CINEMATelugu Cinema

దక్షిణ భారత సినీ రంగంలో తొలి మహిళా సూపర్ స్టార్.. కన్నాంబ.

ఆంధ్ర రాష్ట్రములోని ఏలూరులో కన్నాంబ హరిశ్చంద్ర నాటకం జరుగుతుంది. అందులో స్త్రీ పాత్ర ధారి అయిన ఒక పురుషుడు (ఆ రోజుల్లో నాటకాలలో స్త్రీ పాత్రలు కూడా పురుషులే ధరిస్తూ ఉండేవారు) పద్యాలు చదువుతున్నాడు. అనుకోకుండా ముందు వరుసలో కూర్చుని నాటకాలు చూస్తున్న వారిలో ఒక 15 సంవత్సరాల అమ్మాయి లేచి నిలబడి ఏమిటండీ అలాగేనా పద్యాలు చదవడం? నీ కంటే నేను బాగా పద్యాలు చెప్పగలను అన్నది. ఆ సన్నివేశం చూసిన నాటక సమాజం వాళ్ళు అవాక్కయ్యారు.

అంతలోనే నాటక నిర్వాహకులు “నీకు అంత ధైర్యం ఉంటే వేదిక మీదికి వచ్చి చెప్పు” అన్నారు. వెంటనే ఆ అమ్మాయి ఏ మాత్రం భయపడకుండా వేదిక ఎక్కి “చంద్రమతి” పాత్రకు సంబంధించిన అన్ని పద్యాలు కూడా అనర్గళంగా పాడింది. అది విన్న ప్రేక్షకులు ఆమెకు “వన్స్ మోర్” చెప్పారు. అక్కడి నుండి ప్రారంభించిన తన నాటక సమాజంలో ప్రధాన పాత్రధారి అయ్యారు. ఆ అమ్మాయి పసుపులేటి కన్నాంబ గారు. తరువాత కాలంలో సినిమాలలో అగ్ర కథానాయికగా వెలుగొందారు. సినీ నిర్మాత గా మారి ఎన్నో పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలను నిర్మించారు.

రాగయుక్తంగా పద్యం చదివే వాళ్ళందరూ నటులనిపించుకున్న ఆ రోజుల్లో నటిగా రంగస్థలం మీద అడుగుపెట్టిన పసుపులేటి కన్నాంబ గారు కూడా నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మంచి రూపంతో పాటు, చక్కని గొంతు, స్పష్టమైన ఉచ్ఛారణ కలిగి ఉండడం కన్నాంబ గారికి బాగా కలిసి వచ్చింది. అందుకే రాగానికి భావాన్ని, భావానికి భావ ప్రకటనని జోడించి కరుణ రసాన్ని, రౌద్ర రసాన్ని ప్రదర్శించి మంచి నటి అనిపించుకున్నారు.

నాటక రంగం నుండి సినిమాల్లోకి ప్రవేశించి తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రంలో కూడా నటించి మూడు తరాల ప్రేక్షకులను అలరించిన అద్భుత నటి కన్నాంబ గారు. అంతేకాదు తనని ఆదరించిన తెలుగు, తమిళ భాషల్లో సొంతంగా సినిమాలు నిర్మించి ఆనాడు ఉన్న హీరోయిన్లలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఎన్టీఆర్ గారు, అక్కినేని గారు, ఎస్వీఆర్ గారు వంటి ప్రముఖ నటులతో తాను నిర్మించిన చిత్రాల్లో తాను కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా అభివృద్ధికి తనవంతు కృషి చేసిన కన్నాంబ గారు, ఆమె భర్త కె.బి.నాగభూషణం గారు తెరస్మరణీయులు, చిరస్మరణీయులు.

కన్నాంబ గారి జీవితం, ఆవిడ నేపథ్యం, తాను ఎదిగిన తీరు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన భర్తతో సృష్టించిన రికార్డులు, అలాగే చిట్టచివరి రోజుల్లో తన భర్త అనుభవించిన దయనీయ పరిస్థితులను చూస్తే కన్నాంబ గారి చరిత్ర ఒక సినిమా కథలా అనిపిస్తుంది. తాను చిత్ర పరిశ్రమ లో 1935 నుండి 1964 వరకు 29 సంవత్సరాలు కొనసాగారు. తనని ఆ రోజుల్లో కాంచనమాలతో పోలుస్తుండేవారు. ఎందుకంటే ఇద్దరు కూడా మంచి సౌందర్యరాశులు. ఇద్దరు సినిమాలు కూడా చాలా బాగా ఆడేవి. కన్నాంబ గారు ఎంత ధనవంతురాలు అంటే ఆ రోజుల్లో ఏడు వారాల నగలు ధరించేవారు.

ఇంట్లో బంగారం దాచుకోవడానికి స్థలం దొరక్క పచ్చడి జాడిల మధ్య, వంటింట్లో ఎక్కడ పడితే అక్కడ దాచుకునే వారు. ఆరడుగుల ఎత్తు, అద్భుతమైన వాచకం సంభాషణల్లో స్పష్టత, స్వచ్ఛత, అన్నిటిని మించిన నటన అమోఘం. తాను శోక పాత్ర ధరిస్తే ప్రేక్షకులు కన్నీరు మున్నీరు అయ్యేవారు. ఆమె పౌరుషం గల పాత్రలు ధరిస్తే ప్రేక్షకులు కూడా ఉద్రేకానికి లోనయ్యేవారు. నిండైన విగ్రహం నీటైన నటన ఆవిడ సొంతం. తాను నటిస్తూనే మరణించారు. తన పూర్తి పేరు పసుపులేటి కన్నాంబ. దక్షిణ భారతదేశంలో అత్యధిక పౌరాణిక చిత్రాల నిర్మాణ సంస్థ వీరిదే కావడం విశేషం.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    పసుపులేటి కన్నాంబ

ఇతర పేర్లు  :    కన్నాంబ

జననం    :     05 అక్టోబర్ 1911 

స్వస్థలం   :   ఏలూరు, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం

వృత్తి      :   రంగస్థల, చలనచిత్ర నటి, గాయని

తండ్రి    :   ఎం. వెంకనరసయ్య

తల్లి     :   లోకాంబ

జీవిత భాగస్వామి    :    కడారు నాగభూషణం 

మతం    :   హిందూ మతం

మరణ కారణం  :  వృద్ధాప్యం 

మరణం    :    07 మే 1968 

చెన్నై, భారత దేశం

నేపథ్యం…

ఆంధ్రప్రదేశ్ లోని కడప పట్టణంలో 05 అక్టోబరు 1911 లో వెంకట నరసయ్య మరియు లోకాంబ దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి వెంకట నరసయ్య ప్రభుత్వ కాంట్రాక్టర్‌ గా పని చేసేవారు. వెంకట నరసయ్య, లోకాంబ జంటకు కన్నాంబ గారు ఒక్కరే సంతానం. అయినా కన్నాంబ మాత్రం వాళ్ల అమ్మమ్మ గారింట్లో ఏలూరులోనే పెరిగి పెద్దయ్యారు. గారికి ఆమె తాతయ్య నాదముని నాయుడు అంటే ఎంతో అభిమానం. నాదముని నాయుడు వైద్యవృత్తిలో వుండేవారు. బాగా చదువుకున్న వ్యక్తి. కన్నాంబ గారి ఇష్టాన్ని అభిరుచిని గమనించి ఆమెను ఆ దిశగా ప్రోత్సహించిన ఆదర్శవాది.

కన్నాంబ గారికి సంగీతం లో శిక్షణ ఇప్పించారు. కర్ణాటక సంగీతం పాటలు పద్యాలు నేర్పిస్తుండేవారు. ఆ అనుభవంతోనే తన 13వ ఏటనే కన్నాంబ గారు నాటకాల్లో నటించడం మొదలు పెట్టారు. చిన్నతనంలో ఎంతో మక్కువతో శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకున్న గారికి రంగ ప్రవేశం రోజునే చేదు అనుభవం ఎదురయ్యింది. నృత్య కళాకారులను నీచమైన దృష్టితో చూసే ప్రేక్షకుల వైఖరిని నిరసిస్తూ ఇక జీవితంలో కాలికి గజ్జె కట్టనని తాను శపథం చేశారు. సినీ రంగంలో ప్రవేశించిన తర్వాత కూడా దానికి కట్టుబడి ఉన్నారు కన్నాంబ గారు.

నాటక రంగం…

తన 13వ ఏటనే నటించడం ప్రారంభించింది. తాను పదహారు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది. ఆంధ్ర రాష్ట్రములోని ఏలూరులో హరిశ్చంద్ర నాటకం జరుగుతుంది. అందులో స్త్రీ పాత్ర ధారి అయిన ఒక పురుషుడు (ఆ రోజుల్లో నాటకాలలో స్త్రీ పాత్రలు కూడా పురుషులే ధరిస్తూ ఉండేవారు) పద్యాలు చదువుతున్నాడు. అనుకోకుండా ముందు వరుసలో కూర్చుని నాటకాలు చూస్తున్న వారిలో ఒక 16 సంవత్సరాల అమ్మాయి లేచి నిలబడి ఏమిటండీ అలాగేనా పద్యాలు చదవడం? నీ కంటే నేను బాగా పద్యాలు చెప్పగలను అన్నది. ఆ సన్నివేశం చూసిన నాటక సమాజం వాళ్ళు అవాక్కయ్యారు. అంతలోనే నాటక నిర్వాహకులు “నీకు అంత ధైర్యం ఉంటే వేదిక మీదికి వచ్చి చెప్పు” అన్నారు.

వెంటనే ఆ అమ్మాయి ఏ మాత్రం భయపడకుండా వేదిక ఎక్కి “చంద్రమతి” పాత్రకు సంబంధించిన అన్ని పద్యాలు కూడా అనర్గళంగా పాడింది. అది విన్న ప్రేక్షకులు ఆమెకు “వన్స్ మోర్” చెప్పారు. అక్కడి నుండి ప్రారంభించిన తన నాటక సమాజంలో ప్రధాన పాత్రధారి అయ్యారు. ఇదే నాటక సమాజం వారు కన్నాంబకు సావిత్రి, సత్యభామ, అనసూయ, చంద్రమతి వంటి మంచిమంచి పాత్రలు ఇచ్చి వారి నాటకాలను రక్తికట్టించే ప్రయత్నం చేశారు. సత్యవంతుడు, భక్త కబీరు వంటి మగ పాత్రలు పోషించడం కూడా కద్దు. దొమ్మేటి సూర్యనారాయణతో కలిసి “రంగూన్ రౌడీ” అనే నాటకాన్ని ఆమె దేశవ్యాప్తంగా ప్రదర్శించి మన్ననలు పొందింది. ఆరోజుల్లో ప్రసిద్ధ రంగస్థల నటీనటులచేత రికార్డింగ్ కంపెనీలు నాటక పద్యాలు పాడించి వాటిని రికార్డులుగా విడుదల చేసేవారు. వాటిలో పాడిన “కృష్ణం భజే రాధా” అనే ప్రైవేట్ రికార్డు శ్రోతల్ని ఉర్రూత లూగించింది.

పరిచయం.. ప్రణయం.. పరిణయం…

ప్రేమ అంగట్లో దొరికే వస్తువు కాదు. అది స్వతహాగా మనసులో పుట్టుకొచ్చే పుట్టుమచ్చలాంటిది. ప్రేమంటే హృదయాన్ని పారేసుకోవటం కాదు. తాను లేనప్పుడు నవ్వుని, తానున్నప్పుడు కాలాన్నీ పారేసుకోవడం. నాగభూషణం గార్ల ప్రేమ కూడా అలాంటిదే. నిజానికి నాగభూషణం గారికి అంతకుముందే పెళ్లయ్యింది. కానీ కన్నాంబ లాంటి ప్రజ్ఞాశాలి ముందు తన పెళ్లి కన్నా, ఆమె ప్రేమకే మొగ్గు చూపాడని చెప్పాలి. ప్రేమించడానికి హృదయం ఉండాలి. ప్రేమింపబడడానికి వ్యక్తిత్వం ఉండాలి.

కన్నాంబ గారు ప్రదర్శించే నాటకాలకు ఆయన ప్రయోక్తగా వ్యవహరించేవారు. ఆ సమయంలో వీరి మధ్య కలిగిన పరిచయం ప్రణయం గా మారింది. ఆ ప్రణయం కాస్త పరిణయం గా మారి ఇద్దరూ దంపతులయ్యారు. నిజానికి అప్పటికే నాగభూషణం గారికి పెళ్లి అయిన కారణంగా తమ వివాహ వార్తను 1941 వరకు కన్నాంబ అధికారికంగా ప్రకటించలేకపోయారు. ఎందరి చేతో అమ్మ అని పిలిపించుకున్న గారు తన దాంపత్య జీవితంలో తల్లి కాలేకపోయింది. ఒక పాపను దత్తత తీసుకుని తన ఇష్ట దైవమైన రాజేశ్వరి దేవి పేరు పెట్టుకున్నారు.

పెళ్ళయిన తర్వాత జీవిత భాగస్వామిని ప్రేమించడం అన్నింటికన్నా ఆరోగ్యకరమైన ప్రేమ.

కళ కన్నా ప్రేమ గొప్పది. ప్రేమ కన్నా జీవితం గొప్పది. ప్రేమ కోపాన్ని చంపుతుంది. చిరునవ్వుని పుట్టిస్తుంది. పెళ్లి విషయంలో పొరపాటు చేసినా తన వైవాహిక జీవితం కడదాకా సాఫీగానే సాగిపోయింది. పెళ్లి తరువాత వాళ్ళు వేరే వారికి నాటకాలు వేసే బదులు మనమే ఒక నాటక సమాజం స్థాపిస్తే బావుండునని భావించి వారు 1934 చివరలో “రాజరాజేశ్వరి నాటక సమాజం” అనే పేరుతో సొంతంగా నాటక సమాజాన్ని స్థాపించారు.

సినీ రంగ ప్రవేశం…

1934 చివరలో కన్నాంబ దంపతులు “రాజరాజేశ్వరి నాటక సమాజం” అనే పేరుతో సొంతంగా నాటక సమాజాన్ని స్థాపించారు. వారు నిర్వహించే నాటకాలలో వేమూరు గగ్గయ్య, దొమ్మేటి సూర్యనారాయణ, ఈలపాటి రఘురామయ్య, ఋష్యేంద్రమణి లాంటి వారందరూ కూడా అద్భుతంగా నటిస్తూ ప్రసిద్ధమైన నాటకాలను వేదికపై ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు బళ్లారిలో నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉండగా ఆ ప్రదేశానికి మద్రాసు నుండి ఒక కుర్రవాడు వచ్చాడు. “మేము కొల్హాపూర్ లో ఒక సినిమా తీస్తున్నాము. కన్నాంబ గారికి చంద్రమతి పాత్రతో మంచి పేరు తెచ్చుకున్నారు కదా. అందుకని మేము గారిని సినిమాలోకి తీసుకుంటాము” అని అన్నాడు.

ప్రధాన పాత్రధారి అయిన కన్నంబ గారు వెళ్ళిపోతే నాటక సమాజాన్ని ఆపేయవలసి వస్తుంది. ఇందులో ఉన్న 22 మందిని కూడా సినిమాల్లోకి తీసుకుంటానంటేనే కన్నాంబ గారిని పంపిస్తాము. లేదంటే పంపించలేము అని షరతును పెట్టారు నాగభూషణం గారు. దాంతో ఆలోచించిన కుర్రాడు సరే అని ఆ 22 మందిని కూడా సినిమాల్లోకి ఆహ్వానించారు. ఆ వచ్చిన కుర్రాడే ఆ తరువాత ప్రముఖ దర్శకులలో ఒకరైన “పోలదాసు పుల్లయ్య”. ఆ దర్శకులు తీసిన సినిమా “హరిశ్చంద్ర” (1935). ఆ విధంగా కన్నాంబ గారు సినిమాల్లోకి ఆహ్వానించబడ్డారు. హరిశ్చంద్ర సినిమా ఓ మాదిరిగా ఆడింది. గారికి విపరీతమైన పేరు వచ్చింది.

ఆ తర్వాత కన్నాంబ గారిని “ద్రౌపది వస్త్రాపహరణం” లో ద్రౌపది పాత్రకు తీసుకున్నారు. దాంతో కడారి నాగభూషణం, కన్నాంబ దంపతులకు ఆంధ్రదేశం తిరిగి వచ్చే అవసరం లేకుండా చేసింది. వారు సినీ పరిశ్రమలోనే కొనసాగారు. ఆ విధంగా కన్నాంబ గారు నటించిన రెండవ సినిమా “ద్రౌపది వస్త్రాపహరణం” అత్యంత ఘనవిజయం సాధించింది. దాంట్లో కడారు నాగభూషణం గారు అశ్వత్థామ పాత్రను పోషించారు. ఆ తర్వాత సరస్వతి టాకీసు వారు కనకతార (1937) అనే సినిమాను తీశారు. ఆ సినిమాలో కన్నాంబ గారు కనకతార పాత్రను పోషించారు. దాంట్లో కడారు నాగభూషణం గారు మతిమంతుడు అనే పాత్రను వేశారు. 1938లో హెచ్.ఎం.రెడ్డి గారు గృహలక్ష్మి అనే సినిమా తీశారు. దాంట్లో ప్రధాన పాత్ర గారు అయితే అందులో నాగభూషణం గారు జడ్జి పాత్ర వేశారు.

1940 వ సంవత్సరంలో భవాని ఫిలిమ్స్ వారు “చండిక” చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమాలో “నేనే రాణీనైతే, ఏలనె ఈ ధర ఏకథాటిగా”.. చేతిలో కత్తి పట్టుకుని, వీరావేశంతో గుర్రం మీద కూచుని ఠీవిగా, ధాటిగా కళ్లెర్రజేస్తూ కన్నాంబ గారు పాడితే ఆమె వీర రసాభినయానికి ప్రేక్షకులు ఆవేశపూరితులయ్యారు. కేవలం ఈ పాట కోసమే ఆ రోజుల్లో “చండిక” చిత్రాన్ని మళ్లీమళ్లీ చూసిన వాళ్ళు ఎందరో. ఈ సినిమాలో గుర్రపు స్వారీ అవసరం అంటే పట్టుదల వహించి కన్నాంబ గారు గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. ఈ చిత్ర నిర్మాణ సమయంలో చిరుతపులులకు ఆహారం తినిపించి వాటిని మచ్చిక చేసుకుని నటించిన సాహాసికురాలు కన్నాంబ గారు. ఒక నటి క్రూర జంతువులతో నటించడం అదే మొదటిసారి. ఈ సినిమాలో ప్రతినాయకుడి గా నటించిన “బళ్లారి రాఘవ చారి” గారు గారిని అభినందిస్తూ “హావభావాల అధినేత” గా అభివర్ణించారు.

తమిళ చిత్ర రంగ ప్రవేశం..

రాజగోపాల్ టాకీస్ అనే తమిళ చిత్ర నిర్మాణ సంస్థ “కృష్ణన్ తూరు” అనే పౌరాణిక చిత్రం నిర్మిస్తూ ద్రౌపది వేషానికి ఎంతో మంది తమిళ హీరోయిన్లను ప్రయత్నించి చివరకు కన్నాంబను ఎంపిక చేయడం ఆమె ప్రతిభకు తార్కాణం. తమిళ చిత్ర రంగంలోకి అడుగుపెట్టిన తొలి తెలుగు నటిగా కన్నాంబ గారికి గౌరవం దక్కింది. ఆమె తమిళ చిత్రాలు నటించడానికి చిత్తూరు నాగయ్య గారు ఒక కారణం. తమిళం నేర్చుకుంటే తనలాగా తెలుగు, తమిళ భాషలలో నటించవచ్చు అని చెప్పడంతో తమిళం నేర్చుకోవడానికి కన్నాంబ గారు ఆసక్తి చూపారు. ప్రారంభంలో తమిళం మాట్లాడడానికి తడబడుతున్న తరుణంలో దర్శక నిర్మాత ఆర్.ఎస్.ప్రకాష్ గారు తనను ప్రోత్సహించేందుకు తమిళం నేర్పించారు.

“కృష్ణన్ తూరు” చిత్రం విజయవంతం కాకపోయినా కన్నాంబ గారి ప్రతిభను గమనించిన తమిళ ప్రేక్షకులు తనను ఎంతగానో ఆదరించారు. ఆ తర్వాత పాతికేళ్లపాటు అద్వితీయమైన నటిగా ఆమె తమిళ తెరపై వెలిగారు. పి.యు.చిన్నప్ప, ఎం.కే.రాధా, చిత్తూరు నాగయ్య, ఎం.జి.ఆర్, శివాజీ గణేషన్, ఎస్.ఎస్.రాజేంద్రన్ వంటి ప్రముఖులతో కన్నాంబ గారు తమిళంలో నటించారు. ఆ రోజుల్లో ఆమె ఒక్క సినిమాకి 85 వేల రూపాయలు పారితోషికం తీసుకుని చరిత్ర సృష్టించారు. మరో విషయం ఏమిటంటే ఎన్టీఆర్ హీరోగా బి.యన్.రెడ్డి తెలుగు, తమిళ భాషల్లో “రాజమకుటం” చిత్రం నిర్మించారు. తెలుగు వర్షన్ కంటే తమిళ వర్షన్ లో కన్నాంబ గారికి ఎక్కువ సంభాషణలు ఉన్నాయి. తమిళంలో ఆమెకు ఉన్న పాపులారిటీకి ఇదో నిదర్శనం. తెలుగు, తమిళ భాషలలో కలిపి కన్నాంబ సుమారు 150 చిత్రాలలో నటించారు.

ఇందులో పౌరాణికాలు, జానపద, సాంఘికాలు కూడా ఉన్నాయి. భక్తి రస ప్రధానమైన పాత్రలను ఆమె ఎంత హుందాగా, ఉన్నతంగా పోషించారో, అంతే సామర్థ్యంతో రౌద్ర, కరుణ రస పాత్రలో నటించారు. కంగుమని కంచు కంఠంతో కన్నాంబ గారు సంభాషణలు చెబుతుంటే ప్రేక్షకులు మైమరచి వినేవారు. సంభాషణలు పలకడంలో తనది ప్రత్యేక శైలి. కన్నాంబ గారు బాగున్నారంటే సెట్ కళకళలాడుతుండేది. పెద్ద, చిన్నా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడుతూ జోకులు పేలుస్తూ ఉండేవారు. సినిమా మీద మోజుతో మద్రాసు పారిపోయి వచ్చిన ఎంతో మందిని కన్నాంబ గారు ఆదుకునేవారు. ఏ ఆధారం లేకుండా మద్రాసులో వేషాల కోసం తిరుగుతున్న తనని ఆదరించి అన్నం పెట్టిన మహాతల్లి అని కన్నాంబ గారిని ప్రశంసించేవారు పద్మనాభం గారు.

స్వీయ చిత్ర నిర్మాణం లో…

కన్నాంబ గారు నటిగా స్థిరపడిన తర్వాత సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పారు. తాను రాజరాజేశ్వరి దేవి ఉపాసకురాలు. ఆ దేవత పేరునే శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీని ప్రారంభించారు. శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ పతాకం పై నిర్మించిన తొలి చిత్రం తల్లి ప్రేమ (1941). రెండో చిత్రం సుమతి (1942) తో దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు కడారు నాగభూషణం గారు. తధాదిగా తెలుగు, తమిళ భాషల్లో 25 చిత్రాలు నిర్మించారు. ఈ దంపతులు ప్రతి నెల ఒకటో తేదీన అందరికి జీతాలు చెల్లించేవారు. కడారు నాగభూషణం గారు తాము ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడినా ఎవరికీ ఏనాడు జీతాలు ఆపలేదు. సమయానికి డబ్బు చేతిలో లేకపోతే కన్నాంబ గారు తన నగలు తాకట్టుపెట్టి డబ్బు తెచ్చి జీతాలు చెల్లించేవారు.

నాగభూషణం గారికి న్యూమరాలజీ పై బాగా నమ్మకం. సినిమా పేర్లు నటినట్లు విషయంలో తాను న్యూమరాలజీని అనుసరించేవారు.  ప్రారంభంలో రెండు చిత్రాలు బాగా ఆడక పోవడంతో న్యూమరాలజీ ప్రకారం తన పేరును కడారు భగవానుల నాగభూషణంగా మార్చుకున్నారు. కడారు నాగభూషణం, కన్నాంబ దంపతులకు పిల్లలు లేరు. రాజేశ్వరి అనే అమ్మాయిని పెంచుకుని, పెద్ద చేశార. దర్శకుడు చిత్తజల్లు శ్రీనివాస రావు గారికి ఇచ్చి 17 మే 1946 న వివాహం చేశారు. వారికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే 1963లో నటి రాజసులోచన గారిని చిత్తజల్లు శ్రీనివాస రావు గారిని వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నప్పుడు కన్నాంబ గారు సైతం ఆమోదముద్ర వేశారు.

మహాప్రస్థానం..

కన్నాంబ గారు తాను మరణించే వరకు సినిమాలలో నటిస్తూనే ఉన్నారు. తన చివరి చిత్రం భరణీ పిక్చర్స్ వారి “వివాహ బంధం”. చిత్తూరు నాగయ్య గారి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన “భక్త రామదాసు” చిత్రంలో కన్నాంబ గారు కమల పాత్ర పోషించారు. సినిమాలలో ఒక్క సన్నివేశం తప్ప తాను పాల్గొన్న మిగిలిన సన్నివేశాల చిత్రీకరణ అంతా పూర్తయ్యింది. ఇంతలో కన్నాంబ గారు హఠాత్తుగా మరణించడంతో డూప్ ని పెట్టి ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారు. 07 మే 1964 నాడు కన్నాంబ గారు కన్నుమూశారు. తన మహాప్రస్థానానికి తెలుగు చిత్ర పరిశ్రమ అంతా తరలివచ్చింది.

కన్నాంబ గారిని తెలుగు చలన చిత్ర రంగం అంతగా గౌరవించలేదు. కానీ తమిళ చిత్ర పరిశ్రమ ఎంతో ఆదరించి అక్కున చేర్చుకుంది. 1960 లోనే తనకు “కలైమామణి” పురస్కారంతో ఆమెను సత్కరించారు. అలాగే 2005లో ఆమె పేరిట ఒక తపాలబిల్ల ను వెలువరించి తమిళ సోదరులు కన్నాంబ గారి పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఖరీదైన పట్టు చీరతో కన్నాంబ గారిని సంప్రదాయం ప్రకారం సమాధి చేశారు. అయితే ఆ పట్టుచీర కోసం ఆ మరునాడు ఆ సమాధి తవ్వి చీరను అపహరించారని చెబుతారు. గారి సమకాలీకులు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో కొందరే ఉన్నప్పటికీ ఒక అద్భుత నటిగా ఆమె ప్రేక్షకులకు తరతరాలు గుర్తుండిపోతుంది.

విశేషాలు…

★ చేతిలో కత్తి పట్టుకుని, వీరావేశంతో గుర్రం మీద కూచుని “నేనే రాణీనైతే, ఏలనె ఈ ధర ఏకథాటిగా”… అంటూ పాడిన పాట, ఠీవిగా, ధాటిగా కళ్లెర్రజేస్తూ పాడిన ఆ మహానటి పనుపులేటి కన్నాంబ గారు. ఆ సినిమా పేరు “చండిక” (1941). తన ఠీవి గురించి ఆ రోజుల్లో ఆ సినిమా చూసినవాళ్లు చెప్పుకునేవారు.

★ “చండిక” (1941) సినిమాలో గారు ఇంకా కొన్ని పాటలు పాడారు. మరొక పాట “ఏమే ఓ కోకిలా, ఏమో పాడెదవు, ఎవరే నేర్పినది ఈ ఆట ఈ పాట”. ఈ పాటలో ఆమె నవ్వులు రువ్వుతూ పాడతారు. మధ్యమధ్యలో వచ్చే ఆ నవ్వు ఆమె తప్ప ఇంకెవరు అలా నవ్వులు కలుపుతూ పాడలేరని కూడా ఆనాటి జనం చెప్పుకునేవారు.

★ కన్నాంబ గారు కడారు నాగభూషణం గారిని వివాహం చేసుకుని “శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ” స్థాపించి తెలుగు తమిళభాషల్లో 22 చిత్రాలు నిర్మింపజేశారామె. “సుమతి” (1942),  సౌదామిని (1951), పేదరైతు (1952), లక్ష్మి (1953), సతీ సక్కుబాయి (1954), పాదుకాపట్టాభిషేకం (1954), శ్రీకృష్ణతులాభారం (1955), నాగపంచమి (1956) మొదలైన చిత్రాలు ఆ కంపెనీ నిర్మించింది.

★ జీతాలు ఇవ్వడంలో ఆ కంపెనీకి గొప్ప పేరుండేది. ప్రతి నెలా ఒకటో తేదీ రాకముందే, ముందు నెల చివరి రోజునే స్టాఫ్‌కి జీతాలు ఇచ్చేసేది ఆ కంపెనీ. వారి ఆఫీసు కూడా విశాలమైన కాంపౌండులో, కార్లు, వాన్‌లతో కళకలాడుతూ ఉండేది.

★ గుణ చిత్ర నటిగా ఎక్కువ పాత్రలు ధరించినా, కన్నాంబ గారికి హీరోయిన్‌ గ్లామరే వుండేది. ఇప్పుడు “పుట్టింటి పట్టు చీరలు” అంటూ సినిమా పేర్లతో చీరలు వస్తున్నట్టు,  అప్పుడు “కాంచనమాల గాజులు”, లోలాకులు” అంటూ ఆభరణాలు వచ్చేవి.

★ కన్నాంబ గారు గొప్ప ఐశ్వర్యవంతురాలు. నగలు, ఆభరణాలు, అన్ని బంగారు కాసులు డబ్బాల్లో పోసి, పప్పులు, ఉప్పులు పెట్టుకునే డబ్బాల మధ్య ఎవరికీ తెలియకుండా ఉంచేవారనీ చెప్పుకునేవారు.

★ ఐశ్యర్యం ఎలా వస్తుందో ఎలా పోతుందో ఎవ్వరూ చెప్పలేరని పెద్దలు చెబుతారు. ఎలా పోయాయో, ఏమైపోయాయో గాని కన్నాంబ గారి మరణంతో కంపెనీతో సహా అన్నీ పోయాయి. ఆమె భర్త నాగభూషణం గారు ఒక చిన్నగదిలో ఉంటూ కాలక్షేపం చేసేవారు.

★ ఒకసారి ఒక పత్రికా విలేఖరి కడారు నాగభూషణం గారిని కలవాలని ఆ గదికి వెళ్లి “గుండె కలుక్కుమంది. ఆ వాతావరణం చూడలేక తిరిగి వచ్చేశాను” అని చెప్పారు. “ఆ చిన్నగదిలో ఒక ట్రంకు పెట్టె, ఓ కుర్చీ మాత్రం ఉన్నాయి. ఎదురుగా కన్నాంబ గారి ఫోటో, దండెం మీద తువ్వాలు తప్ప ఇంకేం కనిపించలేదు. ఆయన కిందనే చాపమీద కూచుని, దినపత్రిక చదువుకుంటున్నారు” అన్నారా విలేఖరి.

★ కన్నాంబ గారి మృతదేహాన్ని వారి కులాచారం ప్రకారం నగలతోనే పూడ్చిపెడితే దొంగలు ఆ నగలను కాజేసి ఆమె శవాన్ని కూడా మాయం చేశారట.

Show More
Back to top button