Telugu Cinema

తెలుగు చిత్ర సీమలో పౌరాణిక బ్రహ్మ.. కమలాకర కామేశ్వరరావు

కమలాకర కామేశ్వరరావు చిత్రికరణ లో అంతా హడావిడిగా ఉన్నారు. ఛాయాగ్రాహకుడు లైటింగ్ ఏర్పాట్లు చూస్తున్నాడు. సహాయ దర్శకులు నటీనటుల చేత సంభాషణలు వల్లె వేయిస్తున్నారు.

తెల్లని పంచె, తెల్లని లాల్చి, తెల్లని జుట్టు, నుదుట ఎర్రని కుంకుమ బొట్టుతో ఒకాయన సెట్ అంతా కలియతిరుగుతూ చిత్ర యూనిట్ సభ్యులందరికీ ఆదేశాలిస్తున్నారు.

ఆ చిత్రీకరణ ను చూడడానికి వచ్చిన ఒకాయన ప్రక్కనున్నాయనతో ఆయన ఎవరు అని అడిగాడు.

ఆయన సినిమా దర్శకుడు అన్నాడా పక్క వ్యక్తి.

ఆయన.. ఆయన దర్శకుడా..??అదేమిటి అలా ఉన్నాడు. సినిమా దర్శకుని వాలకం కనిపించడం లేదే..?? అంటూ అడిగినతను ఆశ్చర్యపోయాడు. చాలాసేపు ఆశ్చర్యపోతూనే ఉన్నాడు.

దర్శకులు అంటే ఎలా ఉండాలి. ప్యాంటు, స్లాక్ వేసి మూడు ఐదు సిగరెట్ రింగులు వదులుతూ శూన్యం లోకి చూస్తూ ఉండాలి కదా అన్నది అతగాడి అభిప్రాయం.

ఆరోజు అంతా అతని నోటి నుంచి ఒక్కటే మాట. ఆయన దర్శకుడు అంటే ఎవ్వరూ నమ్మరు సార్ అని.

తెలుగుదనానికి అచ్చమైన ప్రతీకలా కనిపించే ఆ స్వామి పౌరాణిక చిత్రాలకు ఏకైక చిరునామాగా బాసిల్లిన దర్శకుడు “కమలాకర కామేశ్వరరావు” గారు.

ఈ వస్త్రధారణ ఆయనకు తన చిన్నప్పటి నుంచి అలవాటు.

కామేశ్వరరావు తన జీవితకాలంలో మచ్చుకు ఒక్కనాడు ఆయన ప్యాంటు ధరించి ఎరుగరు.

సాంఘిక చిత్రాల మాటెలా ఉన్నా తెలుగు పౌరాణిక చిత్రాలకు సాటి రాగల పౌరాణికాలు యావద్భారతదేశంలోనే మరే భాషలోనూ లేవు.

తెలుగు పౌరాణికాలకు ఆ ఘనతను సాధించి పెట్టారు, కనుకనే పౌరాణిక చిత్రాల బ్రహ్మ గా గుర్తింపు పొందారు కమలాకర కామేశ్వరరావు గారు.

చంద్రహారంతో సినీ రంగ ప్రవేశం చేసి నర్తనశాల తో అంతర్జాతీయ ఖ్యాతి పొంది, నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలలో “శిరోమణి” పురస్కారాన్ని అందుకున్నారు.

కమలాకర కామేశ్వరరావు గారు కృష్ణావతారం సినిమాకు ట్రిక్ షాట్స్ తీస్తున్నారు. పౌరాణికాలలో ట్రిక్ షాట్స్ అంటే మాటలు కాదు. ఎంతో బరువైన ఆభరణాలను ధరించి గంటల తరబడి ఓపికగా నిల్చోవాలి. ఆరోజు పరిస్థితి అదే.

వయస్సులో పెద్దవాడైనా తనతో పాటు ఓపికగా పనిచేస్తున్న కమలాకర గారిని చూసి నందమూరి గారు ఉద్వేగానికి లోనయ్యారు.

“మనిద్దరం పోయాక తెలుగులో అసలు పౌరాణికాలు ఉంటాయా” అని నందమూరి గారు కమలాకర గారిని ప్రశ్నించారు.

అలాగే జరిగింది. చిన్నవాడైనా నందమూరి గారు ముందు గానే వెళ్ళిపోయారు. తర్వాత కమలాకర గారు నిష్క్రమించారు.

అమరపురి లో ఆ ఇద్దరూ తమ గురువు కే.వీ.రెడ్డి గారితో ప్రస్తుతం తాము ఎంతగానో అభిమానించిన పురాణాల గురించి చర్చించుకుంటూ ఉంటారు అనుకోవడంలో ఎవ్వరికీ ఎలాంటి సందేహం లేదు.

ఆ ముగ్గురు కలయికలలో తయారైన చిత్రాలు తెలుగు సినిమా ప్రేక్షకుడికి “అజరామర కావ్యాలు”..

చిత్రంలో అన్నిశాఖలూ, అందరూ కనిపించాలి గానీ, దర్శకుడు కనిపించగూడదని నా ఉద్దేశ్యం. అన్నిశాఖలనూ కనిపింపజెయ్యడమే దర్శకుని ఘనత. మణిహారంలో సూత్రముంటుంది. అది పైకి కనిపించదు. కానీ అన్ని మణులనూ కలిపి హారంగా రూపొందిస్తుంది. చిత్ర దర్శకుడు అలాంటి సూత్రం.” -కమలాకర కామేశ్వరరావు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    కమలాకర కామేశ్వరరావు 

ఇతర పేర్లు  :    పౌరాణిక చిత్రాల బ్రహ్మ 

జననం    :    04 అక్టోబర్ 1911

స్వస్థలం   :    మచిలీపట్నం , మద్రాసు ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా

తండ్రి      :     సుందర రావు 

తల్లి     :      కామేశ్వరమ్మ

వృత్తి      :    తెలుగు సినిమా దర్శకులు 

చదువు      :      కళ ల్లో పట్టభధ్రులు

కాలం       :       1940 నుండి 1980 వరకు

శైలి         :       ఎపిక్ హిస్టారికల్

గుర్తించదగిన రచనలు   :  మహాకవి కాళిదాసు గుండమ్మ కథ మహామంత్రి తిమ్మరుసు నర్తనశాల

మరణం     :     29 జూన్ 1998 (వయస్సు 86)

నెల్లూరు , ఆంధ్రప్రదేశ్ , భారతదేశం

నేపథ్యం..

కమలాకర కామేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా బందరు లో 04 అక్టోబర్ 1911   తేదీన జన్మించారు. వీరి అమ్మ కామేశ్వరమ్మ, నాన్న సుందర రావు గారు. కమలాకర గారు బందరు లోనే బి.ఏ. వరకు చదువుకున్నారు. చదువుకునే రోజుల్లో కూడా తన వస్త్రధారణ పంచకట్టు, లాల్చీ. చిన్నప్పటినుండి అదే వస్త్రధారణ. తనకు కదిలే బొమ్మల మీద కడు ఆసక్తి. భాషా ప్రమేయం లేకుండా వచ్చిన ప్రతీ చిత్రాన్ని చూసేవారు. ఆ చిత్రాల్లోని మంచి చెడ్డలు గమనించేవారు. అంతటితో ఆగకుండా సినిమాకు సంబంధించిన అనేక పుస్తక చదివేవారు. పాఠకుడిగా తానుగ్రహించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రేక్షకుడిగా తాను గమనించిన అంశాలను, గుది గుచ్చి సినిమాల మీద సమీక్షలు వ్రాయడం ప్రారంభించారు.

“కృష్ణా పత్రిక” ఆయన ఉత్సహాన్ని ప్రోత్సాహించేది. “సినీ ఫ్యాన్” అనే పేరుతో ఆ పత్రికలో కామేశ్వరరావు గారు వ్రాసిన సమీక్షలు వచ్చేవి. తన విమర్శలు పాఠకులను అమితంగా ఆకర్షించేవి. న్యూ థియేటర్, ప్రభాత్ వారి సినిమాలను కామేశ్వరరావు గారు చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో సమీక్షించేవారు. బందరు లో అన్ని సినిమాలు విడుదల అయ్యేవి కాదు. అంచేత తాను విజయవాడ వెళ్లి ఆ సినిమాలు చూసి వచ్చేవారు. కథ సంవిధానం మీద కామేశ్వరరావు గారు ప్రధానంగా తన అభిప్రాయాలు వ్రాసేవారు. తన విమర్శల్లో విజ్ఞత ఉండేది. తాను సినిమా బాగుందని వ్రాస్తే చూసే ప్రేక్షకులు, బాగోలేదంటే చూడడం మానేసే ప్రేక్షకులు కూడా ఉండేవారు.

1936లో పోటాపోటీగా విడుదలైన “ద్రౌపది మాన సంరక్షణం”,  “ద్రౌపది వస్త్రాపహరణం” చిత్రాలను తులనాత్మకంగా విశ్లేషిస్తూ కామేశ్వరరావు గారు వ్రాసిన విమర్శలు “కృష్ణా పత్రిక” లో వరుసగా నాలుగు వారాలు వచ్చి సినిమా పరిశ్రమలో పెద్ద సంచలనమే సృష్టించాయి. రెండింటిలో “వస్త్రాపహరణం” ఆర్థికంగా విజయవంతమైంది. “మాన సరక్షణం” ఆర్థికంగా దెబ్బతింది. కానీ “మాన సంరక్షణం” చిత్రమే చాలా గొప్పదని కామేశ్వరరావు వ్రాయడం సినిమా పెద్దలను ఆశ్చర్యపరిచింది. కథను నడిపిన విధానం, నటీనటుల సామర్థ్యం “మాన సంరక్షణం”లోనే భాసించాయని కామేశ్వరరావు సోదాహరణంగా చెప్పుకొచ్చాడు. నార్ల వెంకటేశ్వరరావు, గూడవల్లి రామబ్రహ్మం లను అమితంగా ఆకట్టుకుంది. ఈ విమర్శలే కామేశ్వరరావు గారిని చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించేలా చేశాయి.

సినీ రంగ ప్రవేశం…

కమలాకర గారు డిగ్రీ పూర్తి చేసే నాలుగేళ్ల అయింది. ఈ నాలుగేళ్లు తాను ఎక్కడ ఉద్యోగం చేయలేదు. ఖాళీగానే ఉన్నారు. ఖాళీగా ఉన్న నాలుగేళ్లు తాను ఎక్కువగా గ్రంథాలయంలోనే గడిపారు. 1936లో కామేశ్వరరావు మద్రాసు వెళ్లి టాకీ పులి హెచ్.ఎం.రెడ్డి గారిని కలిశారు. కామేశ్వరరావు గారు తీవ్రంగా విమర్శించిన “వస్త్రాపహరణం” చిత్రానికి దర్శకుడు హెచ్.వి.బాబు గారే అయినా పర్యవేక్షకుడు హెచ్.యం.రెడ్డి గారే. అయినా ఆయన అవేవీ మనసులో పెట్టుకోలేదు. కామేశ్వరరావు గారిని హెచ్.యం.రెడ్డి గారు అభినందించారు. తన పోటీగా సినిమా తీసిన దర్శకుడు (జగన్నాథ్) నమెచ్చుకున్న కామేశ్వరరావు గారికి తన దగ్గర ఉద్యోగం ఇస్తానని కూడా హెచ్.యం.రెడ్డి గారు వాగ్దానం చేశారు.

హెచ్.ఎం.రెడ్డి గారు తీసిన కనకతార 1937 లో విడుదలైంది. సినిమా విడుదల సందర్భంగా రెడ్డి గారే బెజవాడ వచ్చారు. కామేశ్వరరావు గారు బెజవాడ వెళ్లి వారిని కలిశారు. త్వరలోనే తాను గృహలక్ష్మి చిత్రం తీస్తున్నానని ముందుగానే కామేశ్వరరావుకు కబురు చేస్తానని రెడ్డి గారు కమలాకర కు హామీ ఇచ్చారు. అన్నట్టుగానే సినిమా ఆరంభించబోయే ముందు ఆయన కామేశ్వరరావు గారిని మద్రాసు పిలిపించారు. రోహిణి సంస్థలో కామేశ్వరరావు గారు ఉద్యోగిగా చేరారు. కొత్తవాడు కాబట్టి జీతం లేదు. భోజనం, బస ఉచితం. అక్కడే కామేశ్వరరావుకు రామ్ నాథ్, శేఖర్, బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, సముద్రాల రాఘవాచార్య గార్ల వంటి పెద్దలతో పరిచయం కలిగింది.

కె.వి.రెడ్డి గారు అక్కడ క్యాషియర్ గా ఉండేవారు. రోహిణి లాడ్జిలోనే కె.వి.రెడ్డిగారి గదిలోనే కామేశ్వరరావు గారికి కూడా వసతి ఏర్పాటు జరిగింది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. రోహిణిలో పెద్ద, చిన్న తారతమ్యాలు ఉండేవి కావు. లాడ్జి నుంచి అంతా ఓకే కారులో బయలుదేరి షూటింగ్ కి వెళ్లేవారు. కామేశ్వరరావు గారికి ఫలానా పని అంటూ ఏమీ ఉండేది కాదు. చిత్రికరణ లో జరిగేదంతా గమనించేవారు. రెడ్డి గారు ఎప్పుడన్నా ఏదన్నా సలహా అడిగితే తన అభిప్రాయం చెప్పేవారు. సాయంత్రం అయ్యేసరికి తాను కే.వీ. రెడ్డి గారితో కలిసి ఏదో ఒక సినిమాకు వెళ్లేవారు. లాడ్జికి వెళ్ళాక రాత్రి పొద్దుపోయేదాకా ఆ సినిమా మంచి చెడుల గురించి మాట్లాడుకునేవారు.

గృహలక్ష్మి సినిమా పూర్తి అయ్యింది. రోహిణిలో కామేశ్వరరావు పని అయిపోయింది. గృహలక్ష్మి సినిమా ప్రింట్లతో పాటు ఆంధ్రకు రిప్రెసెంటేటివ్ గా వెళ్లారు. బెజవాడ, ఏలూరు మొదలైన ఊళ్ళన్నీ తిరిగారు. తాను మద్రాసు తిరిగి వచ్చేసరికి బి.ఎన్.రెడ్డి, రామ్ నాథ్, శేఖర్ కలిసి వాహనీ సంస్థను ఆరంభించారు. కామేశ్వరరావు గారు తాను కూడా వాహిని దర్శకత్వం విభాగంలో చేరారు. కె.వి.రెడ్డి, ప్రొడక్షన్ మేనేజర్. వాళ్ళ మొదటి చిత్రం “వందేమాతరం”. వాహిని లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదాభిప్రాయాలు ఉండేవి కాదు. స్క్రిప్ట్ నుంచి ఎడిటింగ్, ఎగ్జిబిషన్ వరకు కమలాకర గారికి తెలియని విషయం ఉండేది కాదు.

దేవత చిత్రం నుంచి కామేశ్వరరావు గారికి అసోసియేట్ హోదా లభించింది. నూతన చిత్రానికి కే.వీ.రెడ్డి గారు దర్శకులు అయ్యారు. కామేశ్వరరావు గారు సహాయ దర్శకులు అయ్యారు. వాహినీ లో తాను ఫలానా హోదా కావాలని, ఇంత జీతం కావాలని ఎన్నడూ ఎవర్ని అడిగింది లేదు. అన్నీ వాళ్లే చేశారు. అది వాళ్ళ గొప్పతనం. కే.వి.రెడ్డి తన దర్శకత్వం చేసిన సినిమాలకైతే ప్రకటనలో తన పేరు పక్కన అసోసియేటర్ అని కామేశ్వరరావు గారి పేరు కూడా వేయించేవారు.

తొలి చిత్రం చంద్రహారం…

 1943 వ సంవత్సరం ఒక మధ్యాహ్న వేళ “వాహినీ స్టూడియో” కు శంకుస్థాపన జరిగింది. ఆ రోజు శంకుస్థాపనకు మట్టి వేసిన పదిహేను మందిలో కామేశ్వరరావు గారు కూడా ఉన్నారు. తర్వాత కాలంలో ఆయన ఎంతో సంతృప్తిగా చెప్పుకున్న విషయాల్లో అది కూడా ఒకటి. “వింధ్యారాణి” (1948) నిర్మాణ సమయంలో కామేశ్వరరావు గారికి కవి పింగళి నాగేంద్రరావు గారితో సాన్నిహిత్యం ఏర్పడింది. పింగళి గారిది కూడా బందరే. కామేశ్వరరావు గారు పింగళి గారిని కె.వి.రెడ్డి గారికి, బి.ఎన్.రెడ్డి గారికి పరిచయం చేశారు. వాహిని వారు “గుణసుందరి కథ” (1949) ఆరంభించారు. పింగళి గారితో కలిసి కె.వి.రెడ్డి గారు, కామేశ్వరరావు గారు దానికి కథ తయారు చేశారు.

ఆ కథ వాహిని యజమాన్యం విజయ వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు కామేశ్వరరావు గారిని కూడా తమ యూనిట్ లోకి తీసుకున్నారు. కే.వీ.రెడ్డి గారితో కలిసి కామేశ్వరరావు గారు కూడా “పాతాళభైరవి” స్క్రిప్ట్ వర్క్ లో పాల్గొన్నారు. ఆ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. తర్వాత విజయా వారు కామేశ్వరరావు గారిని దర్శకుడిగా మరో జానపదం “చంద్రహారం” ఆరంభించారు. దర్శకుడుగా కామేశ్వరరావు గారికి అదే తొలి చిత్రం. విజయా వారికి అంతకుముందు తీసిన చిత్రాలతో పోలిస్తే “చంద్రహారం” అపజయం పాలైంది. కానీ ఎందరో విమర్శకుల మన్ననల్ని అందుకుంది. దరిమిలా కామేశ్వరరావు గారు “గుణసుందరి కథ” తమిళ చిత్రానికి దర్శకత్వం చేశారు. అది కూడా పరాజయం పాలైంది.

తర్వాత తాను విజయా సంస్థ నుంచి బయటకు వచ్చి “పెంకి పెళ్ళాం” (1956) కూడా నిరాశనే మిగిల్చింది. కమలాకర గారు ఫ్లాఫ్ దర్శకుడిగా ముద్ర పడిపోయారు. అయితే నందమూరి తారక రామారావుకు మాత్రం కమలాకర గారి మీద అపారమైన నమ్మకం ఉండేది. ఆ నమ్మకంతోనే తన సొంత చిత్రానికి కమలాకర గారిని దర్శకునిగా ఎన్నుకున్నారు.  అప్పట్లో కథ హీరో, తారలను దృష్టిలో పెట్టుకొని పాత్రలను తయారు చేసుకోవడం అనేది ఉండేది కాదు. స్క్రిప్ట్ పక్కాగా తయారయ్యాకే తారల ఎంపిక జరిగేది. కాగితం మీద మనం ఏమి రాసుకున్నారో తెరమీద కూడా అదే ఉండేది. అలాగే ప్రతి సీనుకు ముందు రిహార్సల్ ఉండేవి.

తొలి విజయం “పాండురంగ మహత్యం”..

నందమూరి తారకరామారావు గారు ఎన్.ఏ.టి సంస్థలో తీసిన కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా “పాండురంగ మహత్యం” (1957). ఆ చిత్రం తొమ్మిది కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది. ఆ తర్వాత కమలాకర దర్శకత్వం లో శోభ (1958), రేచుక్క పగటి చుక్క (1959), మహాకవి కాళిదాసు (1960), గులేబకావళి కథ (1962), గుండమ్మ కథ (1962), మహామంత్రి తిమ్మరసు (1962) వచ్చాయి. 1962లో కామేశ్వరరావు గారి దర్శకత్వంలో వచ్చిన మూడు సినిమాలు ఆర్థికంగా మంచి విజయం సాధించాయి. బాక్సాఫీసు వద్ద కమలాకర పేరు, విలువ పెరిగింది.

“కాళిదాసు”, “తిమ్మరసు” చిత్రాలు రాష్ట్రపతి “రజత పథకం” కూడా సంపాదించుకున్నాయి. తర్వాత వచ్చిన నర్తనశాల (1963) చిత్రం జకార్తా లో జరిగిన “అఫ్రో ఏసియన్ ఫిలిం ఫెస్టివల్” లో పాల్గొని ఉత్తమ నటునిగా ఎస్వి రంగారావు గారికి అవార్డు సంపాదించి పెట్టింది. “పాండవ వనవాసం” (1965) కూడా విజయం సాధించడంతో పౌరాణిక చిత్రాలకు కామేశ్వరరావు గారు మొదటి చిరునామాగా మారారు. శకుంతల (1966), శ్రీకృష్ణ తులాభారం (1966), కాంబో రాజు కథ (1967), శ్రీకృష్ణ అవతారం (1967), కలిసిన మనసులు (1968), వీరాంజనేయ (1968), మాయని మమత (1970)  లాంటి చిత్రాలు తర్వాత కాలంలో కామేశ్వరావు దర్శకత్వంలో వచ్చిన సినిమాలే.

ఎమ్.యస్.రెడ్డి భారీ ఎత్తున తీసిన శ్రీకృష్ణ విజయం (1971) పరాజయం పాలైంది. ఇవాళ భారతదేశమంతటా సినిమా ప్రియులు అలరిస్తున్న హేమామాలిని చేత తన పాండవ వనవాసం చిత్రంలో మొదటిసారి నాట్యం చేయించిన ఖ్యాతి కమలాకర గారిదే. డెబ్బయి లలో ఆవిడ డ్రీమ్ గర్ల్ గా యావత్ భారతదేశాన్ని ఆకట్టుకుంటుంది. అయినా కమలాకర గారి మీద గౌరవంతో “శ్రీకృష్ణ విజయం” లో రంభగా చక్కటి పాటకు (జోహారు శిఖి పింఛమౌళి) నాట్యం చేసింది.

పౌరాణికాల మీద పట్టు ఉన్న కమలాకర గారు పిల్లలతో కూడా బాలభారతం (1972) తీసి ప్రేక్షకులను ఒప్పించారు. పౌరాణికాల్లో ఆయన అంతగా రాణించడానికి స్క్రీన్ ప్లే నే కారణం అని పరిశ్రమ పెద్దలు చెప్పుకునేవారు. మద్రాస్ ఫిలిం ఫాన్స్ అసోసియేషన్ వారు రెండుసార్లు కమలాకర గారిని ఉత్తమ దర్శకుడుగా ఎన్నుకున్నారు. చిత్రీకరణ లో పని చేసేటప్పుడు తాను ఎక్కడ కూడా ఒక్క నిమిషం  కూర్చునేవారు కారు. తనతో పని చేసే సాంకేతిక నిపుణులను కూడా తాను ఎంతో గౌరవించేవారు.

వాళ్లు ఎలాంటి సలహాలు చెప్పినా సావధానంగా వినేవారు. వాటిల్లో ఎంత మాత్రం ఔచిత్యం ఉన్నా తప్పనిసరిగా అమలుపరిచేవారు. తాను ఎక్కువగా వేదాంత గ్రంథాలు చదివేవారు. హరికథలు, వేదాంత చర్చలు, మతానికి సంబంధించిన ఉపన్యాసాలు చాలా శ్రద్ధగా వినేవారు. 70 ల ద్వితీయ అర్ధానికి వచ్చేసరికి తెలుగులో పౌరాణికాలకు ఆదరణ తగ్గిపోసాగింది. కురుక్షేత్రం (1977), సీతారామ వనవాసం (1977), వినాయక విజయం (1979), వాసవి కన్యకా పరమేశ్వరి మహత్యం (1980), సంతోష్ మాత వ్రత మహత్యం (1983), శ్రీ దత్త దర్శనం (1985), అష్టలక్ష్మి వైభవం (1986), ఏడుకొండల స్వామి (1991) మొదలైనవి కమలాకర దర్శకత్వం లో వచ్చినవే. చివర్లో వచ్చిన కొన్ని సినిమాలకు ఆర్థిక సమస్యలతో చాలా విషయాలలో తాను రాజీ పడవలసి వచ్చింది. దర్శకుడే సర్వం అనుకునే రోజుల్లో సినిమాలకు వచ్చిన తాను తన చివరి రోజుల్లో అపరిమితంగా పెరిగిపోయిన తారాబలం, సంస్కృతి తనకు ఎంత మాత్రం అవగతం కాలేదు.

దర్శకుడు గా చిత్ర సమాహారం… 

చంద్రహారం (తెలుగు & తమిళం) (1954)..

గుణ సుందరి (తమిళం) (1955)..

పెంకి పెళ్ళాం (1956)..

పాండురంగ మహత్యం (1957)..

శోభా (1958)..

రాజా సేవై (1959)..

రేచుక్క పగటిచుక్క (1959)…

మహాకవి కాళిదాసు (తెలుగు & తమిళం) (1960)..

మహామంత్రి తిమ్మరుసు (1962)..

గుండమ్మ కథ (1962)..

నర్తనశాల (1963)..

పాండవ వనవాసము (1965)..

శకుంతల (1966)..

శ్రీ కృష్ణ తులాభారం (తెలుగు & తమిళం) (1966)..

కాంభోజరాజు కథ (1967)..

శ్రీ కృష్ణావతారం (తెలుగు & తమిళం) (1967)..

కలసిన మనుషులు (1968)..

వీరాంజనేయ (1968)..

మయాని మమత (1970)..

శ్రీ కృష్ణ విజయము (1970)..

బాల భారతం (1972)..

జీవితాశయం (1974)..

కురుక్షేత్రం (1977)..

సీతా రామ వనవాసం (1977)..

జ్ఞాన కుజంధై (1979)..

శ్రీ వినాయక విజయము (1980)..

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం (1980)..

దైవ తిరుమనంగళ్ (1981) (వల్లి తిరుమణం భాగం మాత్రమే)..

ఏకలవ్య (1982)..

సంతోషి మాత వ్రత మహాత్మ్యము (1983)..

బదరీనాథ దర్శనం (1985)..

శ్రీ దత్త దర్శనం (1985)..

అష్టలక్ష్మీ వైభవము (1986)..

దేవి నవగ్రహ నాయకి (1986)..

ఏడు కొండలస్వామి (1991)..

@ సహాయ దర్శకుడు గా…

గృహలక్ష్మి (1938)..

వందేమాతరం (1939)..

సుమంగళి (1940)..

దేవత (1941)..

భక్త పోతన (1942)..

స్వర్గసీమ (1945)..

యోగి వేమన (1947)..

గుణసుందరి కథ (1949)..

పాతాళ భైరవి (1951)..

గుణ సుందరి (1955)..

పురస్కారములు…

జాతీయ చలనచిత్ర అవార్డులు..

1964 వ సంవత్సరంలో నర్తనశాల చిత్రానికి దర్శకత్వం వహించినందుకు గానూ రెండవ ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం వరించింది..

1962 వ సంవత్సరంలో మహామంత్రి తిమ్మరుసు చిత్రానికి గానూ తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా రాష్ట్రపతి నుండి రజత పతకం అందుకున్నారు..

1960 వ సంవత్సరంలో మహాకవి కాళిదాసు చిత్రానికి గానూ తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా రాష్ట్రపతి రజత పతకం స్వీకరించారు..

ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు…

1962 వ సంవత్సరంలో కమలాకర గారు “గుండమ్మ కథ” కు దర్శకత్వం వహించినందుకు గానూ ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారం దక్కించుకున్నారు..

సహస్ర చంద్ర దర్శనం..

90 వ దశకం నాటికి వచ్చేసరికి పౌరాణికాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. తదుపరి కాలమంతా ఆయన ఖాళీగానే జీవితం వెళ్లబుచ్చారు. చిత్ర పరిశ్రమలో వచ్చిన పెను మార్పులు తనను విభ్రాంతికి గురిచేసాయి. వెయ్యి పున్నములు చూసిన వారికి ఒక భోగం జరుపుతారు. అందుకు ఆరోగ్యం, భార్య రెండూ ఉండాలి. ఆ రెండూ ఉన్నాయి కనుక, కమలాకర గారికి ఆ కార్యక్రమం చేయాలని నిశ్చయించుకున్నారు.

“శతమానం భవతి” అని వంద మందిని మాత్రమే పిలిచారు. ఆ ఒక్క వేడుకను సంతోషంగా జరిపించారు. వార్ధక్యం కారణంగా చివరి రోజుల్లో మద్రాసు కు దూరంగా నెల్లూరులో తన కొడుకు దగ్గర ఉన్నారు. స్నేహితులు సన్నిహితులు దూరం కావడంతో ఒంటరితనం వల్ల చాలా బాధపడ్డారు. తన 88వ ఏటా అక్కడే నెల్లూరులో 29 జూన్1999 తేదీన స్వర్గస్తులయ్యారు.

కమలాకర గారి దర్శకత్వంలో రూపొందిన పలు చిత్రాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలను సొంతం చేసుకున్నాయి. “నర్తనశాల” చిత్రానికి రెండో ఉత్తమ చిత్రంగా జాతీయస్థాయిలో అవార్డు వచ్చింది. దక్షిణ భారత దేశంలోనే మొట్టమొదటిసారి దక్కిన గౌరవం అది. “నర్తనశాల” ఎంతో పేరు తెచ్చుకుని జకార్తాలో కూడా ప్రదర్శింపబడింది. పురాణగాథలను తెరకెక్కించడంలో తనదైన బాణీ పలికించిన కామేశ్వరరావు “పౌరాణిక బ్రహ్మ”గా కీర్తిపొందారు. ఆయన రూపొందించిన చిత్రాలు నేటికీ పర్వదినాల సమయంలో బుల్లితెరపై ప్రత్యక్షమై మనకు కనుల విందు చేస్తుంటాయి.

కమలాకర ను అభిమానించే ఎన్టీఆర్…

నందమూరి తారకరామారావు గారికి “తార” హోదా తెచ్చి పెట్టిన చిత్రం “పాతాళభైరవి” చిత్రానికి స్క్రిప్టు రాసిన వారిలో “కమలాకర కామేశ్వరరావు” గారు కూడా ఉన్నారు. తర్వాత కాలంలో నందమూరి గారు ఊహించని ఎత్తులకు ఎదిగినా కూడా కామేశ్వరరావు గారిని మాత్రం ఎంతో గౌరవంతో చూసేవారు. దానికి గల కారణం పురాణాలు, ఇతిహాసాల గురించి ఆయనకున్న అవగాహన. వాళ్ళిద్దరూ కలిసి పనిచేసిన వాటిల్లో “పౌరాణికాల చిత్ర రాజములే” ఎక్కువ. చిత్రీకరణ లో సాధారణంగా నందమూరి గారు కమలాకర గారిని ఏ విషయంలోనూ ప్రశ్నించేవారు కాదు. మరి అనుమానం ఉన్నచోట మాత్రం సందేహం నివృత్తి చేసుకునేవారు.

ఎన్టీఆర్ గారు ఏది అడిగినా కామేశ్వరరావు గారు నాలుగు ఐదు గ్రంథాలు ఆ సందర్భం గురించి ఏమి వ్రాసింది ఉటంకించేవారు. తర్వాత తను వాటిలో ఏ గ్రంధాన్ని ప్రామాణికంగా తీసుకున్నాడో వివరించేవారు. ఎందుకు తీసుకున్నానన్నది విషదీకరించేవారు. అంతే నందమూరి గారు ఇక మాట్లాడే వారు కాదు. తాను చెప్పింది చెప్పినట్టుగా చేసి వెళ్ళిపోయేవారు. నందమూరి దృష్టిలో పురాణాలకు సంబంధించి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సాధికారిక కలిగిన వ్యక్తులు ముగ్గురే ముగ్గురు. కె.వి.రెడ్డి గారు, కమలాకర కామేశ్వరరావు గారు మరియు నందమూరి తారకరామారావు గారు.

తెలుగు చిత్ర సీమలో “ధర్మరాజు”

 కమలాకర గారిని చిత్ర పరిశ్రమ అంతా ధర్మరాజు అనేవారు. అవునవును అంటూ చిత్ర నిర్మాతలు పారితోషికాలు ఎగ్గొట్టేవారు. అదేమిటి డబ్బు గురించి వాళ్ళని అడగరేమిటి అని ఎవరైనా కమలాకర గారిని అడిగితే,  పాపం మంచి ప్రాజెక్టుతో వచ్చారు. పారితోషికం గురించి పట్టుబట్టి ఒక మంచి భక్తి చిత్రాన్ని ప్రేక్షకులకు లేకుండా చేయడం మహాపాపం కదా అనే వారు. అందుకే అన్ని సంవత్సరాలు చిత్ర పరిశ్రమలో ఉన్నా కారు గానీ, కనీసం ఉండడానికి సొంత ఇల్లు కూడా ఏర్పాటు చేసుకోలేకపోయారు.

మనుషుల్లో సత్యశీలత, ధర్మచింతన ఇంకా పూర్తిగా కొడగట్టని కాలంలో పుట్టి, వాళ్లను ఆధ్యాత్మిక చింతనకు తనవంతుగా సినిమా సేవ అందించిన కమలాకర కామేశ్వరరావు గారు ఏమీ ఆశించకుండానే ఇక సెలవు అంటూ తన పని ముగించుకుని వెళ్ళిపోయారు. తెలుగు సినిమా స్వర్ణ యుగానికి అపారమైన సేవలు అందించిన ఆ మహానుభావునికి లేకపోతే వెంకయ్య అవార్డు వంటి అత్యున్నత పరిష్కారం అందించాలన్న తెలివిడి మన పాలకులకు లేకపోయినా, మల్లెపూవు లాంటి తన సినిమాల పరిమళాన్ని ఆస్వాదించిన ప్రేక్షకుల హృదయంలో మాత్రం కమలాకర కామేశ్వరరావు గారు ఎప్పటికీ చిరంజీవే..

Show More
Back to top button