Telugu Cinema

వెండితెర ఆణిముత్యం.. విశ్వనాథుని స్వాతిముత్యం..

“స్వాతిముత్యం” తెలుగు చలనచిత్రం.. (విడుదల… 13 మార్చి 1986)

పొట్ట కోస్తే అక్షరం ముక్క రానివాడు. వెర్రి వెంగళప్ప. శుద్ధ మొద్దవతారం. అమాయక చక్రవర్తి. ఇలాంటి లక్షణాలున్న పాత్రని కథనాయకుడిగా చేసి ఎవరైనా సినిమా తీస్తారా. దానికి తోడు ఆ హీరో గారు ఓ వితంతు మెడలో తాళి కట్టి ఆమెకు అండగా నిలబడతాడు. ఇలాంటి కథతో సినిమా తీయాలంటే ఆ దర్శకునికి ఎంత దమ్ము, ఎంత ధైర్యం ఉండాలి. ఆ చిత్రాన్ని నిర్మించే సాహసం చేసిన నిర్మాతకు ఎన్ని సొమ్ములు ఉండాలి. తమ అభిరుచి మీద నమ్మకం, కథ మీద ఉన్న ఆత్మవిశ్వాసమే ఆ దర్శక, నిర్మాతలతో పెద్ద సాహసానికి పూనుకునేలా చేసింది.

అయితే ఆ చిత్రం వాళ్ళ పరువు దక్కించడమే కాకుండా, తెలుగు చలన చిత్ర ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసింది. కొమ్ములు తిరిగిన సినీ పండితులు అంచనాలను పటాపంచలు చేస్తూ అద్భుత విజయం అందుకున్న చిత్రం “స్వాతిముత్యం”. పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన “తాయారమ్మ బంగారయ్య”, “శంకరాభరణం”, “సీతాకోకచిలుక”, “సాగర సంగమం”, “సితార” ఇలా వచ్చిన ప్రతీ సినిమా తెలుగు వెండితెరపై నూతనత్వానికి సంస్కృతి సంప్రదాయాలకు సంపూర్ణత్వానికి ఆపాదిస్తూ విజయాలను మూటకట్టుకుంటూనే వస్తున్నాయి.

స్వాతిముత్యం కథకు బీజం..

స్వాతిముత్యం చిత్ర కథకు బెంగుళూరులో బీజం పడింది. అద్భుతమైన విజయం సాధించిన చిత్రం “సాగరసంగమం” 511 రోజుల వేడుక నిమిత్తం కె.విశ్వనాథ్, కమలహాసన్, ఏడిద నాగేశ్వరరావు, రచయిత బాలమురుగన్ తదితరులు బెంగుళూరు వెళ్లారు. హోటల్లో అందరు పిచ్చాపాటి మాట్లాడుకుంటున్న సందర్భంలో కె.విశ్వనాథ్ గారూ వయస్సు పెరిగినా, మేథస్సు ఎదగని ఒక వ్యక్తి పాత్ర గురించి చెప్పుకొచ్చారు. శివయ్య అనే వ్యక్తి వయస్సు పెరిగినా మేథస్సు పెరగని అమాయకుడు.

ఆ పాత్ర చుట్టూ కథల్లుకు వచ్చారు విశ్వనాథ్ గారూ. ఆ కథ విన్న రచయితలు సాయినాథ్, ఆకెళ్ళ గార్లు, కె.విశ్వనాథ్ గారి కథలోని ఆత్మకి తమ సంభాషణలతో ఆ కథను సజీవ రూపానికి తీసుకువచ్చారు. ఈ సినిమాకి ముందు ఇదే సంస్థ పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ నిర్మాణంలో వచ్చిన “సితార” చిత్రం ద్వారా రచయితగా పరిచయమైన సాయినాథ్ మరియు కె.విశ్వనాథ్ “సిరివెన్నెల” సినిమాకి సంభాషణలు సమకూర్చిన ఆకెళ్ళ, ఇద్దరు కలిసి ఒక్కమాట మీద నిలబడి స్వాతిముత్యాల్లాంటి సంభాషణలు అందించారు.

ప్రధాన తారాగణం…

 • కమలహాసన్ .. శివయ్య (వీర వెంకట సత్య శివ సుందర రామయ్య )
 • రాధిక.. లలిత
 • శరత్ బాబు.. చలపతి 
 • డబ్బింగ్ జానకి… రాజేశ్వరి
 • పొట్టి ప్రసాద్.. నారాయణ 
 • మేజర్ సుందర రాజన్.. రావు 
 • సుత్తి వీరభద్ర రావు.. గురవయ్య 
 • జె.యల్. శ్రీనివాస్… బాలసుబ్రహ్మణ్యం 
 • మాస్టర్ కార్తీక్.. చిన్నప్పటి బాలసుబ్రహ్మణ్యం
 • ఏడిద శ్రీరామ్.. వెంకట స్వామి 
 • నిర్మలమ్మ.. రాజమ్మ 
 • వరలక్ష్మి… చిట్టి (గురువయ్య పెళ్ళాం కాంతం)
 • మల్లిఖార్జున రావు.. గురువయ్య మామ గారూ 
 • దీప… సుబ్బులు 
 • వైవిజయ…. దుర్గ 
 • జె.వి. సోమయాజులు.. సంగీతం మాస్టారు 
 • మాస్టర్ ఆలీ.. 
 • గొల్లపూడి మారుతీరావు..
 • విద్యాసాగర్…

కథ సంగ్రహం..

స్వాతిముత్యం చిత్రం అంతా ఫ్లాష్ బ్యాక్ (గతం) లోనే నడుస్తుంది. శివయ్య (కమలహాసన్) కొడుకులు, తమ కుటుంబాలతో కలిసి తల్లిదండ్రుల దగ్గరకు వస్తారు. లలిత (రాధిక) అనారోగ్యముతో ఉంటుంది. శివయ్య మనవరాలు ఒక కథ వ్రాయడానికి తన తండ్రి సహాయము కోరగా, తాతగారి (శివయ్య) కథను వ్రాయమంటాడు.

పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్ళి చేసుకున్న లలిత, భర్తని పోగొట్టుకుని, తన సోదరుడైన చలపతి (శరత్ బాబు), తన కొడుకుతో కలిసి అత్తగారింటికి వెళుతుంది. కోటీశ్వరుడైన లలిత మామగారు, లలితను లోపలికి రానివ్వకుండా బయటికి గెంటేస్తాడు. దాంతో చేసేది లేక అన్నగారింటికి చేరిన లలితకి తన వదిన గారి (వై.విజయ) నుండి సాధింపులు, వేధింపులు మొదలు అవుతాయి.

వారు వున్న ఇంటి ప్రాంగణంలోనే శివయ్య తన నాయనమ్మ (నిర్మలమ్మ) తో కలిసి ఉంటుంటాడు. చిన్న పిల్లవాడి మనస్తత్వము గల అమాయకుడు శివయ్య. లలిత పడుతున్న బాధలని తీర్చడానికి తన వంతు సహాయము చేద్దామని అనుకుంటాడు. ఆమెని పెళ్ళి చేసుకుని ఆమెకు కొత్త జీవితము ఇవ్వటమే ఎవ్వరైనా ఆమెకు చేయగలిగే సహాయము అన్న తన నాయనమ్మ మాటలకి స్పందించిన, శివయ్య “శ్రీరామ నవమి” పందిళ్ళప్పుడు అనుకోకుండా ఆమె మెడలో తాళి కడతాడు.

నాయనమ్మ మరణం తరువాత, శివయ్య తాను తాళికట్టిన లలితని, ఆమె కొడుకును తీసుకుని పట్నము వెళ్ళిపోతాడు. అక్కడ వారు అద్దెకు తీసుకున్న ఇంటి యజమాని (గొల్లపూడి మారుతీరావు) కి లలిత మీద కన్నుపడుతుంది. యజమాని శివయ్యతో మగవాడు అన్నాక అడుక్కుని అయినా భార్యను పోషించాలి అన్న మాటకు, ఉద్యోగ నిమిత్తము లలిత బయటికి వెళ్ళినప్పుడు, కొడుకుతో బిచ్చానికి వెళతాడు. అక్కడ తారసపడ్డ లలిత గురువు (జె.వి. సోమయాజులు) గారి ద్వారా గుడిలో ఉద్యోగము సంపాదిస్తాడు.

మరణ శయ్య మీద ఉన్న తన భార్య కోసము తనని, కొడుకుని తీసుకుని వెళ్ళి, శివయ్యను అవమానించి పంపించివేసిన మామ గారిని ఎదిరించి, భర్త శివయ్య దగ్గరకు చేరుతుంది లలిత. లలిత మరణం తో, తన కొడుకులతో కలిసి ఆమె పూజించిన తులసికోటను కూడా తీసుకుని బయల్దేరుతాడు శివయ్య. కథ పూర్తి చేసిన మనవరాలు దానికి “స్వాతిముత్యం” అనే పేరు పెడుతుంది.

భిన్నమైన కథను ఎంచుకున్న దర్శక, నిర్మాతలు…

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శక, నిర్మాతల జోడీ భలే ఆశ్చర్యకరంగా ఉంటాయి. ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అచ్చిరెడ్డి – యస్వీ.కృష్ణారెడ్డి, కె.వి.రెడ్డి – నాగిరెడ్డి, చక్రపాణిలు, కె.విశ్వనాథ్ – ఏడిద నాగేశ్వరరావు ల జోడీలు అలాంటివే. అయితే ముఖ్యంగా కె.విశ్వనాథ్ – ఏడిద నాగేశ్వరరావు కలయికకి చిత్ర పరిశ్రమలో, ప్రేక్షకులలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీళ్ళ కలయికలో ఇంతకుముందు వచ్చిన రెండు సినిమాలు శంకరాభరణం, సాగర సంగమం చిత్రాలు సంగీతం, నృత్య నేపథ్యంలో రూపొందాయి. కాబట్టి మూడో సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని అందరూ భావించారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ వారు ఓ భిన్నమైన కథను ఎంచుకున్నారు.

నిజం చెప్పాలంటే ఈ సినిమాలోని కథనాయకుడు “శివయ్య” పాత్రలో ఎలాంటి హీరోయిజం ఉండదు. హీరోకి ఇన్ని ఫైట్లు, పాటలు ఉండాలన్న బాక్సాఫీస్ సూత్రానికి చాలా చాలా దూరంగా ఉండే ఈ వెర్రి వెంగళప్ప పాత్రను పోషించడానికి చాలా మంది హీరోలు ముందుకురారు. కానీ నటనలో నవరసాలు పండించగల “నవరస నటుడు” కమలహాసన్ గారూ మాత్రం “శివయ్య” పాత్ర తనలోని నటనను సరికొత్తగా ఆవిష్కరిస్తుందని ముందస్తుగానే ఆత్మవిశ్వాసం కనబరిచారు. దర్శక, నిర్మాతల మీద నమ్మకం ఉంచారు. అందుకే “శివయ్య” పాత్ర కమలహాసన్ నట జీవితంలోనే ఓ మణిపూసలా నిలిచిపోయింది.

నవరస నటుడు కమలహాసన్..

శివయ్యగా కమలహాసన్ గారి నటనకు ఎవ్వరైనా ముగ్దులైపోవాల్సిందే. కమలహాసన్ గారి నటన అమోఘం. స్వాతిముత్యం లాంటి సినిమా చేసినందుకు కమలహాసన్ గారూ ఇప్పటికీ గర్వపడుతుంటారు. ఈ సినిమా ద్వారా కమలహాసన్ గారూ సుమారు 9 లక్షల రూపాయలు పరితోషికంగా అందుకున్నా కూడా అంతకు వందరెట్లు కీర్తిని ఆశించారు. ఇప్పటికే చాలామంది నటులు అమాయక పాత్రలు పోషించినప్పుడు “స్వాతిముత్యం” లో కమలహాసన్ గారినే ప్రేరణగా తీసుకుంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు.

ఈ సినిమా గురించి కమలహాసన్ గారిని కదిపితే “స్వాతిముత్యం” చాలా గొప్ప చిత్రం. ఈ సందర్భంలో ప్రత్యేకంగా ఓ విషయాన్ని ప్రస్తావించాలి. భారతీయ సినిమా హాలీవుడ్ ని అనుసరిస్తోంది, కాపీ కొడుతోంది అని విమర్శించే ప్రతీ ఒక్కరికీ “స్వాతిముత్యం” ఉదాహరణగా చూపిస్తాను. “స్వాతిముత్యం” విడుదలైన ఏడు సంవత్సరాల తర్వాత ఈ సినిమాని మక్కీకి మక్కి కాపీ కొట్టి “ఫారెస్ట్ గంప్” అనే చిత్రాన్ని హాలీవుడ్ వాళ్ళు తీశారు. దానితోపాటు ప్రతీ సన్నివేశం యధాతథంగా తీశారని గొప్పగా చెప్పారు.

కమలహాసన్ గారూ ఈ సినిమాలో మమేకమైపోయారు అనడానికి ఓ చిన్న ఉదాహరణ ఏమిటంటే, సరిగ్గా చిత్రీకరణ సమయంలో కే.విశ్వనాథ్ గారూ రచన చేసిన ఒక జానపద గీతాన్ని “పట్టుచీర తెస్తనని” అప్పటికప్పుడే చిత్రీకరించాల్సి వచ్చింది. దాంతో కమలహాసన్ గారూ ముందడుగు వేసి ఆ పాటకు వెంటనే ట్యూన్ కట్టేశారు. అలాగే “నగారా” పై స్వయంగా తానే పాడారు కూడా. ఆ తర్వాత ఆ పాటను వేరే గాయనితో పాడించారు.

లలిత పాత్రలో జీవించిన కథానాయిక రాధిక…

ఈ సినిమాలో కథానాయిక విషయానికి వస్తే ఇందులో లలిత పాత్రలో జీవించిన రాధిక గారూ అటు కమలహాసన్ సరసన గానీ, ఇటు విశ్వనాథ్ దర్శకత్వంలో గానీ చేయడం ఇదే ప్రప్రథమం. రాధిక గారూ పోషించిన లలిత పాత్రను చంపేయకుండా ఈ సినిమాకు శుభం కార్డు వేయాలని తొలిత భావించారు. ఈ విషయమై అనేక చర్చలు జరిగాయి. చివరికి దుఃఖాంతం అయితేనే ఈ కథకి పరమార్థమని భావించి అలాగే ఉంచేశారు. చివరికి అలా చేయడమే సినిమా విజయానికి అదనపు బలం చేకూర్చింది.

కమలహాసన్, రాధిక గార్ల మధ్యలో నడిచే సన్నివేశాలు చిత్రీకరణలో విశ్వనాథ్ గారి దర్శక నైపుణ్యం అపూర్వమనే చెప్పాలి. ముఖ్యంగా కమలహాసన్ లో రాధిక శృంగార భావాలు రగిలించే దృశ్యం చాలా సున్నితంగా చిత్రీకరించారు. విశ్వనాథ్ గారూ కాకుండా వెరెవరైనా అయితే అది గతి తప్పేది.

జె.వి. సోమయాజులు పాత్ర..

జె.వీ.సోమయాజులు గారి పాత్ర చిన్నదైనా ఇందులో తనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర పోషించారు. సినిమాలలో తనకు లైఫ్ ఇచ్చిన పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ బ్యానర్లో సినిమా కాబట్టి చిన్న పాత్ర అయినా చేయడానికి వెంటనే అంగీకరించారు. ఉద్యోగం ఇప్పిస్తానన్న జె.వి.సోమయాజుల చుట్టూ కమలహాసన్ నా ఉద్యోగం అంటూ తిరగడాన్ని హాస్యస్పదంగా చిత్రీకరించారు.

నిర్మలమ్మ మెచ్చిన స్వాతిముత్యం…

కమలహాసన్ నాయనమ్మ “రాజమ్మ”గా నటించిన నిర్మలమ్మ నటన గురించి కొత్తగా చెప్పాల్సింది ఏముంటుంది. దాదాపు 800 చిత్రాలలో నటించిన నిర్మలమ్మ గారూ తన మనసును హత్తుకున్న చిత్రాలు మూడు అని చెబుతారు. అందులో అగ్ర తాంబూలం “స్వాతిముత్యం”. మిగతా రెండు “కుల గోత్రాలు”, “మయూరి” అని చెబుతుండేవారు.

తమిళ నటులు సౌందర రాజన్…

తమిళంలో 450 చిత్రాలు నటించిన ప్రముఖ నటుడు మేజర్ సుందర్ రాజన్ కు ఇది తొలి తెలుగు చిత్రం. ఏడిద నాగేశ్వరరావు గారికి సుందర్ రాజన్ మంచి స్నేహితుడు కూడనూ. అప్పట్లో “శంకరాభరణం” చిత్రాన్ని తమిళనాట రిలీజ్ చేసింది మేజర్ సుందర రాజన్. మేజర్ సుందర రాజన్ పోషించిన “రావు” పాత్రకి ఏడిద నాగేశ్వరరావు గారే స్వయంగా డబ్బింగ్ చెప్పడం విశేషం. “స్వాతిముత్యం” చిత్రాన్ని కూడా మేజర్ సుందర్ రాజన్ తమిళంలో డబ్ చేసి విడుదల చేశారు. “సిప్పిక్కుళ్ ముత్తు” పేరుతో విడుదల అయిన ఈ చిత్రంలో కమలహాసన్ కి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారూ గాత్రదానం చేశారు.

ఈ సినిమాలో సుబ్బులుగా నటించిన దీప సరసన వెంకటస్వామిగా తొలత రాళ్లపల్లి గారిని అనుకున్నారు. అయితే వారి డేట్స్ కుదరలేదు. దాంతో వెంకటస్వామి పాత్రను నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారి చిన్నబ్బాయి శ్రీరామ్ తో చేయించారు. అప్పటికే శ్రీరామ్ సీతాకోకచిలుక, సితార చిత్రాల్లో నటించారు. ఈ సినిమాలో వెంకటస్వామి పాత్రను చక్కగా పోషించారు శ్రీరామ్. కమలహాసన్ మనవడుగా అల్లు అరవింద్ గారి పెద్దబ్బాయి బాబి, మనవరాలు డాక్టర్స్ కే.వెంకటేశ్వరరావు కూతుళ్లు విద్య, దీపు నటించారు. అలాగే రాధిక కొడుకుగా నటించిన పిల్లవాడు ఎవరో కాదు సీనియర్ నటులు కాంతారావు గారి పెద్దబ్బాయి ప్రతాప్ కొడుకు మాస్టర్ కార్తీక్. ఇటీవల పెళ్లి చేసుకున్న కార్తీక్ ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు

దర్శకులు విశ్వనాథ్ గారి దర్శకత్వ ప్రతిభ..

తెలుగు రాష్ట్రాలలో సాంప్రదాయాలకు విలువెక్కువే. ముఖ్యంగా సినిమాలలో సన్నివేశాలు తెరకెక్కించే క్రమంలో ఆచితూచి వ్యవహారించాల్సి ఉంటుంది. ఉద్యోగం, కులం, వృత్తి, ఆయా కులాల ఆహార్యానికి సంబంధించి ఏ చిన్న ప్రయోగం చేసినా వాటిపైన పెద్ద రచ్చే జరుగుతుంది. ప్రస్తుత కాలంలో మరీ ఎక్కువైంది. కానీ అప్పట్లోనే ఏ విమర్శలకు కూడా తావివ్వకుండా ఎన్నో సాహసాలు చేశారు కళాతపస్వి కె.విశ్వనాథ్ గారూ. వారు చేసినవన్నీ ఓ రకంగా వినూత్న ప్రయోగాలు, అద్భుతమైన సాహసాలే అని చెప్పుకోవాలి.

స్వాతిముత్యం చిత్రం లో చూపించినట్టు వింతతు వివాహం కూడా ఒకటి. అది కూడా శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం జరుగుతున్న దేవాలయంలో ఆ కళ్యాణం సందర్భంగా సీతమ్మ వారి మెడలో పడాల్సిన తాళిబొట్టు శివయ్య అనే పేరుగల ఓ వెర్రిబాగుల కుర్రాడు భర్తను పోగొట్టుకున్న ఓ వింతతు మెడలో కట్టడం. ఈ సన్నివేశం ఈ విధంగా తెరకెక్కించాలి అనుకోవడం పెద్ద సాహాసమే. దేవాలయంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతూ ఉంటుంది..

ఓ వైపు కళ్యాణ ఘట్టాన్ని వివరిస్తూ పాట సాగుతుంటుంది. రామయ్య.. అదుగోనయ్యా.. రమణీ లలామ.. నవ లావణ్య సీమ.. ధరాపుత్రి సుమ గాత్రి.. నడయాడి రాగా రామా కనవేమిరా.. శ్రీ రఘురామ కనవేమిరా అంటూ పాట సాగుతూ ఉంటుంది..అదే సమయంలో లలిత పాత్ర ఆలయంలోకి అడుగుపెడుతుంది.. అక్కడున్న భక్తులంతా సీతారాముల కళ్యాణాన్ని భక్తిపారవశ్యంలో మునిగి చూస్తుంటారు. లౌక్యం తెలియని మనసు ఎదగని కథానాయకుడు శివయ్య ఆడిపాడుతుంటాడు. ఎప్పటిలాగే పెళ్లిళ్లలో తాళికట్టే ముందు ఆ తాళిబొట్టుని ముత్తైదువులు అందరి దగ్గరకూ తీసుకెళ్లి నమస్కరించుకోమని చెబుతుంటారు కదా అలా పూజారి కొబ్బరి బొండాంపై తాళిబొట్టుని పెట్టి అందరి దగ్గరకు తీసుకెళుతుంటారు.

ఆ సందర్భంలో ఆ తాళి తీసుకుని లలితకు చటుక్కున్న కట్టేస్తాడు శివయ్య. అప్పుడు కూడా పెళ్లి అంటే ఏంటో తనకు తెలియదు. కేవలం తాళి కడితే కష్టాలు తీరిపోతాయంట కదా అందుకే కట్టానని అమాయకంగా చెబుతాడు. ఇలాంటి సన్నివేశాన్ని పెట్టి, ఆ సందర్భాన్ని రక్తి కట్టించాలంటే ఎంత ధైర్య సాహసాలుండాలి. ఈ సన్నివేశాన్ని ఇలా పెట్టాలి అనుకోవడం సాహసం అయితే ఇంత అందంగా విమర్శలకు అందకుండా తెరకెక్కించడం అంతకు మించిన అద్భుతం.. ఈ విషయంలో దర్శకుడు సఫళీకృతుడయ్యాడు అని చెప్పుకోవాలి.

ఇళయరాజా స్వర కల్పనలోని పాటలు..

ఇళయరాజ గారి స్వరాలు సినిమాకి వరాలుగా నిలిచాయి. ఈ సినిమాలోని ఆరు పాటల్ని ఆత్రేయ, సినారె సీతారామశాస్త్రి గార్లు రచించారు. వటపత్ర సాయికి పాటను సినారె వ్రాశారు. ఈ పాటని క్లైమాక్స్లో విషాద గీతంగా కూడా ఉపయోగించాలనే ఉద్దేశ్యంతో సీతారామశాస్త్రిని గారిని పిలిపించి సెకండ్ వెర్షన్ వ్రాయించారు. అప్పటికే సిరివెన్నెల సినిమా కోసం తొలిసారిగా పాటలు వ్రాశారు. అయితే సిరివెన్నెల గారూ పాటలు వ్రాయగా విడుదలైన తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.

1. “చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య” ..

2. “ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి” ..

3. “పట్టుసీర తెస్తానని పడవేసుకెళ్ళిండు మావా”..

4. “మనసు పలికే మౌనగీతం మమతలోలికే స్వాతిముత్యం” 

5. “రామా కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా” (హరికథ)..

6. “వటపత్రశాయికి వరహాల లాలి”..

7. “సువ్వి సువ్వి సువ్వాలమ్మా”…

సినిమా చిత్రీకరణ..

ఈ చిత్రం అధిక భాగం రాజమండ్రి, గోదావరి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంది. దాంతో పాటు రాజమండ్రి, తొర్రేడు, తాడికొండ, పట్టిసీమ, మద్రాసు మైసూర్ లలో కూడా ఈ సినిమాను చిత్రీకరించారు. ఈ చిత్రం చిత్రీకరణ కోసం తన నట జీవితంలో తొలిసారిగా రాజమండ్రి వెళ్లారు కమలహాసన్ గారూ. రాధిక గారూ చనిపోయే సన్నివేశాలను మద్రాసులోని అరుణాచల స్టూడియోస్ లో సెట్ వేసి తీశారు. ఇప్పటికీ కూడా దానిని స్వాతిముత్యం సెట్ అంటుంటారు. స్వాతిముత్యం చిత్రానికి ఎం.వి. రఘు గారూ ఛాయాగ్రహణం సమకూర్చారు. కె.విశ్వనాథ్ గారితో కలిసి పనిచేయడం ఎం.వి. రఘు గారికి ఇదే తొలిసారి. వారు స్వాతిముత్యం చిత్రానికి వన్నెతగ్గని రీతిలో ఛాయాగ్రహణం సమకూర్చారు. 150 నిమిషాలు నిర్మాణ నిడివి గల ఈ చిత్రం 60 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకోగా, ఈ చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాణ వ్యయం సుమారు 40 నుంచి 45 లక్షలు ఖర్చయ్యింది.

పురస్కారములు..

తెలుగు వారు గర్వించదగ్గ అజరామర చిత్రాలలో ఒకటైన “స్వాతిముత్యం” చిత్రం 1986 వ సంవత్సరంలో భారతదేశము తరుపున ఆస్కార్ పురస్కారాలకు ఎంట్రీ

సాధించింది.

1986 వ సంవత్సరంలో జాతీయ చలనచిత్ర పురస్కారాలలో దర్శకులు కె.విశ్వనాథ్ గారూ ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారాన్ని అందుకున్నారు.

1986 వ సంవత్సరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ చిత్రం విభాగంలో “స్వాతిముత్యం” చిత్రం స్వర్ణ (బంగారు) నంది గెలుపొందింది.

1986 వ సంవత్సరంలో ఫిలింఫేర్ పురస్కారాలలో “స్వాతిముత్యం” చిత్రం ఉత్తమ తెలుగు దర్శకులు విభాగానికి గానూ దర్శకులు కె. విశ్వనాథ్ గారూ ఫిలింఫేర్ పురస్కారాన్ని గెలుపొందారు.

1986 వ సంవత్సరంలో స్వాతిముత్యం చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచినందుకు గానూ కథనాయకులు కమల్ హాసన్ గారూ ఉత్తమ నటులుగా నంది బహుమతి అందుకున్నారు.

శత దినోత్సవ వేడుక…

“స్వాతిముత్యం” చిత్ర శత దినోత్సవ వేడుకలు 1986 జూన్ 20న ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని దేవి 70 ఎం.ఎం. థియేటర్లో వైభవంగా జరిగాయి. హైదరాబాదులో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి సమక్షంలో హిందీ నటులు రాజ్ కపూర్ గారూ, తెలుగు నటులు మెగాస్టార్ చిరంజీవి గారూ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ గారూ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించాక పాల్గొన్న తొలి శతదినోత్సవ వేడుక ఇదే కావడం విశేషం.

గానగంధర్వుడు ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం గారూ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ముఖ్య అతిథి ఎన్టీఆర్ గారూ తన ప్రసంగంలో ఏడిద నాగేశ్వరరావు, కె.విశ్వనాథ్ గార్ల జంట నుండి మన రాష్ట్రమే గాక భారతదేశమే గర్వకారణంగా చెప్పుకోదగ్గ అద్భుతమైన సినిమాలు రావాలని కోరారు. తన ప్రసంగం చివర్లో దానవీరశూరకర్ణ లోని దుర్యోధన డైలాగ్స్ వర్ణించారు. చిరంజీవి గారూ ప్రసంగిస్తూ ఏడిద నాగేశ్వరరావు గారూ తెలుగు నిర్మాత కావడం మన అదృష్టమని, తెలుగు సినిమాలను కించపరిచే వారిని చెంపదెబ్బ కొట్టే విధంగా ఆయన సినిమాలు ఉంటాయని, ఆయన తన అభిరుచిని మార్చుకోవద్దని తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ఇన్ని విశేషాలు ఉన్న “స్వాతిముత్యం” కు ఎన్ని విశేషణాలు జోడించినా కూడా తక్కువే అవుతుంది. తెలుగు తెరకు అమూల్యంగా దక్కిన ఈ చిత్రం అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ కూడా “స్వాతిముత్యమే”…

Show More
Back to top button