నేను డబ్బు కోసమే సినిమాల్లో నటిస్తున్నాను”. అందులో ఎటువంటి సందేహమూ లేదు. అది చెప్పడానికి నాకేమీ నామోషీ లేదు. ఎవరైనా వచ్చి “మా సినిమాలో మీకు అద్భుతమైన పాత్ర ఉంది మేడమ్. మీకు చాలా గొప్ప పేరు వస్తుంది. మీరు ఉచితంగా ఈ సినిమా చేయాలి” అని అంటే నాకు ఆ పాత్ర అక్కర్లేదు” అని నేరుగా చెప్పేస్తాను. నన్ను తెర మీద చూపించి మీరు డబ్బు వసూలు చేస్తున్నప్పుడు నేనెందుకు ఉచితంగా నటించాలి? ఇదేమైనా దానమా, ధర్మమా? నేను మీ సినిమా కోసం కష్టపడుతున్నాను. నాకు ఇవ్వాల్సిన డబ్బు మీరు ఇవ్వండి. కావాలంటే కాస్త ఎక్కువో, తక్కువో ఇవ్వండి. నేను డబ్బు కోసం సినిమాలు చేయడం లేదు. తృప్తి కోసం చేస్తున్నాం” అనేది అబద్ధం. ఎవరూ ఎవరికీ ఇక్కడ ఏదీ ఉచితంగా చేయరు. ఏదైనా ఉచితంగా చేసినా, అందులో ఏదో ఒక లాభం ఆశిస్తారు. సినిమా అనేది పక్కా వ్యాపారం. ఎవరూ ఇక్కడ కళాసేవ చేయడానికి రాలేదు. డబ్బు అనేది లేకపోతే ఎవరూ ఎవర్నీ సరిగా గుర్తించరు, గౌరవించరు అంటారు సీనియర్ నటిమణి లక్ష్మి. తన పూర్తి పేరు యరగుడిపాటి వెంకట మహాలక్ష్మి, వై.వి.లక్ష్మి.
లక్ష్మి గారు ప్రముఖ దర్శకులు, నటులు వై.వి.రావు గారి కూతురు. వై.వి.రావు గారు తెలుగు సినీ దర్శకులు, నటులు. తాను అనేక సాంఘిక విషయాలపై సినిమాలను నిర్మించారు. లక్ష్మి గారు 1968 లో తమిళ సినిమా “జీవనాంశమ్” లో తన 15 యేళ్ల వయసులోనే సినీరంగ ప్రవేశం చేశారు. దక్షిణ భారత భాషలన్నింటితో బాటు హిందీలో నటించిన లక్ష్మి గారు సుమారు 400కు పైగా చిత్రాలలో నటించారు. లక్ష్మి గారు రాజకీయాలలో కూడా అడుగుపెట్టారు. 1977లో విడుదలైన తమిళ సినిమా “శిలా నేరంగలిల్ శిలా మణితారగళ్” లో లక్ష్మి గారి నటనకు గానూ జాతీయ ఉత్తమనటి పురస్కారాన్ని అందుకొని, తమిళ సినిమా కు పురస్కారం అందుకొన్న దక్షిణాదికి చెందిన తొలి నటీమణి అనిపించుకున్నారు.
కేవలం కథానాయిక పాత్రలే కాకుండా గుణ చిత్ర నటిగా కూడా తనదైన ముద్ర వేశారు. తాను తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లో ఎవ్వరూ సాధించని ఫీట్‌ని అందుకున్నారు. తనకు ప్రత్యేకమైన కలలు అంటూ ఏమి లేవు. తనకు నటించడం అంటే చాలా ఇష్టం. దర్శకుడు కొత్తవాడా, లేక అనుభవం ఉన్నవాడా అనేది లేకుండా దర్శకుడు కోరుకున్న విధంగా తాను నటిస్తారు. చిత్ర పరిశ్రమలో తనకు ఎవ్వరూ సహాయం చేయలేదు. తన సొంత కాళ్ళ మీదనే, తన సొంత ప్రతిభతోనే తాను అంతవరకు ఎదిగారు, తప్ప తాను ఎవ్వరి సహాయం తీసుకోలేదు, తనకు ఎవ్వరూ సహాయం చేయలేదు. తాను చిత్తశుద్ధితో కష్టపడి పనిచేసేవారు.
వాస్తవానికి కొంతమంది నటీమణులను ఎన్నేళ్లు గడిచినా కూడా ప్రేక్షకులు మర్చిపోలేరు. అలాంటి అతి తక్కువ మంది నటిమణుల్లో లక్ష్మీ కూడా ఒకరు. 1968 లో నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న లక్ష్మీ గారు ఎన్నో పురస్కారాలను హస్తగతం చేసుకున్నారు. అయితే లక్ష్మి గారు నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ నటిగా వ్యక్తిగత జీవితంలో మాత్రం తాను కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ వాటిని చెదరని గుండె ధైర్యంతో సమర్థవంతంగా దాటేశారు. తెలుగులో “మురారి” సినిమా ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయిన లక్ష్మి గారు, “ఓ బేబి” సినిమాలో తాను నటించిన విధానం అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
జీవిత విశేషాలు…
జన్మ నామం : లక్ష్మి యర్రగుడిపాటి
ఇతర పేర్లు : లక్ష్మీ నారాయణ్
జననం : 13 డిసెంబరు 1952
స్వస్థలం : మద్రాసు, తమిళనాడు, భారతదేశం
మతం : హిందువు
తండ్రి : వై.వి.రావు
తల్లి : రుక్మిణి
జీవిత భాగస్వామి : భాస్కర్ (మొదటి భర్త), మోహన్ (రెండవ భర్త), శివచంద్రన్ (మూడవ భర్త)
పిల్లలు : ఐశ్వర్య భాస్కరన్, సంయుక్త
ప్రముఖ పాత్రలు : మురారి, మిథునం, జీవనతరంగాలు
నేపథ్యం...
యర్రగుడిపాటి వెంకట మహాలక్ష్మి గారు 13 డిసెంబర్ 1952 నాడు తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. లక్ష్మి గారు వారి కుటుంబంలో మూడవ తరం నటి. ఈమె తండ్రి వై.వి.రావు గారు. తాను నెల్లూరు జిల్లాకు చెందినవారు. తాను తెలుగు సినిమా దర్శకులు, నటులు. తాను అనేక సాంఘిక విషయాలపై సినిమాలను నిర్మించారు. ఈమె తల్లి రుక్మిణి గారు కూడా కథానాయికనే. లక్ష్మీ గారి తల్లి రుక్మిణి కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథనాయికగా ఎన్నో సినిమాలలో నటించారు. రుక్మిణి గారు దాదాపు 100 సినిమాలలో నటించి నటిగా మంచి ఆదరణ పొందారు. రుక్మిణి గారు మూడు సంవత్సరాల వయస్సులో బాలనటిగా చిత్ర పరిశ్రమకు వచ్చి దాదాపు 40 సినిమాలలో బాలనటిగా నటించారు. అలా తెలుగు , తమిళ, కన్నడ సినిమాలలో నటించి మెప్పించిన లక్ష్మీ గారి తల్లి రుక్మిణి గారు “శ్రీవల్లి” అనే చిత్రం ద్వారా మొదటిసారి చిత్ర కథనాయికగా పరిచయమయ్యారు. ఈమె తమిళ నటి. లక్ష్మి గారి అమ్మమ్మ నుంగబాక్కం జానకి గారు కూడా నటే. కళాకారుల కుటుంబంలో జన్మించిన లక్ష్మి గారు మూడవ తరము నటి అయితే వాళ్ళ అమ్మాయి ఐశ్వర్య వారి కుటుంబంలో నాలుగవ తరానికి నటి.
వ్యక్తిగత జీవితం…
సినీ తారల జీవితాలు విలాసవంతంగా, రంగులమయంగా ఉంటాయని అభిమానులకు, ప్రేక్షకులకు అందరూ అనుకుంటారు. అయితే అందరి లాగానే వారి జీవితాలలోనూ కష్టాలు ఉంటాయి. డబ్బులు, హోదా ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు తప్పనిసరిగా ఉంటాయి. అదేవిధంగా నటి లక్ష్మి గారి జీవితం లోనూ ఉన్నాయి. లక్ష్మి గారు చిన్న వయస్సు లోనే బాల నటిగా సినిమాల్లోకి వచ్చారు. తాను నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నా వ్యక్తిగత జీవితంలో మాత్రం తాను కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. తన మొదటి భర్తని కాదని మరో రెండు పెళ్లిళ్లు కూడా చేసుకోవడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
లక్ష్మీ గారు కేవలం 15 ఏళ్ల వయస్సులోనే భాస్కర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఇతను ఇన్సూరెన్స్ సంస్థలో పనిచేసేవాడు. ఇతని ద్వారా 1971 లో కుమార్తె ఐశ్వర్య జన్మించింది. ఇష్టం లేకపోయినప్పటికీ ఐదు సంవత్సరాలు జీవితాన్ని గడిపి అనంతరం కొన్ని మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం తన సహనటుడు మోహన్ శర్మ ను ప్రేమించి లక్ష్మి గారు 1975లో రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ బంధం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. దాంతో లక్ష్మి గారు 1980లో మోహన్ శర్మకు విడాకులు ఇచ్చేశారు. ఇక రెండవ సారి కూడా విడాకులు తీసుకొని తాను అనేక విమర్శలు ఎదుర్కొన్నారు.
కాలం గడిచిన కొద్దీ మళ్ళీ ఏడు సంవత్సరాలు తరువాత శివ చంద్రన్ అనే నటుడిని వివాహం చేసుకున్నారు. అప్పట్లో మూడో పెళ్లి చేసుకున్న దక్షిణ తారగా ఒక సంచలనం సృష్టించారు. ఎందుకు అలా పెళ్లిళ్లు చేసుకున్నారు అని అడిగినప్పుడు ఆమె అన్నిటికీ ఒకే ఒక సమాధానం చెప్పే వారు. ఒకరు తక్కువ, నేను ఎక్కువ అనే అహం చూపిస్తే నాకు ఏ మాత్రం నచ్చదు. మగాళ్ళు చూపించే గర్వం, అధికారం కూడా అందుకు ఒక కారణం అని తాను బదులిచ్చారు. ప్రస్తుతం శివ చంద్రన్ తో తన జీవితం చాలా సంతోషంగా ఉందని ఆమె వివరణ ఇచ్చారు.
సినీ రంగ ప్రవేశం…
“జీవనాంశం” తమిళ చిత్రంతో తొలిసారి…
లక్ష్మి గారి సినీ రంగ ప్రవేశం కాకతాళీయంగానే జరిగింది. తాను ఒక ప్రముఖ దర్శకులు వై.వి.రావు గారి కుమార్తె. తన తల్లి కూడా అగ్ర కథానాయిక రుక్మిణి గారు. దాంతో తాను పదిహేనేళ్ళ వయస్సులో పాఠశాల విద్యాభ్యాసం కూడా పూర్తి అవ్వలేదు. ఆ సమయంలో తనను తమిళ చిత్ర రంగంలోకి ఆహ్వానించడానికి దర్శకులు మల్యం రాజగోపాల్ గారు ఆమెను సంప్రదించారు. తమిళంలో ముందుగా రంగ ప్రవేశం చేసిన లక్ష్మి గారికి మల్యం రాజగోపాల్ స్వీయ రచన, దర్శక, నిర్మాణం లో “జీవనాంశం” అనే భారతీయ తమిళ భాష చిత్రంలో తొలిసారిగా రంగు పూసుకుని కెమెరా ముందు నిలుచున్నారు. శంకర్ సుబ్రమణియన్ అయ్యర్ కథనాయకుడిగా, సి.ఆర్.విజయకుమారి కథానాయకిగా నటించిన ఈ సినిమాలో లక్ష్మి గారు హీరో చెల్లెలు పాత్రలో నటించారు. వీరితో బాటు ఏ .వి.ఎం.రాజన్, పుష్పలత, శివకుమార్ మరియు నగేష్ లు కీలక పాత్రలు పోషించారు. 21 అక్టోబరు 1968 నాడు విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది.
తెలుగులో తొలి సినిమా “బాంధవ్యాలు”..
ఇంచుమించు ఓ ఐదు రోజుల తరువాత యస్.వి.రంగారావు గారు తాను నిర్మించడంతో బాటు స్వీయ దర్శకత్వం వహించిన తెలుగు చలనచిత్రం “బాంధవ్యాలు” అనే చిత్రం కోసం లక్ష్మి గారిని సంప్రదించారు. అయితే తనకు పారితోషికం ఎంత ఇస్తారు అని అడిగారు లక్ష్మి గారు. సినిమా అవకాశాల కోసం ఆత్రుతగా ఎదురుచూసే సందర్భం వదిలేసి పారితోషికం అడుగుతున్నావేమని రంగారావు గారు ప్రశ్నించగా, లేదండీ నేను డబ్బులు ఇస్తేనే నటిస్తాను అని తడుముకోకుండా సమాధానం ఇచ్చారు లక్ష్మి గారు. దాంతో నవ్వుకున్న యస్వీ రంగారావు గారు తనకు 2500 రూపాయలు పారితోషికంగా నిర్ణయించారు.
భారతదేశం అంతటా నిరుద్యోగం తాండవిస్తూ ఉన్న ఆ సందర్భంలో 1968 లో 2500 పారితోషికం అంటే ఎగిరి గంతేశారు లక్ష్మి గారు. దాంతో ఆ సినిమా లో కూడా నటించడానికి ఒప్పుకున్నారు. “బాంధవ్యాలు” అనే చిత్రం తమిళ చిత్రం “కన్ కంద దైవంకి” రీమేక్. తన తల్లిదండ్రులు లక్ష్మి గారికి తన కెరీర్ ను తన ఇష్టానికే వదిలేశారు. ఇక తెలుగు సినీ రంగంలో 11 ఫిబ్రవరి 1968 లో ప్రవేశించిన లక్ష్మి గారు “బాంధవ్యాలు” అనే చిత్రంలో తొలిసారి తెలుగు తెర మీద మెరిశారు. ఈ సినిమాలో లక్ష్మి గారికి సావిత్రి గారు తల్లిగా, ధూలిపాళ గారు తండ్రిగా, రంగారావు గారు పెద్దనాన్న గా నటించిన ఈ సినిమాలో రక్తకన్నీరు నాగభూషణం గారు, చంద్రమోహన్ గారు లాంటి వారు నటించారు. చంద్రమోహన్, లక్ష్మి లకు “తువ్వాయి తువ్వాయి”అనే డ్యూయెట్ ను చిత్రీకరించారు.
బహుముఖ ప్రజ్ఞ…
సహజ నటిగా బహుముఖ ప్రజ్ఞకు నటనానికి మూర్తీభవించిన లక్ష్మి గారు తన నటనతో ఆకట్టుకొనే శైలికి తాను ప్రసిద్ధి చెందారు. ఇతర భాషా చిత్రాలతోనే కాకుండా తెలుగు చలనచిత్ర రంగంలో కూడా తన విభిన్న నటనతో తరచుగా ఉత్తమ అభినయనంతో గుర్తింపు పొందేవారు. 1968 లో మొదలైన తన నటప్రస్థానంలో ఒక దశాబ్దం పాటు మంచి నటనకు ఆస్కారమున్న పాత్రలు రావడంతో ఒక భిన్నమైన ప్రేక్షకాదరణ సంపాదించారు. దక్షిణాది ప్రాంతీయ భాషా చిత్రాలలో లక్ష్మి గారికి పొగరుబోతుతనం, అహంభావం, నిర్లక్ష్యం, జాణతనం కలిగిన పాత్రలతో చాలా సహజ సిద్ధంగా ఆహార్యం కలిగిన నటన తోడవ్వడంతో ఆ పాత్రలు తనకు విపరీతమైన ఆదరణ, ఎనలేని పేరును తెచ్చిపెట్టాయి.
లక్ష్మి గారిది గొంతు ఒక సాధారణ, భిన్నమైన స్వరం, సన్నగా ఉంటూ తనకు బహుముఖ ప్రజ్ఞ ఉండటం మూలాన తాను నటించిన సన్నివేశాల్లో గొంతు విభిన్నంగా వినబడుతుంది. సినిమారంగంలో తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకొంటూ అనర్గళంగా బహుముఖ తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ భాషలు మాట్లాడగల సామర్ధ్యం ఉండటం వలన నటించడం చాలా సుళువుగా ఉండటం తన ప్రత్యేకత. తాను హిందీ సినిమాలో కూడా డబ్బింగ్ స్వయంగా చెప్పుకోవడం విశేషం.
లక్ష్మి గారి సినీ ప్రస్థానంలో పాటలు ఒక ముఖ్య పాత్రను పోషించాయి. లక్ష్మి గారికి నేపథ్య గానం పాడిన పాటలన్నీ కూడా దక్షిణాదిలో ముఖ్యంగా తమిళ, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. లక్ష్మి గారికి చాలా వరకు 70% సూపర్ హిట్ పాటలు సుశీల గారు పాడటం విశేషం. తమిళ భాషల్లో ప్రేక్షకాదరణ సంపాదించిన తర్వాత నిర్మాతలకు సుశీల గారినే తనకు నేపథ్య గానం పాడమని లక్ష్మి గారు చెప్పేవారు. లక్ష్మి గారి మళయాళ, కన్నడ భాషల్లో అపురూపమైనవి పాటలకు సుశీల గారే చిరునామాగా నిలిచారు.
అన్ని భాషలలో తానే డబ్బింగ్ చెబుతూ…
1969 – 70 సంవత్సరాలలో లక్ష్మి, జయకుమారి, హలం నటీమణుల మధ్య తేడా తెలిసేది కాదు. వాళ్ళు ఒకరిని పోలి మరొకరు ఉండేవారు. ఆ తరువాత “ఒకే కుటుంబం” లో లక్ష్మి గారు హీరోయిన్ గా నటించాక తనను గుర్తించడం మొదలుపెట్టారు. ఆ తరువాత “జీవన తరంగాలు” సినిమాతో తాను అద్భుతం అనిపించుకున్నారు. మోడరన్ డ్రస్సెస్ లో చక్కగా ఉండేవారు. పాశ్చాత్య నృత్యాలలో (వెస్ట్రన్ డాన్సెస్) అద్భుతంగా అభినయించడంతో బాటు వాటిని సరస శృంగారంగా, సొగసుగా, మనోహరంగా చేసిన మొట్టమొదటి తెలుగు తార లక్ష్మి గారే అని పేర్కొనవచ్చు.
తన గొంతులో జీర, శ్రావ్యత టింక్లింగ్ బెల్స్ శబ్దంలా ఉండేది. నటనలో తాను అత్యంత సహజంగా కెమెరా ముందు ప్రవర్తిస్తుంది. అసలు నాటకీయత అనేది అతి తక్కువ ఉంటూ సహజత్వాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తుంది. మొదటి నుండి లక్ష్మి గారు ఏ భాషలో అయినా తన డబ్బింగ్ తానే చెప్పుకునే వారు. తెలుగు లో కూడా అద్భుతమైన చిత్ర్రాలు చేసినా కూడా ఆ రోజులలో వాణిశ్రీ, శారద గార్ల హవా ఎక్కువగా నడుస్తుండంతో తాను ఎక్కువగా తమిళ, మళయాళ, కన్నడ రంగాల పైనే ఎక్కువ ద్రుష్టి సారించారు. ఆయా భాషల ప్రేక్షకులు తనను ఎక్కువగా ఆదరించారు.
జాతీయ ఉత్తమ నటి గా…
లక్ష్మి గారు దక్షిణ భారతదేశంలోని దాదాపు అందరు ప్రముఖ నటులు మరియు తారలతో నటించారు. అయితే లక్ష్మి గారితో కలిసి ప్రముఖ కన్నడ స్టార్ అనంత్ నాగ్ గారు 1970 మరియు 1980 లలో ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలలో నటించారు. అనంత్ నాగ్ మరియు లక్ష్మి గార్ల జంట సౌత్ ఇండియన్ సినిమాలో ఆల్ టైమ్ గ్రేట్ జోడీగా పరిగణించబడ్డారు. వీరిరువురు సుమారు 25కి పైగా సినిమాల్లో కలిసి నటించారు. వారి జంట విజయానికి సరైన జోడీగా పరిగణించబడింది. జూలీ హిందీ సినిమా విజయం సాధించిన తరువాత లక్ష్మి గారికి చాలా హిందీ చిత్రాలలో అవకాశాలు వచ్చినా కూడా తాను ఆ వైపు చూడలేదు, హిందీ సినిమాలలో నటించలేదు. కేవలం దక్షిణ భారత చిత్రాలపైనే ఎక్కువ సినిమాలు చేయడంపై దృష్టి పెట్టారు.
లక్ష్మి షబానా అజ్మి, షర్మిలా టాగోర్, స్మితా పాటిల్ ల రేంజ్ ఉన్న నటి లక్ష్మి గారు. తాను వాణిజ్య చిత్రాలలో కూడా విజయవంతం అయ్యారు. కొడుకు కోడలు (1972), లో అక్కినేని నాగేశ్వరావు గారి ప్రక్కన వాణిశ్రీ గారికి లక్ష్మి గారు ఓ సెకండ్ హీరోయిన్, సుపుత్రుడు (1971), కన్నకొడుకు (1973), పల్లెటూరి బావ (1973), బంగారు కలలు (1974) లాంటి చిత్రాలలో ప్రధాన కథనాయికగా నటించారు. జయకాంతన్ రచనలో వచ్చిన నవల సిల నెరంగలిల్ సిల మణితార్గళ్ ఆధారంగా దర్శకులు ఎం.భీంసింగ్ గారు రూపొందించిన “సిల నేరంగళిల్ సిల మణితరగళ్” (1977) చిత్రం 1 ఏప్రిల్ 1977 విడుదలై వాణిజ్యపరంగా విజయవంతమైంది. చిత్రం 24వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో లక్ష్మి గారు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు.
డబ్బే ప్రధానం…
కొన్నేళ్ల క్రిందటి మాట. నటి గౌతమి, లక్ష్మి గార్లు కలిసి ఒక సినిమాలో నటించారు. ఆ సినిమా నిర్మాత గారి భార్య అప్పుడప్పుడూ చిత్రీకరణ సెట్ కి వచ్చేవారు. ఆవిడ చాలా సౌమ్యంగా ఉండేవారు. భోజనం చేశారా అని అడిగితే “ఆయన తిన్నాక తింటాను” అనేవారు. ఏది మాట్లాడాలన్నా తన భర్త అనుమతి కోసం ఎదురు చూసేవారు. కొద్ది రోజులకు సదరు నిర్మాత చనిపోయారు. విషయం తెలుసుకున్న లక్ష్మి మరియు గౌతమి గార్లు వాళ్ళ ఇంటికి వెళ్లారు. అందరూ ఏడుస్తున్నారు. నిర్మాత గారి భార్య మాత్రం మౌనంగా కూర్చుని ఉంది. లక్ష్మి, గౌతమి గార్లు ఆమె పక్కకి వెళ్లి భుజం మీద చెయ్యి వేసి ఓదార్చాలని చూశారు. వెంటనే ఆమె తన భర్తను గట్టిగా ఒక బూతు తిట్టి, “ఈ పాపిష్టోడు డబ్బంతా ఎక్కడ పెట్టాడో చెప్పకుండానే పోయాడే” అని అరిచింది. నా పక్కనే ఉన్న గౌతమి షాకైంది.
ఆమె అన్న మాటలకు నాకు వారిద్దరికీ నవ్వొచ్చింది. పక్కనే శవం ఉంది అన్న విషయం కూడా మర్చిపోయి గట్టిగా నవ్వారు. గౌతమి, లక్ష్మి గార్లు కారు దగ్గరికి వచ్చారు. కారు ఎక్కాక కూడా నవ్వుతూనే ఉన్నారు. లక్ష్మి గారు ఈ విషయం గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుతూనే ఉండేవారు. నిర్మాత భార్య అంత సౌమ్యమైన మనిషి అయ్యుండి కూడా తన భర్తపై ఆ స్థాయిలో కోపాన్ని చూపించడం తనను అశ్చర్యానికి గురి చేసింది అంటారు లక్ష్మి గారు. “అప్పుడే నాకు అర్థమైంది. మన బాధ్యతలు మనం సక్రమంగా నిర్వర్తించకపోతే మనం పోయాక కూడా మనల్ని తిట్టుకుంటూనే ఉంటారు. డబ్బే ఇక్కడ ప్రధానం” అని ఇటీవల ఓ తమిళ ఇంటర్వ్యూలో నటి లక్ష్మి గారు వివరించారు.
వ్యక్తిగత విశేషాలు…
లబ్ధప్రతిష్టులు అయిన యరగుడిపాటి వరదరావు (వై.వి.రావు) అప్పట్లో 1938 నుండి 1950 వరకు దర్శకులు, నిర్మాత, కథానాయకుడు. మళ్ళీ పెళ్ళి(1939) తీసిన అద్భుతమైన సహజ నటుడు. వై.వి.రావు గారు నటీమణి లక్ష్మి తండ్రి. ఆయన తమిళ నటి రుక్మిణి గారిని పెళ్ళి చేసుకుంటే పుట్టిన బిడ్డే లక్ష్మి. వై.వి.రావు గారిది సద్బ్రాహ్మణ వంశం. జమీందారుల వంశం. వారి పూర్వీకులు నెల్లూరు రంగనాథ స్వామి ఆలయ గోపురం పునురుథ్థరించారని చెబుతుంటారు. రుక్మిణి గారు కూడా పేరున్న నటీమణినే. అమ్మమ్మ నుంగంబాకం జానకి గారు కూడా నటే. మరి తల్లిదండ్రుల వారసత్వం నటనలో పుణికి పుచ్చుకుని నటనలో అగ్రశ్రేణికి చేరుకున్నారు లక్ష్మి గారు. తల్లి, అమ్మమ్మ అందచందాలూ కూడా లక్ష్మి గారికి అయాచితంగా వచ్చాయి. 1961 లో “శ్రీవల్లి” అనే తమిళ మూవీ లో బాల నటిగా నటించారు లక్ష్మి గారు. 1968 లో మళయాళంలో జీవనాంశం మూవీతో హీరోయిన్ గా చిత్రసీమలో అడుగు వేసినప్పుడు తన వయస్సు 16 ఏళ్ళు.
చాలామంది లక్ష్మి గారి గురించి అవాకులు, చెవాకులూ, మాట్లాడుతూ ఉంటారు. ఇతరులను ఉధ్ధరించే మహానుభావులు అక్కడక్కడా కాదు ఎక్కడైనా ఉంటారు. లక్ష్మి గారు ఒక జాతీయ పురస్కారం, 9 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, లెక్కకు మించిన రాష్ట్ర పురస్కారాలు అందుకున్నారు. తాను కేవలం 3 పెళ్ళిళ్ళు చేసుకుని ఓ చపల చిత్తురాలిగా మిగిలారని సెలెబ్రెటీ హోదా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ ఇంకా ఏవో ఏవో మాట్లాడుతుంటారు. కమల్ హాసన్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా,q వ్యక్తిగత జీవితాలు మనకు అనవసరం కదా. కష్టమైనా సుఖమైనా అనుభవించేది ఆయా వ్యక్తులే కానీ ఇతరులు కాదు కదా. ఆవిడ గారి జీవితం శాసించడానికి మనమెవరం ? వ్యక్తిగత నిర్ణయాలు దాని ఫలితాలు అన్ని వ్యక్తిగతాలే..
సశేషం…
లక్ష్మి గారి కుమార్తె ఐశ్వర్య మనందరికి సుపరిచితురాలు. తాను వైవిధ్య పాత్ర పోషకురాలిగా తాను అందరికీ పరిచయమే. హీరోయిన్ గా నటించినా చేసినా పెద్దగా రాణించలేదు. ఇక అమ్మమ్మ రుక్మిణి గారు, మనవరాలు ఐశ్వర్య ఒక్కటవ్వడం, తల్లి లక్ష్మి తో పడకపోవడం, కొట్లాటలు ఇవన్నీ జరిగాయి. పొట్లాడటాలు, గొడవలు, ఇంటింటి బాగోతాలు అందరి ఇండ్లలో వున్నవే. అవి మనకు అనవసరం. లక్మి తల్లి రుక్మిణి గారు 2007 లో స్వర్గస్తులయ్యారు. ఈ మధ్య విడుదలైన ఓ బేబీ,
ఆమధ్య వచ్చిన మిథునం చూడని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు. శిరస్సు వంచి వందనం చేయదగ్గ నటనా పటిమ లక్ష్మి గారి సొంతం. తాను ఇలాగే మంచి పాత్రలతో ఇంకా కనువిందు చేయాలని నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశిద్దాం.