పౌరాణిక సినిమాల్లో మొదట తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే కథానాయకుడు ఎవరైనా ఉన్నారంటే.. అది విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ మాత్రమే. పౌరాణిక పాత్రలు, సాంఘిక పాత్రలు వేయడంలో తనకు ఎవ్వరు సాటి లేరని ఆయన నిరూపించుకున్నారు. ఎన్టీఆర్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాంటి సినిమాల్లో ఎన్టీఆర్ దర్శకత్వం వహించి, నిర్మించి, నటించిన ‘దాన వీర శూర కర్ణ’ సినిమా విషయాలను ఈ మ్యాగజీన్లో తెలుసుకుందాం. ఎన్టీఆర్ ఒక పౌరాణిక చిత్రం చేయాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా మహాభారత గ్రంథంలో కర్ణుడి పాత్రకు ప్రాధాన్యతను ఇస్తూ ఎన్టీఆర్ స్క్రిప్ట్‌ను స్వయంగా రూపొందించారు.
ఎన్టీఆర్ ఈ సినిమాను నిర్మించడమే కాకుండా రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించి.. స్వయంగా కర్ణుడిగా, దుర్యోధనుడిగా, శ్రీ కృష్ణుడిగా మూడు పాత్రల్లో నటించారు. కీలకమైన పాత్రలకు నటులు లేకపోవడంతో తన కుమారులైన బాలయ్య, హరికృష్ణలను ఈ సినిమాలో తీసుకున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను కేవలం రూ.24 లక్షల ఖర్చుతో 43 రోజులలో పూర్తి చేశారు. ఎడిటింగ్ తర్వాత ఈ సినిమా మూడున్నర గంటల నిడివికి వచ్చింది. ఈ సినిమాను 1977 జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు. అప్పట్లోనే ఈ సినిమా 9 సెంటర్లలో 100 రోజులు ఆడి.. 3 కోట్ల రూపాయల పైచిలుకు నెట్ కలెక్షన్లను వసూలు చేసి రికార్డులను సొంతం చేసుకుంది.
ఈ సినిమాలో డైలాగులు ఎంతో పాపులర్ అయ్యి ఇప్పటికీ జనం నోర్లలో నానుతూనే ఉంటాయి. ముఖ్యంగా ‘‘ఏమంటివేమంటివి’’ అనే డైలాగ్‌ను ఒక్కసారైనా అనని తెలుగు వాడు ఉండడు అంటే అది అతిశయోక్తి కాదు. అంతే కాకుండా, ఈ సినిమాలో కొన్ని చోట్ల ఎన్టీఆర్ నటించిన మూడు పాత్రలు కృష్ణుడు, దుర్యోధన, కర్ణ పాత్రలు నాలుగు సన్నివేశాల్లో ఒకేసారి కనిపిస్తాయి. ఒకే షాట్‌లోనూ మూడు పాత్రలను కూడా చూపించారు. ఆరోజుల్లోనే అంత టెక్నాలజీతో అటువంటి సినిమాను తీశారు ఎన్టీఆర్. అందుకే, ఈ సినిమా ఎన్టీఆర్ “వన్ మ్యాన్ షో” చిత్రంగా హిస్టరీలో నిలిచిపోయింది.