తెలుగు చిత్రాలకు పితామహుడు అనదగిన ఒక ప్రముఖ దర్శకుడి కుమారుడు, తెలుగు సినిమా తొలి దశాబ్దాలలో చెరిగిపోని ఒక ముద్ర వేసిన కథానాయిక కు అల్లుడు, తెలుగు సినిమా స్వర్ణయుగం లో అందాల నటి కి భర్త, తన పేరు చిత్తజల్లు శ్రీనివాసరావు, సి.శ్రీనివాసరావు బి.ఏ.లిట్. చిత్తజల్లు శ్రీనివాసరావు గారి దర్శకత్వ జీవితం 1953 నుండి 1989 వరకు కొనసాగింది. ఈ 35 సంవత్సరాలలో తాను దర్శకత్వం చేసిన సినిమాల సంఖ్య సుమారు 62. ఇందులో 50 తెలుగు సినిమాలు, 05 తమిళ సినిమాలు, 04 కన్నడ, 02 ఒరియా, 01 మళయాల చిత్రం.
తాను దర్శకుడిగా కొనసాగిన కాలం, రూపొందిన చిత్రాల సంఖ్యను చూసుకుంటే, మరీ వేగంతో చిత్రాలను రూపొందించినట్లు కనిపించరు. ఒక్క 1968లో ఆరు సినిమాలు తప్ప మిగతా సంవత్సరాలలో ఒకటి, రెండు లేదా మూడు, నాలుగు చిత్రాలను రూపొందించారు. ఆ రోజులలో చిత్తజల్లు శ్రీనివాసరావు గారి సినిమా అంటే పకడ్బందీ సినిమా అనేవారు సమీక్షకులు, అలాగే ఆదరించే వారు ప్రేక్షకులు. శాంతినివాసం, కంచుకోట, బంగారు గాజులు, నిలువు దోపిడీ, నిండు సంసారం, పెత్తందారులు, జీవిత చక్రం, దేశోద్ధారకులు మొదలైనవి సిచిత్తజల్లు శ్రీనివాసరావు గారు తనదైన ముద్రవేసిన సినిమాలు. వినోదం, సెంటిమెంటు సమపాళ్లలో మేళవించి, వాణిజ్యపరమైన సినిమాలు నిర్మించడంలో చిత్తజల్లు శ్రీనివాసరావు గారు సిద్ధహస్తులు.
చిత్తజల్లు శ్రీనివాసరావు గారి సినిమా అంటే కమ్మని పాటలు ఉంటాయి, వినోదం తప్పనిసరి. సాంఘిక చిత్రాలైతే కుటుంబ విలువ, అనుబంధం ఉంటుంది అన్న భావన ప్రేక్షకులలో ఉండేది. ఆ రోజులలో ఒక విధంగా తనను “ఆల్ రౌండర్” దర్శకులు అని కూడా అనవచ్చు. పౌరాణికాలు, సాంఘికాలు, జానపదాలు, చారిత్రక చిత్రాలు ఇలా ఏ వర్గానికి చెందిన సినిమాలైనా చిత్రీకరించి పక్కా స్క్రిప్ట్ తో తనమైన ముద్ర వేసేవారు చిత్తజల్లు శ్రీనివాసరావు గారు. తన చిత్రాలలో విజయ శాతం 75 పైగానే ఉండేది. దర్శకుడుగా చిత్తజల్లు శ్రీనివాసరావు గారు అనగానే కచ్చితంగా రెండు సినిమాలు చెప్పవచ్చు. ఒకటి అద్భుతమైన విజయం సాధించిన లవకుశ, మరొకటి ఘోరంగా అపజయం పాలైన “ఏకవీర”.
లవకుశ చిత్రానికి అసలు దర్శకుడు చిత్తజల్లు శ్రీనివాసరావు గారి నాన్నగారు చిత్తజల్లు పుల్లయ్య గారు. చిత్తజల్లు పుల్లయ్య గారి నాన్నగారి అనారోగ్యం వలన, ఆయన పర్యవేక్షణలో అధిక భాగం దర్శకత్వం చేశారు చిత్తజల్లు శ్రీనివాసరావు గారు. లవకుశ చిత్ర విజయానికి పూర్తి వ్యతిరేకంగా ఎన్నో అంచనాలతో విడుదలై ప్రేక్షకుల తిరస్కరణకు గురైన చిత్రం “ఏకవీర” తన దర్శకత్వంలోనే తయారయ్యింది. ఎన్టీఆర్ గారిని ఎక్కువ చిత్రాలలో దర్శకత్వం చేసింది చిత్తజల్లు శ్రీనివాసరావు గారు. చిత్తజల్లు శ్రీనివాసరావు గారు పాక్షికంగా దర్శకత్వం వహించిన చిత్రాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే చిత్తజల్లు శ్రీనివాసరావు గారు, నందమూరి తారకరామారావు గారి గారి కలయికలో వచ్చిన చిత్రాల సంఖ్య 18. అక్కినేని నాగేశ్వరరావు గారితో, చిత్తజల్లు శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో చిత్రీకరించిన సినిమాలు ఏడు.
చిత్తజల్లు శ్రీనివాసరావు గారు రూపొందించిన చిత్రాలలో 50% చిత్రాలలో హీరోలు ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరావు గార్లు అయితే, కథానాయిక మరియు ఇతర పాత్రలో నటించిన నటీమణి చిత్తజల్లు శ్రీనివాసరావు గారి భార్య రాజసులోచన గారు 12 సినిమాలు, సావిత్రి గారు ఏడు సినిమాలలో నటిస్తే, జమున గారు ఆరు సినిమాల్లో నటించారు. శోభన్ బాబు గారు ఆరు సినిమాలలో నటిస్తే, కృష్ణ గారు నాలుగు సినిమాలలో నటించారు. చిత్తజల్లు శ్రీనివాసరావు గారు ఎక్కువ చిత్రాలను నిర్మించిన నిర్మాణ సంస్థ కన్నాంబ గారి శ్రీ రాజరాజేశ్వర ఫిలిమ్స్. చిత్తజల్లు శ్రీనివాసరావుగారి నాన్నగారి “లవకుశ” చిత్రానికి పాక్షిక దర్శకత్వం వహించినట్టే, ఆదుర్తి సుబ్బారావు గారి మరణంతో మధ్యలో ఆగిపోయిన “మహాకవి క్షేత్రయ్య” చిత్రాన్ని పూర్తిచేసినది కూడా చిత్తజల్లు శ్రీనివాసరావు గారే.
హిందీ సంగీత దర్శకులు శంకర్ జై కిషన్ గారు తొలిసారిగా నేరుగా సంగీత దర్శకత్వం వహించిన విజయవంత చలనచిత్రం ఎన్టీఆర్ గారి “జీవితచక్రం”. ఈ చిత్రానికి దర్శకుడు చిత్తజల్లు శ్రీనివాసరావు గార. ఇద్దరు ప్రముఖ సంగీత దర్శకులు కే.వీ.మహదేవన్, సాలూరు రాజేశ్వరరావు గార్లు బాణీలు సమకూర్చిన చిత్రం 1980లో విడుదలైన “చుక్కల్లో చంద్రుడు”, దానికి దర్శకులు కూడా చిత్తజల్లు శ్రీనివాసరావు గారే. ఆనాటి ప్రముఖ రచయిత మోదుకూరు జాన్సన్ తొలిసారి మాటలు వ్రాసిన “దేశోద్ధారకులు” చిత్రంలో “స్వాగతం స్వాగతం దొర” అనే పాటను వ్రాశారు. దానికి దర్శకులు కూడా చిత్తజల్లు శ్రీనివాసరావు గారే. చిత్తజల్లు శ్రీనివాసరావు గారు కొన్ని సినిమాలలో కూడా నటించారు.
జీవిత విశేషాలు…
జన్మ నామం : చిత్తజల్లు శ్రీనివాసరావు
ఇతర పేర్లు : సి.యస్.రావు
జననం : 01 మే 1924
స్వస్థలం : కాకినాడ, ఆంధ్రప్రదేశ్
వృత్తి : సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు , నటుడు
తండ్రి : చిత్తజల్లు పుల్లయ్య
తల్లి : రంగమ్మ
జీవిత భాగస్వామి : రాజ సులోచన
పిల్లలు : ఇద్దరు కుమార్తెలు
మరణ కారణం : బోదకాలు
మరణం : 08 డిసెంబరు 2004, మద్రాసు
నేపథ్యం…
కాకినాడలో పుట్టి పెరిగిన చిత్తజల్లు పుల్లయ్య గారు మూకీ సినిమా రోజుల నుండి సినిమా రంగంలో ఉన్నారు. ఈస్టిండియా కంపెనీ వాళ్ళ ఆహ్వానం మేరకు కలకత్తా వెళ్లి పూర్తిస్థాయి దర్శకుడిగా 1933 నుండి సతీసావిత్రి, లవకుశ, శ్రీకృష్ణతులాభారం లాంటి చిత్రాలను రూపొందించారు. పుల్లయ్య గారు 1936లో తీసిన ఒక సినిమాతో చిత్తజల్లు శ్రీనివాసరావు గారిని వెండితెర మీదకి తీసుకొచ్చారు సి.పుల్లయ్య గారు.
చిత్తజల్లు పుల్లయ్య, రంగమ్మ దంపతులకు వరుసగా ఎనిమిది మంది పిల్లలు పుట్టి చనిపోయారు. 01 మే 1924 నాడు తొమ్మిదో సంతానం గా అబ్బాయి జన్మించారు. ఆ అబ్బాయికి శ్రీనివాసరావు అని పేరు పెట్టుకున్నారు. కానీ ఇంట్లో అందరూ బోడిబాబు అని పిలిచేవారు. అప్పట్లో శిశు మరణాలు ఎక్కువగా ఉండేవి. వరుసగా పిల్లలు చనిపోతూ ఉంటే కనీసం ఈ పిల్లవాడైనా మిగిలాడని విలక్షణమైన పేరు పెడుతుండేవారు. హరి, బిక్షం, ఎర్రోడు, నల్లోడు ఇలా. ఆకోవలోనే బోడిబాబుగా పెరిగారు చిత్తజల్లు శ్రీనివాసరావు గారు.
బాల్యం…
చిత్తజల్లు శ్రీనివాసరావు గారు పుట్టిన తర్వాతే పుల్లయ్య గారు బొంబాయి వెళ్లి మూకీ సినిమాలలో పనిచేశారు. శ్రీనివాసరావు గారు తన చదువంతా కాకినాడలోనే సాగించారు. తనకు పదేళ్ల వయస్సు ఉండగా ఒకరోజు శ్రీనివాసరావు గారి కాలికి పుండయ్యింది. దాంతో కొన్ని రోజులు బడి మానేయక తప్పలేదు. అప్పుడు వాళ్ళ నాన్నగారు సి.పుల్లయ్య గారు నాలుగో సినిమాకు దర్శకత్వం చేసే పనిలో ఉన్నారు. 1935లో అందరూ చిన్న పిల్లలతో కలిపి ఒక సినిమా తీస్తున్నారు. ఆ చిత్రం పేరు “సతీఅనసూయ”. అందులో నటించిన బాల నటీమణులు ఈనాటికి కూడా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్లే తర్వాత రోజులలో కథానాయిక, నటి అయిన కృష్ణవేణి గారు, ప్రముఖ నేపథ్య గాయని రావు బాల సరస్వతి గారు.
చిత్తజల్లు శ్రీనివాసరావు గారు కాలికి గాయమైన కొన్నాళ్లకు పాఠశాల ఆపేసి కలకత్తాలోనే ఉన్న వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్లారు. చిత్తజల్లు పుల్లయ్య గారు తీస్తున్న బాలల చిత్రంలో చిత్తజల్లు శ్రీనివాసరావు గారిని ఇంద్రుడు వేషం వేయించారు. పిల్లలు ఉండడానికి సి.పుల్లయ్య గారు పిల్లల కోసం ఒక పెద్ద ఇల్లు తీసుకుని అందరినీ అందులో ఉంచారు. చిత్రీకరణ అయిపోగానే వారికి చదువు చెప్పించేవారు. అలా కాకినాడలో చదువు ఆపేసినా గానీ కలకత్తాలో శ్రీనివాస రావు గారి చదువు ప్రారంభం అయ్యింది. మే 1936లో విడుదలైన “సతీఅనసూయ” చిత్రంతో శ్రీనివాసరావు గారు బాలనటుడి గా తెరంగ్రేటం చేశారు. ఈ సినిమా పూర్తయ్యేసరికి కాలి గాయం మానిపోయింది. దాంతో శ్రీనివాసరావు గారు తిరిగి కాకినాడకు వచ్చి మళ్ళీ పాఠశాలకు వెళ్లడం ప్రారంభించారు.
చిత్తజల్లు శ్రీనివాసరావు గారు పాఠశాలలో చదువతుండగా అప్పుడప్పుడు నాటకాలు జరుగుతుండేవి. అందులో భాగంగానే జరిగిన “సతీసావిత్రి” నాటకంలో సత్యవంతుడి పాత్ర పోషించారు. ఆ పాత్రలో నటిస్తుండగా చిత్తజల్లు శ్రీనివాసరావు గారు అనుకోకుండా వేదిక మీద నుంచి పక్కకు పడిపోయారు. అప్పుడు తాను కట్టుకున్న పంచ ప్రక్కకు జరిగింది. జనం అంతా గోలలు పెట్టారు. ఒక పెద్దాయన వచ్చి పంచ సరిచేసి శభాష్ రా అబ్బాయ్ నీవు నటనలో లీనం అయిపోయావు. ఇలాగే కొనసాగిస్తే నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని మెచ్చుకున్నారు.
కాకినాడలోనే చదువుకున్న చిత్తజల్లు శ్రీనివాసరావు గారు మెరుపు అనే పత్రికను నడిపేవారు. దాని నిర్వహణకు డబ్బులు కావాలి. వాటి కోసం “నవగ్రహ కూటమి” అనే నాటకం వేశారు. అది విజయవంతం అయ్యింది. అలా ఆ పత్రిక నడపడానికి డబ్బులు సమకూరాయి. చిత్తజల్లు శ్రీనివాసరావు గారు కళాశాలలో ఉండగానే దాదాపు పదిహేను నాటకాలు వ్రాశారు. తాను అంతర్ కళాశాల నాటక పోటీలలో బహుమతులు కూడా గెలుచుకున్నారు.
చిత్రరంగ ప్రవేశం…
చిత్తజల్లు శ్రీనివాసరావు గారు బి.ఏ. లో స్పెషల్ ఇంగ్లీష్ చదివి బి.ఏ.లిట్ తెచ్చుకున్నారు. అంత చదువు చదువుకున్నారు కాబట్టి కలకత్తాలో ఒక కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా ఉద్యోగం వచ్చింది. మద్రాసులో సినిమాలలో తీరిక లేకుండా ఉన్న తన నాన్నగారికి ఈ విషయం చెప్పారు శ్రీనివాసరావు గారు. దాంతో నీలాగే చదువుకున్న వారు సినిమాలకు కావాలి. ఉన్నపళంగా వచ్చి సినిమాలలో చేరమని శ్రీనివాసరావు గారికి సలహా ఇచ్చారు తండ్రి పుల్లయ్య గారు. శ్రీనివాసరావు గారి తల్లి రంగమ్మ గారికి శ్రీనివాసరావు గారు సినిమాలలో చేరడం ఇష్టం లేదు. కానీ పుల్లయ్య గారు పట్టువదల్లేదు. సాహిత్యంలోనూ, నాటకాలలోనూ, పత్రిక నిర్వహణలోనూ, జర్నలిజం లోనూ అనుభవం ఉంది. సినిమా రంగంలో ఎలా ఉంటుందో చూద్దాం అనుకోని 22 ఏళ్ల శ్రీనివాసరావు గారు సినిమా రంగంలో ప్రవేశించారు.
జెమిని స్టూడియో లో అప్రెంటీస్ గా…
చిత్తజల్లు పుల్లయ్య గారు ఏడాదికి ఒక సినిమా తీస్తుండేవారు. దాంతో తన వద్ద కాకుండా శ్రీనివాసరావు గారిని జెమిని స్టూడియోలో దర్శకత్వ శాఖలో అప్రెంటిస్ గా చేర్పించారు. అలా చిత్తజల్లు శ్రీనివాసరావు గారు అప్రెంటిస్ గా పనిచేసిన తొలి సినిమా “కల్పన”. దాని దర్శకులు, రూపకర్త ప్రముఖ నాట్య గురువు “ఉదయ శంకర్” గారు. ఆ సినిమాకు సహాయ దర్శకుడిగా అదుర్తి సుబ్బారావు గారు పనిచేశారు. ఆ సినిమా చిత్రీకరణ ఆలస్యమై రెండేళ్ల తర్వాత విడుదలైంది. ఆలోపు మంగళ, అపూర్వ సోదరులు లాంటి అన్ని భాషల చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. ఆ క్రమంలో జెమినీ స్టూడియోస్ అధినేత ఎస్.ఎస్.వాసన్ శ్రీనివాసరావు గారికి బాగా దగ్గరయ్యారు. సి.పుల్లయ్య గారి అబ్బాయికి బాగా పేరు వచ్చేసింది.
పాక్షిక దర్శకుడిగా “పొన్ని” సినిమా…
రాంనాథ్ మరియు ఎ.కె.శేఖర్ వద్ద స్క్రీన్ ప్లే, పాటలు నేర్చుకున్నారు. ఇలా ఐదు, ఆరు సంవత్సరాలు కొనసాగింది. కొన్నాళ్ల తర్వాత కోయంబత్తూర్ లోని పక్షిరాజా స్టుడియోస్ కి వెళ్లారు చిత్తజల్లు శ్రీనివాసరావు గారు. పక్షిరాజా వారు తీస్తున్న “పొన్ని” అనే తమిళ సినిమాకు సహాయ దర్శకుడిగా చిత్తజల్లు శ్రీనివాసరావు గారు పనిచేశారు. కొన్ని అనే సినిమా కొన్ని రోజులు చిత్రీకరణ తరువాత ఏ.ఎస్.ఎస్.స్వామి గారు ఆ సినిమా నుండి తప్పుకున్నారు. అప్పటికే స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, సంభాషణలు అన్ని పూర్తి అయిపోయాయి. అందువలన పక్షిరాజా స్టూడియో అధినేత ఎస్.ఎం.శ్రీరాములు నాయుడు గారు శ్రీనివాసరావు గారిని మిగతా సినిమా పూర్తి చేయమని కోరారు.
ఆ విధంగా చిత్తజల్లు శ్రీనివాసరావు గారు పాక్షికంగా దర్శకత్వం వహించిన చిత్రం తమిళ చిత్రం “పొన్ని”. అది 1953 లో విడుదలైంది. దర్శకత్వం ఏ.ఎం.ఎస్.స్వామి మరియు సి.శ్రీనివాసరావు అని వేశారు. అదే తమిళ చిత్రం, అదే సంవత్సరం తెలుగులో “ఒక తల్లి పిల్లలు” అనే పేరుతో డబ్బింగ్ అయ్యింది. ఇది అనుకున్నంతగా విజయవంతం కాలేదు. ఈ సినిమాలో ట్రావెన్ కోర్ సిస్టర్స్ లలిత, పద్మిని, రాగిణి లతో పాటు అంబికా, సుకుమారి కూడా నటించడం ఒక విశేషం అయితే, వారిపై చిత్రించిన “భామ విజయం” అనే కూచిపూడి నృత్యం కూడా ఒక ప్రత్యేకత. సహాయ దర్శకుడి నుండి దర్శకుడు స్థాయికి తెచ్చిన చిత్రం తమిళ “పొన్ని”.
పూర్తి స్థాయి దర్శకుడిగా….
1953లో చిత్తజల్లు పుల్లయ్య గారు ఈస్ట్ ఇండియా కంపెనీ కోసం “పక్కింటి అమ్మాయి” చిత్రం తీశారు. రేలంగి ప్రధాన పాత్రగా ఉన్న ఈ సినిమాలో చిత్తజల్లు శ్రీనివాసరావు గారు పూర్తి నిడివి ఉన్న గురు పాత్రలో నటించారు. ఆ పాత్రలో ముందుగా నల్లరామ్మూర్తి గారిని అనుకున్నారు. కానీ తను సరైన సమయానికి కలకత్తా చేరుకోకపోవడంతో ఆ పాత్రలో శ్రీనివాసరావు గారిచే నటింపజేశారు. “పొరమచ్చాన్ తిరుంచివందాన్” అనే తమిళ చిత్రంతో శ్రీనివాసరావు గారు పూర్తిస్థాయి దర్శకుడుగా మారారు. ఈ చిత్రం కూడా విజయవంతం కాలేదు. కానీ అప్పటివరకు నర్తకి గా కొనసాగుతున్న కుచలకుమారిని నటిగా పరిచయం చేశారు. ఒక నర్తకి ని హీరోయిన్ గా పరిచయం చేసిన ఘనత చిత్తజల్లు శ్రీనివాసరావు గారిదే
తెలుగులో తొలి సినిమా “శ్రీకృష్ణతులాభారం”…
ఆ తర్వాత శ్రీనివాసరావు గారు తెలుగులో దర్శకత్వం వహించిన మొదటి చిత్రం “శ్రీకృష్ణతులాభారం”. ఈ సినిమా 1955లో విడుదలైంది. ఈ సినిమా కన్నాంబ, కడారు నాగభూషణం ల మాతృసంస్థ “శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ” బ్యానర్ లో నిర్మాణం అయ్యింది. అప్పటికే ఆ నిర్మాణ సంస్థ పది ఏళ్లుగా నిర్మించే చిత్రాలన్నింటికీ కూడా కడారు నాగభూషణం గారే దర్శకులు. నాగభూషణం గారు దర్శకత్వం వహించే ప్రతీ సినిమాలో కన్నాంబ గారు తప్పకుండా ప్రధాన భూమికగా నటిస్తుండేవారు. చిత్తజల్లు శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహించిన “శ్రీకృష్ణతులాభారం” సినిమాలో కన్నాంబ గారు నటించలేదు. ఈ సినిమా డిసెంబరు 1955లో విడుదలైంది. అంతకుముందు సినిమాలలో దర్శకుడు సి.శ్రీనివాస రావు అనే పేరు వేసేవారు. శ్రీకృష్ణతులాభారం చిత్రం నుండి సి.ఎస్.రావు అని వేస్తూ వచ్చారు.
అన్న తమ్ముడు…
ఆ రోజులలో కన్నాంబ తన పెంపుడు కూతురిని చిత్తజల్లు శ్రీనివాసరావు గారికి ఇచ్చి వివాహం జరిపించారు. అనుబంధంతోనే తర్వాత సినిమా “అన్న తమ్ముడు” కూడా శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీకే చేశారు చిత్తజల్లు శ్రీనివాసరావు గారు. అందులో హీరో ఎన్టీఆర్ గారు. ఈ సినిమా మూడేళ్ల తర్వాత 1958లో విడుదలైంది. నిర్మాతగా కడారు నాగభూషణం గారి అబ్బాయి కడారు వెంకటేశ్వరరావు గారి పేరు వేశారు. ఇందులో కూడా కన్నాంబ గారు నటించలేదు. ఈ సినిమా ఓ మాదిరి విజయం సాధించింది. ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్ గారు తరువాత కాలంలో చిత్తజల్లు శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో అత్యధిక చిత్రాలలో నటించారు. ఇందులో జానకి గారితో పాటు ఇంకొక హీరోయిన్ నటించారు. ఆవిడే రాజసులోచన. ఆమె తర్వాత ఐదేళ్లలో చిత్తజల్లు శ్రీనివాసరావు గారి భార్య అయ్యారు. తాను దర్శకుడు అయ్యి ఐదేళ్లయినా ఒక్క విజయం కూడా దక్కలేదు.
మంచి మనసుకు మంచిరోజులు తో తొలి విజయం…
ఎన్టీఆర్ మరియు రాజసులోచన గార్లు నటించిన “మంచి మనసుకు మంచి రోజులు” చిత్రం “తాయిపిరందాల్ వాలిపిరక్కుమ్” తమిళ చిత్రానికి రీమేక్. ఆ తమిళ చిత్రం 1955 జనవరిలో సంక్రాంతికి విడుదలై వసూళ్ల వర్షం కురిపించింది. ఆ సినిమా ద్వారా వచ్చిన లాభాలతో ఏ.కే.వేలన్ (దర్శక, నిర్మాత) తమిళనాడులో స్థలం కొని ఒక స్టూడియో కూడా కట్టుకున్నారు. ఆ స్టూడియో పేరు అరుణాచల స్టూడియో. ఆ తర్వాత కాలంలో ఆ స్టూడియోను చిరంజీవి గారు కొన్నారు. విజయవాడ రామా టాకీస్ యజమాని అశ్వత్ నారాయణ, ఆ తమిళ చిత్రం గురించి, ఆ సినిమా వసూళ్ళ గురించి విని సుందర్ లాల్ నెహతా గారికి చెప్పారు. వీరిద్దరూ కలిసి దర్శకత్వ బాధ్యతులు చిత్తజల్లు శ్రీనివాసరావు గారికి అప్పగించారు. శ్రీనివాసరావు గారు ఆ సినిమాను పెద్దగా మార్పులు చేయకుండా అలాగే తెరకెక్కించారు. 1958 వ సంవత్సరంలో తెలుగు సినిమాలలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా “మంచి మనసుకు మంచి రోజులు” నిలిచింది. అలాగే రాజసులోచన గారు కేవలం నర్తకి గానే కాదు, మంచి నటి అని కూడా నిరూపించుకుంది. “మంచి మనసుకు మంచి రోజులు” అనే సినిమా తరువాత కూడా శ్రీనివాసరావు గారి వరుస సినిమాలలో నటిస్తూ ఉండడం వల్ల 1958 నుంచి శ్రీనివాసరావు, రాజసులోచన గార్ల బంధం బలపడుతూ వచ్చింది.
శాంతినివాసం సినిమా….
1958లో తన అత్తగారు కన్నాంబ గారి బ్యానర్ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీకి “శ్రీకృష్ణ మాయ” అనే సినిమాను రూపొందించారు శ్రీనివాసరావు గారు. తాను అక్కినేని గారితో కలిసి పనిచేసిన మొట్టమొదటి చిత్రం “శ్రీకృష్ణ మాయ”. శ్రీనివాసరావు గారు రాజరాజేశ్వరి ఫిలిమ్స్ కు దర్శకత్వం చేసిన మూడవ మరియు ఆఖరి సినిమా “శ్రీకృష్ణ మాయ”. 1958 నుంచి శ్రీనివాసరావు గారు గారి దర్శకత్వం వేగం పుంజుకుంది. అప్పటి నుంచి సుమారు పదిహేను సంవత్సరాలు వరుసగా సంవత్సరానికి మూడు, నాలుగు సినిమాలు తీస్తూ వచ్చారు. వాటిలో విజయ శాతం ఎక్కువగా ఉంది. 1960 సంక్రాంతికి విడుదలై అనేక కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న చిత్రం “శాంతినివాసం”. ఈ చిత్రానికి నిర్మాతలు కూడా “మంచి మనసుకు మంచి రోజులు” చేసిన సినిమా నిర్మాతలు సుందర్ లాల్ నెహతా మరియు అశ్వత్ నారాయణ గార్లు. ఇందులో అక్కినేని గారు కథనాయకుడు, రాజ సులోచన కథానాయిక. ఈ సినిమా కూడా విజయవంతమైంది. “శాంతినివాసం” సినిమాను ఓకే షెడ్యూల్ లో పూర్తి చేశారు. మైసూరు బృందావన్ గార్డెన్ లో చిత్రీకరించిన ఒకటి, రెండు పాటలు తప్ప ఒకే షెడ్యూల్ లో చిత్రీకరింపబడిన తొలి తెలుగు సినిమా కూడా “శాంతినివాసం”.
లవకుశ సినిమా…
చిత్తజల్లు శ్రీనివాసరావు గారిని మరియు తండ్రి పుల్లయ్య గారిని చరిత్రలో దర్శకులుగా నిలిచిపోయేలా చేసిన చిత్రం 1963 లో వచ్చిన “లవకుశ”. 1955లో చిత్రికరణ ప్రారంభమై వివిధ కారణాల వలన ఐదేళ్లు కొనసాగింది. ఈ సినిమా నిర్మాణం 8000 అడుగులు పూర్తయ్యాక పుల్లయ్య గారి ఆరోగ్యం దెబ్బతిన్నది. నిర్మాతలకు ఎప్పుడు డబ్బులు కుదిరితే అప్పుడు చిత్రికరణ అనేవారు. ఇక లాభం లేదనుకుని దర్శకుడిని మార్చుకోమని పుల్లయ్య గారు సలహా ఇచ్చారు. ప్రత్యామ్నాయంగా బి.యన్ రెడ్డి గారిని సూచించారు. కానీ బి.యన్ రెడ్డి గారు పుల్లయ్య గారి కుమారుడు చిత్తజల్లు శ్రీనివాసరావు గారే సమర్థవంతంగా నిర్వహించగలరని చెప్పడంతో ఆ మిగిలిన 12,000 అడుగుల సినిమా బాధ్యతను చిత్తజల్లు శ్రీనివాసరావు గారు తీసుకున్నారు. “లవకుశ” చిత్రాన్ని పుల్లయ్య గారి టేకింగ్ కి ఏమాత్రం తీసిపోకుండా తీశారు. 1963 మార్చి లో విడుదలైన “లవకుశ” రికార్డుల గురించి చెప్పనవసరం లేదు.
కంచుకోట సినిమా…
పదేళ్ళ వైవాహిక జీవితం తరువాత 1963 లో కన్నాంబ గారి కూతురికి విడాకులు ఇచ్చిన చిత్తజల్లు శ్రీనివాసరావు గారు అప్పటికే తన దర్శకత్వంలో అనేక సినిమాలలో కథానాయికగా నటించిన రాజసులోచన గారిని ద్వితీయ వివాహం చేసుకున్నారు. 1964 – 66 సంవత్సరాలలో శ్రీనివాసరావు గారి సినిమాలు ఒక్కటి కూడా విడుదల కాలేదు. కానీ 1967లో తన దర్శకత్వంలో వచ్చిన చెప్పుకోదగ్గ చిత్రం “కంచుకోట”. భారీ తారాగణం, ఇద్దరు కథానాయకులు, ఇద్దరు కథానాయికలు, భారీ నిర్మాణం, అద్భుతమైనటువంటి పాటలు. ఎన్టీఆర్ గారి సినీ ప్రస్థానంలో “కంచుకోట” ఒక మైలురాయి. 1968 లో విడుదలైన శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు “బంగారు గాజులు”, “గువ్వల గోపన్న”. ఈ రెండింటిలో అక్కినేని నాగేశ్వరావు గారే హీరో. సంగీత పరంగా ఈ రెండు సినిమాలలోని పాటలు తరచూ వినిపిస్తూ ఉంటాయి. “బంగారు గాజులు” తృతీయ ఉత్తమ చిత్రంగా బంగారు నంది అందుకుంది.
దేశోద్ధారకుడు సినిమా…
1968 వ సంవత్సరం ఎన్టీఆర్ తో రెండు సినిమాలు చిత్రీకరించారు. అవి “నిలువు దోపిడీ”, “నిండు సంసారం”. 1969 లో విడుదలైన “ఏకవీర” కళాఖండంగా పేరు తెచ్చుకుంది. కానీ ప్రేక్షకులను నిరాశపరిచిన ఈ చిత్రం పరాజయం పాలైంది. 1973 మార్చిలో విడుదలైన “దేశోద్ధారకుడు” మరొక విజయం సాధించింది. ఎన్టీఆర్ గారు నటించిన తొలి రంగుల సాంఘిక చిత్రం “దేశోద్ధారకులు”. “కంచుకోట” సినిమా స్థాయిలో భారీ నిర్మాణం. శ్రీనివాసరావు గారి దర్శకత్వ ప్రతిభతో “దేశోద్ధారకులు” చిత్రాన్ని ఓ రేంజ్ కి తీసుకెళ్లింది. ఆ రోజులలో మొట్టమొదటి వారం 12 లక్షలు, నెల రోజులకు 30 లక్షల రూపాయలు సాధించడంతోపాటు 12 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకున్నది ఈ చిత్రం. ఈ సినిమాలోని పాటలు ఆ రోజులలో ప్రజారంజకంగా మారుమ్రోగాయి.
వ్యక్తిగత జీవితం…
చిత్తజల్లు శ్రీనివాసరావు గారి వ్యక్తిగత జీవితాన్ని విహంగ వీక్షణంలో చూస్తే ఆ రోజుల్లో దర్శకులు చదువుకున్న తమ సంతానాన్ని సినిమా రంగానికి పరిచయం చేసేవారు కారు. కానీ సి.పుల్లయ్య గారు కుమారుడు చిత్తజల్లు శ్రీనివాసరావు గారు చదువుకొని ఉద్యోగం కూడా చేస్తున్నారు. చదువుకొని ఉద్యోగం చేస్తున్న తన కుమారుడి ఉద్యోగాన్ని మాన్పించిన సి.పుల్లయ్య గారు తనని సినిమా రంగానికి ఆహ్వానించారు. తన వద్ద కంటే కూడా బయటి వాళ్ల దగ్గర బాగా నేర్చుకుంటారని వేరే వాళ్ళ దగ్గర సహాయకుడిగా పెట్టడం ఒక ప్రత్యేకత. పదేళ్ల నిరీక్షణ తర్వాత తన 29 సంవత్సరాల వయస్సులో దర్శకుడిగా మారారు చిత్తజల్లు శ్రీనివాసరావు గారు. ఆ రోజులలో కన్నాంబ, నాగభూషణం గార్లు తన పెంపుడు కూతురిని చిత్తజల్లు శ్రీనివాసరావు గారికి ఇచ్చి వివాహం జరిపించారు.
రాజసులోచన గారు కేవలం నర్తకి మాత్రమే కాదు, మంచి నటి కూడా. చిత్తజల్లు శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో “మంచి మనసుకు మంచి రోజులు” అనే సినిమా లో తొలిసారి నటించారు. తరువాత కూడా శ్రీనివాసరావు గారి వరుస సినిమాలలో నటిస్తూ ఉండడం వల్ల 1958 నుంచి శ్రీనివాసరావు, రాజసులోచన గార్ల బంధం బలపడుతూ వచ్చింది. పెళ్లి సంతానం ఉన్నా కూడా 1963 లో తన భార్యకు విడాకులిచ్చిన శ్రీనివాసరావు గారు అప్పటికే పెళ్లి అయ్యి ఒక కుమార్తెకు తల్లి అయ్యి విడాకులు తీసుకున్న రాజసులోచన గారిని ద్వితీయ వివాహం చేసుకున్నారు. చిత్తజల్లు శ్రీనివాసరావు, రాజ సులోచన గార్లకు ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. పెరిగి పెద్దయ్యాక వీరులో ఒకరు అమెరికాలో స్థిరపడితే, మరొకరు చెన్నైలోనే నివసిస్తున్నారు.
భూలోక చాపచుట్టి…
1975లో విడుదలైన “యశోద కృష్ణ” శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో గుర్తుంచుకోదగ్గ చిత్రం. సంగీత పరంగా పాటలన్నీ ప్రజారంజకాలే. ఎస్వీ రంగారావు గారు నటించిన చిట్టచివరి చిత్రం కూడా “యశోదకృష్ణ” కావడం విశేషం. ఆ తరువాత సంవత్సరం 1976లో విడుదలైన “మహాకవి క్షేత్రయ్య” కు ఒక ప్రత్యేకత ఉంది. ఆ సినిమా నిర్మాణం సగంలో ఉండగా ఆదుర్తి సుబ్బారావు గారు మరణించారు. ఆ సినిమా దర్శకత్వ బాధ్యతలు సి శ్రీనివాసరావు గారే తీసుకున్నారు. 1980 తర్వాత కొత్త దర్శకుల హవా మొదలవ్వడంతో శ్రీనివాసరావు గారు వేగం తగ్గించుకున్నారు.
1980 తర్వాత వచ్చిన చిత్రాలలో చిత్తజల్లు శ్రీనివాసరావు గారికి విజయాలు పెద్దగా లేవు. 1989లో విడుదలైన చిత్తజల్లు శ్రీనివాసరావు గారికి “బాలనాగమ్మ” తన చివరి చిత్రం. ఆ రోజుల్లోనే “ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య”, “కోకిల”, “పల్నాటి సింహం” లాంటి సినిమాలలో అతిథి పాత్రలో వెండితెర మీద కనిపించారు. 1990 తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. కానీ పద్మాలయ స్టూడియోస్ వాళ్ళకి దూరదర్శన్ హిందీ సీరియల్ కి దర్శకత్వం వహించారు. చివరి రోజులలో చిత్తజల్లు శ్రీనివాసరావు గారు ఒక ఇంట్లో ఒంటరిగా ఉండేవారు. తన కాలికి బోధకాలు తీవ్రం అవ్వడంతో ఊతకర్రలతో నడిచేవారు. తాను మరణించే నాటికి వృద్ధాశ్రమంలో ఉన్న చిత్తజల్లు శ్రీనివాసరావు గారు 8 డిసెంబర్ 2004 నాడు భూలోక చాప చుట్టి పరలోకానికి పయనమయ్యారు.