బింది. పుట్టుకతో సంగీతం వచ్చింది గనుక పశువులు కాస్తూ ఆవులను తన గానంతో నిలిపివేయగలిగేవాడు. రఘురామయ్య గారు పెద్దగా చదువుకోలేదు. వీరు ఆంధ్ర నాటకరంగంలో చిరస్మరణీయలు అయిన యడవల్లి సూర్య నారాయణ, దంటు వెంకట కృష్ణయ్య గార్ల  ప్రోత్సాహంతో  శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. ఒకసారి అటుగా వస్తున్న వారిద్దరు ఎక్కడి నుంచో వినివిస్తున్న గానమాధుర్యానికి నిలిచిపోయారు. ఆ గాయకుడి జాడ కోసం చూశారు. ఒక పొదలో బాలుడు నోటిలో వ్రేలు పెట్టుకొని  మధురంగా పాడుతున్న తీరు గమనించి తనని వివరాలు అడిగారు.

“నా పేరు వెంకటసుబ్బయ్య. పశువులు కాచుకుంటాను. ఎటూ తోచక అప్పుడప్పుడు ఇలా పాడుకుంటాను” అని వినయంగా చెప్పారు. నిజానికి రఘురామయ్య గారివి మెరిసే కళ్లు, అందమైన ముఖం, ఉంగరాల జట్టు. వీటన్నిటి చూసి తమతో తీసుకువెళ్లి నాటక శిక్షణ ఇప్పించారు యడవల్లి సూర్యనారాయణ, దంటు వెంకటకృష్ణయ్య లు. అలా   నేర్చుకున్న సంగీతం, జన్మతః ప్రాప్తించిన గాత్ర సౌందర్యం, ఈలపాట నైపుణ్యం, చక్కటి ఆహార్యంతో నాటి ప్రేక్షకులపై చెరిగిపోని ముద్ర వేశారు. అసలు పేరు రఘురామయ్య గారు పాటిస్తే ప్రేక్షకులు ఆయన ఇంటిపేరు “కళ్యాణం” తీసేసి ఈలపాటగా స్థిరపరిచారు. గుంటూరు చుట్టుప్రక్కల మొదలైన రఘురామయ్య గారి నాటకాలు అనతి కాలములోనే ఆంధ్రదేశమంతటా ప్రదర్శనకు నోచుకున్నాయి. బహుశా నాటి నైజాం ప్రాంతంతో సహా ఈలపాట రఘురామయ్య నటన మెచ్చుకోని తెలుగువారు లేరంటే ఆశ్చర్యం లేదు.


నాటకరంగం…

తెలుగు నాటకాలకు మాత్రమే ప్రత్యేకము పద్య ఉటంకము.  అటువంటిది రఘురామయ్యగారు తన పద్యాలను పాత్ర యొక్క స్వభావము, సందర్భానికి తొడరికగా సుదీర్ఘమైన రాగాలాపనతో మొదలుపెట్టి, శ్రోతలను మంత్రముగ్ధులని చేస్తారని ప్రతీతి.  చెన్నపట్నంలోని నాటకాలు వేశారు ఈలపాట రఘురామయ్య గారు. శ్రీకృష్ణుడు అంటే ఇలా ఉంటాడని రఘురామయ్య గారిని చూసి తొలిరోజులలో తెలుగు వారు తెలుసుకున్నారు. ఆ తర్వాత సినిమాల ద్వారా శ్రీకృష్ణ పాత్రను ఎన్టీఆర్ గారు తెలుగువారికి దగ్గర చేశారు. రఘురామయ్య గారు తన పదవ ఏట నుండి మొదలుపెట్టి డెబ్భై ఏళ్ళు వచ్చేవరకు అలుపెరుగని నాటకయానం తనది.

రఘురామయ్య గారు మధ్యమధ్యలో కొన్ని సినిమాలలో పాత్రలు వేసినా, పాటలు పాడినా ఆయన మనసు మాత్రం నాటక రంగం మీదే. అలా వరుసగా అన్ని దశాబ్దాలలో నాటకాలలో మునిగి తేలేవారు రఘురామయ్య గారు. కృష్ణుడు, దుశ్యంతుడు, నారదుడు, తదితర పాత్రలను తాను రంగస్థలం వేదికపై రక్తి కట్టించేవారు. అరవై యేళ్ళ తన వృత్తి జీవితములో అనేక నాటకాలు, ఇరవైవేలకు పైగా ప్రదర్శనలు. ఏడు దశాబ్దాల వయస్సు అంటే ఎవరి శరీరమైన విశ్రాంతి కోరుకుంటుంది. కానీ చేపట్టిన వృత్తిమీద ఎంతో మమకారం, ప్రేమ ఉంటే తప్ప ఎవ్వరైనా ఆ వయస్సులో కూడా శ్రమ పడాలి అనుకోరు.

దాదాపు 60 సంవత్సరాలు నాటక రంగంలో ప్రసిద్ధ నటులందరితో రఘురామయ్య గారు స్త్రీ, పురుష పాత్రలు ధరించారు. తిరుపతి వెంకట కవులు రచించిన పాండవోద్యోగ విజయాలలోని పద్యాలను చక్కగా పాడుతూ, వాటి భావాన్ని వివరిస్తూ, నటించి ప్రచారం చేసిన నటులు వీరు. చలనచిత్ర రంగంలో ఎన్నో కథానాయక పాత్రలు పోషించారు. ఆ రోజుల్లో అందరూ శ్రీకృష్ణుడు పాత్రలో పద్యాలు పాడుతూ, వేణువును మాత్రం చేతితో పట్టుకునేవారు. కానీ రఘురామయ్య గారు మాత్రం తన చూపుడు వ్రేలును నాలిక క్రిందపెట్టి, ఈలపాటతో వేణుగానం చేస్తూ, ప్రేక్షకులకు ఒక అపూర్వమైన అనుభూతి కలిగించేవారు.


తొలి కృష్ణుడు…

పద్యం తెలుగువారి సొంత ఆస్తి. దానిని హృద్యంగా తనదైన శైలిలో, హిందుస్తానీ సంగీత సంగతుల గుబాళింపుతో ఆలపించి ఆబాలగోపాలాన్ని మంత్రముగ్ధం చేసిన రఘురామయ్య గారు వెండితెర మీద తొలి కృష్ణుడు. ఎన్టీఆర్ కు ముందు సినిమా కృష్ణుడుగా అందగాడైన ఈ గాత్రగంధర్వుడు ఎంతో ప్రసిద్ధుడు. విజయవాడకు చెందిన శ్రీ పోతిన శ్రీనివాసరావు (మారుతి సినిమా అధినేత) 1933 లో రూపొందించిన “పృథ్వీపుత్ర” ఈలపాట రఘురామయ్య గారి తొలి చిత్రం కాగా, 1967 లో వచ్చిన “శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న” ఆయన చివరి సినిమా.

శతాధిక చలనచిత్రాలలో నటించిన రఘురామయ్య గారు శాసన 1937 నాటి “రుక్మిణి కళ్యాణం” లో శాంతకుమారి కథనాయికగా నటించగా ఈలపాట రఘురామయ్య గారు శ్రీకృష్ణుడుగా నటించారు. 1946లో మీర్జాపూర్ జమీందారు సతి కృష్ణవేణి గారు నాయకగా, అంజలీదేవి గారు ప్రతినాయకిగా నటించిన “గొల్లభామ” లో రఘురామయ్య గారే కథానాయకుడు. “కుచేల”, “లంకాదహనం”, “కచదేవయాని”, “పాశుపతాస్త్రం”, “మదాలస”, “అగ్ని పరీక్ష”, “చంద్రవంక”, “శ్రీకృష్ణ తులాభారం”, “భక్త మార్కండేయ”, “పాదుకా పట్టాభిషేకం”, “శ్రీకృష్ణరాయబారం”, “చింతామణి”, “ఉషా పరిణయం”, “ఋష్యశృంగ”, “సత్య హరిశ్చంద్ర”, “దక్షయజ్ఞం” మొదలైనవి ఈలపాట రఘురామయ్య చిత్రమాలికలో కొన్ని.


పల్లెటూరి పిల్ల చిత్రం నుండి తప్పుకున్న రఘురామయ్య…

 తెలుగు చిత్ర పరిశ్రమ టాకీలు 1932లో ఆవిర్భవిస్తే 1933వ సంవత్సరంలో ఈలపాట రఘురామయ్య గారు తన మొదటి సినిమా “పృథ్వీపుత్ర” అనే సినిమాతో సినీరంగ ప్రవేశము చేశారు. చూపుడు వ్రేలుని నాలుక క్రింద పెట్టి ఈలపాటతో ఆయన చేసిన వేణు గానం వల్ల ఈలపాటనే తన ఇంటిపేరుగా మారింది. మొదట అక్కినేని నటించిన “పల్లెటూరి పిల్ల” చిత్రంలో అక్కినేని నాగేశ్వరావు గారు ధరించిన పాత్రకు మొదట ఈలపాటి రఘురామయ్య గారినే తీసుకున్నారు. కొంత షూటింగ్ కూడా చిత్రీకరించారు. ఫైటింగ్ సన్నివేశంలో రఘురామయ్య గారు వెనకంజ వేయడమే కాకుండా, తన చేతికి కత్తి గుచ్చుకోవడంతో “మాట, పాట అంటే ఏదో చేస్తాను, కానీ ఈ ఫైటింగ్ లు చేయడం నావల్ల కాదు మరెవరినైనా బుక్ చేసుకోండి” అని దర్శక, నిర్మాత బి.ఏ.సుబ్బారావు గారికి చెప్పిన ఆ చిత్రం నుండి తప్పుకున్నారు ఈలపాట రఘురామయ్య గారు.


“నైటింగేల్ ఆఫ్ ది స్టేజ్”…

సినిమాలలో తన పాటలు పద్యాలు తానే పాడుకోవడం మినహా ఎవ్వరికీ ప్లే బ్యాక్ పాడని రఘురామయ్య ఎన్టీఆర్ గారికి నేపథ్య గానం చేశారు. తాను ఎన్టీఆర్ గారికి పాడిన “శ్రీ రామాంజనేయ యుద్ధం” లో ఆంజనేయుడు పాత్రకు “రామ నీల మేఘశ్యామ”, “శరణు శరణు జానకి రామా” పాటలు ఎంతో ప్రసిద్ధిచెందాయి. ఆరు దశాబ్దాల పాటు వేలాదిగా నాటక ప్రదర్శనలు ఇచ్చిన రంగస్థలం మహా కళాకారుడు రఘురామయ్య గారు. అప్పటి నాటకారంగ దిగజాలైన బళ్లారి రాఘవ, స్థానం నరసింహారావు, ఎర్రబెల్లి సూర్యనారాయణల నాటకాలలో “రాముడు”, “కృష్ణుడు”, “శకుంతల”, “భవానీ శంకరం”, “చింతామణి” పాత్రలకు ఎంతో పేరు పొందారు

ఆంధ్రప్రదేశ్, కలకత్తా, ఢిల్లీ, బొంబాయిలలో ఆయన నాటక ప్రదర్శనలు ప్రేక్షకులను ఉర్రూతలూగించేవి. ఒక ప్రక్క నాటకాలు వేస్తూనే, ఇంకో ప్రక్క సినిమాలలో నటించేవారు రఘురామయ్య గారు. నాటక రంగ సువాసనలతో గొల్లభామలో ఆయన పాడిన “వలపు తేనియలూరిన” పద్యం ఈనాటికి ప్రేక్షకుల మనసుల్లో ఒక రసగుళిక. చేతివ్రేలిని నాలుక క్రింద చొప్పించి మురళీ గానాన్ని తలపించే ఈలపాట సృష్టించి ప్రపంచంలో అంతవరకు ఎవ్వరికీ సాధ్యం కాని ఒక ప్రత్యేకతను సంపాదించుకొని ఈలపాట రఘురామయ్య గా చరిత్ర సృష్టించిన ఈ మహా కళాకారుడుని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ “నైటింగేల్ ఆఫ్ ది స్టేజ్” గా ప్రస్తుతించడం తెలుగువారి సౌభాగ్యం.


మెచ్చుకున్న ప్రధాని ఇందిరాగాంధీ…

ఆ సమయంలో ఈలపాట రఘురామయ్య గారి ఈలపాట గురించి విన్న ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ గారు తన అధికారిక నివాసానికి పిలిపించుకొని ఈలపాట రఘురామయ్య గారి ఈలపాట విన్నారు. ఈలపాట రఘురామయ్య గారు గతంలో ప్రధాని ఇందిరాగాంధీ గారి తండ్రి జవహర్ లాల్ నెహ్రూ గారికి వినిపించిన విషయం చెప్పగానే శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరింత పొంగిపోయారట. ఒకప్రక్క సినిమాలలో నటిస్తూనే మరోప్రక్క నాటకాలు వేస్తుండేవారు ఈలపాట రఘురామయ్య గారు. ఏదిఏమైనా తాను ఎంతగానో ఇష్టపడే నాటకాలు ఆడటం మాత్రం ఆపలేదు.

తాను 70 సంవత్సరాల వయస్సున్నపుడు అది ఏమంత ఎక్కువ వయస్సు కాదన్నది రఘురామయ్య గారి మాట. రఘురామయ్య గారు ప్రతీరోజు వేకువనే లేవటం, శారీరక వ్యాయామం చేయడం, శరీరాన్ని నియంత్రణలో ఉంచుకోవడం రఘురామయ్య గారి దినచర్యలో భాగంగా ఉండేది. శ్రీ కృష్ణ పాత్ర మీద ఆయనకు ఎంతో గౌరవం. ఆ ఆహార్యానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. అందుకే రఘురామయ్య గారిని శ్రీకృష్ణుడి వేషంలో చూడాలని ఎంతోమంది ప్రముఖులు ఎదురుచూసేవారు. సత్యసాయిబాబా ఆహ్వానం అందుకుని వారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా “శ్రీకృష్ణతులాభారం” నాటకం ప్రదర్శించడమే కాక సత్య సాయిబాబా మన్ననలను పొందారు. ఆ సమయానికి రఘురామయ్య వయసు 73 సంవత్సరాలు


విదేశాలలో సైతం…

మే నెల 1972వ సంవత్సరంలో రఘురామయ్య గారు ఇండో నిప్పన్ కల్చరల్ ఎక్స్చేంజ్ సొసైటీ, మద్రాసు వారి ఆధ్వర్యంలో ఒక బృందంలో కౌలాలంపూర్, బ్యాంకాక్, టోక్యో, ఒసాకా, సింగపూర్ లలో పర్యటిస్తూ జపాన్ లో ఒక వేదాంత సొసైటీని సందర్శించారు. ఆ సందర్భంలో రఘురామయ్య గారు వేషధారణతో శ్రీకృష్ణ పాత్రను ధరించి వారి పీఠం ముందు నిలబడ్డారట. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అవతరించాడని భక్తులందరూ సాష్టాంగ ప్రమాణాలు చేశారట. దేవునిగా భావించి భక్తి భావంతో మునిగిపోయారట. వారి ఆశ్రమంలోనే రెండు మూడు రోజులు ఆతిథ్యం ఇచ్చారట. ఇతరుల బట్టలు ఉతికే ఆచారం లేని ఆశ్రమవాసులు చివరికి రఘురామయ్య గారి బట్టలు సైతం వారే చలువచేశారట. దేవుని బట్టలు ఉతికినా కూడా తప్పులేదని ఆ పనిని పవిత్రంగా ఆచరించారట. ఇంతకీ ఆయన కృష్ణ పాత్ర అంత విశిష్టమైనది


నాటకరంగమే మిక్కిలి మక్కువ…

సినీరంగం వేరు, నాటకరంగం వేరు. సినీరంగం ముక్కముక్కలుగా చిత్రీకరించే కళ అది. నటుడి మనఃస్థితిని బట్టి ఏ సన్నివేశాన్ని ఎప్పుడైనా చిత్రీకరణ చేసుకోగలిగేది.   కానీ రఘురామయ్య గారు ఎంచుకున్నది నాటకరంగం. అది మొత్తం ఒక వరుసలో ప్రదర్శన జరగాల్సింది. ఎదురుగా ఉన్న ప్రేక్షకులను అప్పటికప్పుడు మెప్పించాల్సింది. ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వడానికి వీలులేదు. కట్ చెప్పి మరో సన్నివేశానికి అవకాశం అస్సలు ఉండదు. ఉంటే “వన్స్ మోర్” లు ఉంటాయి, అంతే. అందుకే నాటకానికి ఎంతో శ్రమ ఉంటుంది. ఆ శ్రమను తట్టుకుని 70 సంవత్సరాల వయస్సులో నాటకాలను ఎంతో హుషారుగా వేయడమే రఘురామయ్య గారి జీవిత విశేషం.

ఆ వయస్సులో రఘురామయ్య గారు భారత సాంస్కృతిక బృందంలో సభ్యుడిగా జపాన్ తో పాటు ఇతర తూర్పు ఆసియా ఖండ దేశాలకు వెళ్ళారు. అక్కడ ఆయన కృష్ణుడిగా మేకప్ వేసుకొని బయటకు వచ్చేసరికి జపాన్ లోని రామకృష్ణ మిషన్ సభ్యులందరూ లేచి నిలబడి రఘురామయ్య గారికి నమస్కారం చేశారు. అంత గొప్పగా ఉండేది ఆయన కృష్ణుడు వేషం. రఘురామయ్య గారిచేత కృష్ణుడి వేషం వేయించాలని సినీ రంగంలో కొందరు 60 ల్లోనే ప్రయత్నించారు. ఆ సంవత్సరంలోనే రఘురామయ్య గారి జీవితంలో వరుసగా మరువలేని సంఘటనలు జరిగాయి. కేంద్ర, సంగీత, నాటక అకాడమీ పురస్కారం తనను వరించింది. ఆ పురస్కారాన్ని నాటి రాష్ట్రపతి తెలుగు ప్రముఖుడు వి.వి.గిరి చేతుల మీదుగా రఘురామయ్య గారు అందుకున్నారు.


మరణం…

ఈలపాట రఘురామయ్య గారిని 1975లో భారత ప్రభుత్వము వారి పద్మశ్రీ పురస్కారము వరించింది. 1975 సంవత్సరం జనవరి నెల గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ప్రకటించిన పురస్కారాల్లో రఘురామయ్య పేరు ఉంది. తనకు “పద్మశ్రీ” పురస్కారం ప్రకటించారు. ఆ పురస్కారాన్ని ప్రకటించిన తరువాత హైదరాబాదు నగరంలో తనకు వరుసగా సన్మానాలు జరిగాయి. అందరూ ఈలపాట రఘురామయ్యను పొగడ్తలతో ముంచెత్తారు. మచిలీపట్నం వారు రఘురామయ్యకి కనకాభిషేకం తలపెట్టారు. ఈలపాట రఘురామయ్య చేత శ్రీకృష్ణుడు పాత్రలో నాటక ప్రదర్శన, అమోఘస సన్మానం. ఆ ప్రదర్శనకు వెళ్లాలన్నది రఘురామయ్య గారి బలమైన కోరిక.

కానీ ఈలపాట రఘురామయ్య గారి ఆరోగ్యం ఎంత మాత్రం బాగోలేదు. ఇంట్లో వాళ్ళు వెళ్ళొద్దని సూచించారు. అభిమానులు నిరుత్సాహపడరా వైద్యులు అలానే చెబుతారు, నేను వెళతాను. నేను 80 ఏళ్ల వరకు బ్రతుకుతాను. నాకు ఏమి ఢోకా లేదు అని ఇంట్లో వాళ్లకు చెప్పి తనకు తానుగా ఎనిమా తీసుకొని వేడి నీళ్లు పెట్టుకున్నారు. కానీ ఇంతలో తన ఒళ్ళు చల్లబడింది. హడావిడిగా ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. గుండెపోటు వచ్చిందని చికిత్స చేశారు. ఆ గుండెపోటును తట్టుకున్నారు అని వైద్యులు అనుకుంటుండగానే, తనకు రెండోసారి మళ్లీ గుండెపోటు వచ్చింది. అంతే ఆ రెండో గుండెపోటును తట్టుకోలేకపోయారు. ఈలపాట రఘురామయ్య గారు బందరులో జరిగే కనకాభిషేకానికి అందుకోలేకపోయారు. ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీని కూడా అందుకోలేకపోయారు. 24 ఫిబ్రవరి 1975 నాడు ఈలపాట రఘురామయ్య గారి జీవితం సుఖాంతమైంది.

కుటుంబం…

ఈలపాట రఘురామయ్య గారు 1938లో బాపట్లకు చెందిన రోహిణీ వెంకటసుబ్బయ్య, సీతమ్మ దంపతుల కుమార్తె, రంగస్థల నటి ఆదోని లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు సంతానం కాగా వారిలో రూపాదేవి ప్రముఖ తెలుగు, తమిళ సినీ టెలివిజన్ నటి, కళ్యాణం రామకృష్ణ టి.వి. యాంకర్ మరియు నిర్మాత. వీరిద్దరూ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇంకా సంపత్, అండాళ్ లక్ష్మి, శ్రీధర్ ఐదుగురు సంతానం. రఘురామయ్య గారి భార్య ఆదోని లక్ష్మి తన 92 సంవత్సరాల వయస్సులో అంటే 08 డిసెంబరు 2014న విజయవాడలో వృద్ధాప్యం కారణంగా మరణించారు.

వీరి మనుమలు డాక్టర్ టి.వి.ఎస్ గోపాల్, చింతల రత్న, మరియు గంగిశెట్టి రాజా. రఘురామయ్య గారి బావమరిది రోహిణి వెంకయ్య కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (రిటైర్డ్) మరియు అతని భార్య డా. రోహిణి వెంకట సుందర వరద రాజేశ్వరి. ఈమె అనేక పుస్తకాల ప్రసిద్ధ భక్తి రచయితలు మరియు సభ్యులు. శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థానం. వారి కుమారుడు రోహిణి మహేష్ భక్తి రచయిత. తాను అనేక వ్యాసాలు వ్రాశారు. శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థానం లో సభ్యుడు. రఘురామయ్య వారసత్వాన్ని పురస్కరించుకుని ఇటీవల ఆయన జన్మస్థలమైన సుద్దపల్లిలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

విశేషాలు…

★ ఈలపాట రఘురామయ్య గారు పురుష పాత్రలతో పాటు శకుంతల, చిత్రాంగి, చింతామణి మొదలైన స్త్రీ పాత్రలను ముగ్ధ మనోహరంగా అభినయించేవారు.

★ తాను నాటక రంగంలో సుమారు 20,000 నాటక ప్రదర్శనలు ప్రదర్శించడమే కాక దాదాపు 100 సినిమాలలో ప్రముఖ పాత్రలను ధరించారు.

★ 72 సంవత్సరాల వయస్సులో ఘనంగా పద్యాలు పాడుతూ దమ్ముపట్టి ఈలపాట పాడే ఘనత కూడా ఈలపాట రఘురామయ్య గారిదే.

★ దగ్గర దగ్గర కేంద్రాలలో ప్రదర్శించే నాటకాలలో ఒకే రాత్రి మూడు ప్రదర్శనలో పాల్గొన్న ఘనత కూడా ఈలపాట రఘురామయ్య గారిదే.

★ ప్రతినిత్యము శరీర పరిశ్రమను, యోగాభ్యాసం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకొని, నిత్య యవ్వనుడిలా నిలబడగలిగిన ఘనత కూడా ఈలపాట రఘురామయ్య గారిదే.

★ కళామతల్లి “ఆంధ్ర నాటక రంగము” కు అర్పించిన గొప్ప ఆణిముత్యం రఘురామయ్య గారు.

★ గొప్ప చదువులు లేకపోయినా ఆంధ్ర నాటక రంగానికి గౌరవం తెచ్చిన నటసార్వభౌముడు ఈలపాట రఘురామయ్య గారు.

★ ఆంధ్ర నాటక రంగంలో అద్వితీయ ప్రతిభను, అసమాన కళా పిపాసను, మహత్తర కళా శక్తిని అలవర్చుకున్న కళాతపస్వి ఈలపాట రఘురామయ్య గారు.

Show More
Back to top button