CINEMATelugu Cinema

తెలుగు చలనచిత్ర పితామహులు.. రఘుపతి వెంకయ్య నాయుడు గారూ..

రఘుపతి వెంకయ్య నాయుడు (15 అక్టోబరు 1869 – 15 మార్చి 1941)..

భారతీయ చలనచిత్ర రంగానికి, ప్రపంచంలో అత్యధిక చిత్రాలు నిర్మించే పరిశ్రమగా అశేష గుర్తింపు కలిగి ఉంది. దాదాపు అన్ని భారతీయ ప్రధాన భాషలలోను సినిమాలను నిర్మిస్తున్నారు. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, మళయాళం, మరాఠి భాషలలో సినిమా నిర్మాణం ఇతర భాషలకంటే గణనీయంగా ఉంది. ఈ మధ్య కాలంలో ప్రతీ యేటా దాదాపుగా 1000 కి పైగా చలనచిత్రాలు విడుదలవుతున్నట్టు అంచనా.

భారతీయ భాషలలో నిర్మించే ఈ చిత్రాలు కేవలం మన భారతదేశం లోనే కాకుండా రష్యా, దక్షిణాసియా, ఆగ్నేయాసియా, అరబ్బు దేశాలలో కూడా అత్యధిక ప్రాచుర్యం పొందాయి. కైరోలో జరిగిన ఆఫ్రో- ఆసియన్ చలన చిత్ర వేడుకల్లో భారతదేశం నుంచి యస్.వి.రంగా రావు గారికి, శివాజీ గణేశన్ గారికి ఉత్తమ నటుడిగా పురస్కారాలు లభించాయి.

20వ శతాబ్దం ప్రారంభంలో అప్పుడప్పుడే మొదలవుతున్న మూకీ చలన చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేయడంతో సాధారణ , మధ్యతరగతి జనాలకు అవి బాగా చేరువయ్యాయి. అంతేకాకుండా వ్యాపారమే ప్రధాన లక్ష్యంగా రూపొందిచబడే చలన చిత్ర ప్రవేశ ధరలు బాగా తక్కువగా వుండడంతో ప్రేక్షకులు, ప్రజలు ఈ చలన చిత్రాలను వీక్షించి, ఈ పరిశ్రమను ఆదరించి, చిత్ర పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేశారు. ఈ సమయంలోనే సినీ అభిమానం గల భారతీయ యువకులు కొందరు చలన చిత్ర దర్శకులై భారతీయ సంప్రదాయాల్ని, మన భారతీయ భాషలలో చలన చిత్రాల్లోకి ప్రవేశపెట్టడం మొదలుపెట్టారు.

ఇలా భారతీయ చిత్రపరిశ్రమ అభివృద్ధికి గణనీయ కృషి చేసినవారు చాలా మందే ఉన్నారు. వారిలో ముఖ్యలు రఘుపతి వెంకయ్య నాయుడు గారూ. చలన చిత్ర ఆరంభంలో మూకీ చిత్రాలను తెరమీదికి తెచ్చి భారతీయ చిత్ర పరిశ్రమ గణనీయ అభివృద్ధికి పునాది వేసిన అగ్రగణ్యులు వీరు. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి విశేష కృషి చేసిన వీరి సేవలకు గుర్తుగా తెలుగు చలన చిత్ర పితామహుడుగా గుర్తించి, తెలుగు చలనచిత్ర పరిశ్రమ వీరి పేరిట “రఘుపతి వెంకయ్య అవార్డు”ను నెలకొల్పింది. తెలుగు చిత్ర పరిశ్రమలో విశేష కృషి చేసినవారికి ఈ బహుమతిని ప్రధానం చేస్తారు.

జీవితం తొలి దశలో..

రఘుపతి వెంకయ్య నాయుడు గారూ 15 అక్టోబర్ 1869 లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మచిలీపట్నంలో భారత ఆర్మీ అధికారి సుబేదార్ అప్పయ్య నాయుడు గారికి రెండవ కుమారుడిగా జన్మించారు. వీరి సోదరులు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారూ ప్రముఖ విద్యావేత్త మరియు సంఘ సంస్కర్త కూడనూ. రఘుపతి వెంకయ్య నాయుడు గారి పూర్వీకులు హైదరాబాద్ రెజిమెంట్లలో ఈస్ట్ ఇండియన్ కంపెనీ మరియు మద్రాస్ ఆర్మీలో కమాండర్లుగా పనిచేశారు. కానీ రఘుపతి వెంకయ్య గారి కుటుంబం అంతా ఆర్మీలో ఉన్నా కూడా తనకెందుకో ఆ వైపు ధ్యాస ఉండేది కాదు. మొదటి నుండి బొమ్మలు గీయడం, ఫోటోలు తీయడం అలవాటుగా ఉండేది. తనకు 18 సంవత్సరాల వయస్సున్నప్పుడు మద్రాసుకు వెళ్లారు. మద్రాసులోని మౌంట్‌రోడ్‌లో బొమ్మలు గీయడం, గీసిన బొమ్మలను అమ్మడం చేసేవారు. ఛాయాచిత్రాలను తీయడం ఎక్కువగా ఇష్టపడే రఘుపతి వెంకయ్య గారూ ఫోటోగ్రఫీ నేర్చుకుని ఫోటోగ్రాఫిక్ స్టూడియోని స్థాపించారు.

సినీ ప్రస్థానం..

20 వ శతాబ్దంలో 1931 లో హిందీలో “ఆలం ఆరా” అనే టాకీ చిత్రం నిర్మాణం జరిగింది. తెలుగులో కూడా 1931 లోనే “భక్త ప్రహ్లాద” అనే తొలి టాకీ చిత్రం విడుదలయ్యింది. దానికంటే ముందు మూకీలు శకం నడుస్తున్న రోజులలో రఘుపతి వెంకయ్య నాయుడు గారికి మూకీ చలనచిత్రాల మీదికి ధ్యాస మళ్ళింది. మామూలుగానే ఫోటోగ్రఫీ అంటే మిక్కిలి ఇష్టపడే వెంకయ్య గారూ విదేశాలనుండి మూకీ చలానచిత్రాలను తెప్పించి ప్రజల ముందు ప్రదర్శించేవారు. మొదట్లో సినిమా టాకీసులు లేనందున గోడకు సినిమా ప్రదర్శించేవారు. అందుకే ఆ రోజులలో సినిమాను గోడమీద బొమ్మ అని పిలుస్తుండేవారు.

తొలి ప్రయత్నంలోనే…

ఈ మూకీ చిత్రాలకు శబ్దాలు జోడిస్తే బావుంటుంది అన్న ఉద్దేశ్యంతో 1909 వ సంవత్సరంలో, రఘుపతి వెంకయ్య గారూ “జాన్ డికిన్సన్ అండ్ కంపెనీ” నుండి “క్రోనో మెగా ఫోన్” ను తెప్పించారు. మద్రాసులో ఒక చోట గుడారం వేసి మూకీ చిత్రాన్ని ప్రదర్శించి “క్రోనో మెగా ఫోన్” తో చిత్రాలకు శబ్దాలని జోడించడంతో బొమ్మతో పాటు, మాటలు రావడంతో జనం ఆనందంతో కేకలు వేశారు. తన ప్రయత్నం ఫలించడంతో మద్రాసు చుట్టూ ఉన్న గ్రామాలతో పాటు మైసూరు, శ్రీలంక, బర్మాలలో ప్రదర్శనలు చేశారు. తాను కొనుగోలు చేసిన “క్రోనో మెగా ఫోన్‌” ఖరీదు సుమారు 30,000 రూపాయలు ఖరీదు ఉండడంతో ఆ డబ్బు చెల్లించడానికి, వెంకయ్య గారూ తన ఫోటో స్టూడియోని అద్దెకు ఇచ్చారు. విదేశాలనుండి మూకీ చిత్రాలను తెప్పించి ప్రదర్శించడం ఇబ్బందిగా తోచిన వెంకయ్య గారూ తానే సినిమాలు నిర్మించాలనే ఒక ఆలోచనతో తాను విదేశాలనుండి తెప్పించిన 4000 అడుగుల ఫిల్మ్ తో చిత్ర నిర్మాణం ప్రారంభించాడు. రఘుపతి వెంకయ్య గారూ 12 లఘు చిత్రాలను చిత్రీకరించి వాటిని “విక్టోరియా పబ్లిక్ హాల్‌”లో ప్రదర్శించాడు. అతను తన చిత్రాలను ప్రదర్శించడానికి బెంగళూరు , విజయవాడ , శ్రీలంక , రంగూన్ లకు కూడా వెళ్ళారు.

దేశంలోనే తొలి సినిమా థియేటర్.. 

రఘుపతి వెంకయ్య నాయుడు గారూ సినిమాను మంచి వ్యాపారంగా మలుచుకున్నారు. ఇలా సినిమా ప్రదర్శనలు ఇస్తూ, వూరూరా తిరుగుతూ సినిమాలు ప్రదర్శించడం కాకుండా ప్రేక్షకులంతా కూడా ఒకే చోట కూర్చుని సినిమా చూస్తే బావుండు అనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను ఆచరణలో పెడుతూ 1912లో భారతదేశంలోనే మొట్టమొదటిగా మద్రాసులో ‘గెయిటీ’ అనే సినిమా థియేటర్ (ప్రదర్శన శాలను) నిర్మించారు. తరువాత ‘క్రౌన్’, ‘గ్లోబ్’ సినిమా హాళ్ళను కూడా నిర్మించారు. ‘గెయిటీ’ అనే సినిమా థియేటర్ చెన్నైలోని మొదటి భారతీయ యాజమాన్యంలోని సినిమా థియేటర్. ఆ సినిమా హాలులో అమెరికన్ మరియు బ్రిటిష్ చిత్రాలను కూడా ప్రదర్శించేవారు.

అతని థియేటర్లలో ప్రదర్శించబడిన మొదటి సినిమాలలో కొన్ని మిలియన్ డాలర్ మిస్టరీ , మీరా యొక్క రహస్యాలు , చేతిని పట్టుకోవడం , విరిగిన నాణెం , రాజా పేటిక , పెరల్ ఫిష్ , మరియు ‘గ్రేట్ బార్డ్’. రఘుపతి వెంకయ్య గారూ సినిమా థియేటర్లు కట్టడంలో, సినిమాలు తియ్యడంలో పడిన కష్టాలూ, అవస్థలూ అన్నీ ఇన్నీ కావు. ఎలక్ట్రిసిటీ ఇన్‌స్పెక్టర్లూ, శానిటరీ ఇన్‌స్పెక్టర్లూ ప్రతీసారీ వచ్చి ‘అది మార్చు, ఇది మార్చు’ అని పేచీలు పెట్టేవారు. ఒక థియేటర్‌ కట్టడానికి అంగీకరించి, లైసెన్స్‌ ఇచ్చిన తర్వాత కూడా అధికారులు ఏవో అవాంతరాలు, అభ్యంతరాలు చెప్పేవారు. అలా ఒక థియేటర్‌ , నిర్మాణం మధ్యలో ఆగిపోయి తీవ్రమైన నష్టం కలిగించిందనీ, ఈ బాధలు భరించలేక ఇంకొకరైతే, ఈ వ్యాపారానికి స్వస్తి చెప్పేవారనీ, తాను పట్టుపట్టి అంతుచూడాలనుకున్నాననీ, సాధించగలిగాననీ వెంకయ్య తన డైరీలో వ్రాసుకున్నారు.

చలనచిత్ర నిర్మాతగా…

రఘుపతి వెంకయ్య నాయుడు గారూ 1919 వ సంవత్సరంలో “స్టార్ ఆఫ్ ఈస్ట్ ఫిల్మ్స్” అనే నిర్మాణ సంస్థను మరియు గ్లాస్ స్టూడియో అనే ఫిల్మ్ స్టూడియోను ప్రారంభించారు. వెంకయ్య గారూ తన కొడుకు రఘుపతి సూర్య ప్రకాష్ నాయుడు గారిని సినిమాటోగ్రఫీ చదవడానికి లండన్‌ కి పంపారు. చిత్ర నిర్మాణం, స్టూడియోలు ఎలా ఉండాలి లాంటివి పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి అమెరికా, ఇటలీ, జర్మనీ లాంటి దేశాలు కూడా తిరిగి చిత్ర నిర్మాణం గూర్చి పూర్తిగా అధ్యయనం చేశారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దర్శకులు “సిసిల్ బి డెమిల్లి” గారూ “టెన్ కమాండ్‌మెంట్స్” చిత్రాన్ని నిర్మిస్తున్నపుడు రఘుపతి సూర్య ప్రకాష్ గారూ డెమిల్లి గారి క్రింద కొంతకాలం పనిచేశారు.

తండ్రీ కొడుకులు తమ మొదటి సినిమా “మీనాక్షి కళ్యాణం”ని మదురై మీనాక్షి దేవాలయంలోని వాస్తవ పరిస్థితులు ప్రధాన అంశంగా నిర్మించారు. 1921లో భీష్మప్రతిజ్ఞ మూగచిత్రాన్ని నిర్మించారు. తరువాత తమిళ సినిమా నిర్మాత ఎ.నారాయణన్‌ గారితో కలిసి “గ్యారంటీడ్ పిక్చర్స్ కార్పొరేషన్” , “జనరల్ ఫిల్మ్ కార్పొరేషన్” స్థాపించారు. విశ్వామిత్ర, మాయా మధుసూదన, పాండవ నిర్వహణ, రాజ్ ఆఫ్ రాజస్థాన్ వంటి మరికొన్ని మూగ సినిమాలు తీశారు. తరువాత, వారు గజేంద్ర మోక్షం , మత్స్యావతారం , నందనార్ వంటి చిత్రాలను నిర్మించారు.

రఘుపతి వెంకయ్య గారూ నిర్మాణంలో, రఘుపతి సూర్య ప్రకాష్ గారి దర్శకత్వంలో భీష్మప్రతిజ్ఞ అనే మూగచిత్రాన్ని నిర్మించారు. ఇది మూగచిత్రం కాబట్టి దీనిని “మొదటి తెలుగువాడి సినిమా” అంటారు. రఘుపతి సూర్య ప్రకాష్ గారూ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ చిత్రంలో భీష్ముని పాత్రను కూడా పోషించారు. ఇది మొదటి తెలుగు మూకీ (అంటే, ప్లేబ్యాక్ వాయిస్ లేని చిత్రం). రఘుపతి వెంకయ్య గారూ ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీతో విపరీతమైన పోటీని ఎదుర్కొని దివాళా తీశారు. ఆ తరువాత వెంకయ్య గారి కుమారులు రఘుపతి సూర్య ప్రకాష్ గారూ మరియు యరగుడిపాటి వరద రావు గారూ ప్రత్యేకంగా మతపరమైన అంశాలపై దృష్టి సారించి వాటి పైనే చిత్రాలు తీశారు. వారి అత్యంత ప్రసిద్ధ నిర్మాణాలలో మూడు నందనార్ , గజేంద్ర మోక్షం మరియు మత్స్యావతార్ చిత్రాలు. ఈ మూడు చిత్రాలు కూడా మతపరమైన వ్యక్తులు, ఉపమానాలు మరియు నైతికతపై కేంద్రీకృతమై ఉన్నాయి.

రఘుపతి వెంకయ్య అవార్డు…

రఘుపతి వెంకయ్య నాయుడు గారూ ఎప్పుడు పుట్టారో, ఎప్పుడు చనిపోయారో ఎక్కడా సరైన సమాచారం లేదు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కో తరహా. వెంకయ్య గారూ జన్మించింది అక్టోబర్ 15 నాడే కానీ, సంవత్సరం మాత్రం 1869 అని, 1873 అని చెబుతుంటారు. మరణం కూడా అంతే. కొందరేమో 1941 జూలై 1 అంటారు, ఇంకొందరు 1941 మార్చి 15 అని చెబుతారు. మరికొందరు 1943 అంటారు. ఇంతకూ ఏది నిజమో ?? అసలు మన తెలుగు చలానచిత్ర పితామహుడి గురించి ఇంతవరకూ సరైన సమాచారం లేకపోవడం దారుణం. రఘుపతి వెంకయ్య నాయుడు గారి గురించి పరిశోధన చేయించి, చరిత్ర రాయించాలని రచయిత ఆరుద్ర లాంటి వాళ్లు కూడా వాపోయినా, పట్టించుకునే నాథుడే లేడు.

ప్రముఖ పాత్రికేయులు ఇంటూరి వెంకటేశ్వరరావు గారూ ఎంతో పోరాడితే రఘుపతి వెంకయ్య నాయుడు గారి పేరుమీద ఓ అవార్డు వెలిసింది. 1980 నుండి తెలుగు చిత్ర రంగానికి విశేష సేవలందించిన హేమాహేమీలకు ఈ బహుమతిని ప్రధానం చేస్తున్నారు. మొదటగా ప్రముఖ దర్శకులు ఎల్.వి.ప్రసాద్ గారూ “రఘుపతి వెంకయ్య అవార్డు” ను 1980 లో దక్కించుకున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు చలనచిత్ర అభిమానులకు మెగాస్టార్ గా ప్రసిద్ధిపొందిన ప్రముఖ కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి గారూ “రఘుపతి వెంకయ్య అవార్డు” ను చేజిక్కించుకోవడం విశేషం.

మరణం…

తన జీవితాన్ని సినిమాకే అంకితం చేసిన రఘుపతి వెంకయ్య నాయుడు గారూ తన డబ్బులు మొత్తం చలనచిత్ర నిర్మాణానికే వినియోగించారు. పెద్ద మొత్తంలో అప్పులు తెచ్చి చిత్రాలు నిర్మించడంతో జీవితం మలిదశలో ఎక్కువ అప్పులు చెల్లించాల్సి రావడంతో తనకు ఆస్తులు మిగలలేదు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి విశేష కృషి చేసిన రఘుపతి వెంకయ్య గారూ 15 మార్చి 1941 లో తన 69 యేట మరణించారు. రఘుపతి వెంకయ్య గారూ చేసిన సేవలను ఆలస్యంగా గుర్తించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ 1980 నుండి వెంకయ్య గారి పేరు మీదుగా రఘుపతి వెంకయ్య అవార్డును ప్రవేశపెట్టారు. చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గణనీయ కృషి చేసిన వారికి రఘుపతి వెంకయ్య అవార్డును బహుకరిస్తారు.

Show More
Back to top button