పి. శాంత కుమారి (17 మే 1920 – 17 జనవరి 2006)
తెలుగు సినిమా తొలి టాకీ మొదలైన తొలినాళ్లలో ఒక నటీమణిని ఎంపిక చేసుకోవాలంటే ఎన్నో చూసుకోవాల్సి వచ్చేది. ఆమె అందంగా ఉండాలి. పాట పాడగలిగి ఉండాలి. వాచకం బాగుండాలి. వీటన్నిటితో పాటు బాగా నటించగలిగి ఉండాలి. ఇన్ని గుణాలు గల అమ్మాయి దొరకడం బహుశా కష్టంగా ఉండేది. సామాన్య కుటుంబాల నుండి ఆడపిల్లలు రావడానికి, నటించడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకునే వారు కారు.
అప్పట్లో నాటకాలు అన్నా, సినిమాలన్నా వ్యామోహం బాగా ఉన్నా కూడా అందులో నటించేవారన్నా, పాటలు పాడేవారన్నా సమాజంలో చిన్న చూపు ఉండేది. అలాంటి సమయంలోనే బహుముఖ ప్రజ్ఞా పాటవాలు కలిగి ఉన్న పి. శాంతకుమారి గారు చిత్ర సీమకు పరిచయమయ్యారు. నాయికగా ప్రవేశించి మూడు తరాల నాయికా నాయికలకు తల్లై అన్ని రకాల చిత్రాలలోనూ ప్రేమ, భక్తి, వాత్సల్య రసాలను సప్త స్వరాలుగా మార్చిన గాయని నటి పి.శాంతకుమారి. ఫక్తు కర్ణాటక సంగీతాన్ని శుద్ధంగా అభ్యసించిన ఒకే ఒక తెలుగు నటి.
“ఎన్నాళ్లని నా కన్నులు కాయగ ఎదురు చూతురా గోపాలా..
ఎంత పిలిచినా ఎంత వేడినా ఈనాటికి దయ రాదేలా..
వీనుల విందుగా వేణు గానమూ వినితరింపగ వేచితిరా..
వేచి వేచి వెన్న ముద్దవలె కరిగిపోయెరా నా బ్రతుకూ”..
పై పాటను ఆనాటి ప్రసిద్ధ గాయని చేత పాడించాలని అనుకున్నారు దర్శకులు పి.పుల్లయ్య గారు. కానీ తాను ఒప్పుకోలేదు. దాంతో పి.పుల్లయ్య గారు శాంతకుమారి గారితోనే పాడించారు.
ఆత్రేయ గారు వ్రాసిన ఈ సాహిత్యాన్ని, పీలు రాగంలో రసభరితంగా స్వరపరిచారు పెండ్యాల గారు. శాంతకుమారి గారు వెన్న మీగడల మాధుర్యం గల గాత్రంతో అద్భుతంగా ఆలపించారు. శాంతకుమారి గారి కంఠం వాత్సల్యానికి నెలువు. ఆమె గాత్రానికి శ్రోతలు మంచులా కరిగిపోతారు. “కృష్ణ ప్రేమ”, “ధర్మ పత్రిక”, “గుణసుందరి”, “షావుకారు” వంటి చిత్రాల్లో తన పాత్రలకు తానే పాడుకున్నారు శాంతకుమారి గారు.
జీవిత విశేషాలు…
జన్మ నామం : వెళ్ళాల సుబ్బమ్మ (పి. శాంత కుమారి)
జననం : 17 మే 1920
స్వస్థలం : వై.ఎస్.ఆర్.జిల్లా ప్రొద్దుటూరు
తండ్రి : వెల్లాల శ్రీనివాసరావు
తల్లి : పెద్ద నర్సమ్మ
భర్త : పి. పుల్లయ్య
పిల్లలు : ఇద్దరు అమ్మాయిలు పద్మ, రాధ..
వృత్తి : నటి , గాయని, నిర్మాత
మరణ కారణం : దీర్ఘకాలిక అస్వస్థత
మరణం : 17 జనవరి 2006, చెన్నై లోని తన స్వగృహంలో
జననం..
శాంతకుమారి గారి అసలు పేరు వెల్లాల సుబ్బమ్మ. వెల్లాల సుబ్బమ్మ గారు వై.ఎస్.ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు లో 17 మే 1920 సంవత్సరంలో వెల్లాల శ్రీనివాసరావు, పెద్ద నర్సమ్మ గార్లకు జన్మించారు. శ్రీనివాసరావు గారికి కళలు అంటే ఎంతో ఇష్టం. అందుకనే తన కూతురైన సుబ్బమ్మను మద్ర్రాసులో ఉన్న ప్రొఫెసర్ పి.సాంబమూర్తి గారి వద్దకు కర్ణాటక సంగీతం, వయొలిన్ నేర్చుకోవటానికి పంపించారు. డి.కె.పట్టమ్మాళ్ సుబ్బమ్మ గారికి సహాధ్యాయిని. పదమూడేళ్ళ వయసులోనే సుబ్బమ్మ గారు కర్ణాటక సంగీతం లో ఉత్తీర్ణురాలయ్యారు. పదనేళ్ళ వయసులో వయొలిన్ లో ఉత్తీర్ణురాలయ్యారు. ఆ తరువాత గురువు గారితో కలసి దక్షిణ భారతదేశం అంతా ఎన్నో కచేరీలు చేశారు. పదహారేళ్ళ వయసులోనే విద్యోదయా స్కూలులో పిల్లలకు సంగీతం నేర్పించేవారు.
సంగీత విద్యాభ్యాసం…
కడప జిల్లా ప్రొద్దుటూరులో జన్మించిన శాంత కుమారి గారి అసలు పేరు వెళ్లాల సుబ్బమ్మ. ఈమె పిన తండ్రి గారికి సంతానం లేని కారణంగా ఈమె బాల్యమంతా కడపలోనే అతని వద్ద గడిచింది. ఈమె తల్లి పెద్ద నరసమ్మ సంగీత విధ్వంసరాలు కావడంతో సహజంగానే శాంతకుమారి గారికి సంగీత వాసన అబ్బింది. తల్లి పాడుతుంటే విని శాంతకుమారి గారు కూడా అలాగే పాడటం గమనించిన తన అమ్మమ్మ శాంతకుమారి గారికి మంచి గురువును పెట్టి సంగీతాన్ని నేర్పించాలి అనుకుంది. తనకు బాల్యంలో సంగీతం పట్ల ఎంతగా అభిమానం ఉండేదంటే మామూలు చదువు మీద దృష్టి నిలిచేది కాదు. సంగీతం ముందు ఆ చదువులు విసుగ్గా అనిపించేవి. కానీ సంగీతంలో పై స్థాయికి వెళ్లాలంటే కనీసం థర్డ్ ఫామ్ (ఎనిమిదవ తరగతి) చదివి ఉండాలి.
కాబట్టి చదువు పట్ల ఆసక్తి లేకపోయినా తాను తప్పక చదివేవారు. రోజురోజుకు తమ కుమార్తెలో పెరుగుతున్న సంగీతాభిలాషను కాదనలేక ఆమె తల్లిదండ్రులు, ఆమెను తీసుకువచ్చి మద్రాసులో కాపురం పెట్టారు. ఆ రోజుల్లో మద్రాసు నగరంలో ప్రొఫెసర్ పి.సాంబమూర్తి గారు పేరు మోసిన సంగీత విధ్వాంసులు. వారు మద్రాసులో వేసవి పాఠశాల నడిపేవారు. తనకు శిష్యురాలిగా “శాంతకుమారి” ని చేర్పించారు ఆమె తల్లిదండ్రులు. సాంబమూర్తి గారి వద్ద శాంతకుమారి చేరేటప్పటికీ ప్రఖ్యాత సంగీత విధ్వంసరాలు డీ.కే.పట్టమ్మాల్ అక్కడ నాలుగేళ్ల సీనియర్. శాంతకుమారి గారు సాంబమూర్తి గారి శిక్షణలో గాత్రంలోనే కాక, ఫిడెల్ వాయించడంలో కూడా ప్రావీణ్యురాలైంది.
స్కూల్ టీచర్ గా
అప్పట్లో మద్రాసులోనే “మంగంబాకం” లో విద్యోదయా పాఠశాలలో సాంబమూర్తి గారి సిఫారసుతో టీచర్ గా చేరారు శాంతకుమారి గారు. అయితే స్కూల్ టీచర్ ఉద్యోగం తనకు ఇష్టం ఉండేది కాదు. ఆ పాఠశాలలో పిల్లలంతా తమిళం మాట్లాడుతారు. ఈమెకు మాత్రం తమిళం, ఇంగ్లీష్ రెండు భాషలు రావు. తన తండ్రి గారి బలవంతంతో శాంతకుమారి గారు స్కూల్ టీచర్ గా నెలకు 75 రూపాయల జీతానికి చేరారు. మొదట్లో కొంత బెరుగ్గా అనిపించినా పిల్లలంతా “సుబ్బమ్మ టీచర్” అంటూ ప్రేమ చూపించడంతో శాంతకుమారి గారు వాళ్లలో కలిసిపోయారు. స్కూల్ పిల్లలకు గాత్ర సంగీతం తో పాటు ఫిడేల్ వాయించడం కూడా నేర్పించేవారు. ఆ స్కూల్లో పనిచేసే రోజుల్లోనే తానే కచేరీలు చేయడం కూడా ప్రారంభించారు. అంతేకాదు డీ.కే.పట్టమ్మాళ్, వసంత కోకిలం, విశ్వేశ్వరమ్మల పాటల కచేరీలకు పక్క వాయిద్యంగా శాంతకుమారి గారు ఫిడెల్ వాయించేవారు.
సినీ ప్రస్థానం…
“అదృష్టం చెప్పి రాదు” అనే నానుడికి శాంతకుమారి గారి జీవితమే దృష్టాంతం. శాంతకుమారి గారి సినీ రంగ ప్రవేశం కాకతాళీయంగా, నాటక ఫక్కీలో జరిగింది అని చెప్పుకోవచ్చు. మద్రాసులోని ఒకరి ఇంట్లో పందిట్లో సంగీత కచేరి చేస్తున్న సుబ్బమ్మ గారి గాత్ర కౌశలాన్ని, రూప లావణ్యాన్ని, ఆ కచేరీ చూడడానికి వచ్చిన “వేల్పు పిక్చర్స్” అధినేత కీర్తిశేషులు పి.వి.దాసు గారు గమనించి తాను తీయబోతున్న “శశిరేఖ పరిణయం” (మాయాబజార్) లో శశిరేఖ పాత్రకు సరిగ్గా ఆవిడ గారు సరిపోతారు అని అనుకున్నారు. అతి కష్టం మీద ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించిన దాసు గారు సుబ్బమ్మను కథానాయికను చేశారు. సుబ్బమ్మ గారి పేరును పి.వి.దాసు గారే “శాంతకుమారి”గా మార్చారు. ఆ రోజుల్లో ఏడాదికి రెండు లేక మూడు సినిమాలు విడుదల చేసే కారణం వలన ప్రేక్షకులు విరగబడి చూశారు. “శశిరేఖ పరిణయం” చిత్రానికి శాంతకుమారి గారు తీసుకున్న పారితోషికం 1116 రూపాయలు.
చిత్ర జైత్రయాత్ర
“సారంగధర”లో చిత్రాంగి పాత్రధారణతో నటిగా శాంతకుమారి ఎనలేని పేరు ప్రఖ్యాతులను అందుకుంది. ఆ తర్వాత వచ్చిన “కృష్ణ ప్రేమ”, “రుక్మిణి కళ్యాణం”, “ధర్మపత్ని” మొదలైన చిత్రాలు ఆమె స్థాయిని మరింత పెంచాయి. గ్లామర్ పాత్రలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే మన చిత్ర పరిశ్రమలో, అమ్మ పాత్ర వేయాలంటే కథానాయికగా రాణిస్తున్న ఏ నటి కూడా సాధారణంగా ముందుకు రాదు. అలాంటి సమయంలో కథానాయికగా అగ్రశ్రేణిలో ఉన్న శాంతకుమారి గారు తన 27 వ యేట తమిళం చిత్రం “అమ్మ” (1947) చిత్రం లో అమ్మ పాత్ర పోషించి తాను మరింత ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ప్రముఖ నటి జి.వరలక్ష్మి గారు తన భర్త కె.యస్.ప్రకాష్ రావు గారు నిర్మించిన “కన్నతల్లి” చిత్రంలో తల్లి వేషం వేయడానికి శాంతకుమారి “అమ్మ” పాత్ర ప్రభావమే కారణమని చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు.
“అమ్మ” చిత్రం తర్వాత శాంతకుమారి గారు ధరించిన పాత్రలన్నీ ఇంచుమించు అలాంటివే. శాంతకుమారి గారి ఎన్నో పాత్రలు మనల్ని ఆత్మీయంగా పలకరిస్తాయి. “రేచుక్క”, “జయభేరి”, “భక్త జయదేవ”, “మనసే మందిరం”, “తల్లా పెళ్ళామా”, “ప్రేమ్ నగర్”. శాంత, కరుణ, సాత్విక అభినయాల ఆవిష్కరణలో తనకు తానే సాటి. తన మనస్తత్వానికి భిన్నంగా మూతి విరుపుల సవతి తల్లిగా “అర్ధాంగి” లోను, గయ్యాళి అత్తగా “సంక్రాంతి”, “బొమ్మల పెళ్లి” చిత్రాలలోనూ, రాచరిక అహంకారాన్ని ప్రదర్శించే నిర్లక్ష్యపు తల్లిగా “ప్రేమ్ నగర్” లోను “సానుభూతి లేని” పాత్రలు ధరించి తన నటన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు.
ఇదే విషయాన్ని శాంతకుమారి వద్ద ప్రస్తావిస్తే “నేను ధరించిన ప్రతీ పాత్ర నాకు గొప్ప అనుభవాన్ని నేర్పించాయి” అంటారు. “అన్ని రకాల పాత్రలను నేను ధరించినా, కొన్ని మాత్రం భరించాను” అంటారు. 1937లో వచ్చిన “సారంగధర” చిత్రంలో చిత్రాంగిగా వేశ్య పాత్రని సమర్ధవంతంగా పోషించారు శాంతకుమారి గారు. 1957లో జూపిటర్ వారు నిర్మించిన “సారంగధర”లో చిత్రాంగి వేషం పి.భానుమతి గారు ధరించగా, శాంతకుమారి గారు రత్నాంగిగా నటించి కరుణ రసాన్ని పండించారు. అదేవిధంగా “శ్రీ వెంకటేశ్వర మహత్యం” మొదట తీస్తే అందులో పద్మావతి దేవిగా నటించిన శాంతకుమారి గారు, 1960లో నిర్మించిన “శ్రీ వెంకటేశ్వర మహత్యం” లో అందులో “వకుళాదేవి” గా నటించి తన నటనలో వైవిధ్యాన్ని చాటుకున్నారు.
దర్శకులు పి.పుల్లయ్య తో ప్రేమ వివాహం…
“శశిరేఖ పరిణయం” చిత్రం చిత్రీకరణ దశలో ఉండగానే పి.పుల్లయ్య గారి దర్శకత్వంలో స్టార్ కంబైన్స్ వారు తీస్తున్న “సారంగధర” చిత్రంలో చిత్రాంగి వేషానికి శాంతకుమారి గారిని ఎన్నుకున్నారు. “సారంగధర” చిత్రంలో శాంతకుమారి గారు చిత్రాంగి కాగా, “సారంగధరుడి”గా బంధా కనక లింగేశ్వరరావు గారు నటించారు. ఈ చిత్రం ఆమె నట జీవితాన్నే కాకుండా తన వ్యక్తిగత జీవితాన్ని కూడా మలుపు తిప్పింది. ఆ చిత్ర దర్శకులైన పోలదాసు పుల్లయ్య గారితో శాంతకుమారి గారు ప్రేమలో పడ్డారు. ఆ రోజుల్లో ప్రేమ వివాహాలకు పెద్దలు ఇష్టపడేవారు కారు. దీనివల్ల వారి ప్రేమకు అనేక విఘాతలు అడ్డుపడ్డాయి. కానీ సంప్రదాయం, ప్రేమ ఘర్షణ లో శాంతకుమారి గారు నెగ్గారు.
ప్రేమ చిగురించిన ఏడాదికే శాంతకుమారి, పుల్లయ్య గార్లు తన స్వగ్రామమైన వెల్లాలలో దంపతులయ్యారు. పెద్దల అంగీకారం పొందిన ప్రేమ వివాహంగా వీరి వివాహాన్ని అభివర్ణించవచ్చు. దర్శకుడు, నటీమణి వివాహం చేసుకోవడంలో పెద్ద విశేషమేమీ లేదు. కానీ ఇలాంటి వివాహాలు చివరి దాకా కొనసాగవని హాలీవుడ్ నుంచి ఆంధ్ర వరకు అంటుంటారు. కానీ ఇందుకు భిన్నంగా శాంతకుమారి, పుల్లయ్య గార్ల దాంపత్యం పది కాలాలపాటు వర్ధిల్లి వారు మాకు ఆదర్శ దంపతులయ్యారని ప్రఖ్యాత నటి అంజలీదేవి గారు వ్యాఖ్యానించారు. అదే విధంగా మీ జీవితంలో మర్చిపోని సంఘటన ఏమిటి అని శాంతకుమారి గారిని అడిగితే మా వారిని పెళ్లి చేసుకోవడమే అని నిండుగా నవ్విసేవారావిడ.
గాయనిగా శాంతకుమారి…
టాకీ సినిమా పుట్టిన తొలినాళ్లలో చిత్రసీమలో అడుగుపెట్టిన శాంతకుమారి గారు, ప్లే బ్యాక్ లేని రోజులు కావడంతో స్వతహాగా విధ్వాంసురాలు కావడం వలన తన పాటలు తానే పాడుకునేవారు. తీగసాగే స్వర మాధుర్యం శాంతకుమారి గారికి సరస్వతి దేవి ప్రసాదం. భావగాంభీర్యం, తంబురాని కూడా శృతి చేయడానికి ఉపయోగపడే స్వర శుద్ధమైన గాత్రం, కడిగిన ముత్యాల్లా అక్షరాలను ఉచ్చరించే తీరు ఆమెకు జన్మతః లభించిన వరాలు. “ధర్మపత్ని” లో “సతియే సతియా”, “పార్వతి కళ్యాణం” లో “స్వామి నను కరుణించెన్”, “కృష్ణ ప్రేమ”లో “ఇదే ఆనందము” వంటి పాటల్ని ఆనాడు శాంతకుమారి గారికి ఒక ప్రత్యేకతను సాధించి పెట్టాయి.
“మాయలోకం” లో “మోహనరంగా రారా” పాట పాడుతూ ఉంటే నిజ జీవితంలో తల్లి కొడుకుల అనుబంధం కలిగి ఉన్న శాంత కుమారి, అక్కినేని నాగేశ్వరావు గార్లను ప్రేయసి, ప్రియురాలు గానే భావించగలిగారు ఆనాటి ప్రేక్షకులు అంతటి “వినుకట్టు” ఆమె గాత్రానికి ఉంది. “గుణసుందరి కథ” లో శాంతకుమారి, మాలతి పాడిన రెండు ప్రేమ గీతాలు “కలకల ఆ కోకిలేమో”, “చల్లని దొరవేలే చందమామ” ఈ పాటలు వింటున్న కొద్ది మైకం ఎక్కువ అయ్యేదే గాని తగ్గేది కాదు. “గుణసుందరి” తర్వాత మళ్లీ ఆమె పాటలకు ప్రజాదరణ లభించింది “శ్రీ వెంకటేశ్వర మహత్యం” లోనే.
ఆ తర్వాత “సిరిసంపదలు”, “తల్లా పెళ్ళామా”, “ప్రాణమిత్రులు” మొదలైన చిత్రాలలో పాటలు పాడి ఆ చిత్రాలకే ఘనత నాపాదించిన దృశ్యాలలో వాత్సల్యరసం మూర్తీభవించడమే గాక, కథను పాత్రను అనుసరించి దానికి విషాదం, రక్తి, విరక్తి, నిర్వేదం తోడై అటువంటి నటనకు అవి పరాకాష్ట అని ఋజువుచేశాయి. ఆమెకు గల సంగీత పరిజ్ఞానాన్ని చిత్ర పరిశ్రమ సరిగ్గా వినియోగించుకోకపోయినా కూడా ఆమెకు సంగీతం పట్ల గల ఆసక్తి ఎక్కువైందే గాని తగ్గలేదు. “సంగీతం నా శారీరక రుగ్మతలను దూరం చేసి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. కనుక సంగీతంలో శిక్షణ, సలహాలు ఇస్తుంటాను అని శాంతకుమారి గారు చెబుతుండేవారు.
గృహిణిగా…
శాంత కుమారి గారు సినిమా తారగా ఎంత తీరిక లేకుండా ఉన్నా కూడా గృహణిగా తన బాధ్యతలను ఏనాడూ విస్మరించలేదు. తనకు గల కుటుంబ సాంప్రదాయాల విలువలను అత్యంత శ్రద్ధగా కాపాడుకునేవారు. పుల్లయ్య, శాంత కుమారి గార్ల అన్యోన్య దాంపత్యానికి చిహ్నంగా పద్మ, రాధా అనే ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. వీరిలో రెండో అమ్మాయి రాధకు సాహిత్యంలో కూడా ప్రవేశం ఉంది. తమ సొంత సినిమా “మురళీకృష్ణ” కు కథను సమకూర్చింది రాధనే. మీకు
మగపిల్లలు లేనందుకు బాధపడ్డారా అని ఎప్పుడైనా శాంతకుమారి గారిని అడిగితే, ఆవిడ నాకు మగపిల్లలు ఉన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, జగ్గయ్య వీళ్లంతా నా బిడ్డలే. మా వారు కూడా ఎప్పుడూ కూడా ఇదే మాట అనేవారు. వాళ్ళు కూడా మమ్మల్ని అమ్మ, నాన్న అని పిలిచేవారు. నా కూతుర్లు ఇద్దరిని వాళ్ళు భుజాల మీద ఎత్తుకొని ఆడించేవారు. ఇప్పటికే అక్కినేని నాగేశ్వరావు గారు ఎప్పుడైనా మద్రాసు వస్తే మా ఇంటికి భోజనానికి వస్తారు. వీలు లేకపోతే అడిగిమరీ తానున్న చోటుకు క్యారియర్ తెప్పించుకుని మరీ తింటారు అన్నారు శాంతకుమారి గారు.
నిర్మాతగా..
1947 సంవత్సరంలో శాంతకుమారి దంపతులు ఇతర భాగస్వాములతో కలిసి రాగిణి సంస్థను స్థాపించారు. వీరు మొదటి సినిమాగా “భక్తజన” నిర్మించారు. ఇందులో హోనప్ప భాగవతార్ అనే సంగీత విద్వాంసుడు పాండురంగడి పాత్రలో నటించాడు. అయితే ఈ చిత్రం ఆర్థికంగా అపజయం పాలైనా కూడా సంగీతం అమృతప్రాయంగా ఉండి ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఆ తర్వాత “ధర్మదేవత”, “తిరుగుబాటు”, “ఏటుక్కారి”, “అర్థాంగి” మొదలైన చిత్రాలను నిర్మించి మంచి పేరు తెచ్చుకున్నారు.
కొంత కాలం తర్వాత శాంతకుమారి గారు తన భర్త పి.పుల్లయ్యతో కలిసి “పద్మశ్రీ” సంస్థను స్థాపించి ఎన్నో మంచి కుటుంబ కథా చిత్రాలు నిర్మించారు. ఈ చిత్రాలన్నీటికి శాంతకుమారి గారి తమ్ముడు శ్రీ వెంకటేశ్వర్లు నిర్మాణ వ్యవహార్తగా వ్యవహరించారు. వీరు నిర్మించిన “శ్రీ వెంకటేశ్వర మహత్యం” కనకరాశులను కురిపించింది. ఈ చిత్రం సంవత్సరానికి పైగా ప్రతి థియేటర్ లోనూ ఆడి రికార్డులు బద్దలు కొట్టింది. ఆ తర్వాత “కొడుకు కోడలు”, “అల్లుడు మేనల్లుడు”, “అందరు బాగుండాలి” ఇలాంటి చిత్రాలను నిర్మించి మంచి నిర్మాతగా కూడా పేరు తెచ్చుకున్నారు శాంతకుమారి గారు.
పాక్షిక సినిమాల జాబితా..
మాయాబజార్ లేదా శశిరేఖాపరిణయం (1936)
సారంగధర (1937)
రుక్మిణీ కల్యాణం (1937)
భక్తజయదేవ (1938)
శ్రీ వేంకటేశ్వరమహత్యం (1939)
ధర్మపత్ని (1941)
పార్వతీ కల్యాణం (1941)
కృష్ణప్రేమ (1943) (రాధ పాత్ర)
మాయాలోకం (1945)
గుణసుందరి కథ (1949)
(గుణసుందరిదేవి దుష్ట బుద్ధిగల అక్కగా)
షావుకారు (1950)
ధర్మదేవత (1952)
(కాత్యాయిని పాత్ర)
అర్ధాంగి (1955)
సారంగధర (1957)
జయభేరి (1959) (అన్నపూర్ణ పాత్ర)
శ్రీ వెంకటేశ్వర మహత్యం (1960) (వకుళ పాత్ర)
సిరిసంపదలు (1962)
ప్రేమించి చూడు (1965)
ప్రాణమిత్రులు (1967)
బంగారు పిచ్చుక (1968)
అక్కాచెల్లెలు (1970) (జడ్జి రామచంద్రరావు గారి తల్లి)
అల్లుడే మేనల్లుడు (1970) – జానకి
ప్రేమనగర్ (1971)
కొడుకు కోడలు (1972)
సోగ్గాడు (1975)
అందరూ బాగుండాలి (1976)..
గౌరవ పురస్కారాలు..
సుమారు 70 సంవత్సరాల తన సుదీర్ఘ చలనచిత్ర జీవితంలో శాంత కుమారి గారు పొందిన సన్మానాలకు పురస్కారాలకు కొదవలేదు. కళా సరస్వతి, గాన కోకిల, గాన సరస్వతి, సంగీత సరస్వతి ఇలా ఎన్నో బిరుదులిచ్చి సాంస్కృతిక సంస్థలు శాంతి కుమారి గారిని సత్కరించాయి. డాక్టర్ ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా 1995లో తెలుగుజాతి ఆత్మగౌరవ పురస్కారం అందుకున్నారు. 1981లో రఘుపతి వెంకయ్య అవార్డును పుల్లయ్య గారు దక్కించుకోగా, 1999 సంవత్సరంలో అదే రఘుపతి వెంకయ్య అవార్డును శాంతకుమారి గారు పొందారు. రఘుపతి వెంకయ్య అవార్డును పురస్కారాన్ని తీసుకున్న తొలి దంపతులు కూడా వీళ్ళే కావడం విశేషం.
మరణం…
ఎన్నో యేండ్లు కాపురం చేసిన భర్త పి.పుల్లయ్య గారు చనిపోయాక విపరీతంగా దిగులు చెందారు శాంతకుమారి గారు. 1987 లో తన భర్త గారు పోయాక తనను తలుచుకుని శాంతికుమారి గారికి ఆరోగ్యం బాగాలేదు. షుగర్, బి.పీ వచ్చాయి. తనకు దేవుడి భక్తి ఎక్కువ. కానీ గుడికి వెళ్ళలేక, పూజ చేయలేక, నడవలేక, మేడ మెట్లు ఎక్కలేక, దిగలేక, మతిమరుపు అవహించేసి ఎన్నో ఇబ్బందులకు గురి అయ్యారు. 86 ఏళ్ల శాంతకుమారి గారు తెలుగు చిత్ర పరిశ్రమ అంతా కూడా ఆప్యాయంగా ‘అమ్మ’ అని పిలుచుకునే వైవిధ్య భరిత నటి దీర్ఘకాలిక అస్వస్థత తరువాత 17 జనవరి 2006 తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు చెన్నై లోని తన స్వగృహంలో మరణించారు.