
సహజీవనం” అనే మాటను మనం తరచూ వింటూనే వుంటాం. సహజీవనం వల్ల కాపురాల్లో, మనసుల్లో కొన్నిసార్లు సరిదిద్దుకోలేని సంఘర్షణలు తలెత్తుతాయి. ఇలాంటి కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కిస్తే ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారు. ఆర్థికంగా ఆ సినిమా విజయం సాధించకపోతే పరిస్థితి ఏమిటి? ఇత్యాది విషయాలు దృష్టిలో ఉంచుకుని 40 సంవత్సరాల క్రిందటే ఒక అగ్రస్థాయి నటులు, ఒక అగ్రస్థాయి దర్శకులు గొప్ప ప్రయోగమే చేశారు. “సహజీవనం” అనే కథను హృద్యంగా చూపించారు. విజయం సాధించారు. ఆ అగ్రస్థాయి నటులు అక్కినేని నాగేశ్వరావు గారు, అగ్రస్థాయి దర్శకులు దాసరి నారాయణ రావు గారు అయితే, ఆ సినిమా “మేఘసందేశం”.
ఇందులో కథనాయకుడు రవీంద్రబాబు సున్నిత మనస్కుడు, కళారాధకుడు, కవి, మంచి మనిషి. భర్త, పిల్లలు, పూజలు తప్ప మరో ప్రపంచం తెలియని పరమసాధ్వి భార్య పార్వతి. ప్రకృతిలోని కళాసృష్టినంతా తనలో నింపుకున్న కళామూర్తి పద్మ. ప్రేమ, భక్తి, అనురాగం, ఆరాధన, అలౌకికానుబంధం లాంటి భావాలకు నిలువెత్తు సాక్షాలు ఈ ముగ్గురు. ఇలాంటి పాత్రలను ప్రధానంగా చేసుకొని పెద్ద సాహసమే చేసి మేఘసందేశం సినిమా తీశారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. తనలోని కళాత్మక భావాలన్నింటిని పొందుపరిచి “మేఘసందేశం” అనే నవరస సుమమాలికను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు దాసరి గారు.
పరిణితి సాధించిన ఇద్దరు స్త్రీ, పురుషుల మధ్య అవ్యక్తమైన ప్రణయ సంకేతం “మేఘసందేశం” సినిమా. అక్కినేని నాగేశ్వరావు గారు హీరోగా ఎంతో డిమాండ్ కలిగి, ఎందరో నిర్మాతలు సినిమాలు తీయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ తన పారితోషికం గురించి ఆలోచించకుండా తన 200వ చిత్రం కళాత్మకంగా ఉండాలనే తపనతో చేసిన సినిమా “మేఘసందేశం”. అలాగే ఎంత ఖర్చైనా, ఎంత నష్టం వచ్చినా తన అభిమాన నటుడితో స్వీయ దర్శకత్వంలో అద్భుత చిత్రాన్ని నిర్మించాలని తలచిన దాసరి గారి తపస్సుకు ప్రతిఫలం ఈ “మేఘసందేశం”.
నిజానికి మేఘసందేశం చిత్రంలో యుగళ గీతాలు లేవు, పోరాట సన్నివేశాలు లేవు, కడుపుబ్బ నవ్వించే హాస్యం లేదు. అయినా కూడా ఈ చిత్రాన్ని కళాత్మక చిత్రంగా నాటి ప్రేక్షకులు ఆదరించారు. ఈ చిత్రంలో హీరో ఉదాత్త హృదయుడు కాదు, ఆదర్శ యువకుడు కాదు, ధైర్యవంతుడు కాదు. అయినా ఈ చిత్రం దర్శకుడి చేతుల్లో కళాత్మకంగా రూపుదిద్దుకుంది. అత్యద్భుతమైన సంగీత, సాహిత్య, దృశ్య కావ్యం గా “మేఘసందేశం” తీర్చిదిద్దబడింది.
సంగీత సాహిత్య భరిత కళాత్మక చిత్రంగా ప్రశంసలందుకున్న అక్కినేని గారి 200 చిత్రం “మేఘసందేశం” కావడం విశేషం. అతి తక్కువ సంభాషణలతో, అత్యధిక పాటలతో ఈ చిత్రాన్ని దృశ్య కావ్యంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకునే విధంగా తీర్చిదిద్దే ప్రయోగం చేశారు దాసరి గారు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, జయప్రద, జగ్గయ్య ప్రధానపాత్రలుగా పోషించారు. కథ, కథనం, సంగీతం, సాహిత్యం ఇలా అన్ని అంశాలలోనూ సృజనాత్మకత ఉట్టిపడేలా తీర్చిదిద్దిన ఈ చిత్రం 24 సెప్టెంబరు 1982 నాడు విడుదలైన నేటికి 41 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
చిత్ర విశేషాలు…
దర్శకత్వం : దాసరి నారాయణరావు
నిర్మాణం : దాసరి పద్మ
కథ : దాసరి నారాయణ రావు
చిత్రానువాదం : దాసరి నారాయణ రావు
తారాగణం : అక్కినేని నాగేశ్వరరావు , జయప్రద , జయసుధ, కొంగర జగ్గయ్య
సంగీతం : రమేష్ నాయుడు
సంభాషణలు : దాసరి నారాయణ రావు
నేపథ్య గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, ఎస్.పి.శైలజ
గీతరచన : వేటూరి, దేవులపల్లి కృష్ణ శాస్త్రి..
ఛాయాగ్రహణం : పి.ఎన్ సెల్వరాజు
నిర్మాణ సంస్థ : శ్రీ మురళీకృష్ణ ఆర్ట్ క్రియేషన్స్
పంపిణీ : తారక ప్రభు ఫిలిమ్స్
విడుదల తేదీ : 24 సెప్టెంబరు 1982
భాష : తెలుగు
చిత్ర కథ సంక్షిప్తంగా…
ప్రకృతిని చూస్తే పరవశించిపోయే కవి రవీంద్రబాబు. తనకు కళలంటే అమితమైన అభిమానం. తన భార్య పార్వతి. వారిరువురికి ఓ కూతురు ఉంటుంది. తన ఊరిలో రవీంద్రబాబు నిజాయితీ పరునిగా, మంచివాడిగా పేరుంది. తన మాటకు ఊరి జనం కూడా విలువనిస్తూ ఉంటారు. ఆ ఊరిలో ఏటి ఒడ్డున ఓ కళావంతుల కుటుంబం వచ్చి ఉంటుంది. అందులో పద్మ, ఆమె సోదరి కలసి తమ నృత్యంతో ఊరి జనాన్ని ఆకర్షిస్తూ ఉంటారు. అక్కడకు వెళ్లిన తమ మొగుళ్ళు తమ కుటుంబాలను పట్టించుకోవడం లేదని ఎంతోమంది ఆడవాళ్ళు వాపోతుంటారు. ఇది తెలిసిన రవీంద్రబాబు ఆ ఒడ్డుకు వెళ్ళి ఆ కళావంతుల ఆట చూసేవారిని మందలిస్తాడు.
ఓ సారి ఆ కళాకారుల నృత్యగీతాలు విని రవీంద్రబాబు కూడా పరవశించి పోతాడు. ఊరందరికీ బుద్ధి చెప్పిన రవీంద్రబాబు, పద్మ నాట్యానికి ఆకర్షితుడవుతాడు. తన కవితకు తగ్గ నాట్యం చేసే పద్మతోనే జీవితం అనేంతగా మారిపోతాడు. ఈ విషయం భార్య పార్వతికి తెలుస్తుంది. తన అన్నయ్య జగన్నాథానికి చెబుతుంది. అది తెలిసి జగన్నాథం, పద్మను హెచ్చరిస్తాడు. అది రవీంద్రబాబుకు తెలుస్తుంది. బాధపడతాడు. తరువాత పద్మ కనిపించక ఆమె కోసం మేఘాలతో సందేశం పంపుతూ కవితలు రాస్తూ తిరుగుతూంటాడు. పద్మ ఊరొదిలి వేరే ఊరికి మకాం మారుస్తుంది.
ఆమెను వెదుకుతూ వెళ్ళిన రవీంద్రబాబు, ఆమెతోనే వెళ్ళాడని ఊరిజనం అనుకుంటూ ఉంటారు. పద్మ నాట్య ప్రదర్శన వద్ద రవీంద్రబాబు ఆమెను కలుసుకుంటాడు. రవీంద్ర కూతురు పెళ్ళికి రమ్మని జగన్నాథం, ఆ ఊరి పెద్దలు పిలవడానికి వస్తారు. రవీంద్రబాబు రాలేనంటాడు. వస్తే తన కూతురికే పరువు తక్కువ అనీ చెబుతాడు. కానీ, పద్మనే నచ్చచెప్పి పంపిస్తుంది. పెళ్ళయ్యాక కూతురు వెళ్ళవద్దని రవీంద్రబాబు ను కోరుతుంది.
తాను చేసిన పాపానికి, భార్యను క్షమాపణ కోరతాడు రవీంద్రబాబు. ఆయన మనసు పద్మ దగ్గరే ఉంది, అక్కడికి తీసుకువెళ్తేనే మంచిదని పార్వతి అంటుంది. కానీ, ఆలోగా ఆయన ప్రాణం విడుస్తాడు. పద్మకు ఈ విషయం చెప్పాలా, ఆమెను తీసుకు రావాలా వద్దా అనే అంశంపై చర్చ సాగుతుంది. పార్వతి తన అన్నను పిలిచి, పద్మను తీసుకు రమ్మంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తే పద్మ చనిపోయి ఉంటుంది. రవీంద్ర, పద్మ ఇద్దరికీ ఒకే చోట అంత్యక్రియలు జరగడంతో కథ ముగుస్తుంది.
చిత్ర కథకు బీజం…
సినిమాలు ఎక్కువ శాతం వాణిజ్యపరంగా మాత్రమే తెరాకెక్కిస్తారు. అడపాదడప చిత్రాలు కళాత్మకంగా నిర్మిస్తారు. మేఘసందేశం చిత్రం అదే కోవలోకి వస్తుంది. ఈ చిత్ర దర్శకులు దాసరి నారాయణ రావు గారు ఒక లక్ష్యంతో ఈ సినిమాను తెరకెక్కించారు. అప్పటికే దాసరి గారు ఎన్నో వాణిజ్యపరమైన చిత్రాలు తీసి విజయాలు సాధించారు. “శివరంజని”, “నీడ”, “ఓ మనిషీ తిరిగి చూడు” లాంటి కథాబలం ఉన్న సినిమాలు తీసి ఆర్థికంగా విజయం సాధించారు. కానీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చేలా ఓ సినిమాల తెరకెక్కించాలని బలమైన కోరిక కలిగిన దాసరి గారు మేఘసందేశం కథను తయారుచేసుకున్నారు.
ఈ చిత్ర కథ వి.శాంతారామ్ గారు తెరకెక్కించిన “పింజ్రా”ను పోలి ఉంటుంది. దానికి కొన్ని మార్పులూ చేర్పులూ చేసి “మేఘసందేశం” రూపొందించారు. ఈ కథ అనుకునే సమయానికి అక్కినేని నాగేశ్వరావు గారు 200 వ చిత్రం మైలురాయికి చేరుకున్నారు. నాగేశ్వరరావు గారు దాసరి గారితో “మీరు నేను కలిసి ఎన్నో సినిమాలు చేశాం. ఇప్పుడు చేసే చిత్రం మాత్రం ప్రతిష్టాత్మకంగా నిలిచిపోవాలి. వాణిజ్యాంశాలు లేకపోయినా ఫర్వాలేదు” అన్నారు. దాంతో అదే ఉద్దేశ్యం కలిగి ఉన్న దాసరి గారు ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో వెనుతిరిగి చూడలేదు.
తన ప్రవృత్తికి, అభిరుచికి భిన్నంగా ఉండే భార్యతో కాపురం చేస్తూ మరోపక్క తన ప్రవృత్తికి దగ్గరైన ఒక కళాకారిణితో సహజీవనం చేసే కథానాయకుడుగా నటించాలని ఆ చిత్రం పేరు “మేఘసందేశం” అని నాగేశ్వరావు గారితో చెప్పారు దాసరి గారు. అప్పటికే నాగేశ్వరావు గారు స్టార్ హీరో. ఇలా సహజీవనం నేపథ్యంలో సినిమా చేస్తే ప్రేక్షకులు స్వీకరిస్తారా? అన్న సందేహం తలెత్తింది. ఇదే విషయం అక్కినేని అన్నపూర్ణమ్మ గారితో చెప్పినప్పుడు “ఏం పర్వాలేదు ప్రేక్షకులు స్వీకరిస్తారు” అని ధైర్యం చెప్పారు అన్నపూర్ణమ్మ గారు.
సంగీతం…
మేఘసందేశం చిత్రానికి కథనాయకుడు అక్కినేని కావొచ్చు, దర్శకులు దాసరి గారికి చిత్రం యొక్క ఘనత దక్కవచ్చు. కానీ నిజానికి ఈ సినిమాకి సంగీత దర్శకులు రమేష్ నాయుడు గారు నిజమైన కథానాయకులు. ఈ చిత్రంలోని పాటలు అద్భుతంగా వచ్చాయి. ఓ పాట కాస్త వినిపించిందంటే చాలు ఆ పాట ఇప్పటికీ కూడా పూర్తిగా వినాల్సిందే అనిపిస్తుంది. “ఆకాశ దేశానా ఆషాఢమాసాన”, “నవరస సుమమాలిక”, “నిన్నటిదాకా శిలనైనా”, “పాడనా వాణి కళ్యాణిగా” అంటూ వేటూరి గారు అందించిన సాహిత్యానికి, “ఆకులో ఆకునై”, “ముందు తెలిసెనా ప్రభూ”, “సిగలో అవి విరులో”, “సీతవేళ రానీయకు” అంటూ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వ్రాసిన పాటలకు, “ప్రియే చారుశీలే” అనే జయదేవుని అష్టపది లాంటి పాటలకు అద్భుతమైన సంగీతాన్ని అందించి పాటలను అజరామరం చేసిన ఘనత రమేష్ నాయుడు గారిది.
“ముందు తెలిసెనా ప్రభూ”, “పాడనా వాణి కళ్యాణిగా”, “నిన్నటిదాకా శిలనైనా” లాంటి పాటలను ఇప్పటికి ఎవ్వరూ మర్చిపోలేదు. ఒక తపస్సులా ఈ పాటలు చేశారు రమేష్ నాయుడు గారు. దాసరి గారు కథ చెప్పి “మనం ఓసారి కూర్చోవాలి అన్నప్పుడు, మనం కాదు నేను కూర్చుంటాను. నన్ను మూడు నెలలు వదిలిపెట్టండి” అని చెప్పారు రమేష్ నాయుడు గారు. మొత్తం 24 బాణీలు సిద్ధం చేశారు. అందులో 14 పాటలు రికార్డు చేశారు. 12 పాటలను ఈ సినిమాలో వాడారు. “దేవులపల్లి కృష్ణశాస్త్రి”, వేటూరి సుందర రామూర్తి గార్ల సాహిత్యం ఈ చిత్రానికి వన్నె తెచ్చింది. ఈ కథలో వాణిజ్యాంశాలు లేకపోవడంతో దాసరి నారాయణ గారి భార్య దాసరి పద్మ గారు ఈ చిత్రాన్ని నిర్మించారు.
అక్కినేని నాగేశ్వరావు…
అక్కినేని గారికి మేఘసందేశం 200 వ సినిమా. అప్పటికే ఎన్నో మహోన్నతమైన పాత్రలు పోషించిన మహానటుడికి ఇందులోని రవీంద్రబాబు పాత్ర కొత్తగా తెచ్చిన పేరు ప్రతిష్టలు ఏమీ లేకపోయినా నటుడుగా తనని మరో మెట్టు ఎక్కించిందనే చెప్పాలి. అక్కినేని గారు మొట్టమొదటగా 1944 లో “సీతారామ జననం” తో మొదలెట్టిన తన ప్రస్థానం 1957 వరకు 60 సినిమాలు చేశారు. తన 60 వ సినిమా “దొంగల్లో దొర”. 1957 నుండి 1962 వరకు 40 సినిమాలు చేశారు. తన 100 వ సినిమా “గుండమ్మ కథ”. 1962 నుండి 1982 వరకు 20 సంవత్సరాలలో 100 సినిమాలు పూర్తిచేశారు. 1982 లో తన 200 వ సినిమా “మేఘసందేశం”. 38 సంవత్సరాలలో 200 సినిమాలలో నటించిన అక్కినేని గారు మేఘసందేశం కంటే ముందు ” “రాగదీపం” తీస్తున్నప్పుడే ఈ కళాత్మక దృశ్యకావ్యం గురించి చర్చలు జరిపారు.
ఈ చిత్రంలో అక్కినేని గారు ఓ పెద్దమనిషి, పదిమందికీ మంచీచెడూ చెప్పగలవాడు. ఆస్తిపాస్తులు, కుటుంబగౌరవమూ దండిగా ఉన్నవాడు, అందమైన భార్య, ఓ దొరసాని. అలాంటివాడు సైతం ఊరికి వచ్చిన ఓ సాని వలలో పడిపోతాడు. ఇలాంటి ఒక పాత్ర చేయాలంటే అది ఓ అద్భుతమైన సాహాసమే అని చెప్పాలి. ఆ పాత్రలో అక్కినేని గారు ఒదిగిన తీరు అమోఘం. అక్కినేని గారి నటన అద్భుతం.
మనసులో ఎంతో బాధ, గుండెనిండా మరెంతో భావుకత. ఆ రెండింటినీ కళ్లల్లో చూపించే నేర్పు కావాలి.
ఇలాంటి క్లిష్టమైన పాత్రను ఒంటిచేత్తో పండించారు అక్కినేని గారు.
జయసుధ, జయప్రదలకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. అన్నింటికీ మించి జయప్రద ఈ సినిమాకు రంగు, రుచి, వాసనలను అద్దింది.
దాసరి నారాయణ రావు..
దర్శకరత్న దాసరి నారాయణ రావు గారు 1973 లో తొలిసారిగా “తాతా మనవడు” తో దర్శకుడిగా ప్రస్థానం మొదలుపెట్టారు. రాధమ్మ పెళ్ళి (1974) తో కృష్ణ గారితో సినిమా తీసే అవకాశం వచ్చింది. బంట్రోతు భార్య (1974) తో కృష్ణంరాజు గారితో, బలిపీఠం (1975) తో శోభన్ బాబు గారితో, మనుషులంతా ఒక్కటే (1976) తో ఎన్టీఆర్ గారితో సినిమా తీసే అవకాశం చేజిక్కించుకున్నారు. మూడేళ్లలో అగ్రతారలతో సినిమా తీసిన తాను 1978 లో అక్కినేని గారితో తొలిసారిగా దేవదాసు మళ్ళీ పుట్టాడు సినిమా తీశారు. “ఏడంతస్థుల మేడ”, “శ్రీవారి ముచ్చట్లు”, “ప్రేమాభిషేకం”, “యువరాజు” లాంటి భారీ విజయాల తర్వాత అక్కినేని దాసరి కలిసి పనిచేసిన సినిమా “మేఘసందేశం”. ఇందులోని రవీంద్రబాబు పాత్ర అక్కినేని గారికి కొత్తగా తెచ్చిన పేరు ప్రతిష్టలు ఏమీ లేకపోయినా, దాసరి గారిని మాత్రం దర్శకుడుగా ఈ సినిమా శిఖరాగ్రాన నిలిపింది.
దర్శకుడిగా దాసరి గారికి 66 వ సినిమా. అద్భుతమైన చిత్రాలు తీసి విజయం అందుకున్న ఏ దర్శకులు కూడా ప్రయోగాల జోలికి పోరు. కానీ దాసరి వెళ్లారు.
తన అర్ధాంగి పద్మను కూడా తోడుగా తీసుకొని మరీ వెళ్లారు.
వెళ్లడమే కాదు, కళాత్మక భావాలను, తన సృజన ద్వారా అద్భుతంగా పలికించి యావత్తు తెలుగు జాతితో “షెభాస్” అని అనిపించుకున్నారు.
మేఘసందేశం చిత్రంలో అప్పటిదాకా ఆ పాత్రను మహానుభావుడుగా చూపించినా, చివరకు ఆ పాత్ర చేసింది తప్పు అని దాసరి గారు చెప్పిన తీరు నిజంగా అపూర్వం.
సినిమా ఆద్యంతంగా సున్నిత భావాలను అద్భుతంగా పలికిస్తూ, కళాత్మక విలువలతో సినిమాను నడిపించిన దాసరి గారి దర్శకత్వ ప్రతిభ తారా స్థాయికి చేరింది మాత్రం ఆ పతాక సన్నివేశంలోనే.
చివరకు భార్య చేతిలోనే రవీంద్రబాబు ప్రాణాలు వదలడం, అదే సమయంలో ఎక్కడో దూరంగా ఉన్న పద్మ కూడా చనిపోవడం దర్శకుని సృజనకు నిదర్శనం.
నిర్మాణం…
ప్రస్తుతం సినిమా చిత్రీకరణలో క్రేన్, ట్రాలీ ఈ రెండు కీలక పాత్రలు పోషిస్తున్నాయి. ఈ రెండింటిని ఉపయోగించకుండా సినిమా తీయాలంటే సదరు దర్శకునిలో అనుపమాన ప్రతిభ అవసరం.
అంతే కాకుండా దర్శకుడు ఎంత అడిగితే అంత ఇవ్వగలిగిన నటనాపటిమ నటీనటుల్లో ఉండాలి. “మేఘసందేశం” విషయంలో ఈ రెండు సరిగ్గా కుదిరాయి. అందుకే క్రేన్, ట్రాలీని ఉపయోగించకుండా కేవలం కెమెరా, స్టడీ, బ్లాక్ తోనే “మేఘసందేశం” చిత్రాన్ని తెరకెక్కించారు దాసరి గారు.
తన శైలికి విరుద్ధంగా మాటల్ని కూడా చాలా పొదుపుగా వాడారు దాసరి.
అప్పటికే అక్కినేని గారు అగ్ర కథానాయకులు. ఇలా సహజీవనం నేపథ్యంలో సినిమా చేస్తే ప్రేక్షకులు హర్షిస్తారా, లేదా అని సందేహంలో తెరకెక్కించిన చిత్రం ఇది.
పోలవరం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సెట్ వేసి చిత్రీకరణ మొదలుపెట్టారు.
ప్రకృతి కూడా సహకరిస్తూ ఎప్పుడు వర్షం కావాలంటే అప్పుడు వచ్చేది. అందుకే ఇందులోని వాన సన్నివేశాలు ఎంతో సహజంగా కనిపిస్తాయి.
వాణిజ్యపరంగా ఈ సినిమా విజయవంతం అవ్వలేదు. కానీ విచిత్రం. ఎన్నో పురస్కారాలు వచ్చాయి.
తొమ్మిది నంది అవార్డులు, నాలుగు జాతీయ అవార్డులు, మరికొన్ని ఫిలింఫేర్ పురస్కారాలు ఈ ప్రాంతీయ చిత్రానికి లభించాయి.
ఈ చిత్రంలో జయసుధను చూస్తే చాలు కళ్ళ వెంబడి నీళ్లు వస్తాయి. తనకు జాతీయ ఉత్తమ నటి పురస్కారం తృటిలో తప్పింది.
పురస్కారాలు…
మేఘసందేశం సినిమా 30వ జాతీయ చలనచిత్ర అవార్డులలో నాలుగు పురస్కారాలను దక్కించుకోవడంతో బాటు, ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది పురస్కారాలను తొమ్మిది గెలుచుకుంది.
జాతీయ చలనచిత్ర అవార్డులు (1982)
★ 1982 లో తెలుగులో చిత్రికరింపబడ్డ మేఘసందేశం సినిమా జాతీయ ఉత్తమ చలనచిత్రంగా పురస్కారం దక్కించుకుంది.
★ ఈ చిత్రానికి సంగీత దర్శకులు రమేష్ నాయుడు గారు ఉత్తమ సంగీత దర్శకులుగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్నారు.
★ ఈ చిత్రానికి పి.సుశీల గారికి ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది.
★ ఈ సినిమా కు కె.జె.యేసుదాస్ ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం గెలుచుకున్నారు.
నంది పురస్కారాలు (1982)..
★ 1982 వ సంవత్సరంలో మేఘసందేశం సినిమా ఉత్తమ చిత్రంగా దాసరి నారాయణరావు గారు నంది పురస్కారాన్ని అందుకున్నారు.
★ ఈ చిత్రంలో నటనకు గాను అక్కినేని నాగేశ్వరరావు గారిని ఉత్తమ నటుడు గా నంది పురస్కారం వరించింది.
★ ఈ చిత్రంలో అద్భుతమైన నటన ప్రదర్శించినందుకు గాను జయసుధ గారు ఉత్తమ నటిగా నంది పురస్కారం దక్కించుకున్నారు.
★ ఈ చిత్రానికి అద్భుతమైన బాణీలు సమకూర్చినందుకు గాను సంగీత దర్శకులు రమేష్ నాయుడు గారు ఉత్తమ సంగీత దర్శకుడు గా నంది బహుమతి పొందారు.
★ ఈ చిత్రానికి అత్యుత్తమ సాహిత్యాన్ని అందించినందుకు గాను దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఉత్తమ గీత రచయిత గా నంది పురస్కారం గెలుచుకున్నారు.
★ ఈ చిత్రానికి నేపథ్య గానం అందించిన కె.జె.యేసుదాస్ గారు ఉత్తమ నేపథ్య గాయకుడు గా నంది పురస్కారం గెలుపొందారు.
★ ఈ చిత్రానికి నేపథ్య గానం అందించిన పి.సుశీల గారు ఉత్తమ నేపథ్య గాయని గా నంది పురస్కారం పొందారు.
★ ఈ చిత్రానికి ఉత్తమ ఆడియోగ్రాఫర్ గా ఎ.ఆర్.స్వామినాధన్ గారు నంది పురస్కారం దక్కించుకున్నారు.
★ ఈ చిత్రానికి ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా పి.ఎస్.సెల్వరాజ్ గారికి నంది పురస్కారం దక్కింది.
@ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్
★ 1982 వ సంవత్సరంలో మేఘసందేశం తెలుగు చిత్రానికి గాను దర్శకులు దాసరి నారాయణరావు గారు ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారం అందుకున్నారు.
ముగింపు…
ప్రేమ కంటే గొప్పది ఆరాధన. రవీంద్రబాబు, పద్మల మధ్య ఉన్నది కూడా అదే.
మనసులు వేరైనా వారి ఆత్మలు మాట్లాడుకుంటూనే ఉంటాయని పతాక సన్నివేశంలో చెప్పారు దాసరి గారు.
ఎక్కడ నాదం వినిపిస్తుందో అక్కడ పదం నర్తిస్తుంది. ఎక్కడ గజ్జ ఘల్లుమంటుందో అక్కడ గళం విప్పారుతుంది.
ఎక్కడ రసచైతన్యం కలుగుతుందో, అక్కడ భావోద్రేకం ఉత్పన్నమవుతుంది. ఇది కచ్చితంగా నిజం.
కాని ఈ కళారాధన మత్తులో పడి మట్టిని, మనిషిని, బంధాలను, బాధ్యతలను విస్మరిస్తే చివరకు జీవితం దుర్భరం అవుతుంది.
రవీంద్రబాబు రచనలకు పుస్తక రూపాన్ని ఇస్తే అది “మేఘసందేశం” అంత గొప్పగా ఉండొచ్చు.
కానీ అదే రవీంద్రబాబు జీవితానికి ఓ పుస్తక రూపాన్ని ఇస్తే అది మరో “అసమర్ధుని జీవిత యాత్ర” అవుతుంది.
ఈ సినిమాలో దాసరి గారు చెప్పిన నీతి అదే.
విశేషాలు…
★ అక్కినేని గారికి వీరాభిమాని అయిన దాసరి గారి కలయికలో “ఏడంతస్తుల మేడ”, “శ్రీవారి ముచ్చట్లు”, “ప్రేమాభిషేకం”, “బహుదూరపు బాటసారి”, “బంగారు కుటుంబం” వంటి చిత్రాలు రూపొంది విజయం సాధించాయి.
★ అక్కినేని 200వ చిత్రంగా వచ్చిన “మేఘసందేశం” చిత్రాన్ని దాసరి నారాయణరావు గారు స్వీయ దర్శకత్వంలో నిర్మించడం విశేషం.
★ మేఘసందేశం సినిమా దర్శకుడిగా దాసరి గారికి 66వ చిత్రం. ఈ చిత్రాన్ని “తారక ప్రభు ఫిలిమ్స్ బ్యానర్” పై “దాసరి పద్మ” గారు నిర్మించారు.
★ కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం భారతీయ పనోరమా, కేన్స్ మరియు మాస్క్ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శింపబడి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
★ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక తాను అందజేసిన మొదటి నంది పురస్కారం “మేఘసందేశం”. ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా అక్కినేని నాగేశ్వరావు గారు నంది బహుమతిని అందుకున్నారు.
★ ఉత్తమ చిత్రం, ఉత్తమ నేపథ్యగాయని (సుశీల), ఉత్తమ నేపథ్య గాయకుడు (ఏసుదాసు), ఉత్తమ సంగీత దర్శకుడు (పసుపులేటి రమేష్ నాయుడు) విభాగాలలో నాలుగు జాతీయ పురస్కారాలు అందుకున్న చిత్రంగా మేఘసందేశం నిలిచింది.
★ “మేఘసందేశం” చిత్రం 1982 వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారాలలో 09 నంది పురస్కారాలు అందుకుంది.


