
టాకీలు మొదలైన 1932 వ సంవత్సరం తొలినాళ్ళలో రెండు మూడేళ్ల పాటు తెలుగు, తమిళ చిత్రాలు ఎక్కువగా కలకత్తా, కొల్హాపూర్, బొంబాయి లలో నిర్మాణాలు ఎక్కువగా జరుగుతూ వుండేవి. బందరు నుండి వచ్చిన పినపాల వెంకటదాసు “వేల్ పిక్చర్స్” స్థాపించి 1934 ప్రాంతాల్లో సినిమా మొత్తం మద్రాసులోనే చిత్రీకరించవచ్చు అని నిరూపించారు. ఆ తరువాత మద్రాసులో స్టూడియోలు స్థాపించే వారి సంఖ్య పెరిగింది. తరువాత రోజులలో తెలుగు సినిమా నిర్మాణం మద్రాసులోనే జరిగినప్పటికీ, తొలి దశాబ్దాలలో కొల్హాపూర్, సేలం, కోయంబత్తూర్ నగరాలలో సినిమాలు ఎక్కువగా నిర్మాణం అవుతూ ఉండేవి. ఆంధ్రదేశంలో రాజమండ్రి, విశాఖపట్నం లాంటి నగరాలలో చిత్ర నిర్మాణం జరిగింది. కానీ ఎక్కువ సంవత్సరాలు కొనసాగలేదు. కొల్హాపూర్ లో 1940 దశాబ్దం మొదటి సంవత్సరాల వరకు కొనసాగింది. మద్రాసులోని సినీ నిర్మాణ వేగాన్ని తట్టుకొని సేలంలో సుమారుగా 30 సంవత్సరాలు సినిమా నిర్మాణం కొనసాగింది. ఒకరకంగా సేలంలో దశాబ్దాల పాటు చిత్ర నిర్మాణం కొనసాగడానికి భారతదేశంలోని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ “మోడరన్ థియేటర్స్” అధినేత టి.ఆర్.సుందరం కారణమైతే, కోయంబత్తూరులో దశాబ్దాల పాటు చిత్ర నిర్మాణం కొనసాగడానికి కారణం ఎస్.ఎం.శ్రీరాములు నాయుడు.
తమిళ చలనచిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు యస్.యం. శ్రీరాములు నాయుడు. పాతిక సంవత్సరాలలో ముప్పై సినిమాలు. వాటిల్లో 15 సినిమాలను శ్రీరాములు నాయుడు నిర్మిస్తే, మరో 15 సినిమాలకు దర్శక, నిర్మాతగా వ్యవహారించారు. మొత్తంగా చెప్పాలంటే 30 సినిమాలు ఆయన ఆధ్వర్యంలో నిర్మాణం అయ్యాయి. ఎన్టీఆర్ జగదేకవీరునీ కధ (1961) సినిమాకు మూలమైన తమిళ చిత్రం “జగతల ప్రతాపన్” కు శ్రీరాములు నాయుడు దర్శకులు. ఓకే సినిమా “మలైక్కల్లన్” (1954) ను ఆరు భాషలలో తెరకెక్కించి ఆరు చిత్రాలను ఘనవిజయం చేసిన ఘనత శ్రీరాములు నాయుడుదే. ఆ చిత్రాలు వరుసగా తమిళంలో “మలైక్కల్లన్” (1954), తెలుగులో అగ్గి రాముడు (1954), హిందీలో ఆజాద్ (1955), మలయాళంలో తస్కరవీరన్ (1957), బెట్టడ కల్లా (1957), సింహాళ భాషలో సూరసేన (1957). ఇలా ఒకే కథను ఆరు భాషలలో నిర్మించి, అన్ని చోట్ల అద్భుతమైన విజయాలు సాధించిన రికార్డు శ్రీరాములు నాయుడు సొంతం. నటీనటులు ఎంత పెద్ద వారైనా సరే, వారు శ్రీరాములు నాయుడు షరతులకు లోబడి పనిచేస్తూ ఉండేవారు. రెండు సినిమాల విజయం తరువాత మరొక సినిమా విజయం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన ఎంజీఆర్ కి మొట్టమొదటి వాణిజ్యపరమైన విజయం అందించింది శ్రీరాములు నాయుడే.
భాగస్వాములతో కలిసి సెంట్రల్ స్టూడియో, పక్షిరాజా స్టూడియో లను నిర్మించి కోయంబత్తూరు మూవీ మొగల్ అనిపించుకున్న వ్యక్తి యస్.యం.శ్రీరాములు నాయుడు. 1930 – 1940 లలో సినిమాలు ఎక్కువగా స్టూడియో యాజమాన్యాలే నిర్మిస్తూ వచ్చారు. కడారు నాగభూషణం, కన్నాంబ లాంటి కొద్దిమంది నిర్మాతలు తప్ప. దక్షిణ భారతదేశంలోనే కాదు, భారతదేశంలో కూడా మూడు సినిమా స్టూడియో నిర్మాణాలకు ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి యస్.యం. శ్రీరాములు నాయుడు. కోయంబత్తూరులో 1937లో ప్రారంభమైన సెంట్రల్ స్టూడియో, కోయంబత్తూరు లో 1945లో ప్రారంభమైన పక్షిరాజా స్టూడియో, అలాగే బెంగళూరులో 1968లో మొదలుపెట్టిన చాముండేశ్వరి స్టూడియో. ఈ మూడు స్టూడియోల నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన వారు యస్.యం. శ్రీరాములు నాయుడు. లక్ష్మీకాంతన్ హత్య కేసులో నిందితులలో ఒకరిగా యస్.యం. శ్రీరాములు నాయుడు చేర్చగా నవంబర్ 1944 నుండి ఏప్రిల్ 1945 వరకు జైలు శిక్ష అనుభవించారు. ఆ తరువాత సరైన ఆధారాలు లేకపోవడంతో ఆయన విడుదలయ్యారు.
జీవిత విశేషాలు…
- జన్మనామం : సుబ్బరాయలు మునుస్వామి శ్రీరాములు నాయుడు
- ఇతర పేర్లు : యస్. యం. శ్రీరాములు నాయుడు
- జననం : 1910
- స్వస్థలం : తిరుచునాపల్లి, తమిళనాడు, భారతదేశం
- వృత్తి : వ్యాపార వేత్త , స్టూడియో అధినేత, దర్శకుడు, నిర్మాత
- తండ్రి : మునుస్వామి నాయుడు
- మరణ కారణం : అనారోగ్యం
- మరణం : 1976, కోయంబత్తూరు…
నేపథ్యం…
ఎస్.ఎం.శ్రీరాములు నాయుడు పూర్తి పేరు సుబ్బరాయలు మునుస్వామి శ్రీరాములు నాయుడు 1910 వ సంవత్సరంలో జన్మించారు. తమ పేర్లకు ముందు తాతల, తండ్రుల పేర్లు ఉంచడం అప్పటి ఆచారం. ఆయన తండ్రి పేరు మునుస్వామి, తాత పేరు సుబ్బరాయలు. తండ్రి మునుస్వామి నాయుడు ఆ రోజులలో దక్షిణ భారతీయ రైల్వేలో స్టేషను మాస్టరుగా పనిచేస్తూ ఉండేవారు. స్వాతంత్య్రం రాకముందు దక్షిణ భారతీయ రైల్వే అనేది ఒక ప్రైవేటు కంపెనీ. దానికి లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో షేర్లు కూడా వర్తకం అవుతూ ఉండేవి. 1900 సంవత్సరం ఆరంభంలో దక్షిణ భారతీయ రైల్వే కేంద్ర స్థానం తమిళనాడులోని తిరుచునాపల్లి. అక్కడ స్టేషన్ మాస్టరుగా పనిచేస్తున్న మునుస్వామి నాయుడుకి ఇద్దరు ఆడపిల్లల తరువాత మగ సంతానంగా శ్రీరాములు నాయుడు జన్మించారు.
పదవీ విరమణ అనంతరం మునుస్వామి నాయుడు తన కుటుంబాన్ని తిరుచునాపల్లి నుండి కోయంబత్తూరుకు మార్చారు. పదవీ విరమణ చేసి కోయంబత్తూరుకు మకాం మార్చిన తరువాత ఖాళీగా కూర్చోకుండా మునుస్వామి నాయుడు 1932లో ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టారు. డేవి అండ్ కంపెనీ అనే ఒక పేరు మోసిన ఆంగ్ల వ్యాపార సంస్థకు ఒక పెద్ద హోటల్ ఉండేది. ఆ హోటల్ ఆవరణములోనే మునుస్వామి నాయుడు పెద్ద బేకరీ స్థాపించారు. ఆ రోజులలో బన్, రొట్టెలు (బ్రెడ్) ఎక్కువగా జ్వరం వచ్చిన వారికి ఆహారం ఇస్తూ ఉండేవారు. అందువలన బేకరీ వ్యాపారం పెద్దగా లాభసాటిగా ఉండేది కాదు. మునుస్వామి నాయుడు దానిని లాభాల బాట పట్టించారు.
ఇంటర్మీడియట్ తోనే చదువుకు స్వస్తి…
చదువుకునే రోజులలో శ్రీరాములు నాయుడు ప్రతీరోజు బేకరీకి వెళ్లి, దాని నిర్వాహణ అంతా గమనిస్తూ ఉండేవారు. ఉద్యోగం చేయడం ఇష్టం లేని తాను ఇంటర్మీడియట్ చదువు పూర్తయ్యాక తండ్రి నిర్వహిస్తున్న వ్యాపారంలో చేరారు. కేవలం బేకరీ నిర్వహణ మాత్రమే కాకుండా అందులో అన్ని పనులు నేర్చుకొని బేకింగ్ కూడా చేసేవారు. శ్రీరాములు నాయుడు తయారుచేసే బ్రెడ్స్ ప్రత్యేక రుచులు ఉంటాయని పేరు వచ్చేసింది. దాంతో వినియోగదారులు శ్రీరాములు నాయుడు తయారు చేసిన బ్రెడ్లు మాత్రమే కావాలని అడిగి మరీ కొనుక్కొని వెళ్తూండేవారు. ఆయన బేకరీలో చేరిన తరువాత ఆ బేకరీని విస్తరించవలసి వచ్చింది. క్రమశిక్షణతో పని చేసే శ్రీరాములు నాయుడికి వ్యాపారంలో ఏ పని చేయడానికైనా చిన్నతనంగా ఉండేది కాదు. తాను ఎలాగా పనిచేసేవారో షాపులో పనిచేసేవాళ్లను కూడా అలాగే క్రమశిక్షణలో పెట్టేవారు.
సోమరితనంగా ఉండడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. తన ఇంటికి వచ్చిన బంధువుల పిల్లల్ని కూడా బేకరీకి తీసుకొచ్చి వాళ్లతో పనులు చేయిస్తూ ఉండేవారు. లాభాల కోసమే వ్యాపారం, అంతేకానీ విలాసాల కోసమో, లేక కాలక్షేపం కోసమో వ్యాపారం చేయకూడదు అనేవారు. ఇలాంటి కష్టపడే వ్యవహార శైలి ఉండడం వలన శ్రీరాములు నాయుడు విజయవంతమైన దర్శక, నిర్మాత అయ్యారు. ఆయన చిన్నతనం నుండే సమాజంలో పెద్దపెద్ద వాళ్లతో పరిచయాలు పెంచుకునేవారు. కోయంబత్తూరులోని కాస్మోపాలిటన్ క్లబ్ సభ్యులలో అతి పిన్నవయస్కుడు శ్రీరాములు నాయుడే కావడం విశేషం. పెద్దపెద్ద వాళ్ళతో వ్యాపార విస్తరణ కోసం ఆలోచిస్తూ ఉండే ఆయనను అప్పుడప్పుడే మొదలవుతున్న టాకీ సినిమాలు ఆకర్షించాయి.
సిని రంగ ప్రవేశం…
ఆంధ్రదేశానికి తెలుగు సినిమాలను పరిచయం చేసిన వ్యక్తి “రఘుపతి వెంకయ్య నాయుడు” అయితే, కోయంబత్తూరుకు “సామికన్ను విన్సెంట్” సినిమాలను పరిచయం చేశారు. దక్షిణ భారతదేశంలో చలనచిత్ర వ్యాపారంలో ఆయన ఒక మార్గదర్శకుడు. ఆధునిక సినిమా థియేటర్లకు పూర్వగామిగా ఉన్న బహిరంగ ప్రదేశాలలో తాత్కాలిక టెంట్‌లో సినిమాలు ప్రదర్శించబడేవి. 1905 లోనే ఆయన టెంట్ సినిమాలను స్థాపించారు. సామికన్ను విన్సెంట్ రైల్వేలో క్లర్క్ గా పని చేస్తూ ఉండేవారు. ఫ్రాన్స్ నుండి సినిమాలను తీసుకువచ్చి ప్రదర్శించేవారితో విన్సెంట్ కు పరిచయం ఏర్పడింది. అలాంటి ఒక ఫ్రెంచ్ దేశస్థుడు తన సినిమా సామాగ్రిని అమ్మేస్తుంటే దానిని కొని కోయంబత్తూరులో టూరింగ్ టాకీసు మొదలుపెట్టారు విన్సెంట్. 1914లో ఆయన కోయంబత్తూరులో సెమీ పర్మినెంట్ థియేటర్ ను స్థాపించారు.
సెమీ పర్మినెంట్ థియేటర్ అనేది దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి శాశ్వత సినిమా సినిమా ప్రదర్శన శాలలలో (థియేటర్) ఒకటి. అలా సినిమా రంగంతో ఉన్న పరిచయంతో టాకీలు ప్రారంభం కాగానే అందులో ప్రవేశించారు సామి కన్ను విన్సెంట్. 1933లో ఆయన కలకత్తా వెళ్లి పయనీర్ ఫిల్మ్ కంపెనీతో కలిసి హిందూ దేవుడు మురుగన్ కథ ఆధారంగా “వల్లి తిరుమనం” చిత్రాన్ని నిర్మించి వాణిజ్యపరంగా విజయవంతమయ్యారు. ఆ సినిమా తెచ్చిన లాభాల వల్ల ఆకర్షితులైన కోయంబత్తూరు వ్యాపారి “ఆర్.కె రామకృష్ణన్ చెట్టియార్” అనే వ్యాపారి సామి కన్ను విన్సెంట్ తో కలిసి సినిమా నిర్మాణంలోకి దిగారు. అప్పటికే విన్సెంట్ కి సినిమా రంగంలో అనుభవం ఉంది. కాబట్టి కలకత్తా వెళ్లి సినిమాల నిర్మించే బదులు మనమే కోయంబత్తూరులో సినిమాలు తీస్తే బాగుంటుందని అనుకున్నారు. వారికి కాస్మోపోలిటన్ క్లబ్ లో పరిచయమైన శ్రీరాములు నాయుడు కూడా భాగస్వామిగా చేరారు.
“సెంట్రల్ స్టూడియో” నిర్మాణం…
ముగ్గురు భాగస్వామ్యంతో (సామి కన్ను విన్సెంట్, ఆర్.కె. రామకృష్ణన్ చెట్టియార్, శ్రీరాములు నాయుడు) 1937 లో కోయంబత్తూరులో “సెంట్రల్ స్టూడియో” నిర్మాణం ప్రారంభమయ్యింది. సరిగ్గా దానికి ముందే సేలంలో మోడ్రన్ థియేటర్ ప్రారంభమైంది. సెంట్రల్ స్టూడియో నిర్మాణంలో పాత్ర పోషించిన శ్రీరాములు నాయుడు తండ్రి కూడా వేరువేరు వ్యాపార రంగాలలో ఉంటూ బాగానే డబ్బు సంపాదించారు. ఒకవైపు సెంట్రల్ స్టూడియో బాధ్యతలు చూసుకుంటూనే శ్రీరాములు నాయుడు, మరో వైపు తండ్రి వ్యాపారాలు కూడా చూసుకుంటూ ఉండేవారు. సెంట్రల్ స్టూడియో భాగస్వామ్యంలో ఒక ద్విభాషా చిత్రాన్ని నిర్మించారు. తమిళ, తెలుగు భాషలలో రెండింటిలోనూ ఒకటే పేరు “తుకారం” (1938).
బి. నారాయణ రావు దర్శకత్వం వహించిన తమిళ చిత్రంలో ప్రముఖ కర్ణాటక విద్వాంసుడు “ముసిరి సుబ్రమణ్య అయ్యర్” ప్రముఖ పాత్ర పోషించగా, ఎం.ఎల్.టాండన్ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రానికి చిలకలపూడి సీతారామ ఆంజనేయులు ప్రముఖ పాత్ర పోషించారు. సెంట్రల్ స్టూడియో చేసిన తొలి ప్రయోగం సఫలం కాలేదు. కానీ ఏ నష్టాలు లేకుండా బయటపడ్డారు. తుకారాం (1938) సినిమాలకు శ్రీరాములు నాయుడు పరిశీలకులు మరియు పర్యవేక్షకులు మాత్రమే. ఆయన ఒకవైపు తమ సొంత బేకరీలో పని చేసుకుంటూనే చిత్ర నిర్మాణంలోని అన్ని భాగాలను పరిశీలిస్తూ ఉండేవారు. ఆ తరువాత సెంట్రల్ స్టూడియో భాగస్వామ్యంలో నాలుగైదు సినిమాలు నిర్మాణం అయితే, ఆ స్టూడియోలోనే బయటి నిర్మాతల సినిమాలు అరడజను నిర్మాణం అయినాయి. స్టూడియోలో నిర్మాణం అయిన సినిమాలన్నీటికి భాగస్వామి హోదాలో శ్రీరాములు నాయుడు పరిశీలకుడిగా ఉన్నారు.
పక్షిరాజా ఫిలిమ్స్…
సెంట్రల్ స్టూడియో భాగస్వాముల్లో ఒకరైన ఆర్.కె. రామకృష్ణన్ చెట్టియార్ 1940లో సెంట్రల్ స్టూడియో నుండి తప్పుకోవడంతో ఆ స్థానంలో కోయంబత్తూరుకు చెందిన “బి.రంగస్వామి నాయుడు” అనే పారిశ్రామిక వేత్త భాగస్వామిగా చేరారు. ఆయన భాగస్వామిగా చేరిన దగ్గర నుంచి సెంట్రల్ స్టూడియో నడిపే బాధ్యతలు శ్రీరాములు నాయుడుకి అప్పగించి ఆయన జనరల్ మేనేజరును చేశారు. ఆయన ఉహించినట్టుగానే శ్రీరాములు నాయుడు లోని కచ్చితత్వం, వ్యాపార మెలకువలు అనేకమంది ఇతర రంగాలను చెందిన వ్యాపారవేత్తలను ఆయనకు దగ్గర చేశాయి. మద్రాసులో ఉండే కే.ఎస్ నారాయణ అయ్యంగార్ అనే ఆయనకి నారాయణ అండ్ కో కంపెనీ ఉండేది. ఆ కంపెనీకి సంబంధించిన వ్యవహారాలన్నీ కోయంబత్తూరులోని శ్రీరాములు నాయుడు చక్కబెడుతూ ఉండేవారు.
సెంట్రల్ స్టూడియోకి శ్రీరాములు నాయుడు 1940లో జనరల్ మేనేజరు అయ్యారని తెలిసిన నారాయణ అయ్యంగార్, శ్రీరాములు నాయుడుకి ఒక ప్రతిపాదన చేశారు. అదేమిటంటే ఇద్దరు కలిసి ఒక సినిమా బ్యానరు స్థాపించి, ఆ బ్యానరు మీదనే సినిమాలు నిర్మించడం. శ్రీరాములు నాయుడు అందుకు ఒప్పుకుని నారాయణ అయ్యంగార్ భాగస్వామ్యంలో పక్షిరాజా ఫిలిమ్స్ అనే సినిమా నిర్మాణ సంస్థ బ్యానరు మొదలైంది. ఆ బ్యానరులో వచ్చిన మొట్టమొదటి చిత్రం ఆర్యమాల (1941). “ఉత్తమ పుతిరన్” (1940) అనే సినిమాతో తారాపథం చేరుకున్న “పుదుకోట్టై ఉలగనాథన్ చిన్నస్వామి పిళ్లై (పియు చిన్నప్ప) ఆర్యమాల (1941) సినిమాలో కథానాయకులు. ఆ సినిమాకు దర్శకుడు బొమ్మన్ ఇరానీ.
నిజానికి ఈ సినిమా కర్త, కర్మ, క్రియ అన్నీ శ్రీరాములు నాయుడు. దర్శకుడు బొమ్మన్ ఇరానీతో కలిసి దర్శకత్వం కూడా తానే చేశారు. టైటిల్స్ లో దర్శకుడిగా బొమ్మని ఇరాన్ పేరు ఉంటుంది. పక్షిరాజు ఫిలిమ్స్ బ్యానరులో మొదలైన మొట్టమొదటి చిత్రం ఆర్యమల. ఈ చిత్రం ద్వారా అనేకమంది నటీనటులను శ్రీరాములు నాయుడు వెలుగులోకి తెచ్చారు. అప్పటివరకు చిన్న చిన్న పాత్రలకే పరిమితమైన యం.యస్ సరోజినీ ఈ సినిమాలో కథానాయికగా చేశారు. లేబరేటరీలో పనిచేయడానికి కృష్ణన్- పంచపకేశన్ అనే ఇద్దరు కుర్రాళ్లకు అవకాశం ఇచ్చారు. ఆ తరువాత రోజులలో వారు విజయవంతమైన దర్శక జంట “కృష్ణన్ – పంజు” అయ్యారు. “ఆర్యమల” చిత్రం మంచి లాభాలు తెచ్చిపెట్టడంతో నారాయణ అయ్యాంగారుకి, శ్రీరాములు నాయుడుపై నమ్మకం మరింత పెరిగింది.
విజయవంతం అయిన “శివకవి”, “జగతలప్రతాపన్”..
పక్షిరాజు ఫిలిమ్స్ బ్యానరులో నిర్మించే రెండో సినిమాకి సెంట్రల్ స్టూడియో కూడా భాగస్వామ్యం కలిసింది. వారి సంయుక్త నిర్మాణంలో తయారైన చిత్రం “శివకవి” 1943 లో విడుదలైంది. పికె రాజా సాండో దర్శకుడిగా ఉన్న ఈ సినిమాలో అప్పటికే తమిళ సూపర్ స్టార్ అయిన ఎం.కె. త్యాగరాజ భాగవతార్ కథానాయకులు. దర్శకుడుగా ఎప్పటికీ 20 ఏళ్ల అనుభవం ఉన్న రాజా సాండో “శివకవి” సినిమా ప్రారంభమైన కొద్దిరోజులకే దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకున్నారు. అప్పటికే ఎంతో అనుభవం ఉన్న రాజా సాండోకి ప్రతీ విషయంలోనూ శ్రీరాములు నాయుడు కల్పించుకోవడం నచ్చలేదు. దాంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. సినిమా నిర్మాణం సగం పూర్తయ్యేసరికి వారి మధ్య విభేదాలు తారస్థాయికి చేరి రాజా సాండో బయటకు వెళ్లిపోవలసి వచ్చింది. దాంతో “శివకవి” సినిమా దర్శకత్వ బాధ్యతలు శ్రీరాములు నాయుడు తీసుకున్నారు. 10 ఏప్రిల్ 1943 నాటి విడుదలైన శివకవి వాణిజ్యపరంగా అద్భుతమైన విజయం సాధించింది. ఆ సినిమా కేవలం తమిళ ప్రాంతంలోనే కాకుండా మద్రాసు ప్రెసిడెన్సీలోని తమిళేతర ప్రాంతాలలో కూడా అనూహ్యమైన విజయం సాధించింది.
ఈ సినిమాను ప్రేక్షకులు నెలల తరబడి విరగబడి చూశారు. అప్పటికే సూపర్ స్టార్ అయిన త్యాగరాజు భాగవతార్ ఈ సినిమాతో మరొక మెట్టు పైకెక్కారు. శ్రీరాములు నాయుడు తెరవెనుక దర్శకుడిగా “ఆర్యమల” చిత్రం, చిత్రానికి ఆపద్ధర్మ దర్శకుడిగా “శివకవి” చిత్రాలకు పనిచేస్తే, తనను పూర్తిస్థాయి దర్శకుడిగా చేసిన చిత్రం “జగతలప్రతాపన్” (1944). ఆర్యమల సినిమాలో నాయికా, నాయకులుగా నటించిన ఎం.ఎస్ సరోజిని, పియు చిన్నప్పలు “జగతలప్రతాపన్” లో కూడా ప్రధాన పాత్రధారులుగానే నటించారు. వారితో పాటు ఎస్. వరలక్ష్మి కూడా ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా ఎన్టీఆర్ కథానాయకుడిగా తెలుగులో వచ్చిన “జగదేకవీరుని కథ” కు మూలం. “జగదేకవీరుని కథ” సినిమాలో శివశంకరి అనే పాటలోని ఎన్టీఆర్ బహుళ పాత్రల దృశ్యాలను 1944 లో “జగతలప్రతాపన్” లో చిత్రీకరించి ఔరా అనిపించుకున్నారు శ్రీరాములు నాయుడు. ఈ చిత్రం కూడా వాణిజ్యపరంగా ఘనవిజయం సాధించి పక్షిరాజా ఫిలిమ్స్ వారికి హ్యాట్రిక్ చిత్రమైంది. దాంతో తమిళ చిత్రపరిశ్రమలో శ్రీరాములు నాయుడుకి అదృష్ట జాతకుడు అనే పేరు వచ్చింది.
సి.ఎన్. లక్ష్మీకాంతన్ హత్యకేసు…
స్టూడియో నిర్వహణ, సినిమా నిర్మాణం, దర్శకత్వం ఇలా ఏడేళ్లుగా విజయవంతంగా కొనసాగిన శ్రీరాములు నాయుడుకి “జగతలప్రతాపన్” తరువాత ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వడం ప్రారంభమయ్యాయి. 1944 వ సంవత్సరం డిసెంబరులో యస్.యం. శ్రీరాములు నాయుడు హత్యా నేరం క్రింద నటుడు “త్యాగరాజ భాగవతార్”, హాస్య నటులు “నాగర్‌కోయిల్ సుడలైముత్తు కృష్ణన్” (ఎన్.ఎస్.కృష్ణన్) తో కలిసి ఆరు నెలలు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దక్షిణ భారత చలనచిత్ర రంగంలో ఆ కేసు అప్పటికీ, ఇప్పటికీ పెద్ద సంచలనం.
సి.ఎన్. లక్ష్మీకాంతన్ అనే ఒక సినిమా పాత్రికేయుడు సినిమాలలో అగ్రస్థానంలో ఉన్న వ్యాపారవేత్తల మీద పుకార్లు వ్రాసి వారిని బెదిరించి వారి వద్ద డబ్బులు వసూలు చేస్తూవుండేవారు. ఆవిధంగా పేరున్న ప్రముఖులే లక్ష్యంగా లక్ష్మీకాంతన్ ఆ రోజులలో తమిళ సూపర్ స్టార్ ఎం.కె. త్యాగరాజ భాగవతార్, హాస్యనటుడు ఎన్.ఎస్.కృష్ణన్, విజయవంతమైన వ్యాపారవేత్త యస్.యం. శ్రీరాములు నాయుడు లను కూడా ఇదేవిధంగా బెదిరించారు. ఈ ముగ్గురు ఆ విషయాలని ఖాతరు చేయలేదు. నేను రాబోయే సంచికలో మీపై పలానా వార్తలు వ్రాస్తున్నాను. డబ్బులు ఇస్తే మీపై వ్రాసే వార్తలను ఆపేస్తానని లక్ష్మీకాంతన్ మరోసారి వారిని బెదిరించారు. లక్ష్మీకాంతన్ ప్రతీ ఒక్కరినీ ఇలా బెదిరించేవారు.
ఒక్కసారి తన బ్లాక్ మెయిల్ కి లొంగితే ఇదే అలవాటు అవుతుందని అని భావించిన ఆ ముగ్గురు లక్ష్మీకాంతన్ పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. లక్ష్మీకాంతన్ నడుపుతున్న “సినిమా తూదు” అనే పత్రికకు లైసెన్స్ లేదని ప్రభుత్వం విచారణలో తేలింది. వెంటనే ప్రభుత్వం వారు ఆ పత్రికని మూయించేశారు. ఇదంతా 1943లో జరిగింది. ఒక్కసారి నేర వృత్తిని కొనసాగించిన నేరస్థుడు తన నేర ప్రవృత్తిని మార్చుకోలేనట్లు, “లక్ష్మీకాంతన్” 1944లో హిందూ నేషన్ అనే పత్రికను కొని దాని ద్వారా బెదిరింపుల విధానానికి తెరలేపాడు. ఆ ముగ్గురికి (యస్.యం శ్రీరాములు నాయుడు, ఎం.కే.త్యాగరాజ భాగవతార్, ఎన్.ఎస్.కృష్ణన్ లకు నిద్రలేకుండా చేశారు. ఆ పరిస్థితులు అలా కొనసాగుతుండగా 1944 నవంబరు రెండవ వారంలో లక్ష్మీకాంతన్ ను మద్రాసు నడిబొడ్డున పట్టపగలే ఎవరో కత్తితో పొడిచారు. ఆ మరునాడే 09 నవంబరు 1944 నాడు ఉదయం 4:15 గంటలకు నిముషాలకు అతను ఆసుపత్రిలో చనిపోయారు.
జైలు నుండి శ్రీరాములు నాయుడు విడుదల…
సి.ఎన్. లక్ష్మీకాంతన్ చనిపోతూ తన వాంగ్మూలాన్ని న్యాయవాదికి, ఒక పోలీసు అధికారికి వినిపించారు. పోలీసుల పరిశోధనలలో లక్ష్మీకాంతన్ కు శత్రువులు చాలామంది ఉన్నారని తేలింది. అనుమానితులలో ఆరుగురిని అరెస్టు చేశారు. వారిలో లక్ష్మీకాంతన్ ఇంటిని ఆక్రమించి కాళీ చేయని వ్యక్తి, వాళ్ళ వీధిలోనే ఒక కిరాణా కొట్టు యజమాని, సినిమా స్టంట్ మాస్టర్ ఇలా కొందరున్నారు. స్టంట్ మాస్టర్ చెప్పిన వివరాలను బట్టి లక్ష్మీకాంతాన్ బెదిరింపులకు విసిగిపోయిన ఎస్.ఎం. శ్రీరాములు నాయుడు, యం.కె.త్యాగరాజ భాగవతార్, ఎన్.ఎస్. కృష్ణన్ లను అనుమానితులుగా చేర్చి, కేసు విచారణ అనంతరం 1944 డిసెంబరులో ఆ ముగ్గురిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఆరోజుల్లో అది పెద్ద సంచలనం.
నిజానికి ఆ ముగ్గురు (ఎస్.ఎం. శ్రీరాములు నాయుడు, యం.కె.త్యాగరాజ భాగవతార్, ఎన్.ఎస్. కృష్ణన్) ప్రజాదరణ ఉన్నవారు. అప్పటికే వారి మీద కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. దాంతో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. హేమాహేమీలైన న్యాయవాదులంతా రంగంలోకి దిగారు. ప్రాథమిక విచారణ సుమారు ఐదు నెలలు కొనసాగింది. హత్య జరిగినప్పుడు శ్రీరాములు నాయుడు మద్రాసులోనే లేడని ఋజువు అవ్వడంతో 1945లో ఏప్రిల్ లో ఆయనను విడుదల చేశారు. ఆ తరువాత కొద్ది కాలానికి హాస్యనటులు ఎన్.ఎస్. కృష్ణన్ ను విడుదలయ్యారు. సూపర్ స్టార్ యం.కె.త్యాగరాజ భాగవతార్ మాత్రం ఇంకొన్ని రోజులు అంటే 1947 ఏప్రిల్ దాకా జైలులోనే ఉండాల్సి వచ్చింది. తాను విడుదలయ్యాక ఆయన జాతకం తారుమారు కావడం కూడా ఒక విషాదాంత కథ.
పక్షిరాజా స్టూడియో స్థాపన…
శ్రీరాములు నాయుడు ఏప్రిల్ 1945 లో జైలు నుండి నిర్దోషిగా విడుదయ్యారు. విడుదలయిన కొద్ది కాలానికే “సెంట్రల్ స్టూడియో” భాగస్వామి రంగస్వామి నాయుడు మరణించారు. శ్రీరాములు నాయుడికి అప్పటివరకు మద్దతుగా ఉన్న బి.రంగస్వామి నాయుడు లేకపోవడంతో శ్రీరాములు నాయుడు “సెంట్రల్ స్టూడియో” నుండి బయటకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. “పక్షి రాజా ఫిలిమ్స్” నిర్మాణ సంస్థలో భాగస్వామి అయిన నారాయణ అయ్యంగార్ తో కలిసి శ్రీరాములు నాయుడు తమ నిర్మాణ సంస్థ “పక్షిరాజ ఫిలిమ్స్” పేరు మీదుగానే పక్షిరాజు స్టూడియోస్ ని స్థాపించారు. ఆ స్టూడియోకి శ్రీరాములు నాయుడు, నారాయణ అయ్యంగార్ లు భాగస్వాములు. మామూలుగానే నారాయణ అయ్యంగార్ మద్రాసులో ఉండేవారు. కాబట్టి స్టూడియో నిర్వాహణ అంతా శ్రీరాములు నాయుడు చూసుకునేవారు.
పక్షిరాజా స్టూడియో స్థాపనతో కోయంబత్తూరులో రెండు స్టేడియాలు స్థాపించినట్లు అయ్యింది. తమ స్టూడియోలో సొంత సినిమాలు తీసుకోవడమే కాకుండా, మద్రాసు నుండి నిర్మాతలు వచ్చి పక్షిరాజా స్టూడియోలో వాళ్ళ సినిమాలు నిర్మాణం చేస్తూ ఉండేవారు. కొత్తగా స్టూడియో నిర్మించిన తరువాత పక్షిరాజు బ్యానరులో శ్రీరాములు నాయుడు దర్శకత్వంలో మొదటి చిత్రంగా “కన్నిక” నిర్మించారు. బ్యానరును పక్షిరాజా ఫిలిమ్స్ నుండి పక్షిరాజా స్టూడియో కు మార్చారు. టీ.ఈ.వరదన్, ఎం.ఎస్. సరోజిని నటించిన ఈ చిత్రంలో అప్పుడప్పుడే సినీ రంగ ప్రవేశం చేసిన ట్రావెన్కోర్ సోదరీమణులు లలిత, పద్మినీ లతో ఒక నృత్య సన్నివేశాన్ని “కన్నిక” చిత్రంలో పెట్టారు. గరుత్మంతుడిపై కూర్చొని కథానాయకుడు ఆకాశయానం చేయడం లాంటి సన్నివేశాలు ఉన్నప్పటికీ ఆ చిత్రం విజయం సాధించలేదు. శ్రీరాములు నాయుడు కి పక్షిరాజా స్టూడియో తరుపున తొలి పరాజయం కలిగింది.
పక్షిరాజా స్టూడియోను ఆధునీకరించి…
“కన్నిక” సినిమా పరాజయం తరువాత శ్రీరాములు నాయుడు ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో “కన్నిక” సినిమాలో ప్రధాన పాత్ర ధరించిన టీ.ఈ.వరదన్ ప్రధాన పాత్రలో ఆనాటి తమిళ చిత్రరంగ అందాల తార “టి.ఆర్. రాజకుమారి” కథానాయికగా “త్యాగరాజ భాగవతార్” చిత్రం పావలక్కోడి (1934) చిత్రాన్ని పునర్నిర్మించి ఏప్రిల్ 1949 లో విడుదల చేశారు. ఈ చిత్రం కూడా నష్టాలనే మిగిల్చింది. వరుసగా నష్టాలు రావడంతో పక్షిరాజా స్టూడియోలో భాగస్వామి అయిన నారాయణ అయ్యంగార్ భాగస్వామ్యం నుండి తప్పుకున్నారు. దాంతో పక్షిరాజు స్టూడియోస్ బాధ్యతంతా శ్రీరాములు నాయుడు తీసుకున్నారు. స్టూడియో బాధ్యతలను తాను ఒక్కడే మోయాల్సి వచ్చినా, వరుసగా రెండు సినిమాలు నష్టాలను మిగిల్చినా శ్రీరాములు నాయుడు బెదరలేదు.
మద్రాసులో గల “ఇండో కమర్షియల్ బ్యాంకు” యజమాని శంకర లింగ అయ్యర్ స్టూడియోకు కొంత పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు. ఆ డబ్బులతో శ్రీరాములు నాయుడు స్టూడియోని నవీకరించి ఎక్కువ మంది నిర్మాతలను ఆకర్షించారు. పక్షిరాజా స్టూడియోలో వారు సినిమాలు నిర్మించడానికి సౌకర్యవంతంగా స్టూడియోను ఆధునీకరించారు. ఆ రోజులలో మద్రాసు నుండి వచ్చే కళాకారులు, సాంకేతిక నిపుణులు బసచేయడానికి వీలుగా విలాసవంతమైన 30 గదులు, వాటికి మరుగుదొడ్లతో కలిపి సిద్ధం చేసి ఉంచారు. ఐదు లక్షల రూపాయలు ఖరీదు చేసి ఆ రోజుల్లోనే మిచేల్ కెమెరా కొన్నారు. సినిమాను ప్రదర్శించే ప్రొజెక్షన్ థియేటర్ కూడా కట్టారు. నాలుగైదు అంతస్తులలో వడ్రంగి, విద్యుత్తీకరణ, నటీనటుల కోసం ఒక బ్యూటీ పార్లర్ ను కూడా ఏర్పాటు చేయించారు.
“ఎఝై పాదుం పాడు” తో విజయం…
నవీకరించిన పక్షిరాజా స్టూడియోలో సొంత ఆర్కెస్ట్రాలు, సొంత జంతు ప్రదర్శనశాలలు ఏర్పాటు చేశారు. జానపద చిత్రాలకు ఆ రోజుల్లో అవసరమయ్యే జంతువులు, పక్షులు కూడా స్టూడియోలో లభ్యమయ్యేవి. స్టూడియోలో మొత్తం 15 కార్లు ఉండేవి. మొత్తం స్టూడియోలో ఉన్న విభాగాలన్నింటినీ సమన్వయం చేయడానికి కొంతమందితో కలిసి ప్రత్యేక సమన్వయ విభాగాన్ని ఏర్పాటు చేశారు. వీటన్నింటితో పక్షిరాజా స్టూడియో ఆదాయాన్ని శ్రీరాములు నాయుడు పెంచగలిగారు. రెండు సినిమాల పరాజయం తరువాత విరామం తీసుకున్న శ్రీరాములు నాయుడు పక్షిరాజా స్టూడియోస్ తరపున తరువాత చిత్రంగా నిర్మించిన చిత్రం “ఎఝై పాదుం పాడు” చిత్రానికి కే.రామ్ నాథ్ ని దర్శకుడిగా నియమించారు.
“ఎఝై పాదుం పాడు” చిత్రాన్ని తెలుగులో “బీదల పాట్లు” (1950) గా నిర్మించగా ఈ రెండింటిలోనూ చిత్తూరు నాగయ్య ప్రధాన పాత్రదారులు. విక్టర్ హ్యూగో రచించిన లెస్ మిజరబుల్స్ నవల ఈ సినిమాకి అనుకరణ. “రాధా జయలక్ష్మి” పాడిన “విధియిన్ విలైవాల్ అనాది ఆనేన్” అనే పాటను కేవలం సింగిల్ షాట్ లోనే చిత్రీకరించారు. ఈ సినిమా దీపావళి కానుకగా 1954 లో మద్రాసులో ఉన్న క్యాసినో థియేటర్ లో విడుదలైంది. అప్పటివరకు ఇంగ్లీష్ సినిమాలకే పరిమితమైన ఆ చిత్ర ప్రదర్శన శాలలో మొట్టమొదటిసారిగా “ఎఝై పాదుం పాడు” సినిమా విడుదలైంది. అలాగే తెలుగు భాషలో తీసిన “బీదల పాట్లు” కూడా అటుఇటుగా ఒకటి, రెండు రోజులకు విడుదలైంది. రెండు భాషల్లోనూ విజయం సాధించి పక్షిరాజు స్టూడియో పరువు నిలబెట్టింది.
పరాజయం పాలైన “పొన్ని” (1953)..
“బీదల పాట్లు” సినిమా తరువాత మెగా ఫోన్ పట్టుకున్న శ్రీరాములు నాయుడు “కాంచన” (1952) అనే తమిళ, మలయాళ ద్విభాషా చిత్రాన్ని తన దర్శకత్వంలో నిర్మించారు. తెలుగులో అదే పేరుతో ఆ చిత్రాన్ని డబ్బింగ్ కూడా చేశారు. ఆనంద వికటన్ పత్రికలో జనాధరణ పొందిన సీరియల్ కథతో నిర్మించిన ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. సినిమాలు పరాజయం పొందుతుండడంతో శ్రీరాములు నాయుడు పునః ఆలోచనలో పడ్డారు. ఆయన నిర్మాతగా ఉండిపోయి విజయవంతమైన చిత్రాల దర్శకుడు ఏ.ఎన్.ఎస్. స్వామి దర్శకత్వంలో “పొన్ని” (1953) అనే తమిళ సినిమాని ప్రారంభించారు. కానీ దర్శకుడికి మధ్యలో ఏదో సమస్య రావడంతో దర్శకత్వ బాధ్యతలు చిత్తజల్లు శ్రీనివాసరావు అనే తెలుగు సినిమా దర్శకులు ఆ సినిమాను పూర్తిచేశారు. దీనికి తెలుగువెర్షన్ “ఒక తల్లి పిల్లలు” కూడా జూన్ 1953లో విడుదలైంది. కానీ ఆ సినిమా కూడా నష్టాలనే మిగిల్చింది. నష్టాలు కొన్నైనా పూడ్చుదామని హిందీలో విజయవంతమైన చిత్రాలు తమిళంలోకి తర్జుమా చేశారు. అవి కూడా అనుకున్న ఫలితాలను అందించలేదు.
ఆరు భాషలలో “మలైక్కల్లన్”…
వరుస పరాజయాల పిమ్మట పక్షిరాజు స్టూడియోని తలెత్తుకునేలా చేసిన చిత్రం “మలైక్కల్లన్”. తన దర్శకత్వంలోనే ఎస్.ఎం. శ్రీరాములు నాయుడు నిర్మించారు. ఎంజీఆర్, భానుమతిల కలయికలో వచ్చిన ఈ చిత్రం రాష్ట్రపతి రజత పతకాన్ని గెలుచుకున్న మొదటి తమిళ చిత్రంగా నిలిచింది. శ్రీరాములు నాయుడు సినీ జీవితంలో, ఎం.జి.ఆర్ నట జీవితంలో, పక్షిరాజు స్టూడియో చరిత్రలో, అలాగే దక్షిణ భారతదేశ చలనచిత్ర చరిత్రలో మరపురాని మైలురాయి “మలైక్కల్లన్”. 22 జూలై 1954 నాడు విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. ఎస్.ఎం.సుబ్బయ్య నాయుడు స్వరపరిచిన పాటలు ఇప్పటికి కూడా సినీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి.
ఎంజీఆర్ కి మొట్టమొదటిసారిగా సౌందరరాజన్ నేపథ్య గానం చేసింది ఈ సినిమానే. ఆరు భాషలలో పునర్నిర్మించిన ఈ తమిళ “మలైక్కల్లన్” ను తెలుగులో అగ్గిరాముడు (1954), హిందీలో ఆజాద్ (1955), మలయాళం లో తస్కరవీరన్ (1957), కన్నడలో బెట్టడ కల్లా (1957), సింహాళ భాషలో సూరసేన (1957) ఇలా ఆరు భాషలలో కూడా ఘనవిజయం సొంతం చేసుకుంది. తెలుగులో అగ్గి రాముడు ఏడు కేంద్రాల్లో శత దినోత్సవం, రెండు కేంద్రాల్లో రజతోత్సవం కూడా జరుపుకుంది. ఇన్ని భాషలలో శ్రీరాములు నాయుడు విజయం సాధించారు. తొమ్మిది సంవత్సరాలుగా ఉన్న నష్టాలను భర్తీ చేసి, పైపెచ్చు లాభాలను కూడా మిగిల్చింది. ఏదైనా సాధించడం కోసం ఎంతో కష్టపడే శ్రీరాములు నాయుడు, ఈ సినిమాల వల్ల వచ్చిన లాభంతో మద్రాసులో ఒక అపార్ట్మెంట్ నిర్మించుకున్నారు.
పరాజయంతో ముగించి…
మలైక్కల్లన్ సినిమా తరువాత శివాజీ గణేషన్ తమిళంలో మరగతం (1959), దీనినే తెలుగులో ఎన్టీఆర్ తో విమల (1960) చిత్రాలను ఎస్.ఎం. శ్రీరాములు నాయుడు స్వయంగా దర్శక, నిర్మాణం చేశారు. తమిళంలో 21 ఆగస్టు 1959 నాడు, అలాగే తెలుగులో 11 ఆగస్టు 1960 విడుదలయ్యాయి. “మలైక్కల్లన్” సాధించిన ఘనవిజయం ముందు “మరకతం” తేలిపోయింది. అప్పటికే పాతికేళ్ల అనుభవంతో సినిమారంగంలో కొనసాగుతున్న శ్రీరాములు నాయుడు “పక్షిరాజా బ్యానరు” లో తాను స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిట్టచివరి చిత్రం కళ్యాణియిన్ కనావన్ (1963). శివాజీ గణేషన్, బి.సరోజ దేవి, ఎస్.వి. రంగారావు, టి.ఆర్. రామచంద్రన్ ప్రధాన పాత్రధారులుగా 20 సెప్టెంబర్ 1963 నాడు విడుదలైంది. ఇది కూడా పరాజయం పాలైంది. తమిళ సినిమా రంగంలో, అలాగే తమిళ ప్రేక్షకులలో అప్పటికే చాలా మార్పులు వచ్చాయి. అప్పటికి శ్రీరాములు నాయుడు వయస్సు 53. కాలానుగుణంగా మారిన పరిస్థితులలో ఆయన ముందుకు కొనసాగలేకపోయారు.
నిష్క్రమణం…
1963 వ సంవత్సరం తరువాత పక్షిరాజా స్టూడియో బ్యానరులో గానీ, శ్రీరాములు నాయుడు తన దర్శకత్వంలో కానీ ఏ చిత్రాన్నీ నిర్మించలేకపోయారు. కోయంబత్తూరు లోని పక్షిరాజా స్టూడియోని 1968 వ సంవత్సరంలో మూసేసి అందులోని పరికరాలు అన్నీ బెంగళూరులోని చాముండేశ్వరి స్టూడియోకి మార్చి, ఆ స్టూడియో నిర్వాహణను శ్రీరాములు నాయుడు చేపట్టారు. అప్పటికే ఆయన వయస్సు 58 సంవత్సరాలు. చాముండేశ్వరి స్టూడియోకి మారిన తరువాత ఏ ఒక్క సినిమా నిర్మాణం కూడా ఆయన చేపట్టలేకపోయారు. ఆ స్టూడియో నిర్వాహణను ఆయన తన మేనల్లుడుకి ఇచ్చేసి విశ్రాంతి దశలోకి ప్రవేశించారు. తన 66 సంవత్సరాల వయస్సులో అనగా 1976 వ సంవత్సరంలో యస్.యం. శ్రీరాములు నాయుడు ప్రశాంతంగా కన్నుమూశారు. “మలైక్కల్లన్” సినిమా తరువాత కనీసం ఒక్క విజయవంతమైన సినిమాను తీయలేకపోయాను అనే బాధను ఆయనను చివరి వరకు వెంటాడుతూనే ఈ లోకం నుండి నిష్క్రమించారు.

