Telugu Cinema

మాటల్లో చెప్పలేని ఆనందానికి, కళారాధన ఒక్కటే సాధన…  సాగర సంగమం

వెండితెర పై సాగర సంగమం మంచి చిత్రం రావాలంటే, మంచి కథ, మంచి దర్శకుడి తో పాటు మంచి అభిరుచి గల నిర్మాత కూడా ఉండాలి. ఉత్తమ చిత్రం కావాలంటే, ముందు ఉత్తమ అభిరుచి గల నిర్మాత సాహసం చేయాలి. అలా ఉత్తమ చిత్రాల కోసం ధైర్యం చేసే నిర్మాతలు తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది ఉన్నారు. అలాంటి ఉత్తమ నిర్మాతలలో ఏడిద నాగేశ్వరరావు గారూ ప్రముఖులు. ఆయన తీసిన ప్రతీ చిత్రం కూడా ఉత్తమ చిత్రమే. ప్రతీ చిత్రాన్ని మనసు పెట్టి నిర్మించారు.

తాను నిర్మించిన పది సినిమాలు కూడా అత్యంత సాహసం చేసి నిర్మించినవే. అలాంటి  అరుదైన సాహసం ఎవరు చేస్తారు? ఒకవేళ చేస్తే ఒకటి, రెండు చిత్రాలు తీసి సరదా తీరిపోగానే తిరిగి వాణిజ్య చిత్రాల వైపు మళ్ళిపోతారు. వాణిజ్య చిత్రాలు ఏ విధంగా తీసినా డబ్బులు వస్తాయి. 

అయితే ఈ ప్రయత్నంలో తన కుమారులు ఏడిద రాజా, ఏడిద శ్రీరామ్ మరియు సహా నిర్మాతల సహకారం ఏడిద నాగేశ్వరావు గారికి లభించింది.

నిజానికి ఓ సినిమా, వెనక వచ్చే మిగతా సినిమాలకు అనుసరణీయం, ఆచరణీయం. అలాంటి సినిమాని గొప్ప సినిమా అని అంటాం. కానీ అనుసరణకు, ఆచరణకు సాధ్యం కానీ అద్భుతమైన చిత్రాలు కూడా కొన్ని ఉంటాయి. అప్పుడప్పుడు అలాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి.

ఆ కోవకు చెందిన చిత్రమే కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి “సాగర సంగమం”. ఈ సినిమాను అనుసరించడం, అనుకరించడం, ఆచరించడం అసాధ్యం.

పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై కమలహాసన్, జయప్రద నాయకా నాయికలుగా, ఎస్పీ శైలజ, శరత్ బాబు, ఏడిద శ్రీరామ్ ఇతర పాత్రలలో కళాతపస్వి కే.విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన చిత్రం “సాగర సంగమం”.

జంద్యాల గారు సంభాషణలు వ్రాయగా, ఇళయరాజా గారు సంగీతాన్ని సమకూర్చి, ఏడిద నాగేశ్వరరావు గారు నిర్మించిన ఈ చిత్రం 03 జూన్ 1983 నాడు మూడో తేదీన విడుదలై నాలుగు దశాబ్దాలు నిండిన ఈ చలనచిత్రం భారతీయ చిత్ర పరిశ్రమ వందేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో CNN-IBN రూపొందించిన 100  ఉత్తమ చిత్రాల్లో  ‘సాగర సంగమం’ చిత్రం 13 వ స్థానం దక్కించుకుంది.

నదీమ్మ తల్లి సముద్రంలో మమేకమవుతున్న అపురూప దృశ్యం తిలకించడానికి ఎంత మనోహరంగా, రమణీయంగా, మనోల్లాసంగా ఉంటుందో, అంత రమణీయంగా ఉంటుందీ సినిమా. అందుకే “సాగర సంగమం” పేరు ఈ చిత్రానికి సరిగ్గా సరిపోయింది. ముందుగా సీతాకోకచిలుక చిత్రానికి “సాగర సంగమం” పేరు పెట్టాలని అనుకున్నారు. కానీ భగవంతుడి నిర్ణయం మరోలా ఉంది. ఈ అద్భుత కళాఖండం కోసం దైవం  “సాగరసంగమం” అనే పేరు అప్పుడే రిజర్వ్ చేసేసింది.

చిత్ర విశేషాలు…

దర్శకత్వం    :    కె.విశ్వనాథ్

నిర్మాణం     :      ఏడిద నాగేశ్వరరావు

రచన          :       కె. విశ్వనాథ్

తారాగణం   :    కమల్ హాసన్, జయప్రద, శరత్ బాబు, ఎస్.పి. శైలజ

సంగీతం      :       ఇళయరాజా

నేపథ్య గానం    :     ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, ఎస్.పి.శైలజ

గీతరచన      :      వేటూరి సుందరరామమూర్తి

ఛాయాగ్రహణం   :   పి.ఎస్. నివాస్

నిర్మాణ సంస్థ   :      పూర్ణోదయా మూవీ క్రియేషన్స్

నిడివి       :      160 నిముషాలు

భాష        :      తెలుగు

చిత్ర కథ సంక్షిప్తంగా…

కథనాయకుడు నృత్యంలోనే తన సుఖాన్ని, దుఃఖాన్ని, ప్రేమను, విరహాన్ని చవి చూసిన ఒక నిస్వార్థమైన కళాకారుని కథ ఇది. బాలకృష్ణ (కమల్ హాసన్) అనే పేద యువకుడు తన స్వయంకృషితో నాట్యం నేర్చుకొంటాడు. కూచిపూడి, భరతనాట్యం, కథక్ రీతులలో ప్రావీణ్యుడవుతాడు. కానీ వాణిజ్యం, విచ్చలవిడితనం పెచ్చుమీరిన చిత్ర రంగంలో ఇమడలేకపోతాడు. అతని ప్రతిభను గుర్తించిన మాధవి (జయప్రద) అనే యువతి అతనిని ప్రోత్సహిస్తుంది. ఢిల్లీలో మహామహుల సమక్షంలో జరిగే ఒక కార్యక్రమంలో అతని నాట్యప్రదర్శన ఏర్పాటు చేయిస్తుంది.

కానీ చివరి క్షణంలో బాలకృష్ణ తల్లి (డబ్బింగ్ జానకి) చనిపోవడంతో అతడు నాట్య ప్రదర్శన పోటీలో పాల్గొనలేకపోయాడు. అతనికి ఎల్లవేళలా తోడుగా నిలచిన మాధవిపై అతనికి ప్రేమ మొదలౌతుంది. కానీ మాధవికి అంతకు ముందే పెళ్ళయివుంటుంది. వీరి ప్రేమ గురించి తన భర్తకు చెప్పి అతన్ని పిలిపిస్తాడు. అతను సమర్ధించినప్పటికి బాలకృష్ణ మాత్రం వారిరివురు కలసి భార్యభర్తలుగా ఉండాలని కాంక్షించి తన ప్రేమను త్యాగం చేస్తాడు. తల్లి మరణం, ప్రేమ వైఫల్యంతో ఆత్మన్యూనత భావంతో బాలకృష్ణ త్రాగుడుకు బానిస అవుతాడు.

తరువాతి భాగంలో మాధవి కూతురు (శైలజ)కు బాలకృష్ణ గురువవుతాడు. నాట్య కళ గొప్పతనం గురించి ఆమెకు తెలియజేస్తాడు. ఆపై ఆమె నాట్య ప్రదర్శనలో ఆమె నర్తిస్తుంది. అప్పటికే జనాల చప్పట్లు, తన విద్యను చూసి విపరీతమైన ఆనందం పొంది నాట్య ప్రదర్శన చివర్లో బాలకృష్ణ మరణించడంతో కథ ముగుస్తుంది. చివరిగా కనిపించే మాట NO END FOR ANY ART (ఏ కళకు అంతం లేదు)..

కథకు బీజం…

వాస్తవానికి కె. విశ్వనాథ్ గారు పూర్ణోదయా సంస్థ కోసం “సాగర సంగమం” కథను తయారు చేసుకోలేదు. అల్లు అరవింద్, చేగొండి హరి రామ జోగయ్య,  వి.వి.శాస్త్రి గార్లు కలిసి కె.విశ్వనాథ్ గారితో చిత్రం చేయాలనుకున్నారు. ఇందుకోసం కె.విశ్వనాథ్ గారు ఒక కథను తయారు చేసుకున్నారు. అప్పుడు కూడా హీరోగా కమలహాసన్ నే తీసుకుందామని అనుకున్నారు. అనివార్య కారణాల వలన ఆ ప్రాజెక్ట్ ఆ సమయంలో కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఏడిద నాగేశ్వరావు గారు సినిమా చేద్దామని కె.విశ్వనాథ్ గారిని అడగడంతో, అప్పుడు ఈ కథ బయటికి తీశారు కె.విశ్వనాథ్ గారు. ఏడిద నాగేశ్వరావు గారికి కథ విపరీతంగా నచ్చేసింది. అయితే నటులు కమలహాసన్ గారు మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. ఆ సినిమా తాను చేయనన్నారు. వయస్సులో తాను ముసలాడి పాత్ర చేస్తే, ఇంచుమించు అన్నీ అలాంటివే వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.  కానీ కె.విశ్వనాథ్ గారు రంగంలోకి దిగి ఒప్పించడంతో చివరకు ఒప్పుకున్నారు. అలాగే ఇందులో కథానాయిక మాధవి పాత్రకు ముందు అనుకున్నది జయసుధ గారిని, కానీ చివరకు ఆ పాత్ర జయప్రదనే వరించింది.

నటీనటుల ఎంపిక…

ఈ చిత్రంలో కథనాయకుడు శాస్త్రీయ నృత్యకారుడు. కనుక ఈ పాత్ర చేసే హీరో నిజ జీవితంలో శాస్త్రీయ నృత్యకారుడు అయి ఉండాలి. కాబట్టి కమలహాసన్ అయితే సరిగ్గా సరిపోతాడు అనుకున్నారు. కానీ అందులోని ముసలి పాత్ర చేయడానికి తాను అంగీకరించలేదు. కారణం తమిళంలో ముసలి పాత్ర చేసి ఒక చిత్రం తనను నిరాశ పరిచింది. అయినా నిర్మాత ఏడిద నాగేశ్వరావు గారు పట్టు వదలకుండా తిరిగి ఒప్పించారు. ఇకపోతే కథానాయికగా ముందుగా జయసుధ గారిని అనుకున్నారు. కానీ ఆమె వేరే సినిమాలతో ఖాళీ లేకపోవడంతో జయప్రదను ఎంచుకున్నారు. శైలజ పాత్రకు నృతం తెలిసిన ఓ కొత్త అమ్మాయిని ఎంపిక చేసుకోవాలని అనుకున్నాడు దర్శకుడు కె.విశ్వనాథ్ గారు.

అప్పుడే నృత్యం నేర్చుకుంటున్న ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి చెల్లెలు ఎస్.పి.శైలజను ఆ పాత్రకు సిఫార్సు చేశారు నాగేశ్వరరావు గారు. అందుకు కె.విశ్వనాథ్, బాలసుబ్రహ్మణ్యం గార్లు ఒప్పుకున్నారు. శంకరాభరణం తో పేరు సంపాదించుకున్న మంజు భార్గవి గారు ఈ సినిమాలో ఓ పెళ్ళి సన్నివేశంలో నృత్య ప్రదర్శన ఇస్తూ కనిపిస్తుంది. స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే ఈ చిత్రంలోని బాలకృష్ణ పాత్రను కమలహాసన్ గారు మాత్రమే చేయగలరు. ఆ పాత్రలో మరొకని ఊహించలేం. మాధవి పాత్రకు జయప్రద గారు ప్రాణం పోశారని చెప్పాలి. నర్తకి గా శైలజ మెప్పించారు. జంధ్యాల గారి సంభాషణలు ఇప్పటికీ కూడా ప్రేక్షకుల చెవుల్లో మారు మ్రోగుతూనే ఉన్నాయి.

తారాగణం…

కమల్ హాసన్  –  బాలకృష్ణ

జయప్రద  –  మాధవి

శరత్ బాబు  –  రఘుపతి

ఎస్పీ శైలజ  –  శైలజ, మాధవి కూతురు

సాక్షి రంగారావు  –  బాలు మామయ్య

డబ్బింగ్ జానకి  –  బాలు తల్లి

చక్రి తోలేటి  –  యువ ఫోటోగ్రాఫర్

పొట్టి ప్రసాద్  –  మాధవి పనిమనిషి

మిశ్రో   –   నృత్య దర్శకుడు

మంజు భార్గవి   –   నర్తకి

గీత   –   నృత్య సహాయం

కమలహాసన్ నట విశ్వరూపం…

ఈ చిత్రంలో కథనాయకుడు (కమలహాసన్) ఒక కళాకారుడు. సున్నిత మనస్కుడు, భావోద్వేగాన్ని ఆపుకోలేనివాడు. సంతోషం వస్తే తన నాట్యంతో ప్రకృతిని పరవశింప చేస్తాడు. కోపం వస్తే అదే నాట్యంతో పంచభూతాలను స్తంభింపజేస్తాడు. ప్రేమ భావాన్ని దాచుకోలేడు. నా అన్న వాళ్ళు దూరమైతే అస్సలు సహించలేడు, భరించలేడు. తనని తాను హింసించుకుంటూ, తన వారిని స్మరించుకుంటూ తన జీవితాన్ని గడిపేస్తుంటాడు. పరిపూర్ణమైన కళాకారునికి బాలు పాత్ర నిలువుటద్దం. ఇంత అద్భుతమైన పాత్రలో కమలహాసన్ గారు నటించలేదు, జీవించారు.

ఈ చిత్రంలో “ఆల్ ఇండియా డాన్స్ ఫెస్టివల్” ఇన్విటేషన్ ను కమలహాసన్ గారికి జయప్రద చూపించే సన్నివేశాన్ని ఎవరయినా మరచిపోగలరా. ఆ ఆహ్వానంలో తన పేరును, తన రూపును చూసుకున్న కమలహాసన్ గారు విపరీతమైన భావోద్వేగానికి లోనయ్యి, బాధని, ఆనందాన్ని ఒకేసారి వ్యక్తం చేసిన ఆ సన్నివేశంలో నటుడిగా ఆకాశమంత ఎత్తులో కనిపిస్తారు కమలహాసన్ గారు. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన తల్లి ముందు తన గుండెల్లో బాధనంతటినీ దిగమింగి కమలహాసన్ నాట్యం చేసే తీరును భారతీయ సినిమాకు మరో వందేళ్లు వచ్చినా మర్చిపోలేరన్నది అక్షర సత్యం.

వార్త పత్రికల ఆఫీసులో ఎడిటర్ సన్నివేశం “పంచభూతములు ముఖ పంచకమై” అంటూ భారతీయ నృత్య రీతులనన్నింటినీ శైలజ మందు ప్రదర్శించే సన్నివేశం గానీ, వర్షంలో బావి మీద నాట్యం దృశ్యం, తనలో అంతర్గతుడైన కళాకారుడిని శైలజలో సాక్షాత్కరింపజేయడానికి పతాక సన్నివేశంలో బాలు పడే తపన, ఇలాంటి సన్నివేశాలలో కమలహాసన్ గారి నటన అమోఘం, అపూర్వం, అనితర సాధ్యం. తెలుగు తెరపై ఇప్పటివరకు వచ్చిన అత్యుత్తమ పది స్క్రీన్ ప్లే లలో “సాగర సంగమం”  ఒకటి అని కచ్చితంగా చెప్పవచ్చు. ఇంతకీ ఈ చలన చిత్రం ప్రేమ కథా చిత్రమా లేక కళాత్మక చిత్రమా అనేది సమాధానం దొరకని ప్రశ్నలా మిగిలిపోయింది.

సంగీతం…

అప్పటి వరకు కె. విశ్వనాథ్ గారి సినిమాలకు కె.వి. మహదేవన్ గారు సంగీతం అందించేవారు. తొలిసారిగా ఇళయరాజా గారిని “సాగర సంగమం” చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నారు. ఈ సినిమా కోసం ఇళ‌య‌రాజా అందించిన పాట‌లు ఇప్ప‌టికీ సంగీత ప్రియుల్ని అల‌రిస్తూనే ఉన్నాయి. వేటూరి సుందర రామ్మూర్తి గారి సాహిత్య రచనతో, ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో చిత్రంలోని ఏడు పాటలు కూడా ఆణిముత్యాలే అని చెప్పాలి.

1.            “ఓం నమశ్శివాయ”…  

2.            “తకిట తధిమి తకిట తధిమి తందాన”…            

3.            “నాద వినోదము నాట్యవిలాసము”…

4.            “బాలా కనకమయ చేల”…         

5.            “మౌనమేలనోయి ఈ మరపురాని రేయి”               

6.            “వేదం అణువణువున నాదం”…             

7.            “వే వేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే”…

నేప‌థ్య సంగీతం కూడా సినిమాకు ప్ర‌ధాన హైలైట్ గా నిలిచింది. త‌మిళ చిత్రాల‌కు అద్భుత‌మైన సంగీతం అందించిన సంగీత ప్ర‌పంచంలో స‌రికొత్త ఒర‌వ‌డిని సృష్టించిన ఇళ‌యరాజాకు తొలిసారి ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడిగా జాతీయ పురస్కారం ద‌క్కింది ఈ సినిమాకే. అంతే కాకుండా మ‌ధుర గాయ‌కుడు బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు ఉత్త‌మ గాయ‌కుడిగా జాతీయ అవార్డుని అందించింది. ఈ సినిమాకు జంధ్యాల‌, వేటూరి, నివాస్ (ఫొటోగ్ర‌ఫీ), తోట త‌ర‌ణి (క‌ళ) వంటి ఎంద‌రో అత్యుత్త‌మ సాంకేతిక నిపుణులు ప‌ని చేశారు.

చిత్రీకరణ..

“సాగర సంగమం” చిత్రాన్ని మద్రాసు, విశాఖపట్నం, హైదరాబాదు, ఊటీ లలో చిత్రీకరించారు. “వే వేల గోపెమ్మలా”  అనే పాటను విశాఖపట్నంలోని భీమిలి బీచ్ ప్రక్కనున్న పార్క్ హోటల్లో, అందులో వచ్చే ఊహా దృశ్యాలను చెన్నై లోని “విజయ గార్డెన్స్” లో చిత్రీకరించారు. జయప్రద ఇంట్లో జరిగే సన్నివేశాలు, “మౌనమేలనోయి” పాట, సముద్రపు ఒడ్డులో తీసిన సన్నివేశాలన్నీ కూడా వైజాగ్ లోనే చిత్రీకరించారు. “ఓం నమఃశివాయ” పాటను హైదరాబాదులో చిత్రీకరించారు. పత్రికా కార్యాలయంలోని సన్నివేశాలను ఖైరతాబాద్ లోని ఈనాడు కార్యాలయంలో చిత్రీకరించారు. మద్యం మత్తులో ఓ బావి మీదున్న పైపుపై కమల్ హాసన్ నాట్యం చేసే “తకిట తథిమి” పాటను మద్రాసులోని “అరుణాచలం స్టూడియో” లో 30 అడుగుల బావి సెట్ వేసి చిత్రీకరించారు.

“నాదవినోదము” పాటను ఊటీలో తీశారు. వి.శాంతారాం తీసిన “ఝనక్ ఝనక్ పాయల్ బాజే”, “నవరంగ్” సినిమాలకు నృత్య దర్శకత్వం వహించిన గోపికృష్ణ “నాదవినోదము” అనే పాటకు నృత్య దర్శకత్వం వహించాడు. అతడు ఈ పాట కోసమే ప్రత్యేకంగా బొంబాయి నుండి వచ్చాడు. పతాక సన్నివేశాల్లో వచ్చే “వేదం అణువణువున నాదం” అనే పాట చిత్రీకరణకు ముందు కమల్ కు ఓ హిందీ సినిమా షూటింగులో కాలికి తీవ్రమైన గాయమైంది. దాంతో, నెలరోజులపాటు ఈ సినిమా చిత్రీకరణను వాయిదా వేశారు. ఆ తరువాత విడుదలకు ఆలస్యమవుతుందని చిత్రీకరణ పునః ప్రారంభించారు. అయితే, అప్పటికీ కమలహాసన్ గారు ఇంకా కోలుకోలేదు. అడుగు తీస్తే అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నారు. అయినప్పటికీ కూడా నృత్యం చేయడానికి పూనుకున్నాడు. “షాట్” అనగానే నృత్యం చేయడం, “కట్” అనగానే క్రింద పడిపోవడం. అలా, ఆ పాట పూర్తయింది.

చిత్రీకరణ జరిపే సమయంలోనే స్క్రిప్టులో లేని కొన్ని అంశాలను సృష్టించడం జరిగింది. ఖైరతాబాద్ వినాయక విగ్రహం ముందు కమలహాసన్ గారు నృత్యం చేసే ఘట్టం. ఆ ప్రాంతంలో చిత్రీకరించే సమయంలో దర్శకుడు కె.విశ్వనాథ్ గారికి ఓ ఆలోచన వచ్చింది. అదే, ఓ సినిమా నృత్య దర్శకుడి వద్ద సహాయకుడిగా చేరడానికి వెళ్ళి, అక్కడి పరిస్థితుల వల్ల మథనపడి, వినాయక విగ్రహం ముందు నృత్యం చేసే ఘట్టం. ఆ సన్నివేశం మొత్తాన్ని అప్పటికప్పుడు అనుకొని పెట్టడం జరిగింది. ఆ నృత్య ఘట్టంలో నేపథ్య సంగీతంగా పండిట్ రవిశంకర్ మ్యూజిక్ బిట్ ని వాడమని సిఫార్సు చేశాడు కమలహాసన్ గారు.

దాంతో కె.విశ్వనాథ్ గారికి ఆ ఆలోచన నచ్చడంతో వెంటనే తన ఇంట్లో ఉన్న రవిశంకర్ ఎల్.పి.రికార్డుని తెప్పించారు కమల్. జయప్రద ఇచ్చిన డాన్స్ ఫెస్టివల్ ఆహ్వాన పత్రికలో తన ఫోటోను చూసుకొని కమల్ ఉద్వేగంతో ఏడవడం వరకు మొదట అనుకున్న సన్నివేశం.

అయితే, దాన్ని చిత్రీకరించే సమయంలో కె.విశ్వనాథ్ గారు కెమెరా వెనుక నుండి నవ్వమని కమలహాసన్ గారికి సైగ చేశారు.

అలా చెప్పిన వెంటనే కమలహాసన్ గారు ఏడుపులోంచి నవ్వులోకి మారిపోతారు. ఆ సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచింది.

విడుదల..

1983 జూన్ 3న సాగర సంగమం విడుదలైంది. అంటే సినిమా విడుదలయ్యి నేటికి నలభై వసంతాలు. “సాగర సంగమం” సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందించారు. తమిళంలో సలంగై ఒలి (మువ్వల సవ్వడి అని అర్థం) అనే పేరుతో, మలయాళంలో “సాగర సంగమం” అనే పేరుతో విడుదల చేశారు.

తెలుగులో 35 కేంద్రాల్లో, తమిళంలో 30 కేంద్రాల్లో వందరోజులు ప్రదర్శించబడిన ఈ సినిమా విజయవాడ, హైదరాబాదు నగరాల్లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది.

బెంగళూరు, మైసూరు నగరాల్లో ఏడాదిన్నర పాటు ప్రదర్శించబడింది. బెంగళూరు లో ఒక థియేటర్ లో ఏకంగా 511 రోజులు ప్రదర్శింపబడి రికార్డు సృష్టించింది.

తమిళ, మలయాళ, రష్యన్ భాషలలో అనువాదమై తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేసింది.

కమలహాసన్ తొలిసారి ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకుంది ఈ సినిమాకే.

ఇళయరాజా ఉత్తమ సంగీత దర్శకునిగా తొలిసారి జాతీయ అవార్డు తీసుకుంది ఈ చిత్రానికే. “శంకరాభరణం” తర్వాత ఉత్తమ గాయకుడుగా ఎస్పీ బాలు గారు జాతీయ పురస్కారం అందుకుంది కూడా ఈ సినిమాకే. ఈ సినిమాకు దర్శకుడిగా కె.విశ్వనాథ్ గారిని తప్ప మరొకరిని ఊహించలేం.

ఇందులోని బాలు పాత్రలో కమలహాసన్ గారిని తప్ప మరొకరిని చూడలేం. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని చిత్రం అని ప్రేక్షకులు తెలియజేసిన మరపురాని కళాఖండం “సాగరసంగమం” సినిమా.

పురస్కారాలు…

1983 వ సంవత్సరంలో “సాగర సంగమం” తెలుగు చిత్రానికి గానూ కళాతపస్వి కె.విశ్వనాథ్  గారికి ఉత్తమ దర్శకునిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం వరించింది..

“సాగర సంగమం” తెలుగు చిత్రానికి గానూ నటుడు కమల్ హాసన్ గారూ ఉత్తమ నటుడుగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నారు..

నటి జయప్రద గారూ “సాగర సంగమం” తెలుగు చిత్రంలో నటనకు గానూ ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం దక్కించుకున్నారు..

1984 వ సంవత్సరంలో “సాగర సంగమం” తెలుగు చిత్రానికి సంగీతం అందించినందుకు గానూ ఇళయరాజా గారికి ఉత్తమ సంగీత దర్శకుడు గా భారత జాతీయ చలనచిత్ర పురస్కారం గెలుచుకున్నారు..

ఎస్.పీ.బాల సుబ్రహ్మణ్యం గారికి “సాగర సంగమం” తెలుగు చిత్రానికి గీతం ఆలపించినందుకు గానూ ఉత్తమ గాయకుడుగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారం వరించింది..

విశేషాలు…

★ శరత్ బాబు గారితో కలిసి సరదాగా డబ్బింగ్ థియేటరుకి వచ్చిన నటుడు రాజేంద్రప్రసాద్ గారు, నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారు అడగడంతో ఈ సినిమాలో శైలజ ప్రియుడిగా నటించిన అరుణ్ కుమార్ గారికి డబ్బింగ్ చెప్పారు.

★ జయప్రద గారి భర్త పాత్ర పోషించిన మోహన్ శర్మ గారికి గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు డబ్బింగ్ చెప్పారు.

★ “వేవేల గోపెమ్మలా” పాటలో దర్శకుడిగా నటించిన వ్యక్తికి నిర్మాత నాగేశ్వరరావు గారు డబ్బింగ్ చెప్పారు.

★ ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్రలో నటించిన ప్రసిద్ధ గాయని ఎస్.పి. శైలజ గారు తన జీవితానికి ఈ ఒక్క పాత్ర చాలునని మళ్ళీ నటించలేదు.

★ ఈ చిత్రంలో దర్శకుడు నటుల హవభావాల ద్వారా, సన్నివేశాల్లో చుట్టూ వున్న పరిస్థితుల ద్వారా భావాన్ని వ్యక్తపరిచారు.

★ రష్యన్ భాషలోకి అనువాదమైన తొలి తెలుగు చిత్రం ఇది.

★ ఈ సినిమా రెండు జాతీయ పురస్కారాలు, ఆరు నంది పురస్కారాలు గెలుచుకుంది.

★ 1984లో ముంబైలో జరిగిన పదవ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇండియన్ పనోరమాకు ఎంపికైంది.

★ 1984లో రష్యాలో జరిగిన తాష్కెంట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి ఇండియన్ ఎంట్రీగా ఈ చిత్రం ఎంపికైంది.

★ స్పానిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లోనూ ఈ చిత్రం చోటు దక్కించుకుంది.

★ రష్యాలో అత్యధిక ప్రింట్లతో విడుదలై, రష్యన్ భాషలోకి అనువాదమైన తొలి తెలుగు సినిమాగా కూడా నిలిచింది.

★ మాటల్లో చెప్పలేని ఆనందానికి కళారాధన ఒక్కటే సాధన అని చెప్పే “సాగర సంగమం” చిత్రం ఎప్పటికీ ఒక ఆణిముత్యమే..

Show More
Back to top button